3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా? | Minister Harish Rao Sensational Comments On Nalgonda Congress Leaders | Sakshi
Sakshi News home page

3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?

Published Sat, Sep 30 2023 4:39 AM | Last Updated on Sat, Sep 30 2023 4:41 AM

Minister Harish Rao Sensational Comments On Nalgonda Congress Leaders - Sakshi

నకిరేకల్‌ సభలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తదితరులు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్‌ఎస్‌కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్‌ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్‌ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు.

హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  సిగ్గులేకుండా 3 గంటల కరెంట్‌ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్‌ఎస్‌ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేయాలన్నారు. 

కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు 
నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్‌ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్‌ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్‌ అని ఉత్త కరెంట్‌ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్‌ కొట్టేది బీఆర్‌ఎస్‌ పార్టీయేనని, నకిరేకల్‌ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. 

వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి 
రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆర్‌ఎస్‌ పార్టీదేనని విద్యుత్‌ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్‌ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. 

ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది 
ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 

తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే 
తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్‌ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్‌ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్‌ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement