Siddipeta Special Grade municipality
-
శభాష్ సిద్దిపేట
సిద్దిపేట మార్క్‌పై కేంద్రబృందం ఆరా గ్రేడింగ్ కోసం ఢిల్లీ నుంచి వచ్చిన బృందం వాస్తవ పరిస్థితులపై క్షేత్రస్థాయి సర్వే సిద్దిపేట జోన్: బహిరంగ మల విసర్జన రహిత మున్సిపాల్టీగా దేశస్థాయిలో రెండవ పట్టణంగా గుర్తింపు పొంది, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ మార్క్‌పై కేంద్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలన చేసింది. కేంద్ర పట్టణాభివృద్ది శాఖ అధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా లక్ష జనాభాకు మించిన 500 పట్టణాలను దేశవ్యాప్తంగా గుర్తించింది. వాటిలో బహిరంగ మల విసర్జన రహిత పట్టణంగా గుర్తింపు పొందిన పట్టణాల్లో నిజనిర్ధారణ అంచనా వేసి జాతీయ స్థాయిలో గ్రేడింగ్ ప్రకటించేందుకు ప్రత్యేక కమిటీని నియమించింది. కమిటీ సభ్యులు పట్టణంలో విస్తృతంగా పర్యటించి వాస్తవ వివరాలను సేకరించారు. త్వరలో సేకరించిన సమగ్ర వివరాలను రహస్య నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందించనున్నారు. వివరాల్లోకి వెళ్తే .. రాష్ట్రంలోనే బహిరంగ మలవిసర్జన రహిత పట్టణంగా , జాతీయ స్థాయిలో రెండవ పట్టణంగా సిద్దిపేటను ఈ యేడాది జూన్ 8న ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం గతంలో 3 లక్షల జనాభా కలిగిన పట్టణాలకు పారిశుద్ధ్యం విషయంలో గ్రేడింగ్ ప్రకటించి ప్రోత్సహించే వారు . ఈ ప్రక్రియలో స్వల్పమార్పులు చేసి దేశ వ్యాప్తంగా లక్ష జనాభా ఉండి, పారిశుద్ద్యాన్ని గాడిన పెట్టిన 500 పట్టణాలను ప్రభుత్వం గుర్తించింది. ఇందుకు సంబంధించిన వాస్తవ వివరాలను సేకరించేందుకు కేంద్రం కమిటీ సభ్యులను ఏర్పాటు చేసింది. అందులోని ఇద్దరు సభ్యులు విజయ్‌కుమార్, గిరిబాబులు స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ సిద్దిపేటను బుధవారం సందర్శించారు. పట్టణంలోని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలను , వాటిని ప్రజలు ఉపయోగించే విధానాన్ని మురికి వాడల్లో , ఆయా వార్డుల్లో పరిశీలించి గూగుల్ మ్యాప్ద్వారా గుర్తించిన ప్రదేశాలను వారి సూచనల మేరకు వాస్తవ పరిస్థితులను ఇంటర్నెట్లో పొందుపర్చారు. అంతకుముందు వారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రమణాచారితో సమీక్ష నిర్వహించి వివరాలు తెలుసుకున్నారు. సిద్దిపేట బేష్ సిద్దిపేటలో పారిశుద్ధ్య నిర్వహణ, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ ప్రక్రియ సంతృప్తికరంగా ఉందని బృందం సభ్యులు సిద్దిపేట పరిస్థితిపై కితాబిచ్చారు. కేంద్రం బహిరంగ మలవిసర్జన రహిత పట్టణాలుగా గుర్తింపు పొందిన వాటి వాస్తవ వివరాల సేకరణకు , ఆయా పట్టణాలకు స్వచ్చ భారత్ కింద గ్రేడింగ్ మంజూరికి ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసిందన్నారు. -
సిద్దిపేటలో ‘షాడో’ బ్యూరోక్రాట్స్
సిద్దిపేట జోన్: సిద్దిపేట ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అయ్యేలా మంత్రి హరీష్‌రావు సోమవారం వినూత్న ప్రయోగానికి నాంది పలికారు. తెలంగాణ లోనే తొలి ప్రక్రియగా సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో ఆయా వార్డుల్లో అధికార వికేంద్రీకరణ ప్రక్రియకు తెరలేపారు. డివిజన్ కేంద్రమైన సిద్దిపేటలోని 45 ప్రభుత్వ శాఖాధికారులతో సోమవారం రాత్రి మున్సిపల్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. పది లక్ష్యాలతో కూడిన ప్రణాళికను రూపొందించి ఇష్టంతో పని చేయాలని.. కష్టమని భావించిన అధికారులు నిర్భయంగా బాధ్యతల నుంచి తప్పుకోవాలన్నారు. సిద్దిపేటలో షాడో వ్యవస్థ రూపకల్పనను మంత్రి స్పష్టీకరించారు. సిద్దిపేట స్పెషల్ గ్రేడ్ మున్సిపాల్టీలో 34 వార్డులున్నాయి. సుమారు35 వేల కుటుంబాల్లో 1.50 లక్షల జనాభా ఉన్నట్లు తేలింది. ఆయా శాఖల అధికారులతో ముందు సమగ్ర వివరాలను సేకరించాలన్నారు. ప్రజలకు ప్రభుత్వ పక్షాన అందించాల్సిన సేవలు, మున్సిపల్ అధికారుల పని తీరును ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులు పర్యవేక్షించి, పరిశీలించి తన దృష్టికి తీసుకురావాలని కోరారు. పట్టణ ప్రజలకు మున్సిపల్ పక్షాన మెరుగైన సేవలను అందించాలన్నారు. ప్రతి వార్డుకు మున్సిపల్ అధికారులకు చేయూతగా ప్రత్యేకాధికారులుగా 34 మంది స్పెషల్ ఆఫీసర్ల నియామకం వారి బాధ్యతలను గురించి వివరించారు. ప్రతి 15 రోజులకోసారి సిద్దిపేట ఆర్డీఓ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం ఉంటుందని, ప్రతి నెలకోసారి ప్రత్యేకాధికారులతో తానే స్వయంగా మాట్లాడతానని క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యల్ని, పరిష్కరిస్తున్న విషయాలను ఎప్పటికప్పుడు నివేదిక రూపొందిస్తానని మంత్రి హరీష్‌రావు స్పష్టం చేశారు. ప్రతి అధికారి ఒక వార్డును దత్తత తీసుకొని వారంలో మూడు రోజులు వార్డుల్లో పర్యటించాలని స్పష్టం చేశారు. ప్రధానంగా తాగునీటి సరఫరా, వీధి దీపాల సమస్యలు, చెత్త సేకరణ, పట్టణంలోని ఆయా వార్డుల్లో చేపడుతున్న అభివృద్ధి పనులపై నిఘా, ప్రతి ఇంటికి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయా వార్డులకు బాధ్యులుగా నియమింపబడిన ప్రభుత్వ అధికారులు స్వీకరించాలని కోరారు. ఈ సమీక్షలో ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, మున్సిపల్ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమణాచారితో పాటు ముఖ్య అధికారులు, సిబ్బంది, మున్సిపల్ యంత్రాంగం పాల్గొంది.