ముంపు..ముప్పు.. | state division with reason assets and employees distributed | Sakshi
Sakshi News home page

ముంపు..ముప్పు..

Published Thu, May 8 2014 2:48 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM

ముంపు..ముప్పు.. - Sakshi

ముంపు..ముప్పు..

- రాష్ట్ర విభజనతో ఐటీడీఏకు తగ్గనున్న ప్రాధాన్యం
- సంస్థలోని ప్రధాన శాఖలకూ కత్తెర
- జూన్ 2 తర్వాత 205 గ్రామాలతో తెగిపోనున్న బంధం

 
 భద్రాచలం, న్యూస్‌లైన్, రాష్ట్ర విభజన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు నుంచే రెండు రాష్ట్రాల సరిహద్దుల ఏర్పాటు, ఆస్తులు, ఉద్యోగుల పంపకాలు జరిగిపోనున్నాయి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ముంపు పరిధిలోకి వచ్చే 136 రెవెన్యూ గ్రామాలు(205 హ్యాబిటేషన్‌లు) తెలంగాణ నుంచి వేరు చేసి అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిపేందుకు అధికారికంగా ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. అయితే ఈ ప్రాంతం నుంచి తమను వేరుచేసే నిర్ణయాన్ని ముంపు గ్రామాల ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రాధాన్యం కోల్పోనున్న ఐటీడీఏ..
ఏజెన్సీలోని గిరిజనుల అభివృద్ధి కోసమని భద్రాచలంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐటీడీఏ( సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ) రాష్ట్ర విభజనతో ప్రాధాన్యత కోల్పోయే ప్రమాదం ఉంది. జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉండగా, ఇందులో 29 మండలాలు పాలన ఈ ఐటీడీఏ నుంచే సాగుతోంది. దీనిలో 19 మండలాలను ట్రైబల్ ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్‌గా గుర్తించి గిరిజనులకు ప్రత్యేక పథకాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, అశ్వారావుపేట, దమ్మపేట వంటి మండలాలను అత్యంత వెనుకబడిన ప్రాంతాలు(పీటీజీ)గా గుర్తించి వాటి అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు వెచ్చిస్తున్నారు.

రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ మండలాల్లోని గ్రామాలను తెలంగాణ నుంచి వేరుచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతున్నారు. కూనవరం, వీఆర్‌పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగానూ, చింతూరు, భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో కొన్ని గ్రామాలకు జూన్ 2 తరువాత జిల్లాతో సంబంధాలు తెగిపోనున్నాయి. ఫలితంగా ఏజెన్సీలో ఇప్పటి వరకూ ఐటీడీఏ ద్వారా పథకాలు అందుకున్న ఈ గ్రామాలన్నీ వేరు చేయబడతాయి. ఇలా రాష్ట్రంలోనే పెద్దదైన భద్రాచలం ఐటీడీఏ పరిధి తగ్గి ప్రాధాన్యం కోల్పోనుంది.

ప్రధాన శాఖలకు కత్తెర...
ఏజెన్సీలోని అత్యంత వెనుకబడిన మండలాలను జిల్లా నుంచి వేరు చేయటం ద్వారా ఐటీడీఏలోని ప్రధాన శాఖలను ఎత్తివేసే అవకాశాలు ఉన్నాయి. అధికారులు సైతం దీన్ని అంగీకరిస్తున్నారు. ఇప్పటివరకు పాలన సాగించిన ప్రభుత్వాలు గిరిజనాభివృద్దికి నిధుల కోత పెట్టడటంతో ఇప్పటకే పలు శాఖలకు పనిలేకుండా పోయింది. ఐటీడీఏలోని మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల విభాగాలకు అధికారులను తొలగించారు. అలాగే వ్యవసాయ, ఉద్యానవన శాఖలకు కూడా పని లేకుండా చేశారు.

 రాష్ట్ర విభజనతో వెనుకబడిన మండలాలు ఐటీడీఏ నుంచి వేరుకానుండటంతో ప్రస్తుతం ఉన్న కొండరెడ్ల(పీటీజీ) విభాగం కూడా ఎత్తి వేసే అవకాశం ఉంది. పీటీజీ మండలాల్లో ఇందిరాక్రాంతి పథ ం ద్వారా గిరిజనులకు న్యూట్రిషన్ సెంటర్‌లు, బాలబడులు వంటి ప్రయోగాత్మక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. వీటన్నింటి కీ జూన్ 2 తరువాత తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఐటీడీఏ నుంచి నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఫలితంగా ఐటీడీలోని ప్రధాన శాఖలను ఎత్తివేసే ప్రమాదం ఉందని అధికారులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

జిల్లాలో 1242 రెవెన్యూ గ్రామాలు ఉండగా, వీటిలో 904 ఏజెన్సీలోనే ఉన్నాయి. రాష్ట్ర విభజనతో 136 రెవెన్యూ గ్రామాలు(205 హ్యాబిటేషన్‌లు) ఏజెన్సీ నుంచి వేరు చేయబడతాయి. అదే విధంగా జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న 10 వేల మంది కొండరెడ్డి గిరిజనుల్లో దమ్మపేట, అశ్వారావుపేటలలో ఉన్న 1457 మందికి మినహా మిగతా వారందరికీ భద్రాచలం ఐటీడీఏతో సంబంధాలు తెగిపోనున్నాయి.

ఐటీడీఏ తరలిపోనుందా..?
భద్రాచలం ఐటీడీఏను వేరే ప్రాంతానికి తరలిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో మాదిరే దీన్ని పాల్వంచ కేంద్రంగా ఏర్పాటు చేసే అవకాశాలు లేకపోలేదని కొందరు అధికారులు అంటున్నారు. రాష్ట్ర విభజనకు శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఐటీడీఏ అధికారులు, ఉద్యోగుల్లో దీనిపైనే చర్చసాగుతోంది. ఐటీడీఏ కార్యాలయాన్ని 1974-75 సంవత్సరంలో ఖమ్మంలో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1979 డిసెంబర్ 17న పాల్వంచకు మార్చారు. అక్కడ నుంచి 1993 ఫిబ్రవరి 9న భద్రాచలం తరలించారు. మళ్లీ ఇప్పుడు పాల్వంచకు మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.

భద్రాచలం డివిజన్‌లోని చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, భద్రాచలం మండలాల్లోని 98 రెవెన్యూ గ్రామాలు జిల్లా నుంచి వేరు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతుండగా, ఈ నాలుగు మండలాల్లో నివసిస్తున్న 81,707 మంది తగ్గిపోనున్నారు. అదే ముంపు మండలాల ఆర్డినెన్స్‌కు కొత్తగా వచ్చే ప్రభుత్వం ఆమోదం తెలిపితే భద్రాచలం డివిజన్‌లోని నాలుగు మండలాలు(భద్రాచలం పట్టణం మినహా) కూడా వేరు చేయబడతాయి. అదే జరిగితే భద్రాచలం డివిజన్ నుంచి ఏకంగా 1,14,726 మంది తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లాల్సి ఉంటుంది. దీంతో భద్రాచలంలోని ఐటీడీఏ కార్యాలయాన్ని భవిష్యత్‌లో పాల్వంచకు తరలించే ప్రమాదముందని గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement