State Division
-
ఉసూరుమనిపించారు.. రాష్ట్ర విభజన అంశాలపై నామమాత్రంగా చర్చ
సాక్షి, అమరావతి: విభజన సమస్యల పరిష్కారమే అజెండాగా హైదరాబాద్‌లోని ప్రజా భవన్లో ఏర్పాటు చేసిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పక్కదారి పట్టింది. కీలకమైన విభజన అంశాలపై కాకుండా ఇతర అంశాలపై అత్యధిక సమయం వెచ్చించడంపై ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్ర విభజన అంశాలపై పరిష్కారం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిలతో పాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు శనివారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. దాదాపు గంటా నలభై నిమిషాలు సాగిన భేటీలో ఏ విషయంపై కూడా ఓ అంగీకారానికి రాలేదు. ఇరు రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇరు రాష్ట్రాల మంత్రులతో రెండు కమిటీలు వేయాలని నిర్ణయించి చేతులు దులుపుకున్నారు. మిగిలిన సమయం అంతా డ్రగ్స్, సైబర్ క్రైమ్, మూసీ నది పరిరక్షణ తదితర అంశాలపై కేటాయించడంపై ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయాలని నిర్ణయించారు. అధికారుల కమిటీ రెండు వారాల్లోగా సమావేశమై చర్చలు జరపనుంది. ఈ కమిటీ స్థాయిలో పరిష్కారం కాని అంశాలపై రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చిస్తుందని ఇరు రాష్ట్రాలు నిర్ణయించాయి. మంత్రుల కమిటీ నిర్ణయాలను రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అంగీకరించనున్నారు. వీరి స్థాయిలో కూడా ఫలితం తేలకపోతే ఇరు రాష్ట్రాల సీఎంలు మళ్లీ భేటీ అయ్యి చర్చిస్తారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అనంతరం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌లు సమావేశ వివరాలను విలేకరులకు వివరించారు.సమావేశంలో ఏపీ, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పలు ప్రశ్నలపై దాటవేతపోలవరం ముంపు మండలాలు, విద్యుత్ బకాయిలు వంటి అంశాలపై చర్చించారా అని ఇరు రాష్ట్రాల మంత్రులను విలేకరులు ప్రశ్నించగా.. భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ.. నేరుగా సమాధానం ఇవ్వకుండా అన్ని విషయాలు చర్చించామన్నారు. విలేకరులు మరో ప్రశ్న వేస్తుండగానే సమావేశం ముగించి వెళ్లిపోయారు. అంతకు ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాళోజీ నారాయణరావు రాసిన ‘నా గొడవ’ పుస్తకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహూకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి వెంకటేశ్వరస్వామి ఫొటో బహూకరించి, రేవంత్, భట్టిలకు చంద్రబాబు శాలువా కప్పి సత్కరించారు. ఈ సమావేశంలో ఏపీ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రులు కందుల దుర్గేష్, సత్యప్రసాద్, బీసీ జనార్ధన్‌రెడ్డి, సీఎస్, ఇతర అధికారులు, తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, సీఎస్, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్ర విభజన అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చర్చలు జరిపానని ఏపీ సీఎం చంద్రబాబు శనివారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఇరు రాష్ట్రాలకు మేలు కలుగుతుందనే నమ్మకం ఈ సమావేశం ద్వారా కలిగిందన్నారు. డ్రగ్స్ ఫ్రీ స్టేట్‌గా చేయడానికి కలిసి పనిచేస్తాంపదేళ్లుగా పరిష్కారం దొరకని సమస్యలకు ఈ సమావేశంలో పరిష్కారం దొరుకుతుందని అనుకోలేదు. వీటి పరిష్కార మార్గం కోసం కలిసి పని చేయాలని ఇరు రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవడం కోసం సీఎస్ స్థాయి అధికారులతో కూడిన ఒక కమిటీ, మంత్రుల స్థాయిలో ఇంకో కమిటీ వేశాం. ఇరు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉన్నతాధికారులతో కూడిన కమిటీ రెండు వారాల్లోగా సమావేశం అవుతుంది. ముందుగా అధికారుల స్థాయిలో పరిష్కారమయ్యే అంశాలను చర్చిస్తాం. అక్కడ ఫలితం రాకపోతే ఆ తర్వాత మంత్రుల స్థాయిలో చర్చలు ఉంటాయి. మంత్రుల స్థాయిలో కూడా పరిష్కారం కాకపోతే తిరిగి ముఖ్యమంత్రులు సమావేశమై చర్చిస్తారు. ఈ సమావేశంలో విభజన సమస్యల పరిష్కారంతో పాటు డ్రగ్స్ నిర్మూలన, సైబర్ క్రైమ్‌ను అరికట్టడం వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్నాం. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించుకొని అందుకోసం ఏడీజీ స్థాయి అధికారులతో ప్రత్యేక కమిటీ వేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఏడీజీ స్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్న కోరికను అంగీకరించింది. తెలంగాణ సరిహద్దు రాష్ట్రాల నుంచి మత్తు పదార్థాలను అరికట్టడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కలిసి పని చేస్తున్నాం.– తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపిల్లల స్కూల్ బ్యాగుల్లో గంజాయివిభజన చట్ట సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వచ్చి సమావేశం ఏర్పాటు చేయడం అభినందనీయం. ఇరు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బ తినకుండా చర్చలతో సత్వరం పరిష్కరించుకునే దిశగా అడుగులు వేస్తాం. ఇరు రాష్ట్రాలు కలసి అభివృద్ధి చెందేలా తరచూ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశం అవుతారు. తెలంగాణ కోరిన విధంగా రాష్ట్రంలో గంజాయి సరఫరా నియంత్రణకు ఇప్పటికే చర్యలు చేపట్టాం. ఆరుగురు మంత్రులతో సబ్ కమిటీ వేశాం. ఏపీలో 8వ తరగతి విద్యార్థుల బ్యాగుల్లో కూడా గంజాయి దొరుకుతోంది. ఏపీలో అత్యధికంగా సాగవుతున్న గంజాయి తమ రాష్ట్రానికి వస్తోందని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజలు హర్షించేలా విభజన సమస్యలను పరిష్కరిస్తాం.– ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ -
విభజన తెరిచిన కొత్త తలుపులు
ప్రస్తుతం ఏపీలో నెలకొని ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితుల కోసం ముప్పై ఏళ్ల క్రితం 1994లో జరిగిన ఎన్నికల ముందు పంజాబ్‌కు చెందిన మాజీ రక్షణశాఖ అధికారీ, బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కాన్షీరాం ఏడాది పాటు ఇక్కడ ‘క్యాంప్’ చేసి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల కోసం అప్పట్లో ఆయన వెతుకులాడారు. అయితే ఆయన ఆశించిన సామాజిక సమీకరణాలు ఇక్కడ లేవని నిర్ధారించుకున్నాక ఆయన వెళ్ళిపోయారు. అప్పట్లో ఆయన ప్రయత్నం ఫలించి ఉత్తరప్రదేశ్‌లో 1995లో సమాజవాదీ పార్టీ మద్దతుతో బీఎస్పీ నుంచి మాయావతి తొలి ఎస్సీ ముఖ్యమంత్రి అయ్యారు. అవే ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ను ఓడించి ఎన్టీఆర్ గెలవడంతో 1995లో చంద్రబాబు ‘మార్క్’ టీడీపీ రాజకీయాలకు తెలుగునాట మార్గం సుగమం అయింది. అప్పటి నుంచి యూపీ – ఏపీ రాజకీయాలు రైలు పట్టాలు మాదిరిగా సమాంతరంగానే ఉంటూ ఎక్కడా సారూప్యత లేని రీతిలో ఉన్నాయి. ఉత్తర–దక్షిణ దిక్కుల్లో ఉన్న రెండింటి మధ్య వ్యత్యాసాలు ఎన్నో ఉన్నప్పటికీ, మూడు దశాబ్దాల పైబడిన ఆర్థిక సంస్కరణల ప్రభావం దేశ సామాజిక రంగం మీద ఆ యా రాష్ట్రాలను బట్టి ఎక్కువ తక్కువగా కనిపించడం అయితే కాదనలేనిది. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడడం వెనుక ఉన్నది కూడా ఈ సంస్కరణల కాల ప్రభావమే. అలాగే సంస్కరణల్లోని ‘సరళీకరణ’ అంశం మనవద్ద సీబీఎన్ సరికొత్త–‘ద్రవ రాజకీయాలకు’ (‘లిక్విడ్ పాలిటిక్స్’) ప్రాతిపదిక అయింది. వాటి లక్షణం అది కనుక మారుతున్న కాలంతో పాటుగా దాన్ని ఆయన ‘అడాప్ట్’ చేసుకున్నారు. అయితే ‘సరళీకరణ’ను తమకు తగినట్టు ‘అడాప్ట్’ చేసుకోవడం అనేది, ఏ ఒక్కరి గుత్త సొత్తో కాదు కనుక, సంస్కరణలు మొదలైన పదేళ్ళకే 2000లో ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్‌గఢ్, బిహార్ నుంచి జార్ఖండ్‌లు విడిపోయాయి. మరో పదేళ్లకు ఈ రాష్ట్రాల సరిహద్దున ఉన్న తెలంగాణ... ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయింది. దీనికి వ్యతిరేకంగా ఆధిపత్య వర్గాలు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమానికి ఎన్ని కారణాలు ఉన్నా అవి దాన్ని ఆపలేక పోయాయి. ఉపరితలాల్లో కనిపించకుండా భూగర్భ పొరలను కుదిపే తాత్విక అంశం–‘సరళీకరణ’ అనబడే ‘లిబరలైజేషన్’. ఈ ముప్పై ఏళ్లలో ఐదు కొత్త రాష్ట్రాలు ఏర్పడితే, వాటిలో కొత్త పార్టీలు ఏర్పడి అవి అధికారాల్లోకి వచ్చాయి. అలా కొత్త సమాజాలకు అవకాశాలు వచ్చాయి. ఇటువంటి జాతీయ పరిణామం చూసినప్పుడు, ప్రాంతాల మధ్య విభజన తర్వాతే... ముప్పై ఏళ్ల క్రితం కాన్షీరాం ఆశించిన కులాలవారీగా విడిపోయిన రాజకీయ ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఏర్పడలేదు. ఇప్పటికీ కొందరు దీన్ని ‘నెగిటివ్’ దృష్టి నుంచి చూసినా, గడచిన పదేళ్ళలో అది ‘మర్యాద’ ముసుగును తొలగించుకుని మరీ ‘ఓపెన్’గా మన మధ్య స్థిరపడింది. కనుక ఇప్పుడు బిహార్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల రాజకీయాల్లో ‘కులం’ పోషించే సూక్ష్మస్థాయి పాత్రను ఏపీ విషయంలో మనం అన్వయించి చూడవచ్చు. ఇకముందు అదేమంత ‘బూతు’ అవదు. ఎంత త్వరగా మనం ఏమిటో మనం స్వీయప్రకటన చేసుకుంటే అంత మేర మనకు సమయం వృథా అవదు. అయితే 2024 ఎన్నికలు ముగిసిన తర్వాత, ఏపీలో నెలకొనివున్న సామాజిక రాజకీయ సమీకరణాలను చూసినప్పుడు ఇప్పటికే అవి కాన్షీరాం దృష్టి దాటి విస్తరించాయా అనేది ‘కేస్ స్టడీ’ అవుతుంది. అలా కావడానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది– గత ప్రభుత్వం కోనసీమ జిల్లాకు పేరు మార్చినప్పుడు మే 2022లో అమలాపురంలో జరిగిన ఆందోళన, విధ్వంసం, గృహదహనాలు విభజిత ఏపీ చరిత్రలో మొదటి సామాజిక హింసాత్మక సంఘటన. అన్ని రాజకీయ పార్టీలు సామాజికంగా అదొక సున్నితమైన తొలికూతగా గుర్తించాలి. రెండవది– కొంచెం లోతైన విస్తృతమైన చర్చ అవసరమైనది. కాపు కులం నుంచి ముఖ్యమంత్రి రావాలి, అంటూ తిరుపతి మాజీ కాంగ్రెస్ ఎంపీ చింతా మోహన్ కొంత కాలంగా కోరుతున్నారు. అలా కనుక జరిగితే, ఆ తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రి అవుతారు అనేది బహుశా ఆయన ఆశ కావొచ్చు. ఈ మొత్తాన్ని సమీక్షించడానికి 2024 ఏపీ ఎన్నికల పూర్వరంగం సరైన ‘ఎరీనా’ అవుతుంది. ఉత్తరప్రదేశ్‌లో ఒక ఎస్సీ ముఖ్యమంత్రిగా మాయావతి 2007–12 మధ్య చెప్పుకోదగిన పరిపాలనా సంస్కరణలు తెచ్చారు. అయితే, ఎస్సీ కాకపోయినా ఓసీ కులాల్లో పేదల నుంచి అన్ని కులాల్లోని పేదల వరకూ... అందరికీ 2019–24 మధ్య జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో సంక్షేమ ఫలాలు అందాయి. కేవలం ఆర్థిక పరమైన ఊరట మాత్రమే కాకుండా ఈ ప్రభుత్వం తీసుకున్న పరిపాలనా వైఖరి కారణంగా సూక్ష్మ స్థాయిలో ‘పవర్ పాలిటిక్స్’ స్థానంలోకి ‘ఫంక్షనల్ పాలిటిక్స్’ ప్రవేశించాయి. వీటిలో ‘డెలివరీ’ ప్రధానం తప్ప రాజకీయ పార్టీల పట్ల విశ్వాసాలతో పెద్దగా పని ఉండదు. శ్రేణులలో కూడా మొదలైన ఇటువంటి ‘లిక్విడ్ పాలిటిక్స్’ ధోరణి కారణంగా ఇకముందు ముఖ్యమంత్రి కులం ప్రజల సానుకూల తీర్పుకు ప్రాతిపదిక కాకపోవచ్చు.– జాన్సన్ చోరగుడి వ్యాసకర్త అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత -
విభజన... అసమాన అంతరాలు పెంచడానికా?
రాష్ట్ర విభజన జరిగి జూన్ 2 నాటికి పదేళ్లు గడిచాయి. పాలకుల వైఫల్యం వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతాల మధ్య ఏర్పడిన అసమాన అభివృద్ధి విధానాలు విభజన తర్వాత కూడా కొనసాగుతున్నాయి. దశాబ్దా్దలుగా జరిగిన పోరాటాలు, ఉద్యమాలు, అమరవీరుల త్యాగాల నెత్తుటి మరకలను పాలకులు తమ తిరోగమన విధానాలతో తుడిపేస్తున్నారు. ఈ పదేళ్ల కేంద్ర ప్రభుత్వ పోకడ భారత రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తికి గండి కొట్టేలా వెళ్లింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విడదీసిన తర్వాత ఏర్పడే రెండు తెలుగు రాష్ట్రాలకు పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చకుండా తన పబ్బం గడుపుకోవడం మీదనే కేంద్రం దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి చివరికి ఎగ్గొట్టారు. తెలంగాణకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటిస్తామని మొండిచేయి చూపించారు.ఇక, విభజన చట్టంలో పేర్కొన్న హామీలను కూడా పాక్షికంగానే అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని పూర్తి కావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా ప్రేక్షక పాత్ర వహించింది. ఒక్క మాటలో చెప్పాలంటే రెండు రాష్ట్రాలను ఏర్పాటు చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు, నిర్వహించాల్సిన బాధ్యతలను నిర్వహించలేదు. పదేళ్ల పాటు చేతులు దులుపుకునే ప్రయత్నమే జరిగింది. కృష్ణా, గోదావరీ నదీజలాల వ్యవహారంలో ఎటూ తేల్చకపోగా, కేంద్రమే స్వయంగా గొడవలు పెడుతోంది. విద్యుత్ బకాయిల చెల్లింపులు, ఉద్యోగుల విభజన లాంటి ముఖ్యమైన అంశాలను కూడా తేల్చలేదు. ద్రవ్యలోటు పూడ్చే విధంగా ఆర్థికంగా ఆదుకోవాల్సిన కేంద్రం అసలు తాను ఇవ్వాల్సిన నిధులను కూడా ఇవ్వడం లేదు. సాగునీటి ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించకపోగా, సాగునీటి రంగానికి ఉపయోగపడే విధంగా ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాలను ఉపయోగించుకోవడమే తప్ప ఎనిమిది కోట్ల తెలుగు ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదు. మలివిడత ఉద్యమంలో పాల్గొన్న వారెవరూ నాటి టీఆర్ఎస్ (నేటి బీఆర్ఎస్) పార్టీ అధికారంలో వుండగా ప్రాతినిధ్యంలోకి రాలేదు. చివరికి తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ కుటుంబ కృషిగానే మలిచే ప్రయత్నం చేశారు. దీని ఫలితమే టీఆర్ఎస్ గడిచిన 10 ఏళ్ల పాలన ఏకఛత్రాధిపత్యంగా సాగడానికి కారణమైంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం భూమి కోసం, దోపిడి, పీడనకు వ్యతిరేకంగా జరిగింది. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజాస్వామ్యాన్నీ, స్వేచ్ఛనూ, ప్రశ్నించే గొంతులనూ అణచివేస్తూ కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరించారు. పార్లమెంటులో విభజన చట్టంపై చర్చ జరుతున్న సందర్భంలో ప్రతిపక్షం (బీజేపీ) నుండి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విభజన హామీగా రెండు రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించాలన్నారు. పోలవరం, ప్రాణహిత, చేవెళ్ళ ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించి పూర్తి చేయాలన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారు మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా ప్రధాన బాధ్యతలు చేపట్టి తను డిమాండ్ చేసిన ప్రత్యేక హోదాలు ఈ 10 ఏండ్లలో పట్టించుకోకుండా గాలికొదిలేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ నీటి యుద్ధం కొనసాగుతూనే వుంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీకి నీటిని క్రమబద్ధీ్దకరించటం, రివర్ బోర్డు ఏర్పాటు, ద్రవ్యలోటు పూడ్చడం, ఉద్యోగులను సొంత రాష్ట్రాలకు పంపడం, ఆంధ్రలో కలిపిన ఏడు తెలంగాణ గ్రామాల ఉమ్మడి సమస్యలు వంటివి పరిష్కారం కాలేదు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, ఎన్టీపీసీలో మిగిలివున్న 3 వేల మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వంటి ముఖ్యమైన హామీలు అమలు జరుగలేదు. 9, 10 షెడ్యూల్లో వున్న 91 ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లలో 71 సంస్థలను విభజించినట్లు ప్రకటించి, నేటికీ ఉమ్మడిగానే కొసాగిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు పాలకుల విధానాల వల్ల ప్రాంతాలు, ప్రజల మధ్య ఏర్పడిన ఆర్థిక, సామాజిక అంతరాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. ప్రజలకు దీర్ఘకాలిక అభివృద్ధికి ఉపకరించే భూమి, ఉపాధి, నీటి వనరులు, ఉద్యోగాలు, వేతనాలు వంటి అంశాలను పట్టించుకోలేదు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం గడిచినా ప్రజల జీవితాల్లో అభివృద్ధి భూమిక ఏర్పడలేదు. భూములు పంచుతామన్న పాలకులు ఉన్న భూములను బినామీ పేర్లతో ఆక్రమించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా మారారు. వ్యవసాయానికి ప్రోత్సాహం లేక చిన్న, మధ్యతరగతి రైతులు వ్యవసాయాన్ని వదులుకొని కార్పొరేట్ సంస్థల వద్ద అతితక్కువ వేతనాలకు వాచ్మెన్లుగా, గార్డెన్లలో పనిచేసే కూలీలుగా మారినారు.తెలంగాణ ఏర్పడితే ఈ పరిస్థితులు వస్తాయని ప్రజలు భావించలేదు. ఉద్యోగాలు వస్తాయనీ, ఉపాధి సౌకర్యాలు మెరుగుపడుతాయనీ, అన్ని ప్రాంతాలు సమాన అభివృద్ధి అయితే స్థానికంగా ఉపాధి పొందుతామనీ భావించారు. కానీ, వారి ఆశలు అడియాసలయ్యాయి. ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య తీవ్రమైన అంతరాలు పెరుగుతూనే వున్నాయి. ఇది సామాజిక దోపిడి, వివక్షకు దారితీసింది. దీని ఫలితమే బీఆర్ఎస్ పార్టీని అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెదించి, ప్రత్యామ్నాయంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టంగట్టారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజారంజక పాలన కొనసాగించవలసిన అవసరం వున్నది. రాష్ట్రంలో, దేశంలో అస్తిత్వ రాజకీయాల ప్రభావం పెరుగుతున్నది. ప్రజల ప్రధాన సమస్యలైన భూమి, కూలి, ఉద్యోగ సమస్యలను తీర్చాలి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు సమర్థవంతంగా అమలు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ ప్రయోజనాల కొరకైతే రాష్ట్రం ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలి. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, వివిధ వర్గాల ప్రజల మధ్య అంతరాలు తగ్గించే విధంగా ప్రతిపక్షాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు తీసుకొని పరిపాలన సాగించాలి. రాష్ట్రాన్ని అన్నిరకాలుగా అభివృద్ధి వైపు నడిపించాల్సిన బాధ్యత అధికార పార్టీపై వుంది. రెండు రాష్ట్రాల ప్రజలు ఆశించినట్టు ఇప్పటి నుంచైనా అధికారంలోకి వచ్చే, వచ్చిన పార్టీల ప్రభుత్వాలు, కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్షలను నెరవేర్చేందుకు చిత్తశుద్ధి కనబరచాలి.జూలకంటి రంగారెడ్డి వ్యాసకర్త మాజీ శాసన సభ్యులు(నేడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం) -
పెండింగ్ అంశాలపై నేడు కేంద్రం సమీక్ష
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలపై బుధవారం కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ సమీక్ష చేయనుంది. సమన్వయ కమిటీ వద్ద ఉన్న పెండింగ్ అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపైన కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ (సమన్వయ) కార్యదర్శి అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఉన్నతాధికారులతో ఈ సమావేశం జరుగుతుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ డైరెక్టర్ ఎం. చక్రవర్తి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం పంపించారు. ఈ–సమీక్ష పోర్టల్‌లో పొందుపరిచిన అంశాలపై సమీక్షించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర సమన్వయ కమిటీ వద్ద పెండింగ్‌లో ఉన్న 34 అంశాలతో పాటు వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల వద్ద పెండింగ్‌లో ఉన్న 15 అంశాలను అజెండాలో చేర్చారు. రాష్ట్ర విభజన జరిగిన ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు భర్తీ, పెండింగ్‌లో ఉన్న జాతీయ రహదారులు, రైల్వే లైన్లను అజెండాలో చేర్చారు. విశాఖలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, జాతీయ ఫార్మాస్యూటికల్ విద్యా సంస్ధ ఏర్పాటు, పారిశ్రామిక, ఆర్థిక ప్రగతికి పన్ను రాయితీలు, ఆర్ అండ్ ఆర్తో సహా పోలవరం పూర్తి వ్యయాన్ని భరించడం తదితర అంశాలు కూడా ఉన్నాయి. -
మోదీ వ్యాఖ్యలపై చర్చకు నోటీసు ఇవ్వండి
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలపై పార్లమెంట్లో చర్చకు డిమాండ్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. మోదీ మాట్లాడిన అంశాలపై ఏపీ ఎంపీలు నోటీసు ఇవ్వాలని కోరారు. బుధవారం రాజమహేంద్రవరంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చ జరిగితేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని, అప్పుడే ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయం దేశానికి తెలుస్తుందని అన్నారు. చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా పార్లమెంట్ చరిత్రలో మొదటిసారి మెజార్టీతో సంబంధం లేకుండా రాష్ట్ర విభజన చేశారన్నారు. ఇటీవల రాజ్యసభలో ఏపీపై చర్చ జరుగుతున్న సందర్భంలో వైఎస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి షెడ్యూల్ 9, 10లలో ప్రస్తావించిన 150 సంస్థల విషయం ఎనిమిదేళ్లు అవుతున్నా కేంద్రం తేల్చకపోవడం అన్యాయమన్నారు. -
రాష్ట్ర విభజనకు మద్దతివ్వం ..
సాక్షి బెంగళూరు: ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్ర విభజనకు తాము ఒప్పుకోబోమని, అయితే ప్రయోజనాల సాధనకు మద్దతిస్తాం అని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు బీఎస్ యడ్యూరప్ప తెలిపారు. బెంగళూరులో పార్టీ కార్యాలయంలో శనివారం బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితి, ఉత్తర, దక్షిణ కర్ణాటక విభజన, సీఎం కుమారస్వామి పాలనపై సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. కుమారస్వామి కర్ణాటక మొత్తానికి ముఖ్యమంత్రి అని, కానీ ఆయన మాత్రం 37 నియోజకవర్గాలకు మాత్రమే సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం విడిపోతే భవిష్యత్ తరాలు కుమారస్వామిని క్షమించవని అన్నారు. సీఎం కుమారస్వామి కుటుంబం కేవలం ఉత్తర కర్ణాటకను మాత్రమే కాదు, రాష్ట్రం మొత్తాన్ని నాశనం చేసిందని విమర్శించారు. 75 ఏళ్ల సీనియర్ నాయకుడిగా ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి తాను ఒప్పుకోనని యడ్డి చెప్పారు. ఆగస్టు రెండో తేదీన ఉత్తర కర్ణాటక పోరాట సమితి పిలుపుని చ్చిన ఉత్తర కర్ణాటక బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. బడ్జెట్లో ఉత్తరకు అన్యాయం కుమారస్వామి ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉత్తర కర్ణాటకకు అన్యాయం జరిగిందని యడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తరహాలో ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రాన్ని తీసుకురావాలని కొందరు చూస్తున్నారని విమర్శించారు. అలాగే ఈ నెలాఖరులో వాటాల్ నాగారాజు ఆధ్వర్యంలో జరిగే కర్ణాటక బంద్‌కు కూడా మద్దతిస్తామని చెప్పారు. ఈ బంద్‌లకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రుణమాఫీ ప్రకటించారనే కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి అడుగులు వేయలేదని చెప్పారు. కాగా, ఆగస్టు 9 నుంచి మూడు బృందాలుగా విడిపోయి రాష్ట్ర బీజేపీ నేతలందరూ రాష్ట్ర పర్యటన చేస్తారని తెలిపారు. తొలి బృందంలో తాను, గోవింద కారజోళ, శోభ కరంద్లాజే, రెండో బృందంలో ఆర్.అశోక్, అరవింద్ లింబావళి, జగదీశ్ శెట్టర్, మూడో బృందంలో కేఎస్ ఈశ్వరప్ప, సీటీ రవి, లక్ష్మణ సవదిలు ఉంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాధనలను ప్రజలకు వివరిస్తామని తెలిపారు. 22 ఎంపీ సీట్లు గెలుస్తాం తమ సమావేశంలో లోక్‌సభ ఎన్నికలపై చర్చించాం, అభ్యర్థుల ఎంపిక చర్చకు రాలేదని తెలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాలకు 22– 23 స్థానాలు కచ్చితంగా గెలుచుకోగలుగుతామని జోస్యం చెప్పారు. ఉత్తర కర్ణాటక ప్రత్యేక రాష్ట్రం కోసం శ్రీరాములు డిమాండ్ చేయడం లేదని, కేవలం ఉత్తర కర్ణాటక అభివృద్ధి కోసమే ఆయన ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఏ కారణంతోనూ రాష్ట్రం విడిపోవడానికి బీజేపీ మద్దతివ్వదని చెప్పారు. మీడియా ప్రతినిధులను విధానసౌధలోకి రానివ్వనని సీఎం అనడం సమంజసం కాదని అన్నారు. మీడియాను నిర్బంధించడం మంచి పరిణామం కాదని చెప్పారు. దేశంలో ఎక్కడా ఇలాంటి ఘటన జరగలేదని తెలిపారు. -
రాష్ట్రాన్ని విడదీయడమే మంచిదైంది
గుంటూరువెస్ట్: రాష్ట్రాన్ని విడదీయడమే మంచిదైందని, దీన్ని కొందరు విమర్శించినా విభజన వల్ల మనకు పరిశ్రమలు, ఉద్యోగాలు, ఇతర అవకాశాలు లభించాయని రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ అన్నారు. స్థానిక కలెక్టరేట్లోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం కోరమండల్ సంస్థ ఆధ్వర్యంలో గ్రామీణ బాలికల ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్పీకర్ కోడెల మాట్లాడుతూ.. విభజన వల్ల వచ్చిన అవకాశాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం లభించిందన్నారు. జనాభాలో 50 శాతం మంది మహిళలున్న ఈ సమాజంలో అవకాశాలను అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలను ఎంపికచేసి 50 మందికి రూ.5,000, 50 మందికి రూ.3,500 చొప్పున నగదును అందజేశారు. -
ఉండవల్లి అప్పుడు ఏం చేశారు: సోము వీర్రాజు
సాక్షి, రాజమండ్రి: పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది బీజేపీయేనని ఆ పార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు స్పష్టం చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే ఆ ప్రాజెక్టుకు రూ.4వేల కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు. ముంపు మండలాలను ఆంధ్రాలో కలిపింది కూడా బీజేపీయేనని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్‌కు ఆంధ్రా అభివృద్ధి గుర్తుకు రాలేదా.. పార్లమెంటులో రాష్ట్రాన్ని విడదీసినపుడు అప్పటి ఎంపీ ఉండవల్లి ఏం చేశారు.. భద్రాద్రి రాముడు తెలంగాణకు వెళ్ళినపుడు ఉండవల్లి ఏమీ చేయలేకపోయారు ఎందుకు అని ప్రశ్నించారు. సాధ్యాసాధ్యాలు పరిశీలించిన అనంతరం విశాఖ రైల్వే జోన్ కోసం బీజేపీ యత్నిస్తుందని సోము అన్నారు. ‘ఉపాధి’ పథకం కొందరు అవినీతిపరులకు ఉపాధిగా మారిందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా నరేంద్ర మోడీయే ప్రధాని అని, ముందస్తు ఎన్నికలపై మోడీదే తుది నిర్ణయం అని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక, మద్యం మాఫియాలను అరికట్ట లేకపోతోందని వీర్రాజు విమర్శించారు. -
విభజన హామీలపై ఉమ్మడి పోరు
ఇబ్రహీంపట్నం(మైలవరం): రాష్ట్ర విభజన హామీల సాధనకు ఫిబ్రవరిలో ఉమ్మడి పోరుకు శ్రీకారం చుడతామని సీపీఎం రాష్ట్రకార్యదర్శి పి.మధు తెలిపారు. పశ్చిమ కృష్ణా జిల్లా మహాసభలో గురువారం ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్రం మోసం చేస్తోందన్నారు. ప్రధాని మోదీతో భేటీ అయిన సీఎం చంద్రబాబు ఏవిధమైన హామీలు పొందారు ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాడితే తమ పార్టీ మద్దతిస్తుందని ప్రకటించారు. గుంటూరు జిల్లా గొట్టుపాడులో దళితులపై దాడిచేసిన అగ్రకులస్తులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. భూస్వాములను అరెస్ట్ చేయకపోతే ‘చలో గుంటూరు’కు పిలుపునిస్తామని హెచ్చరించారు. సీఎం చంద్రబాబు నిరుద్యోగ భృతితో పాటు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ఉద్యమాలకు సిద్ధం కండి పాలకుల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చిగురుపాటి బాబూరావు పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా రింగ్సెంటర్లో గురువారం బహిరంగ సభ నిర్వహించారు. తొలుత ఏ కాలనీ గ్రౌండ్ నుంచి స్థానిక రింగ్‌సెంటర్ వరకు కార్యకర్తలు, పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించారు. బహిరంగ సభలో బాబూరావు మాట్లాడుతూ పాలకులు ఇచ్చిన హామీల నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రజలపై భారలు మోపడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పెట్టుకుందని ఎద్దేవా చేశారు. ఆయిల్ ఉత్పత్తుల ధరలు పెంచడమేనని చెప్పారు. ధరలు పెంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చోద్యం చూస్తున్నారని ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు నిరసగా ఉద్యమించనున్నుట్లు చెప్పారు. రాష్ట్ర నాయకులు ఉమామహేశ్వరరావు, స్వరూపారాణి, జమలయ్య, శ్రీనివాస్, జిల్లా నాయకులు ఆర్.రఘు, నాగేశ్వరరెడ్డి, పీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. పశ్చిమ కృష్ణా కార్యదర్శిగా డీవీ కృష్ణ రెండు రోజుల పాటు నిర్వహించిన సీపీఎం జిల్లా మహాసభలో పశ్చిమకృష్ణా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కార్యదర్శిగా డీవీ కృష్ణ, కార్యవర్గదర్శివర్గ సభ్యులుగా దోనేపూడికాశీనా«థ్, ఎన్సీహెచ్ శ్రీనివాస్, శ్రీదేవి, పీవీ ఆంజనేయులు, నాగేశ్వరరెడ్డి, విష్ణువర్ధన్లను ఎన్నికయ్యారు. మరో 24 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. -
‘విభజన’ రభస ఇంకెన్నాళ్లు?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి నాలుగేళ్లు కావస్తోంది. కాని పోలీస్ శాఖలో విభజన మాత్రం సాగదీత ధోరణిలోనే ఉంది. రాష్ట్ర స్థాయి కేడర్‌గా ఉన్న డీఎస్పీ, అదనపు ఎస్పీ, నాన్ కేడర్ ఎస్పీ అధికారుల విభజన పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో రూపొందించిన సీనియారిటీ జీవోలు 54, 108 కారణంగా తాము అన్యాయానికి గురయ్యామంటూ గ్రూప్–1 డీఎస్పీలు, ప్రమోటీ అధికారులు ఒకరిపై ఒకరు కోర్టుకెళ్లారు. సీనియారిటీ జాబితా సవరించి అధికారుల విభజన పూర్తి చేయాలని 2015లో హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారుల్లో చలనం లేకుండా పోయింది. సీనియారిటీ సమీక్ష పేరుతో ఏళ్ల పాటు కాలయాపన చేస్తూ సమస్యను జటిలం చేస్తున్నారే తప్ప.. పరిష్కార మార్గాలు వెతకడం లేదు. మూడేళ్లుగా ప్యానల్ పెండింగ్ సీనియారిటీ జాబితా సవరించి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీర్చేందుకు ఇరు రాష్ట్రాల పోలీస్ ఉన్నతాధికారులు ముందుకు కదలకపోవడంతో అధికారుల పదోన్నతులపై నీలినీడలు ఏర్పడ్డాయి. మూడేళ్లుగా (2015 నుంచి 2017 వరకు) కేంద్రానికి వెళ్లాల్సిన కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ జాబితా పెండింగ్‌లోనే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల్లో ఐపీఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు సీనియారిటీ జాబితాను సవరించి ప్యానల్‌ను పంపించాల్సి ఉంది. కానీ ఇది జరగలేదు. 2007 గ్రూప్–1 అధికారులు కన్ఫర్డ్ ఐపీఎస్‌గా పదోన్నతి పొందాల్సి ఉంది. వీరు పదోన్నతి పొందితే పోలీస్ శాఖకు ఎస్పీ హోదా కలిగిన ఐపీఎస్ అధికారులు 24 మంది కీలకమవుతారు. ఇద్దరు డీజీపీలు మారారు.. రెండు రాష్ట్రాల్లో ఇద్దరు డీజీపీలు మారిపోయారు. ఇక్కడ అనురాగ్ శర్మ, అక్కడ జేవీ రాముడు ఇద్దరు విభజన అంశాలను పూర్తి స్థాయిలో గట్టెక్కించలేకపోయారన్న ఆరోపణ ఉంది. అయితే ఇప్పుడున్న డీజీపీలు మహేందర్‌రెడ్డి, సాంబశివరావు అయినా సీనియారిటీ జాబితాను పరిష్కరించి కన్ఫర్డ్ ఐపీఎస్ ప్యానల్ ప్రతిపాదనలతోపాటు ప్రమోటీ అధికారులకు సరైన స్థానం కల్పించేందుకు కృషి చేయాల్సి ఉంది. ఎన్నాళ్లీ అడ్హాక్ పదోన్నతులు సీనియారిటీ జాబితా సవరించకుండా విచక్షణ అధికారాల పేరుతో రెండు రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా అడ్హాక్ పదోన్నతులు కల్పించారు. ఏ అధికారి కూడా రెగ్యూలర్ పోస్టులో పదోన్నతి పొందింది లేదు. ఇటీవల తెలంగాణలో గ్రూప్–1 అధికారులు, ప్రమోటీలు మొత్తం అడ్హాక్ పద్ధతిలోనే ప్రమోషన్ పొందారు. అదే సీనియారిటీ జాబితా క్లియర్ అయితే వారందరికీ రెగ్యులర్ పదోన్నతి కింద సీనియారిటీ స్థానం నిర్ధారించాల్సి ఉంటుంది. దీని వల్ల ప్రమోషన్లు రావాల్సిన మిగతా అధికారులకు కూడా న్యాయం జరిగే అవకాశం ఉంది. -
‘ఉమ్మడి’ ఫీజు చెల్లింపులకు ఓకే!
- 2013–14 ఫీజు బకాయిలపై సానుకూలంగా స్పందించిన ఆర్థిక శాఖ - సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సుకు ఆమోదం! - వారం రోజుల్లో ఉత్తర్వులు! సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో నెలకొన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల చెల్లింపులకు మార్గం సుగమవుతోంది. బకాయిలను చెల్లించాలంటూ సాంఘిక సంక్షేమ శాఖ చేసిన సిఫార్సులకు రాష్ట్ర ఆర్థిక శాఖ సానుకూలంగా స్పందించింది. త్వరలో ఈ బకాయిలకు మోక్షం కలగనుంది. 2013–14 విద్యా సంవత్సరపు ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను 2014–15 వార్షికంలో విడతల వారీగా విడుదల చేయగా.. రూ.248.5 కోట్లు మిగిలిపోయాయి. ఇరు రాష్ట్రాల మధ్య చెల్లింపులపై నెలకొన్న అస్పష్టతతో రాష్ట్రం మిగిలిపోయిన నిధులను పెండింగ్‌లో పెట్టింది. ఆ తర్వాతి సంవత్సరం నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేస్తున్నప్పటికీ 2013–14 బకాయిల ఊసెత్తకపోవడంతో వాటిపై గందరగోళం నెలకొంది. ఆయా విద్యార్థులు కోర్సు పూర్తి చేసినప్పటికీ యాజమాన్యాలకు ఫీజులు చెల్లించని కారణంతో సర్టిఫికెట్లను కాలేజీల్లోనే వదిలేశారు. భారం తగ్గే అవకాశం వాస్తవానికి 2013–14 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ.248.5 కోట్లు ఉన్నాయి. లక్ష మంది విద్యార్థులు కాలేజీలకు బకాయి పడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వం విడుదల చేసే బకాయిల చెల్లింపుల్లో సాంఘిక సంక్షేమ శాఖ సరికొత్త వ్యూహాన్ని అనుసరిస్తోంది. నాలుగేళ్ల నాటి బకాయిలు కావడంతో వీరిలో సగం మంది విద్యార్థులు వ్యక్తిగతంగా ఫీజులు చెల్లించుకోగా.. కొందరు కార్యాలయానికి వచ్చి ఫీజు నిధులు విడుదల చేయాలని వినతులు సమర్పిస్తున్నారు ప్రస్తుతం బకాయిలున్న వారిలో 20 శాతం విద్యార్థులు పొరుగు రాష్ట్రానికి చెందిన వారున్నారు. ఈ క్రమంలో బకాయిలను పూర్తి స్థాయిలో కాకుండా సగం ఇస్తే సరిపోతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రాధాన్యత క్రమంలో ఫీజులు చెల్లించాలని సాంఘిక సంక్షేమ శాఖ భావిస్తోంది. తొలి విడతలో రూ.150 కోట్లు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ అంగీకరించినట్లు సమాచారం. డిమాండ్‌ను బట్టి మిగిలిన మొత్తాన్ని విడుదల చేస్తే సరిపోతుందని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నట్లు తెలిసింది. ఈ మేరకు వారం రోజుల్లో నిధుల విడుదల ఉత్తర్వులు రావొచ్చని సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. -
అక్కరకు రాని చంద్రబాబు అనుభవం!
► రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి అడ్డుకోరు. ► ఓటుకు కోట్లు నేపథ్యంలో ప్రత్యేక హోదా తాకట్టు.. ► విభజన హామీల అమలు లేదు.. ► రెవెన్యూ లోటు భర్తీ లేదు.. రాజధానికీ అరకొర నిధులే.. ► పదోషెడ్యూలులో ఆస్తులు పోతున్నా పట్టదు.. తొమ్మిదేళ్ల ముఖ్యమంత్రి... పదేళ్ల ప్రతిపక్షనాయకుడు.. రాజకీయాల్లో మూడున్నర దశాబ్దాల అనుభవం..ఇవన్నీ ఎవరిని ఉద్దేశించినవో వేరే చెప్పనక్కరలేదు.. ఆయన జగమెరిగిన ‘త్రికాలజ్ఞుడు’. స్వయం ప్రకటిత ‘అనుభవజ్ఞుడు’. ఆయనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..తన అనుభవం.. కేంద్రంతో తన ఫ్రెండ్షిప్.. వెరసి రాష్ట్రానికి ఎంతో మేలుచేస్తుందని, స్వర్గాన్ని నేలకు దించేస్తానని నమ్మబలికారు.. నమ్మి జనం ఓట్లేశారు. మూడేళ్లు పూర్తయ్యాయి. వెనక్కి తిరిగి చూసుకుంటే అంతా ఖాళీ.. రాష్ట్రానికి ఏం ఒరిగింది? ప్రజలకు ఏం మేలు జరిగింది? బాబుగారి అనుభవమంతా ఏమయ్యింది? రాష్ట్రం కోసం కేంద్రంతో కొట్లాడారా? కనీసం మాట్లాడారా?.. ఆకాశాన్ని నేలకు దించనక్కరలేదు.. న్యాయంగా మనకు రావలసినవి వచ్చేలా చూశారా? అన్నిటికీ ఒక్కటే సమాధానం.. ఏమీ జరగలేదు. అమరావతి : ఐదుకోట్ల మంది ఎంతో ఆశగా ఎదురుచూసిన ‘ప్రత్యేక హోదా’ను పనిగట్టుకుని అటకెక్కించారు. రాష్ట్ర ప్రగతికి పది కాదు, పదిహేను సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా కావాలని తిరుమల వెంకన్న సాక్షిగా, నరేంద్రమోదీ సమక్షంలో డిమాండ్ చేసిన చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత మాటమార్చారు. నాడు ప్రత్యేక హోదా సంజీవని అన్న నోటితోనే.. దాంతో ఏం వస్తుంది? అని ప్రశ్నించడంతో విలేకరులతో పాటు ప్రజలూ నివ్వెరపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో అంతులేని అవినీతితో ఆర్జించిన నల్లడబ్బును ఎరవేసి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్నందునే ప్రత్యేక హోదాపై కేంద్రప్రభుత్వాన్ని నిలదీయలేకపోయారన్నది బహిరంగ రహస్యం. అంటే తన ప్రయోజనాల కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టారన్నమాట. ముఖ్యమంత్రి హోదాలో ముందుండి పోరాడాల్సిన, అందరినీ కలుపుకుని పోయి కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు మూడేళ్లలో ఎన్నడూ నోరు మెదిపిందే లేదు. వెరసి.. పార్లమెంటు సాక్షిగా నాటి ప్రధానమంత్రి ఇచ్చిన హామీకే దిక్కులేకుండా పోయింది. విభజన హామీలదీ అదేదారి.. రాష్ట్రం విడిపోయి మూడేళ్లు పూర్తయినప్పటికీ విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలేవీ నెరవేరలేదు. అర్ధరాత్రి విలేకరుల సమావేశం పెట్టి విభజన చట్టంలోని హామీలన్నింటినీ చదివేస్తే అదే ఏదో ప్రత్యేక ప్యాకేజీ అన్నట్లు వెంకయ్యనాయుడిని పిలిచి సన్మానాలు చేశారు. జైట్లీ ప్రకటనను చంద్రబాబు నాయుడు స్వాగతించడంపైనా విమర్శలు వెల్లువెత్తాయి. జైట్లీ ప్రకటనలో అసలు ప్యాకేజీ అన్నమాటే లేకపోయినా ప్యాకేజీ ఏదో ప్రకటించారంటూ ప్రచారం చేశారు. విభజన చట్టంలోని అంశాల అమలుకు పట్టుబట్టకుండా ప్యాకేజీ వచ్చేసిందంటూ చంకలు గుద్దుకోవడంతోనే మూడేళ్లు గడచిపోయాయి. రాష్ట్ర విభజన ఏడాది ఏర్పడే ఆర్థిక లోటును భర్తీ చేస్తామని ఇచ్చిన హామీలో కేంద్రం భారీగా కోత విధించింది. అలాగే రాజధాని నిర్మాణానికి కేంద్రం అరకొర నిధులతోనే సరిపుచ్చింది. విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇంకా సాగునీటి రంగం, ఉద్యోగుల సర్వీసు అంశాలు, పంపిణీ, పదవ, తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఉద్యోగులు, ఆస్తులు, అప్పులు పంపిణీ ఇంకా కొలిక్కి రాలేదు. పైగా తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పుల పంపిణీలోను, అలాగే పదవ షెడ్యూల్లోని సంస్థల ఆస్తులు, అప్పులు పంపిణీల్లో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి ప్రతికూల ఆదేశాలు జారీ అయ్యాయి. పదవ షెడ్యూల్లోని సంస్థలకు చెందిన స్థిరాస్తుల్లో(రూ.33 వేల కోట్లు) ఏపీకి ఎటువంటి వాటా రాదని, ఎక్కడి ఆస్తులు అక్కడికే చెందుతాయని, నగదు, అప్పులను మాత్రమే జనాభా నిష్పత్తి మేరకు పంపిణీ చేసుకోవాలని కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. అలాగే తొమ్మిదవ షెడ్యూల్లోని సంస్థలకు చెందిన ఆస్తులు(రూ.10వేల కోట్లు), అప్పుల పంపిణీకి సబంధించి హెడ్ క్వార్టర్స్ అంటే కేవలం ప్రధాన కేంద్ర కార్యాలయం ఆస్తులు, అప్పులే గానీ దాని అనుబంధ యూనిట్లు, సంస్థలు రావని ఏపీ ప్రభుత్వానికి షాక్ ఇస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇంత అన్యాయం జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నిలదీయలేకపోయారు. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రాన్ని ప్రశ్నించకుండా మౌన ప్రేక్షకుని మాదిరిగా చూస్తుండడమే చంద్రబాబు అనుభవమని అనుకోవడం తప్ప ఇక ఇప్పుడు చేయగలిగిందేమీ లేదని ప్రజలు నిట్టూరుస్తున్నారు. విభజన చట్టంలోని ప్రధాన హామీలు, వాటి అమలు తీరు తెన్నులు రెవెన్యూ లోటు భర్తీగా రూ.16,078 కోట్లు కేంద్రం ఇవ్వాలికానీ కేంద్రం 4,117 కోట్ల రూపాయలతో సరిపుచ్చింది. ఇంతకన్నా ఒక్క పైసా ఇవ్వబోమని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదాకు మంగళం పలికింది. బాబు కోరిక మేరక చట్టంలోని అంశాలన్నీ కలిపి అదే ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్రం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి తొలుత బాబు ఐదు లక్షల కోట్ల రూపాయలు కావాలని అడిగారు. అయితే కేంద్రానికి 43,000 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపారు. కానీ కేంద్రం రాజధానిలో సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, రాజభవన్ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలే ఇస్తామని తేల్చింది. ఇందులో ఇప్పటికి 1,950 కోట్ల రూపాయలను విడుదల చేసింది. దుగరాజపట్టణంలో భారీ ఓడరేవు నిర్మాణం చేపడతామని విభజన చట్టంలో చెప్పారు కానీ ఇప్పుడు వయబుల్ కాదని కేంద్రం స్పష్టీకరించింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారు కానీ ఇంకా వయబులిటీ అధ్యయనం పేరుతో కమిటీ ఏర్పాటు వద్దే ఆగిపోయింది. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చట్టంలో చెప్పారుకానీ రైల్వే జోన్ ఏర్పాటుపై దాగుడు మూతలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరిశ్రమలకు ఇచ్చిన పన్ను రాయితీల రికవరీలో విభజన చట్టం నిబంధనలతో రాష్ట్రానికి రూ.3820 కోట్లు నష్టం వస్తున్నందున నిబంధనల్లో సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ఇప్పటి వరకు కేంద్రం స్పందించలేదు. వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చట్టంలో చెప్పారు. అయితే ఒక ఏడాదికి జిల్లాకు 50 కోట్ల రూపాయలతో కేంద్రం సరిపుచ్చేసింది. మూడేళ్లలో రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చిన కేంద్రం. -
న్యాయం కావాలి!
ఉమ్మడి హైకోర్టును పీడిస్తున్న ఖాళీలు - పని ఒత్తిడితో న్యాయమూర్తులు ఉక్కిరిబిక్కిరి - పోస్టుల భర్తీలో కేంద్రం తీవ్ర జాప్యం - రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలపై మీనమేషాలు - కక్షిదారులు, న్యాయవాదుల్లో పెరిగిపోతున్న అసహనం సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తుల ఖాళీలు.. ఇప్పుడు ఉమ్మడి హైకోర్టును పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య. న్యాయమూర్తుల పోస్టుల భర్తీ ప్రక్రియకు సంబంధించి ఉన్నతస్థాయిలో జరుగుతున్న అసాధారణ జాప్యంతో పెరిగిపోతున్న పని ఒత్తిడి న్యాయమూర్తులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. దీనికి తోడు న్యాయవ్యవస్థలో చోటు చేసుకుంటున్న సంస్కరణల నేపథ్యంలో పెరిగిపోతున్న ఇతర అధికారిక పనులతో వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవలను ఉపయోగించుకునేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన కేంద్రం, ఆ మేర హైకోర్టు నుంచి సిఫారసులు అందినా ఇప్పటివరకు వారి నియామకానికి మాత్రం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వకపోవడాన్ని వారు తప్పుపడుతున్నారు. ఇదే సమయంలో విచారణకు నోచుకోని కేసులతో.. భరించలేని ఒత్తిడితో కక్షిదారులు, న్యాయవాదుల్లో అసహనం రోజు రోజుకు పెరిగిపోతోంది. రిటైర్డ్ న్యాయమూర్తులేమైనట్లు..? రాజ్యాంగంలోని అధికరణ 224ఎ కింద రిటైర్డ్ న్యాయమూర్తులను హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులుగా నియమించుకోవచ్చు. రిటైర్డ్ న్యాయమూర్తుల సేవల వినియోగంపై అప్పటి లా కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎం.జగన్నాథరావు నిర్ధిష్టమైన ప్రతిపాదనలు చేశారు. అయితే అవి ఇప్పటివరకు ఆచరణకు నోచుకోలేదు. సుదీర్ఘ తర్జనభర్జనల అనంతరం కేంద్ర న్యాయశాఖ గత ఏడాది నవంబర్‌లో రిటైర్డ్ న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి గత ఏడాది చివర్లో నలుగురు రిటైర్డ్ న్యాయమూర్తుల పేర్లను సిఫారసు చేశారు. జస్టిస్ ఖండవల్లి చంద్రభాను, జస్టిస్ గుండా చంద్రయ్య, జస్టిస్ రెడ్డి కాంతారావు, జస్టిస్ ఎస్.రవికుమార్ పేర్లను కేంద్రానికి పంపారు. ఇలా నాలుగు హైకోర్టుల నుంచి 18 పేర్లు పంపినా.. కేంద్రం ఇప్పటికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. అయినా ప్రయోజనం లేదు... అయితే పెరుగుతున్న సంఖ్యలకు అనుగుణంగా న్యాయమూర్తుల సంఖ్య లేకపోవడంతో సిట్టింగ్ న్యాయమూర్తులపై పని ఒత్తిడి తీవ్రమవుతోంది. రోజుకు ఒక్కో న్యాయమూర్తి ముందు వందల సంఖ్యలో కేసులు వస్తున్నప్పటికీ, వాటిలో గరిష్టంగా 60–80 కేసులు మాత్రమే విచారించడం సాధ్యమవుతోంది. దీంతో కక్షిదారుల నుంచి న్యాయవాదులకు, న్యాయవాదుల నుంచి న్యాయమూర్తులకు ఒత్తిడి ఎదురవుతోంది. ఒక్కో జడ్జి పరిష్కరించిన కేసులు...(సుప్రీంకోర్టు తాజా లెక్కల ప్రకారం) ► ఉమ్మడి హైకోర్టులో (గత సెప్టెంబర్ నాటికి) పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య: 2,85,663. ► ఇందులో క్రిమినల్ కేసులు: 41,172... సివిల్ కేసులు: 2,44,491. ► 2016 మూడో త్రైమాసికం(జూలై–సెప్టెంబర్)లో హైకోర్టు పరిష్కరించిన కేసు సంఖ్య: 17,991 ► ఆ క్వార్టర్లో హైకోర్టు పని దినాలు: 60 ► ఈ లెక్కన ఒక్కో న్యాయమూర్తి పరిష్కరించిన సరాసరి కేసులు: 299 పెరుగుతున్న కేసుల సంఖ్య(ఒక ఏడాదికి)... ► రాష్ట్ర విభజనకు ముందు దాఖలయ్యే రిట్ పిటిషన్ల సంఖ్య: 35 వేల నుంచి 38 వేలు ► ప్రస్తుతం: దాదాపు 47 వేలు ► రాష్ట్ర విభజనకు ముందు క్రిమినల్ కేసుల సంఖ్య: 11 వేల నుంచి 13 వేలు ► ప్రస్తుతం: 22 వేలకుపైగా... ► ఇప్పుడు తెలంగాణకు పరిపాలన ట్రిబ్యునల్ లేకపోవడంతో, ఉద్యోగ వివాదాల కేసులను హైకోర్టే విచారించాల్సి వస్తోంది. వీటికి తోడు ఆస్తి వివాదాలు, కుటుంబ వివాదాల కేసులు కూడా భారీగానే దాఖలవుతున్నాయి. -
బాధ్యుల్లేరు.. భారం ఉంది..
పోలీస్‌శాఖలో కీలక విభాగాలకు అధిపతులేరీ? పదోన్నతులకూ అవకాశం ఇవ్వని ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఐపీఎస్‌ల పదోన్నతులు, పోస్టింగ్స్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడంతో కీలక విభాగాల పనితీరు గాడి తప్పేలా కనిపిస్తోంది. ఇన్చార్జీ లతో నెట్టుకొస్తున్న విభాగాలు అయోమయంలో పడిపో యాయి. దీంతో అదనపు డీజీపీల నుంచి ఎస్పీల వరకు పనిభారం పెరిగిపోయింది. రెండు జోన్లకు ఒకే ఐజీ, 4 రేంజ్‌లకు ఇద్దరు డీఐజీలే ఉన్నారు. సీఐడీకి చీఫ్‌గా ఉండే అదనపు డీజీ పోస్టు ఖాళీగా ఉంది. సీఐడీలో ఆరుగురు ఎస్పీలకు గానూ ఒక ఎస్పీ మాత్రమే ఉన్నారు. నలుగురు డీఐజీలు ఉండాల్సింది ఒక డీఐజీతో నెట్టుకొస్తున్నారు. ఏసీబీకీ చీఫ్ హోదాలో కూడా ఇన్చార్జీల పాలనే సాగుతోంది. ఏసీబీలో జాయింట్ డైరెక్టర్లుగా 4 పోస్టులంటే ఇద్దరే సర్వీసుల్లో ఉన్న అధికారులు న్నారు. మిగతా ఇద్దరు కాంట్రాక్ట్ పద్ధతిలో కొనసాగుతున్నారు. విజిలెన్స్‌లోనూ ఇన్చార్జీ డైరెక్టర్ పాలన కొనసాగు తోంది. డీఎస్పీ నుంచి నాన్ క్యాడర్ ఎస్పీ హోదా వరకు ఉన్న 41 మంది అధికారులు ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. అసలే కొరతతో ఇబ్బంది పడుతుంటే ఈ పదవీ విరమణలతో మరింత డీలా పడనుందని ఆందోళన మొదలైంది. రాష్ట్ర విభజనలో భాగంగా 12 నాన్‌క్యాడర్ ఎస్పీ, 24 వరకు అదనపు ఎస్పీ పోస్టులు వచ్చాయి. వీటితోపాటు కొత్తగా మంజూరయ్యే పోస్టులకు పదోన్నతి ఇవ్వాలని ఉన్నతాధికారులు నిర్ణయిం చారు. ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టడంతో ఆశావహుల్లో అసంతృప్తి నెలకొంది. -
జీరోలా చేస్తున్నారు
టీడీపీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి గుంటూరు(నగరంపాలెం): పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్లమెంట్ నియోజకవర్గంలో, రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్లో సింహంలా పనిచేసిన వాడిని అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో వారే సున్నా చేయాలని చూస్తున్నారని గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి అవేదన వ్యక్తం చేశారు. సంస్థాగత ఎన్నికలపై ఆదివారం నిర్వహించిన టీడీపీ నగర సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో ఇతరుల జోక్యం ఎక్కువగా ఉండటం వల్ల పనులు, పార్టీ పదవులు తన ప్రమేయం లేకుండానే కొనసాగుతున్నాయని చెప్పారు. పేదలు, కార్యకర్తల కోసం చేసిన సిఫార్సులను అధికారులు పట్టించుకోవటం లేదన్నారు. శత్రువుల కన్నా పార్టీలో ఉన్న మిత్రులతోనే ఎక్కువ నష్టం జరుగుతుందని తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు దాటినా నగరపాలక సంస్థ ఎన్నికలుగానీ, వక్ఫ్‌బోర్డు, దేవస్థాన కమిటీలు ఏర్పాటు చేయలేకపోవటంలో కార్యకర్తలు నిరాశకు గురవుతున్నారని తెలిపారు. పార్టీ పదవులతో విజిటింగ్ కార్డులు కొట్టించుకొని అమరావతిలో సెటిల్మెంట్లు చేసుకునేవారు ఎక్కువయ్యారని విమర్శించారు. -
ప్రజల అభీష్టం మేరకే విభజన జరిగింది కదా!
► ‘విభజన’ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు ► అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ.. పిటిషన్లను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు సాక్షి, న్యూఢిల్లీ: ‘ప్రజల అభీష్టం మేరకే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది కదా..! విభజన జరిగిన తర్వాత దీనిపై ఇప్పుడు విచారణ జరపాలని కోరడంలో ఆంతర్యం ఏమిటి?’ అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 2014లో రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఎంపీ రాయపాటి సాంబశివరావు సహా 26 మంది దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు సోమవారం విచారణకు స్వీకరించింది. అంతకుముందు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహెర్, జస్టిస్ చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ స్పందిస్తూ.. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకే విభజ న జరిగింది కదా! దీనిపై విచారణ జరపాలని కోర డంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫు న్యాయవాది ఏడీఎన్ రావు జోక్యం చేసుకుంటూ.. ‘రాష్ట్ర విభజన ఏపీ ప్రజల కోరికకు విరుద్ధంగా విభజన జరిగింది. కాబట్టి బిల్లు ఆమోదానికి సంబంధించి అఫిడవిట్ దాఖలు చేసేలా లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ను ఆదేశించండి..’ అని కోరారు. విభజనకు వ్యతిరేకంగా తాము దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్రం అఫిడవిట్లు దాఖలు చేయలేదని, దీనిపై కూడా కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాల్సిందిగా ఇతర పిటిషనర్లు రఘురామకృష్ణ రాజు, పద్మనాభరావు తరఫు న్యాయవాది సతీశ్ ధర్మాసనాన్ని కోరారు. కేంద్రం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఏపీని విభజించామని కేంద్రం తరఫున అదనపు సొలిటర్ జనరల్ పరంజిత్ సింగ్ పట్వాలియా ధర్మాసనానికి తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం పిటిషన్లను విచారణకు స్వీకరిస్తున్నామని, అన్ని పిటిషన్లను కలిపి ఒకేసారి విచారిస్తామని స్పష్టం చేసింది. కేంద్రం కౌంటర్ దాఖలు చేయకపోతే దాఖలు చేయాలని ఆదేశించింది. -
‘విభజనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం’
సత్తెనపల్లి: ఉమ్మడి ఏపీ రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం అన్నారు. మంగళవారం గుంటూరు జిల్లా సత్తెనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ విస్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ ఒక్కటే చేసిందనే అపవాదు వేస్తున్నారని, చంద్రబాబు రెండుసార్లు రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖలు ఇచ్చిన విషయాన్ని జేడీ శీలం ఈ సందర్భంగా గుర్తు చేశారు. రాష్ట్ర విభజన కాంగ్రెస్ తప్పుకాదని అందరూ కలిసి చేసిందే అని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై తిరుపతిలో వేంకటేశ్వరస్వామి సాక్షిగా నరేంద్ర మోదీ హమీ ఇచ్చి మాటమార్చడం దురదష్టకరమన్నారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలను కేసీఆర్ కొనుగోలు చేస్తున్నారని దూషిస్తూ ప్రధానికి ఫిర్యాదు చేసిన చంద్రబాబు.... సిగ్గు లేకుండా రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని జేడీ శీలం విమర్శించారు. చంద్రబాబు తన చర్యల ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను కించపరుస్తున్నారన్నారు. కాంగ్రెస్ భూములు పంపిణీ చేస్తే చంద్రబాబు ప్రభుత్వం లాక్కుంటోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ బ్యాంకులు జాతీయకరణ చేస్తే మోదీ ప్రైవేటు పరం చేస్తున్నారని విమర్శించారు. మోదీ, చంద్రబాబు, వెంకయ్య నాయుడును ఓడించేందుకు ఇప్పటినుంచే సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
‘సరిహద్దు’ చిచ్చు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య మరోసారి సరిహద్దు వివాదం రాజుకుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే తెలంగాణ లారీలను చెక్‌పోస్టుల వద్ద అడ్డుకుని రోజుల తరబడి నిలిపేయటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రెండు రాష్ట్రాల మధ్య సింగిల్ పర్మిట్ విధానానికి ఒప్పందం కుదరకపోవటంతో ఇబ్బంది పడుతున్న తమను ఇప్పుడు ఏపీ అధికారులు కావాలనే వేధిస్తున్నారంటూ తెలంగాణ లారీ యజమానుల సంఘం భగ్గుమన్నది. రాష్ట్ర విభజన అనంతరం సరిహద్దు దాటాలంటే పన్ను కట్టాల్సిందేనంటూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ‘సరిహద్దు’ వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రెండు రాష్ట్రాల అధికారుల చర్చల ఫలితంగా వివాదం సద్దుమణిగింది. నాలుగు రోజులుగా దాచేపల్లి, పొందుగుల, నాగార్జునసాగర్ తదితర చెక్‌పోస్టుల వద్ద వందల సంఖ్యలో తెలంగాణ లారీలను ఏపీ అధికారులు నిలిపేస్తున్నారు. ఇందులో ఎక్కువగా ఇసుక లారీలే ఉన్నాయి. సరైన వే బిల్స్ ఉన్నా స్థానికంగా కంప్యూటరీకరణ లేనందున వాటిని నర్సరావుపేట కార్యాలయానికి వెళ్లి సరిచూసుకోవాలనే కారణంతో లారీలను రెండు, మూడురోజులపాటు నిలిపేశారు. దీంతో తెలంగాణ లారీ యజమానులు ధర్నాలకు కూడా దిగారు. ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారుతోందని గుర్తించిన ఏపీ అధికారులు గురువారం చాలా లారీలను వదిలేశారు. ‘తోక బిల్లు’ లేదని... ఓ చెక్‌పోస్టులో లారీని తనిఖీ చేశాక పత్రాలన్నీ సరిగా ఉంటే ‘పత్రాలు సరిగానే ఉన్నాయి సరిహద్దు దాటేందుకు అభ్యంతరం లేదు’ అని పేర్కొంటూ ఓ పత్రం ఇస్తారు. దానిని లారీల డ్రైవర్లు తోక బిల్లుగా వ్యవహరిస్తారు. ఆ బిల్లు లేదనే సాకుతో అధికారులు లారీ డ్రైవర్లను వేధిస్తున్నారని తెలంగాణ లారీ యజమానుల సంఘం ఆరోపిస్తోంది. ఒక్కో లారీ నుంచి ఏపీ అధికారులు రూ.400 వరకు వసూలు చేస్తున్నారని, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రెండు ప్రభుత్వాలు చర్చించుకుని లారీలకు సింగిల్ పర్మిట్ విధానం ప్రారంభించాలని తెలంగాణ లారీ యజమానుల సంఘం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇసుక దందా... ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒకరు అక్రమంగా సిలికా ఇసుకను తెలంగాణకు సరఫరా చేస్తున్నట్టు బయటపడింది. తెలంగాణలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఇసుక సరఫరా బాగా తగ్గిపోయింది. దీంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో ఇసుక కొరత ఏర్పడింది. దీన్ని ఆసరా చేసుకున్న ఆ ఎమ్మెల్యే చిలుకలూరిపేట, రేపల్లె తదితర ప్రాంతాల నుంచి సిలికా ఇసుక అక్రమ సరఫరాకు తెరలేపారు. దీనికి ఆ ఎమ్మెల్యే హైదరాబాద్‌కు చెందిన లారీలనే వినియోగించటం గమనార్హం. అధికారులు పట్టుకున్న లారీల్లో ఇవీ ఉండటంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. -
‘కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు’
గుంటూరు : ప్రత్యేక హోదాకు మించిన ఆదాయ వనరులు ఆంధ్రప్రదేశ్‌కు వస్తాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఆయన మంగళవారమిక్కడ మాట్లాడుతూ చట్టంలో ఉన్నవి అమలు చేసి వాటికి చట్టబద్ధత కల్పిస్తామన్నారు. ప్రత్యేక హోదాపై కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని వెంకయ్య మండిపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో నాడు రాష్ట్ర ప్రయోజనాలపై నోరు మెదపని వారు ఈరోజు తనను విమర్శిస్తున్నారని వెంకయ్య నాయుడు ధ్వజమెత్తారు. ఏడు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం సాధ్యమయ్యేదా అని ఆయన ప్రశ్నించారు. తెనాలిలో ఇవాళ జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వెంకయ్య పాల్గొన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయనకు బీజేపీ నేతల సన్మానం చేశారు. -
ఈ చిన్న లాజిక్ కూడా మరిచారా...బాబుగారూ
ప్రత్యేక హోదా వస్తే అప్పుల్లో 90 శాతం కేంద్రమే భరిస్తుంది ఇందులో రూ.26,253 కోట్లు విదేశీ సంస్థల నుంచి రుణం ప్రత్యేక హోదా ఇస్తే–ఇందులో 90 శాతం కేంద్రమే భరిస్తుంది అంటే 23,628.33 కోట్లు కేంద్రం భరిస్తుంది–రాష్ట్రం కేవలం రూ.2623.37 కోట్లే భరిస్తే చాలు రూ.11,525 కోట్లు రాష్ట్ర సర్కారు వాటా కేంద్రం వద్ద పెండింగ్‌లో 13 విదేశీ అప్పు ప్రాజెక్టులు హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం భారీ ఎత్తున విదేశీ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 13 ప్రాజెక్టులను రూపొందించింది. ప్రపంచ బ్యాంకుతో పాటు జైకా, తదితర విదేశీ ఆర్థిక సంస్థల నుంచి 37,778.80 కోట్ల రూపాయల విలువగల ప్రాజెక్టులను చేపట్టాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టులన్నింటినీ కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ఇందులో విదేశీ సంస్థల నుంచి 26,253.71 కోట్ల రూపాయలు అప్పు చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక హోదా సాధించిన పక్షంలో ఈ అప్పులో కేంద్ర ప్రభుత్వం 90 శాతం భరిస్తుంది. రాష్ట్ర సర్కారు పది శాతం భరిస్తే సరిపోతుంది. 26,253.71 కోట్ల రూపాయల అప్పుల్లో కేంద్ర ప్రభుత్వం 23,628.33 కోట్ల రూపాయలు భరిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.2623.37 కోట్లు భరిస్తే సరిపోతుంది. ఐదేళ్ల పాటు అమలయ్యే ఈ విదేశీ ప్రాజెక్టులకు ప్రత్యేక హోదా వర్తింప చేస్తే రాష్ట్రంలో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాజెక్టులన్నీ కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధ్యయనం చేసిన తరువాత, రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు ఆధారంగాను, అలాగే వ్యయం చేసే సామర్ధ్యం ఆధారంగా ఆమోదం తెలుపుతుందని అధికార వర్గాలు తెలిపాయి. వ్యయం చేసే సామర్ధ్యంతో పాటు తిరిగి రుణాలు చెల్లించే సామర్ధ్యాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకునే ఎంత వరకు ఏ ప్రాజెక్టులకు అనుమతించాలో నిర్ధారిస్తుందని ఉన్నతాధికారి తెలిపారు. విదేశీ ఆర్థిక సంస్థల ద్వారా చేపట్టేందుకు 13 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. మొత్తం 13 ప్రాజెక్టుల వ్యయం రూ.37,778.80 కోట్లు కాగా ఇందులో విదేశీ సంస్థల రుణం రూ.26,253.71 కోట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వ భరించనున్న వాటాగా రూ.11,525.09 కోట్లుగా పేర్కొన్నారు. ఈ 13 ప్రాజెక్టులకు సంబంధించిన వ్యయంలో 70 శాతం మేర విదేశీ సంస్థల నుంచి రుణంగా తీసుకుంటుండగా రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద 30 శాతం భరించనుంది. -
తెలంగాణకు చేరిన ఇంజనీర్లు
టీఎస్ జెన్కోలో భర్తీ చేయనున్న యూజమాన్యం ? పాల్వంచ: ఆంధ్రప్రదేశ్‌లోని దిగువ సీలేరు పవర్ ప్లాంట్‌లో పనిచేస్తున్న తెలంగాణ స్థానికత కలిగిన ఇంజనీర్లు గురువారం తమ విధులు బహిష్కరించి స్వరాష్ట్రానికి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత దిగువ సీలేరు ఆంధ్రాలోకి వెళ్లడంతో ఇంతకాలం అక్కడే విధుల్లో కొనసాగారు. ఈ క్రమంలో తెలంగాణ స్థాని కత కలిగిన వారిని రిలీవ్ చేసి పంపించాలని అక్కడ ఇంజనీర్లు నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు. దీనికి తెలంగాణ లో అన్ని ఇంజనీర్స్ అసోసియేషన్లు సంఘీభావం తెలుపుతున్నాయి. కానీ ఉద్యోగుల విభజన చేసి పంపడంలో జాప్యంతో విధులు బహిష్కరించి వచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విధులు బహిష్కరించిన వారిని టీఎస్ జెన్కోలో భర్తీ చేసేందుకు తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ బాధ్యత తీసుకుందని తెలుస్తోంది. యాజమాన్యం, ప్రభుత్వం నుంచిఅనుమతి తీసుకున్నామని ఆ సంఘ నేతలు చెబుతున్నారు. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.సుధాకర్‌రావు, ప్రధాన కార్యదర్శి రత్నాకర్‌రావు, అసోసియేట్ అధ్యక్షుడు మంగీలాల్ నేతృత్వంలో సీలేరుకు వెళ్లిన 30 మంది ఇంజనీర్లు (ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అకౌంట్స్ సిబ్బంది) సీఈ మోహన్ రావుకు ఈ విషయాన్ని తెలిపినట్లు సమాచారం. ఆ వెంటనే వారు విధులు బహిష్కరించి తెలంగాణ చేరుకున్నారు. మార్గమధ్యలో పాల్వంచలోని కేటీపీఎస్ కాంప్లెక్స్‌కు గురువారం రాత్రికి చేరుకున్నారు. శుక్రవారం ఉదయమే వీరు నేరుగా టీఎస్ జెన్కో సీఎండీ ప్రభాకర్‌రావును కలిసి టీఎస్ జెన్కోలో తమను భర్తీ చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఆంధ్ర స్థానికత కలిగిన ఉద్యోగులు సైతం టీఎస్ జెన్కోలో పనిచేస్తుండటంతో వారిని ఎక్కడ భర్తీ చేయాలనే విషయమై తర్జనభర్జన జరుగుతోంది. తక్కువ మందే రావడంతో వెంటనే వారికి పోస్టింగ్‌లు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీ కరించిందని ఇంజనీర్ల సంఘాలు హామీ ఇచ్చి మరీ తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో చేర్చుకునేందుకు సుముఖం సీలేరులో విధులు బహిష్కరించి వచ్చే వారిని తెలంగాణలో జాయిన్ చేసుకునేందుకు యాజమాన్యం అంగీకరించిందని ఇంజనీర్స్ అసోసియేషన్ నాయకులు తెలిపారు. -
తపాలా రెండు ముక్కలు..!
- విభజన ప్రక్రియ ప్రారంభం - తెలంగాణ సర్కిల్ చీఫ్‌గా చంద్రశేఖర్ నియామకం - ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ రాయ్ బదిలీ - పరిపాలనా సిబ్బందికి ఆప్షన్ అవకాశం - తపాలా సిబ్బంది ఎక్కడివారక్కడే సాక్షి, హైదరాబాద్: తపాలా శాఖను విభ జించాలని ఎట్టకేలకు రాష్ట్ర విభజన జరిగిన రెండేళ్ల తర్వాత కేంద్రం నిర్ణయించింది. దీనికి సంబంధించి తపాలా శాఖ ఆదేశాలు జారీ చేసింది. జనాభా ప్రాతిపదికన 42:58 నిష్పత్తిలో విభజన తంతు పూర్తి చేయాలంటూ తాజాగా హైదరాబాద్‌కు సమాచారం అందింది. తపాలా శాఖ ప్రధాన కార్యాలయం, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, కర్నూలు రీజినల్ కార్యాలయాలు, డివిజనల్ కార్యాలయాల్లోని పరిపాలన విభాగాల్లోని సిబ్బంది, మల్టీ టాస్క్ సర్వీసు సిబ్బందికి, సర్కిల్ కార్యాలయాల్లోని ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఎగువ స్థాయి వారికి ఆప్షన్ అవకాశం కల్పించారు. వారు ఏ ప్రాంతంలో పనిచేయాలనుకుంటున్నారో ఆసక్తి వ్యక్తీకరిస్తూ లేఖలు సమర్పించారు. ఇక ఆయా ప్రాంతాల్లో తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న వారు ఎక్కడి వారు అక్కడే పనిచేయాలి. తెలంగాణకు కొత్త చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ విభజనలో భాగంగా తెలంగాణ సర్కిల్‌కు కొత్త పోస్ట్‌మాస్టర్ జనరల్‌ను తపాలా శాఖ నియమించింది. ప్రస్తుతం ఉమ్మడిగా ఏపీ సర్కిల్ చీఫ్‌గా పనిచేస్తున్న రాయ్‌ని ఉత్తరప్రదేశ్ చీఫ్ పోస్ట్‌మాస్టర్‌గా బదిలీ చేసి, ఉత్తరప్రదేశ్‌లో పనిచేస్తున్న చంద్రశేఖర్‌ను తెలంగాణ సర్కిల్ చీఫ్‌గా నియమించింది. ఆయన ఒకటో తేదీన బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఏపీ సర్కిల్‌కు మరో అధికారిని నియమించేవరకు చంద్రశేఖరే ఇన్చార్జిగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఇక ఉన్నత పదవుల్లో ఏ ప్రాంతానికి ఎవరిని నియమించాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టులను ఏ రాష్ట్రానికి అవిగా కేటాయించాల్సి ఉన్నందున అందులో స్పష్టత ఇవ్వాలంటూ స్థానిక యంత్రాంగం ఢిల్లీకి లేఖ రాసింది. మరో రెండుమూడు రోజుల్లో అందులో స్పష్టత రానుండటంతో నియామకాలు కూడా జరగబోతున్నాయి. ప్రస్తుతం తపాలా శాఖలో 41,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇందులో 26 వేల మంది గ్రామీణ్ డాక్ సేవక్స్ ఉన్నారు. వీరిని రెండు రాష్ట్రాల మధ్య విభజించాల్సి ఉంది. -
డాక్యుమెంట్లతో పాటు స్వీయ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేవారు, విద్యార్థులకు స్థానికత కావాలంటే స్వీయ ప్రకటనతో పాటు తెలంగాణలో నివాసం ఉన్నట్లు, అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు సంబంధిత ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. ధ్రువపత్రాలను ఆన్లైన్లో గానీ మీసేవలోగానీ సమర్పిస్తే సబంధిత తహసీల్దారు వారం రోజుల్లోగా స్థానికత పత్రం జారీ చేస్తారు. వారంలోగా తహసీల్దారు జారీ చేయకపోతే స్వయంచాలకం (ఆటోమేటిక్)గా ధ్రువీకరణ పత్రం జారీ అయ్యేలాగ ఏర్పాట్లు చేశారు. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే వారికి స్థానికతపై కేంద్రం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 2లోగా తెలంగాణలోని ఏ ప్రాంతంనుంచైనా ఆంధ్రప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి వెళ్లినా స్థానికతను వర్తింప చేస్తారు. ఆ తరువాత వెళ్లే వారికి స్థానికత వర్తించదని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఉద్యోగార్థులు, విద్యార్థులకే స్థానికత వర్తిస్తుందని, వారి తల్లిదండ్రులకు, సంరక్షకులకు కాదని పేర్కొన్నారు. మైనర్లకు స్థానికత కావాలంటే తల్లిదండ్రులు, సంరక్షకులు ధరఖాస్తు చేసుకోవచ్చును. స్వీయ ప్రకటనలోని సమాచారం తప్పు అని తేలితే.. స్థానికత పత్రం ద్వారా పొందిన ఉద్యోగం లేదా అడ్మిషన్ రద్దు చేస్తారు. అంతేగాక ప్రాసిక్యూషన్ చర్యలు చేపడతారు. డెరైక్టు రిక్రూట్మెంట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఎక్కడ నివాసం ఉంటున్నారనే దాన్నే పరిగణనలోకి తీసుకోవాలి గానీ వారి తల్లిదండ్రులు, సంరక్షకుల నివాసాన్ని కాదని స్పష్టం చేశారు. ధ్రువీకరణ పొందాలంటే.. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లే ఉద్యోగార్థులు, విద్యార్థులు ఏపీలో స్థానికత పొందాలంటే.. తెలంగాణలో నివాసం ఉన్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డ్, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నివాసం ఉంటున్నట్లు నిర్ధారించే ఆధార్ కార్డు, డ్రైవింగ్ లెసైన్స్, రేషన్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్, పాన్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల్లో ఒకటి జత చేయాలి. -
ఐటీడీఏ...4 జిల్లాల్లోకి..!
రాష్ట్ర విభజనకు ముందు, ఆ తర్వాత కూడా భద్రాచలం అతి పెద్ద ఐటీడీఏగా గుర్తింపు పొందింది. ఉమ్మడి రాష్ట్రంలో 29 మండలాలు, తెలంగాణ రాష్ట్రంలో 24 మండలాలున్న ఐటీడీఏ... జిల్లాల పునర్విభజన కారణంగా నాలుగు ముక్కలవుతోంది. భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు, భూపాలపల్లిలో 2, మహబూబాబాద్‌లో 3, ఖమ్మం జిల్లాలో 3 మండలాలు పూర్తిగా, రెండు మండలాలు పాక్షికంగా ఏజెన్సీ పరిధిలోకి రానున్నారుు. కామేపల్లిని కొత్తగూడెంలో ఉంచుతారా... ఖమ్మంలో కలుపుతారా వేచి చూడాల్సిందే. భద్రాచలం : ఏజెన్సీ ప్రాంత ప్రజానీకం అభివృద్ధి కోసమని ప్రత్యేకంగా సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)లను ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. జిల్లాలో 1975 మార్చి 3వ తేదీన ఖమ్మం కేంద్రంగా ఐటీడీఏ తన కార్యకలాపాలు ప్రారంభించింది. దీనిని 1979 డిసెంబర్ 17న పాల్వంచకు తరలించారు. అక్కడ నుంచి 1993 ఫిబ్రవరి 9న భద్రాచలంనకు మార్చారు. భద్రాచలంలో మొదట్లో ఐటీడీఏ కార్యాలయూన్ని చర్ల రోడ్డులోని ప్రస్తుతం గిరిజన బీఈడీ కళాశాల నిర్వహిస్తున్న భవనాల్లో నిర్వహించారు. కొద్ది కాలానికి ఐటీడీఏకు ప్రత్యేకించి విశాలమైన భవనాలు నిర్మించారు. భద్రాచలం ఐటీడీఏకు ఉన్న అధునాతన భవనాలు, సువిశాలమైన స్థలం తెలంగాణ రాష్ట్రంలో కాక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఏ ఐటీడీఏకు కూడా లేవు. ఉమ్మడి రాష్ట్రంలో ఇలా.... రాష్ట్ర విభజన జరగక ముందు జిల్లాలో 46 మండలాలకుగాను, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం డివిజన్లలోని 29 మండలాలు పూర్తిగా, సత్తుపల్లి, పెనుబల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలు కూడా ఐటీడీఏ పరిధిలోనే ఉండేవి. ఇందులో ట్రైబల్ సబ్‌ప్లాన్(టీఎస్పీ) పరిధిగా గుర్తించిన 19 మండలాలపై ఐటీడీఏ ద్వారా పెద్ద ఎత్తున నిధుల కేటాయింపు ఉండేది. జిల్లా విస్తీర్ణం 16,029 స్క్వేర్ కిలోమీటర్లు కాగా, ఇందులో ఐటీడీఏ పరిధిలో గల ఏజెన్సీ ప్రాంతం 12,175 స్క్వేర్ కిలోమీటర్ ఉంది. అంటే ఈ లెక్కన జిల్లా విస్తీర్ణంలో 76 శాతం ఏజెన్సీనే అన్నమాట. జిల్లాలో 4 డివిజన్లు ఉండగా, ఇందులో 3 డివిజన్లు ఏజె న్సీ పరిధిలోనివి. జిల్లా మొత్తం మీద 6.83 లక్షల మంది గిరిజన జనాభా ఉండగా, ఇందులో 5.61 మంది గిరిజనులు ఏజెన్సీ ప్రాంతవాసులే. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలో ఉన్న ఐదు మండలాలు పూర్తిగా, భద్రాచలం పట్టణం మినహా మిగతా మండలం, బూర్గంపాడులోని ఆరు రెవెన్యూ గ్రామాలు ఏపీలో విలీనమయ్యాయి. ఈ కారణంగా భద్రాచలం ఐటీడీఏ పరిధి త గ్గింది. ప్రస్తుతం జిల్లాలో 41 మండలాలకు గాను ఐటీడీఏ పరిధిలో 24 ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీడీఏ పరిధిలో 904 గ్రామాలు ఉండగా, ప్రస్తుతం 571 గ్రామాలు ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజన జనాభాలో 1,90,304 మంది తగ్గిపోయారు. కొత్తజిల్లాల ఏర్పాటుతో.... రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం కావడంతో ఐటీడీఏ స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న 41 మండలాల్లో కొత్తగా ఏర్పడబోయే భద్రాద్రి జిల్లాలో 19 మండలాలు ఉంటారుు. అరుుతే జూలూరుపాడు, బయ్యారం, గార్ల, కామేపల్లి, ఏన్కూరు ఏజెన్సీ మండలాలు ఖమ్మంలో ఉంటాయని, వీటి కోసమని అక్కడ కొత్తగా ఐటీడీఏ కార్యాలయూన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి జిల్లా నుంచి ప్రతిపాదనలు కూడా వెళ్లాయి. అయితే తాజాగా కొత్త ప్రతిపాదనలు వచ్చి పడ్డాయి. గార్ల, బయ్యారం, ఇల్లెందు మండలాలను కొత్తగా ఏర్పాటు చేయబోయే మహబూబాబాద్ జిల్లాలోకి, అదే విధంగా వాజేడు, వెంకటాపురం మండలాలను భూపాలపల్లి జిల్లాలోకి సర్దుబాటు చేసేందుకు తాజా ప్రతిపాదనలు తయారవుతున్నాయి. ఇదే జరిగితే భద్రాచలం ఐటీడీఏ పరిధి మరింతగా తగ్గిపోయే అవకాశముంది. -
ఏపీ స్థానికత ఫైల్‌పై రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారి స్థానికత అంశంపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. ఏపీ స్థానికత ఫైలుపై ఆయన శుక్రవారం సంతకం చేశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం స్థానికత గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఏపీకి తిరిగి వచ్చేవారిని స్థానికత వర్తిస్తుంది. విభజన జరిగినప్పటి నుంచి మూడేళ్లలోపు.. అంటే జూన్ 2, 2017లోపు ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారినందర్నీ స్థానికులుగా గుర్తించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో దీనికి చట్టరూపం దాల్చింది. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విభిన్న ప్రాంతాలమధ్య విద్య, ఉద్యోగాలకు సంబంధించి సమాన అవకాశాలు కల్పించేందుకు వీలుగా 32వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ ‘371-డి’, ‘371-ఈ’లను చేర్చిన విషయం తెలిసిందే. ఆయా నిబంధనలను నిర్వచిస్తూ 1975లో ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులను జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 97 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ ఈ ఉత్తర్వులు అమలులో ఉంటాయి. అయితే ఇప్పటికే తెలంగాణలో స్థిరపడి రాష్ట్ర విభజన నేపథ్యంలో తిరిగి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలనుకునేవారి విషయంలో స్థానికతను నిర్ధారించేందుకు ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజా సవరణను ప్రతిపాదించింది. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులు-1975లోని పేరా 7ను సవరించాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే.