ఆ గనులు ‘పశ్చిమ’కే
కుకునూరు : రాష్ట్ర విభజనకు ముందు ఖమ్మం జిల్లా పరిధిలో గల కుకునూరు మండలంలోని గనులు పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చాయి. అతి విలువైన ఇనుపరాయి, అందమైన స్ఫటిక (క్వార్జ్) నిల్వలు కుకునూరు మండలంలో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ముంపు మండలాల విలీనం నేపథ్యంలో విలువైన రాతి నిక్షేపాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందనున్నాయి. కుకునూరు మం డలం ఉప్పేరు పంచాయతీ పరిధిలోని ఎర్రపాడు, రెడ్డిగూడెం అడవుల్లో అణు విద్యుత్‌కు ఉపయోగపడే ఇనుపరాయి నిల్వలు అపారంగా ఉన్నాయి. బ్రిటిష్ వారు గమనించిన ఆ ఇనుప రాయిని ఇప్పటివరకు మన ప్రభుత్వాలు గాని, అధికారులు గాని గుర్తించకపోవడం గమనార్హం. 2012లో చెన్నైకి చెందిన ఇందిరాగాంధీ అటామిక్ రీసెర్చి సెంటర్, ఖమ్మం జిల్లాకు చెందిన మైనింగ్ అధికారుల సహకారంతో ఈ నిక్షేపాలను అక్రమంగా తరలించే ప్రయత్నాలు చేశారు. స్థానిక గిరిజనులు, అమరవరం అటవీ రేంజ్ అధికారులు అడ్డుకోవడంతో ఆ ఇనుపరాయి విలువ తెలిసింది. అతివిలువైన, అరుదైన ఆ ఇసుప రాయిని ఇంతవరకు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు.
అందమైన తెల్లరాయి నిల్వలు
కుకునూరు మండల పరిధిలోని కమ్మరిగూడెం గ్రామంలో అందమైన తెల్లరాయి (క్వార్జ్) నిల్వలు అపారంగా ఉన్నాయి. దీనిని స్ఫటిక రాయి అంటారు. కివ్వాక పంచాయతీ పరిధిలోని కమ్మరిగూడెంలో గల ఈ తెల్లరాయి రసాయనాల తయారీలో ఉపయోగపడుతుందని స్థానికులు చెబుతున్నారు. ఐదేళ్ల క్రితం ఓ రసాయనాల పరిశ్రమకు చెందిన అక్రమార్కులు ఆ రాయిని తరలించుకుపోతుండగా గిరిజనులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇనుపరాయి, తెల్లరాయి గురించి పట్టించుకున్న వారు లేరు. ఇక్కడ పరిశ్రమలను నెలకొల్పి, గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆదివాసీ సంఘాలు ఎన్నోసార్లు మొత్తుకున్నా ఎవరూ
పట్టించుకోలేదు.
అతి విలువైన ఖనిజ సంపదను వినియోగించుకోవడంలో అటు ప్రభుత్వం, ఇటు అధికారులు విఫలమయ్యారు, కుకునూరు మండలం నవ్యాంధ్ర రాష్ట్రంలో విలీనమైన నేపథ్యంలో ఆ గిరి జన గ్రామాలు ఇకపై పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లనున్నాయి. ఈ దృష్ట్యా కోట్ల విలువచేసే ఖనిజ సంపద కూడా పశ్చిమగోదావరి జిల్లాకు చెందనుంది. ఆ సంపదను వెలికితీసి.. వాటికి సంబంధించిన పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి నవ్యాంధ్ర ప్రభుత్వం కృషి చేయూలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఆ గిరిజన గ్రామాలు ఇకనైనా అభివృద్ధికి నోచుకుంటాయో, లేవో వేచి చూడాల్సిందే.