
అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదలి
స్వగ్రామంలో ప్రకృతి సేద్యం చేపట్టిన మహిళ
7 ఎకరాల్లో పర్మాకల్చర్ ఫుడ్ ఫారెస్ట్ సాగు
పర్యావరణ హిత జీవన శైలిపై ప్రచారోద్యమం
పుట్టిన గడ్డపై ప్రజలు చిన్న వయసులోనే కేన్సర్, లివర్, గుండె జబ్బు వంటి ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడి మృతి చెందటంతో కలవరపాటుకు గురైన ఆమె అమెరికాలో ఆరంకెల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలి ఏడేళ్ల క్రితం పుట్టింటికి తిరిగి వచ్చేశారు. తమ ఏడెకరాల్లో ఐదంచెల ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. యోగా, ప్లాస్టిక్ రహిత జీవన శైలిని తాను ఆచరిరిస్తూ 2017 నుంచి అనేక ఇతర స్వచ్ఛంద సంస్థలతో కలసి ప్రచారోద్యమం చేపట్టారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థుల్లో ఎకోఫ్రెండ్లీ లివింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. ఆమె పేరు అక్కిన భవానీ.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లి భవాని స్వగ్రామం. అమెరికాలో పెద్ద జీతంతో కూడిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగం 17 ఏళ్లకు పైగా చేశారు. తాను పుట్టిన గడ్డ మీద ఆహార, ఆరోగ్య, పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించి, ఉద్యోగానికి రాజీనామా చేశారు. మితిమీరిన రసాయనాలతో ఆహారోత్పత్తి చేయటం, ప్లాస్టిక్ వాడకం, అపసవ్యమైన జీవన శైలి మూల కారణాలని గుర్తించారు. అమెరికాలో ఉండగానే ఆమె యోగా నేర్చుకున్నారు. ప్రకృతికి అనుగుణమైన సాధారణ జీవన శైలిని అలవర్చుకున్నారు. మనకు, భూమికి శాశ్వత ప్రయోజనాన్ని కలిగించే పర్మాకల్చర్ వ్యవసాయ పద్ధతిని నేర్చుకున్నారు. గత 50 ఏళ్లుగా పర్మాకల్చర్‌ను ఆచరిస్తున్న వాషింగ్టన్ (అమెరికా)కు చెందిన మైఖేల్ పిలార్సి్క వద్ద శిక్షణ పొందారు. అనేక దేశాలు పర్యటించి ప్రకృతి వనరుల పరిరక్షణ పద్ధతుల్ని భవాని అధ్యయనం చేయటం విశేషం.
భూమి, నీరు, గాలి, అడవి, భూమిపైన జీవరాశిని పరిరక్షించుకోవటం ద్వారా మనిషి ఆరోగ్యంగా జీవించవచ్చని.. ప్లాస్టిక్, రసాయన రహిత ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా, ప్రకృతి సేద్యం ఇందుకు దోహదపడతాయని భవాని మనసా వాచా కర్మణా నమ్ముతున్నారు. రసాయనాల్లేని ఆహారోత్పత్తితో పాటు యోగా తదితర కార్యకలాపాల ద్వారా.. శారీరకంగా/ మానసికంగా/ఆధ్యాత్మికంగా ఆరోగ్యదాయకమైన జీవనశైలిని అనుసరించటం అవసరమని నమ్ముతున్నారు. ఈ భావాలను తమ గ్రామం కేంద్రంగా ప్రచారం చేయటమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం వర్క్‌షాపులు, స్టడీ టూర్లు, ఫామ్ విజిట్లు నిర్వహించటంతో పాటు ‘నర్చర్5’ పేరుతో వెబ్‌సైట్‌ను, యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తున్నారు.
స్వగ్రామానికి తిరిగి వచ్చిన తర్వాత 2019లో పాలేకర్ పద్ధతిలో వరి సాగుతో ప్రకృతి సేద్యంప్రారంభించారు. తదనంతరం తమ కుటుంబానికి చెందిన 7 ఎకరాల భూమిలో ఫైవ్ లేయర్ మోడల్‌లో వక్క ప్రధాన పంటగా పండ్లు, కూరగాయలు, ఔషధ మొక్కలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేపట్టారు. సేంద్రియ పెరటి తోటల సాగు ద్వారా పోషకాహార స్థాయిని పెంపొందించటం.. పండ్ల తొక్కలతో సేంద్రియ ద్రావణాలు తయారు చేసుకొని వినియోగించటం.. గుడ్డ సంచుల వాడకం.. వంటి అంశాలపై గుంటూరు తదితర ప్రాంత పాఠశాలల్లో విద్యార్థులు, టీచర్లకు శిక్షణ ఇస్తున్నారు. కరోనా సమయంలో జిల్లా అధికారులతో కలసి ఆరోగ్యదాయకమైన జీవన శైలి, యోగా తదితరాలపై ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఆహారం, ఆదాయం, ఆరోగ్యం అనే ఫార్ములాతో భవానీ ప్రస్తుతం చినతాడేపల్లిలోని ఏడెకరాల ‘పొలంలో ప్రకృతి బడి’ని నిర్మించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆదాయం కోసం వక్క సాగు, ఆహారం కోసం వివిధ రకాల మంచి పండ్లు, ఆరోగ్యం కోసం ఔషధ మొక్కలు ఒకే చోట పెంచే ఫుడ్ ఫారెస్ట్‌ను పెంచుతున్నారు.
వక్క ప్రధాన పంటగా నాటారు. మొదట అరటి, ఆ తర్వాత పసుపు అంతర పంటలుగా వేశారు. అక్కడక్కడా మామిడి, లిచీ, రాంభోళా వంటి పండ్ల మొక్కలను నాటారు. వక్క చెట్లపైకి పాకించడానికి రెండు రకాల మిరియం పాదులను పెంచుతున్నారు. ఒక మడిని ఔషధ మొక్కల కోసం కేటాయించారు. కుంకుడు, షికాకాయ్ మొక్కలు కూడా నాటారు. ఔషధ మొక్కలతో తల నూనె, పండ్ల పొడి, ఎండిన పూలతో టీ పొడి, పసుపు తదితర ఉత్పత్తులను స్వయంగా తయారు చేసి విక్రయిస్తున్నారు. క్షేత్రంలో మొక్కలన్నిటికీ డ్రిప్ పద్ధతిలో నీటిని అందిస్తున్నారు. పొలం చుట్టూ రక్షణ కోసం వెదురు, వాక్కాయ మొక్కలను నాటారు.
మడినే బడిగా మార్చి బాలలు, యువతకు ప్రకృతి పాఠాలు బోధించాలన్నది ఆమె సంకల్పం. నవతరానికి స్ఫూర్తిని కలిగించే వర్కుషాపుల నిర్వాహణ ఆమెకు ఇష్టం. భవానీ కృషిని గుర్తించిన హైద్రాబాద్‌లోని ‘మేనేజ్’ సంస్థ గత ఏడాది ఉమెన్ అగ్రిప్రెన్యూర్ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది. జీవితానుభవాలతో ‘జర్నీ ఆఫ్ మై మిస్టేక్స్’ అనే పుస్తకం రాస్తున్నానని ఆమె తెలిపారు.
– యడ్లపల్లి మురళీకృష్ణ, తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లా
Comments
Please login to add a commentAdd a comment