పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా.
ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ ఇంటర్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్‌ను పెంచుతూ అబ్బురపరుస్తోంది.
చిన్నప్పటిలా ఉండాలని...
నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్‌లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి.
అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్‌కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్‌లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్‌కు వెళ్లడం మానేసింది.
పార్క్‌లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్‌ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్‌ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్‌ను నిర్వహిస్తోంది.
పెంచుతూ పంచుతోంది..
తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్‌లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు.
ఆసక్తితో శాంతి...
ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్‌ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment