Gardening
-
పుష్కలంగా కూరగాయలు కావాలా? అయితే ఇలా చేయండి!
సేంద్రియ ఆహారం ఆవశ్యకతపై వినియోగదారుల్లో పెరుగుతున్న చైతన్యంతో కిచెన్ గార్డెన్ల సంస్కృతి ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు పెచ్చరిల్లుతున్న నేపథ్యంలో కూరగాయలు, పండ్ల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో ఇంటిపట్టునే 13 రకాల కూరగాయలను సేంద్రియంగా పండించుకొని తింటున్న కుటుంబాల సంఖ్య దేశంలో అంతకంతకూ పెరుగుతోంది. పఠాన్‌చెరులోని ‘ఇక్రిశాట్’ ఆవరణలో గల వరల్డ్ వెజిటబుల్ సెంటర్ దక్షిణాసియా కేంద్రం సేంద్రియ పెరటి తోటల సాగుపై పరిశోధనలు చేపట్టింది (లాభాపేక్ష లేని ఈ సంస్థ కేంద్ర కార్యాలయం తైవాన్‌లో ఉంది). రెండు నమూనాల్లో సేంద్రియ పెరటి తోటల సాగుకు సంబంధించి ‘సెంటర్’ అధ్యయనంపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ జాతీయ, అంతర్జాతీయ ప్రభుత్వ / ప్రైవేటు వ్యవసాయ పరిశోధనా సంస్థలతో కలసి కూరగాయలు, మిరప వంటి పంటలపై పరిశోధనలు చేసింది. టాటా ట్రస్టులతో కలిసి 36 చదరపు మీటర్ల స్థలంలో పౌష్టిక విలువలతో కూడిన 13 రకాల సేంద్రియ కూరగాయల పెరటి తోటల (న్యూట్రి గార్డెన్స్) పై తాజాగా క్షేత్రస్థాయిలో ఈ పరిశోధన జరిగింది. కుటుంబానికి వారానికి 5.1 కిలోల (ప్రతి మనిషికి రోజుకు 182 గ్రాముల) చొప్పున.. ఏడాదికి 266.5 కిలోల పోషకాలతో కూడిన తాజా సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సమకూరాయి. తద్వారా ఒక కుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75% అందాయి. బీటా కెరొటెన్ (విటమిన్ ఎ), విటమిన్ సి అవసరానికన్నా ఎక్కువే అందాయి. 25% ఐరన్ సమకూరిందని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది.జార్కండ్లో పెరటి తోటల పెంపకం ద్వారా కుటుంబాలకు కూరగాయల ఖర్చు 30% తగ్గింది. అస్సాంలో సేంద్రియ న్యూట్రిగార్డెన్ల వల్ల పది వేల కుటుంబాలు విషరసాయనాలు లేని కూరగాయలను సొంతంగానే పండించుకుంటున్నారు. మార్కెట్లో కొనటం మానేశారని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ తెలిపింది. వ్యవసాయ దిగుబడులు పెంచే పరిశోధనలతో పాటు భవిష్యత్తు తరాల ప్రజల ఆరోగ్యదాయక జీవనానికి ఉపయోగపడే క్షేత్రస్థాయి పరిశోధనలు చేస్తున్నామని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ఇండియా కంట్రీ డైరెక్టర్ అరవఝి సెల్వరాజ్ చెప్పారు. స్క్వేర్ గార్డెన్ నిర్మాణం ఎలా?గ్రామీణ కుటుంబాలకు సర్కిల్ గార్డెన్తో పోల్చితే నలుచదరంగా ఉండే స్క్వేర్ గార్డెనే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. 6 మీటర్ల పొడవు, 6 మీటర్ల వెడల్పు ఉండే స్థలాన్ని ఎంపికచేసుకొని మెత్తగా దున్నాలి. మాగిన పశువుల ఎరువు లేదా కోళ్ల ఎరువుతో వేప పిండి కలిపి చల్లితే చీడపీడలు రావు. 6-6 స్థలాన్ని 7 బెడ్స్ (ఎత్తుమడులు) గా ఏర్పాటు చేయాలి. వాటిని అడ్డంగా విభజించి 14 చిన్న మడులు చేయాలి. ఒక్కో మడిలో ఒక్కో పంట వేయాలి. పాలకూర, గోంగూర, ఉల్లి, క్యారట్, టొమాటో, బెండ, వంగ వంటి పంటలు వేసుకోవాలి. బెడ్స్ మధ్యలో అంతరపంటలుగా బంతి, మొక్కజొన్న విత్తుకుంటే రసంపీల్చే పురుగులను నియంత్రించవచ్చు. ఇంటిపంటల ఉత్పాదకత 5 రెట్లు! సేంద్రియ ఇంటిపంటలు పౌష్టిక విలువలతో కూడి సమతులాహార లభ్యతను, ఆహార భద్రతను పెంపొందిస్తున్నాయి. తాము తినే ఆహారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే సామర్ధ్యాన్ని కుటుంబాలకు ఇస్తున్నాయి. ఫలితంగా మరింత సుస్థిరమైన, ఆరోగ్యదాయకమైన జీవనానికి మార్గం సుగమం అవుతోంది. ప్రణాళికాబద్ధంగా సేంద్రియ ఇంటిపంటలను వ్యక్తిగత శ్రద్ధతో సాగు చేస్తే పొలాల ఉత్పాదకతో పోల్చినప్పుడు దాదాపు 5 రెట్ల ఉత్పాదకత సాధించవచ్చు. భారత్‌లో పొలాల్లో కూరగాయల దిగుబడి హెక్టారకు సగటున 12.7 టన్నులు ఉండగా, సేంద్రియ ఇంటిపంటల ద్వారా హెక్టారుకు ఏడాదికి 73.9 టన్నుల దిగుబడి పొందవచ్చు. విస్తారమైన కూరగాయ తోటల్లో సైతం సమీకృత వ్యవసాయ పద్ధతులు పాటిస్తే రసాయనాల వినియోగం తగ్గటంతో పాటు 20% అధిక దిగుబడి పొందవచ్చు. – ఎం. రవిశంకర్, సీనియర్ హార్టీకల్చరిస్ట్, ప్రాజెక్టు మేనేజర్, వరల్డ్ వెజిటబుల్ సెంటర్, దక్షిణాసియా ప్రాంతీయ కేంద్రం, పఠాన్చెరుసర్క్యులర్ కిచెన్ గార్డెన్ ఎలా?పట్టణ ప్రాంతాల్లో స్థలం తక్కువగా ఉన్న చోట సర్క్యులర్ గార్డెన్ అనుకూలంగా ఉంటుంది. చూపులకూ ముచ్చటగా ఉంటుంది. 3 మీటర్ల చుట్టుకొలత ఉండే మడిలో 11 రకాల పంటలు పండించవచ్చు. మధ్యలో ఉండే చిన్న సర్కిల్లో కొత్తిమీర, పుదీన వంటి ఆకుకూరలు వేసుకోవచ్చు. పెద్దగా ఉండే వెలుపలి సర్కిల్లో అనేక మడులు చేసి వేర్వేరు కూరగాయ మొక్కలు వేసుకోవచ్చు. ఒక మడిలో భూసారం పెంపుదలకు వాడే పచ్చిరొట్ట పంటలు వేసుకోవాలి. చీడపీడల నియంత్రణకు పసుపు, నీలం జిగురు అట్టలు పెట్టుకోవాలి. వేపనూనె, పులిసిన మజ్జిగ పిచికారీ చేస్తుంటే తెగుళ్ల నుంచి పంటలను రక్షించుకోవచ్చు. ఈ సస్యరక్షణ చర్యల ద్వారా రసాయనిక పురుగుమందులు వాడకుండానే పంటలను రక్షించుకోవచ్చు. స్క్వేర్ గార్డెన్ దిగుబడి ఎక్కువగుండ్రంగా, దీర్ఘ చతురస్త్రాకారంలో ఉండే రెండు రకాల గార్డెన్ డిజైన్లు పెరటి కూరగాయ తోటల సాగుకు అనుకూలం. స్థలం లభ్యతను బట్టి గార్డెన్ డిజైన్‌ను ఎంపిక చేసుకోవాలి. 6 మీటర్ల చుట్టుకొలత గల సర్కిల్ గార్డెన్లో 150 రోజుల్లో 56 కిలోల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, దుంపలు పండాయి. ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పాదకాల ఖర్చు రూ. 1,450. అయితే, 6“6 మీటర్ల విస్తీర్ణంలో పెరటి తోట (స్క్వేర్ గార్డెన్)లో అవే పంటలు సాగు చేస్తే 67 కిలోల దిగుబడి వచ్చింది, ఉత్పాదకాల ఖర్చు రూ. 1,650 అయ్యింది. ఈ గార్డెన్లు విటమిన్లు, ఖనిజాలు, పీచు, యాంటీఆక్సిడెంట్లతో కూడిన సమతుల ఆహారాన్ని కుటుంబానికి అందించాయి. ఆమేరకు మార్కెట్‌పై ఆధారపడకుండా రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసే పౌష్టికాహారాన్ని ఆ కుటుంబం పండించుకొని తినవచ్చని వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పేర్కొంది. ఇళ్లు కిక్కిరిసి ఉండే అర్బన్ ప్రాంతాల్లో కంటెయినర్ గార్డెన్లను ఏర్పాటు చేసుకొని ఆరోగ్యదాయకమైన కూరగాయలు, ఆకుకూరలను నగరవాసులు పండించుకోవటం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న విషయం తెలిసిందే. సేంద్రియ ఇంటిపంటలపై వరల్డ్ వెజిటబుల్ సెంటర్ పరిశోధన36 చ.మీ. స్థలంలో వారానికి 5.1 (ఏడాదికి 266.5) కిలోల సేంద్రియ ఆకుకూరలు, కూరగాయల దిగుబడికుటుంబానికి అవసరమైన ప్రొటీన్లు 75%, ఐరన్ 25%, పుష్కలంగా ఎ, సి విటమిన్లు(ఇతర వివరాలకు.. వరల్డ్ వెజిటబుల్ సెంటర్ ప్రతినిధి వినయనాథ రెడ్డి 99125 44200) -
అర్బన్ అగ్రికల్చర్ అదుర్స్
నానాటికీ కాంక్రీటు అరణ్యంగా మారిపోతున్న హైదరాబాద్ నగరంలో అనేకమంది, ఎక్కువగా సొంత ఇంటి యజమానులు తమ ఇంటి మిద్దె (టెర్రస్)ల పైనే వివిధ రకాల సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు పండిస్తున్నారు. సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. ఆరోగ్య పరిరక్షణపై అవగాహన పెరుగుతున్న కొద్దీ ఈ విధంగా సేంద్రియ ఇంటి పంటలు లేదా మిద్దె తోటల (టెర్రస్ కిచెన్ గార్డెనింగ్) సాగు వైపు మొగ్గు చూపేవారి సంఖ్య పెరిగిపోతుంది.నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే విరివిగా ఇలా పంటలు పండిస్తుండగా ఇటీవలి కాలంలో వరంగల్, కరీంనగర్ వంటి నగర పాలక సంస్థల పరిధిలోనూ ప్రారంభమై విస్తరిస్తోంది. వాస్తవానికి టెర్రస్‌లపై సేంద్రియ కూరగాయలు, పండ్ల సాగుపై పుష్కర కాలం క్రితమే ‘సాక్షి’ దినపత్రిక ‘ఇంటిపంట’ శీర్షిక ద్వారా ప్రచారోద్యమాన్ని ప్రారంభించింది. వీటి ప్రాధాన్యత విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలకు అవగాహన కల్పించింది.నిపుణులతో ఉచిత శిక్షణా తరగతుల నిర్వహణతో హైదరాబాద్ నగరంలో వేలాది మంది సేంద్రియ మిద్దె తోటల సాగులో నైపుణ్యం పొందేలా చేసింది. అయితే ప్రస్తుతం సేంద్రియ ఇంటిపంటలు లేదా మిద్దె తోటలు సాగు చేస్తున్న నగరవాసుల్లో అర్బన్ అగ్రికల్చర్ (పట్టణ వ్యవసాయం) నైపుణ్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి? ఏయే రకాల పంటలకు ప్రాధాన్యం ఇస్తున్నారు? వంటింటి వ్యర్థాలను చెత్తలో పారేయ కుండా కంపోస్టు ఎరువుగా మార్చుకుంటున్న వారి శాతం ఎంత? ఎన్నో ఏళ్లుగా అర్బన్ ఫార్మర్ (పట్టణ రైతు) గా ఉన్నప్పటికీ వీరిలో లోపిస్తున్న నైపుణ్యాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన ప్రశ్నలకు ప్రొ.జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం (పీజేటీఎస్ఏయూ)లోని విస్తరణ విద్యా విభాగానికి చెందిన అగ్రికల్చర్ ఎమ్మెస్సీ విద్యార్ధి జి.చరణ్ తేజ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు.3 నగరాల్లో అధ్యయనంచరణ్ తేజ మిద్దె తోటలు విస్తారంగా సాగవుతున్న హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్ నగరాల్లో మొత్తం 120 మంది టెర్రస్ కిచెన్ గార్డెనర్లపై అధ్యయనం చేశారు. ఇందులో అనేక అంశాల్లో సేంద్రియ ఆకుకూరలు సాగుపై ఎక్కువ మంది గార్డెనర్లు ఆసక్తి చూపుతున్నారనేది ఒకటి. కాగా ఈ అధ్యయనానికి సంబంధించి ప్రొఫెసర్లు పి.విజయలక్ష్మి, డా.బి.సవిత, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎ.మీనాతో కలసి చరణ్ తేజ రాసిన మూడు పరిశోధనా వ్యాసాలు జర్నల్స్‌లో ప్రచురితం అయ్యాయి. అధ్యయనంలోని ముఖ్యాంశాలు..మిద్దె సేద్యంలో 51% నడి వయస్కులే⇒ సేంద్రియ ఇంటిపంటలు సాగు చేపట్టిన వారిలో 61% మంది మహిళలు కాగా, మిద్దె తోటలు సాగు చేస్తున్న వారిలో 51% నడి (35–50 ఏళ్ల) వయస్కులు ఉన్నారు. 50 ఏళ్లు దాటిన వారి (20%) కంటే యువజనులే ఎక్కువ (29%).⇒ సేంద్రియ ఇంటిపంటల సాగుకు సంబంధించిన 20 అంశాల్లో 52% మంది టెర్రస్ గార్డెనర్లకు అధిక పరిజ్ఞానం ఉండగా, 36% మందిలో ఒక మోస్తరుగా, 11% మందిలో మరీ తక్కువగా ఉంది. ⇒ సేంద్రియ ఆహారం ఆవశ్యకతను గుర్తించి మిద్దె తోటల సాగు చేపట్టిన వారిలో 62% డిగ్రీ/ఆపైన చదువుకున్న వారే. చదువు లేని వారు 2%, నిరక్షరాస్యులు 3% మిద్దె తోటలు సాగు చేస్తున్నారు. ⇒ మిద్దె తోట సాగుదారుల్లో 37% మంది ప్రభుత్వ ఉద్యోగులు, 23% గృహస్తులు, 18% వ్యాపారులు, 16% విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు. ప్రైవేటు ఉద్యోగులు చాలా తక్కువగానే ఉన్నారు. కేవలం 6% మందే టెర్రస్ సాగు చేస్తున్నారు. ఈ సాగుదారుల్లో మధ్యస్థ స్థాయి వార్షికాదాయం ఉన్నవారు 56%, అల్పాదాయ వర్గాల వారు 26%, అధికాదాయ వర్గాలు 18% ఉన్నారు.ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం పట్టణాల్లో మిద్దె తోటల సాగును పూర్తిస్థాయిలో ప్రోత్సహించడానికి ప్రభుత్వం విధానపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కోతులు, చీడపీడలు, పక్షుల బెడద నుంచి పరిరక్షించుకోవడానికి నెట్ ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పించాలి. చీడపీడలను గుర్తించి, వాటిని అధిగమించే నైపుణ్యాలను పెంపొందించటం కోసం అనుభవజ్ఞులైన ఉద్యాన అధికారులతో అన్ని నగరాలు, పట్టణాల్లో ప్రజలకు శిక్షణ ఇప్పించాలి. వర్టికల్ గార్డెనింగ్ నైపుణ్యాలపై మిద్దె తోటల సాగుదారులకు ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇప్పిస్తే టెర్రస్ స్థలాన్ని మరింత ఉత్పాదకంగా వినియోగించుకోవటానికి అవకాశం కలుగుతుంది. – గువ్వల చరణ్ తేజ76 శాతం అనుభవజ్ఞులే⇒ 3 నుంచి 9 ఏళ్ల క్రితం నుంచి ఇంటిపంటల సాగు చేపట్టిన నగరవాసులు ఏకంగా 76% ఉన్నారు. 15 ఏళ్ల అనుభవం ఉన్నవారు 16%, 20–21 ఏళ్ల అనుభవం కలిగిన వారు 7% ఉన్నారు. ⇒ కుటుంబం అంతా కలసి తోట పనులు చేసుకుంటున్నవారు 53% ఉండగా, ఇంట్లో ఎవరో ఒక్కరు ఆసక్తితో చేస్తుంటే.. వారికి అడపా దడపా సాయం చేసే కుటుంబాలు 29%, అరుదుగా సాయం చేసే కుటుంబాలు 17% ఉన్నాయి. ⇒ మధ్యస్థ విస్తీర్ణంలో ఏర్పాటైన తోటలు 64% కాగా పెద్దవి 26%, చిన్నవి 10% ఉన్నాయి. ⇒ 65% కుటుంబాలు ఆకు కూరలకు అధిక ప్రాధాన్యత (ఎక్కువ విస్తీర్ణంలో) ఇస్తున్నాయి. కూరగాయలే ముఖ్యం అనుకునే వారు 22%, తీగజాతులు ముఖ్యం అనుకుంటున్న వారు 6%, ఔషధ మొక్కలు ముఖ్యం అనుకుంటున్న వారు 4%.. పండ్లను సాగు చేస్తున్న వారు 3% ఉన్నారు. ⇒ కూరగాయలు, ఆకుకూరలు, దుంపకూరలు, తీగజాతి కూరగాయలు, పువ్వుజాతి కూరగాయలు (క్యాబేజీ వంటివి), పండ్లు, ఔషధ మొక్కలు.. లాంటివన్నీ సాగు చేస్తున్న కుటుంబాలు 53% ఉండగా, మరో 29% కుటుంబాలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, దుంపకూరలకు పరిమితం అవుతున్నారు.సొంత కంపోస్టు వాడుతున్న 84% మంది⇒ మిద్దె తోటల సాగులో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే స్లాబ్ ద్వారా నీరు లీకయ్యే ప్రమాదం ఉందన్న గ్రహింపు 89% మందికి ఉంది. సారవంతమైన మట్టి మిశ్రమం వాడటంలో, వంటింటి వ్యర్థాలతో కంపోస్టు తయారు చేసుకొని వినియోగించడంలో, చీడపీడలను నియంత్రించుకోవటంలో 85–86 శాతం మందికి పూర్తి అవగాహన ఉండటం విశేషం. ⇒ ప్రభుత్వ శిక్షణ పొందామని 45% మంది చెప్పారు. మిద్దె తోటల సమాచారం కోసం వాట్సాప్‌పై ఎక్కువగా ఆధారపడుతున్నా మన్నారు. ఆ తర్వాత స్థానాల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఉన్నాయి. రోజుకు రెండు, మూడు గంటలు మిద్దె తోట పనులు చేసుకుంటున్నామని ఎక్కువ మంది చెప్పారు.ఇవీ లోపాలు⇒ టెర్రస్ గార్డెనింగ్ లేఅవుట్ గురించి 54% మందికి తెలియదు. కుండీలు, మడుల్లో పంట మార్పిడి చేయాలన్న గ్రహింపు 47 శాతం మందిలోనే ఉంది.⇒ ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో మిద్దె తోటను రక్షించుకునే నైపుణ్యం 47% మందికి లోపించింది.⇒ అదనపు నీరు బయటకు వెళ్లిపోవటానికి కుండీలు, మడులకు అడుగున బెజ్జాలు ఉండాలన్న విషయం తెలియని గార్డెనర్లు 51% ఉన్నారంటే ఆశ్చర్యం కలగకపోదు.⇒ కోతుల నుంచి పంటలను రక్షించుకోవటం పెద్ద సవాలుగా మారింది. -
మొక్కలు సరిగా ఎదగడం లేదా? ఈ టిప్స్ ట్రై చేయండి!
ఇంటి కుండీలలో లేదా పెరటి తోటల్లో పెంచే మొక్కలు ఒక్కొక్కసారి ఎండి పోతుంటాయి. ఎండిన చెట్టు చిగురించాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అసలు చెట్లు ఎందుకు ఎండిపోవడానికి నీరు లేక, మరే ఇతర కారణమా అనేది గుర్తించాలి. నీరు తక్కువైనప్పుడే కాదు.. నీరు ఎక్కువగా ఉన్నా చెట్లు ఎండిపోతుంటాయి. కాబట్టి, అలా లేకుండా చూడండి. త్వరలో వసంత రుతువు రాబోతోంది. మీ పెరటి తోటలో లేదా ఇంటి కుండీలలో ఉన్న చెట్లను సంరక్షించుకోవడం ఇప్పటినుంచే ఆరంభిస్తేనే కదా అప్పటికి చక్కగా చిగిర్చి పూలు పూసేది! ఇంకెందుకాలస్యం? చూసేద్దామా మరి! మొక్కలకు జీవకళ మొక్కలు సాధారణంగా పురుగుల కారణంగా అనేక తెగుళ్ళ బారిన పడుతుంటాయి. అప్పుడు ఎండి, వాడిపోతుంటాయి. అలా కాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వాటిని కాపాడుకోవాలి. ఆకులపై దుమ్ము, ధూళి పేరుకుపోయినా అవి కళ తప్పుతాయి. అందువల్ల వాటిని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇందుకు చిన్న పాటి పైపు లేదా స్ప్రేయర్ ఉపయోగపడుతుంది. సూర్యకాంతి... చెట్లకి సరైన కాంతి అవసరం. అలాగని మరీ ఎండలో కూడా ఉంచరాదు. లేదా బాగా చీకటి ఉన్న ప్రదేశంలో ఉంచడమూ సరికాదు. ఎండ పొడ పడే ప్రదేశంలోనే కుండీలని ఉంచాలి లేదా చెట్లని పెంచాలి. కుండీల పరిమాణం... కుండీలో పెంచే మొక్క తీరును బట్టే కుండీని ఎంచుకోవాలి. చెట్ల కుండీలు అవి పెరగడానికి సరిపడనంత లేకుండా చిన్నగా ఉన్నా చెట్లు ఎండిపోవడానికి కారణమవుతాయి. కాబట్టి, సరైన పరిమాణంలో ఉన్న కుండీల్లో పెంచడం మేలు. మొక్కలని శుభ్రం చేయడం... దెబ్బతిన్న, ఎండిన, పండిన ఆకులని ఎప్పటికప్పుడు తుంచి శుభ్రం చేయాలి. వీటిని కత్తెరతో కత్తిరించడం మంచిది. తెగులు సోకిన కొమ్మలను, ఆకులని తుంచడం వల్ల మొక్కలు చక్కగా పెరుగుతాయి. ఎరువులు... ఎరువు లేకుండా పెంచడం వల్ల చెట్లు నిస్తేజంగా... సారం లేనట్లు... వడలిపోయినట్లు కనిపిస్తాయి. అందువల్ల వాటికి అప్పుడప్పుడు ఎరువులు వేయాలి. అప్పుడే మొక్కలు చక్కగా పెరుగుతాయి. వీలయినంత వరకు రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువులను వాడటం మంచిది. బియ్యం, పప్పులు కడిగిన నీళ్లని పోయడం, ఉల్లిపొట్టు, కూరగాయల తొక్కలు వంటి వంటింటి వ్యర్థాలతో ఎరువులు తయారు చేసే ఉపకరణాలు ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటి సాయం తో తయారు చేసిన ఎరువులు వాడటం వల్ల వాటికే కాదు, అవి తినే మన ఆరోగ్యానికి కూడా మంచిది. -
మిగిలిపోయిన అన్నం, కూరల్ని మొక్కలకు పడేయండి
అన్నం, కూరలు మిగిలిపోతే పడేస్తుంటారు. అయితే ఆ పడేసేదేదో మొక్కల దగ్గర పడేస్తే వాటికి కావాల్సిన పోషకాలు అంది, అవి ఏపుగా పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ►మిగిలిపోయిన పప్పులో నీళ్లు కలిపి పలుచగా చేయాలి. ఈ పప్పు నీళ్లను మొక్కలకు పోయాలి. మజ్జిగ మరీ పుల్లగా అయితే తాగలేము. ఈ పుల్లటి మజ్జిగను బకెట్ నీళ్లల్లో పోసి కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. ► మిగిలిపోయిన అన్నాన్ని మెత్తగా గ్రైండ్ చేసి నీటిలో కలపాలి. ఈ నీటిని మొక్కలకు పోయాలి. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు కడిగిన నీటిని సింక్‌లో పోయకుండా మొక్కలకు పోస్తే మంచిది. ► ఉల్లిపాయ తొక్కలు, అరటి తొక్కలను పడేయకుండా నీటిలో నానబెట్టాలి. పదిగంటల తరువాత ఈ నీటిని మొక్కలకు పోయాలి. ఈ నీటి నుంచి నైట్రోజన్, పొటాషియం, ఫాస్పరస్‌లు మొక్కలకు పుష్కలంగా అందుతాయి. చూశారుగా... మిగిలిపోయినవి మొక్కలకు ఎంత మేలు చేస్తున్నాయో. ఇంకెందుకు ఆలస్యం మీ గార్డెన్ మరింత పచ్చగా కళకళలాడించేందుకు ప్రయత్నించండి. -
ఇల్లే నందనవనం.. టెర్రస్ గార్డెనింగ్‌తో ఎన్నో ఉపయోగాలు
గేటు తీయగానే ఇంట్లో యజమాని కంటే ముందు మొక్కలు పలుకరిస్తాయి. ఎటుచూసినా సుగంధాలు వెదజల్లే వివిధ రకాల పూల మొక్కలు..కనువిందు చేసే రంగురంగుల పుష్పాలు.. సంపూర్ణ ఆరోగ్యానిచ్చే సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరలు, పండ్ల మొక్కలు దర్శనమిస్తాయి. రెండంతస్తుల భవనం..ఎటుచూసినా పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తుంది. ఒంగోలు సంతపేటలోని డి.విజయలక్ష్మి ఇంటి వద్ద కనిపించే దృశ్యాలు ఇవి. తొలి నాళ్లలో పూలమొక్కలు పెంచడం అలవాటు చేసుకున్న ఆమె సేంద్రియ ఎరువులతో సహజసిద్ధంగా రకరకాల కాయగూరలు,ఆకుకూరలు,పందిరి కాయగూరలు..వివిధ రకాల పండ్లను పండిస్తున్నారు. ఇంటి ముందున్న ఖాళీ స్థలం మొదలు భవనానికిరువైపులా ఉన్న స్థలంలో..మొదటి, రెండో అంతస్తుకు వెళ్లేందుకు ఏర్పాటు చేసుకున్న మెట్ల పైన.. రెండో అంతస్తులో 1000 చదరపు అడుగుల స్థలంలో మొక్కలు పెంచుతూ నందన వనంగా మార్చేశారు. ఆమె భర్త చెంచురామిరెడ్డి. వృత్తి రీత్యా డాక్టర్. ఇంట్లో నిత్యం వండుకునే ఆకుకూరలు..కాయగూరలు అన్నీ మేము పండించేవే.. రోజూ పూసే పూలతో దేవుడి గది అంతా నిండిపోతుందని మురిసిపోతూ చెబుతున్నారు. ఇలా ఒక్క విజయలక్ష్మే కాదు నగరంలో వందలాది మంది ఇంటి పంటలపై ఆసక్తి చూపిస్తూ తమ పెరట్లో రకరకాల మొక్కలు పెంచుతున్నారు. సాక్షిప్రతినిధి, ఒంగోలు: ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతున్నారు. ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చేసుకుంటూ అనారోగ్యానికి దూరంగా ఉంటున్నారు. పల్లెల్లో, పట్టణాల్లో చాలా ఇళ్లలో పెరటి సాగు కనిపిస్తుంది. కూరగాయల సాగు ఏర్పాటు చేసుకుని స్వయంగా కూరగాయలు పండించుకుంటున్నారు. ఈ ఒక్క ఆలోచన వారి కుటుంబానికి సరిపడా పౌష్టికాహారం అందిస్తోంది. ఇంటి పైనే కూరగాయలు, పూలు, పండ్లు పండిస్తూ వాటినే వినియోగిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు, మహారాష్ట్ర, తూర్పుగోదావరి జిల్లాలోని కడియం నర్సరీల నుంచి రకరకాల పూలు..పండ్ల మొక్కలను తెచ్చుకుంటున్నారు. అలాగే రకరకాల కాయగూరలకు సంబంధించిన విత్తనాలను వివిధ పట్టణాల నుంచి తెచ్చుకుంటున్నారు. ఇంటి పంటలపై ఆసక్తి ఉన్న హైదరాబాద్‌కు చెందిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి నగరంలోని చాలా మందికి ఉచితంగా విత్తనాలను అందజేస్తున్నారు. అంతేకాకుండా మొక్కల పెంపకంపై పలు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. ఇంటిపంటలో పెంచుతున్న మొక్కలు ఇవి.. నగరంలో చాలా మంది ఇళ్లలో ఎక్కువగా పూలు, ఆకు కూరలు, కూరగాయలు, రకరకాల పండ్ల మొక్కలను పెంచుతున్నారు. వివిధ రకాల క్రోటన్స్, మందారం, బంతి, మల్లి, సన్నజాజి, గులాబి, తులసి, పత్తి మందారం, సంపంగిలతో పాటు బొప్పాయి, జామ, అరటి, మామిడి, సపోట, దానిమ్మ, ఆపిల్‌ను పండిస్తున్నారు. అలాగే బెండ, అరటి, దొండ, బీర, కాకరకాయ, సొరకాయ, పొట్లకాయ, టమోట, పచ్చిమిర్చి, గోరు చిక్కుడు, పందిరి చిక్కుడు, మునక్కాయలు తదితర కాయగూరలతో పాటు తోటకూర, మెంతికూరలను సైతం సాగుచేస్తున్నారు. ప్రతి రోజూ గంట నుంచి రెండు గంటల శ్రమ.. ఇంట్లో మొక్కలు పెంచడం కోసం ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రత్యేక సమయాన్ని కేటాయిస్తున్నారు. ప్రతి రోజూ ఉదయం లేవగానే మొక్కలకు నీళ్లు పడతారు. మొక్కలకు ఏవైనా చీడ, పీడలు ఆశిస్తే వాటిని తొలగించి అవసరమైన చోట సహజసిద్ధ వనరులతో తయారు చేసిన మందులను స్ప్రే చేస్తారు. చాలా మంది సొంతంగా జీవామృతాన్ని, వేపనూనె, పిట్టు, పిడకలను తయారు చేసుకుంటున్నారు.మరికొందరు గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి తెచ్చుకుంటున్నారు. అలాగే నగరంలోని గోశాల నుంచి ఆవు ఎరువు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గేదె ఎరువులను సేకరిస్తున్నారు. రెండు, మూడు నెలలకొకసారి మొక్కలన్నింటినీ అవసరమైన మందులు జల్లుతారు. ఈ ప్రక్రియ ఒకరోజు పడుతుంది. ఇలా చెట్లను సంరక్షిస్తూ తన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతూ.. ఇంట్లోకి ఆరోగ్యకరమైన పండ్లను, కూరగాయలను పండించుకుంటున్నారు. సంతపేట విజయలక్ష్మి ఇంట్లో వివిధ రకాల మందారం మొక్కలు ఉన్నాయి. అందులో పత్తి మందారం వెరీ స్పెషల్. ఇది తెలుపు రంగులో పూస్తుంది. మధ్యాహ్నానికి లేత పింక్ కలర్లోకి మారుతుంది. సాయంత్రానికి ముదరు పింక్ కలర్లోకి మారుతుంది. ఇలాంటి ఆసక్తి కలిగించే పూల మొక్కలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఆపిల్.. ఆపిల్ మొక్కను పెంచేందుకు సుకన్య ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ముందుగా ఆపిల్ విత్తనాలను 15 రోజుల పాటు ఫ్రిజ్డ్‌లో ఉంచారు. మొలక వచ్చాక వాటిని కోకోపిట్లో ఉంచి తర్వాత కుండీలో పెట్టారు. మూడు సంవత్సరాల నుంచి దీనిని పెంచుతున్నారు. దీనిని తొట్టెలోంచి తీసి భూమిలో పాతాలి. ఐదు నుంచి ఏడేళ్లు వచ్చాక కాయలు కాస్తుందని చెబుతున్నారు సుకన్య. ప్రకాశం మిద్దెతోటల పెంపకం గ్రూప్.. ఇంటి పంటలు పండించే వారి కోసం నగరంలో ‘ప్రకాశం మిద్దెతోటల పెంపకం’ అనే ప్రత్యేకమైన గ్రూపును ఏర్పాటు చేశారు. నగరంలోని మారుతీనగర్‌కు చెందిన ఆలపాటి సుకన్య అడ్మిన్‌గా ఉన్నారు. ఆమెతో పాటు సంతపేటకు చెందిన డి.విజయలక్ష్మి ప్రధానంగా ఉంటూ ఇంటి పంటలు పండించే వారిని ప్రోత్సహిస్తున్నారు. ఈ గ్రూప్‌లో ఇప్పటి వరకూ 130 మందికి పైగా సభ్యులు ఉన్నారు. వారికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నారు. హైదరాబాద్ నుంచి రఘోత్తమరెడ్డి, రిటైర్డ్ బ్యాంకు ఆఫీసర్ అప్పారావు తదితరులను తీసుకువచ్చి సలహాలు సూచనలు ఇప్పిస్తున్నారు. దాదాపు మూడేళ్లుగా ఈ గ్రూపు నడుస్తోంది. ఇంటి పంటలపై ఆసక్తిని పెంచేందుకు నిరంతరం సమావేశాలు నిర్వహిస్తామని అడ్మిన్ సుకన్య చెబుతున్నారు. ఐదేళ్ల నుంచి.. మొదట్లో పూల మొక్కలు పెంచా. ఆ తర్వాత సేంద్రియ ఎరువులతో ఇంట్లోనే ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు పెంచుతున్న విధానాన్ని తెలుసుకున్నా. వాటి పెంపకంపై ఆసక్తి పెరిగింది. రకరకాల పూల మొక్కలతో పాటు కాయగూరలు, పండ్లను పెంచుతున్నా. రెండో అంతస్తులో వీటిని పెంచుతున్నా. తొలినాళ్లలో వీటిని సంరక్షించేదాన్ని. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఇంట్లో పనిచేస్తున్నా భార్య, భర్తలు ఇద్దరూ నాలుగు నెలలుగా మొక్కలు సంరక్షిస్తున్నారు. సహజసిద్ధమైన ఎరువులతో పండిస్తున్న కూరగాయలు తినడంతో సంతృప్తినిస్తోంది. – డి.విజయలక్ష్మి, సంతపేట, ఒంగోలు సొంతంగా ఎరువుల తయారీ.. మామగారు ఆలపాటి సత్యనారాయణ పొగాకు వ్యాపారి. ఆయన బెంగళూరు నుంచి రకరకాల పూల మొక్కలను తీసుకొచ్చేవారు. అలా ఇంట్లో మొక్కలు పెంచడం అలవాటైంది. క్రమంగా కాయగూరలు, పండ్ల మొక్కలు పెంచడం అలవాటు చేసుకున్నా. కిచెన్ వేస్ట్‌తో ఎరువులు తయారు చేస్తున్నా. జీవామృతాన్ని కూడా సొంతంగా తయారు చేసుకుంటున్నా. సేంద్రియ ఎరువులను సైతం తయారు చేస్తున్నా. అమెరికాలో ఉంటున్న కుమారుడు సైతం రకరకాల కాయగూరలను పెంచుతున్నారు. పెరటి మొక్కల పెంపకంపై నగరవాసులకు ఆసక్తిని పెంచేందుకు మూడేళ్ల కిందట ప్రత్యేక గూప్ను ఏర్పాటు చేశాం. ప్రసుతం 130 మంది సభ్యులు ఉన్నారు. రానున్న రోజుల్లో గ్రూప్‌ను మరింత విస్తరించేలా కార్యక్రమాలు చేపట్టనున్నాం. – ఆలపాటి సుకన్య, మారుతీనగర్, ఒంగోలు ఎన్నో ఉపయోగాలు.. పూల మొక్కలతో పాటు సుందరీకరణ మొక్కలు పెంచడం ఆహ్లాదాన్ని ఇస్తుంది. కూరగాయల సాగు చేయడం ద్వారా రసాయనాలతో పండే కూరగాయలకు దూరంగా ఉంటూ మన చెట్లకు పండే కూరగాయలు తింటూ ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చు. పండ్ల మొక్కలు పెంచడం ద్వారా రసాయనాలు లేని పండ్లను తినొచ్చు. మార్కెట్లో దొరికే పండ్లలో రసాయనాలతోనే పెంచి రసాయనాలతోనే వారిని పండేలా చేస్తారు. దీంతో అందులో పోషకాలు అన్ని పోతాయి. ఇలా మన ఇంట్లో పండిన పండ్లను తినడం ద్వారా అందులో ఉండే పోషకాలన్నీ లభిస్తాయి. -
పచ్చదనంపై ప్రేమ, ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది
పచ్చదనంతో కళకళలాడే పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అంటారు. చాలామందికి చిన్నతనమంతా పల్లెల్లోనే గడుస్తుంది. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం లేదు. పల్లెటూళ్లంటే పండగలు, పబ్బాలు, సెలవలు గడపడానికి వెళ్లే పర్యాటక స్థలాలుగా భావిస్తున్నారు. అరవైపదుల వయసు వారు మాత్రం పల్లెల మట్టివాసనలు, పచ్చదనం పరిమళాలను ఇప్పటికీ కోరుకుంటూనే ఉన్నారు. ఈ కోవకు చెందిన నీలిమా దింగ్రా... తన చిన్ననాటి పచ్చదనాన్ని ఆస్వాదించేందుకు ఏకంగా డబుల్ డెక్కర్ గార్డెన్‌నే పెంచేస్తోంది. తనలాగా పచ్చదనాన్ని ఆస్వాదించాలనుకునేవారికీ సలహాలు సూచనలు ఇస్తూ వారితో మొక్కలు నాటిస్తోంది. అరవై ఏళ్ల వయసులో ఇవన్నీ చేస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది నీలిమా దింగ్రా. ఢిల్లీకి చెందిన నీలిమా దింగ్రా స్టాండర్డ్ సెక్యూరిటీస్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటర్ లిమిటెడ్‌కు మేనేజింగ్ డైరెక్టర్. దీని విలువ కోట్లలోనే ఉంటుంది. వ్యాపార భాగస్వామితో కలిసి, రూ.75 లక్షల పెట్టుబడితో నీలిమ దీనిని ప్రారంభించింది. కొద్దిసంవత్సరాల్లోనే కంపెనీని లాభాల బాట పట్టించింది. డిల్లీలో ప్రధాన కార్యాలయంతో పాటు, ముంబైలో మరో రెండు కార్యాలయాలు నిర్వహిస్తూ సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది. ఇంతపెద్ద వ్యాపారం చూసుకునేవారికి ఏమాత్రం తీరిక దొరికినా.. వయసు రీత్యా కాస్త విశ్రాంతి తీసుకుంటారు. కానీ నీలిమ మాత్రం ఇంట్లో డబుల్ డెక్కర్ గార్డెన్‌ను పెంచుతూ అబ్బురపరుస్తోంది. చిన్నప్పటిలా ఉండాలని... నీలిమ చిన్నప్పుడు హర్యాణాలోని రోహ్తక్లో పెరిగింది. అక్కడ ఎటుచూసిన పచ్చదనమే కనిపించేది. స్కూలు నుంచి రాగానే జామ చెట్టు కింద కూర్చుని అన్నం, స్నాక్స్ వంటివి తినేది. ఆకుపచ్చని పరిసరాల్లో పెరగడం వల్ల మొక్కలపైన ఎనలేని మక్కువ ఏర్పడింది. పెద్దయ్యి చదువులు, పెళ్లితో పెద్దపట్టణంలో స్థిరపడింది. అభివృద్ధి పేరుతో ఎక్కడ చూసిన కాంక్రీట్ నిర్మాణాలే కనిపిస్తున్నాయి. అక్కడక్కడ షో కోసం పెంచుతున్న ఒకటి రెండు మొక్కలు మాత్రమే కనిపిస్తున్నాయి. అందరికీ ప్రాణవాయువు ఇచ్చేంత పచ్చదనం మచ్చుకైనా కనిపించడంలేదు. పచ్చదనాన్ని ఇష్టపడే నీలిమ ఏ మాత్రం సమయం దొరికినా దగ్గర్లోని పార్క్‌కు వెళ్లేది. చల్లని సాయంత్రాల్లో పార్క్‌లో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదంగా ఉండేది తనకు. అయితే కొద్దిరోజులకు మోకాళ్ల నొప్పులు మొదలయ్యాయి. దీంతో 2015 నుంచి పార్క్‌కు వెళ్లడం మానేసింది. పార్క్‌లో నడిచే సమయాన్నీ ఇంట్లో మొక్కలు నాటడానికి కేటాయించింది. ఇంట్లో ఒక మూలన కొద్దిపాటి స్థలంలో విత్తనాలు వేసింది. అవి చక్కగా మొలకెత్తడంతో ఆమె గార్డెన్‌ను విస్తరించడం మొదలు పెట్టింది. ఇలా విస్తరిస్తూ రెండు అంతస్తుల్లో పచ్చటి గార్డెన్‌ను అభివృద్ది చేసింది. ఈ డబుల్ డెక్కర్ టెర్రస్ గార్డెన్‌ను పూర్తిగా సేంద్రియ పద్ధతిలో నిర్వహించడం విశేషం. ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ సమయం కేటాయిస్తూ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ అందమైన టెర్రస్ గార్డెన్‌ను నిర్వహిస్తోంది. పెంచుతూ పంచుతోంది.. తన డబుల్ డెక్కర్ గార్డెన్ పచ్చదనంతో కళకళలాడుతుండడం నీలిమకు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఈ సంతోషంతో మొక్కలను ఇతరులకు ఉచితంగా అందించేది. తన గార్డెన్లో పెరిగిన మొక్కల పిలకలు, అంటుకట్టడం ద్వారా వచ్చిన కొత్త మొక్కలను తెలిసినవారికి, గుళ్లకు ఇస్తోంది. ఇలా ఇప్పటి దాకా వెయ్యికి పైగా మొక్కలను పంచింది. నీలిమ గార్డెన్ చూసిన వారంతా మొక్కలు చక్కగా పెరగాలంటే ఏంచేయాలంటూ అని అడిగి మరీ నీలిమ దగ్గర సలహాలు, సూచనలు తీసుకుంటున్నారు. ఆసక్తితో శాంతి... ఇతరులు చిట్కాలు, సూచనలు తీసుకోవడం గమనించిన నీలిమ గార్డెనింగ్ జ్ఞానాన్నీ మరింతమందికి పంచాలన్న ఉద్దేశంతో ‘శాంతి క్రియేషన్స్’ పేరిట యూ ట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ తెరిచి గార్డెనింగ్ చిట్కాలు చెబుతోంది. నెటిజన్లు అడిగే సందేహాలను నివృత్తి చేస్తోంది. ఎక్కువ స్థలం లేనివారు వర్టికల్ గార్డెన్‌ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి, చీడపీడల నుంచి మొక్కలను ఎలా కాపాడుకోవాలి. తక్కువ ఖర్చులో అందమైన గార్డెన్‌ను ఎలా పెంచుకోవాలి, వంటి సందేహాలకు చక్కని సలహాలు ఇస్తోంది. ఆరుపదుల వయసులో పచ్చదనంతో బిజీగా ఉంటూ నేటియువతరానికి ఆదర్శంగా నిలుస్తోంది. -
బిజీగా ఉండే వాళ్లకి ఈ డివైస్‌తో గార్డెనింగ్ ఈజీ!
గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండి, వాటి సంరక్షణ చూసుకునే తీరికలేని వాళ్లకు ఈ డివైస్ చక్కగా ఉపయోగపడుతుంది. ఈ హైడ్రోపోనిక్స్ గార్డెనింగ్ సిస్టమ్.. పాలకూర, టొమాటో, బచ్చలికూర, కొత్తిమీర, గులాబీ, చామంతి వంటి నచ్చిన మొక్కల్ని పెంచుకోవడానికి యూజ్ అవుతుంది. ఇందులో త్రీ లైట్స్ సెట్టింగ్ ఉంటుంది. రెడ్ కలర్ లైట్.. విత్తనాలు వేసినప్పుడు, బ్లూ లైట్ మొక్క ఎదుగుతున్నప్పుడు, సన్ లైక్ లైట్ పువ్వులు విరబూస్తున్నప్పుడు లేదా పండ్లు కాస్తున్నప్పుడు సెట్ చేసుకోవాలి. నీళ్లు ఏ మోతాదులో ఉన్నాయి, ఎంతకాలం వరకు సరిపోతాయో కనిపిస్తుంటాయి. నీళ్లు పోయడానికి ప్రత్యేకమైన హోల్ ఉంటుంది. అలాగే ప్రతి రెండు వారాలకు ఒకసారి న్యూట్రిన్ టాబ్లెట్స్ వేస్తూ ఉండాలి. ఈ గాడ్జెట్‌తో మొక్క 5 రెట్లు వేగంగా పెరుగుతుంది. ఇందులో సైలెంట్ పంప్‌తో కూడిన వాటర్ ట్యాంక్ ఉంటుంది. న్యూట్రియంట్ సొల్యూషన్స్, 24 సీడ్లింగ్ బ్లాక్స్, 12 ప్లాంటింగ్ బాస్కెట్స్ ఉంటాయి. డివైస్ లోపల నీటి పంపు ప్రతి గంటకు ముప్పై నిమిషాల పాటు ఆటోమెటిక్‌గా ఆన్ అవుతూ ఉంటుంది. ఈ డివైజ్‌ధర 69 డాలర్లు(రూ. 5661/-) (చదవండి: ఎడారి ప్రాంతంలో సాగు...‘జాయ్’ఫుల్‌గా కరువుకు చెక్!) -
ఖర్చు లేకుండా.. మిద్దె తోటతో ఆరోగ్యం
ప్రజల అవసరాల దృష్ట రోజు రోజుకు కాంక్రీట్ మయంగా మారుతున్నాయి పట్టణాలు. పట్టణ ప్రజలకు సరిపడా కూరగాయలు లభించడం లేదు అని చెప్పవచ్చు. దింతో ఇప్పుడిప్పుడే పట్టణ ప్రజలు తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టడంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం... సిద్దిపేట జిల్లా ఏర్పడిన తర్వాత గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా సిద్దిపేటలో నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దింతో పట్టణంలో బహుళ అంతస్తుల బిల్డింగుల నిర్మాణం కావడంతో, పట్టణం కాంక్రీట్ జంగల్ గా మారిపోయింది. ఇప్పుడిప్పుడే ప్రజలు పచ్చదనం వైపు అడుగులు వేస్తూ, తమ బిల్డింగ్ ల మీద మిద్దె తోటల పెంపకం చేపట్టారు. సిద్దిపేట పట్టణంలో రోజురోజుకు మిద్దె తోటల పెంపకం కల్చర్ పెరిగిపోతుంది. కరోనా మానవుని జీవితంలో పెను మార్పులకు కారణమయ్యింది. పట్టణ ప్రజలలో తమ ఆరోగ్యాల పై శ్రద్ధ పెరగటంతో, ఫ్రెష్ గా దొరికే కూరగాయలను తినడానికి ఇష్టపడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో కాముని అశోక్, రాజేశ్వరి అనే ప్రభుత్వ ఉపాధ్యాయ దంపతులు , మిద్దె తోటను పెంచుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అశోక్ ఇల్లు పచ్చని చెట్లతో ఒక పొదరిల్లుగా దర్శనమిస్తుంది. కరోనా సమయంలో యూట్యూబ్ లో చూసి మిద్దె తోటను పెంచడం జరిగిందని కాముని అశోక్ తెలిపారు. ఇండ్లలో పాడైన, పనికిరాని వస్తువుల తో తక్కువ ఖర్చులోనే మిద్దే తోటను ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ తెలిపారు. ప్లాస్టిక్ బాటిల్స్, నూనె క్యాన్లు,పాడైన వస్తువులలో మట్టిని నింపి కూరగాయ మొక్కలు, పండ్ల మొక్కలు పెంచడం జరుగుతుందని అశోక్ తెలిపారు. మిద్దె తోటలో పాలకూర, కొత్తిమీర, మెంతం, పుదీనా, చుక్కకూర, తోటకూర, ఎర్ర బచ్చలి, టమాట, వంకాయ, బెండకాయ, మిర్చి, క్యాబేజీ, క్వాలి ఫ్లవర్, వంటి అన్ని రకాల కూరగాయలు పండించడం తో పాటు మునిగే చెట్టు, కరివేపాకు చెట్టు, నిమ్మచెట్టు పెంచడం జరుగుతుందని అశోక్ దంపతులు తెలిపారు. శ్రీనివాస్ అనే మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మిద్దె తోటను పెంచుతున్నారు. తమ మిద్దే తోటలో అన్ని రకాల కూరగాయలు పండించడంతో, తమ ఇంటి అవసరాలకు సరిపోవుగా, ఇరుగుపొరుగు వారి కూడా కూరగాయలు ఇవ్వడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏర్పాటుచేసిన స్వచ్ఛ బడి పట్టణ ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్చ్ బడిలో తయారైన, వర్మి కంపోస్టు ఎరువును కూరగాయల మొక్కలకు వేయడం జరుగుతుందని శ్రీనివాస్ తెలిపారు. వర్మీ కంపోస్ట్ తయారు చేయడం, మిద్దె తోటల పెంపకం పై కూడా స్వచ్ఛ బడిలో అవగాహన కల్పించడం జరుగుతుందని శ్రీనివాస్ పేర్కొన్నారు. మేమంతా ప్రభుత్వ ఉపాధ్యాయులం కావడంతో, సాయంకాలం వేళ మిద్దె తోటలో ఒక గంటసేపు గడపడంతో స్వచ్ఛమైన గాలితో పాటు ప్రకృతి వనంలో ఉన్నట్టు అనిపిస్తుందని ఉపాధ్యాయురాలు రాజేశ్వరి తెలిపారు. వర్మి కంపోస్ట్ తో పండించిన కూరగాయలు ఫ్రెష్‌గా, ఎంతో రుచికరంగా ఉంటాయని ఆమె అన్నారు. స్వచ్ఛమైన కూరగాయలు తినడంతో తాను 6 నెలలకు ఒక్కసారి కూడా టాబ్లెట్ వాడడం చాలా తక్కువ అని రాజేశ్వరి తెలిపారు. మనసుంటే మార్గం ఉన్నట్లు,పట్టణ ప్రజలు తమ ఇంటి వద్ద ఖాళీ ప్రదేశాలలో కూరగాయ మొక్కలు పెంచుకోవాలని రాజేశ్వరి సూచించారు. -
సంక్షోభం నేర్పిన పాఠం! నగరాల్లోకి 'పెరటి తోటలొచ్చాయ్'!
కోవిడ్–19 మహమ్మారి ప్రభావాల నుంచి కోలుకుంటున్న దశలో శ్రీలంకను 2022లో మరో సంక్షోభం చుట్టుముట్టింది. ఆహారం, ఇంధన కొరతతో కూడిన పెద్ద ఆర్థిక సంక్షోభం దేశాన్ని కుదిపేసింది. రసాయనిక ఎరువులను దిగుమతి చేసుకోవడానికి డబ్బులేకపోయింది. ఈ సంక్షోభం తీవ్రత ఎంతంటే.. ప్రజలు తమ ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అంచనా ప్రకారం సంక్షుభిత శ్రీలంకలో ప్రజలు భోజనాల సంఖ్యను 37% తగ్గించుకున్నారు. తినే ఆహారాన్ని 40% తగ్గించుకున్నారు. తక్కువ ఇష్టపడే ఆహారాలను తినటం 68% తగ్గించుకోవాల్సి వచ్చింది. కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ) ఆవరణలో పచ్చికను తొలగించి కూరగాయలు సాగు చేస్తున్న దృశ్యం బయటి నుంచి ఆహారోత్పత్తులు నగరానికి రావటం తగ్గినప్పుడు ఉన్న పరిమితులకు లోబడి నగరంలోనే కూరగాయలు, పండ్లు వంటివి పండించుకోవటం తప్ప వేరే మార్గం లేదు. దేశ రాజధాని కొలంబో అతిపెద్ద నగరమైన కొలంబో(అప్పటి) మేయర్ రోసీ సేననాయక (మార్చి 19న ఆమె పదవీ కాలం ముగిసింది) ఈ దిశగా చురుగ్గా స్పందించారు. కొలంబో మునిసిపల్ కౌన్సిల్ (సీఎంసీ) మద్దతుతో నగరంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాల్లో ఆహార పంటలను పండించేలా చొరవ చూపారు. ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో కూరగాయలు, పండ్ల సాగు ప్రారంభమైంది. కొలంబో విస్తీర్ణం 37 చ.కి.మీ.లు. జనాభా 6.26 లక్షలు (2022). నిజానికి ప్రజల స్థాయిలో టెర్రస్ కిచెన్ గార్డెనింగ్ ప్రయత్నాలకు కొలంబో గతం నుంచే పెట్టింది పేరు. అయితే, పాలకులు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. సెంట్రల్ కొలంబోలో కూరగాయల మొక్కలతో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీ కరోనాకు ఆర్థిక/ఆహార సంక్షోభం తోడైతే తప్ప కొలంబో మున్సిపల్ కౌన్సిల్(సీఎంసీ)కి, శ్రీలంక ప్రభుత్వానికి అర్బన్ అగ్రికల్చర్ ప్రాధాన్యత ఏమిటో తెలిసిరాలేదు. నగరంలో ఖాళీ స్తలాలు ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నంతలో ఆకుకూరలు, కూరగాయల సాగుకు కౌన్సిల్ పచ్చజెండా చూపటమే కాదు.. మొదటి పెరటి తోట కొలంబో టౌన్ హాల్ చుట్టూ ఉన్న పచ్చిక బయలు లోనే ఏర్పాటైంది. సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత 30 సంవత్సరాల క్రితం క్యూబాలోని హవానాలో కూడా ఇలాగే జరిగింది. వ్యవసాయ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఎదుట పచ్చికను తొలగించి కూరగాయ పంటల సాగుకు శ్రీకారం చుట్టిన సందర్భం అది. ఉపయోగించని ప్రతి అంగుళం ఖాళీ స్తలాల్లో ఇంటి పెరటిలో, బాల్కనీలలో, ఇంటి పైకప్పులలోనూ కూరగాయలు పండించమని నివాసితులను, పాఠశాల విద్యార్థులను సీఎంసీ ప్రోత్సహించింది. కొలంబో సిటీ కౌన్సిల్ ఆవరణలో సాగవుతున్న కూరగాయలను పరిశీలిస్తున్న మాజీ మేయర్ రోసీ సేననాయక తదితరులు Good morning from our rooftop terrace #SriLanka #naturelovers #GoodMorningTwitterWorld pic.twitter.com/SkFGeLFr6V— Devika Fernando (@Author_Devika) June 28, 2023 60%గా ఉన్న అల్పాదాయ వర్గాల ప్రజలకు అర్బన్ అగ్రికల్చర్ చాలా అవసరమని సీఎంసీ భావిస్తోంది. కోవిడ్డ మహమ్మారికి ముందు నగరంలో కూరగాయల సాగు ఆవశ్యకతను సీఎంసీలో ఏ విభాగమూ గుర్తించ లేదు. ఇప్పుడు వచ్చిన మార్పు గొప్పది. ఈ సానుకూల ప్రయత్నాలకు శ్రీలంక కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చింది, ప్రభుత్వ ఉద్యోగులందరూ పంటలు పండించడానికి శుక్రవారం ఇంట్లోనే ఉండేందుకు వీలు కల్పించింది. సేంద్రియ ఎరువుల ఉత్పత్తికి, నగర పరిసరాల్లో పడావుపడిన వరి పొలాలు, ఖాళీ ప్రభుత్వ స్తలాలను సాగు చేయడానికి సైన్యాన్ని కూడా నియోగించారు. ప్రైవేటు సంస్థలు కూడా కదిలాయి. సెంట్రల్ కొలంబోలో పూర్తిగా వివిధ కూరగాయ మొక్కలతో రూపొందించిన క్రిస్మస్ చెట్టును ఏర్పాటు చేశారు. పంతంగి రాంబాబు, సీనియర్ న్యూస్ ఎడిటర్, సాక్షి సాగుబడి డెస్క్ (చదవండి: దుబాయ్ సిగలో 'రూఫ్‌టాప్ సేద్యం) -
ఆకుపచ్చ ధనం
పచ్చగా కళకళలాడటం అంటే ఏమిటో రేష్మా రంజన్‌కు తెలుసు. అందుకే తృప్తినివ్వని గవర్నమెంట్ ఉద్యోగాన్ని వదిలి మరీ ఇంట్లో ఉండిపోయింది. ఇంట్లో ఏం చేసింది? తనకిష్టమైన మొక్కలు పెంచింది. మట్టి, నీరు, కుండీ, ఆకు, ఎరువు... ఇవి ఎలా ఉపయోగిస్తే ఇంటి మొక్కలు అందంగా అద్భుతంగా ఉంటాయో బాగా తెలుసుకుంది. వాటినే వీడియో పాఠాలు చేసింది. ‘ప్రకృతీస్ గార్డెన్’ పేరుతో వందలాది వీడియోలు చేసింది. పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఏర్పడ్డారు. రేష్మా దిశా నిర్దేశంలో ఇళ్లల్లో మొక్కలు పెంచుతున్నారు. వారు హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల వచ్చే ఆదాయంతో రేష్మా పచ్చగా ఉంది. జార్ఘండ్‌లోని బొకారోలో రేష్మా రంజన్ ఇంటికి వెళితే చిన్న సైజు వనంలో అడుగు పెట్టినట్టు ఉంది. దాదాపు 2000 అందమైన, రకరకాల కుండీల్లో వందలాది రకాల మొక్కలు కనిపిస్తాయి. కొత్తిమీర, పొదీనాతో మొదలు ఆపిల్, అవకాడో వరకూ రేష్మా కుండీల్లో సృష్టించనిది అంటూ ఏదీ లేదు. ఒక కుండీలో ఉల్లిపాయలు పెరుగుతుంటాయి... మరో కుండీలో అనాసపళ్లు... ఇంకో కుండీలో చిలగడ దుంపలు, మరో కుండీలో నేతి బీరకాయలు... ఇక పూలైతే లెక్కే లేదు. వాటి మధ్య కూచుని వీడియోలు చేస్తుంటుంది రేష్మా. కేవలం తను పెంచి చూసిన మొక్కల గురించే ఆమె మాట్లాడుతుంది. ఆ అనుభవాల నుంచి వచ్చిన పాఠాలు కాబట్టే ఆమెకు పది లక్షల మంది సబ్స్క్రయిబర్లు ఉన్నారు. ► బాల్యం ముఖ్యం బాల్యంలో ఏర్పరిచే మంచి ప్రభావాలు వారికి జీవితాంతం ఉంటాయి అనడానికి రేష్మ రంజన్ ఒక ఉదాహరణ. రేష్మాది బొకారో అయినా ఐదో క్లాస్ వరకూ బీహార్‌లోని పల్లెలో అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది. తాతయ్య ఇంట్లో విపరీతంగా చెట్లు. ‘దారిన పసిబిడ్డను వదిలి వెళ్లిపోతే చూసినవారు ఎలా కలత చెందుతారో ఎవరైనా ఏదైనా మొక్కను పారేసి ఉంటే మా తాత అంత కలత చెందేవాడు’ అంటుంది రేష్మా. అతడు ఎక్కడ ఏ మొక్క నిర్లక్ష్యంగా పడేసి ఉన్నా తెచ్చి ఇంట్లో దానికి ప్రాణం పోసేవాడు. రేష్మా మూడో క్లాసు పాసై నాలుక్కు వెళుతున్నప్పుడు మూడు మొక్కలు తెచ్చి వీటిని నువ్వే పెంచాలి అని చెప్పాడు తాతయ్య. ‘అయితే నేను మరీ అతిగా పెంచి ఎక్కువ నీళ్ళు, ఎక్కువ ఎరువు వేసేసి వాటిని చంపేశాను’ అని నవ్వుతుంది రేష్మా. ఆ గుణపాఠం నుంచి బాల్యంలోనే మొక్కలను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో నేర్చుకుంది. ‘అదే మొక్కల మీద నా ప్రేమకు అంకురం’ అంటుంది రేష్మా. ► ఉద్యోగంలో అసంతృప్తి ఇంటర్ తర్వాత ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐ.సి.ఏ.ఆర్) నుంచి అగ్రికల్చర్ సైన్స్ డిగ్రీ చేసిన రేష్మా ఆ వెంటనే అగ్రికల్చర్ కోఆర్డినేటర్‌గా ప్రభుత్వ ఉద్యోగం పొందింది. ‘2015లో నాకు ఉద్యోగం వచ్చింది. నాకు ఇష్టమైన ఉద్యోగం అనుకున్నాను. నా పని రైతులకు వారి పంట పోషణలో సాయం చేయడం. కాని నా లాంటి చిన్న పిల్ల చెప్తే వినడం ఏమిటి అనుకునేవారో లేదా వారి సంప్రదాయ జ్ఞానం మీద విశ్వాసమో కాని నేను చెప్పే సూచనలు రైతులు వినేవారు కాదు. అంతేకాదు మట్టిని బట్టి, విత్తును బట్టి పంటలో మార్పు చేర్పులు చెప్తే లక్ష్యం చేసేవారు కాదు. ఆ అసంతృప్తి నాకు ఉండేది. మరోవైపు ఉద్యోగం వల్ల నేను స్వయంగా మొక్కలు పెంచలేకపోయేదాన్ని. అదే సమయంలో నా చదువును చూసి ఫ్రెండ్స్ ఫలానా మొక్కలు ఎవరు వేయాలి... ఫలానా తీగను ఎలా పెంచాలి... అని సలహా అడిగేవారు. ఈ అన్ని సమస్యలకు సమాధానంగా ఉద్యోగం మానేసి యూట్యూబ్ చానల్ మొదలెట్టాను’ అంటుంది రేష్మా. ► పదివేల మంది అనుకుంటే ‘నేను మొక్కలు, తీగలు, పూల చెట్లు, పండ్ల చెట్లు, కూరగాయలు, ఇండోర్ ప్లాంట్లు... వీటన్నింటిని ఎలా పెంచారో, కేర్ తీసుకోవాలో చెప్తే నాలాగే మొక్కలను ఇష్టపడే ఒక పదివేల మంది అయినా ఫాలో కాకపోతారా అనుకున్నాను. సహజ పద్ధతిలో గులాబీ పెంచడం ఎలా? అనేది నా మొదటి వీడియో. దానికి వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు. పది వేల మంది అనుకుంటే రెండు మూడేళ్ల లోనే లక్ష మంది అయ్యారు. 2016 నుంచి నా పాఠాలు కొనసాగితే 2022 చివరకు పది లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ అయ్యారు. ప్రొడక్ట్ ప్రమోషన్స్ కోసం వచ్చే వారి వల్ల కాని, యూట్యూబ్–ఫేస్బుక్ పేజ్ వల్ల కాని నాకు నెలకు లక్ష నుంచి లక్షన్నర ఆదాయం వస్తోంది’ అంటుంది రేష్మా. ఒక పనిలో పూర్తిగా నైపుణ్యం ఉంటే ఆ పనిలో ఆనందం, ఆదాయం రెండూ పొందవచ్చు. మీకు బాగా మొక్కలు పెంచడం వస్తే రేష్మాలా యూట్యూబ్ చానల్ నడపొచ్చు. బాగా మొక్కలు పెంచాలని ఉంటే ఆమె చానల్ ఫాలో కావచ్చు. ‘అందరూ మొక్కలు పెంచితే ప్రపంచం పచ్చగా మారడానికి ఎక్కువ టైమ్ పట్టదు’ అని రేష్మా చెప్పే మాట అందరూ వినాలి. ► అందమైన ఇల్లు మొక్కలు ఎలా అంటే అలా పెంచడం కాదు. వాటిని అందమైన కుండీల్లో అందమైన అరల మీద పెడితే వచ్చే అందాన్ని కూడా రేష్మా చెబుతుంది. సహజంగా ఎరువుల్ని, క్రిమి సంహారకాలను ఎలా తయారు చేసుకోవాలో చూపుతుంది. సేంద్రియ విధానాలు కూడా చూపుతుంది. ఇండోర్ ప్లాంట్స్ ఎలా శుభ్రం చేయాలి అనే ఆమె వీడియో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నవారంతా చూడతగ్గది. ‘వాల్ డెకరేషన్’గా గోడలకు కుండీలు బిగించి ఎలాంటి మొక్కలు పెంచాలో చూపుతుంది. ఇంకా ఆమె చెప్పే విషయాలు అనంతం. -
హోమ్ గార్డెనింగ్
సాక్షి, హైదరాబాద్: కరోనా తర్వాతి నుంచి హోమ్ గార్డెనింగ్పై మక్కువ పెరిగింది. ఇంట్లో దుర్వాసనకు దూరంగా ఉండటంతో పాటు అందం, ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగిందనేది నిపుణుల అభిప్రాయం. తక్కువ నిర్వహణ వ్యయం హోమ్ గార్డెనింగ్ మొక్కల ప్రత్యేకత. ఇండోర్ గార్డెనింగ్ మీద ఆసక్తి ఉన్న వాళ్ల తొలి ప్రాధాన్యం స్నేక్ ప్లాంట్ మొక్కే. తక్కువ కాంతి పరిస్థితుల్లో కూడా ఇది పెరుగుతుంది. దీని నిర్వహణకు తక్కువ నీటి అవసరం ఉంటుంది. చీకటి ప్రదేశంలో, గది మూలల్లోనూ ఇది పెరుగుతుంది. తక్కువ కాంతిలో ఈ మొక్కను ఉంచినప్పటికీ.. స్వచ్చమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ఇది నిలువుగా పెరుగుతుంది. ► మధ్యస్థ స్థాయిలో సూర్యరశ్మి లేదా పరోక్ష పద్ధతిలో సూర్యకాంతిలోనూ పెరగడం రబ్బర్ ప్లాంట్ ప్రత్యేకత. దీనికి ఆకులు పెద్ద సైజ్‌లో ఉంటాయి. అందువల్ల గాలి నుంచి వచ్చే వ్యర్థాలు, దుమ్ము, ధూళి కణాలను చాలా సులువుగా గ్రహిస్తాయి. ఈ మొక్క ఆకులను తరుచుగా శుభ్రం చేస్తుండాలి. ప్రతి రోజూ ఒకే సమయంలో ఒకే పరిమాణంలో నీటిని పోయాలి లేకపోతే ఆకులు రాలిపోయే ప్రమాదం ఉంది. ► గార్డెనింగ్ ఔత్సాహికులు, అనుభవజ్ఞులకు మనీ ప్లాంట్ సరైన మొక్క. నిర్వహణ కోసం పెద్దగా కష్టపడాల్సిన పన్లేదు. అంత త్వరగా ఎండిపోదు. ఇంటి గాలిలోని బెంజెన్లు, ఫార్మాల్డిహైడ్ వంటి విష రసాయనాలను మనీ ప్లాంట్ గ్రహిస్తుంది. వీటిని కుండీల్లో, బుట్టల్లో ఎక్కడైనా వేలాడదీయవచ్చు లేదా నీటి గిన్నెలలో కూడా పెంచుకోవచ్చు. ఇవి నిలువుగా పెరుగుతుంటాయి. ఇంటి లోపల, ఆరుబయట, ప్రవేశ ద్వారం వద్ద వీటిని ఉంచుకోవచ్చు. ఏ మొక్కకైనా సరే అతిగా నీళ్లు పోయకూడదు. ఎంత పరిమాణంలో నీటిని పోయాలో తెలుసుకోవాలంటే అది ఉండే మట్టిని పరిశీలించాలి. -
Chinavanka Village: ఊరే ఉద్యానవనం...
వజ్రపుకొత్తూరు రూరల్: ఆ ఊరంతా పూలతోటే. దారులన్నీ పూల బాటలే. పచ్చని చెట్లు, రకరకాల విదేశీ పూల మొక్కలు, ఇంటిని పెనవేసుకున్న తీగలతో చినవంక గ్రామం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉద్యానవనంలా కనిపించే ఈ ఊరు శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో ఉంది. స్థానికంగా లభించే మొక్కలతో పాటు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి రకరకాల అందమైన పూల మొక్కలను తెప్పించుకొని ఎంతో ఆసక్తితో పెంచుతున్నారు. ప్రతి ఇంట రకరకాల పూల, ఔషధ, తీగ మొక్కలను పెంచుతూ అందంగా అలంకరించుకుంటున్నారు. సుమారు 220 గడప ఉన్న ఈ గ్రామంలో అడుగు పెడితే పూల ప్రపంచంలో అడుగు పెట్టిన అనుభూతి కలుగుతుంది. ఆదర్శంగా నిలుస్తున్న ఈ గ్రామంలో కనువిందు చేస్తున్న అందమైన మొక్కలను చూసేందుకు పరిసర ప్రాంతాల నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. -
మిద్దె తోటల మాధవి.. ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో
తోటపని ఆందోళనను దూరం చేస్తుంది.తోటపని ఒత్తిడుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.తోటపని ఏకాగ్రతకు దారి చూపుతుంది.తోటపని ఆరోగ్యాన్నిఇస్తుంది.తోటపని సంతృప్తినీ, సంతోషాన్నీ మూట గట్టి ఇస్తుంది. విశాఖపట్నం వాసి మాధవి గుత్తికొండ పదేళ్లుగా చేస్తున్న డాబాగార్డెన్ ఐదేళ్లుగా ‘మ్యాడ్ గార్డెనర్’ పేరుతో యూ ట్యూబ్ ద్వారా కూరగాయల పెంపకాన్నీ ప్రోత్సహిస్తోంది. లక్షలాది వ్యూవర్స్‌కి తనదైన వాణీ వినిపిస్తోంది. ఇంటికి అవసరమైన కూరగాయల సాగును సొంతంగా తామే ఎలా సాగు చేసుకోవచ్చో చిన్న చిన్న సూచనల ద్వారా వ్యూవర్స్‌ని ఆకట్టుకుంటోంది మాధవి గుత్తికొండ. సాగులో మెలకువలను చెబుతూ నెటిజనులను ప్రోత్సహిస్తున్న మాధవి తాను చేస్తున్న పని గురించి చెబుతూ... ‘‘తోటపని నాకు చిన్నప్పటి నుంచీ ఉన్న అభిరుచి. కుండీల్లో మొక్కలు పెంచేదాన్ని. ఇండోర్, ఔట్‌డోర్ డెకొరేటివ్ మొక్కల పెంపకాన్ని ఇష్టంగా చేసేదాన్ని. పెళ్లి, పిల్లల బాధ్యతల నడుమ రోజులు గడుస్తున్నప్పటికీ మొక్కల పెంపకం ఎప్పుడూ ఆపలేదు. పదేళ్ల కిందట సొంతంగా ఇల్లు కట్టుకున్నాం. ఇంటికి అవసరమైన రెండు మూడు రకాల కూరగాయల మొక్కలు సాగుచేసేదాన్ని. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కాలేజీలకు వెళుతున్నారు. నాకు కాస్త తీరిక దొరికింది. దీంతో మేడ పైన కూడా మొక్కల పెంపకం ముఖ్యంగా కూరగాయల పెంపకం చేసేదాన్ని. ఒత్తిడి నుంచి విశ్రాంతి వైపు.. పిల్లలు మేడ పైన చదువుకునేటప్పుడు మొక్కల మధ్య ఉండటం వల్ల ఒత్తిడి తగ్గుతుందని, వాతావరణం ఆహ్లాదంగా ఉంటుందనీ నాతోపాటు వాళ్లూ మొక్కలకు నీళ్లు పోయడం, వాటి గురించి పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఐదేళ్ల క్రితం యూ ట్యూబ్ మా పిల్లలు, వారి స్నేహితులతో మాట్లాడుతున్నప్పుడు యూ ట్యూబ్‌లో గార్డెన్‌కి సంబంధించిన ఛానెల్స్ సెర్చ్ చేశాను. తెలుగులో ఏవీ కనిపించలేదు. దాంతో నేనే చానెల్ మొదలుపెట్టాను. ఫోన్‌తోనే షూట్.. ఏ సీజన్లో ఏ విత్తనాలు, మట్టి రకాలు, ఎరువు, నీళ్లు ఎంతలా పెట్టాలి.. ఇలా అన్ని సూచనలతో ఫోన్లోనే గార్డెనింగ్‌కు సంబంధించిన వన్నీ షూట్ చేస్తుంటాను. తీసిన వీడియోలను మొదట్లో పిల్లలే ఎడిట్ చేసేవారు. ఇప్పుడు నేనే స్వయంగా ఛానెల్ వర్క్ కూడా చేస్తున్నాను. కాలక్షేపం... పేరు, ఆనందం టైమ్ పాస్‌కు మొదలుపెట్టిన ఈ తోట పని ఇప్పుడు నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. పిల్లలు కూడా కాస్త టైమ్ దొరికితే చాలు తోట పనిలోకి వచ్చేస్తున్నారు. మేం బయటకు వెళ్లినప్పుడు ఎక్కడైనా కొత్తరకం విత్తనాలు, మొక్కలు కనిపించినా, వాటిని తీసుకురావడం మొదలైంది. బంగాళదుంప.. పసుపు నేను ప్రయత్నించని సాగు అంటూ లేదు. బీర, సొరకాయలు, పచ్చిమిరప నాలుగైదు రకాలు, టొమాటో నాలుగు రకాలు, మునగ.. బంగాళదుంపల సాగు కూడా చేశాను. వెల్లుల్లి ట్రై చేశాను. పసుపు కొమ్ములూ పండించాను. అరటిమొక్కలు పెంచుతున్నాం. వీటి పనిలో సాయంగా ఉండటానికి ఒక హెల్పర్‌ని పెట్టుకున్నాను. ఘనమైన రుచి.. ఆరోగ్యం.. ఖర్చు గురించి ఆలోచన లేదు. ఎందుకంటే, ఇంటికి అవసరమైన ఆర్గానిక్ కూరగాయలు కొనాలంటే మాటలు కాదు. అదే మనకు మనంగా పండించుకున్నాం కాబట్టి ఖర్చు కలిసిరావడంతోపాటు కూరగాయల రుచి కూడా బాగుంటుంది. ఇంటిల్లిపాది ఆరోగ్యం బాగుంటుంది. మా అవసరాలకు మించిన కూరగాయలను చుట్టుపక్కలవాళ్లకు, బంధువులకు కూడా పంపిస్తుంటాను. కాలానుగుణంగా మూడు నెలలకు ఒకసారి పంటసాగు పని ఉంటుంది. ఇప్పటికి నాలుగు లక్షలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ముందు నుంచీ ఛానెల్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఫాలో అయినవారున్నారు. కొత్తగా జాయినైనవారున్నారు. మా ఛానెల్ ద్వారా మిద్దె తోట గురించి తెలిసినవారు, సూచనలు, సలహాలు తీసుకొని వాళ్లు కూడా కూరగాయలు పండిస్తున్నారు. వాటిని మాకు పంపించేవారు, లేదా ఆ వీడియోలు షేర్ చేసేవారు ఉంటారు. ఇది నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంటుంది. కొంతమందైనా స్ఫూర్తిగా తీసుకొని కూరగాయల సాగు చేయడం సంతోషాన్ని ఇస్తుంటుంది. అనుభవంలోకి వస్తే తప్ప ఆ ఆనందం తెలియదు. ఇప్పుడు మా ఇంటిపైన కాసే కూరగాయలతో వంటలు కూడా చేసి, వాటిని పోస్ట్ చేస్తుంటాను. మంచి రెస్పాన్స్ రావడంతోపాటు ఇప్పుడు యూట్యూబ్ నుంచి అంతో ఇంతో ఆదాయమూ వస్తోంది’’ అని ఆనందంగా వివరించారు మిద్దె తోటల మాధవి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ఇంటిపంట ఓ స్టేటస్ సింబల్!
ఇవాళ మనం ఒక ప్రత్యేక సందర్భంలో నిలిచి ఉన్నాం. ఇటువంటి సందర్భాన్ని ప్రపంచం మునుపెన్నడూ చూడలేదు. ఇలా ప్రపంచం యావత్తూ మృత్యుభయంతో గజగజ వణికిపోయి సమస్త పారిశ్రామిక కార్యకలాపాలను సమస్త రవాణా సాధనాలను ఎక్కడికక్కడ ఆపేసుకుని సమస్త దేశాలూ స్వీయ లాక్డౌన్ పాటించడం మునుపు ఎన్నడూ లేని విషయం. లాక్డౌన్ అనేది దశల వారీగా ఇంకా సాగుతూనే ఉంది. ఇదంతా కోవిడ్ వైరస్ వ్యాప్తి – తదనంతర సంక్షోభ పరిస్థితుల గురించి అని మీలో అందరికీ తెలుసు. కోవిడ్ వైరస్ అనేది ప్రపంచానికి అనేక పాఠాలను నేర్పుతోంది. నేర్చుకున్న వారికి నేర్చుకున్నంత.అందులో ఒక పాఠం ’రోగనిరోధక శక్తి– బలవర్ధకమైన ఆహారం’ అనేది అతి ముఖ్యమైన పాఠం. బలమైనరోగ నిరోధకశక్తి కలిగిన వారిని కోవిడ్ వైరస్ ఏమీ చెయ్యలేకపోతోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది కోవిడ్ వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. వారంతా బలహీనమైన వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్న వారు. రోగనిరోధక శక్తిని కలిగి ఉండటానికి, ప్రకృతి సిద్ధ పద్ధతిలో పండించిన ఆహారం అవసరం. రసాయన పురుగు మందుల వ్యవసాయం మూలంగా ఉత్పత్తి చెయ్యబడిన ఆహారంలో రోగనిరోధక శక్తి దాదాపుగా ఉండదని ప్రామాణిక నివేదికలు తెలియజేస్తున్నాయి. ప్రపంచం సంగతి తెలియదు కానీ, మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో మటుకు, మనం ఇక ముందు ఏది మాట్లాడుకోవాలన్నా’ కోవిడ్ కు ముందు– తరువాత’ అని మాట్లడుకోవలసి ఉంటుంది. అంతగా గత తొమ్మిది నెలల లాక్డౌన్ ప్రజలకు పాఠాలు చెప్పింది. ఒక అంచనా ప్రకారం.. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుమారు రెండున్నర లక్షల మంది మిద్దె తోటలు లేదా ఇంటి పంటల సేద్యం చేస్తున్నారు. గత తొమ్మిది నెలల లాక్‌డౌన్‌కు పూర్వం వీరి సంఖ్య కేవలం వేలల్లో ఉండేది. కేవలం తొమ్మిది నెలల కోవిడ్ కాలంలో అనూహ్యంగా పెద్ద సంఖ్యలో ఇంటి పంటల సాగు వైపు మొగ్గు చూపారు ప్రజలు. ఇందుకు గల ముఖ్య కారణాల్లో గత దశాబ్ద కాలంగా ’సాక్షి’ దినపత్రిక ’ఇంటిపంట’ పేరుతో ప్రచారం చెయ్యడం కూడా. ప్రారంభంలో ‘అది సాధ్యమేనా?‘ అని అనుమానాలు వ్యక్తం చేసిన వారు కూడా, ప్రస్తుతం మిద్దె తోటల కల్చర్ వైవు, పెరటి తోటల కల్చర్ వైవు మరలుతున్నారు. మరోవైపు అటు వ్యవసాయ రంగంలో కూడా, గత దశాబ్ద కాలంగా సాక్షి దినపత్రిక ‘సాగుబడి’ ద్వారా రసాయన వ్యవసాయానికి ప్రత్యామ్నాయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ రెండు రకాల ప్రోత్సాహాలకు తోడుగా అనేక ఇతర సంస్థలు కూడా బాధ్యతగా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రచారం చేస్తూ వచ్చాయి. ఇంకా మరికొన్ని సంస్ధలు వ్యక్తులు కూడా ఇటువంటి ప్రచారంలో పాలు పంచుకోవడం మనం ఎరుగుదుం. అటువంటి గత దశాబ్దపు కృషికి కోవిడ్ వైరస్ నేర్పిన పాఠాలు కూడా తోడై, అతి తక్కువ కాలంలోనే లక్షలాది మంది మిద్దె తోటలు/ పెరటి తోటలు/ ఇంటిపంటల సాగు వైపు మరలారు. ఇదంతా రసాయన ఎరువులు పురుగుమందులు హైబ్రిడ్ విత్తనాలు లేకుండా, పూర్తి దేశీ పద్ధతిలో, తిరిగి మన పురాతన వ్యవసాయ పద్ధతుల వైపు ఆలోచించడానికి– ఆచరణలోకి తేవడానికి కారణం అయింది. ఏదీ ఏమైనా ఇవాళ తెలుగునాట కోట్లాది మంది ప్రకృతి వ్యవసాయం గురించి, ఈ పంటల ప్రాధాన్యత గురించి, అవి మన ఆరోగ్యానికే కాకుండా సమస్త పర్యావరణానికి ఎలా మేలు కలిగిస్తాయో తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలోనే అనేకమంది ఇంటి పంటల వైపు మరలారు. ఇంటిపంట అంటే ప్రధానంగా మిద్దెతోట సేద్యమే. పట్టణాలలో పెరటి తోటల సేద్యానికి అవకాశాలు తక్కువ– దాదాపుగా లేవు. స్థలాల ఖరీదు విపరీతంగా పెరిగింది. అందువల్ల పెరటి తోటల సేద్యం చెయ్యడానికి అవకాశాలు మూసుకుపొయ్యాయి. కేవలం మిద్దె తోటల సేద్యానికి మాత్రమే అవకాశాలున్నాయి. నగరాల విస్తీర్ణం ఎంత ఉంటుందో, మిద్దె తోటల సేద్యానికి అంత అవకాశం ఉంటుంది. నగరాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం, నగర మిద్దె తోటల్లో ఉంది. ఇప్పుడు మిద్దె తోట అనేది ఒక ఆరోగ్యమంత్రం. ఒక స్టేటస్ సింబల్‌గా మారింది. ఇది శుభపరిణామం. ఇందుకు ప్రత్యక్ష, పరోక్ష కారకులకు అందరికీ అభినందనలు తెలుపుతూ.. మిద్దె తోటల లేదా ఇంటిపంటల అవసరం గురించి, వాటి నిర్మాణ, నిర్వహణల గురించి కొన్ని విషయాలను చర్చిద్దాం. మిద్దె తోటల సాగు వల్ల నూరు లాభాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన లాభం పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, పండ్లు, ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాల సాగు ఉత్పత్తి. ప్రధాన ఆహారమైన వరి, గోధుమ, చిరుధాన్యాలు, పప్పు దినుసులు వగైరా మిద్దె తోటల్లో పెరటి తోటల్లో సాగు చెయ్యలేం. కారణం? తగినంత విస్తీర్ణంలో మిద్దె కానీ పెరడు భూమి కానీ అందుబాటులో ఉండకపోవడం. కనుక మనం ఇంటిపంట అని పిలుస్తున్నది అటు గ్రామాలలో ప్రకృతి వ్యవసాయాన్నీ ఇటు పట్టణాలలో మిద్దె తోటల సేద్యాన్ని ఉద్దేశించి మాత్రమే. ► స్వాతంత్య్రానంతరం వ్యవసాయ రంగంలో హైబ్రిడ్ విత్తనాలు రసాయన ఎరువులు పురుగుమందుల వాడకం క్రమంగా పెరిగింది. ఓ దశాబ్దం క్రితం వరకు కేవలం పైర్ల మీద మాత్రమే పురుగుమందులను స్ప్రే చేసే వారు! క్రమంగా కలుపు నివారణ కోసం విషపూరిత రసాయన మందులను భూమి మీద స్ప్రే చెయ్యడం ప్రారంభం అయింది. ఒకప్పుడు కూరగాయల మార్కెట్‌కు వెళ్లిన వారు బెండ, వంగ వంటి కూరగాయలను కొనేముందు పురుగు పుచ్చు ఉందో లేదో అని ప్రతీ కాయను పరీక్షగా చూసి తీసుకునే వారు. అయినా ఒకటో రెండో పుచ్చు కాయలు వచ్చేవి. ఇటీవల అటువంటి పురుగు, పుచ్చు కాయలు కనబడటమే లేదు. ఎందుకని? అంతగా పురుగుమందుల వాడకం పెరిగింది. వారం వారం ఏదో ఒక పురుగుమందును కూరగాయల మొక్కల మీద స్ప్రే చేస్తుంటారు. అదీ సంగతి! ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక జిల్లా కేంద్రంలో సుమారు అయిదు వందల పురుగుమందుల దుకాణాలు ఉన్నాయి. సాలీనా వాటి టర్నోవర్ అయిదు వందల కోట్ల రూపాయల వరకు ఉంటుంది. ఇలా ఉభయ తెలుగు రాష్ట్రాల జిల్లాల్లో జరుగుతున్న పురుగుమందుల వ్యాపారం ఏ లెవల్లో సాగుతోందో అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ లెక్క. ఇది స్వయంగా ఓ జిల్లా కేంద్రంలోని పురుగుమందుల వ్యాపారి చెప్పిన లెక్క. అంటే నిత్యం ముప్పూటలా మనం పురుగుమందులనే పళ్లాలలో పెట్టి మన పిల్లలకు, తల్లిదండ్రులకు తినమని పెడుతున్నాం– మనమూ అదే విషాహారం తింటున్నాం. ఎంత సంపాదిస్తున్నాం అన్న దానికన్నా, ఎంత నాణ్యమైన ఆహారాన్ని తింటున్నాం అనేది ముఖ్యమైన విషయం. ఇవాళ మధ్య తరగతి ఎగువ దిగువ మధ్య తరగతి వాళ్లలో క్యాన్సర్ పేషెంట్ లేని ఇల్లు అరుదు. అదంతా ఈ పురుగుమందుల తిండి వల్లనే అని మనకు అనేక నివేదికలు చెప్తున్నాయి. మనం తినే ఆహారంలో సగభాగమైన కూరగాయలను పండ్లను ఇతర వంటింటి సుగంధ ద్రవ్యాలను మనమే మన ఇంటిపంటలుగా ఇంటి మీదనే పండించుకోవచ్చు. అందుకు మిద్దె తోటలే సరైన సాధనాలు. ప్రకృతి జీవన విధాన సాధనకు, మిద్దె తోట సరైన సాధనం. పురుగుమందుల తిండికి భయపడితే చాలు, సమయమూ ఓపిక వాటంతట అవే చక చకా వస్తాయి. మిద్దె తోటల సాగు వల్ల అనేక లాభాలు ఉన్నాయని చెప్పుకున్నాం కదా? అందులో ప్రధాన లాభాలను ఒకసారి మీ దృష్టికి తెస్తాను. మిద్దె మీద తోట ఉండటం వల్ల, ఇంటిలో కనీసం మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది. ఆ కారణంగా ఏసీ, కూలర్ వగైరా వాడవలసిన అవసరం తగ్గుతుంది. వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఆ మేరకు విద్యుత్ బిల్లులతోపాటు విద్యుత్ ఉత్పత్తి వల్ల వచ్చే కాలుష్యం కూడా తగ్గుతాయి. ఒక ఇంటి మీద తోట ఉండటం వల్ల అంత ఉష్ణోగ్రత తగ్గినప్పుడు, ఒక నగరం మీద మొత్తం మిద్దె తోటల సాగు చేస్తే నగరపు ఉష్ణోగ్రతలు ఎంత తగ్గాలి? ఓ సజృనాత్మక ప్రక్రియ! కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్ళవలసిన అవసరం తప్పుతుంది– అందుకు వాడే వాహనం దానికి ఇంధనం తద్వారా వెలువడే వాయు కాలుష్యం, సమయం వగైరా తప్పుతాయి. రోడ్ల మీద ట్రాఫిక్ కూడా తగ్గుతుంది. రోజూ ఓ అరగంట మిద్దెతోటలో లేదా పెరటి తోటలో పని చేసుకోవడం మూలంగా శరీరానికి కావలసిన వ్యాయామం లభిస్తుంది. అలాగే మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. మిద్దెతోట లేదా పెరటితోట లేదా వ్యవసాయం అనేది ఓ సజృనాత్మక ప్రక్రియ! పిల్లల్లో సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది. ఇలా ఒక కాలంలో ఒక పద్ధతిలో ఒక విత్తనాన్ని నాటితే ఇలా సంరక్షణ చర్యలు తీసుకుంటే ఇలా ఉత్పత్తి వస్తుంది అని ఒక ఉత్పత్తి క్రమం పిల్లలకు అర్థం అవుతుంది. అదే క్రమం పిల్లలకు బ్రతుకు క్రమాన్ని కూడా తెలియచేస్తుంది. ఇంటి మీద ఒక తోట ఉంటే, కుటుంబ సభ్యుల మధ్య ఉమ్మడి సబ్జెక్టుగా మారి అందరి మధ్యా ఒక బంధం ఏర్పడుతుంది. పిల్లలు పెద్దవారై ఉద్యోగాలకు ఎటు వారు అటు పోయి ఒంటరితనానికి లోనయ్యే గృహిణులకు మిద్దెతోట ఒక ఆలంబనగా మారుతుంది. ఉపశమనం కలిగిస్తుంది. రిటైర్డ్ ఉద్యోగులకు మిద్దె తోట ఒక పునర్జన్మను ఇస్తుంది. మీ మిద్దెతోట మూలంగా తిరిగి వారికి ఒక సోషౖల్ లైఫ్ ప్రారంభం అవుతుంది. సమస్యలు తగ్గుతాయి! మిద్దె తోటల సాగు విస్తీర్ణం ఎంత పెరిగితే, ఉష్ణోగ్రతలు వాయు, ధ్వని కాలుష్యాలు అంత తగ్గుతాయి, ఆ మేరకు ప్రజలకే కాదు పరోక్షంగా ప్రభుత్వాలకు కూడా సమస్యలు తగ్గుతాయి. మిద్దె తోటల సాగు మూలంగా ప్రజల ఆరోగ్యాలు బాగు పడతాయి– ఆ మేరకు ఖర్చులు తగ్గుతాయి, ఆ డబ్బును ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించ వచ్చు. ఇంటిపంట/మిద్దెతోట అనేది ఓ నాలుగు అక్షరాల చిన్నపదం మాత్రమే కాదు, అది బహుళార్థ సాధక సాధనం. బరువు సమస్యే కాదు! ’ఇంటి మీద మిద్దెతోట నిర్మాణం జరిపితే బరువు మూలంగా ఇంటికి ప్రమాదం కాదా?’ అని కొందరికి అనుమానం కలుగుతుంది. ’ఇంటి మీద మొక్కల పెంపకం చేపడితే, నీటి ఉరుపు సమస్య ఏమైనా ఏర్పడుతుందా?’ అని మరికొందరు అనుమానపడతారు. మిద్దె తోట బరువు ఒక ఇంటిమీద పెద్ద బరువు కాదు. కాలమ్స్ పద్ధతిలో కట్టిన ఆర్సీసీ బిల్డింగ్ అయితే, అది స్టాండర్డ్ బిల్డింగ్ అయితే, మనం భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకంగా ఎటువంటి జాగ్రత్తలు కూడా అవసరం లేదు. మిద్దె మీద వర్షపు నీరు నిలవకుండా ఒక వైపు వాలు ఉంటుంది. పై కప్పు వేసేటప్పుడు ఆ వాలును సరిగా మెయింటైన్ చెయ్యమని మేసన్ పని వారికి, బిల్డర్‌కు చెప్పాలి. ఖర్చు ఎక్కువ అక్కర్లేదు ’మిద్దె తోటల సాగు చాలా ఖర్చుతో కూడుకున్నది’ అని కొందరు అనుకుంటున్నారు– అదీ నిజం కాదు. మీరు ఎంత బడ్జెట్లో అయినా ఓ మిద్దెతోటను ప్రారంభం చెయ్యవచ్చు. ఓ వంద రూపాయల సిమెంట్ లేదా మట్టి కుండీలో ఓ కరివేపాకు మొక్కను పెంచవచ్చు. అలాగే చిన్న చిన్న ట్రేలలో ఆకుకూరల పెంపకం చేపట్టవచ్చు. ఓ నెలలోనే ఆకుకూరలను పొందవచ్చు. ఓ ఖాళీ సిమెంట్ సంచిని నీళ్లలో ఝాడించి ఉతికి, సగానికి మడిచి మట్టి ఎరువుల్ని కలిపి నింపుకుని ఓ రెండు వంగ మొక్కలను నాటుకుని వారంలో ఒకసారి వంకాయలను ఉత్పత్తి చెయ్యవచ్చు. అది అన్నిటి కంటే చవకైన పద్ధతి. ఓ పదివేల రూపాయల నుండి ఓ లక్ష రూపాయల వరకు వ్యయం చేసుకుని చక్కని మిద్దెతోట నిర్మాణం చేసుకోవచ్చు. పురుగుమందుల దృష్టి కోణం నుంచి చూస్తే, ఇవాళ ఇల్లు ఎంత ముఖ్యమో ఇంటి మీద తోట కూడా అంతే ముఖ్యం. మిద్దె తోటల నిర్మాణం విషయంలో పీనాసితనం పనికి రాదు. సరైన సాధనం ఎంపిక ముఖ్యం మునుపు మిద్దె తోటల నిర్మాణానికి సరైన సాధనం లేదు. ఎవరికి తోచిన పాత్రలను వారు పెట్టుకుని, అరకొర ప్రయత్నాలు చేసే వారు. పగిలిన ప్లాస్టిక్ బకెట్ లేదా సంచులు మట్టి సిమెంట్ కుండీలు మాత్రమే అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అందమైన పటిష్ఠమైన ఇటుకల మడుల నమూనాలు అందుబాటులో ఉన్నాయి. మడుల కింద చీపురుతో ఊడ్చుకోవచ్చు. అంత సౌకర్యవంతమైన మడుల నమూనాలు అభివృద్ధి చెయ్యబడ్డాయి. మిద్దెతోట నిర్మాణం విషయంలో సరైన సాధనాన్ని ఎన్నుకోవడం ముఖ్యమైన విషయం. ఏవో చిప్పా దొప్పా మొక్కలను నాటడానికి వాడితే , సరైన ఉత్పత్తులు రావు. పైగా నిరాశ ఉత్పత్తి అవుతుంది. మొదటికే మోసం వస్తుంది. ఇటుకల మడులు శ్రేయస్కరం మిద్దెతోట నిర్మాణానికి ఇటుకల మడులు శ్రేయస్కరం. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు, ఒక ఫీటు లోతు కలిగిన మడులు అవసరం ఉంటుంది. ప్రతీ మడి లేదా బెడ్ కింద ప్రత్యేకంగా రెండు అంగుళాల మందం కలిగిన ’సిమెంట్– ఐరన్ రాడ్ – బిళ్లను పోత పోసి వేస్తారు. క్యూరింగ్ తరువాత ఆ బిళ్లను ఒక ఫీటు ఎత్తుపైకి లేపి దిగువన నాలుగుౖ వెపులా నాలుగు ఇటుకలనే కాళ్లుగా పెట్టి, బిళ్ల మీద చుట్టూ నాలుగుౖ వెపులా ఫీటు ఎత్తు ఇటుకల గోడ కట్టాలి. మడి అడుగున నీరు నిలవ కుండా ఒక వైపు కాస్తా వాలుగా సిమెంట్ ప్లాస్టరింగ్ చెయ్యాలి. మడి గోడలకు లోపల బయట కూడా సిమెంట్ ప్లాస్టరింగ్ చేయించాలి. టెర్రకోట రంగు చేయించుకున్న తరువాత చక్కగా నచ్చిన ముగ్గులను మడుల గోడల మీద వేసుకోవాలి. అందమైన పటిష్ఠమైన ఇటుకల మడులు సిద్దం అవుతాయి. భూమి మీద చేసే వ్యవసాయానికి మిద్దె మీద చేసే వ్యవసాయానికి ప్రధానమైన తేడా ఇటుకల మడులు అమర్చుకునే విషయంలో మాత్రమే. తక్కిన వ్యవసాయం అంతా ఒక లాగే ఉంటుంది. ఇటువంటి ఇటుకల మడులను మిద్దె మీద మొత్తం ఎన్ని పడతాయో ఒకేసారి లెక్కవేసుకుని కట్టించాలి. దారులు వదులుకుని చక్కగా సిస్టమెటిగ్గా కట్టుకోవాలి. మడుల వరుసలు అన్నీ బీమ్ల మీద కట్టుకోవాలి. ఇటుకల మడుల నిర్మాణానికి దాదాపు ఓ వారం పని దినాలు అవుతాయి. ఇనుపరాడ్ –సిమెంట్ –ఇటుకలు ఇసుక – కంకర వంటి మెటీరియల్‌ను తాపీ మేస్త్రీతో కలిసి కొనుగోలు చెయ్యాలి. లేదా వారికే గుత్తకు ఇవ్వవచ్చు. స్టాండర్డ్ పని చెయ్యమని చెప్పాలి. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఫీటు లోతు కలిగిన ఒక మడి నిర్మాణానికి సుమారు మూడు వేల రూపాయలు వ్యయం కావచ్చు. మట్టి ఎరువులకు అదనంగా ఖర్చు అవుతుంది. ప్రతీ రెండు మడుల తరువాత మూడవ మడిని మాత్రం మరో ఫీటు లోతు ఎక్కువగా పెట్టి కట్టించాలి. వాటిని పండ్ల మొక్కల పెంపకానికి వాడాలి. మిద్దెతోటల్లో అన్ని రకాల పండ్ల మొక్కలను కూడా పెంచవచ్చు. అన్ని రకాల కూరగాయల మొక్కల సాగుకు నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు ఒక ఫీటు లోతు మడులు సరిపోతాయి. గ్రోబ్యాగులు మూడవ ప్రత్యామ్నాయం గ్రోబ్యాగులు– ఇవి ప్లాస్టిక్ సంచులు తక్కువ ఖర్చు– బరువు తక్కువ– ఎక్కువ కాలం మన్నికగా ఉండవు. నాలుగైదు సంవత్సరాల తరువాత పనికిరావు! ఎండలకు పాడౌతాయి. పైగా ప్లాస్టిక్ సంచులు వాడకూడదు అని విజ్ఞులు చెప్తున్నారు. మట్టి కుండీలు తరువాత సిమెంట్ లేదా మట్టి కుండీలు ఉన్నాయి. అవి కేవలం పూల మొక్కల పెంపకానికి మాత్రమే పనికి వస్తాయి. లేదా ఒక సిమెంట్ కుండీలో ఒక వంగ మొక్కను పెంచవచ్చు. కూరగాయలను పండ్లను కుటుంబ అవసరాలకు సరిపడా ఉత్పత్తి చెయ్యాలంటే ఇటుకల మడులు తప్పకుండా ఉండాలి. సొంత ఇల్లు ఉన్న ప్రతీ వారు ఇటువంటి మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. అపార్ట్మెంట్లలో ఉన్నవారు కూడా ఇటువంటి ఇటుకల మడులకే ప్రాధాన్యం ఇవ్వాలి. ఫైబర్ మడులు ఇటుకల మడులు కట్టడానికి ఓ వారం రోజుల పని దినాలు అవుతాయి. కొంత రిస్క్ ఉంటుంది. మరో చోటకు మార్చడానికి కుదరదు. బరువు ఎక్కువ అనే భావన ఉంటుంది. అటువంటి వారిని దృష్టిలో ఉంచుకొని ఫైబర్ మడులను కూడా డిజైన్ చెయ్యడం జరిగింది. నాలుగు ఫీట్ల పొడవు వెడల్పు కలిగి ఒక ఫీటు లోతు ఉన్న మడులతో పాటు వివిధ రకాల డిజైన్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఫైబర్ టబ్బులతో ఒక్క రోజులోనే మిద్దె తోట నిర్మాణం పూర్తి చెయ్యవచ్చు. స్థూలంగా మిద్దె తోట నిర్మాణం విషయంలో మడుల నమూనాల గురించి సమాచారం ఇది. నిలువు పందిళ్లు మిద్దెతోట నిర్మాణం విషయంలో మడులను అమర్చుకోవడంతో ప్రధానమైన దశను దాటుతాం. తరువాత రెండోదశలో టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా నిలువు పందిరి నిర్మించుకోవాలి. టెర్రస్ మీద చుట్టూ నాలుగు వైపులా రక్షణ గోడ ఉంటుంది. మూడు ఫీట్ల ఎత్తుతో ఉంటుంది. ఆ గోడనుబేస్ చేసుకుని ఎనిమిది ఫీట్ల ఎత్తుతో పందిరి వేసుకోవాలి. పందిరి అంటే మనకు అడ్డంగా వేసే పందిరి తెలుసు. మిద్దె మీద అడ్డంగా పందిరి వేస్తే దిగువన నీడపడి మొక్కలు ఎదగవు– స్థలం వృథా అవుతుంది. అందుకని నిలువు పందిరి కట్టాలి. ప్రతీ పది ఫీట్లకు రక్షణ గోడను సపోర్ట్ చేసుకుని ఒక ఐర న్ పోల్ బిగించి అడ్డం పొడవు తీగలు కట్టుకుని చక్కని పందిరి కట్టు కోవాలి. కూరగాయల జాతుల్లో సగం తీగజాతి కూరగాయల మొక్కలే ఉన్నాయి– నిలువు పందిరి చుట్టూ ఒక ఇటుకల మడి వరుస కట్టిస్తే తీగ జాతులన్నిటినీ అటువైపు పెంచి పందిరికి పాకించవచ్చు. ఈ విధంగా మిద్దెతోట నిర్మాణంలో మడులను కట్టుకోవడం – నిలువు పందిరి వేసుకోవడంతో రెండు దశలు పూర్తి అవుతాయి. సిమెంటు కుండీలు మూడవ దశ – సిమెంట్ లేదా మట్టికుండీలను అమర్చుకోవాలి. ఇటుకలతో ప్రధాన మడులు కట్టించుకున్న తరువాత , మిగిలిన చిన్న చిన్న ప్లేసులు బయటపడతాయి. వాటిలో సిమెంట్ లేదా మట్టికుండీలను తెచ్చుకుని పెట్టుకోవాలి. ఇవి ప్రధానంగా పూల మొక్కలు పెంచడానికి వాడాలి. మిద్దె తోటల్లో పెరటి తోటల్లో పొలాలలో పూల మొక్కలు తప్పకుండా ఉండాలి. రోజు పూలు పుయ్యాలి. పూలు తేనెటీగలను ఆకర్షించి మొక్కల్లో పరపరాగ సంపర్కం సజావుగా జరగడానికి దోహదం చేస్తాయి. పుష్పాల ఫలదీకరణ చెందిన తరువాత సంపూర్ణ ఉత్పత్తి జరుగుతుంది. ఎర్రమట్టి మేలు ఈ మూడు దశల తరువాత మట్టి గురించి ఎరువుల గురించి ఆలోచించాలి. మట్టిలో ఎర్రమట్టి నల్లమట్టి అని రెండు రకాల మట్టి లభిస్తుంది. నగరాలలో భవన నిర్మాణ పనులు సాగుతున్న ఏరియాలలో రోడ్లపక్కన అక్కడక్కడా కొందరు మట్టిని కుప్పులుగా పోసి అమ్ముతుంటారు. అది సాధారణంగా ఎర్రమట్టి అయుంటుంది. మొక్కలకు అని చెప్పాలి. ఇసుక శాతం తక్కువ ఉండాలి. సారవంతమైన మట్టి కావాలి. మొరం లేదా చవుడు మట్టి పనికి రాదు. ప్రస్తుత అవసరం కంటే ఎక్కువ మట్టిని తెచ్చుకోవాలి. మాటిమాటికి మట్టిని తేలేం. ఎక్కువ తెచ్చుకోవాలి. టెర్రస్ మీద ఓ మూలన నిల్వ చేసుకుని ఓ షీట్ కప్పాలి. ఎప్పుడు అవసరం పడితే అప్పుడు మట్టిని వాడుకోవచ్చు. ఎరువుల విషయానికి వస్తే పశువుల ఎరువు మంచిది. గొర్రెల మేకల కోళ్ల ఎరువులు కూడా వాడుకోవచ్చు. అవి కూడా విష రసాయనాలు కలువని ఎరువులు అయి ఉండాలి. మాగిన లేదా చివికిన ఎరువులు మట్టిలో కలపాలి. తాజా పచ్చి ఎరువులు కలపకూడదు. మట్టి రెండు భాగాలుగా ఎరువు ఒక భాగంగా తీసుకుని మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. మడులను కాస్తా వెలితి ఉండేలా నింపుకోవాలి. మట్టి ఎరువుల మిశ్రమాన్ని మడుల్లో నింపడంతో మిద్దెతోట నిర్మాణం దాదాపు పూర్తి అవుతుంది. మిగిలింది విత్తనాల విషయం. దేశీ విత్తనాలు మేలు విత్తనాలలో దేశీ విత్తనాలు హైబ్రిడ్ విత్తనాలు ఉన్నాయి. దేశవాళీ విత్తనాలు మన వాతావరణానికి అనుగుణంగా ఉంటాయి. అయితే ఎక్కడపడితే అక్కడ అవి దొరికే అవకాశం లేదు. ఓపికగా సేకరించాలి. అందరికీ అందుబాటులో హైబ్రిడ్ విత్తనాలు మాత్రమే ఉన్నాయి. పరవాలేదు. వాటిని కూడా వాడుకోవచ్చు. వాటి నుండి తిరిగి విత్తనాలను కట్టుకుని తిరిగి వాటిని వాడవచ్చు. క్రమంగా అవీ దేశవాళీ విత్తనాల వలె మారతాయి. సంవత్సరంలో మూడు కాలాలు ఉన్నాయి. ఆ మూడు కాలాల ప్రారంభ రోజుల్లో విత్తనాలను నాటుకోవాలి. నారు మొక్కలను నాటు కోవాలి. కొన్ని మొక్కలను కొన్ని కాలాలలో పెంచలేం.పెంచినా కాపు కాయవు. ఆ గ్రహింపు ఉండాలి. శీతాకాలపు పంటలైన మిర్చి, టొమాటో, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, కొత్తిమీర, వెల్లుల్లి వంటి వాటిని ఎండాకాలంలో పండించలేం. శ్రద్ధ తీసుకుంటే వర్షాకాలంలో మాత్రం కొంత పండించవచ్చు. ఈ జాగ్రత్త వహించాలి. గుమ్మడి – బూడిద గుమ్మడి – దుంపలు వంటి వాటిని వర్షాకాలం ప్రారంభంలో నాటు కోవాలి. మిగతా అన్ని మూడు కాలాల్లో కూడా ఉత్పత్తి చెయ్యవచ్చు. నీటి యాజమాన్య విషయంలో మిద్దె తోటల్లో పెరటి తోటల్లోఎక్కువ నీరు పెట్టడం వల్ల చాలా సమస్యలు వస్తుంటాయి. ఎక్కువ నీరు వల్ల మొక్కలు ఎర్రబడి చనిపోతాయి. వేరుకుళ్లు తెగులు వచ్చే అవకాశం ఉంటుంది. మట్టి పొడిగా ఉంటేనే నీరు మొక్కలకు నీరు అవసరం ఉండదు. కేవలం తేమ మాత్రమే అవసరం ఉంటుంది. తేమ ద్వారా మాత్రమే మట్టిలో ఉన్న సూక్ష్మ, స్థూల పోషకాలను గ్రహిస్తాయి. ప్రతిరోజూ మిద్దెతోటలో ఉదయం ఓ రౌండ్ తిరగాలి. మొక్కల మొదళ్ల దగ్గర మట్టిని ముట్టుకుంటే తేమ ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. తేమ ఉంటే నీరు పెట్టడం అవసరం లేదు. తేమ లేకుంటే– మట్టి పొడిగా ఉంటే నీరు పెట్టడం అవసరం ఉంటుంది. మనం పెట్టిన నీరు మడుల్లోంచి బయటకు రాకుండా– తగు మాత్రమే పెట్టాలి. నాలుగైదు గంటల పాటు ఎండ మొక్కల మీద కనీసం ప్రతీ రోజూ నాలుగైదు గంటల పాటు ఎండ తప్పకుండా పడాలి. మొక్కల మొలిచిన తరువాత పది రోజులకు ఒకసారి అంతర కృషి చెయ్యాలి. మొక్కల మధ్య మట్టిని లూజ్ చెయ్యాలి. చేసేటప్పుడు మొక్కల వేర్లు దెబ్బతినకుండా సున్నితంగా మట్టిని లూజ్ చెయ్యాలి. ఇలా చెయ్యడం వల్ల మొక్కల వేరు వ్యవస్థకు ప్రాణవాయువు అంది బలపడుతుంది. మొక్కల ఎదుగుదల బాగుంటుంది. ప్రతీ అంతర కృషి తరువాత స్వల్పంగా వర్మీకంపోస్టు చల్లి తగినంత నీరు పెట్టాలి. చీడపీడల సమస్యలు తక్కువే చీడపీడల సమస్యలు కూడా మిద్దెతోటల్లో ఉంటాయి. సమృద్ధిగా పశువుల ఎరువులు పోసి మొక్కలను పెంచుతాం కనుక మొక్కలు బలంగా ఎదిగి సహజంగా రోగనిరోధకశక్తి కలిగి ఉంటాయి. చీడపీడల సమస్యలు తక్కువ ఉంటాయి. వాటిలో పేను సమస్య ముఖ్యమైనది. పేను అనేది నల్లగా పచ్చగా ఉంటుంది. కంటికి కనిపిస్తుంది. ఆకుల అడుగు భాగంలో చేరి రసాలను పీల్చి ఆకులు ముడుచుకు పొయ్యేలా చేసి మొక్కను ఎదగకుండా చేసి గిడస బారుస్తాయి. పేనును గమనించాలి. మొక్కల మీద చీమలు పారడాన్ని గమనిస్తే, పేను ఉందని అర్థం చేసుకోవాలి. ఆకుల అడుగు భాగం చెక్ చెయ్యాలి.పేనును చేతి వేళ్లతో నలిపి కూడా నివారణ చెయ్యవచ్చు.పేను సోకిన ఆకులను తెంపి తోట నుండి దూరంలో పారెయ్యాలి. మిగిలిన లేత ఆకుల కింద ఉన్న పేను నివారణకు లీటరు నీటిలో అయిదు మిల్లీ లీటర్ల వేప నూనె బాగా కలిపి నురగ వచ్చే దాకా షేక్ చేసి ఆకుల అడుగు భాగంలో స్ప్రే చెయ్యాలి. మొక్క సాంతం తడిసేలా స్ప్రే చెయ్యాలి. నాలుగు రోజుల వ్యవధిలో మరోసారి స్ప్రే చెయ్యాలి. బీర, సోర, కాకర, బెండ, వంగ, పొట్ల, గుమ్మడి వంటి మొక్కల మీద ఎక్కువగా సోకుతుంది. తెల్లనల్లి పేను తరువాత తెల్లనల్లి మరో సమస్య. బెండ, వంగ, మందార, టొమాటో, మొక్కల మీద ఎక్కువ సోకుతుంది. దీన్ని కూడా చేతి వేళ్లతో నలిపి నివారణ చెయ్యాలి. దీనికి ఏ వేపనూనె కూడా అవసరంలేదు. పచ్చ పురుగులు చుక్కకూర, పాలకూర వంటి ఆకుకూరల మీద వన్ ఇంచ్ పొడవు, పెన్సిల్ సైజ్ పచ్చని పురుగులు వస్తాయి. రాత్రి బయటకు వచ్చి ఆకులను తిని తెల్లవారుతుంటే కిందకు జారుకుంటాయి. ఉదయాన్నే చెక్ చేస్తే పురుగులు దొరుకుతాయి. ఏరి అవతల పడెయ్యాలి. అలా వరుసగా రెండు మూడు రోజుల పాటు చెయ్యాలి. బీర, సొర మొక్కలు పూత దశలోకి రాగానే పిందెలు పండుబారి ఎండిపోయే సమస్య ఎదురవుతుంది. దానికి కొన్ని కారణాలుఉన్నాయి. వాతావరణం సరిగా లేకపోవడం– మొక్కలు ఆరోగ్యంగా లేకపోవడం– పాలినేషన్ సరిగ్గా జరగకపోవడం వగైరా కారణాలు. పువ్వులు పూసే సాయంత్రం వేళల్లో వెళ్లి మగ పువ్వును తెంపి సమీపంలో ఉన్న ఆడపువ్వు కేసరాల మీద మగపువ్వు కేసరాలను సున్నితంగా రుద్దాలి. ఫలదీకరణ శాతంపెరుగుతుంది. బూడిద తెగులు ఆకుల మీద బూడిద తెగలు సోకుతుంది. తెగలు సోకిన ఆకులను తెంపి పారెయ్యాలి. పుల్లని మజ్జిగను మిగిలిన ఆకుల మీద స్ప్రే చెయ్యాలి. కొంత కంట్రోల్ అవుతుంది. చీడపీడల నివారణలో చేతిని మించిన సాధనం లేదని గ్రహించాలి. ఈ విధంగా కొంచెం ఖర్చు కొంచెం శ్రద్ధా శ్రమతో చక్కగా మిద్దెతోటల సాగు చెయ్యవచ్చు. ఇంటిల్లి పాదికీ సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. మిద్దెతోటల నిర్మాణం విషయంలో సౌందర్య దృష్టి కూడా ఉండాలి. అందంగా తీర్చిదిద్దుకోవాలి. మిద్దె మీద ఓ అందమైన తోటగా మార్చుకోవాలి. ఆయురారోగ్య రహస్యాలు, మిద్దె తోటల్లో దాగి ఉన్నాయి! – తుమ్మేటి రఘోత్తమరెడ్డి, మిద్దెతోట నిపుణులు ప్రకృతికి సంక్షిప్త రూపం మిద్దె తోట! ప్రకృతికి మనిషికి ఎటువంటి సంబంధం కలిగి ఉంటుందో, మిద్దెతోట కూడా అటువంటి సంబంధాన్ని తిరిగి కలిగిస్తుంది. ప్రకృతికి దూరమై పలువ్యాధులకు దగ్గరైన ఆధునిక సమాజానికి మిద్దె తోట సరైన ఆయురారోగ్య పరిరక్షణా సాధనం. ఇలా చెప్పుకుంటూ పోతే మిద్దెతోటల సాగు వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని తెలుస్తుంది. నిర్వహణ సులభం మిద్దెతోట నిర్వహణ చాలా కష్టం అని కొందరు భావిస్తున్నారు. కానీ, అది నిజం కాదు. మిద్దెతోట లేదా పెరటి తోట చాలా సులభంగా చెయ్యగల పని. సుమారు రోజూ ఒక అర గంటసేపు పనిచేసినా సరి పోతుంది. ఇంటికి సరిపడా కూరగాయలను పండ్లను ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇంటిపంటల రుచి అమోఘమైన రుచి. ఏ రోజు ఉత్పత్తిని ఆ రోజే వాడుకోవడం వల్ల వాటిలోని సంపూర్ణ పోషకాలు మనకు అందుతాయి. ఎంతో విలువైన జీవశక్తి పూరితమైన ఉత్పత్తి అది. జీవశక్తి పూరితమైన ఆహారమే మనల్ని బలోపేతం చేస్తుంది. మనం ఎంత బలంగా ఉంటే, మనకు అంతగా రోగనిరోధకశక్తి ఉంటుంది. వ్యాధులకు దూరంగా ఉంటాం. హైదరాబాద్ మహానగరం - మిద్దెతోటల చరిత్ర క్రీస్తు శకం1667 నాటికే గొల్లకొండ కోట భవనాల మీద తాని తోటలను చూసాను అని ’టావెర్నియర్’ అనే యాత్రా చరిత్రకారుడు రాసాడు. ‘హీనా మహల్ ఆర్చీల మీద అంత పెద్దపెద్ద వృక్షాలను ఎలా పెంచారో ఆశ్చర్యం కలిగించింది’ అని రాసాడు. నగరాల నిర్మాణం ప్రారంభం అయిన నాటి నుంచే, స్ధలాల కొరత ఏర్పడి మిద్దెల మీద తోటల నిర్మాణం ప్రారంభం అయింది. సిమెంటు రింగులూ బాగుంటాయి. ఇటుకల మడుల తరువాత మరో ప్రత్యామ్నాయం సిమెంట్ రింగులు లేదా గూనలు అని కూడా అంటారు. పూర్వం చేద బావులు పూడి పోకుండా ఉండటానికి వాడేవారు. వాటిని కూడా మన మిద్దెతోటల మడులకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వాటి వల్ల కాస్తా మిద్దె తోట నిర్మాణ పనిదినాలు– రిస్కు కూడా కొంత తగ్గుతాయి. ఈ రింగులకు కూడా అడుగున గుండ్రని బిళ్లలు వేసి వాటి కింద ఫీటు ఎత్తు ఇటుక కాళ్లను నాలుగు పెట్టి రింగులను కూర్చుండబెట్టి సిమెంటుతో అతుకుతారు– ఇదంతా వారినే చెయ్యమని అడగాలి. వేరే వారు అవి తేలేరు. -
లాక్డౌన్ పంట; మేడ మీద చూడమంట
ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్డౌన్ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే. శామ్ జోసెఫ్ కేరళ రాష్ట్రం కొట్టాయంలో ఆర్టీసీ స్టేషన్ మాస్టర్. సెలినె ముత్తొమ్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో సీనియర్ ట్యూటర్. ఈ దంపతులు కోవిడ్ విరామంలో ఓ ప్రయోగం చేశారు. తమ ఇంటి పై భాగంలో సరదాగా వరిపంట సాగు చేశారు. ‘‘ఎంత పండించామన్నది ముఖ్యం కాదండీ., ఎలా పండించామన్నదే మీరు చూడాల్సింది’’ అంటున్నారు ఈ దంపతులు. టెర్రస్ మీద సాగు అనగానే మడి కట్టి మట్టి పరిచి, నీరు చల్లి నారు పోసి ఉంటారనే అనుకుంటాం. కానీ వీళ్లు నీళ్ల సీసాల్లో పెంచారు. వాడి పారేసిన వాటర్ బాటిల్స్ పై భాగాన్ని కత్తిరించి, బాటిల్స్‌లో కొద్దిపాటి మట్టి, ఆవు ఎరువు వేసి నీరు పోశారు. అందులో వరి నారును నాటారు. నెలలు గడిచాయి. వరి వెన్ను తీసింది, గింజ పట్టింది, తాలు తరక కాకుండా గట్టి గింజలతో వరి కంకులు బరువుగా తలలు వంచాయి. ధాన్యం గింజలు గట్టిపడి, వరికంకులు పచ్చిదనం, పచ్చదనం తగ్గి బంగారు రంగులోకి మారాయి. జోసెఫ్ దంపతులు పంటను కోసి, కంకులను నూర్చి, ధాన్యాన్ని మర పట్టించి బియ్యాన్ని డబ్బాలో నింపారు. తూకం వేస్తే నాలుగు కిలోలు మాత్రమే. చేపల తొట్టె గట్టు మీద 175 సీసాల్లో ఇంతకంటే ఎక్కువ ధాన్యాన్ని పండించడం కుదిరే పని కూడా కాదు. జోసెఫ్ దంపతులు ఇంటి మీద పండ్లు, కూరగాయలను పండిస్తున్నారు. చేపలను పెంచుతున్నారు. ఇంటి మీదున్న చేపల తొట్టెలో రెండు వందల చేపలు పెరుగుతున్నాయి. ఇంటి ఆవరణలో మరో చేపల తొట్టెలో ఐదు వందల చేపలు పెరుగుతున్నాయి. ఈ ప్రయోగాన్ని కొనసాగిస్తామని, ఈ సారి ఎక్కువగా సాగు చేస్తామని చెప్తున్నారు జోసెఫ్, సెలినె. ఓ పదేళ్ల తర్వాత మనలో ఎవరికైనా కరోనా లాక్డౌన్ ఎంత కాలం సాగింది అనే సందేహం వస్తే అందుకు సమాధానం వీళ్ల వరి సాగు కాలమే. కరోనా లాక్డౌన్ కారణంగా ఇద్దరికీ ఉద్యోగాల్లో విరామం వచ్చింది. ఆ విరామం ఒక వరి పంట కాలం. అన్ లాక్ అయ్యి ఆర్టీసీ బస్సులు నడిచే నాటికి పంట చేతికొచ్చింది. -
మన ఆహారం మనమే పండించుకుందాం!
‘మనం ఏం తింటామో అదే మనం’ అంటారు. ఆ సామెతను పూర్తిగా పాటిస్తున్నారు సమంత. లాక్డౌన్ సమయాన్ని గార్డెనింగ్‌కి కేటాయించారు. ఇంటికి కావాల్సిన కూరగాయలను, పండ్లను సొంతంగా పండించి, వాటికి కావాల్సిన ఎరువులను కూడా కొన్నింటిని తయారు చేసి ఓపికగా పండించారు సమంత. వీటికి సంబంధించిన విశేషాలను ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటున్నారు. తనతో పాటు గార్డెనింగ్ ప్రారంభించండి అని రకుల్ ప్రీత్, మంచు లక్ష్మీలకు ‘గ్రో విత్ మీ’ చాలెంజ్ విసిరారు. ఈ చాలెంజ్ స్వీకరించిన రకుల్ మాట్లాడుతూ – ‘‘గ్రో విత్ మీ’ చాలెంజ్‌కి నన్ను నామినేట్ చేసినందుకు థ్యాంక్యూ సమంత. మనం నాటిన గింజలు మొక్కలుగా మారే ప్రక్రియను గమనించడం వర్ణించలేని అద్భుతమైన అనుభూతి. మనం తినేది మనమే పండిస్తే మన శరీరానికి కావాల్సినవన్నీ అవే మనకు సమకూరుస్తాయి అని విన్నాను. గార్డెనింగ్ ద్వారా ప్రకృతితో పాటు మనతో మనం మమేకం అవుదాం’’ అన్నారు. గార్డెనింగ్ ప్రారంభించిన ఓ వీడియోను షేర్ చేశారు కూడా. లక్ష్మీ మంచు మాట్లాడుతూ– ‘‘ఈ కరోనా వల్ల మనందరం తెలుసుకున్న ఓ ముఖ్య విషయం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా అవసరం అని. మొక్కలు మనందరికీ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి. మనకు కావాల్సిన ఆహారం, స్వచ్ఛమైన గాలి ఇలా ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. ఏదైనా లేకుండా బతకొచ్చు గానీ ఆహారం లేకుండా కచ్చితంగా బతకలేం. అందుకే నేను, నివీ (లక్ష్మీ కుమార్తె నిర్వాణ మంచు) కలసి గార్డెనింగ్ ప్రారంభిస్తున్నాం’’ అని విత్తనాలు నాటుతున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. సమంత తన గార్డెన్లో పండించిన క్యారెట్స్‌ను చూపిస్తూ, ‘‘ఈ వారం మా ఇంట్లో అన్నీ క్యారెట్ ఐటమ్సే. క్యారెట్ హల్వా, క్యారెట్ పచ్చడి, క్యారెట్ జ్యూస్, క్యారెట్ ఫ్రై, క్యారెట్ పకోడి, క్యారెట్ ఇడ్లీ, క్యారెట్ సమోస’’ అని సరదాగా క్యాప్షన్ చేశారు. -
వైరల్ : అందుకే అవంటే మాకు ప్రాణం!
మనుషుల కంటే కూడా పెంపుడు జంతువులు ఎక్కువ ప్రేమ చూపిస్తాయి అంటారు. ఇది చాలా సార్లు నిజమైంది కూడా. కల్మషం లేని వాటి ప్రేమ ముందు ఏదైనా తక్కువే. ముఖ్యంగా కుక్కల విశ్వాసం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనిషికి అవి మంచి స్నేహితులు. 24 గంటలు వాటికి అతుక్కునే ఉంటూ దాన్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. తమను ప్రాణంగా చూసుకునే యజమానుల విషయంలోనూ అవి అలాగే ప్రవర్తిస్తాయి. ఇందుకు ఈ సంఘటనే ఉదాహరణ. తోటలో తన యజమానికి కుక్క సాయం చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. (కిమ్ అరాచకం: వారి పాలిట శాపం) దీనికి సంబంధించిన వీడియోను వెల్కమ్ టు నేచర్ అనే ఓ సంస్థ గురువారం తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ఓ వ్యక్తి తన తోట పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో అతని పెంపుడు కుక్క తనకు సాయం చేస్తోంది. మొక్కను నాటే ముందు తన కుక్కకు సంకేతం ఇవ్వడంతో అది మట్టిని తవ్వింది. దీంతో ఆ వ్యక్తి మొక్కను నేలలో నాటాడు. 15 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఇప్పటికే 60 వేల మందికి పైగా వీక్షించారు. 6 వేల లైకులు సంపాదించిన ఈ పోస్టుపై ‘వావ్. చాలా బాగుంది. ఈ వీడియోను చూస్తే నా పెంపుడు జంతువు గుర్తొచ్చింది. అందుకే అవంటే మాకు అంత ప్రాణం.’ అంటూ జంతు ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. (హ్యాపీ గార్డెనింగ్) good boy helps with gardening pic.twitter.com/gBcy52vivE — Welcome To Nature (@welcomet0nature) August 20, 2020 -
కొత్త ప్రయాణం
లాక్డౌన్ సినిమా స్టార్స్ అందరినీ ఇళ్లల్లో లాక్ చేసేసింది. ఈ ఖాళీ సమయాన్ని కొందరు తారలు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. సమంత అయితే టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టారు. ‘క్యాబేజ్ మైక్రోగ్రీన్స్’ని పండించారు. మైక్రోగ్రీన్స్ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. వాటిని ఎలా పండించాలో కూడా సోషల్ మీడియా ద్వారా వివరంగా చెప్పారు. ఇప్పుడు ఓ 48 రోజులపాటు ఈషా క్రియ (యోగా) ప్రయాణం మొదలుపెట్టానని తెలిపారు. ఈషా యోగా గురించి సమంత ఇంకా మాట్లాడుతూ– ‘‘ఈ క్రియ చేయటం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. అలాగే ఆరోగ్యవృద్ధికి తోడ్పడుతుంది. మనిషి శ్రేయస్సుకు అవసరమైన శారరీక బలంతో పాటు ఏదైనా కష్టం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొనే మానసిక ధైర్యం కూడా వస్తుంది. మానసికంగా, శారీరకంగా «ధృడంగా తయారవ్వొచ్చు’’ అని చెప్పారు. -
హ్యాపీ గార్డెనింగ్
‘‘నా తొలి పంట నా చేతికి వచ్చింది’’ అని సంబరపడిపోతున్నారు సమంత. ఇటీవల ఆమె టెర్రస్ గార్డెనింగ్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ‘క్యాబేజ్ మైక్రోగ్రీన్స్’ని పండించారు. మైక్రోగ్రీన్స్ అంటే సూక్ష్మ మొక్కలు అని అర్థం. రెగ్యులర్ క్యాబేజ్కన్నా ఈ మైక్రోగ్రీన్స్‌లో పోషకాలు ఎక్కువ. ఇక ట్రేల్లో పండించిన క్యాబేజీ ఫొటోను షేర్ చేసి, ‘ఒకవేళ మీకు గార్డెనింగ్ మీద ఆసక్తి ఉంటే.. క్యాబేజీ మైక్రోగ్రీన్స్‌ని ఎలా పండించాలో’ నేను చెబుతా అన్నారు సమంత. చక్కగా స్టెప్ బై స్టెప్ చెప్పారామె. ‘‘ఈ పంటకు మీకు కావాల్సిందల్లా ఒక ట్రే, కోకోపీట్ (కొబ్బరి పొట్ట ఎరువు), విత్తనాలు, చల్లని గది.. అంతే. నా బెడ్రూమ్ కిటికీ సూర్యరశ్మి పాక్షికంగా వస్తుంది. ఒకవేళ ట్రైకి తగినంత సూర్య రశ్మి రాకపోతే దానికి దగ్గరగా ఒక బెడ్ ల్యాంప్ ఉంచవచ్చు. ఇక పంట ఎలా వేయాలంటే.. 1. ట్రేని కోకోపీట్‌తో నింపాలి. 2.విత్తనాలు చల్లండి 3.కోకోపీట్ మొత్తం తడిచేవరకూ నీళ్లు చల్లి, ఆ తర్వాత ట్రేని కవర్ చేయండి. కిటికీకి దగ్గరగా ఇంట్లో చల్లని ప్రాంతంలో ఈ ట్రేని ఉంచండి. సూర్యరశ్మి తక్కువగా ఉందనిపిస్తే.. బెడ్‌సైడ్ ల్యాంప్ ట్రే దగ్గర ఉంచండి. నేను అలానే చేశాను. నాలుగు రోజులు ట్రే కదిలించకుండా అలానే ఉండనివ్వండి. ప్రతి రోజూ మీరు గమనిస్తే మొలకలు కనబడతాయి. ఐదో రోజు ట్రే మీద ఉన్న కవర్ తీసి, రోజుకోసారి నీళ్లు చల్లండి. ఎనిమిదో రోజుకల్లా మీ మైక్రోగ్రీన్స్ రెడీ అయిపోతాయి’’ అని మొత్తం వివరించి, ‘హ్యాపీ గార్డెనింగ్’ అన్నారు సమంత. -
ఆ కష్టం తెలుస్తోంది!
‘‘మన భోజనం మన చెంతకు చేరడం వెనక ఎంత పెద్ద కష్టం దాగి ఉందో నాకు ఇప్పుడిప్పుడే అర్థం అవు తోంది’’ అంటున్నారు సమంత. ఇటీవలే ఆమె తన టెర్రస్‌పై గార్డెనింగ్‌ను ఆరంభించిన సంగతి తెలిసిందే. ఈ గార్డెనింగ్ క్లాసుల ద్వారా తెలుసుకుంటున్న కొత్త విషయాలు తనకు చాలా ఆసక్తికరంగా ఉంటున్నాయని అంటున్నారు సమంత. ఈ విషయం గురించి సమంత మాట్లాడుతూ – ‘‘ఆసక్తికర విషయాలు తెలుసుకునే సమయం మీ దగ్గర ఉన్నట్లయితే గార్డెనింగ్‌ను స్టార్ట్ చేయమని నేను సలహా ఇస్తాను. ప్రస్తుతం నేను గార్డెనింగ్ చేస్తున్నాను. ఇన్నాళ్లూ భూమితో నాకు ఉన్న కనెక్షన్ ను నేను కోల్పోయానని ఇప్పుడు అనిపిస్తోంది. నా భోజనం ప్లేటు నా టెబుల్పైకి రావడం వెనక ఎంత పెద్ద పని దాగి ఉందో అర్థం అవుతోంది. ఒక చిన్న విత్తనాన్ని నాటినప్పుడు అది భూమిని చీల్చుకుని పైకి రావడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఆ తర్వాత అది రోజులు, నెలలు, సంవత్సరాలు పెరుగుతుంది. ఈ విధానానికి మనం అందరం కనెక్టయ్యే ఉంటామని మనం అర్థం చేసుకోవాలి’’ అన్నారు. అలాగే సమంత కుకింగ్ క్లాసుల్లో చేరారు. ఓ సూపర్ సూప్‌ను తయారు చేశారు. తన గార్డెనింగ్‌లో పెరిగిన మొక్కల ఆకులతోనే సమంత ఈ సూప్‌ను తయారు చేశారట. ఇంకా ఫెయిల్ అవుతున్నాను కొబ్బరికాయను వెంటనే పగలుకొట్టడంలో తరచూ ఫెయిల్ అవుతుంటానని అంటున్నారు సమంత. ‘‘చాలా ఏళ్లు గడిచాయి. దాదాపు 50 సినిమాల కోసం కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చింది. అలా యాభైసార్లు ప్రాక్టీస్ కూడా చేశాను. కానీ కొబ్బరికాయను కొట్టడంలో ఇప్పటికీ ఫెయిల్ అవుతున్నాను. కొందరు కొన్ని విషయాలు ఎప్పటికీ నేర్చుకోలేరు’’ అని సమంత తన ఇన్ స్టాగ్రాగామ్లో షేర్ చేశారు. సూప్ రుచి చూస్తున్న సమంత -
హ్యాపీ ప్లేస్
సుకుమారి సమంత తన సున్నితమైన వేళ్లతో చక్కగా మట్టిలో విత్తనాలను నాటుతున్నారు. ఇది ఏ సినిమాలోని పాత్ర కోసమో కాదు.. నిజ జీవితంలోనే. ఇంతకీ విషయం ఏంటంటే...సమంత తన ఇంటి టెర్రస్‌పై ఓ గార్డెన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. అక్కడ చిన్నపాటి వ్యవసాయం చేస్తున్నారు. ‘‘హ్యాపీ ప్లేస్. ఇలా మట్టిలో విత్తనాలు నాటడం నా హృదయాన్ని సంతోషంతో నింపివేసింది. మా టెర్రస్‌పై గార్డెనింగ్ చేయడానికి సాయం చేసినవారికి ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు సమంత. -
వ్యయమే ప్రియమా!
సాక్షి, సిటీబ్యూరో: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ ఏర్పాటు చేయాలనే హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆలోచన బాగానే ఉన్నా... అందుకు రూ.కోట్లలో ఖర్చు చేస్తుండడం వివాదాస్పదంగా మారింది. బెంగళూర్‌లోని హోసర్ రోడ్డు ఫ్లైఓవర్ పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్‌ను కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద కొన్ని కంపెనీలు అందించిన సహకారంతో ‘సే ట్రీస్’ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేయగా... అందుకు భిన్నంగా నగరంలో ఏర్పాటుకు మాత్రం హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు సంస్థ ఖజానా నుంచే ఖర్చు చేసేందుకు మొగ్గు చూపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అదే ‘సే ట్రీస్’ సంస్థ రెండేళ్ల క్రితం పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ వే పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చిన సమయంలో అప్పటి అధికారులు ఆసక్తి చూపారు. అప్పటి కమిషనర్ టి.చిరంజీవులు వర్టికల్ గార్డెనింగ్ రూ.కోట్లలో వ్యయమవుతున్న నేపథ్యంలో కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ కింద ఒక్కో పిల్లర్‌ను దత్తత తీసుకోవాలని భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. కొన్ని కంపెనీల నుంచి సానుకూలత వ్యక్తమైనా... ఆ తర్వాత అధికారులు మారడంతో ఎవరూ దీనిపై దృష్టిసారించలేదు. కనీసం అదే ఆలోచనను అమలు చేస్తున్నారంటే అదీ లేదు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న అర్బన్ ఫారెస్ట్రీ విభాగం అధికారులు కార్పొరేట్ కంపెనీల సహాయం తీసుకోవడం కంటే.. సంస్థ ఖజానా నుంచే ఖర్చు చేస్తే పోలా అనే ధోరణిలో మూడుసార్లు టెండర్ పిలిచారు. ఒకరిద్దరూ కోట్ చేసినా మళ్లీ పక్కన పెట్టేశారు. చివరకు ల్యాండ్ స్కేపింగ్‌లో మంచి అనుభవముందంటూ నగరానికి చెందిన గ్రీన్‌లైఫ్ ల్యాండ్‌స్కేపింగ్ డెవలపర్స్ సంస్థకు నామినేషన్ పద్ధతిలో వర్టికల్ గార్డెనింగ్ పనులు అప్పగించారు. దీంతో ఆ సంస్థ పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ వే 3, 5, 6, 13, 14 పిల్లర్లకు రూ.56 లక్షల వ్యయంతో పనులు చేపట్టింది. ఇక్కడ మరో విషయమేమిటంటే అత్యవసర పరిస్థితుల్లో ఏవైనా పనులు చేయించుకోవాలంటే హెచ్ఎండీఏ ఎంప్యానల్మెంట్ రిజిస్ట్రేషన్ ఉన్న కాంట్రాక్టర్లకు మాత్రమే పనులు అప్పగించాల్సి ఉంది. ఆ నిబంధనను ఉల్లంఘించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. దీనిపై మాట్లాడేందుకు హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు మాత్రం నిరాకరిస్తున్నారు. దుబారాపై దుమారం... జనం రద్దీ ఉండే ప్రాంతాల్లో పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ ఏర్పాటు చేస్తే బ్యూటీఫుల్‌గా కనిపిస్తుందని, ట్రాఫిక్‌లో చిక్కుకునే వాహనదారులకు కాస్త ఉపశమనం కలిగేలా చేస్తుందని హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు పేర్కొంటున్నారు. అయితే వీటి ఏర్పాటుకు రూ.కోట్లలో ఖర్చు అవుతుండగా పైసా ఆదాయం రాదు. అయినా అధికారులు అత్యుత్సాహం చూపడంపై పలువురు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీలు సీఎస్ఆర్ పద్ధతిలో ఏర్పాటు చేయాలని అవగాహన కల్పిస్తే సత్ఫలితం ఉండేదని, బెంగళూర్ తరహాలో ఇక్కడా పైసా ఖర్చు లేకుండా పని జరిగేదని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ వే మాదిరే గచ్చిబౌలిలో రెండు పిల్లర్లు, హైటెక్ సిటీలో మూడు పిల్లర్లకు వర్టికల్ గార్డెనింగ్ ఏర్పాటు పనులను రూ.56 లక్షలకు ఇస్తూ అర్బన్ ఫారెస్ట్రీ అధికారులు నిర్ణయించడంపై హెచ్ఎండీఏ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. తొలి విడతలో కేవలం ఐదు పిల్లర్లను మాత్రమే ఎంచుకున్న అధికారులు... మరిన్ని ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ నిధులతోనే వర్టికల్ గార్డెనింగ్ పనులు చేయాలని ఆలోచిస్తుండడం ఏమిటనిప్రశ్నిస్తున్నాయి. -
‘స్మార్ట్’ గార్డెనింగ్
కాజీపేట : గతంలో ఏ పల్లెకు వెళ్లినా పచ్చదనం ఉట్టిపడుతుండేది. అటు పల్లెలతో పాటు ఇటు పట్టణాల్లో సైతం రహదారులు, ప్రధాన కూడళ్లు, ఇళ్లలో సైతం పలు రకాల మొక్కలు కనువిందు చేస్తుండేవి. అయితే పట్టణీకరణ, అధునాతన సౌకర్యాల కల్పన, రహదారుల విస్తరణతో పచ్చదనం కనుమరుగవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మొక్కల పెంపకం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. కొంత మందికి మొక్కలు పెంచేందుకు సరిపడా స్థలాలు ఉన్నా.. అవగాహన, గైడెన్స్ లేకపోవడంతో మొక్కలు పెంచలేకపోతున్నారు. అలాంటి వాళ్ల కోసం టెక్నాలజీ పలు రకాల అవకాశాలను కల్పిస్తోంది. ఎక్స్‌క్లూజివ్‌గా మొక్కల పెంపకం కోసమే పలు యాప్‌లు అందుబాటులోకి కూడా వచ్చాయి. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు అనేక యాప్‌లు మొక్కల పెంపకం కోసం మనల్ని గైడ్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. మొక్కల పెంపకం ఓ కళ... ఇంటి ఆవరణలో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచడం అనేది ఒక అందమైన కళ. అలాంటి వాటిపై ఆసక్తి ఉన్న వారి కోసమే స్మార్ట్ ఫోన్లో పలు యాప్‌లు తీర్చిదిద్దబడ్డాయి. ఏ కాలంలో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎటువం టి మట్టిని ఎంపిక చేసుకోవాలి.. కృత్రిమ, సేంద్రీయ ఎరువులను ఎలా అందించాలి.. తదితర సమాచారాలను ఈ యాప్‌లు సమగ్రంగా వివరిస్తున్నాయి. గార్డెన్ టిప్స్ యాప్... కుండీల్లో పెంచుకునే మొక్కల వివరాలు గురించి ఎక్కువగా ఈ యాప్‌లో తెల్సుకునే వీలుంది. ఇంట్లో ఉండే కీటకాలు, బొద్దింకలు, ఈగలు, దోమలను తరిమికొట్టేందుకు ఎలాంటి మొక్కలను పెంచుకోవాలనే అంశాలను ఈ యాప్‌లో పొందుపరిచారు. రోస్ గార్డెన్ యాప్... ప్రత్యేకంగా గులాబీ మొక్కలను పెంచుకునే విధానం, అనుసరించాల్సిన పద్ధతుల గురించి తెలిపే యాప్ ఇది. అందుబాటులో ఉన్న మట్టికి అనుగుణంగా ఎటువంటి రోజా మొక్కలు వేసుకోవచ్చు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అందమైన రోస్ గార్డెన్ తయారవుతుంది అనే అంశాలను వివరంగా పొందుపరిచారు. పువ్వులు ఎక్కువ కాలం నిలువ ఉండేందుకు ఎలాంటి పద్ధతులు అవలంభించాలో అనే అంశాలు కూడా ఉన్నాయి. వెజిటబుల్ పాట్ గార్డెనింగ్... ఇంటి ఆవరణలో కుండీల్లో పలు రకాల కూరగాయల మొక్కలను పెంచుకోవడానికి అనుగుణంగా ఈ యాప్‌ను రూపొందించారు. ఎటువంటి కుండీలు వినియోగించాలి.. మట్టి రకాలు.. ఏయే కూరగాయలు పెంచుకోవచ్చనే విషయాలు సమగ్రంగా ఉంటాయి. ఇంకెందుకు మరి ఆలస్యం వెంటనే మీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకొని.. మొక్కల పెంపకాన్ని ప్రారంభించండి..హోమ్ గార్డెనింగ్ యాప్...పెరట్లో కూరగాయలు, ఇంటి ఆవరణలో అందాన్ని ఇచ్చే మొక్కలు పెంపకానికి సంబంధించిన యాప్ ఇది. విత్తనాలు ఎలా ఎంచుకోవాలి.. నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలన్న ఏడు అంశాలతో కూడిన వివరాలను ఈ యాప్‌లో పొందుపర్చారు. ఇంటి పరిసరాల్లో ఎలాంటి మొక్కలు నాటాలి.. ఎంత విస్తీర్ణంలో నాటుకోవాలి.. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను ఎలా నాటుకోవచ్చో ఇందులో వివరంగా ఉంటుంది. ఈ యాప్‌లో వీడియోల ద్వారా అవగాహన పెంచుకునే అవకాశం కూడా కల్పించారు. -
రాణుల పూదోట!
3సముద్ర అలల తాకిడిలో సేదతీరుతున్న మత్స్యకన్య.. కనుచూపు మేర ఆకుపచ్చని పసరిక, మధ్య మధ్యలో చెట్లు.. తపస్సులో లీనమైన తథాగతుడి ప్రసన్న వదనం.. అందమైన కోట, దాని చుట్టూ తోట. ఆ తోటలో నీటి కొలను. కొలనుపై చెక్క వంతెన. వంతెన ఆవల పక్షుల గూడు. ఆ పక్షులను పలకరించే యువరాణి.. విశాలమైన ప్రాంగణంలో చక్కటి ఇల్లు, కారు, మనసున మనసై నిలిచిన ఓ ప్రేమజంట. ఇది మీ కల అయితే.. ఆ కలను తమ కళతో ఓ రూపమిచ్చి మీ ముందుకు తీసుకువస్తారు. మీ వృత్తిని, ఆసక్తిని, మీ కళ్ల ముందు నిలుపుకోవాలనుకునే కలలను, చిత్రాలను మీరు కోరుకున్నట్లుగా డెస్క్‌టాప్ గార్డెన్‌గా మలిచి అందిస్తారు నగరానికి చెందిన రాణి పూదోట, రాణి నరిశెట్టి. మొక్క పెంచితే కలిగే తృప్తిని, ఒత్తిడి నుంచి కలిగే ఉపశమనాన్ని గ్రహించిన వీరు డెస్క్‌టాప్ గార్డెనింగ్‌ను వీలైనంత ఎక్కువ మందికి చేరువ చేయాలనుకుంటున్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా తట్టుకొని పెరిగే గట్టి మొక్కలను మినియేచర్ గార్డెనింగ్‌లో వాడతారు. ఆఫీస్‌లో, ఇంట్లో కిటికీ, బాత్రూమ్, స్టడీ టేబుల్ ఎక్కడైనా వీటిని పెట్టుకోవచ్చు. వారం పది రోజులు ఊరు వెళ్లినా బతికే తత్వం ఉన్న గట్టి మొక్కలతోనే ఈ గార్డెన్స్ రూపొందిస్తున్నారు. సన్సెవేరియా, గోల్డెన్ పాతోస్, అలోవెరా, బ్రయోఫిలం, క్రిప్టాంతస్, జమీయా లాంటి మొక్కలు తక్కువ నీరు, వెలుతురు, గాలి ఉన్నా బతికేస్తాయి. ఈ మొక్కలు గదిలో గాలిని శుద్ధి చేస్తాయి. రాత్రిళ్లు కార్బన్ డయాక్సైడ్ను విడుదల చేయవు. కలలకు రూపం.. చిన్నపిల్లలు ఫెయిరీ, కార్టూన్ క్యారెక్టర్లు, మగపిల్లలు ఆటలు, పెద్ద వాళ్లు మెడిటేషన్ గులక రాళ్లు కూడా లేకుండా మట్టి మాత్రమే ఉండేలా కావాలని కొందరు, రాధాకృష్ణులు, సంగీతం, ఆటలు, వృత్తులు, సందర్భాలు ఇలా రకరకాల థీంస్తో మినియేచర్ గార్డెన్లు రూపొందిస్తున్నారు. పార్టీల్లో 3, 4 వందల రూపాయల గిఫ్ట్ ఇచ్చే బదులు ఈ డెస్క్‌టాప్ గార్డెన్స్ ఇస్తే బాగుంటుందంటున్నారు రాణి పూదోట, రాణి నరిశెట్టి. ఇష్టంగా చేశాం.. నేను గృహిణిని. సైన్సు సబ్జెక్ట్ చదువుకున్నా. మొక్కల పెంపకంపై ఆసక్తి. మినియేచర్ గార్డెనింగ్ సింపుల్‌గా స్టార్ట్ చేశాం. కస్టమైజ్డ్ గార్డెన్ల నుంచి పార్టీ రిటర్న్ గిఫ్ట్ బల్క్ ఆర్డర్ల వరకు చేస్తున్నాం. – రాణి పూదోట స్వానుభవంతో.. నేను ఐటీ ఉద్యోగిని. ప్రతి ఉద్యోగంలో, ప్రతి ఒక్కరి జీవితంలో స్ట్రెస్ తప్పదు. నా టేబుల్ మీద ఈ చిట్టి గార్డెన్ ఉంటుంది. కాసేపు ఈ మొక్కలను చూస్తే ఎంతో రిలాక్స్డ్గా అనిపిస్తుంది. మనం పెంచే మొక్కకి ఒక ఆకు, కొమ్మ, పువ్వు వచ్చినా కలిగే ఆనందమే వేరు. – రాణి నరిశెట్టి -
గార్డెనింగ్ తో గృహశోభ!
సాక్షి, హైదరాబాద్: ఈరోజుల్లో ఇంట్లో పెంపుడు జంతువులు, ఇంటి బయట గార్డెనింగ్ ఈ రెండూ హాబీలుగా మారిపోయాయి. అయితే ఇందులో గార్డెనింగ్ అనేది ఏవో మొక్కలు పెంచేసి.. రోజూ నీళ్లు పోస్తే సరిపోలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంటి ఆవరణలో గార్డెనింగ్ ఎంత ఆహ్లాదంగా ఉంటే ఆ ఇంటి అందం రెట్టింపవుతుంది మరి. గార్డెనింగ్‌లో నిపుణుల పలు సూచనలివిగో.. ♦ మొక ్కలు ఎంపిక చేసుకొనే ముందు అవి పెరిగే ఎత్తు, పూల రంగు, వాసన వంటి అంశాలను గమనించాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతాయో తెలుసుకోవాలి కూడా. ♦ గార్డెనింగ్ అంటే నిటారుగా పెరిగే మొక్కలు కాకుండా పొదల మాదిరిగా పెరిగే పూల మొక్కలు, తీగలతో అల్లుకుపోయే మొక్కలు పెంచుకుంటే ఇంటి ఆవరణ అందంగా ఉంటుంది. ♦ ఏ మొక్కకు ఎంత నీరు పెట్టాలి అనే విషయాన్ని తెలుసుకోవాలి. మొక్కలు నాటిన మొదటివారంలో రోజూ నీరు పెట్టాలి. రెండో వారం నుంచి రెండు రోజులకొకసారి నీరు పెట్టొచ్చు. అయితే ఇది అన్ని మొక్కలకు వర్తించదు. కొన్ని రకాల పూల మొక్కలకు ప్రతి రోజూ నీరు పెట్టాల్సి ఉంటుంది మరి.