అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీలు..! | mini stp's in apartments | Sakshi
Sakshi News home page

అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీలు..!

Published Fri, May 23 2014 4:25 AM | Last Updated on Sat, Aug 18 2018 8:37 PM

అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీలు..! - Sakshi

అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీలు..!

  •  50 ఫ్లాట్‌లు దాటినవి, గేటెడ్ కమ్యూనిటీలపై జలమండలి దృష్టి
  •  ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు
  •  రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతులపై ఆసక్తి
  •  తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు వాడుకునే వీలు
  •  సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో బహుళ అంతస్తుల భవనాల్లో (అపార్ట్‌మెంట్స్) మురుగు శుద్ధి కేంద్రాల (సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్-ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. భూగర్భజలాలు అడుగంటి పోతుండటం, జలాశయాల నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి గార్డెనింగ్, టాయిలెట్ ఫ్లష్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టి సారించింది.
     
     కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 50 ఫ్లాట్‌లు మించి ఉన్న అపార్ట్‌మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వాటర్‌బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాన్ని (మినీ ఎస్టీపీ) మరో మూడు నెలల్లో ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. తద్వారా మినీ ఎస్టీపీల పనితీరుపై అన్ని వర్గాలకు అవగాహన పెంపొందించవచ్చని పేర్కొన్నాయి.
     
     నగరంలో 50 ఫ్లాట్స్‌కు మించి ఉన్న అపార్ట్‌మెంట్లు సుమారు 12 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయన్నారు. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నెలకొన్న అపార్ట్‌మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం (రెడ్యూస్), వినియోగించిన నీటిని శుద్ధి చేయడం (రీసైకిల్), తిరిగి వినియోగించడం (రీ యూజ్) పద్ధతులను అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మూడు ‘ఆర్’ల (3 ఆర్) విధానంగా పిలుస్తారన్నారు.
     
     రూ.కోటి ఖర్చుతో మినీ ఎస్టీపీ..!

     అపార్ట్‌మెంట్ల వద్ద రోజువారీగా రెండు మిలియన్ లీటర్ల మురుగు నీటిని, వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చవుతుందని అం చనా. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్, రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగు నీటిలోని బీఓడీ, సీఓడీ, నురుగు, ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగు నీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధి చేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈ నీరు తాగడానికి పనికి రాదు. కానీ గార్డెనింగ్, బాత్‌రూం ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం, ఫ్లోర్ క్లీనింగ్, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి జలమండలి ముందు మినీ ఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది.
     
     వినియోగదారుల సహకారమే కీలకం..!

     ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటి బిల్లులు, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు.
     
     ఎస్టీపీలతో ఉపయోగాలివే...
     
    ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కే రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది.
         
    భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు.
         
    మినీ ఎస్టీపీల్లో శుద్ధి చేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు.
         
    జలమండలి ట్యాంకర్ నీటి కోసం ఎదురుచూసే అవస్థలు తప్పుతాయి.
         
    గార్డెనింగ్, గ్రీన్‌బిల్డింగ్‌లు, చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు. పచ్చదనానికి కొదవుండదు.
         
    పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుం ది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది. చారిత్రక నదిని పరిరక్షించినవారవుతాం.
         
    లోతట్టు ప్రాంతాల్లో  భూమి లోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్ ట్యూబ్‌వెల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement