Green Building
-
అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్’ను మించేలా..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 241.50 ఎకరాల్లో అడుగడుగునా అద్భుతమనేలా.. గ్రీన్బిల్డింగ్ రూపంలో, స్మార్ట్ భవనంగా ఐఐఎం రూపుదిద్దుకుంటోంది. క్యాంపస్ పరిధిలో 7,200 రకాల పూలు, పండ్ల మొక్కలు, వివిధ వృక్షజాతులు పెంచుతున్నారు. సౌరవిద్యుత్ వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించేలా భవన నిర్మాణం సాగింది. పరిపాలన భవనం మినహా దాదాపు అన్ని బిల్డింగ్లు పూర్తి కావడంతో ఇప్పటికే తరగతుల నిర్వహణను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 100 సీట్లు అదనంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మొదటి దశలో నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. విభిన్న ప్రత్యేకతల సమాహారం ► ఇప్పటికే హాస్టళ్లు, తరగతి గదులు, 4 స్టార్ కిచెన్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఇది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ► 2022 ఆగస్ట్ నుంచి ఏయూ క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌కు తరగతులను తరలించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో భవనాల్ని అద్దెకు తీసుకుని హాస్టళ్లు నిర్వహించేవారు. వాటిని కూడా ఖాళీ చేసి.. కొత్త క్యాంపస్‌లో నిర్మించిన వసతి గృహాల్లోనే విద్యార్థులకు గదులు కేటాయించారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో గదిని పూర్తిస్థాయిలో కేటాయించడం విశేషం. హాస్టళ్లను కూడా తరలించడం వల్ల అద్దెల రూపంలో నెలకు రూ.5 లక్షల వరకూ ఆదా చేస్తున్నారు. ► ఓవైపు హరిత భవనంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కర్బన ఉద్గారాల వినియోగాన్ని తగ్గించేలా క్యాంపస్ నిర్మాణం జరిగింది. ► క్యాంపస్ మొత్తానికి సౌర విద్యుత్ వినియోగించుకునేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ► కోవిడ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్యాంపస్‌కు అదనపు హంగులు సమకూరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పరికరాలను వినియోగించడానికి చేతులతో స్విచ్‌లు నొక్కే అవసరం లేకుండా.. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► హార్వర్డ్ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. ► వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. ► ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. ► ప్రతి ప్రొఫెసర్ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్సైట్లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు. ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ► విద్యార్థుల హాస్టళ్లలో ప్రతి గదిలో ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. ► దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఐఐఎం క్యాంపస్‌కు హరితహారంగా క్యాంపస్ భవనం చుట్టూ 7,200 రకాల చెట్లు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే కొంతమేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సీట్లు పెంచే ఆలోచన దిశగా.. ఈ విద్యా సంవత్సరం మరో 100 సీట్లు పెంచే దిశగా ఐఐఎంవీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు 300 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 187 మంది ఉన్నారు. మొత్తం 487 సీట్లున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం సీట్లను మరో 100కి పెంచి 400 అడ్మిషన్లు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 100 సీట్లు పెంచుతూ మొత్తం 1170 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు. (క్లిక్ చేయండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ) ఫైవ్ స్టార్ రేటింగ్‌కు అనుగుణంగా.. గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకునేలా విశాఖపట్నంలో కొత్త ఐఐఎం క్యాంపస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇతర చిన్న చిన్న పనులు మినహా దాదాపు క్యాంపస్ పూర్తయింది. ఇందుకోసం మొత్తం రూ.807.69 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 1,170 మంది విద్యార్థులకు సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 600 మందికి వీలుగా నిర్మాణాలు చేపట్టాం. 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. శాశ్వత భవనంలో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్ -
ఆగమేఘాలపై అందాల తోట
విలాసవంతమైన ఇంటిని నిర్మించుకునే క్రమంలో కావల్సినవన్నీ కొనేయవచ్చు కాని నిండైన ఉద్యానవనాన్ని నిమిషాల మీద తేలేం కదా! సరిపడా స్థలం వదలాలి. మొక్కలు నాటాలి. నీళ్లు పోయాలి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని చేస్తే కాని డ్రీమ్ గార్డెన్ తయారవదు. అయితే గృహప్రవేశం వేళకే అన్నీ సిద్ధమైపోవాలంటే సాధ్యమా? ఊటీకో, కొడెకైనాల్కో వెళ్లొచ్చారు. ఆ పచ్చని ప్రాంతాలు తిరిగొచ్చాక లంకంత కొంప ఉన్నా లక్షణమైన తోట లేదు కదా అని బాధేసింది. ఆఘమేఘాలపై ఇంటిని గ్రీన్ బిల్డింగ్‌గా మార్చేయాలనుకున్నారు. కాని అది సాధ్యమా? ఏ టు జెడ్... రెడీమేడ్.. ‘గతంలో ఏమో కానీ ఇప్పుడది సాధ్యమే’ అంటున్నారు బంజారాహిల్స్‌లోని యూనిక్ ట్రీస్ యజమాని రామ్‌దేవ్. ఖరీదును పట్టించుకోకపోతే చాలు.. సిద్ధంగా ఉన్నాయి రెడీమేడ్ ఉద్యానవనాలు అంటున్నారాయన. ఇంపోర్టెడ్ ట్రీస్‌తో దేశంలోనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన రామ్‌దేవ్.. పూర్తిస్థాయి ఇన్స్టంట్ గార్డెన్స్‌ను వారంలోనే అమర్చుకోవచ్చునని చెబుతున్నారు. ఇప్పటికే నగరంలో 20కిపైగా భవంతులకు ఆయన ఈ తరహాలో రెడీమేడ్ పచ్చదనాన్ని అందించారు. ఇంటి ముందు పచ్చదనాన్ని ‘పార్క్’ చేయాలంటే ఒకటో రెండో మొక్కలుంటే సరిపోవుగా! ‘గచ్చు’గుద్దినట్టు ఉండే గడ్డి నుంచి గగనాన్ని తాకే వృక్షాల దాకా ఎన్నో కావాలి. ‘ఏపుగా పెరిగిన వృక్షాలు, విభిన్న రకాల గ్రాస్..ఇలా ఒక పూర్తిస్థాయి గార్డెన్‌కు వారంలోనే రూపమివ్వొచ్చు’ అన్నారు రామ్‌దేవ్. అయితే, ఇందుకోసం రూ.10 లక్షలు మొదలుకుని రూ. కోట్ల వరకు బడ్జెట్ వెచ్చించాలి. ఇన్స్టంట్...ఇన్వెస్ట్మెంట్ కూడా.. జూబ్లీహిల్స్‌లో ఒకాయన కొనేళ్ల క్రితం రూ.లక్ష ఖర్చుతో గార్డెన్ అమర్చుకున్నారు. అందులోని కొన్ని వృక్షాల విలువ పెట్టిన పెట్టుబడికి కొన్ని రెట్లు పెరిగింది. రూ.కోట్లు పలుకుతున్నాయి. ‘ఇప్పుడు వృక్షాలు కొనడం మంచి పెట్టుబడి సాధనం కూడా. ఒక ఇంటిని మనం నిర్మించుకుంటే తర్వాతి కాలంలో స్థలం తప్ప అన్నింటి విలువా తగ్గిపోతాయి. కాని మొక్కలు మాత్రమే తమ విలువను ఏ యేటికాయేడు పెంచుకుంటాయి’ అని సదరు ఇంటి యజమాని ఆనందం వ్యక్తం చేశారు. సిటీలో ఇన్స్టంట్ గ్రీనరీకి పెరిగిన డిమాండ్ పుణ్యమా అని వీటిని పెట్టుబడి సాధనంగా కూడా పలువురు చూస్తున్నారు. థీమ్గార్డెన్లూ షురూ.. ఇన్స్టంట్ రాకతో ఇంటి గార్డెన్స్ ఏర్పాటులో బోలెడన్ని మార్పులు వచ్చేశాయి. ఒక కాన్సెప్ట్ తీసుకుని ఏర్పాటు చేసే థీమ్ గార్డెన్స్ కూడా సిద్ధమైపోయాయి. తెల్ల ఇసుక, మెరిసే రాళ్లతో వైవిధ్యంగా కనిపించే జపనీస్ గార్డెన్స్, కోకోనట్, పామ్ ట్రీస్ వంటివి విరివిగా వినియోగించే ట్రోపికల్ స్టైల్ గార్డెన్, స్పెయిన్, గ్రీస్ వంటి దేశాల నుంచి తెచ్చిన మొక్కలతో రూపొందే మెడిటేరియన్ థీమ్ గార్డెన్, రాళ్లే ఆధారంగా అల్లుకునే స్టోన్ గార్డెన్... ఇలా విభిన్న రకాలున్నాయి. వీటిలో ట్రోపికల్కు సిటిజనుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇండియన్ మొక్కలూ రానున్నాయ్.. ఫిలిప్పీన్స్, థాయ్‌లాండ్, వియత్నాం, ఆస్ట్రేలియా, మెక్సికో, స్పెయిన్, ఇటలీ, అర్జెంటీనా, జపాన్, అమెరికా, ఉరుగ్వే, సౌత్ ఈస్ట్ ఏసియా దేశాలు, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి ప్రస్తుతం ఎదిగిన మొక్కల్ని దిగుమతి చేసుకుంటున్న సిటిజనులకు భవిష్యత్తులో ఇండియన్ మొక్కలు సైతం ఇన్‌స్టంట్‌గా అందుబాటులోకి రానున్నాయి. ‘ఎలాంటి వాతావరణంలోనైనా పెరిగే కొన్ని ప్రత్యేకమైన వృక్షాలనే ఈ ఇన్స్టంట్ గార్డెన్స్‌కు వినియోగిస్తున్నారు. అయితే ఇవన్నీ విదేశీవే. ఇకపై దేశీయంగా పరిచయం ఉన్నవి కూడా అందించనున్నాం. జమ్మి, నాగమల్లి, వేప వంటి కొన్ని రకాలను పరిశీలిస్తున్నాం. అలాగే నాటిన పదేళ్లకు గాని పండు ఇవ్వని పనస వంటి చెట్లనూ రెడీమేడ్‌గా అందించాలనుకుంటున్నాం’ అని రామ్‌దేవ్ వివరించారు. -
హరిత భవనాల నిర్మాణమే నినాదం కావాలి
సెంట్రల్ యూనివర్సిటి: దేశంలో హరిత భవనాల నిర్మాణమే నినాదంగా మారాలని ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ మనూ సింగ్ తెలిపారు. హైదరాబాద్‌లో 12వ అంతర్జాతీయ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్ సదస్సు ప్రారంభంకానున్న సందర్భంగా సీఐఐ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మెట్రో రైల్ మనూ సింగ్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా గ్రీన్ బిల్డింగ్ మూమెంట్ యజ్ఞంలా సాగుతుందని తెలిపారు. అభివృద్ధి చెందిన అమెరికా, జపాన్, చైనా వంటి దేశాలు వేగవంతమైన హరిత భవన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయన్నారు. అభివృద్ధికి సూచకంగా హరిత భవనాలు, నిర్మాణాలు నిలుస్తాయని తెలిపారు. వివిధ రంగాలలో అభివృద్ధి సాధించడం ఎంత ముఖ్యమో, హరిత భవనాలను నిర్మించడం అంతే ముఖ్యం అన్నారు. నివాసిత ప్రాంతాలలో విరివిగా చెట్లు నాటడం కాలుష్యాన్ని నివారించడమేనన్నారు. నగరాల్లో గ్రీన్ బిల్డింగ్‌లను నిర్మించడం సవాలుగా మారిందని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. చర్చా కార్యక్రమంలో ఇండియా గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ ప్రేమ్ సింగ్ జైన్, గుజరాత్ కాలుష్య నియంత్రయ బోర్డు చైర్మన్ మిస్త్రీ, క్యారియర్ ఇండియా అసిస్టెంట్ డెరైక్టర్ దీరజ్ బద్వా తదితరులు పాల్గొన్నారు. 12వ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ కాంగ్రెస్‌కు వేదికైన హైదరాబాద్... 12వ అంతర్జాతీయ హరిత భవన సదస్సుకు హైదరాబాద్ వేదికైంది. గురువారం నుండి 6వ తేది వరకు కొనసాగే ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 5000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. ఈ సదస్సులో పలు సమస్యాత్మక అంశాలను చర్చించనున్నారు. సదస్సు మూడు రోజుల పాటు కొనసాగనుంది. -
అపార్ట్మెంట్లలో మినీ ఎస్టీపీలు..!
50 ఫ్లాట్లు దాటినవి, గేటెడ్ కమ్యూనిటీలపై జలమండలి దృష్టి ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు రెడ్యూస్, రీసైకిల్, రీయూజ్ పద్ధతులపై ఆసక్తి తాగడానికి మినహా ఇతరత్రా అవసరాలకు వాడుకునే వీలు సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో బహుళ అంతస్తుల భవనాల్లో (అపార్ట్మెంట్స్) మురుగు శుద్ధి కేంద్రాల (సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్-ఎస్టీపీ) ఏర్పాటుకు జలమండలి సన్నాహాలు చేస్తోంది. భూగర్భజలాలు అడుగంటి పోతుండటం, జలాశయాల నీటి నిల్వలు తగ్గుముఖం పడుతుండటంతో మురుగునీటిని మంచినీటిగా మార్చి గార్డెనింగ్, టాయిలెట్ ఫ్లష్, ఫ్లోర్ క్లీనింగ్ వంటి ఇతరత్రా అవసరాలకు వినియోగించుకునే విధానాలపై దృష్టి సారించింది. కాంక్రీట్ మహారణ్యంలా మారిన మహానగరం పరిధిలో 50 ఫ్లాట్లు మించి ఉన్న అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీల వద్ద స్థానికుల సహకారంతో ఈ నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించినట్లు వాటర్‌బోర్డు వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. చిన్నపాటి మురుగు శుద్ధి కేంద్రాన్ని (మినీ ఎస్టీపీ) మరో మూడు నెలల్లో ప్రయోగాత్మకంగా జలగం వెంగళరావు పార్క్‌లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపాయి. తద్వారా మినీ ఎస్టీపీల పనితీరుపై అన్ని వర్గాలకు అవగాహన పెంపొందించవచ్చని పేర్కొన్నాయి. నగరంలో 50 ఫ్లాట్స్‌కు మించి ఉన్న అపార్ట్మెంట్లు సుమారు 12 వేల వరకు ఉన్నట్లు బోర్డు వర్గాలు గుర్తించాయన్నారు. భూగర్భజలాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో నెలకొన్న అపార్ట్మెంట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు ముందుకొస్తే ఎస్టీపీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాగా పలు అభివృద్ధి చెందిన దేశాల్లో నీటి వినియోగాన్ని తగ్గించడం (రెడ్యూస్), వినియోగించిన నీటిని శుద్ధి చేయడం (రీసైకిల్), తిరిగి వినియోగించడం (రీ యూజ్) పద్ధతులను అమలు చేస్తున్నారు. ఈ విధానాన్ని మూడు ‘ఆర్’ల (3 ఆర్) విధానంగా పిలుస్తారన్నారు. రూ.కోటి ఖర్చుతో మినీ ఎస్టీపీ..! అపార్ట్మెంట్ల వద్ద రోజువారీగా రెండు మిలియన్ లీటర్ల మురుగు నీటిని, వ్యర్థ జలాలను శుద్ధి చేసేందుకు ఏర్పాటు చేసే చిన్నపాటి ఎస్టీపీ నిర్మాణానికి సుమారు రూ.కోటి ఖర్చవుతుందని అం చనా. ఈ ఎస్టీపీ వద్ద ఏరియేషన్, రివర్స్ ఆస్మోసిస్ విధానాల ద్వారా మురుగు నీటిలోని బీఓడీ, సీఓడీ, నురుగు, ఇతరత్రా కలుషిత అనుఘటకాలను తొలగించి మురుగు నీటిలో సుమారు 60 శాతం నీరు తిరిగి వినియోగించుకునేలా శుద్ధి చేస్తారు. అంటే వందలీటర్ల మురుగు నీటిని శుద్ధి చేస్తే 60 లీటర్లను తిరిగి వినియోగించుకోవచ్చన్నమాట. కాగా ఈ నీరు తాగడానికి పనికి రాదు. కానీ గార్డెనింగ్, బాత్రూం ఫ్లష్, వాహనాలు శుభ్రపరచడం, ఫ్లోర్ క్లీనింగ్, ఇతరత్రా అవసరాలకు వినియోగించుకోవచ్చు. మన నగరంలో థర్మాక్స్ వంటి కంపెనీలు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసి జలమండలి ముందు మినీ ఎస్టీపీల ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిసింది. వినియోగదారుల సహకారమే కీలకం..! ఎస్టీపీ నిర్మాణానికి జలమండలి సాంకేతిక సహకారమే అందిస్తుంది. నిర్మాణానికయ్యే వ్యయాన్ని అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న వినియోగదారులే భరించాలి. ఇప్పటికే నీటి బిల్లులు, ఇంటి పన్నులు, కరెంట్ బిల్లుల మోతతో సతమతమౌతున్న వినియోగదారులు ఎస్టీపీల నిర్మాణానికి ఏమేర ముందుకొస్తారన్నది సందేహాస్పదంగా మారింది. వీటి నిర్మాణానికయ్యే వ్యయంలో జలమండలి సగం వ్యయాన్ని సమకూరిస్తే మిగతా మొత్తాన్ని ఫ్లాట్లలో నివాసం ఉంటున్న వినియోగదారులు భరించే ప్రతిపాదనను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎస్టీపీలతో ఉపయోగాలివే... ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ నుంచి విముక్తి పొందవచ్చు. ఎందుకంటే ఐదు వేల లీటర్ల నీటి ట్యాంకర్‌కే రూ.1000 చెల్లించాల్సిన దుస్థితి తప్పుతుంది. భూగర్భ జలాల లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ ఎస్టీపీల నిర్మాణంతో నీటిఎద్దడి గణనీయంగా తగ్గుతుంది. వాడుకునే నీటికి కొరత ఉండదు. మినీ ఎస్టీపీల్లో శుద్ధి చేయగా మిగిలిన నీటిని భూగర్భంలోకి మళ్లించి భూగర్భజల నిల్వలు పెంచవచ్చు. జలమండలి ట్యాంకర్ నీటి కోసం ఎదురుచూసే అవస్థలు తప్పుతాయి. గార్డెనింగ్, గ్రీన్‌బిల్డింగ్‌లు, చిన్నపార్కుల నిర్వహణకు నీటికొరత ఉండదు. పచ్చదనానికి కొదవుండదు. పెద్దపెద్ద అపార్ట్మెంట్లలో మినీ ఎస్టీపీల నిర్మాణంతో నగరంలో మురుగునీటి ప్రవాహం గణనీయంగా తగ్గుతుం ది. మూసీలోకి ప్రవహించే మురుగు ప్రవాహం తగ్గుతుంది. మూసీ ప్రక్షాళన మరింత సులువు అవుతుంది. చారిత్రక నదిని పరిరక్షించినవారవుతాం. లోతట్టు ప్రాంతాల్లో భూమి లోపల సుమారు 1500 ఫీట్ల వరకు డ్రిల్లింగ్ చేసి డీప్ ట్యూబ్‌వెల్స్‌ను ఏర్పాటుచేసి ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని వీటిల్లోకి మళ్లిస్తే భూగర్భ జలాల రీఛార్జీ సులువు అవుతుంది. మండువేసవిలో బోరుబావులు ఎండిపోయే దుస్థితి తప్పుతుంది.