అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్‌’ను మించేలా.. | IIM Visakhapatnam Permanent Campus Building Full Details in Telugu | Sakshi
Sakshi News home page

అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్‌’ను మించేలా..

Published Mon, Jan 2 2023 5:34 PM | Last Updated on Mon, Jan 2 2023 5:35 PM

IIM Visakhapatnam Permanent Campus Building Full Details in Telugu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) శాశ్వత భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 241.50 ఎకరాల్లో అడుగడుగునా అద్భుతమనేలా.. గ్రీన్‌బిల్డింగ్‌ రూపంలో, స్మార్ట్‌ భవనంగా ఐఐఎం రూపుదిద్దుకుంటోంది. క్యాంపస్‌ పరిధిలో 7,200 రకాల పూలు, పండ్ల మొక్కలు, వివిధ వృక్షజాతులు పెంచుతున్నారు. సౌరవిద్యుత్‌ వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించేలా భవన నిర్మాణం సాగింది. పరిపాలన భవనం మినహా దాదాపు అన్ని బిల్డింగ్‌లు పూర్తి కావడంతో ఇప్పటికే తరగతుల నిర్వహణను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 100 సీట్లు అదనంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 


రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది.  మొదటి దశలో నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్‌ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. 


విభిన్న ప్రత్యేకతల సమాహారం 

► ఇప్పటికే హాస్టళ్లు, తరగతి గదులు, 4 స్టార్‌ కిచెన్‌ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. ఇది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. 

► 2022 ఆగస్ట్‌ నుంచి ఏయూ క్యాంపస్‌ నుంచి కొత్త క్యాంపస్‌కు తరగతులను తరలించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో భవనాల్ని అద్దెకు తీసుకుని హాస్టళ్లు నిర్వహించేవారు. వాటిని కూడా ఖాళీ చేసి.. కొత్త క్యాంపస్‌లో నిర్మించిన వసతి గృహాల్లోనే విద్యార్థులకు గదులు కేటాయించారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో గదిని పూర్తిస్థాయిలో కేటాయించడం విశేషం. హాస్టళ్లను కూడా తరలించడం వల్ల అద్దెల రూపంలో నెలకు రూ.5 లక్షల వరకూ ఆదా చేస్తున్నారు. 
     
► ఓవైపు హరిత భవనంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కర్బన ఉద్గారాల వినియోగాన్ని తగ్గించేలా క్యాంపస్‌ నిర్మాణం జరిగింది. 
     

► క్యాంపస్‌ మొత్తానికి సౌర విద్యుత్‌ వినియోగించుకునేలా సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్‌ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. అవసరాలకు మించి విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్‌ విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసేలా ప్లాంట్‌ నిర్మాణం జరుగుతోంది. 
     
► కోవిడ్‌ సమయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్యాంపస్‌కు అదనపు హంగులు సమకూరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పరికరాలను వినియోగించడానికి చేతులతో స్విచ్‌లు నొక్కే అవసరం లేకుండా.. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 
     
► హార్వర్డ్‌ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. 
     
► వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. 
     
► ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. 
     
► ప్రతి ప్రొఫెసర్‌ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్‌సైట్‌లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు. ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. 
     
► విద్యార్థుల హాస్టళ్లలో ప్రతి గదిలో ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్‌ మిషన్‌ ఏర్పాటు చేశారు. 
     
► దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఐఐఎం క్యాంపస్‌కు హరితహారంగా క్యాంపస్‌ భవనం చుట్టూ 7,200 రకాల చెట్లు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే కొంతమేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. 

సీట్లు పెంచే ఆలోచన దిశగా.. 
ఈ విద్యా సంవత్సరం మరో 100 సీట్లు పెంచే దిశగా ఐఐఎంవీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు 300 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 187 మంది ఉన్నారు. మొత్తం 487 సీట్లున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం సీట్లను మరో 100కి పెంచి 400 అడ్మిషన్లు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో బోర్డు మీటింగ్‌ జరగనున్న నేపథ్యంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 100 సీట్లు పెంచుతూ మొత్తం 1170 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు. (క్లిక్‌ చేయండి: వాహ్‌ వైజాగ్‌.. సాటిలేని మేటి సిటీ)


ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌కు అనుగుణంగా.. 

గ్రీన్‌ బిల్డింగ్స్‌ రేటింగ్‌ సిస్టమ్‌ ద్వారా 5 స్టార్‌ రేటింగ్‌ సొంతం చేసుకునేలా విశాఖపట్నంలో కొత్త ఐఐఎం క్యాంపస్‌ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్, ఇతర చిన్న చిన్న పనులు మినహా దాదాపు క్యాంపస్‌ పూర్తయింది. ఇందుకోసం మొత్తం రూ.807.69 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 1,170 మంది విద్యార్థులకు సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫస్ట్‌ ఫేజ్‌లో 600 మందికి వీలుగా నిర్మాణాలు చేపట్టాం. 5 స్టార్‌ రేటింగ్‌ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. శాశ్వత భవనంలో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. 
– ప్రొఫెసర్‌ చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement