గంభీరంలో నిర్మించిన ఐఐఎం విశాఖపట్నం క్యాంపస్
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం/రేణిగుంట (తిరుపతి జిల్లా): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఒకటి అయిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)– విశాఖపట్నం శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. 2015 నుంచి ఐఐఎం–విశాఖ కార్యకలాపాలను ఆంధ్రా విశ్వవిద్యాలయంలో నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం విశాఖ శివారు ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాల్ని ఉచితంగా కేటాయించింది.
ఇందులో శాశ్వత భవన నిర్మాణం పూర్తి చేసే పనుల్ని రెండు దశల్లో చేపట్టారు. మొదటి దశలో రూ.472.61 కోట్లతో పనులు పూర్తయ్యాయి. మొత్తం 62,350 చదరపు మీటర్ల విస్తీర్ణంలో బిల్డప్ ఏరియాని అభివృద్ధి చేశారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలను ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. అడుగడుగునా అద్భుతమనేలా హరిత భవనం (గ్రీన్ బిల్డింగ్), స్మార్ట్ భవనంగా దీన్ని తీర్చిదిద్దారు. 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంటును నిరి్మంచారు. దీని ద్వారా సంవత్సరానికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కానుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయ నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్ధులు ‘యు’ ఆకారంలో కూర్చొనేలా తరగతి గదులు నిర్మించారు.
తిరుపతి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్ శాశ్వత క్యాంపస్‌లు కూడా..
తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) శాశ్వత క్యాంపస్‌లను కూడా మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్ విధానంలో జాతికి అంకితం చేయనున్నారు. ఈ మేరకు ఏర్పేడు సమీపంలోని రెండు క్యాంపస్‌లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏర్పేడు సమీపంలో రెండు విద్యా సంస్థలకు 895 ఎకరాలను వేర్వేరుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. జాతికి అంకితం చేసే కార్యక్రమంలో తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ, ఐఐఎస్‌ఈఆర్ డైరెక్టర్ శంతాను భట్టాచార్య పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment