Indian Institute of Management
-
‘ప్రగతి’ సూపర్ సక్సెస్
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది. రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది. ‘గ్రిడ్లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్ఫర్డ్ ప్రస్తావించింది. 2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్ఫర్డ్ అధ్యయనం తెలిపింది. ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది. -
ఐఐఎం వైజాగ్‌కు అరుదైన అవార్డు
సాక్షి, విశాఖపట్నం: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం (ఐఐఎంవీ) మరో అరుదైన అవార్డు దక్కించుకుంది. న్యూఢిల్లీలోని డా.బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించిన ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్ ఫెస్టివల్–2023లో ఐఐఎంవీకు అవార్డు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తూ స్టార్టప్‌లకు చేయూతనందిస్తున్నందుకు గాను పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అందించిన ప్రతిష్ఠాత్మక అవార్డును ఐఐఎంవీ ప్రతినిధి ఎంఎస్ సుబ్రహ్మణ్యం అందుకున్నారు. ఐఐఎంవీలో మహిళా స్టార్టప్స్‌ని ప్రోత్సహించేందుకు ఐఐఎంవీ ఫీల్డ్(ఇంక్యుబేషన్ అండ్ స్టార్టప్స్)ను ఏర్పాటు చేశారు. ఇందులో మొదటి బ్యాచ్‌లో 20 మంది మహిళా పారిశ్రామికవేత్తలు సాగించిన విజయాలకు సంబంధించిన వివరాలతో ‘బ్రేకింగ్ బౌండరీస్’ అనే పుస్తకాన్ని ముద్రించారు. ఈ పుస్తకం ప్రీమియర్ బిజినెస్ స్కూల్ అవార్డును సొంతం చేసుకుంది. అవార్డు సాధించడంపై ఐఐఎంవీ డైరెక్టర్ ప్రొ.ఎం చంద్రశేఖర్ అభినందనలు తెలిపారు. ఐఐఎంవీ ఫీల్డ్‌లో 90 మందికిపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తమ స్టార్టప్స్‌ను అభివృద్ధి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
‘మన్ కీ బాత్’కు 23 కోట్ల శ్రోతలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతినెలా చివరి ఆదివారం నిర్వహించే ‘మన్ కీ బాత్’కు ప్రజల్లో విశేష ఆదరణ ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రధాని ఇచ్చే సందేశాన్ని దాదాపు 23 కోట్ల మంది వింటున్నట్లు తాజా సర్వేలో తేలింది. మొత్తం శ్రోతల్లో 65 శాతం మంది హిందీ భాషలో వినేందుకు ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడయ్యింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–రోహ్తక్ ఈ సర్వే నిర్వహించింది. సర్వేలో ఏం తేలిందంటే.. 100 కోట్ల మందికిగాపైగా ప్రజలు కనీసం ఒక్కసారైనా మన్ కీ బాత్ విన్నారు. 41 కోట్ల మంది తరచుగా వింటున్నారు. 23 కోట్ల మంది కచ్చితంగా వింటున్నారు. మొత్తం శ్రోతల్లో 44.7 శాతం మంది టీవీల్లో, 37.6 శాతం మంది మొబైల్ ఫోన్లలో కార్యక్రమం వింటున్నారని ఐఐఎం–రోహ్తక్ డైరెక్టర్ ధీరజ్ పి.శర్మ చెప్పారు. మన్ కీ బాత్ 100వ ఎడిషన్ వచ్చే ఆదివారం ప్రసారం కానుంది. ఎక్కువ మంది టీవీ చానళ్లలో, మొబైల్ ఫోన్లలో వీక్షించనున్నారు. కేవలం 17.6 శాతం మంది రేడియోల్లో వినబోతున్నట్లు సర్వేలో తేలింది. 22 భారతీయ భాషలు, 29 యాసలతోపాటు 11 విదేశీ భాషల్లో మన్ కీ బాత్ ప్రసారమవుతోందని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. -
మహిళలది జీతం బత్తెం లేని చాకిరి.. రోజూ బండెడు చాకిరీ.. పురుషులు మాత్రం!
అహ్మదాబాద్ : మహిళలు ఇంట్లో జీతం బత్తెం లేకుండా బండెడు చాకిరీ చేస్తున్నారని, రోజుకున్న 24 గంటల సమయం సరిపోవడం లేదని గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) తాజా అధ్యయనంలో వెల్లడైంది. జీతం లేని ఇంటి పనిని పురుషులు 2.8 గంటలు చేస్తే మహిళలు 7.2 గంటల సేపు ఇంటిపనుల్లోనే ఉంటున్నారని ఆ అధ్యయనంలో తేలింది. అధ్యయనం ఏం చెప్పిందంటే.. ఆఫీసులో పని చేస్తూ సంపాదిస్తున్న మహిళలు కూడా పురుషుల కంటే రెండు రెట్లు ఎక్కువగా ఇంటి పనుల్లో నిమగ్నమైపోతున్నారు. ఇల్లు శుభ్రం చేయడం, వంట చేయడం, పిల్లల్ని చూసుకోవడం వంటి పనులన్నీ మగవారి కంటే మహిళలే ఎక్కువగా చేస్తున్నారు. 15 నుంచి 60 ఏళ్ల వయసున్న మహిళలందరూ రోజుకి 7 గంటలకు పైగా ఇంటి పనులు చేస్తున్నారు. ఈ విషయం జగమెరిగిన సత్యమే అయినప్పటికీ ‘‘టైమ్ యూజ్ డేటా : ఏ టూల్ ఫర్ జెండర్డ్ పాలిసీ అనాలిసిస్’’ పేర ఎంత సేపు మహిళలు జీతం లేని చాకిరీ చేస్తున్నారో సర్వే చేయగా మహిళలు సగటున రోజుకి 7.2 గంటలు ఇంటి పనులు చేస్తూ వస్తూ ఉంటే , మగవాళ్లు 2.8 గంటలు మాత్రమే చేస్తున్నారని తేలినట్టుగా ఐఐఎంఏ ప్రొఫెసర్ నమ్రత చందార్కర్ తెలిపారు. -
అడుగడుగునా అద్భుతమనేలా.. ‘హార్వర్డ్’ను మించేలా..
సాక్షి, విశాఖపట్నం : విశాఖలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవన నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. 241.50 ఎకరాల్లో అడుగడుగునా అద్భుతమనేలా.. గ్రీన్బిల్డింగ్ రూపంలో, స్మార్ట్ భవనంగా ఐఐఎం రూపుదిద్దుకుంటోంది. క్యాంపస్ పరిధిలో 7,200 రకాల పూలు, పండ్ల మొక్కలు, వివిధ వృక్షజాతులు పెంచుతున్నారు. సౌరవిద్యుత్ వినియోగిస్తూ కర్బన ఉద్గారాలను నియంత్రించేలా భవన నిర్మాణం సాగింది. పరిపాలన భవనం మినహా దాదాపు అన్ని బిల్డింగ్లు పూర్తి కావడంతో ఇప్పటికే తరగతుల నిర్వహణను ప్రారంభించారు. ఈ విద్యా సంవత్సరంలో మరో 100 సీట్లు అదనంగా పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర విభజన బిల్లులో పొందుపరిచిన కేంద్ర విద్యా సంస్థల్లో ఐఐఎం ఒకటి. ఆంధ్ర విశ్వ విద్యాలయం పరిధిలో 2015 నుంచి తాత్కాలిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. శాశ్వత భవన నిర్మాణం కోసం ప్రభుత్వం ఆనందపురం–గంభీరం పరిసర ప్రాంతాల్లో 241.50 ఎకరాలు కేటాయించింది. ప్రస్తుతం ఈ స్థలంలో శాశ్వత భవనాల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మొదటి దశలో నిర్మాణాలకు రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ప్రపంచ ప్రసిద్ధ హార్వర్డ్ విశ్వవిద్యాలయాన్ని మించేలా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ నిర్మాణాల్లో మిళితం చేయడం విశేషం. విభిన్న ప్రత్యేకతల సమాహారం ► ఇప్పటికే హాస్టళ్లు, తరగతి గదులు, 4 స్టార్ కిచెన్ తదితర నిర్మాణాలు పూర్తయ్యాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ నిర్మాణం జరుగుతోంది. ఇది మార్చి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. ► 2022 ఆగస్ట్ నుంచి ఏయూ క్యాంపస్ నుంచి కొత్త క్యాంపస్‌కు తరగతులను తరలించారు. నగరంలో వివిధ ప్రాంతాల్లో భవనాల్ని అద్దెకు తీసుకుని హాస్టళ్లు నిర్వహించేవారు. వాటిని కూడా ఖాళీ చేసి.. కొత్త క్యాంపస్‌లో నిర్మించిన వసతి గృహాల్లోనే విద్యార్థులకు గదులు కేటాయించారు. ఒక్కో విద్యార్థికి ఒక్కో గదిని పూర్తిస్థాయిలో కేటాయించడం విశేషం. హాస్టళ్లను కూడా తరలించడం వల్ల అద్దెల రూపంలో నెలకు రూ.5 లక్షల వరకూ ఆదా చేస్తున్నారు. ► ఓవైపు హరిత భవనంతో వాతావరణ కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవడంతో పాటు కర్బన ఉద్గారాల వినియోగాన్ని తగ్గించేలా క్యాంపస్ నిర్మాణం జరిగింది. ► క్యాంపస్ మొత్తానికి సౌర విద్యుత్ వినియోగించుకునేలా సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. పగలు వీలైనంత మేరకు సూర్యుని వెలుతురు వినియోగించుకుంటూ.. రాత్రి సౌరవిద్యుత్ వినియోగించేలా నిర్మాణాలు చేపట్టారు. అవసరాలకు మించి విద్యుత్ ఉత్పత్తి చేసేలా 1,500 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చివరి దశకు చేరుకుంది. ఏడాదికి 22.59 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసేలా ప్లాంట్ నిర్మాణం జరుగుతోంది. ► కోవిడ్ సమయంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని క్యాంపస్‌కు అదనపు హంగులు సమకూరుస్తున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న కొన్ని పరికరాలను వినియోగించడానికి చేతులతో స్విచ్‌లు నొక్కే అవసరం లేకుండా.. సెన్సార్ల ఆధారంగా పనిచేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ► హార్వర్డ్ విశ్వవిద్యాలయం నమూనాను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు ‘యు’ ఆకారంలో కూర్చునేలా తరగతి గదులు నిర్మించారు. 50 మంది, 100 మంది కూర్చునేలా ఏసీ తరగతి గదులు సిద్ధం చేశారు. ► వందసీట్లతో 10 తరగతి గదులు, 50 సీట్లతో 10 తరగతి గదులు నిర్మించారు. వీటికి అదనంగా మరో 5 తరగతి గదులు కూడా నిర్మించారు. ప్రొఫెసర్లకు 117 గదులున్నాయి. ► ప్రత్యేక తరగతులు చెప్పేందుకు దేశవిదేశాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం 60 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ని పోలిన అతిథి గృహం నిర్మాణం కూడా పూర్తయింది. ► ప్రతి ప్రొఫెసర్ చెప్పే పాఠం రికార్డవుతుంది. ఇలా రికార్డు చేసిన పాఠాలను ఐఐఎం వెబ్సైట్లో విద్యార్థుల కోసం రెండువారాలు ఉంచుతున్నారు. ఎవరికి ఎలాంటి సందేహం ఉన్నా.. ఈ వీడియో చూసి తెలుసుకోవచ్చు. ► విద్యార్థుల హాస్టళ్లలో ప్రతి గదిలో ఏసీ, టీవీ, ఫ్రిజ్, ఓవెన్, వాషింగ్ మిషన్ ఏర్పాటు చేశారు. ► దేశంలో ప్రత్యేక గుర్తింపు వచ్చేలా ఐఐఎం క్యాంపస్‌కు హరితహారంగా క్యాంపస్ భవనం చుట్టూ 7,200 రకాల చెట్లు, పూలు, పండ్ల మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే కొంతమేర మొక్కలు నాటే కార్యక్రమాన్ని పూర్తి చేశారు. సీట్లు పెంచే ఆలోచన దిశగా.. ఈ విద్యా సంవత్సరం మరో 100 సీట్లు పెంచే దిశగా ఐఐఎంవీ అడుగులు వేస్తోంది. ఇప్పటికే మొదటి సంవత్సరం విద్యార్థులు 300 మంది.. రెండో సంవత్సరం విద్యార్థులు 187 మంది ఉన్నారు. మొత్తం 487 సీట్లున్నాయి. ఈ ఏడాది మొదటి సంవత్సరం సీట్లను మరో 100కి పెంచి 400 అడ్మిషన్లు చేపట్టే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఈ వారం రోజుల్లో బోర్డు మీటింగ్ జరగనున్న నేపథ్యంలో సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. ఏటా 100 సీట్లు పెంచుతూ మొత్తం 1170 మంది విద్యార్థుల సామర్థ్యం ఉన్న క్యాంపస్‌గా అభివృద్ధి చేయనున్నారు. (క్లిక్ చేయండి: వాహ్ వైజాగ్.. సాటిలేని మేటి సిటీ) ఫైవ్ స్టార్ రేటింగ్‌కు అనుగుణంగా.. గ్రీన్ బిల్డింగ్స్ రేటింగ్ సిస్టమ్ ద్వారా 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకునేలా విశాఖపట్నంలో కొత్త ఐఐఎం క్యాంపస్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, ఇతర చిన్న చిన్న పనులు మినహా దాదాపు క్యాంపస్ పూర్తయింది. ఇందుకోసం మొత్తం రూ.807.69 కోట్లు మంజూరయ్యాయి. మొత్తం 1,170 మంది విద్యార్థులకు సరిపడా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఫస్ట్ ఫేజ్‌లో 600 మందికి వీలుగా నిర్మాణాలు చేపట్టాం. 5 స్టార్ రేటింగ్ ప్రమాణాలకు అనుగుణంగా పచ్చదనం అభివృద్ధి చేస్తున్నాం. శాశ్వత భవనంలో త్వరలోనే పూర్తి స్థాయి కార్యకలాపాలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నాం. – ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఐఐఎంవీ డైరెక్టర్ -
దిక్కుతోచని స్థితిలో గిగ్ వర్కర్లు
ముంబై: తాజా నైపుణ్యాలను అలవరుచుకోవడం లేదా కొత్త ఉపాధిని వెతుక్కోవడమనే సవాలును ఎదుర్కొంటున్నట్టు కాంట్రాక్టు పనివారు (గిగ్ వర్కర్లు) అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లో ఏర్పాటైన స్లార్టప్ ప్లాట్‌ఫామ్ సీఐఐఈ.కో ఒక నివేదికను విడుదల చేసింది. పనివాతావరణం తమకు సవాలుగా ఉన్నట్టు సర్వేలో పాల్గొన్న వర్కర్లలో 52 శాతం మంది చెప్పారు. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం లేదంటే మరో ఉద్యోగం వెతుక్కోవాల్సిన సవాలును ఎదుర్కొంటున్నట్టు వీరు తెలిపారు. స్వల్పకాల ఆదాయం కోసం ప్లాట్‌ఫామ్‌లలో కాంట్రాక్టు పనికోసం చేరిన వారు దీర్ఘకాలం పాటు, ఎటువంటి వృద్ధి లేకుండా కొనసాగాల్సి వస్తున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ‘‘మేము అభిప్రాయాలు తెలుసుకున్న ప్రతి ముగ్గురిలో ఒకరు సమీప కాలంలో ఉద్యోగాలు మారే విషయమై స్పష్టమైన ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. అధిక వేళలపాటు పనిచేయాల్సి రావడం, నైపుణ్యాలను పెంచుకునే వాతావరణం లేకపోయినా కూడా మూడింట రెండొంతుల మంది ఉద్యోగాలు మారే విషయమై ప్రణాళికతో లేరు’’అని ఈ నివేదిక ప్రస్తావించింది. నైపుణ్యాల అంతరం దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. ఇలా అయితే నష్టం.. యూనివర్సిటీల నుంచి వస్తున్న ఉద్యోగార్థులకు ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు మొదటి ఉద్యోగ వేదికలుగా ఉంటున్నట్టు ఈ నివేదిక తెలిపింది. వారు ఈ ఉద్యోగాలకే అతుక్కుపోయి నైపుణ్యాలు పెంచకోకుండా, మెరుగైన సంస్థల్లో కొలువులు పొందలేకపోతే.. అది మానవనరులను సరిగ్గా ఉపయోగించుకోలేని పరిస్థితికి దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇంటర్నెట్ సుదుపాయం ఉన్నా కానీ, నేడు గిగ్ వర్కర్లలో 50 శాతం మంది రిఫరల్ రూపంలోనే పనిని పొందుతున్నట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా 4,070 మంది గిగ్ వర్కర్ల నుంచి సీఐఐఈ అభిప్రాయాలు తెలుసుకుని ఈ నివేదిక రూపొందించింది. -
ఆటోడ్రైవర్ కుమారుడికి ఐఐఎంలో సీటు
సాక్షి, పెద్దపల్లి: ఆటోడ్రైవర్ కుమారుడు ఐఐఎంలో సీటు సాధించాడు. నిత్యం పిల్లలను పాఠశాలకు ఆటోలో తీసుకెళ్లి వస్తూ తన పిల్లలను సైతం ఎలాగైనా ఇదే పాఠశాలలో చదివించాలని వారికి మంచి భవిష్యత్ అందించాలని అందుకు ఎంతకష్టమైనా భరించేందుకు సిద్ధపడ్డాడు. అనుకున్నదే తడవుగా ఎన్టీపీసీలోని సెయింట్ క్లెయిర్ పాఠశాలలో సీటు సాధించాడు. తన కొడుకు 8 నుంచి 10వ తరగతి వరకూ చదివి, అందరి పిల్లల ముందు బెస్ట్ అవార్డు అందుకోవడంతో తండ్రి ఆనందానికి అవదులు లేకుండాపోయాయి. గోదావరిఖని ద్వారకానగర్‌కు చెందిన ఎమిరెడ్డి రాజిరెడ్డి ఆటో నడుపుతూ తన కుమారుడు లక్ష్మికాంత్‌రెడ్డిని సెయింట్క్లెయిర్ పాఠశాలలో చేర్పించాడు. 8,9,10వ తరగతి వరకు అక్కడే చదివిన లక్ష్మికాంత్‌రెడ్డి టెన్త్‌లో బెస్ట్ స్టూడెంట్‌గా ఎంపికై నిత్యం తన తండ్రి ఆటోలో వచ్చే పిల్లల ముందే అవార్డు అందుకున్నాడు. ఇదేస్ఫూర్తితో ముందుకు సాగి కరీంనగర్లో ఇంటర్లో చేరి స్కాలర్‌షిప్‌తో చదువు పూర్తిచేశాడు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్‌లో 6వేల ర్యాంకు సాధించి హైదరాబాద్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తండ్రికి పక్షవాతం... లక్ష్మికాంత్‌రెడ్డి చదువు కొనసాగిస్తుండగా తండ్రికి పక్షవాతం వచ్చింది. దీంతో ఆర్థికంగా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ బెదరకుండా ఇంజినీరింగ్ చేస్తూ రెడ్డిహాస్టల్లో ఉండేవాడు. చదువుకు డబ్బులు సరిపోకపోవడంతో ట్యూషన్ చెప్పి ఆర్థికంగా నిలదొక్కుకున్నాడు. ఇంజినీరింగ్ పూర్తవుతున్న క్రమంలో క్యాంపస్ సెలక్షన్స్‌లోనే సాఫ్ట్వేర్ ఉద్యోగానికి ఎంపికై 2016 నుంచి ఉద్యోగం చేస్తూ కుటుంబానికి సహకారం అందించాడు. ఈక్రమంలో గతేడాది సెప్టెంబర్‌లో ఐఐఎం ఎంట్రన్స్ పరీక్ష రాసి 610 మార్కులు సాధించాడు. మంచి మార్కులు రావడంతో అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు లభించింది. ఇదే కళాశాల ఆవరణలోని బ్యాంకులో లోన్ తీసుకుని పేమెంట్ సీటు పొందాడు. ఏడాదిలో చదవు పూర్తిచేసి మంచి ఉద్యోగం సాధిస్తాడని కుటుంబ సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాన్న కృషితో ఈ స్థాయికి ఎదిగా.. నా చదువుకోసం నాన్న చాలా కష్టపడ్డాడు. ఆటోలో వెళ్లే పిల్లల ముందు ఉత్తమ విద్యార్థిగా అవార్డు సాధించడం ఆనందంగా ఉంది. స్కాలర్‌షిప్‌తో ఇంటర్ పూర్తి చేశా. పట్టుదలతో హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదువు కొనసాగించా. రెడ్డీస్ హాస్టల్ వారందించిన సహకారంతో ఇంజినీరింగ్ పూర్తిచేశా. క్యాంపస్ సెలక్షన్స్‌లో కొన్నాళ్లు ఉద్యోగం చేశా. అహ్మ దాబాద్ ఐఐఎంలో సీటు లభించడం చాలా సంతోషంగా ఉంది. – లక్ష్మికాంతరెడ్డి, విద్యార్థి -
విభజనవాద శక్తులను కట్టడి చేయండి
న్యూఢిల్లీ: దేశంలో విభజనవాద శక్తులను కట్టడి చేయాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)బెంగళూరు, అహ్మదాబాద్‌లకు చెందిన విద్యార్థులు, బోధనాసిబ్బంది ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రధాని మౌనం దాల్చడం విద్వేషాలను రెచ్చగొట్టే వారికి ధైర్యాన్నిస్తోందని పేర్కొన్నారు. దేశంలో మైనారిటీలపై దాడుల ఘటనలు, విద్వేష పూరిత ప్రసంగాల నేపథ్యంలో రాసిన ఈ లేఖపై 180 మందికి పైగా సంతకాలు చేశారు. ‘మిశ్రమ సంస్కృతులకు గౌరవించే మీరు.. దేశంలో పెరుగుతున్న అసహనంపై మౌనంగా ఉండటం మమ్మల్ని బాధిస్తోంది. మీ మౌనం విద్వేషపూరిత గొంతుకలకు బలాన్నిస్తోంది’ అని లేఖలో పేర్కొన్నారు. -
నేటి స్టార్టప్‌లే రేపటి ఎమ్ఎన్సీలు
న్యూఢిల్లీ: భారత్‌లో నేటి స్టార్టప్‌లే రేపటి బహుళ జాతి సంస్థలుగా మారుతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. అది సాధించినప్పుడే ఆత్మ నిర్భర్ భారత్ కల సాకారం అవుతుందని అన్నారు. గత కొన్ని దశాబ్దాలుగా వివిధ దేశాలకు చెందిన ఎంఎన్‌సీలు భారత్‌లో వ్యాపారం చేశాయని, ఇక భారత్ ఎంఎన్‌సీలు ఇతర దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తాయని అన్నారు. భారతదేశం లోకల్ నుంచి గ్లోబల్ వైపు అడుగులు వేయడానికి ఐఐఎం విద్యార్థులందరూ కలసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఒడిశాలోని సంబల్పూర్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) శాశ్వత భవనానికి శనివారం మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు. సృజనాత్మక ఆలోచనలతో అందరినీ భాగస్వాముల్ని చేస్తూ కలసి కట్టుగా ముందుకు వెళ్లడమే నిర్వహణ రంగంలో ముఖ్య సూత్రమన్నారు. భారత్ తన కాళ్ల మీద తాను నిలబడడానికి అదే కావాలన్నారు. ప్రతీ విద్యార్థి తమ కెరీర్ లక్ష్యాలను దేశాభివృద్ధికి ఉపయోగపడేలా మలచుకోవాలన్నారు. భారత్ ఉత్పత్తులకు అంతర్జాతీయ బ్రాండ్ కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఐఐఎం విద్యార్థులు కొత్త కాన్సెప్ట్‌లతో లోకల్ ఉత్పత్తులకు గ్లోబల్ మార్కెట్ వచ్చేలా కృషి చేసి ఆత్మనిర్భర్ భారత్ కల సాకారం చేసుకోవడానికి తోడ్పాటునందించాలన్నారు. లోకల్ నుంచి గ్లోబల్ మధ్య ఐఐఎం విద్యార్థులే వారధిగా ఉంటారని మోదీ చెప్పారు. -
క్యాట్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో 2020–21 విద్యా సంవత్సరం ఎంబీఏ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి గతేడాది నవంబర్ 24న నిర్వహించిన క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్)–2019 పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 2.09 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 1.34 లక్షల మంది పురుషులు, 75 వేల మంది మహిళలు ఉన్నారు. తెలంగాణకు చెందిన వారు దాదాపు 7 వేల మంది క్యాట్ పరీక్ష రాసినట్లు సమాచారం. తాజా ఫలితాల్లో దేశవ్యాప్తంగా 10 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, వీరంతా పురుషులే కావడం గమనార్హం. 100 పర్సంటైల్ వచ్చిన వారంతా డిగ్రీలో ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే. టాప్ టెన్‌లో ఆరుగురు ఐఐటీ విద్యార్థులు కాగా, మరో ఇద్దరు ఎన్ఐటీకి చెందిన విద్యార్థులు. వీరిలో నలుగురు మహారాష్ట్ర, మిగిలిన ఆరుగురు తెలంగాణ, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు చెందినవారు. మరో 21 మంది 99.9 పర్సంటైల్ సాధించగా, ఇందులో 19 మంది ఇంజనీరింగ్ నేపథ్యమున్న వారే కావడం గమనార్హం. వరంగల్ నిట్ విద్యార్థులు క్యాట్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. -
రూ.52 లక్షల వార్షిక వేతనం!
కోజికోడ్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్–కోజికోడ్ (ఐఐఎం–కే) విద్యార్థులను భారీ ఆఫర్స్ వరించాయి. ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఓ విద్యార్థికి అత్యధికంగా ఏడాదికి రూ.52లక్షల వేతనం ఇచ్చేందుకు ఓ సంస్థ ముందుకు రాగా మొత్తం విద్యార్థుల సరాసరి వేతనం రూ.17.76 లక్షలుగా ఉందని ఐఐఎం(కే) ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ఏడాది 382 మంది విద్యార్థుల బ్యాచ్‌లో అత్యధికంగా 367 మందిని డెలాయిట్, బీసీజీ, ఈవై, గోల్డ్‌మన్ సాక్స్, పీడబ్ల్యూసీ, ఆర్థర్ డీ లిటిల్, జేపీ మోర్గాన్ చేజ్ వంటి ప్రముఖ సంస్థలు ఎంపిక చేసుకున్నాయని తెలిపింది. మిగతా వారిలో 11 మంది ప్లేస్మెంట్ ప్రక్రియలో పాల్గొనలేదనీ, నలుగురు మాత్రం ఎంపిక కాలేదని వెల్లడించింది. ఈ ఏడాది క్యాంపస్ ఎంపికలకు అత్యధికంగా 178 కంపెనీలు పాల్గొన్నాయనీ, ఇది గత ఏడాది కంటే 58శాతం ఎక్కువని ఐఐటీ–కే తెలిపింది. -
ఐఐఎంలో పీజీ ఫీజు రూ.22 లక్షలు
అహ్మదాబాద్: అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం–ఏ)లో పోస్టుగ్రాడ్యుయేషన్ ఫీజు పెరిగింది. 2018–20 బ్యాచ్‌కు గాను రూ.21లక్షల నుంచి రూ.22 లక్షలకు పెంచుతున్నట్లు ఐఐఎం డైరెక్టర్ డీసౌజా తెలిపారు. శనివారం ఐఐఎం బోర్డు సభ్యులు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారన్నారు. గతేడాది రూ.19.5 లక్షలున్న ఫీజును 21 లక్షలకు పెంచారు. ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఫీజును ఏడాదికి 5 శాతం చొప్పున పెంచుతున్నట్లు తెలిపారు. పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రాం ఫర్ ఎగ్జిక్యూటివ్స్ ఫీజులో 5శాతం పెరుగుదల ఉంటుందన్నారు. -
ఐఐఎం ఏర్పాటు చేయండి
కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కడియం విజ్ఞప్తి న్యూఢిల్లీ: రాష్ర్టంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని కేంద్ర మాన వవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీ సీతారాం నాయక్‌తో కలసి ఆయన స్మృతి ఇరానీకి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఐఐఎం ఏర్పాటుకు సంబంధించి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఐఐఎం ఏర్పాటు వీలు పడదని, వచ్చే విద్యాసంవత్సరంలో పరిశీలిస్తామని హామీ ఇచ్చినట్లు కడియం శ్రీహరి తెలిపారు. భువనగిరిలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై కూడా పరిశీలిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. దత్తాత్రేయతో కడియం భేటీ కడియం శ్రీహరి శ్రమశక్తి భవన్లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో భేటీ అయ్యారు. ఐఐఎం ఏర్పాటు, వరంగల్‌లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, సైనిక్ స్కూల్, ఖాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటుపై కేంద్రంతో సంప్రదించాలని కోరారు. అందుకు తన వంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ, ఏపీకి రెండు హైకోర్టులు ఉండాలని, ఆ దిశగా చర్యలు చేపడుతోందని దత్తాత్రేయ తెలిపారు. అనంతరం కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలసి వరంగల్‌లో సైనిక్ స్కూల్ ఏర్పాటు అంశంపై చర్చించారు. వారం రోజుల్లో అనుమతి ఉత్తర్వుల జారీకి హామీ ఇచ్చినట్లు కడియం తెలిపారు. ఆయన వెంట ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు రామచంద్రు తెజావత్, వేణుగోపాలాచారి తదితరులు ఉన్నారు. -
గంభీరం వెనుక గంటా మౌనం
ఒక్కసారీ చర్చలకు పిలువని ‘గంటా’ మంత్రి తీరుపై గుర్రుగా ఉన్న బాధిత రైతులు వివాదస్పదమవుతున్న ఐఐఎం భూముల సేకరణ సమాన పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్ విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) ఏర్పాటు కోసం తలపెట్టిన భూ సేకరణ వివాదస్పదమవుతోంది. ఈ భూముల వ్యవహారంలో పట్టాదారులతో సమానంగా ఆక్రమితరైతులకు పరిహారం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా సాగుతున్న ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. సొంత నియోజకవర్గంలో నెలకొన్న సమస్య పరిష్కారంలో రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాస రావు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఒక్కసారి కూడా చర్చలకు పిలవకుండా వ్యవహారాన్ని కావాలనే తాత్సారం చేస్తున్నారంటూ మంత్రిపై బాధిత రైతులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ముందు ఆక్రమిత రైతులందరికీ పట్టాలు ఇస్తామని ఇప్పుడు కనీసం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కోవాలని చూస్తేఊరుకోబోమని వీరంతా హెచ్చరిస్తున్నారు. ఆనందపురం మండలం గంభీరంలో సర్వే నెంబర్ 68లో 291.53 ఎకరాలు, సర్వేనెంబర్ 88లో 144.85 ఎకరాలు, సర్వే నెంబర్- 71లో మరో11ఎకరాల భూములున్నాయి. వీటిలో 31.29 ఎకరాలకు 19 మందికి గతంలో డి-ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ రెండు సర్వేల్లో సుమారు 150 ఎకరాలకు పైగా భూములను సుమారు వందమంది రైతులు దశాబ్దాలుగా ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ జీవనం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో సర్వే నెంబర్ 68, 88లలో డి.ఫారం పట్టాలిచ్చిన వాటితో రైతుల ఆక్రమణలో ఉన్న భూముల్లో 388.48 ఎకరాలను ఐఐఎం ఏర్పాటు కోసం కేటాయించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానితో ఈ నెల 5వ తేదీన శంకుస్థాపన చేయాలని తలపెట్టగా చివరి నిముషంలో మంత్రి పర్యటన రద్దవడంతో వాయిదా పడింది. కనీసం భూముల స్వాధీన ప్రక్రియ పూర్తికాకుండా ఏ విధంగా శంఖుస్థాపన చేయడం వలన వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనే వాదన వస్తోంది. రైతుల ఆందోళనకు బయపడే వాయిదా వేయించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి. పట్టాభూముదారులకే పరిహారం డి.ఫారం పట్టా కలిగిన 19 మంది రైతులకు వారి ఆక్రమణలో ఉన్న 31.29 ఎకరాలకు ఎకరాకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. కాగా మిగిలిన ఆక్రమణదారులకు మాత్రం రిలీ్ఫ్ అండ్ రిహేబిటేషన్ (ఆర్ అండ్ ఆర్) కింద ఎకరాకు రూ.2.5లక్షలకు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. అసలు ఆక్రమిత దారులకు పరిహారం ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదని..అయినా సరే ఏళ్ల తరబడి సాగు చేసిన రైతులు నష్టపోకూడదన్న భావనతోనే నిబంధనలను పక్కన పెట్టి మరీ పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఆక్రమి రైతులు పట్టువీడకపోవడం సరికాదని విశాఖ ఆర్డీఒ నాగవెంకటమురళి చెప్పుకొచ్చారు. ఇప్పటికే తహశీల్దార్, ఆర్డీఒ స్థాయిలో చర్చలకు ఆహ్వానించినా రైతులు రాలేదని ఆయన చెప్పారు. అందరికి ఒకే రీతిలో పరిహారం ఇస్తామంటేనే తాము చర్చలకు వస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు. అంతవరకు భూముల్లో అడుగుపెట్టనీయబోమని చెబుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే రాష్ర్టమంత్రి గంటా బాధిత రైతులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిం చాలని లేకుంటే ఈ ప్రభావం ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుపై పడి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
‘క్యాట్’ రిజిస్ట్రేషన్లకు అక్టోబర్ 10న అవకాశం
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లు, ప్రముఖ బిజినెస్ స్కూళ్లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్)-2014 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, దరఖాస్తుల ప్రక్రియకు అక్టోబర్ 10న అవకాశం ఉంది. ఈ ఏడాది క్యాట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఆగస్టు 6 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సి ఉండగా మధ్యలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీంతో ఒకరోజు ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నేపథ్యంలో అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 10న రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించాలని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-ఇండోర్ నిర్ణయించింది. గతేడాది క్యాట్‌కు 1.93 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి ఇప్పటివరకు 1.89 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. కామన్ అడ్మిషన్ టెస్ట్ నవంబర్ 16, నవంబర్ 22న ఉదయం, మధ్యాహ్నం.. రెండు సెషన్లుగా జరగనుంది. ఫలితాలు డిసెంబర్ మూడో వారంలో వెలువడే అవకాశాలున్నాయి. వివరాలకు వెబ్సైట్: https://iimcat.ac.in/ -
క్యాంపస్ అంబాసిడర్ - పి. నరహరి- ఐఐఎం - ఇండోర్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) - ఇండోర్. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ సంస్థ.. ఏ ఐఐఎంలోనూ లేని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్‌ను ఇంటర్మీడియెట్ అర్హతతోనే అందిస్తోంది. ఇక్కడ సెకండియర్ పీజీపీ చదువుతున్న పాయల నరహరి.. ఆరుగురు విద్యార్థులు మాత్రమే ఉండే ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. స్పోర్ట్స్ కమిటీ సెక్రటరీగా కూడా ఉన్న ఆయన తన క్యాంపస్ లైఫ్‌ను పంచుకుంటున్నారిలా... క్యాంపస్ అద్భుతం మా ఊరు చిత్తూరు జిల్లాలోని పాయలవారిపల్లి. క్యాంపస్.. దాదాపు 200 ఎకరాల్లో ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్పరంగా.. ఆడిటోరియం, లైబ్రరీ, క్యాంటీన్, హాస్టళ్లు, ల్యాబ్ లు, ప్లే గ్రౌండ్స్, ఇంక్యుబేషన్ సెంటర్ అత్యుత్తమ స్థాయిలో ఉంటాయి. రెండేళ్లకు కలిపి కోర్సు ఫీజు రూ.15 లక్షలు. ప్రతి రోజూ ఉదయం 8.45 నుంచి రాత్రి 11.30 వరకు క్లాసులు, ఇండస్ట్రియల్ లెక్చర్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్.. ఇలా ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొంటాం. ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు రెండేళ్ల పోస్ట్‌గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్లో భాగంగా.. మొదటి ఏడాది అందరికీ కామన్‌గా ఉంటుంది. రెండో ఏడాదిలో ఎన్నో ఎలక్టివ్స్ అందుబాటులో ఉంటా యి. గవర్నెన్స్, స్ట్రాటజీ, ఆపరేషన్స్, ఫైనా న్స్.. ఇలా ఎన్నింటినో ఎంచుకోవచ్చు. భవిష్యత్తులో ఒక కంపెనీ మేనేజర్‌కు కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్‌పర్సనల్ స్కిల్స్, నాయకత్వ నైపుణ్యాలను నేర్పిస్తారు. కోర్సులో భాగంగా ఇండస్ట్రీ విజిట్స్, లైవ్ ప్రాజెక్టులు ఉంటాయి. కేస్ స్టడీస్‌కు ఎక్కువ ప్రాధాన్యం అసైన్మెంట్లు, ప్రాజెక్టులు, గ్రూప్ డిస్కషన్స్ కోర్సులో భాగంగా ఉంటాయి. లెక్చర్తోపాటే ఆయా అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ఎక్కువగా వివిధ కంపెనీల పరాజయాలను కేస్ స్టడీస్‌గా ఎంచుకుంటాం. సంబంధిత కంపెనీ చేపట్టిన స్కీమ్ ఎందుకు ఫెయిల్ అయింది? అందుకు దారితీసిన కారణాలేమిటి? ఎక్కడ లోపాలు దొర్లాయి? ఎలా చేసి ఉంటే విజయవంతమయ్యేది? ఇలా సమస్యను విశ్లేషించి పరిష్కారం సూచిస్తాం. కలెక్టర్‌కు నివేదిక ఇవ్వాలి ఐఐఎం- ఇండోర్‌లో మరో అద్భుత కార్యక్రమం.. రూరల్ ఇమ్మర్షన్ ప్రోగ్రామ్. ఇందులో భాగంగా ఒక్కో విద్యార్థుల గ్రూప్‌కు ఒక్కో జిల్లా కేటాయిస్తారు. విద్యార్థుల బృందం.. ఆ జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ పథకాలు ప్రజలకు సరిగా అందుతున్నాయా? లేదా? ఏమైనా సమస్యలు ఉన్నాయా? పరిష్కార మార్గాలు.. ఇలా అధ్యయనం చేసి ఒక నివేదికను సంబంధిత జిల్లా కలెక్టరుకు ఇవ్వాలి. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్.. మన తెలుగు విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సును అత్యుత్తమ కెరీర్ ఆప్షన్‌గా భావించాలి. కోర్సులో చేరితే మంచి భవిష్యత్ సొంతం చేసుకోవచ్చు. చిన్నవయసులోనే మంచి ఎక్స్పోజర్ ఈ కోర్సు ద్వారా లభిస్తుంది. ప్రభుత్వాలు చేపట్టే వివిధ పథకాల అమలు, ప్రజలకు పథకాల లబ్ధి చేరడం కోసం ప్రభుత్వం మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటే మంచిదని నా అభిప్రాయం. -
మూడు సంస్థల సంయుక్త పీజీ ప్రోగ్రామ్
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-కలకత్తా, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)-ఖరగ్‌పూర్, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ (ఐఎస్ ఐ)-కోల్‌కతా.. ఈ మూడు ప్రఖ్యాత సంస్థలు కలిసి సంయుక్తంగా బిజినెస్ అనలిటిక్స్‌లో పోస్టుగ్రాడ్యుయేట్(పీజీ) ప్రోగ్రామ్‌ను ఆఫర్ చేయనున్నాయి. రెండేళ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సు వచ్చే ఏడాది జూలైలో ప్రారంభం కానుంది. తాజా ప్రతిపాదనకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఇప్పటికే ఆమోదముద్ర వేసింది. కొత్త కోర్సుకు ఇంకా పేరును ఖరారు చేయలేదు. మూడు సంస్థలు కలిసి కరిక్యులమ్‌ను రూపొందిస్తాయి. కోర్స్ కంటెంట్‌లో మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, టెక్నాల జీ కాంబినేషన్ సబ్జెక్ట్‌లు ఉంటాయి. కోర్సును విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులకు మూడు సంస్థలు సంయుక్తంగా డిగ్రీని ప్రదానం చేస్తాయి. తాజా ప్రోగ్రామ్ ద్వారా వ్యాపార నిర్వహణకు అవసరమైన అన్ని నైపుణ్యాలను నేర్చుకోవచ్చని ఐఐఎం-కలకత్తా వర్గాలు తెలిపాయి. ఈ పోస్టుగ్రాడ్యుయేట్ (పీజీ) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ప్రత్యేకమైన అడ్మిషన్ విధానం, ఎంట్రెన్స్ ఉంటుంది. అభ్యర్థుల గణాంక నైపుణ్యాలను పరీక్షించేలా ఈ పరీక్షను రూపొందిస్తారు. రెండేళ్ల కోర్సును నాలుగు సెమిస్టర్లుగా విభజించారు. విద్యార్థులు మొదటి మూడు సెమిస్టర్లలో.. ఒక్కో సంస్థలో ఒక్కో సెమిస్టర్‌ను అభ్యసిం చాలి. మూడు సంస్థలు కోర్స్ కరిక్యులమ్‌లో తమ వంతు భాగాన్ని బోధిస్తాయి. నాలుగో సెమిస్టర్‌ను పరిశ్రమలో ఇంటర్న్‌షిప్ ద్వారా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఐఐఎం-అహ్మదాబాద్లోజాయ్ ఆఫ్ గివింగ్ వీక్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-అహ్మదాబాద్‌లో ప్రతిఏటా నిర్వహిస్తున్నట్లుగానే ఈ ఏడాది కూడా ‘జాయ్ ఆఫ్ గివింగ్ వీక్’ అక్టోబర్ 6 నుంచి 12 వరకు జరగనుంది. ఇందులో విష్ ట్రీ, క్లాథ్స్ కలెక్షన్ డ్రైవ్, ఏ డే ఎట్ ఐఐఎంఏ వంటి కార్యక్రమా లుంటాయి. ఇతర ప్రాంతాల విద్యార్థులు ఇందులో పాల్గొనొచ్చు. ఒక రోజంతా క్యాంపస్ లోనే గడపొచ్చు. ఐఐఎంఏ విద్యార్థులు, ప్రొఫె సర్లతో భేటీ కావొచ్చు. క్విజ్లు, క్లబ్ ఇంటరాక్ష న్స్ వంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అ య్యేందుకు అవకాశం ఉంది. జాయ్ ఆఫ్ గివింగ్ వీక్ పాల్గొనాలనుకునే ఔత్సాహికులు ఇప్పటినుంచే దరఖాస్తు చేసుకోవచ్చు. -
వేగం, కచ్చితత్వమే..విజయ సాధనాలు..
దేశంలో మేనేజ్మెంట్ విద్యకు తలమానికంగా పరిగణించే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్)కు యువతలో ఎంతో ఆదరణ ఉంది.. గతంతో పోల్చితే కొన్ని మార్పులతో సరికొత్త విధానంలో ఈ సారి క్యాట్‌ను నిర్వహించనున్నారు.. ఈ పరీక్షకు మరో ఎనిమిది వారాల సమయం మిగిలి ఉన్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాలు అనుసరించాలి.. ఏయే అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి..గత విజేతల సూచనలు, తదితర అంశాలపై విశ్లేషణ.. గతంలో క్యాట్ పరీక్షలో ఎక్కువ సంఖ్యలో స్లాట్లు ఉండేవి. కానీ ఈ సారి కేవలం రెండు రోజుల్లో ప్రతి రోజూ రెండు స్లాట్లలో పరీక్షను నిర్వహిస్తున్నారు. మొత్తం నాలుగు స్లాట్లలో పరీక్ష జరుగుతుంది. దాంతో గతంలో మాదిరిగా ప్రశ్నల పునరావృతం, నార్మలైజేషన్, స్కేలింగ్ వంటి ఇబ్బందులు ఈసారి తలెత్తకపోవచ్చు. పెరిగిన ప్రశ్నలు-తగ్గిన సమయం: గతంలో మాదిరిగానే ఈసారి కూడా రెండు విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అవి. 1. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్ 2. లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీ. కాకపోతే ప్రశ్నల సంఖ్య, కేటాయించిన సమయంలో మార్పులు చోటు చేసుకున్నాయి. సవరించిన విధానం మేరకు ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు వస్తాయి. ఇందుకు కేటాయించిన సమయం 170 నిమిషాలు. గతంలో రెండు విభాగాల్లో కలిపి 60 ప్రశ్నలు వచ్చేవి (30 ప్రశ్నల చొప్పున). ఇందుకు సమయం 140 నిమిషాలు ఉండేది. అంటే ప్రశ్నల సంఖ్యను 60 నుంచి 100కు పెంచారు. అదనంగా 30 నిమిషాల సమయం కేటాయించారు. అంటే పెరిగిన ప్రశ్నల స్థాయిలో సమయాన్ని మాత్రం కేటాయించకపోడం గమనించాల్సిన కీలక అంశం. అంటే కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుంది. అంతేకాకుండా గతంతో పోల్చితే వేగంగా, కచ్చితత్వంతో ప్రశ్నలను సాధించాల్సి ఉంటుంది. మెరుగైన స్కోర్ సాధనలో ఈ రెండు అంశాలే కీలకపాత్ర పోషిస్తాయని చెప్పొచ్చు. స్వేచ్ఛ-అదనంగా నెల: గతంలో ప్రతి విభాగానికి నిర్దిష్ట సమయం అంటూ ఉండేది. కానీ తాజా మార్పుల నేపథ్యంలో అభ్యర్థులు తన ప్రాధాన్యం మేరకు ఏ విభాగాన్నైనా ఎంతసేపయినా చేయొచ్చు. ఈ అంశాన్ని తెలివిగా సద్వినియోగం చేసుకోవాలి. పట్టున్న అంశంలో ఎక్కువ స్కోర్ చేసేందుకు దీన్ని అవకాశంగా మలుచుకోవాలి. గత కొంత కాలం నుంచి క్యాట్ పరీక్షను అక్టోబర్‌లో నిర్వహిస్తూ వచ్చారు. కానీ ఈసారి క్యాట్ నవంబర్‌లో జరుగుతుంది. అంటే ప్రిపరేషన్‌కు అదనంగా నెల రోజుల సమయం అందుబాటులోకి వచ్చింది. 50 రోజులకు పైగా: క్యాట్ పరీక్షకు ఎనిమిది వారాలు అందే దాదాపు 50 రోజులకు పైగా సమయం మిగిలి ఉంటుంది. ఈ సమయంలో చదవడం, ప్రాక్టీస్ చేయడం, ప్రిపరేషన్తీరు విశ్లేషణ వంటి అంశాలకు ప్రాముఖ్యతనివ్వాలి. అదే సమయంలో ఆయా అంశాలకు సంబంధించిన ప్రాథమిక భావనలపై గట్టి పట్టు సాధించాలి. ఎందుకంటే క్యాట్ పరీక్ష సరళిని పరిశీలిస్తే.. ప్రశ్నలన్నీ దాదాపుగా ప్రాథమిక భావనలపైనే ఉంటున్నాయి. అంతేకాకుండా బలాలు, బలహీనతలను విశ్లేషించుకోవాలి. పట్టులేని అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ప్రయోజనకరం. ఇందులో మెరుగైన స్కోర్ చేయకున్నా ప్రశ్నల సరళి, ప్రిపరేషన్ తీరుపై ఒక అంచనా వస్తుంది. తదనుగుణంగా ప్రిపరేషన్ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఏయే అంశాలకు: గతా ప్రశ్నపత్రాల ఆధారంగా క్యాట్‌లో ఏయే అంశాలకు ప్రాధాన్యత లభిస్తుందనే విషయంలో స్పష్టత వస్తుంది. అయితే ప్రస్తుత విధానంలో ప్రతి విభాగం నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ప్రశ్నలను సాధించడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో మోడ్రన్ మ్యాథమెటిక్స్ను విస్మరించకూడదు. ఎందుకంటే సులువైనవి అనే ఉద్దేశంతో అర్థమెటిక్, ఆల్జీబ్రా అంశాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. అయితే ఈ అంశాల నుంచి ప్రశ్నలు తక్కువగా వస్తాయనే విషయాన్ని గమనించాలి. కాబట్టి మొత్తంగా స్కోరింగ్ ప్రభావితం కావచ్చు. విభాగాల వారీగా: నిర్దిష్ట ప్రణాళిక, ఆచరణ ఉంటే క్యాట్‌లో విజయం సాధించడం సులభమే. విభాగాల వారీగా మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది. తద్వారా ఆయా విభాగాల్లోని అంశాల్లో మీ ప్రిపరేషన్ తీరు ఏవిధంగా ఉందో తెలుసుకునే అవకాశం లభిస్తుంది. చివరి నెల: చివరి నెల పూర్తిగా పునశ్చరణకు కేటాయించాలి. కొత్తగా ఎటువంటి టాపిక్ చదవకపోవడమే మంచిది. ఈ సమయంలో పునశ్చరణను వారాలు, రోజుల వారీగా విభజించుకోవాలి. ఒకే అంశ ంపై ఎక్కువ సమయం వెచ్చించడం కంటే అన్ని అంశాలకు ప్రాధాన్యతనివ్వడం ప్రయోజనకరం. అంతేకాకుండా ప్రిపరేషన్ తీరును విశ్లేషించుకోవాలి. ఇందుకోసం మాక్ టెస్ట్‌లను ఉపయోగించుకోవాలి. వీటి ఫలితాలను విశ్లేషించుకోవడానికి కూడా తగిన సమయం కేటాయించాలి. స్కోరింగ్, బలాలు, వేగం, సాధించిన విధానం, ప్రశ్నల సరళి వంటి అంశాలాధారంగా మాక్ టెస్ట్ ఫలితాలను విశ్లేషించుకోవాలి. సాధించే విధంగా: క్యాట్ పరీక్షలో ప్రశ్న ఏవిధంగా వచ్చినా దాన్ని సాధించే విధంగా సిద్ధం కావాలి. ఇటువంటి పరీక్షల్లో ఒక సారి ఇచ్చిన ప్రశ్ననే కోణాన్ని మార్చి భిన్నంగా అడుగుతారు. కాబట్టి ప్రాథమిక భావనలపై పట్టు ఉంటే ప్రశ్న ఏ కోణంలో వచ్చినా సాధించవచ్చు. కనీసం రోజుకు నాలుగు గంటలు చదవాలి. ఏ విభాగానికి ఎక్కువ సమయం కేటాయించామనేది దాని కంటే అన్ని విభాగాల ప్రిపరేషన్‌కు సమయం సమంగా ఉండేలా చూసుకోవాలి. నెగిటివ్ మార్కింగ్: కొత్త విధానంలో నిర్వహిస్తున్నారు. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కచ్చితత్వం కీలక పాత్రను పోషిస్తుంది. నార్మలైజేషన్ పద్ధతిలో సులువైన ప్రశ్నకు తప్పు చేస్తే నెగిటివ్ మార్కింగ్ ఎక్కువగా ఉంటుంది. అందుకే కచ్చితత్వానికి ప్రాధాన్యం ఇవ్వాలి. చివరి ఎనిమిది వారాలు బలహీనంగా ఉన్న అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పరీక్షకు ఏడాది సమయం ఉన్నా, ఒక రోజు మిగిలి ఉన్నా.. పట్టు లేని అంశాలపై దృష్టి సారించడం మంచిది. సాధ్యమైనంత వరకు ఆ అంశాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష తేదీని పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుతం సమయం తక్కువగా ఉంది. కాబట్టి ప్రస్తుత ప్రిపరేషన్ స్థాయిని రెండింతలు చేయాలి.క్యాట్ అన్ని విభాగాలు కీలకమైనవే. ఏదో ఒక విభాగం ప్రత్యేకం అని చెప్పాలేం. అడిగే ప్రశ్నలు కూడా అందరూ భావిస్తున్నట్లుగా మరీ క్లిష్టంగా ఉండవు. ఆయా అంశాలపై ప్రాథమిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా సులభమైన ప్రశ్నలు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు వాటిని పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే సాధించడం ప్రయోజనకరం. ఏవైనా ప్రశ్నలు మిగిలి ఉంటే వాటిని చివరగా ప్రయత్నించాలి. క్యాట్ వంటి పరీక్షలకు సిద్ధమయ్యే క్రమంలో మాక్ టెస్ట్‌లు ఎక్కువ ప్రయోజనంగా ఉంటాయి. ఎందుకంటే మన ప్రిపరేషన్ స్థాయిని తెలుసుకోవడానికి మాక్ టెస్ట్‌లకు మించిన సాధనం మరొకటి లేదు. తద్వారా ఏయే అంశాల్లో మెరుగవ్వాలో అనే విషయంపై స్పష్టత వస్తుంది. పరీక్ష రాసిన ప్రతి సారి ఫలితాలను విశ్లేషించుకోవాలి. ఏ ప్రశ్నను ప్రయత్నించలేదు, ఏ ప్రశ్నకు తప్పు సమాధానం ఇచ్చారు, ఎందుకు తప్పు సమాధానం గుర్తించారు వంటి అంశాల ప్రాతిపదికగా మాక్ టెస్ట్‌ల ఫలితాలను మూల్యాంకనం చేసుకోవాలి. ఆ ప్రశ్నలు ఏ అంశాలకు సంబంధించినవో గుర్తించి.. వాటికి ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. అప్పుడే మెరుగైన స్కోర్ సాధించవచ్చు.గతంలో విభాగాల వారీగా నిర్దిష్ట సమయం ఉండేది. కానీ ప్రస్తుతం ఈ నిబంధనను సవరించారు. కాబట్టి మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ద్వారా మాత్రమే క్యాట్‌లో ఏవిధంగా సమయపాలన పాటించవచ్చు అనే అంశంపై స్పష్టత వస్తుంది. ఈ విషయంలో మాక్ టెస్ట్‌లను ప్రామాణికంగా తీసుకోవడం మేలు. క్యాట్ నిర్వహణలో తీసుకువచ్చిన నూతన మార్పులు ఆసక్తికరంగా ఉన్నాయి. గతంలో నేను పరీక్ష రాసినప్పుడు ఇంగ్లిష్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలను నిర్దిష్ట సమయం కంటే ముందే పూర్తి చేశాను. కానీ మ్యాథమెటిక్స్ విభాగంలో అన్ని ప్రశ్నలను ప్రయత్నించడానికి సమయం సరిపోలేదు. సవరించిన నిబంధనల మేరకు మీ ప్రాధాన్యత మేరకు విభాగాల వారీగా సమయాన్ని కేటాయించుకునే స్వేచ్ఛ లభిస్తుంది. కాకపోతే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ స్వేచ్ఛ కొంత కఠినమైంది. ఎందుకంటే పెరిగిన ప్రశ్నలతో చూస్తే కేటాయించిన సమయం తక్కువ. కాబట్టి ప్రశ్నల ఎంపికలో తెలివిగా వ్యవహరించాలి. ప్రిపరేషన్లో కానీ, పరీక్షలో కానీ మెరుగైన స్కోర్ ఏ విధంగా సాధించాలి? అనే అంశంపైనే మన ధ్యాసంతా ఉండాలి. దానికనుగుణంగా వ్యూహాలు రూపొందించుకోవాలి. అప్పుడే మంచి పర్సంటైల్ సాధ్యమవుతుంది. -కృష్ణ కౌండిన్య, క్యాట్-2103, 100 పర్సంటైల్ స్కోరర్. క్యాట్ పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం అనే అంశాలు కీలక సాధనాలు. చివరి ఎనిమిది వారాలు సాధ్యమైనంత వరకు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ క్రమంలో సులభమైన ప్రశ్నలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవాలి. నూతన విధానంలో ఈ సామర్థ్యం నిర్ణయాత్మక పాత్ర పోషించవచ్చు. ముఖ్యమైనవి అని భావించే అంశాలు, ప్రశ్నలపై అధికంగా దృష్టి సారించాలి. వారానికి కనీసం రెండు మాక్ టెస్ట్‌లకైనా హాజరు కావాలి. పరీక్షలో చివర్లో చేద్దామనే ఉద్దేశంతో చాలా ప్రశ్నలను వదిలేయవడం సమంజసం కాదు. అన్నిటి కంటే రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా కీలకమైంది. కాబట్టి ఇందులో మెరుగైన స్కోర్ సాధించేందుకు వీలుగా రీడింగ్ స్కిల్స్‌ను మెరుగుపరుచుకోవాలి. నూతన విధానంలో క్యాట్‌ను నిర్వహిస్తున్నారు. కాబట్టి రెండు విభాగాల్లో కటాఫ్‌ను చేరుకోవడం ప్రధానం. అయితే అదే సమయంలో పట్టు ఉన్న విభాగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది.మాక్ టెస్ట్లనేవి చాలా కీలకం. కాకపోతే వీటికి సంబంధించి.. సాధించిన, సాధించని ప్రశ్నల విషయంలో ఎన్నో అంశాలను గమనించాల్సి ఉంటుంది. సాధించని ప్రశ్నల విషయానికొస్తే.. వాటికి సంబంధించిన కొత్త భావనలను నేర్చుకోవాలి. సాధించిన వాటి విషయంలో.. ఉదాహరణకు ఒక కఠినమైన ప్రశ్నకు సమాధానాన్ని గుర్తించడానికి నాలుగు నిమిషాల పడితే.. ఆ అంశంలో ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని గమనించాలి. దాన్ని నిమిషంలో సాధించేలా ప్రిపరేషన్‌ను సాగించాలి. నూతన విధానంలో మొదటి సారి క్యాట్‌ను నిర్వహిస్తున్నారు. కాబట్టి పరీక్షలో పాటించాల్సిన సమయపాలనపై ఒక అంచనాకు రావడానికి మాక్ టెస్ట్‌లే మెరుగైన మార్గం. కాకపోతే క్యాట్ పరీక్ష ఎప్పుడూ అభ్యర్థులను ఆలోచనకు, ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. కాబట్టి అటువంటి వాటికి సిద్ధంగా ఉండడం మంచిది. అభ్యర్థులు తమకు పట్టు ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే అవకాశాన్ని ఈ నూతన విధానం కల్పిస్తుంది. కాబట్టి మెరుగైన స్కోర్ సాధించడంలో ఈ అంశం కీలకపాత్ర పోషించవచ్చు. ఎప్పుడు టాప్ స్కోర్ సాధించాలనే లక్ష్యంతో ఉండాలి. మాక్ టెస్ట్‌లు కీలకమే. కాకపోతే వాటి ఫలితాలతో నిరుత్సాహం చెందకూడదు. వాటిని నేర్చుకోవడానికి ఒక మంచి మాధ్యమంగా మాత్రమే భావించాలి. వాటి ఆధారంగా ప్రిపరేషన్ స్థాయి పెంచుకోవాలి. అప్పుడే మెరుగైన స్కోర్ సాధ్యమవుతుంది. -కుమార్ కార్తీక్, క్యాట్-2103, 100 పర్సంటైల్ స్కోరర్, ఐఐఎం-కోల్‌కతా. -
ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వండి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 100 నుంచి 300 ఎకరాల్లోపు ప్రభుత్వ భూముల వివరాలు ఈనెల 26వ తేదీలోపు అందించాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లాలోని ముగ్గురు ఆర్డీఓలు, 56 మంది తహసీల్దార్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీమాంధ్రలో కీలకమైన యూనివర్శిటీలను స్థాపించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఐఐటీ, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లను ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు 100 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో మండలాల్లో త్వరితగతిన భూములను గుర్తించి వెంటనే నివేదికలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మండలాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలున్నాయి, అసైన్డ్ భూమిలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంత ఖాళీగా ఉంది, ఎన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయో నెలాఖరులోపు వివరాలు అందించాలని ఆదేశించారు. ఆర్ఎస్ఆర్ యాక్ట్ కింద డివిజన్ల వారీగా ఎన్ని ఎకరాలున్నాయి, వాటిలో పట్టా భూములు ఎంత ఉన్నాయో నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా ఆక్రమణలకు గురైనట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రభుత్వం కోటి 40 లక్షల రూపాయలు విడుదల చేసిందన్నారు. మీ సేవ కేంద్రాల్లో 9070 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వరుసగా ఎన్నికలు రావడంతో అర్జీల సంఖ్య పెరిగిపోయిందన్నారు. త్వరితగతిన మీ సేవ కేంద్రాల్లోని అర్జీలను పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్ సెల్లో అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు. ఒంగోలు డివిజన్లో 1354, కందుకూరు డివిజన్లో 1149, మార్కాపురం డివిజన్లో 573 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని యాకూబ్ నాయక్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి రంగాకుమారి పాల్గొన్నారు. -
వార్షిక వేతనం రూ.32 లక్షలు!
ఐఐఎం-ఇండోర్ గ్రాడ్యుయేట్‌కు దక్కిన అదృష్టం ఇండోర్: సంవత్సరానికి ముప్పై రెండు లక్షల రూపాయలు... ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)-ఇండోర్‌కు చెందిన విద్యార్థికి ఓ భారతీయ కంపెనీ ఆఫర్ చేసిన వార్షిక వేతనమిదీ. అయితే ఇది గతేడాది ఇదే సంస్థకు చెందిన విద్యార్థికి ఆఫర్ చేసిన మొత్తం కంటే రూ.రెండు లక్షలు తక్కువ కావడం గమనార్హం. ఐఐఎం-ఇండోర్‌లో నిర్వహించిన ప్లేస్మెంట్ కార్యక్రమంలో 2012-14 బ్యాచ్‌కు చెందిన ఓ విద్యార్థికి రూ.32 లక్షల వార్షిక వేతనాన్ని భారతీయ కంపెనీ ఒకటి ఆఫర్ చేసినట్టు సంస్థ ప్రతినిధి ఒకరు ఆదివారం తెలిపారు. సదరు కంపెనీ వివరాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. 2012-14 బ్యాచ్‌కు చెందిన మొత్తం 475 మందికి కూడా తాజా ప్లేస్మెంట్ ప్రోగ్రాంలో ఉద్యోగాలు లభించినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారికి దక్కిన సగటు వార్షిక ప్యాకేజీ రూ.12.13 లక్షలని వివరించారు. -
మనోళ్లు మెరిశారు
* ‘క్యాట్’లో ముగ్గురికి 100 పర్సంటైల్ * ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్న తేజ, కృష్ణ సాక్షి, హైదరాబాద్, కాకినాడ/సామర్లకోట, న్యూస్‌లైన్: ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)లలో ప్రవేశం కోసం గత ఏడాది నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష (క్యాట్- 2013) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఐఐఎం ఇండోర్ విడుదల చేసిన ఈ ఫలితాల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురికి 100 పర్సంటైల్ లభించింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట యువకుడు తోటకూర శివసూర్యతేజ, హైదరాబాద్ నుంచి పిల్లుట్ల కృష్ణ కౌండిన్య, విజయవాడకు చెందిన ఇమనేని కార్తీక్ కుమార్ 100 పర్సంటైల్‌తో టాపర్లుగా నిలిచారు. వీరితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన మరో ఐదుగురు 100 పర్సంటైల్ సాధించారు. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏలో చేరుతానని శివసూర్య తేజ తెలిపాడు. తేజ ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఇన్ఫోసిస్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. తేజ తండ్రి సాయిరామకృష్ణ గణిత ఉపాధ్యాయుడు. మరో టాపర్ కృష్ణ కౌండిన్య ఐఐటీ ముంబైలో బీటెక్(కంప్యూటర్ సైన్స్) ఫైనలియర్ చదువుతున్నాడు. వీరితో పాటు కాకినాడ జేఎన్టీయూలో కంప్యూటర్ సైన్సు డిగ్రీ ఆఖరి సంవత్సరం చదువుతున్న రాజమండ్రి యువకుడు ద్వారంపూడి యశ్వంత్‌రెడ్డి 99.7 పర్సంటైల్ సాధించగా, కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లికి చెందిన అవిర్నేని సాహితి 99.36 పర్సంటైల్ సాధించింది. దేశవ్యాప్తంగా ఐఐఎంలలో ఉన్న 3,335 ఎంబీఏ సీట్లలో ప్రవేశాల కోసం గత ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబర్ 11 వరకు 40 పట్టణాల్లో నిర్వహించిన క్యాట్ పరీక్షకు 1.94 లక్షల మంది హాజర య్యారు. వివేకానందుడే స్ఫూర్తి ‘ఎటువంటి శిక్షణ లేకుండా, ఆన్లైన్లో కాకినాడలోని టైమ్ ఇనిస్టిట్యూట్ పెట్టిన టెస్టుల సహకారంతో, పట్టుదలతో ఈ విజయం సాధించాను. గతంలో 99 పర్సంటైల్ సాధించినప్పటికీ, అహ్మదాబాద్ ఐఐఎంలో సీటు కోసం మళ్లీ క్యాట్ రాశాను. రాష్ట్రానికి ఆర్థిక సలహాదారు కావాలన్నది నా ఆశయం. అహ్మదాబాద్ ఐఐఎంలో ఎంబీఏ చదవడం ద్వారా ఆర్థిక, రాజకీయ అంశాలతో పాటు దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఆర్థిక సలహాదారు కావడానికి అవసరమైన అంశాలు నేర్చుకోవచ్చు. తరువాత సులభంగా ఐఏఎస్ పూర్తి చేయొచ్చు. మా నాన్న నాకు చదువులో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. వివేకానందుని సూక్తులు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. మంచి పుస్తకాలతో పాటు ఆన్లైన్లో లభించే సమాచారం తెలుసుకోవడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయి. ప్రతి అంశాన్నీ విశ్లేషించి, అధ్యయనం చేయడం ద్వారా విజయం సాధించవచ్చు. మా నాన్న గణిత ఉపాధ్యాయుడు కావడంతో ఇంట్లో అనేక రకాల పుస్తకాలు ఉన్నాయి. నా విజయం వెనుక నా తల్లి సహకారం ఎంతో ఉంది. వారితో పాటు పినతండ్రి గంగాధర్, తమ్ముడి ప్రోత్సాహం ఉంది’ - తోటకూర శివసూర్యతేజ ఇంతకంటే ఆనందమేముంటుంది? ‘తేజ సాధించిన విజయాన్ని మాటల్లో వర్ణించలేను. చిన్నతనం నుంచీ మంచి మార్కులతో పాస్ కావడం వల్ల తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. పదో తరగతిలో మంచి మార్కులు రావడంతో కాకినాడ ‘ఆదిత్య’లో ఉచితంగా సీటు వచ్చింది. అదేవిధంగా ఇంటర్లో మంచి మార్కులు సాధించడంతో ప్రభుత్వ కోటాలో ఇంజనీరింగ్ సీటు వచ్చింది. అలా తేజ చదువుకు ఎక్కువ ఖర్చు చేయవలసిన అవసరం కలగలేదు. నా అభిప్రాయాలను ఎప్పుడూ నా కుమారులపై రుద్దలేదు. వారి ఇష్టం మేరకు చదువు కోవాలని సూచించాను. వారి చదువుకోసం అవసరమైన వాతావరణం కల్పించాం. ఇంట్లో చిన్న గంథాలయం ఉండటం తేజకు బాగా ఉపయోగపడింది’ - తోటకూర సాయిరామకృష్ణ ఐఐఎం అహ్మదాబాద్‌లోనే ‘క్యాట్ 2013లో టాపర్‌గా 100 పర్సంటైల్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. ఐఐఎం అహ్మదాబాద్‌లో ఎంబీఏ చేయాలనుకుంటున్నాను’ - కృష్ణ కౌండిన్య -
శివుడు... గెలిచాడు!
అతడొక పేపర్ బాయ్. ఐదో తరగతి చదువుతున్నప్పటి నుంచి వేపర్ వేస్తున్నాడు. ఒకరోజు అతడి సక్సెస్ స్టోరీ అతడు డెలివరీ చేసే న్యూస్ పేపర్లలో ప్రచురితమైంది! అతన్నొక సెలబ్రిటీని చేసింది. అయితే అదొక అద్భుతంలా జరగలేదు. అతడు పడిన శ్రమకు ప్రతిఫలంగా జరిగింది. ఎన్.శివకుమార్... ఈ యేడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఎంబిఏ ఎంట్రన్స్ కోసం జరిగిన ‘క్యాట్’ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులందరిలోనూ ప్రత్యేకంగా వినిపించిన పేరు. ఎంతోమంది విద్యార్థులు ఐఐఎమ్‌లలో ఎంబిఏ చదివేందుకు అర్హత సాధించినా శివకుమార్ సాధించిన సక్సెస్ మాత్రం ప్రత్యేకమైనదిగా నిలిచింది. అతడి ప్రస్థానం ప్రముఖంగా నిలిచి అతడికొక సెలబ్రిటీ స్టేటస్‌ను ఇచ్చింది. పేపర్‌బాయ్, పేపర్సెల్లర్... ఐఐఎమ్‌లో సీటు సాధించక ముందు వరకు శివకుమార్‌కి ఉన్న హోదా అది! ఈ నేపథ్యమే అతడి విజయానికి మరింత గుర్తింపును తెచ్చిపెట్టింది. అంతా అనుకూలమైన పరిస్థితుల మధ్య ర్యాంకును సాధించడం కాదు, చదువుతో పాటు శ్రమ, శ్రమతో పాటు చదువు ద్వారా శివకుమార్ నిజమైన విజేతగా నిలిచాడు. పేపర్‌బాయ్ నుంచి పేపర్ సెల్లర్‌గా... ఐదోతరగతి నుంచి పదోతరగతి వరకు పేపర్ వేస్తూ వచ్చిన ఇతడు, ఆ తర్వాత సొంతంగా పేపర్ ఏజెన్సీ తీసుకున్నాడు. ఒక పేపర్ బాయ్ న్యూస్‌పేపర్ ఏజెంట్‌గా ఎదగడం అంటే విజయమే! అతడు చూసే ప్రపంచంలో ఉన్నతస్థాయికి ఎదగడమే. అయితే, దాన్నొక అల్పమైన సక్సెస్‌గా భావించాడు శివ. అది తన సంపాదనను కొంతమేర పెంచడానికి ఉపయోగపడుతుందే కానీ, అంతిమ విజయం మాత్రం కాదనుకున్నాడు. చదువు ద్వారానే దాన్ని సాధించవచ్చనుకున్నాడు. సన్నిహితుల సహకారం... స్కాలర్‌షిప్‌లే సాయంగా... మైసూర్ నుంచి బెంగుళూరు వలస వచ్చిన కుటుంబానికి చెందిన శివ ఇంజినీరింగ్ పూర్తిచేయడానికి అనేకమంది సన్నిహితులు సహకరించారు. వారికి తోడు నిమ్నవర్గాల వారికి ప్రభుత్వం ఏడాదికి 20 వేల చొప్పున ఇచ్చే స్కాలర్షిప్ కూడా తన చదువుకు తోడ్పాటును అందించిందని శివ చెప్పాడు. శివ తండ్రి ట్రక్ డ్రైవర్. వీరు గిరిజన వర్గానికి చెందినవారు. ‘నేను సాధించిన దానికి ఎంతమంది ఎంత అభినందిస్తున్నా, నేను వచ్చిన మూలాలను మాత్రం మరవను’ అని శివ చెబుతాడు. కార్పొరేట్ సెక్టార్లో పనిచేయాలి, సివిల్స్ సాధించాలి... ఐఐఎమ్ సాధించగానే మీడియా... ఇంటర్వ్యూల కోసం శివ వెంట పడింది. ఆ సందర్భంలో మీడియా ద్వారా శివ కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక విజ్ఞప్తి చేశాడు. ప్రైవేట్ విద్యాసంస్థలు భారీస్థాయిలో డొనేషన్లు కట్టించుకుంటున్నాయని, దీన్ని నివారించి అందరికీ విద్యను అందుబాటులో ఉంచాలని శివ సీఎం ను కోరాడు. డబ్బు లేకపోవడం వల్ల చదవలేకపోవడంలో ఉన్న బాధేంటో తనకు తెలుసని, తనలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని శివ విజ్ఞప్తి చేశాడు. ఐఐఎమ్ కోల్‌కతాలో ప్రవేశం పొందిన శివ ముందుగా కార్పొరేట్ సెక్టార్లో పనిచేయాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాడు. సివిల్స్ తన తదుపరి లక్ష్యమని శివకుమార్ చెప్పాడు. కార్పొరేట్ సెక్టార్లో పనిచేస్తూ ఐఏఎస్ హోదాలో పబ్లిక్సెక్టార్లోకి ప్రవేశించాలనే ప్రణాళికతో ఉన్నానని శివ వివరించాడు. పట్టుదలే ఆయుధంగా, శ్రమే సంకల్పంగా కలిగి ఉన్న ఇతడి ప్రణాళిక కార్యరూపం దాల్చడం చాలా సులభమే!