గంభీరం వెనుక గంటా మౌనం
ఒక్కసారీ చర్చలకు పిలువని ‘గంటా’
మంత్రి తీరుపై గుర్రుగా ఉన్న బాధిత రైతులు
వివాదస్పదమవుతున్న ఐఐఎం భూముల సేకరణ
సమాన పరిహారం ఇవ్వాలంటూ డిమాండ్
విశాఖపట్నం: ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) ఏర్పాటు కోసం తలపెట్టిన భూ సేకరణ వివాదస్పదమవుతోంది. ఈ భూముల వ్యవహారంలో పట్టాదారులతో సమానంగా ఆక్రమితరైతులకు పరిహారం ఇవ్వాలంటూ గత వారం రోజులుగా సాగుతున్న ఆందోళన రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. సొంత నియోజకవర్గంలో నెలకొన్న సమస్య పరిష్కారంలో రాష్ర్ట మంత్రి గంటా శ్రీనివాస రావు చొరవ చూపడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ఒక్కసారి కూడా చర్చలకు పిలవకుండా వ్యవహారాన్ని కావాలనే తాత్సారం చేస్తున్నారంటూ మంత్రిపై బాధిత రైతులు గుర్రుగా ఉన్నారు. ఎన్నికల ముందు ఆక్రమిత రైతులందరికీ పట్టాలు ఇస్తామని ఇప్పుడు కనీసం పరిహారం ఇవ్వకుండా బలవంతంగా లాక్కోవాలని చూస్తేఊరుకోబోమని వీరంతా హెచ్చరిస్తున్నారు.
ఆనందపురం మండలం గంభీరంలో సర్వే నెంబర్ 68లో 291.53 ఎకరాలు, సర్వేనెంబర్ 88లో 144.85 ఎకరాలు, సర్వే నెంబర్- 71లో మరో11ఎకరాల భూములున్నాయి. వీటిలో 31.29 ఎకరాలకు 19 మందికి గతంలో డి-ఫారం పట్టాలు ఇచ్చారు. ఈ రెండు సర్వేల్లో సుమారు 150 ఎకరాలకు పైగా భూములను సుమారు వందమంది రైతులు దశాబ్దాలుగా ఆక్రమించుకుని సాగు చేసుకుంటూ జీవనం పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో సర్వే నెంబర్ 68, 88లలో డి.ఫారం పట్టాలిచ్చిన వాటితో రైతుల ఆక్రమణలో ఉన్న భూముల్లో 388.48 ఎకరాలను ఐఐఎం ఏర్పాటు కోసం కేటాయించారు. ప్రభుత్వ అధీనంలో ఉన్న భూముల్లో కేంద్రమంత్రి స్మృతి ఇరానితో ఈ నెల 5వ తేదీన శంకుస్థాపన చేయాలని తలపెట్టగా చివరి నిముషంలో మంత్రి పర్యటన రద్దవడంతో వాయిదా పడింది. కనీసం భూముల స్వాధీన ప్రక్రియ పూర్తికాకుండా ఏ విధంగా శంఖుస్థాపన చేయడం వలన వివాదం మరింత ముదిరే అవకాశం ఉందనే వాదన వస్తోంది. రైతుల ఆందోళనకు బయపడే వాయిదా వేయించారనే వాదనలు కూడా విన్పిస్తున్నాయి.
పట్టాభూముదారులకే పరిహారం
డి.ఫారం పట్టా కలిగిన 19 మంది రైతులకు వారి ఆక్రమణలో ఉన్న 31.29 ఎకరాలకు ఎకరాకు రూ.20లక్షల చొప్పున పరిహారం ఇచ్చేందుకు అధికారులు ప్రతిపాదించారు. కాగా మిగిలిన ఆక్రమణదారులకు మాత్రం రిలీ్‌ఫ్ అండ్ రిహేబిటేషన్ (ఆర్ అండ్ ఆర్) కింద ఎకరాకు రూ.2.5లక్షలకు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. అసలు ఆక్రమిత దారులకు పరిహారం ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదని..అయినా సరే ఏళ్ల తరబడి సాగు చేసిన రైతులు నష్టపోకూడదన్న భావనతోనే నిబంధనలను పక్కన పెట్టి మరీ పరిహారం ఇచ్చేందుకు ముందుకొచ్చినా ఆక్రమి రైతులు పట్టువీడకపోవడం సరికాదని విశాఖ ఆర్డీఒ నాగవెంకటమురళి చెప్పుకొచ్చారు. ఇప్పటికే తహశీల్దార్, ఆర్డీఒ స్థాయిలో చర్చలకు ఆహ్వానించినా రైతులు రాలేదని ఆయన చెప్పారు. అందరికి ఒకే రీతిలో పరిహారం ఇస్తామంటేనే తాము చర్చలకు వస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు.
అంతవరకు భూముల్లో అడుగుపెట్టనీయబోమని చెబుతున్నారు. ఈ వివాదం మరింత ముదరకముందే రాష్ర్టమంత్రి గంటా బాధిత రైతులతో చర్చలు జరిపి సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిం చాలని లేకుంటే ఈ ప్రభావం ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఏర్పాటుపై పడి మరింత జాప్యం జరిగే అవకాశం ఉంటుందని వివిధ వర్గాల వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.