ప్రధాన మంత్రి ప్రతిష్టాత్మక పథకంపై ఆక్స్‌ఫర్డ్ కితాబు
సాక్షి బెంగళూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేస్తున్న పథకాలు, ప్రాజెక్టులపై ఎప్పటికప్పడు సమీక్ష జరుపుతూ సమయానికి పనులు పూర్తయ్యేలా చేసేందుకు నేరుగా ప్రధాని మోదీ పాల్గొని నిర్వహించే వర్చువల్ సమావేశం ప్రో–యాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ (ప్రగతి) కార్యక్రమం అద్భుత ఫలితాలనిస్తోందని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం కితాబునిచ్చింది.
రెండో తేదీన బెంగళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో జరిగిన కార్యక్రమంలో ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం ‘ప్రగతి’కార్యక్రమంపై జరిపిన అధ్యయనాన్ని ఒక బిజినెస్ స్కూల్ కేస్ స్టడీ రూపంలో విడుదల చేసింది.
‘గ్రిడ్‌లాక్ టూ గ్రోత్’పేరిట చేసిన అధ్యయనంలో ప్రగతి కార్యక్రమం అమలు, వాటి ఫలితాలను విశ్లేషించింది. దేశంలో భారీ ఎత్తున మౌలిక వసతులు, సామాజికాభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రగతి పథకం ద్వారా విజయవంతంగా అమలు చేస్తున్నారని ఆక్స్‌ఫర్డ్ ప్రశంసించింది. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్వహించిన ఈ పరిశోధనలో ‘ప్రగతి’కార్యక్రమం ద్వారా దేశంలో జరిగిన డిజిటల్ గవర్నెన్స్ అభివృద్ధిని ఆక్స్‌ఫర్డ్ ప్రస్తావించింది.
2015లో ‘ప్రగతి’ప్రస్థానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు 205 బిలియన్ డాలర్ల విలువైన 340 ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తిచేశారని వెల్లడించింది. ‘ప్రగతి’కార్యక్రమంలో భాగంగా సుమారు 50 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం జరిగిందని, రెట్టింపు స్థాయిలో విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చాయని తెలిపింది. మౌలికవసతుల కల్పన కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి జీడీపీలో రూ. 2.5 నుంచి రూ. 3.5 మేర తిరిగి లబ్ధి చేకూర్చినట్లు ఆక్స్‌ఫర్డ్ అధ్యయనం తెలిపింది.
ప్రధాన మంత్రి మౌలికవసతుల అభివృద్ధి కోసం ఉద్దేశించిన పీఎం గతిశక్తి, పర్యావరణ అనుమతుల నిమిత్తం రూపొందించిన పరివేశ్‌లను నిర్వహించడంలో ఈ ప్రగతి ఎంతగానో దోహదపడిందని వర్సిటీ తెలిపింది. గతంలో పర్యావరణ అనుమతుల కోసం 600 రోజులు పడుతుండగా ప్రస్తుతం ‘ప్రగతి’కారణంగా జీఐఎస్ మ్యాపింగ్, డ్రోన్ పర్యవేక్షణ ద్వారా ఆ గడువు దాదాపు 75 రోజులకు తగ్గిందని వెల్లడించింది. గ్రామాల్లోని కుళాయి కనెక్షన్స్ కూడా కేవలం ఐదేళ్లలో 17 శాతం నుంచి 79 శాతానికి పెరిగినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment