యువ గ్రాడ్యుయేట్లకు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ ఉద్బోధ
బెంగళూరు: గొప్ప తెలివితేటలే కాదు, తోటివారి పట్ల దయాగుణం కలిగి ఉండటం ఎంతో అవసరమని యువ పట్టభద్రులకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉద్బోధించారు. ఆదివారం ఆయన బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీ(ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ)లో జరిగిన 32వ స్నాతకోత్సవంలో ప్రసంగించారు. అకడెమిక్ బ్లాక్ విస్తరణ పనులకు అనంతరం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రసంగించారు. ‘నిజమైన నాయకత్వ ప్రతిభ గలవారు తమ బలాలతోపాటు బలహీనతలను కూడా గుర్తించగలరు. తమకున్న బలంతో ఇతరులకు తోడ్పాటునిస్తూ, తమ బలహీనతలను అధిగమించేందుకు ఇతరుల సాయం తీసుకుంటారు’అని సీజేఐ వివరించారు. అడ్డంకులను అధిగమించే క్రమంలో కుటుంబంతోపాటు స్నేహితుల మద్దతు ఎంతో అవసరమని చెప్పారు.
తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎంతో సహనంతో మెలగాలన్నారు. ‘నిర్ణయం తీసుకునే ప్రక్రియ అనిశి్చతితో కూడి ఉంటుంది, అయినా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ అనిశ్చితి కొనసాగేది కొంతకాలమే. మీరు ఎంచుకునే మార్గం ఏదైనప్పటికీ, భవిష్యత్తులో మీ సొంత నిర్ణయాలు సానుకూల పరిణామాలను కలిగిస్తాయి. ఈ క్రమంలో సహనం, వినయం అనే సద్గుణాలను ఎన్నడూ వీడరాదని కోరుతున్నాను’అని జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
‘వేగంగా మారుతున్న ప్రపంచం, అవసరాలు, వాతావరణ మార్పులు, సోషల్ మీడియా వంటి కొత్త వినోద సాధనాలు, సామాజిక దురాచారాలను మార్చాలనే ఆత్రుత సంక్లిష్ట సమస్యలకు స్వల్పకాలిక ఫలితాలను కోరేలా చేస్తున్నాయి’అంటూ ఆయన ఇలాంటి సమయంలో సహనంతో మెలగాల్సిన అవసరం ఎంతో ఉందని నొక్కిచెప్పారు. ‘హడావుడిగా తీసుకునే నిర్ణయాలకు ఎక్కువ శక్తిని వెచి్చంచాల్సి ఉంటుంది. ఇలాంటివి దీర్ఘకాలంలో మీ మానసిక ఆరోగ్యానికి చేటు కల్గిస్తాయి.
దీర్ఘకాలంలో సానుకూల లక్ష్యాలను సాధించడం కూడా కష్టమవుతుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది’అని ఆయన యువ న్యాయవాదులను హెచ్చరించారు. న్యాయమూర్తిగా 24 ఏళ్లపాటు పనిచేశాక నాకో విషయం అర్థమయింది. మనదేశంలోని కోర్టుల్లో మనం మూడో వ్యక్తిగా కాకుండా మొదటి వ్యక్తిగా వాదిస్తాం ఎందుకంటే.. కోర్టుల్లో మనం క్లయింట్ల కోసం వాదించం. మనమే క్లయింట్లుగా వాదనలు సాగిస్తాం. వారికి ప్రతినిధులుగా మాత్రమే కాదు, వారి గొంతుక, వారి లాయర్‌గా, విజేతలుగా ఉంటాం’అని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment