ట్రయల్ కోర్టు జడ్జీలకు సీజేఐ హితవు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్‌క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు.
అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment