
బెంగళూరు: ఓ రాష్ట్రానికి డీజీపీగా పని చేసిన వ్యక్తి దారుణంగా హత్య గావించబడటం చాలా విచారకరం. అది కూడా భార్య, కూతురు కలిసి చేసిన మాస్టర్ ప్లాన్ కు బలికావడం ఇంకా దురదృష్టకరం. కర్ణాటక రాష్ట్ర మాజీ డీజీపీ ఓమ్ ప్రకాష్ హత్య అనంతరం అనేక విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. భార్య పల్లవి బాధ పడలేక తన సోదరి సరితా కుమారి ఇంటి వద్దే ఉంటున్న ఓమ్ ప్రకాష్ ను ఇంటికి రప్పించి మరీ హత్య చేయడం సమాజంలోని పరిస్థితులు ఇంతలా దిగజారిపోవడానికి అద్దం పడుతోంది.
నేను ఇంట్లో లేని సమయంలోనే నాన్న హత్య
అయితే ఈ విషయంలో కుమారుడు కార్తీకేష్ ఇచ్చిన ఫిర్యాదులో మాత్రం తల్లి, సోదరి పాత్రలను ప్రముఖంగా ప్రస్తావించాడు. గత కొంతకాలంగా తల్లి పల్లవి.. నాన్నను చంపుతానంటూ బెదిరిస్తోందనే విషయాన్ని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే గతంలో నాన్నపై హత్యాయత్నం చేయడానికి అమ్మ యత్నించిందన్నాడు. పెద్ద రాయి తీసుకుని తలపై కొట్టి చంపాలని చూసిందన్నాడు.
‘ మా తండ్రిని చంపుతానని పదే పదే అమ్మ బెదిరిస్తూ వస్తోంది. ఈ బెదిరింపులతో మా నాన్న కూడా ఇంట్లో నుంచి వెళ్లిపోయి బయటే ఉంటున్నారు. నాన్న సోదరి( మా అత్త) సరితా కుమారి ఇంటికి వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారు. అయితే రెండు రోజుల క్రితం నా సోదరి కృతి.. నాన్న వద్దకు వెళ్లింది. ఇంటికి తిరిగి రావాలని పట్టుబట్టింది. నేను రానని నాన్న చెప్పినా పట్టుబట్టుకుని కూర్చొంది. దాంతో నాన్న తిరిగి ఇంటికి వచ్చారు.

నాన్నను వెంట తీసుకునే వచ్చింది కృతి. ఇష్టంలేకుండానే నాన్న ఇంటికి వచ్చారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. నేను ఇంట్లో లేని సమయం చూసి వాళ్లిద్దరూ కలిసి నాన్నను హత్య చేశారు. నాకు ఓ స్నేహితుడు ఫోన్ చేసి చెప్పాడు. మీ నాన్నకు ఇలా అయ్యిందనే విషయాన్ని చెప్పాడు. నేను సరిగ్గా నిన్న సాయంత్రం(ఆదివారం) గం. 5.45 ని.లకు ఇంటికి తిరిగి వచ్చేశాను.
అప్పటికే మా ప్రాంగణమంతా పోలీసులు, చుట్టుపక్కల వారితో నిండిపోయి ఉంది. నేను మా నాన్న రక్తమడుగులో పడి ఉండటం చూశాం. ఆయన శరీరమంతా గాయాలతో నిండిపోయింది. నాన్న శరీరంలో పగిలిన బాటిల్, కత్తి ఉండటాన్ని గమనించాను. అప్పుడు సెయింట్ జాన్స్ హాస్పిటల్ప్ కి నాన్నని తీసుకెళ్లాం. మా అమ్మ, చెల్లి కూడా పూర్తి డిప్రెషన్ లో ఉన్నారు. అమ్మా, సోదరి కలిసే నాన్నను హత్య చేశారనే విషయాన్ని బలంగా నమ్ముతున్నా’ అని పోలీస్ లకు ఇచ్చిన స్టేట్ మెంట్ లో కార్తీకేష్ చెప్పుకొచ్చాడు.