
బెంగళూరు: కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్ హత్య కేసు(Om Prakash Case) దర్యాప్తులో మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. గూగుల్‌లో వెతికి మరీ భర్త ఓం ప్రకాశ్‌ను పల్లవి(Wife Pallavi) హతమార్చినట్లు వెల్లడైంది. అంతేకాదు తన భర్త తనపై విష ప్రయోగం చేశాడని.. ఆయన పెట్టే హింస భరించలేకే హత్య చేశానని ఆమె పోలీసుల ఎదుట చెప్పినట్లు అక్కడి మీడియా కథనాలు ఇస్తున్నాయి.
హత్యకు ఐదు రోజుల ముందు నుంచి పల్లవి గూగుల్‌లో విపరీతంగా వెతుకుతూ వస్తోంది. ఎక్కడ నరాలు తెగితే మనిషి త్వరగా చనిపోతాడోనని వెతికిందామె. చివరకు మెడ దగ్గరి నరాలను దెబ్బ తీస్తే చనిపోతారని నిర్ధారించుకుని హత్య చేసింది. ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాల నేపథ్యంలో తన భర్త, కర్ణాటక మాజీ డీజీపీ ఓం ప్రకాశ్‌ను పల్లవి హతమార్చిన సంగతి తెలిసిందే. అయితే..
ఓం ప్రకాశ్ కొడుకు కార్తీక్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. స్కిజోఫ్రెనియా అనే మానసిక సమస్యతో బాధపడుతున్న ఆమె.. భర్త నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఊహించుకుంటూ వస్తోంది. ఈలోపు ఆస్తి తగదాలు కూడా మొదలు కాగా.. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందంటూ కుటుంబ వాట్సాప్ గ్రూపుల్లో కొన్నిరోజులుగా ఆమె సందేశాలు ఉంచుతూ వస్తోంది.
పీటీఐ కథనం ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నాం ఓం ప్రకాశ్ భోజనం చేస్తున్న సమయంలో పల్లవి భర్త ఓం ప్రకాశ్ కళ్లలో కారం కొట్టింది. ఆపై కాళ్లు చేతులు కట్టేసి విచక్షణరహితంగా పొడిచి హత్య చేసింది. భర్త ప్రాణం పోతుండగానే పోలీసులకు ఆమె సమాచారం అందించింది. పోలీసులు వచ్చి చూసే సరికి ఆయన రక్తపు మడుగులో పడి ఉండగా.. ఆమె రిలాక్స్‌గా ఓ కుర్చీలో కూర్చుని ఉంది.
హత్య అనంతరం.. ఐపీఎస్ ఫ్యామిలీ గ్రూప్‌లో సందేశం ఉంచిన ఆమె.. ఓ మాజీ అధికారికి తానొక మృగాన్ని చంపినట్లు సందేశం కూడా పంపినట్లు నిర్ధారణ అయ్యింది. ఇక ఈ హత్య తన సోదరి కృతి పాత్ర కూడా ఉండొచ్చని ఓం ప్రకాశ్ తనయుడు కార్తీక్ ఆరోపిస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ కేసులో పల్లవిని ప్రాథమిక నిందితురాలిగా అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె నుంచి కీలక వివరాలు రాబట్టే ప్రయత్నాల్లో ఉన్నారు.