bail application
-
CJI D Y Chandrachud: బెయిల్ అర్జీలపై ‘సేఫ్ గేమ్’ వద్దు
బెంగళూరు: బెయిల్ అర్జీల విషయంలో ట్రయల్ కోర్టుల జడ్జీలు ‘సేఫ్ గేమ్’ ఆడుతున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. అనుమానాస్పదం అనే పేరు చెప్పి ప్రతి కేసులోనూ బెయిల్ తిరస్కరిస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఆదివారం బెంగళూరులో బెర్క్లే సెంటర్ 11వ వార్షిక సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ట్రయల్ కోర్టులు ప్రతి బెయిల్ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలి. కానీ అనుమానాస్పదం పేరిట అర్జీలను ట్రయల్ కోర్టుల జడ్జీలు కొట్టేస్తున్నారు. ఇలాంటి సేఫ్‌గేమ్ పనికిరాదు. బెయిల్ అర్జీలపై ఇంగిత జ్ఞానంతో ఆలోచించాలి. కేసు ప్రాముఖ్యతను బట్టి తుది నిర్ణయం తీసుకోవాలి. అంతేగానీ పై కోర్టుకు వదిలేయకూడదు. ఎందుకంటే వాళ్లంతా హైకోర్టు గడపతొక్కుతున్నారు. అక్కడా బెయిల్ దొరక్కపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అనవసరంగా అరెస్ట్ అయిన వాళ్లు కూడా సుప్రీంకోర్టు దాకా రావాల్సిన పరిస్థితి! ఇలాంటి కేసులన్నీ అంత దూరం రావడం సరికాదు’’ అన్నారు. వాతావరణ మార్పులు మహిళలు, చిన్నారులు, దివ్యాంగులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని సీజేఐ అన్నారు. ‘‘వాతావరణ మార్పులతో వలసలు పెరుగుతున్నాయి. ప్రజలకు నాణ్యమైన జీవితం కరువవుతోంది. ఆహార కొరతతో చిన్నారులు, ఇతర సమస్యలతో మహిళలు బాధ పడుతున్నారు. ఇబ్బందుల కొలిమిలో కాలిపోతున్నారు’’ అని ఆవేదన వెలిబుచ్చారు. -
కవిత బెయిల్ తీర్పులపై ఉత్కంఠ
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై సోమవారం తీర్పురానుంది. ఉదయం తీర్పు వెలువడాల్సి ఉండగా.. మధ్యాహ్నం 12 గం. సమయానికి వాయిదా వేసింది ట్రయల్ కోర్టు.ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సీబీఐ నమోదు చేసిన రెండు కేసుల్లోనూ బెయిల్‌కు సంబంధించి ఢిల్లీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా తీర్పులు ఇవ్వనున్నారు. లిక్కర్ కేసులో ఈడీ మార్చి 15న కవితను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉండగానే.. ఏప్రిల్ 11న సీబీఐ కూడా పీటీ వారెంట్‌తో ఆమెను అరెస్టు చేసింది. ఈ కేసులకు సంబంధించి కవిత వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో తల్లిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి ఉందంటూ ఈడీ కేసులో మధ్యంతర బెయిల్ కోరారు. మరోవైపు బీఆర్ఎస్ స్టార్ క్యాంపెయినర్‌గా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని, మహిళలపరమైన కొన్ని సమస్యలు ఉన్నాయని సీబీఐ కేసులో బెయిల్ కోరారు. కేవలం ఇతరుల స్టేట్మెంట్ల ఆధారంగానే కవితను అరెస్టు చేశారని.. మహిళ కాబట్టి బెయిల్‌కు అర్హురాలని ఆమె తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. మరోవైపు ఈ రెండు బెయిల్ పిటిషన్లను దర్యాప్తు సంస్థలు వ్యతిరేకించాయి. కవితకు బెయిల్ ఇస్తే ఆధారాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుపై ప్రభావం పడుతుందని కోర్టుకు విన్నవించాయి. ఈ పిటిషన్లపై వాదనలను ఇప్పటికే పూర్తిచేసిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి.. తీర్పును రిజర్వు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు ఈ తీర్పులను వెలువరించనున్నారు. బెయిల్ రాకుంటే వెంటనే హైకోర్టుకు.. ఒకవేళ ట్రయల్ కోర్టులో బెయిల్ నిరాకరిస్తే వెంటనే హైకోర్టుకు వెళ్లాలని కవిత న్యాయవాదులు యోచిస్తున్నట్టు సమాచారం. మరోవైపు కవిత జ్యుడిషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. సోమవారం బెయిల్ రాకుంటే.. మంగళవారం ఆమెను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చాల్సి ఉంటుంది. ఈసారి తనను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాకుండా, నేరుగా కోర్టులో హాజరయ్యేలా చూడాలని కవిత ఇప్పటికే కోర్టును కోరారు కూడా. -
‘బెయిల్ చట్టం’ తీసుకురండి..
న్యూఢిల్లీ: క్రిమినల్ కేసుల్లో నిందితులను జైలు నుంచి విడుదల చేసే విషయంలో క్రమబద్ధత సాధించేందుకు బెయిల్ చట్టం తీసుకువచ్చే విషయం పరిశీలించాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరింది. చట్టంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి, రక్షణ కల్పించాలని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఉన్న కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ స్వాతంత్య్రానికి పూర్వమున్న విధానానికి కొనసాగింపు మాత్రమేనని పేర్కొంది. దేశంలోని జైళ్లు విచారణ ఖైదీలతో కిక్కిరిసిపోయాయని తెలిపింది. గుర్తించదగిన నేరాన్ని నమోదు చేసినప్పటికీ వీరిలో ఎక్కువ మందిని అరెస్టు చేయాల్సిన అవసరం లేదని కూడా పేర్కొంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై పోలీసు రాజ్యమనే ముద్ర పడరాదని జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. -
బెయిల్ ఉత్తర్వుల కాపీల జారీలో ప్రత్యామ్నాయ యంత్రాంగం
సాక్షి, అమరావతి: న్యాయస్థానాలు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నప్పటికీ, ఆ ఉత్తర్వుల సర్టిఫై కాపీలు జైలు అధికారులకు సకాలంలో అందకపోవడంతో అండర్ ట్రయిల్ ఖైదీలు, నిందితులు ఇబ్బందిపడుతున్నారని హైకోర్టు పేర్కొంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యామ్నాయ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తూ గురువారం ఉత్తర్వులిచ్చింది. హైకోర్టులో సిబ్బంది తక్కువగా ఉన్నందువల్ల కోర్టు ఉత్తర్వుల కాపీల జారీలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు ఈ ఏర్పాటు చేసింది. సకాలంలో ఉత్తర్వుల కాపీని అందజేయకుండా బెయిల్ పిటిషన్‌ను పరిష్కరించడం నిందితుడిని సౌకర్యవంతమైన స్థానంలో ఉంచదని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కోర్టులు సరికొత్త పద్ధతులను అన్వయించుకుంటూ ఈ సమస్యపై దృష్టిసారించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ఇటీవల హైకోర్టులో కోర్టు మాస్టర్లు ఏ రోజు జరిగిన కోర్టు ప్రొసీడింగ్స్‌ను, వెలువరించిన ఉత్తర్వులను, తీర్పులను ఆ రోజే నెట్లో అప్లోడ్ చేస్తున్నారంది. ► ఈ పరిస్థితుల్లో కక్షిదారులు, న్యాయవాదులు ఉత్తర్వుల కాపీలను హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చంది. నిందితుల తరఫున పూచీకత్తులు సమర్పించడానికి మెమో దాఖలు చేసే సమయంలో న్యాయవాది ఉత్తర్వుల కాపీని హైకోర్టు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న విషయాన్ని ప్రస్తావించాలి. ► సంబంధిత కోర్టు అడ్మినిస్ట్రేటివ్ అధికారి లేదా చీఫ్ మినిస్టీరియల్ అధికారి హైకోర్టు వెబ్సైట్లోకి వెళ్లి ఆ ఉత్తర్వులను పరిశీలించాలి. ► కోర్టు ప్రిసైడింగ్ అధికారి అదే రోజు రిలీజ్ ఆర్డర్‌ను ఈ–మెయిల్ లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో జైలు అధికారికి పంపాలి. ముందస్తు బెయిల్ విషయంలో కోర్టు ఉత్తర్వుల కాపీల పరిశీలన బాధ్యత సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్‌దే. ► ఈ ఉత్తర్వుల కాపీని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, డైరెక్టర్ ప్రాసిక్యూషన్, అన్ని జిల్లాల ప్రిన్సిపల్ జడ్జిలకు పంపాలని హైకోర్టు రిజిస్ట్రార్(జ్యుడీషియల్)ను ఆదేశించింది. ► జిల్లా జడ్జిల ద్వారా ఈ ఉత్తర్వుల కాపీని ఆయా న్యాయవాద సంఘాలకు కూడా పంపాలని సూచించింది. ఈ నెల 26 నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయంది. ► న్యాయాధికారులు ఈ ఉత్తర్వుల అమలులో ఇబ్బందులు ఎదుర్కొంటే.. రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) దృష్టికి తీసుకురావాలంది. ముందస్తు బెయిళ్ల విషయంలో ఎస్‌హెచ్‌వోలు తమ ఇబ్బందులను హైకోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దృష్టికి తీసుకురావచ్చంది. ఆ ఇబ్బందులను రిజిస్ట్రార్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆగస్టు 31 నాటికి హైకోర్టు ముందుంచాలని ఆదేశించింది. ► ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు కావాలంటే తదుపరి విచారణ సమయంలో చూస్తామంటూ విచారణను ఆగస్టు 31కి వాయిదా వేసింది. ఈ మేరకు జస్టిస్ కన్నెగంటి లలిత గురువారం ఉత్తర్వులిచ్చారు. నార్కోటిక్ డ్రగ్స్ కేసులో నిందితులకు బెయిల్ మంజూరు చేసేటప్పుడు న్యాయమూర్తి ఈ ఉత్తర్వులిచ్చారు. -
బెయిల్ రాక..బయటకు రాలేక..
అల్లిపురం(విశాఖ దక్షిణం): నెల రోజులు గడిచిపోయాయి.. కింది కోర్టులో బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు.. హైకోర్టును ఆశ్రయిస్తే.. వాయిదాలు పడుతూ వస్తోంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఏసీబీ కేసులో చిక్కుకొని జైలు పాలైన తమ వారి కోసం నాలుగు పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని.. మన పోలీసులు ఏ తప్పు చేయలేదని భావిస్తున్నామని.. అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోందని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19న విచారణ ఉన్నందున.. ఆ రోజు బెయిల్ లభించే అవకాశం ఉందని.. ఆ వెంటనే మన వారిని వెనక్కు తీసుకొస్తామని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. చోరీ సొత్తు రికవరీ కోసం రాజస్థాన్ వెళ్లి.. అవినీతి ఆరోపణలతో అక్కడి ఏసీబీకి చిక్కిన నగర పోలీస్ బృందం బెయిల్ పిటిషన్ ఈ నెల 19కి వాయిదా పడిందని ఆయన తెలిపారు. నవంబర్ ఐదో తేదీన పీఎంపాలెం క్రైం సీఐ ఆర్వీఆర్కే చౌదరితో పాటు మహారాణిపేట ఎస్సై గోపాలరావు, పరవాడ క్రైమ్ ఎస్సై షరీఫ్, వన్‌టౌన్ క్రైమ్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌లను రాజస్థాన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, కేసులో ఇరుక్కున్న మన పోలీసులకు అవసరమైన సహకారం అందించేందుకు నగర క్రైం డీసీపీ షెముషి బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో ఒక బృందం రాజస్థాన్ వెళ్లింది. అయితే అక్కడ జైలులో ఉన్న వారిని కలుసుకోవడానికి ఆమెకు సమయం పట్టింది. బెయిల్‌కు తీవ్ర యత్నాలు వివరాలు తెలుసుకుని న్యాయవాదిని నియమించి రాజస్థాన్ దిగువ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రెండుసార్లు ప్రయత్నించినా బెయిల్ దొరకలేదు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ను వివరణ కోరగా కోర్టు బెయిల్ పిటీషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిందని, ఈసారి బెయిల్ మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన వెంటనే పోలీసులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. ఈ కేసులో రాజస్థాన్ ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విధంగా మన పోలీసులు తప్పు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. కేసు కోర్టులో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు. ఆందోళనలో ఉద్యోగుల కుటుంబాలు.. విధి నిర్వహణలో రాజస్థాన్ వెళ్లిన తమ వారి రాక కోసం పోలీసు కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. నెల రోజులకుపైగా కుటుంబాలకు దూరంగా ఉండటంతో జైలులో ఉన్న పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీనైనా బెయిల్ మంజూరు అవుతుందన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. -
ఆయనకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురు
న్యూఢిల్లీ: లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న వివాదాస్పద ఆధ్మాత్మిక గురువు ఆశారాం బాపునకు సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైంది. అనారోగ్యం కారణంగా తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలన్న విజ్ఞప్తి సుప్రీంకోర్టు నిరాకరించింది. అదే సమయంలో ఎయిమ్స్ కు చెందిన మెడికల్ బోర్డులోని ముగ్గురు వైద్యులు వెళ్లి ఆయన ఆరోగ్యపరిస్థితిపై తమకు తెలియజేయాలని చెప్పింది. రాజస్థాన్ లోని ఆశ్రమంలో ఉండగా ఓ మైనర్ పై ఆశారాం బాపు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయనను 2013 సెప్టెంబర్ 2న పోలీసులు అరెస్టు చేసి ప్రస్తుతం జైలులో ఉంచారు. దీంతో తనకు ఇటీవల ఆరోగ్యం బాగాలేదని, ఆస్పత్రిలో చికిత్స కోసం తనకు బెయిల్ ఇవ్వలంటూ రెండు రోజుల కిందట ఆయన రాజస్థాన్ హైకోర్టులో పిటిషన్ వేయగా అక్కడ కూడా కోర్టు అందుకు నిరాకరించింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లగా ఉన్నత న్యాయస్థానం కూడా బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎయిమ్స్ వైద్యాధికారులకు సూచించింది. -
'ఈ సమయంలో బెయిల్ ఇవ్వలేం'
జోద్పూర్: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు, లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశారం బాపునకు మరోసారి రాజస్థాన్ కోర్టులో చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దాదాపు ముగింపు దశలో ఉండగా ఇప్పుడు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదంటూ కోర్టు స్పష్టం చేసింది. 2013 సెప్టెంబర్ 2న జోద్ పూర్ సెంటర్ జైలుకు ఆశారాం బాపును తరలించారు. ఓ మైనర్ పై లైంగిక దాడికి పాల్పడ్డాడనే ఆరోపణల కిందట ఆయనను అరెస్టు చేసి జైలుకు తరలించగా అప్పటి నుంచి ఆయన పలుమార్లు బెయిల్ పిటిషన్ పెట్టుకున్నా కోర్టు ఇవ్వలేదు. ఆశారాం బెయిల్ పిటిషన్ వేయడం.. కోర్టు తిరస్కరించడం ఇది మూడోసారి.