అల్లిపురం(విశాఖ దక్షిణం): నెల రోజులు గడిచిపోయాయి.. కింది కోర్టులో బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు.. హైకోర్టును ఆశ్రయిస్తే.. వాయిదాలు పడుతూ వస్తోంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఏసీబీ కేసులో చిక్కుకొని జైలు పాలైన తమ వారి కోసం నాలుగు పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని.. మన పోలీసులు ఏ తప్పు చేయలేదని భావిస్తున్నామని.. అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోందని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19న విచారణ ఉన్నందున.. ఆ రోజు బెయిల్ లభించే అవకాశం ఉందని.. ఆ వెంటనే మన వారిని వెనక్కు తీసుకొస్తామని ఆయన ‘సాక్షి’కి చెప్పారు.
చోరీ సొత్తు రికవరీ కోసం రాజస్థాన్ వెళ్లి.. అవినీతి ఆరోపణలతో అక్కడి ఏసీబీకి చిక్కిన నగర పోలీస్ బృందం బెయిల్ పిటిషన్ ఈ నెల 19కి వాయిదా పడిందని ఆయన తెలిపారు. నవంబర్ ఐదో తేదీన పీఎంపాలెం క్రైం సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరితో పాటు మహారాణిపేట ఎస్సై గోపాలరావు, పరవాడ క్రైమ్ ఎస్సై షరీఫ్, వన్‌టౌన్ క్రైమ్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌లను రాజస్థాన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, కేసులో ఇరుక్కున్న మన పోలీసులకు అవసరమైన సహకారం అందించేందుకు నగర క్రైం డీసీపీ షెముషి బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో ఒక బృందం రాజస్థాన్ వెళ్లింది. అయితే అక్కడ జైలులో ఉన్న వారిని కలుసుకోవడానికి ఆమెకు సమయం పట్టింది.
బెయిల్‌కు తీవ్ర యత్నాలు
వివరాలు తెలుసుకుని న్యాయవాదిని నియమించి రాజస్థాన్ దిగువ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రెండుసార్లు ప్రయత్నించినా బెయిల్ దొరకలేదు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్‌ను వివరణ కోరగా కోర్టు బెయిల్ పిటీషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిందని, ఈసారి బెయిల్ మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన వెంటనే పోలీసులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. ఈ కేసులో రాజస్థాన్ ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విధంగా మన పోలీసులు తప్పు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. కేసు కోర్టులో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు.
ఆందోళనలో ఉద్యోగుల కుటుంబాలు..
విధి నిర్వహణలో రాజస్థాన్ వెళ్లిన తమ వారి రాక కోసం పోలీసు కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. నెల రోజులకుపైగా కుటుంబాలకు దూరంగా ఉండటంతో జైలులో ఉన్న పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీనైనా బెయిల్ మంజూరు అవుతుందన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment