Visakhapatnam police
-
విశాఖ: గంటల వ్యవధిలో కిడ్నాప్ కేసు చేధన
సాక్షి, విశాఖపట్నం: నగరంలో కిడ్నాప్ వ్యవహారం వెలుగుచూసింది. ఓ రియల్టర్‌ను భార్యతో సహా కిడ్నాప్ చేశారు దుండగులు. అయితే అంతేవేగంగా స్పందించిన పోలీసులు కేసును చేధించారు. బాధితుల్ని రక్షించడంతో పాటు నలుగురు కిడ్నాపర్లను అదుపులోకి తీసుకున్నారు. విశాఖ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో.. రియల్టర్ శ్రీనివాస్, అతని భార్య లక్ష్మిని కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. అయితే ఈ కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు అంతే చాకచక్యంగా చేధించారు. నలుగురు కిడ్నాపర్లను అరెస్ట్ చేశారు. భర్తపై ఛీటింగ్ కేసు.. కిడ్నాపర్ల డిమాండ్ మరోవైపు శ్రీనివాస్ దంపతులు విజయవాడ నుంచి విశాఖ కి కొద్ది రోజుల క్రితం వ్యాపారం నిమిత్తం వచ్చారు. గతంలో శ్రీనివాస్‌పై విజయవాడ పడమటలో చీటింగ్ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో జూన్ 2021లో శ్రీనివాస్ అరెస్ట్ కూడా అయ్యాడు. ఆ సమయంలో రూ.3 కోట్లు కాజేజినట్లు కేసు నమోదు అయ్యింది. ఈ తరుణంలో వాళ్ల దగ్గరి నుంచి రూ. 60 లక్షలు డిమాండ్ చేస్తూ కిడ్నాప్‌కు దిగారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు కొనసాగుతుండగా.. ఈస్ట్ ఏసిపి ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కిడ్నాప్ వ్యవహారంలో మరో రియల్టర్ సంస్థపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ చదవండి: విశాఖలో అదృశ్యం.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం -
క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్
పీఎంపాలెం (భీమిలి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్న ముఠాను శనివారం రాత్రి విశాఖ పోలీసులు పట్టుకున్నారు. బెట్టింగ్‌ల ప్రక్రియ సూత్రధారి పరారు కాగా నలుగురిని అరెస్టు చేశారు. వారివద్ద నుంచి సుమారు రూ.3 లక్షలు విలువైన ఎల్రక్టానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. విశాఖలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను పీఎంపాలెం సీఐ రవికుమార్ తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. ఈ నెల 9 నుంచి జరుగుతున్న పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 క్రికెట్ మ్యాచ్‌లపై వీరు బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. రుషికొండ పనోరమాహిల్స్ సెలబ్రిటీ టవర్స్ 15వ అంతస్తులోని ఫ్లట్‌ను చేబోలు శ్రీనివాస్ ఎలియాస్ కేబుల్ శ్రీను అద్దెకు తీసుకున్నాడు. అక్కడ క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహించేందుకు ఎల్రక్టానిక్ పరికరాలు సిద్ధం చేశాడు. విశాఖలోని అక్కయ్యపాలేనికి చెందిన కుంచంగి రవికుమార్ (29), సుజాతానగర్‌కు చెందిన తమ్మారెడ్డి ధనుంజయ్ (34), శ్రీకాకుళం జిల్లా నరసయ్యపేట మండలం బుచ్చిపేట మండలానికి చెందిన మార్పు శివాజీ (29), విశాఖ ఎంవీపీ కాలనీకి చెందిన వీరపునేని రాంబాబు (43)లను ఉద్యోగులుగా నియమించాడు. క్రికెట్ మ్యాచ్ జరిగేటప్పుడు ఒకేసారి 30 మందితో 30 సెల్ఫోన్ల ద్వారా మాట్లాడగల సామర్థ్యం ఉన్న సెటప్ బాక్సు ఏర్పాటు చేసి బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. తప్పుడు రేటింగ్‌లు చెబుతూ.. పాకిస్తాన్ సూపర్‌లీగ్ టీ–20 మ్యాచ్‌లలో శనివారం రాత్రి 9.30 గంటలకు కెట్ట గ్లాడియర్స్–పెషావర్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. క్రికెట్ లైవ్ గ్రూపులో చూస్తూ మ్యాచ్ గెలుపోటములపై కోడ్ ద్వారా అసలు రేటింగ్‌కు బదులు తప్పుడు రేటింగ్‌లు చెబుతూ బెట్టింగులు కాసేవారిని తప్పు దోవ పట్టిస్తూ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందడంతో పీఎంపాలెం సీఐ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు శనివారం రాత్రి దాడిచేసి నలుగురు నిందితులను అరెస్టుచేసి వారివద్ద నుంచి పలు పరికరాలు, రూ.1,500 నగదు స్వాదీనం చేసుకున్నారు. అప్పటికే ప్రధాన నిందితుడు శ్రీనివాస్ పరారయ్యాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ రవికుమార్ తెలిపారు. -
రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక..
సాక్షి, విశాఖపట్నం : ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసును విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అదే సమయంలో ఇతరుల ప్రమేయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో హోంమంత్రి ఆదేశాల మేరకు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి మరో యువకుడు రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక అఖిల్ సాయి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చదవండి: హత్యకేసులో సెంట్రల్ జైలుకి అఖిల్.. ఈ హత్యకు ముందు అఖిల్ సాయి గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు సూర్యనారాయణ రాజుతో కలిసి రామును బెదిరించడమే కాకుండా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద దాడి కూడా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ కూడా ఉన్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్‌ను రెచ్చ గొట్టి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే వరలక్ష్మి హత్యలో ఈ రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు ప్రమేయం ఏ మేరకు ఉందన్న కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
న్యూ ఇయర్ పేరుతో అసభ్యంగా ప్రవర్తిస్తే...
సాక్షి, విశాఖ : నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం సాక్షితో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలకు పకడ్బందీగా బందోబస్తు చేశామని పేర్కొన్నారు. 3400 మంది పోలీసులతో విశాఖ నగరంలో అడుగడుగునా భద్రతా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విశాఖ వాసులు ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవచ్చని అన్నారు. బీచ్ రోడ్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపుతోపాటు ముందుగానే కొన్ని పార్కింగ్ స్థలాలు కేటాయించామని తెలిపారు. బీచ్ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని, న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. -
ప్రియుడి కోసం భర్త దారుణ హత్య
సాక్షి, విశాఖపట్నం : ఆర్మీ సిపాయి సతీష్ కుమార్ ఆత్మహత్య కేసును విశాఖ సిటీ పోలీసులు చేధించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు నిర్థారించారు. ఈ కేసులో సతీష్ భార్య జ్యోతి, ఆమె ప్రియుడు భరత్ కుమార్, అతని స్నేహితుడు భాస్కర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి చెందిన సతీష్ సైన్యంలో పనిచేస్తున్నాడు. సతీష్ జమ్మూకశ్మీర్‌లో ఉండగా, భార్య జ్యోతి, ఇద్దరు పిల్లలు విశాఖ సిటీ మద్దిలపాలెంలో ఉంటున్నారు. ఈ క్రమంలో జ్యోతి భరత్ కుమార్ అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. జ్యోతి ప్రవర్తనపై అనుమానం వచ్చి ఆమె అత్త ఓ సారి మందలించింది. కొద్ది రోజుల తర్వాత సతీష్ డ్యూటీకి నెల రోజులు సెలవు పెట్టి ఇంటికి వచ్చాడు. ఈ నేపథ్యంలో జ్యోతి వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని ఆమెను నిలదీశాడు. తన వివాహేతర సంబంధం బట్టబయలు కావడంతో భర్తను హతమార్చాలని పన్నాగం పన్నింది జ్యోతి. ప్రియుడు భరత్‌తో కలిసి ప్లాన్ చేసింది. సతీష్ కుమార్ తాగే విస్కీలో నిద్ర మాత్రలు కలిపి ఇచ్చింది. సతీష్ నిద్రమత్తులోకి జారుకున్న తర్వాత ప్రియుడు భరత్, అతని స్నేహితుడు భాస్కర్లకు ఫోన్ చేసి ఇంటికి రప్పించింది. ముగ్గురు కలిసి నిద్రమత్తులో ఉన్న సతీష్ మెడకి చున్నీ బిగించి హత్య చేశారు. అనంతరం అదే చున్నీతో ఫ్యాన్ ఫ్యాన్‌కి వ్రేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. ఏమి తెలియనట్లుగా తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులకి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా అసలు విషయం బయటపడింది. జ్యోతీ, భరత్, భాస్కర్లను అరెస్ట్ చేసిన సిటీ పోలీసులు మంగళవారం విశాఖ పోలీస్ కమీషనర్ ఆర్ కె మీనా ముందు హాజరు పరిచారు. -
పగలు మెకానిక్.. రాత్రి బైక్‌ల చోరీ
సాక్షి, ఉక్కునగరం(గాజువాక): అతని వృత్తి మెకానిక్.. ప్రవృత్తి బైకుల చోరీ. పగలు వాహనాలను బాగు చేసే ఆయన రాత్రి వేళ బైకుల చోరీని అలవాటుగా మార్చుకున్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు ఏకంగా 200 బైకులను అపహరించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నగర సౌత్ జోన్ పోలీసులు దర్యాప్తుముమ్మరం చేశారు. ఎట్టకేలకు కేసును ఛేదించారు. వందకు పైగా బైకులను రికవరీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. పరవాడలో బైక్ రిపేర్ షాపు నిర్వహిస్తూ.. పరవాడలో సుమారు 15, స్టీల్‌ప్లాంట్‌లో దాదాపు 40, ఇలా అనకాపల్లి, గాజవాక పరిధితో పాటు పలు చోట్ల మొత్తం సుమారు 200 బైకులు అపహరణకు గురయ్యాయి. పోలీసులకు సవాలుగా మారిన ఈ దొంగతనాల మూలం పరవాడలో ఉన్నట్టు తేలింది. నిందితుడు పరవాడలో బైక్ రిపేర్ షాపు నిర్వహిస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన వ్యకిగా గుర్తించారు. బయటకు మెకానిక్‌గా కనిపిస్తూ రాత్రుళ్లు బైకుల దొంగతనం చేయడం ప్రవృత్తిగా మార్చుకున్నట్టు పోలీసుల దర్యాప్తులో నిర్థారించారు. చోరీ బైక్‌ల విడిభాగాలను విక్రయిస్తూ.. చోరీ చేసిన బైకుల విడి భాగాలను తీసి స్పేర్‌పార్టులుగా అమ్మకం చేసేవాడు. ఆ వ్యాపారం విస్తరించడంతో చుట్టు పక్కల ప్రాంతాలకు చెందిన మెకానిక్‌లు కూడా ఈయన వద్ద నుంచే స్పేర్‌పార్టులు కొనుక్కునేవారు. ఇటీవల దొరికిన ఒక సాక్ష్యం ద్వారా నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా తప్పించుకున్నాడు. తప్పించుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు.. దీంతో అప్రమత్తమైన పోలీసులు ప్రకాశం, ఖమ్మం జిల్లాలకు రెండు బృందాలను పంపిం చారు. ఖమ్మంలోని అతని బంధువు ఇంట్లో ఉండగా పట్టుకున్నట్టు తెలిసింది. అతడి నుంచి రాబట్టిన సమాచారం మేరకు ఇప్పటికే వందకు పైగా బైకులను పోలీసులు రికవరీ చేశారు. స్పేర్ పార్ట్‌లను రికవరీ చేస్తూ.. నిందితుడి నుంచి స్పేర్ పార్టులు కొనుగోలు చేసిన మెకానిక్‌లను కూడా అదుపులోకి తీసుకుని మరికొన్ని స్పేర్ పార్టుల రికవరీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. నగర క్రైం ఏడీసీపీ సురేష్‌బాబు నేతృత్వంలో గాజువాక క్రైం సీఐ సూర్యనారాయణ ఆధ్వర్యంలో పలువురు క్రైం ఎస్‌లు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న బైకులను స్టీల్‌ప్లాంట్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఉంచారు. దొరికిన స్పేర్ పార్టులతో బిగించి తిరిగి బైకులను సిద్ధం చేస్తున్నారు. రికార్డు స్థాయిలో బైక్‌లు రికవరీ దిశగా.. జిల్లాలో ఇప్పటి వరకు అత్యధికంగా 90 చోరీ బైకులను రికవరీ చేయగా.. ఈ సారి అంతకంటే ఎక్కువ బైకులను పోలీసులు స్వాధీనం చేసుకునే దిశగా దర్యాప్తు సాగుతోంది. అతి త్వరలో పోలీసులు నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందని సమాచారం. -
బెయిల్ రాక..బయటకు రాలేక..
అల్లిపురం(విశాఖ దక్షిణం): నెల రోజులు గడిచిపోయాయి.. కింది కోర్టులో బెయిల్ ప్రయత్నాలు ఫలించలేదు.. హైకోర్టును ఆశ్రయిస్తే.. వాయిదాలు పడుతూ వస్తోంది.. ఈ నేపథ్యంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఏసీబీ కేసులో చిక్కుకొని జైలు పాలైన తమ వారి కోసం నాలుగు పోలీసు కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయి. అయితే ఈసారి తప్పకుండా బెయిల్ వస్తుందని.. మన పోలీసులు ఏ తప్పు చేయలేదని భావిస్తున్నామని.. అయితే కేసు కోర్టు పరిధిలో ఉన్నందున నిస్సహాయంగా ఉండిపోవాల్సి వస్తోందని నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 19న విచారణ ఉన్నందున.. ఆ రోజు బెయిల్ లభించే అవకాశం ఉందని.. ఆ వెంటనే మన వారిని వెనక్కు తీసుకొస్తామని ఆయన ‘సాక్షి’కి చెప్పారు. చోరీ సొత్తు రికవరీ కోసం రాజస్థాన్ వెళ్లి.. అవినీతి ఆరోపణలతో అక్కడి ఏసీబీకి చిక్కిన నగర పోలీస్ బృందం బెయిల్ పిటిషన్ ఈ నెల 19కి వాయిదా పడిందని ఆయన తెలిపారు. నవంబర్ ఐదో తేదీన పీఎంపాలెం క్రైం సీఐ ఆర్వీఆర్కే చౌదరితో పాటు మహారాణిపేట ఎస్సై గోపాలరావు, పరవాడ క్రైమ్ ఎస్సై షరీఫ్, వన్‌టౌన్ క్రైమ్ కానిస్టేబుల్ హరిప్రసాద్‌లను రాజస్థాన్ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. దాంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు, కేసులో ఇరుక్కున్న మన పోలీసులకు అవసరమైన సహకారం అందించేందుకు నగర క్రైం డీసీపీ షెముషి బాజ్‌పాయ్ ఆధ్వర్యంలో ఒక బృందం రాజస్థాన్ వెళ్లింది. అయితే అక్కడ జైలులో ఉన్న వారిని కలుసుకోవడానికి ఆమెకు సమయం పట్టింది. బెయిల్‌కు తీవ్ర యత్నాలు వివరాలు తెలుసుకుని న్యాయవాదిని నియమించి రాజస్థాన్ దిగువ కోర్టులో బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా రెండుసార్లు ప్రయత్నించినా బెయిల్ దొరకలేదు. దీనిపై నగర పోలీస్ కమిషనర్ యోగానంద్ను వివరణ కోరగా కోర్టు బెయిల్ పిటీషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసిందని, ఈసారి బెయిల్ మంజూరు కావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరైన వెంటనే పోలీసులను ఇక్కడికి తీసుకొస్తామన్నారు. ఈ కేసులో రాజస్థాన్ ఏసీబీ అధికారులు ఆరోపిస్తున్న విధంగా మన పోలీసులు తప్పు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. కేసు కోర్టులో ఉన్నందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు. ఆందోళనలో ఉద్యోగుల కుటుంబాలు.. విధి నిర్వహణలో రాజస్థాన్ వెళ్లిన తమ వారి రాక కోసం పోలీసు కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. నెల రోజులకుపైగా కుటుంబాలకు దూరంగా ఉండటంతో జైలులో ఉన్న పోలీసులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19వ తేదీనైనా బెయిల్ మంజూరు అవుతుందన్న ఆశతో వారు ఎదురు చూస్తున్నారు. -
పోలీస్ బాస్ బరస్ట్
‘మీ దర్యాప్తులో తేలిన అంశాలు పత్రికలకు లీకవుతున్నాయా లేక.. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు దర్యాప్తు చేస్తున్నారా?!.. ఎందుకిలా జరుగుతోంది.. మీ తీరుతో పోలీసు వ్యవస్థ పరువు తీస్తున్నారు’.. బాస్ నోటి నుంచి దూసుకొచ్చిన ఈ మాటల తూటాలు నగర పోలీసు అధికారులను సూటిగా తాకాయి.. గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా నిర్వహించిన ఐదు జిల్లాల ఉన్నతాధికారుల సమీక్షలో.. ఇటీవల విశాఖలో నమోదైన పలు సంచలనాత్మక కేసులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.. హత్య కేసుల్లో డీఎస్పీ రవిబాబు అరెస్టు.. బంగారం రికవరీకి రాజస్థాన్ వెళ్లిన పోలీసు అధికారులపై అక్కడి ఏసీబీ పంజా.. గంజాయి అక్రమ రవాణాలో ఎక్సైజ్ పోలీసుల పాత్ర బహిర్గతం.. తదితర ఘటనలు ప్రస్తావనకు వచ్చినప్పుడు పోలీస్ బాస్ ఒక్కసారి బరస్ట్ అయ్యారని సమాచారం..‘మీరేం చేస్తున్నారో.. ఇక్కడేం జరుగుతోందో.. ప్రతిదీ నాకు తెలుసు’.. అని క్లాస్ పీకారు.. ప్రశాంతతకు విశాఖ మారుపేరు.. అటువంటి నగరంలో క్రైమ్ రేటు పెరుగుతోంది.. పరిస్థితి అదుపు తప్పుతోంది.. పరువు పోతోంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని డీజీపీ గట్టిగా హెచ్చరించారు. సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హత్య కేసుల్లో ఓ డీఎస్పీ జైలుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా విశాఖ పోలీసుల పరువు గంగలో కలిసింది. ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో లంచం కేసులో అక్కడి ఏసీబీకి చిక్కడంతో జాతీయస్థాయిలోనూ మచ్చ వచ్చింది. ఇక గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ఎక్సైజ్ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఇవన్నీ తాజాగా జరిగిన ఘటనలే. పోలీసులను సవా ల్ చేస్తున్నవే.. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) సాంబశివరావు నగర పర్యటనకు రావడంతో పోలీసు అధికారులు హడలెత్తిపోయారు. పోలీస్ బాస్ ఏమంటారో... ఎవరికి చీవాట్లు పడతాయోనని ఆందోళన చెందారు. సరిగ్గా అధికారులు భయపడినట్లే జరిగింది. డీజీపీ సాంబశివరావు పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా గురువారం విశాఖ నగరంలో డీజీపీ సాంబశివరావు శ్రీకాకుళం, విజ యనగరం. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలతో పాటు రాజమండ్రి అర్బన్, విశాఖ పోలీస్ కమిషనరేట్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యచరణ రూపొందించడమే సమావేశం అజెండా అయినప్పటికీ విశాఖ పోలీసుల పనితీరుపై డీజీపీ సమీక్ష చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. నాకంతా తెలుసు నగరంలో గంజాయి సరఫరా, వినియోగంపై ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి సమాధానమివ్వబోగా డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘టాస్క్‌ఫోర్స్‌లో ఏం జరుగుతోంది.. శాఖాపరమైన ఫిర్యాదులు లెక్కలేనన్ని వస్తున్నాయి.. మీరేం చేస్తున్నారో అంతా నాకు తెలుసు’.. అని గట్టిగా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. ఇదే సందర్భంలో డీఎస్పీ రవి బాబు కేసు దర్యాప్తు విషయం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. ‘హత్య కేసుల్లో డీఎస్పీ ఉన్నా గానీ నిష్ఫక్షపాతంగా కేసు కట్టా రన్న పేరు తెచ్చుకున్నారు.. అక్కడ వరకు ఓకే కానీ.. ఆ కేసు దర్యాప్తు విషయాలు ముందుగానే పత్రికలకు ఎలా లీకయ్యాయని’ ప్రశ్నిం చినట్టు తెలిసింది. ‘మీరు దర్యాప్తు చేసిన విషయాలు ముందుగానే పూసగుచ్చినట్టు పత్రిక ల వారికి చెప్పారా.. లేదంటే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు విచారణ చేపట్టారా’.. అని సంబంధిత విచారణ అధికారులను నేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది.. అంతకు ముందు విశాఖ అంటే ప్రశాంత నగరమనే వాళ్లు.. కానీ ఈ మధ్యనే పరిస్థితి అదుపు తప్పింది.. శాంతిభద్రతల విషయంలో వెంటనే మార్పు రావాలి.. అని కమిషనరేట్ అధికారులను డీజీపీ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం. సెక్యూరిటీ లేకుండా ఆ అర్ధగంట డీజీపీ ఎక్కడకు వెళ్లారు? సమావేశం నుంచి డీజీపీ ఓ అర్ధగంట సేపు ఎటువంటి గన్‌మెన్ సెక్యూరిటీ లేకుండా ఒంటరిగానే ప్రైవేటు కారులో వెళ్లడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎస్పీలు, కమిషనర్లు, ఎక్సైజ్ అధికారులతో మొదలైన సమావేశం రెండు గంటలకు పైగా ఏకబిగిన సాగింది. అనంతరం డీజీపీ సమావేశం నుంచి బయటకు వచ్చి ఒక్కరే ఓ ప్రైవేటు కారులో బయటకు వెళ్లారు. సరిగ్గా ప్రెస్‌మీట్‌కు ముందు 6 గంటలకు తిరిగి చేరుకున్నారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ గన్‌మెన్ లేకుండా ఒంటరిగా ఆ అర్ధగంట ఎక్కడకు వెళ్లారోనని పోలీసు అధికారవర్గాల్లోనూ చర్చకు తెరలేపింది. కాగా, నగరంలోని సంపత్ వినాయగర్ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, దేవాలయానికి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఎందుకని ప్రైవేటు వాహనంలో వెళ్లారని ఓ పోలీసు అధికారి గురువారం రాత్రి సాక్షికి చెప్పుకొచ్చారు. -
హోదా కోసం రావడం పబ్లిక్ న్యూసెన్సట!
సాక్షి, విశాఖపట్నం/అమరావతి: ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు గురువారం సాయంత్రం విశాఖ వచ్చిన పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేతను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. రెండు గంటలకు పైగా అక్కడినుంచి కదలనివ్వలేదు. చివరకు 143 సెక్షన్‌ను ప్రయోగించాల్సి వస్తుందని జగన్‌కు చెప్పిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, నగర పోలీస్ కమిషనర్ టి.యోగానంద్‌లు ఆయనను బలవంతంగా విమానంలో తిరిగి హైదరాబాద్‌కు పంపించేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పోలీసులు 144 సెక్షన్‌ను విధించారనే మాట వినబడుతుంటుంది. ప్రజలకు ఈ సెక్షన్ గురించిన పూర్తి వివరాలు తెలియకపోయినా సంబంధిత ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో గుమిగూడకూడదు వంటి ఆంక్షలు ఉంటాయని అర్థమైపోతుంది. మరి 143 సెక్షన్ ఏమిటి? 144 సెక్షన్‌కు కాస్త అటు ఇటుగా ఉండే ఈ సెక్షన్ గురించి ఇండియన్ పీనల్ కోడ్ 45/1860లో వివరంగా ఉంది. ప్రజా జీవనానికి నిర్విరామంగా విఘాతం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవడానికి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచిగానీ, జిల్లా మేజిస్ట్రేట్ నుంచి గానీ అధికారం పొందిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేయవచ్చు. క్లుప్తంగా చెప్పాలంటే పబ్లిక్ న్యూసెన్స్ (ప్రజాజీవనానికి విఘాతం) పేరిట అరెస్ట్ చేయడానికి 143 సెక్షన్ అవకాశం కల్పిస్తోంది. అయితే విపక్ష నేత ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా జరిగే కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనడానికి వస్తే అది పబ్లిక్ న్యూసెన్స్ ఎలా అవుతుందో, హక్కుల కోసం మాట్లాడటం ప్రజా జీవనానికి విఘాతం ఎలా అవుతుందో పాలకులు, అధికారులే చెప్పాలి. ప్రతిపక్ష నేతగా కేబినెట్ హోదా కలిగిన వ్యక్తిపై 143 సెక్షన్ ప్రయోగానికి విశాఖ పోలీసులు పూనుకోవడంపై న్యాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పగ బట్టిన దొంగ
అదేంటి దొంగ పగబట్టడమేమిటని అనుకుంటున్నారా!?.. ఏం చేస్తాం.. యథా పోలీసు తథా దొంగలా మారింది అక్కడి పరిస్థితి. ఇంతకూ విషయమేమిటంటే.. గోపాలపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలో చందానగర్ సమీపంలోని ఓ ఇంట్లో ఐదు రోజుల క్రితం దొంగతనం జరిగింది. రాత్రి పూట కుటుంబ సభ్యులంతా డాబా మీద పడుకుంటే అర్ధరాత్రి దొంగ వచ్చి ఇంటి తాళాలు పగులగొట్టి రెండు బ్యాగుల సంచులు, మూడువేల రూపాయల నగదు ఎత్తుకుపోయారు. తెల్లారి కిందకు దిగి చూస్తే విషయం అర్ధమైంది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత బాధిత కుటుంబ సభ్యులు రైల్వేస్టేషన్ సమీపంలో అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడి వద్ద తమ ఇంట్లో చోరీ అయిన బ్యాగులు ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వాళ్లొచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తీసుకువెళ్లారు. బాల నేరస్తుడిగా గతంలోనూ చోరీ కేసులు నమోదైన చరిత్ర అతనికి ఉండటంతో.. కాస్త కోటింగ్ ఇద్దామనుకున్నారు. పోలీసుల ఉద్దేశాన్ని పసిగట్టిన ఆ దొంగ అపస్మారక స్థితిలోకి వెళ్లినట్టు హడావుడి చేశాడు. దీంతో ఎందుకొచ్చిన గొడవని భావించిన పోలీసులు అతన్ని ఎక్కడి నుంచి తీసుకువచ్చారో.. తిరిగి అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత సదరు దొంగ తాను దొంగతనం చేసిన ఇంటికి వెళ్లి ‘నాపైనే ఫిర్యాదు చేస్తారా.. మీ సంగతి చూస్తా’.. అంటూ బెదిరింపులకు దిగాడు. ఇదే విషయం పోలీసులకు చెబితే.. వామ్మో వాడిని మనమేం చేయలేం.. మీరు కూడా పట్టించుకోకండి అని ఉచిత సలహా ఇచ్చేశారు. దొంగను పట్టించినా ‘ఇదేం బాధ.. అటు డబ్బు పోయి.. ఇటు పట్టించిన దొంగ పగబట్టి... ఏమిటో మా పరిస్థితి’ అంటూ పాపం.. ఆ సగటు దిగువ మధ్యతరగతి కుటుంబ సభ్యులు అల్లాడిపోతున్నారట!. -
ప్రియురాలితో కలిసి చోరీలు... ప్రియుడి అరెస్ట్
విశాఖపట్నం : ప్రియురాలితో కలిసి చోరీ చేస్తూ... పోలీసులు కళ్లు కప్పి తిరుగుతున్న ఘరాన దొంగ శివ భవానిని ఎట్టకేలకు విశాఖపట్నంలో పోలీసులకు చిక్కాడు. బుధవారం పోలీసులు తనిఖీల్లో భాగంగా పీఎం పాలెం వద్ద శివ భవానిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 30 తులాల బంగారం, ల్యాప్ట్యాప్తోపాటు 3 బైక్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి... పోలీస్ స్టేషన్‌కి తరలించారు. శివ భవానిపై జిల్లా వ్యాప్తంగా పలు చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. పోలీసులు నిందితుడు శివ భవానిని తమదైన శైలిలో విచారిస్తున్నారు. -
విశాఖలో బాహుబలి అభిమానుల హల్చల్
విశాఖపట్నం: 'బాహుబలి' అభిమానులు గురువారం విశాఖపట్నంలో హల్చల్ సృష్టించారు. స్థానిక శ్రీకన్య థియేటర్లో బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించడం లేదని ఆ చిత్ర అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులోభాగంగా సదరు అభిమానులు ఈ రోజు ఉదయం శ్రీకన్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. శుక్రవారం బాహుబలి చిత్రాన్ని శ్రీకన్య థియేటర్లో చిత్రాన్ని ప్రదర్శించే విధంగా సన్నాహాలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ క్రమంలో శ్రీకన్య థియేటర్‌పై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో థియేటర్ అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. బాహుబలి అభిమానుల దాడి ఘటనపై యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన బాహుబలి చిత్రం మొదటి భాగం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. -
తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి
‘నారాయణ’లో తెలుగు విద్యార్థులపై ఇనుప రాడ్లు, కర్రలతో దాడి పీఎం పాలెం (విశాఖపట్నం): విశాఖపట్నం శివారు మధురవాడలోని నారాయణ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న ఉత్తరాది విద్యార్థులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. అదే కళాశాలలో చదువుతున్న తెలుగు విద్యార్థులను ఇనుప రాడ్లు, కర్రలు, బెల్టులతో చితకబాదారు. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనలో 31మంది గాయపడ్డారు. పీఎం పాలెం సీఐ ఎస్.అప్పలరాజు, బాధిత విద్యార్థుల కథనం ప్రకారం... ఈ కళాశాలలో జార్ఖండ్, రాజస్థాన్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాలకు చెందిన 190 మంది విద్యార్థులు సీబీఎస్సీ సెక్షన్లో చదువుతున్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అరకు, తదితర ప్రాంతాలకు చెందిన 110 మంది విద్యార్థులు స్టేట్ సిలబస్ బోధించే సెక్షన్లో విద్య అభ్యసిస్తున్నారు. వారి మధ్య శుక్రవారం సాయంత్రం భోజనాల సమయంలో వివాదం తలెత్తింది. ఇది పోలీసు స్టేషన్ వరకూ వెల్లడంతో కక్ష కట్టిన ఉత్తరాది విద్యార్థులు ఈ మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. దర్యాప్తు జరుగుతోంది. -
తెలుగు విద్యార్థులపై నార్త్ ఇండియా విద్యార్థుల దాడి
-
గాజువాక పైడిమాంబ కాలనీలో దొంగలు బీభత్సం
విశాఖపట్నం: విశాఖపట్నం గాజువాకలోని పైడిమాంబ కాలనీలో దోపిడి దొంగలు మంగళవారం అర్థరాత్రి బీభత్సం సృష్టించారు. టైల్స్ వ్యాపారి ఇంట్లో చోరీ చేసి... 60 తులాల బంగారంతోపాటు రూ. 10 లక్షల నగదు అపహరించి పరారైయ్యారు. ఈ విషయాన్ని బుధవారం ఉదయం గమనించి సదరు టైల్స్ వ్యాపారి పోలీసులకు ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసులను చూసి పెళ్లికొడుకు జంప్
విశాఖపట్నం: విశాఖపట్నం పెదవాల్తేరు ప్రాంతంలో గురువారం బాల్యవివాహం జరిగింది. ఈ బాల్య వివాహంపై స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటిన వివాహ వేదిక వద్దకు చేరుకున్నారు. అంతలోనే పెళ్లికొడుకు హడావుడిగా మైనర్ బాలికకు తాళికట్టాడు. పోలీసులు చూసి పెళ్లికొడుకు పరారైయ్యాడు. దాంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులతోపాటు పెళ్లికొడుకు తల్లిదండ్రులను పోలీసు స్టేషన్‌కు తరలించి... విచారిస్తున్నారు. -
రూ. 70 లక్షల గంజాయి స్వాధీనం
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా బుచ్చయ్యపేట మండలం రాజాం జంక్షన్ వద్ద పోలీసులు మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి అయిదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వ్యాన్ సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి 500 కేజీలు ఉందని పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 70 లక్షల వరకు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. అయిదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.