
‘మీ దర్యాప్తులో తేలిన అంశాలు పత్రికలకు లీకవుతున్నాయా లేక..
పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు దర్యాప్తు చేస్తున్నారా?!..
ఎందుకిలా జరుగుతోంది.. మీ తీరుతో పోలీసు వ్యవస్థ పరువు తీస్తున్నారు’..
బాస్ నోటి నుంచి దూసుకొచ్చిన ఈ మాటల తూటాలు నగర పోలీసు అధికారులను సూటిగా తాకాయి..
గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా నిర్వహించిన ఐదు జిల్లాల ఉన్నతాధికారుల సమీక్షలో.. ఇటీవల విశాఖలో నమోదైన పలు సంచలనాత్మక కేసులు కూడా ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం..
హత్య కేసుల్లో డీఎస్పీ రవిబాబు అరెస్టు.. బంగారం రికవరీకి రాజస్థాన్ వెళ్లిన పోలీసు అధికారులపై అక్కడి ఏసీబీ పంజా.. గంజాయి అక్రమ రవాణాలో ఎక్సైజ్ పోలీసుల పాత్ర బహిర్గతం.. తదితర ఘటనలు ప్రస్తావనకు వచ్చినప్పుడు పోలీస్ బాస్ ఒక్కసారి బరస్ట్ అయ్యారని సమాచారం..‘మీరేం చేస్తున్నారో.. ఇక్కడేం జరుగుతోందో.. ప్రతిదీ నాకు తెలుసు’.. అని క్లాస్ పీకారు.. ప్రశాంతతకు విశాఖ మారుపేరు.. అటువంటి నగరంలో క్రైమ్ రేటు పెరుగుతోంది.. పరిస్థితి అదుపు తప్పుతోంది.. పరువు పోతోంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాలని డీజీపీ గట్టిగా హెచ్చరించారు.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: హత్య కేసుల్లో ఓ డీఎస్పీ జైలుకెళ్లడంతో రాష్ట్రవ్యాప్తంగా విశాఖ పోలీసుల పరువు గంగలో కలిసింది. ఓ సీఐ, ఇద్దరు ఎస్సైలు ఎక్కడో రాజస్థాన్ రాష్ట్రంలో లంచం కేసులో అక్కడి ఏసీబీకి చిక్కడంతో జాతీయస్థాయిలోనూ మచ్చ వచ్చింది. ఇక గంజాయి స్మగ్లింగ్ కేసులో ఇద్దరు ఎక్సైజ్ అధికారులు అడ్డంగా బుక్కయ్యారు. ఇవన్నీ తాజాగా జరిగిన ఘటనలే. పోలీసులను సవా ల్ చేస్తున్నవే.. సరిగ్గా ఇదే సమయంలో రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్(డీజీపీ) సాంబశివరావు నగర పర్యటనకు రావడంతో పోలీసు అధికారులు హడలెత్తిపోయారు. పోలీస్ బాస్ ఏమంటారో... ఎవరికి చీవాట్లు పడతాయోనని ఆందోళన చెందారు. సరిగ్గా అధికారులు భయపడినట్లే జరిగింది. డీజీపీ సాంబశివరావు పోలీసుల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. గంజాయి నిర్మూలన ప్రధానాంశంగా గురువారం విశాఖ నగరంలో డీజీపీ సాంబశివరావు శ్రీకాకుళం, విజ యనగరం. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల ఎస్పీలతో పాటు రాజమండ్రి అర్బన్, విశాఖ పోలీస్ కమిషనరేట్ అధికారులు, ఎక్సైజ్ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కమిషనరేట్ పరిధిలోని డీసీపీలు, ఏసీపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గంజాయి నిర్మూలనకు ప్రత్యేక కార్యచరణ రూపొందించడమే సమావేశం అజెండా అయినప్పటికీ విశాఖ పోలీసుల పనితీరుపై డీజీపీ సమీక్ష చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
నాకంతా తెలుసు
నగరంలో గంజాయి సరఫరా, వినియోగంపై ప్రస్తావనకు వచ్చిన సందర్భంలో టాస్క్‌ఫోర్స్‌కు చెందిన ఓ అధికారి సమాధానమివ్వబోగా డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ‘టాస్క్‌ఫోర్స్‌లో ఏం జరుగుతోంది.. శాఖాపరమైన ఫిర్యాదులు లెక్కలేనన్ని వస్తున్నాయి.. మీరేం చేస్తున్నారో అంతా నాకు తెలుసు’.. అని గట్టిగా క్లాస్ పీకినట్టు చెబుతున్నారు. ఇదే సందర్భంలో డీఎస్పీ రవి బాబు కేసు దర్యాప్తు విషయం ప్రస్తావనకు వచ్చిందని అంటున్నారు. ‘హత్య కేసుల్లో డీఎస్పీ ఉన్నా గానీ నిష్ఫక్షపాతంగా కేసు కట్టా రన్న పేరు తెచ్చుకున్నారు.. అక్కడ వరకు ఓకే కానీ.. ఆ కేసు దర్యాప్తు విషయాలు ముందుగానే పత్రికలకు ఎలా లీకయ్యాయని’ ప్రశ్నిం చినట్టు తెలిసింది. ‘మీరు దర్యాప్తు చేసిన విషయాలు ముందుగానే పూసగుచ్చినట్టు పత్రిక ల వారికి చెప్పారా.. లేదంటే పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా మీరు విచారణ చేపట్టారా’.. అని సంబంధిత విచారణ అధికారులను నేరుగా ప్రశ్నించినట్టు తెలిసింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విశాఖ నగరంలో క్రైమ్ రేట్ విపరీతంగా పెరుగుతోంది.. అంతకు ముందు విశాఖ అంటే ప్రశాంత నగరమనే వాళ్లు.. కానీ ఈ మధ్యనే పరిస్థితి అదుపు తప్పింది.. శాంతిభద్రతల విషయంలో వెంటనే మార్పు రావాలి.. అని కమిషనరేట్ అధికారులను డీజీపీ గట్టిగా హెచ్చరించినట్లు సమాచారం.
సెక్యూరిటీ లేకుండా ఆ అర్ధగంట డీజీపీ ఎక్కడకు వెళ్లారు?
సమావేశం నుంచి డీజీపీ ఓ అర్ధగంట సేపు ఎటువంటి గన్‌మెన్ సెక్యూరిటీ లేకుండా ఒంటరిగానే ప్రైవేటు కారులో వెళ్లడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మధ్యాహ్నం 3.15 గంటలకు ఎస్పీలు, కమిషనర్లు, ఎక్సైజ్ అధికారులతో మొదలైన సమావేశం రెండు గంటలకు పైగా ఏకబిగిన సాగింది. అనంతరం డీజీపీ సమావేశం నుంచి బయటకు వచ్చి ఒక్కరే ఓ ప్రైవేటు కారులో బయటకు వెళ్లారు. సరిగ్గా ప్రెస్‌మీట్‌కు ముందు 6 గంటలకు తిరిగి చేరుకున్నారు. ఆయన పర్యటన పూర్తిగా వ్యక్తిగతమే అయినప్పటికీ గన్‌మెన్ లేకుండా ఒంటరిగా ఆ అర్ధగంట ఎక్కడకు వెళ్లారోనని పోలీసు అధికారవర్గాల్లోనూ చర్చకు తెరలేపింది. కాగా, నగరంలోని సంపత్ వినాయగర్ స్వామి ఆలయానికి వెళ్లి వచ్చారని, దేవాలయానికి వెళ్లేటప్పుడు సెక్యూరిటీ ఎందుకని ప్రైవేటు వాహనంలో వెళ్లారని ఓ పోలీసు అధికారి గురువారం రాత్రి సాక్షికి చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment