
సాక్షి, విశాఖ : నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విశాఖ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. మంగళవారం సాక్షితో ఆయన మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకలకు పకడ్బందీగా బందోబస్తు చేశామని పేర్కొన్నారు. 3400 మంది పోలీసులతో విశాఖ నగరంలో అడుగడుగునా భద్రతా ఏర్పాటు చేశామని వెల్లడించారు. విశాఖ వాసులు ప్రశాంతంగా వేడుకలు జరుపుకోవచ్చని అన్నారు. బీచ్ రోడ్ వైపు వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ మళ్లింపుతోపాటు ముందుగానే కొన్ని పార్కింగ్ స్థలాలు కేటాయించామని తెలిపారు. బీచ్ రోడ్డులోకి ఎలాంటి వాహనాలను అనుమతించడం లేదని, న్యూ ఇయర్ వేడుకలకు అర్ధరాత్రి ఒంటి గంట వరకే అనుమతి ఉందని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.