మరెన్నో విశేషాల సమాహారంగా బ్రిటన్ బుల్లి దీవి ‘ఫౌలా’
2025 ఏడాది మొదలై ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా కొత్త తీర్మానాలతో, ఆనందక్షణాలతో బంధుమిత్రుల సమక్షంలో జనమంతా నూతన సంవత్సరానికి స్వాగతం పలికేసి తమతమ పనుల్లో బిజీ అయిపోయారు. కానీ బ్రిటన్‌లోని ‘ఫౌలా’ద్వీపంలో మాత్రం అత్యంత ఆలస్యంగా అంటే సోమవారం (జనవరి 13) రోజు ఘనంగా కొత్త ఏడాది వేడుకలు జరిగాయి.
అందరూ డిసెంబర్ 31 రాత్రి నుంచే సెలబ్రేషన్లు మొదలెట్టి ముగించేస్తే వీళ్లేంటి ఇంత ఆలస్యంగా వేడుకలు చేస్తున్నారని ఆశ్చర్యపోకండి. వాళ్ల దృష్టిలో జనవరి 13వ తేదీనే అసలైన కొత్త ఏడాది. ఎందుకంటే వాళ్లు మనలా ఆధునిక గ్రెగోరియన్ క్యాలెండర్‌ను పాటించరు. ప్రాచీనకాలంనాటి సంప్రదాయ జూలియన్ క్యాలెండర్‌ను మాత్రమే అనుసరిస్తారు. జూలియన్ క్యాలెండర్ స్థానంలో నాలుగు శతాబ్దాల కిందట కొత్తగా గ్రెగరీ క్యాలెండర్ వచ్చిన సంగతి తెల్సిందే.
400 సంవత్సరల క్రితం నాటి 13వ పోప్ గ్రెగరీ కొత్త క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కొత్త క్యాలెండర్ ఆయన పేరిటే తర్వాత కాలంలో గ్రెగోరియన్ క్యాలెండర్‌గా స్థిరపడిపోయింది. కానీ ఫౌలా ద్వీపవాసులు మాత్రం తన ఐలాండ్‌లో వేడుకలను పాత జూలియన్ క్యాలెండర్‌ను అనుసరించి మాత్రమే జరుపుకుంటారు. అందుకే జూలియన్ క్యాలెండర్ ప్రకారం కొత్త ఏడాదిని జనవరి 13వ తేదీన మాత్రమే జరుపుకున్నారు. దీంతో ఆదివారం ద్వీపంలో సంబరాలు అంబరాన్ని తాకాయి. క్రిస్మస్‌ను సైతం వాళ్లు జూలియన్ క్యాలెండర్ ప్రకారమే చేసుకుంటారు. అందరూ డిసెంబర్ 25న క్రిస్మస్ చేసుకుంటే వీళ్లు మాత్రం జనవరి ఆరో తేదీన క్రిస్మస్‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు.
ఎక్కడుందీ ఫౌలా?
బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపంగా గుర్తింపు పొందిన ఈ ఫౌలా.. షెట్‌ల్యాండ్ అనే ప్రధాన ద్వీపానికి 16 మైళ్ల దూరంలో ఉంది. ఫౌలా ద్వీపం పొడవు కేవలం ఐదు మైళ్లు. ప్రధాన భూభాగం నుంచి ఇక్కడికి విద్యుత్‌లైన్ల వ్యవస్థ లేదు. అందుకే ఇక్కడ జనం సొంతంగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసుకున్నారు. పవన విద్యుత్, చిన్నపాటి జల విద్యుత్ వ్యవస్థ, సౌర ఫలకాలతో సౌర విద్యుత్‌ను సమకూర్చుకుంటున్నారు.
ప్రధాన ద్వీపసముదాయమైన షెట్లాండ్‌లోని టింగ్‌వాల్ విమానాశ్రయం నుంచి ఇక్కడికి విమాన సర్వీసులు ఉన్నాయి. బ్రిటన్‌లోని అత్యంత మారుమూల ద్వీపాల్లో ఒకటైన ఫౌలాలో అత్యంత పురాతన నార్న్ భాషను మాత్రమే మాట్లాడతారు. ఇక్కడి జనాభా కేవలం 40 మంది మాత్రమే. ప్రస్తుతం 36 మంది మాత్రమే ఉంటున్నారు. పని చేయడానికి బయటి నుంచి ఎవరూ రారు. మన పని మనం చేసుకోవాల్సిందే. ప్రకృతిని ఆస్వాదిస్తూనే ఇక్కడి జనమంతా పనుల్లో బిజీగా ఉంటారు.
రెండూ అద్భుతమైనవే: రాబర్ట్ స్మిత్
రెండు వారాల వ్యవధిలో రెండు క్రిస్మస్‌లు, రెండు నూతన సంవత్సర వేడుకలు రావడం నిజంగా బాగుంటుందని 27 ఏళ్ల రాబర్ట్ స్మిత్ వ్యాఖ్యానించారు. విద్యాభ్యాసం కోసం కొంతకాలం షెట్లాండ్ ద్వీపసముదాయంలో ఉన్న రాబర్ట్.. మళ్లీ ఫౌలాకు వచ్చేశారు. అందరు ద్వీపవాసుల మాదిరిగానే ఆయనా అనేక పనులు చేస్తాడు. పడవను నడపడం, నీటి శుద్ధి కర్మాగారంలో పనిచేయడం, టూర్లు, అవసరమైతే ఉత్తరాలు అందించడం అన్ని పనుల్లో పాలు పంచుకుంటాడు. ‘‘ఉరుకుల పరుగుల షెట్లాండ్ లైఫ్‌ను చూశా. ప్రశాంతమైన ఫౌలా జీవితాన్ని గడుపుతున్నా. ఆస్వాదించగలిగే మనసున్న ఫౌలా స్వాగతం పలుకుతోంది.
ఇక్కడ అందరం ఒకే కుటుంబంలా నివసిస్తాం. ఎప్పుడూ సంగీతం వింటాం. సాధారణంగా ఏ ద్వీపంలోనైనా వృద్ధులు, మధ్యవయస్కులు ఉంటారు. కానీ ఫౌలాలో ఎక్కువ మంది యువత, చిన్నారులే. గతంలో ఇక్కడి మెజారిటీ జనాభా పక్షుల వేటనే ప్రధాన వృత్తిగా ఎంచుకునేది. పక్షులను కొట్టి తెచ్చి కూర వండుకుని తినేయడమే. ఇప్పుడంతా మారిపోయింది. ఎన్నో వృత్తులు వచ్చాయి. తోటపని, చేపలు పట్టడం, కళాకారునిగా పనిచేయడం ఇలా...’’అని రాబర్ట్ అన్నారు. ‘‘ఇక్కడి వాళ్లు అందరితో కలుపుగోలుగా ఉంటారు. ప్రతి ఒక్కరి ఇంటికీ వెళ్తాం. ఆనందంగా పాడతాం. ఆడతాం. రాబర్ట్ గతంలో గిటార్ వాయించేవాడు. తర్వాత మాండలీన్ పట్టుకున్నాడు. ఇప్పుడేమో ఫిడేల్ నేర్చుకుంటున్నాడు’అని ద్వీపంలోని మరో వ్యక్తి చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment