new calendar
-
కాలగతిలో కొత్త వేకువ
మార్పు ప్రకృతి సహజ లక్షణం. చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు. కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది. రోజులుగా, నెలలుగా, ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండగుర్తు. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త కేలండర్లు వస్తాయి. కొత్త డైరీలు వస్తాయి. కొందరు అదృష్టవంతులకు ఒకరోజు సెలవు దొరుకుతుంది. కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందురోజు రాత్రి జనాలు సందడి సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకొంటారు. గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారు. అలాగని కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రపంచం అమాంతంగా మారిపోదు.లోకంలో మనుషులు ఎప్పటిలాగానే ఉంటారు. మనుషుల స్వభావాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. భూమి గోళాకారంలోనే ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన నింగి నుంచి చుక్కలు రాలిపడిపోవడం, దిక్కులు ఏకమైపోవడం వంటి ఆకస్మిక అనర్థాలేవీ సంభవించవు. ప్రపంచంలో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధాలు కొన సాగుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంక్షోభాలు రగులుతూనే ఉంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో వినిపించే కేరింతల హోరులో అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయంతే! ప్రపంచమంతా అలాగే ఉన్నప్పుడు మరి మారినదేమిటంటారా? మార్పు మన కళ్ల ముందే జరిగిపోతూ ఉంటుంది. ప్రచార పటాటోప కాంతులకు కళ్లుబైర్లు కమ్మిన దివాంధత్వంలో మనం వెనువెంటనే మార్పును గుర్తించలేం. కొంచెం తెప్పరిల్లిన తర్వాతనే మార్పు మనకు అర్థమవుతుంది. అనుభవంలోకి వస్తుంది. ‘మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు’ అని గ్రీకు తత్త్వవేత్త హెరా క్లిటస్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే చెప్పాడు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహంలో, వేడుకల సంరంభంలో మునిగిపోయిన జనానికి ఆ సమయంలో జరిగే మార్పులేవీ గోచరించవు. కేలండరు మారుతున్న వేళలోనే ఎక్కడో ఒకచోట ఒక మొక్క మొలకెత్తవచ్చు. ఒక మహావృక్షం నేలకూలిపోవచ్చు. కొత్తగా ఒక శిశువు ఈ భూమ్మీదకు రావచ్చు. పాతబడిన ఒక పండుటాకు రాలిపోవచ్చు. మరెక్కడో ఒకచోట నిశ్శబ్దంగా ఒక కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. ఒక విధ్వంసానికి కొత్తగా ధ్వంసరచన జరుగుతూ ఉండవచ్చు. వార్తలకెక్కితే తప్ప మార్పులను గుర్తించడం మానేశాం మనం. అయినా వార్తలతో నిమిత్తం లేకుండా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అసలు మనం జరుపుకొనే ఈ కొత్త సంవత్సరం వేడుకలు కూడా నానా మార్పుల ఫలితమే! ఇప్పటి మన నాగరికత, మన వేషభాషలు, మన సాంకేతిక పరిజ్ఞానం, మన కళానైపుణ్యాలు, మన ఆటపాటలు, మన తిండితిప్పలు వంటివన్నీ ఎన్నో మార్పుల ఫలితమే! ఎంతటి నియంతలకైనా మార్పును నివారించడం సాధ్యం కాదు. అనంత కాలవాహినిలో మార్పులు అలల్లా వచ్చిపోతుంటాయి. మంచి చెడులు మార్పులకూ వర్తిస్తాయి. మంచి మార్పులు వికాసానికి, చెడు మార్పులు వినాశానికి దారులు వేస్తాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిన్నటితో ముగిసిపోయిన సంవత్సరంలోనూ కొన్ని గణనీయమైన మార్పులే చోటు చేసుకున్నాయి. నిన్నటితో ముగిసిన ఏడాదిలో మానవాళికి మేలు చేసే పదమూడు మార్పులు జరిగినట్లు ‘టైమ్’ మ్యాగజైన్ కథనం చెబుతోంది. ఇదొక ఆశాజనకమైన విషయం. లోకంలో ఎక్కడో ఒకచోట అపశ్రుతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం వాటినే భూతద్దంలో చూపిస్తూ, ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వగచే వారికి ప్రపంచంలోని ఆశాజనకమైన మార్పులు అగుపడవు. అయితే, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని మహాకవి గురజాడ చెప్పిన మాటలు మరువరాదు. ప్రపంచమంతా శరవేగంగా మారిపోతున్నా, కొందరు యథాతథవాదులు మాత్రం మార్పును కోరుకోరు. తాము మారాలనుకోరు. లోకం తమ కళ్లముందే మారిపోతుండటాన్ని చూసి వారు ఏమాత్రం సహించలేరు. మార్పులను నివారించడానికి శాయశక్తులా విఫలయత్నాలు చేస్తుంటారు. కాలంచెల్లిన మనుషులు కాలం పరుగును వెనక్కు మళ్లించడానికి నానా విన్యాసాలు చేస్తుంటారు. విఫలయత్నాలు, విన్యాసాలు వికటించి మార్పులు అనివార్యమనే సంగతి అనుభవంలోకి వచ్చినా జీర్ణించుకోలేరు. కాలంతో కలసి ముందుకు సాగేవారిని, మార్పులను మనసారా స్వాగతించే వారిని, మార్పులకు దోహదపడేవారిని అక్కసుకొద్ది ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా లోకం తన మానాన తాను మారుతూనే ఉంటుంది. మార్పు తన శాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనాలు తమ జీవితాల్లో మేలి మార్పుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం కాలం మరింతగా అనుకూలించాలని, కష్టాలు కడతేరాలని, ప్రపంచంలో యుద్ధాలు సమసిపోవాలని, శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని, మానవాళికి మేలు కలగాలని, ప్రగతి దిశగా కాలం పరుగు వేగం పుంజుకోవాలని కోరుకుందాం. కొత్త సంవత్సరం కొత్త వేకువ ఉదయించాలని కోరుకుందాం. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కొత్త సంవత్సరం ఒక చక్కని సందర్భం. ఈ సందర్భాన్ని సార్థకం చేసుకుందాం. -
తెలంగాణ సాహితీ సంపద పరిరక్షణకు పెద్దపీట: శ్రీనివాస్‌గౌడ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సాహితీ సంపద పరిరక్షణకు పెద్దపీట వేశామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం తన కార్యాలయంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన క్యాలెండర్‌ను మంత్రి ఆవిష్కరించారు. తెలంగాణకు చెందిన ప్రాచీన కళలు, సాహిత్యం, చరిత్రలకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరిశంకర్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత పాలకులు నిర్లక్ష్యం చేసిన చరిత్ర, సాహిత్యం, కళలు, భాష, యాసలను ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరేటి వెంకన్న, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
స్కూలు పిల్లలకు ఎన్సీఈఆర్టీ క్యాలెండర్
న్యూఢిల్లీ: లాక్ డౌన్లో ఒకటినుంచి 12 తరగతుల విద్యార్థులు సమయం సద్వినియోగం చేసుకునేలా జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎన్సీఈఆర్టీ) ప్రత్యేక క్యాలెండర్ విడుదల చేసింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ గురువారం ఈ క్యాలెండర్ విడుదల చేశారు. టెక్నలాజికల్ టూల్స్, సోషల్ మీడియా టూల్స్ ఉపయోగించుకొని మరింత పరిజ్ఞానాన్ని పిల్లలకు అందించే విధంగా ఇందులోని కోర్సులు ఉన్నాయని రమేశ్చెప్పారు. ఇందులో అధ్యాపకులు బోధించే విషయాలను విద్యార్థులు చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. టెక్నాలజీ అందుబాటులో లేని విద్యార్థుల కోసం ఫోన్ కాల్ ద్వారా బోధించే విధానం కూడా ఇందులో ఉన్నట్లు వెల్లడించారు. 1 నుంచి 12 తరగతుల వరకు ఉన్న అన్ని విషయాలు ఇందులో ఉంటాయని, అయితే విద్యార్థులు వరుస క్రమంలోనే గాక, తమకు ఆసక్తి ఉన్న అంశాలను ఎన్నుకొని మరీ చూసి నేర్చుకోవచ్చని తెలిపారు. అందులో ఉన్న వరుస క్రమం తప్పనిసరి కాదని అన్నారు. లాక్ డౌన్ లో విద్యార్థులను సమయం వృధా కానివ్వకుండా, ఇది ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల స్కూళ్లు కూడా లబ్ధి పొందుతాయని చెప్పారు. -
నువ్వు నీ కుటుంబం మనం
కొత్త కొత్తగా ఇంకో మూడు రోజుల తరువాత వచ్చే నాలుగో రోజు సాయంత్రం నుంచి మన హడావిడి మొదలవుతుంది. మన సంతోషాల వేడికి చలికి చిరు చెమటలు పడతాయి. కేకులు తెగుతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ కేకలు ఎగిసిపడతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో లెఫ్ట్ అండ్ రైట్ను పట్టించుకుంటున్నాంగానీ మధ్యలో ఉన్న విలువైన నిధి జోలికి మాత్రం చాలామంది వెళ్లడం లేదు. ‘న్యూ’ అంటే మూడు అక్షరాల పదం కాదు... మనల్ని, మనతో పాటు కుటుంబాన్ని, కుటుంబంతో పాటు సమాజాన్ని మార్చేసే శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం. అందుకే ఈ అస్త్రం ఎప్పుడూ చెట్టెక్కకూడదు. ‘నేను’తోనే ఆ ఆయుధం పదును తేరుతుంది. జపాన్ ఆర్టిస్ట్, పీస్ యాక్టివిస్ట్, సింగర్ యోకో తరుచుగా ఒక మాట చెబుతుంటారు... ‘నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. అది మారితే ప్రపంచమే మారుతుంది’ అని! మార్పు, కొత్తదనం నుంచి వచ్చే ఫలితాలు ముందస్తుగా కనిపించవు. అమెరికన్-రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి వెరా నజరీయన్ మాటల్లో చెప్పాలంటే ‘కొత్తదనం’ లేదా ‘మార్పు’ అనేది తొలి వేకువ లాంటిది. పుట్టడం పుట్టడంతోనే వేకువ బ్రహ్మాండమైన వెలుగైపోదు. వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటిని చీల్చుకుంటూ మెల్లగా అరుణోదయం అవుతుంది. మార్పు కూడా అంతే. మనం మారాలనుకున్నప్పుడు, కొత్తగా బతకాలనుకున్నప్పుడు ప్రతికూలత అనే చీకటి ఆవరించి ఉంటుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. పట్టుదల అనే వేడికి ఆ చీకటి కరిగిపోతుంది. వెలుగుబాటకు దారి చూపుతుంది. ఇప్పుడు మళ్లీ మనం యోకో దగ్గరికి వద్దాం. ‘రోజూ పొద్దుటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని పలకరించుకో. కొద్ది కాలం తరువాత నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పేమిటో గమనించుకో’ అంటారామె. అద్దం అంటే మ్యాజిక్ మిర్రర్ కాదు. అందరింట్లో ఉండే మామూలు అద్దమే. అది అద్దమే కాదు, అంతరాత్మ కూడా. అందుకే ఉదయమే అద్దాన్ని పలకరించండి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ మూడు ప్రశ్నలూ వేయండి. అద్దమే సమాధానం చెబుతుంది. ‘నేను ఇలా ఎందుకు ఉన్నాను?’ ‘దీనికి కారణం ఏమిటి?’ ‘దీని నుంచి బయటపడడమెలా?’ అన్ని సమస్యలకూ ఈ మూడు ప్రశ్నలే సమాధానం చెబుతాయి. మనల్ని కొత్త మనిషిగా సమాజం ముందు నిలుపుతాయి. శేషేంద్ర కవిత్వాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. ‘బయట ఉన్నది నేనే/లోపల ఉన్నది నేనే/బయటి బాధలకు నేను ఎప్పుడు కరిగి నీరై పోయానో/అప్పుడే నేను నా లోపలి బాధల్ని పోల్చుకోలిగాను.’ నిజానికి పోల్చుకోగలిగింది ‘బాధ’ మాత్రమే కాదు... జీవనోత్సాహం, జీవనవైవిధ్యం... ఇలా ఎన్నెన్నో! మన కుటుంబానికి ఏం చేయవచ్చు? కుటుంబం పట్ల మన బాధ్యత మనకు సరికొత్త శక్తినిస్తుంది. ‘నా తల్లిదండ్రులు గర్వపడే పని చేస్తాను’ అను కున్నప్పుడు... ఆ బాధ్యత మనలో శక్తిని నింపుతుంది. కుటుంబం ఇవ్వడంతో పాటు తీసుకోవడమూ నేర్పుతుంది. ‘నైతిక మద్దతు’ అనేదాన్ని కుటుంబం మనకిస్తే , విజయానందం అనేదాన్ని మనం కుటుంబానికి ఇస్తాం. ఈ గజిబిజి బిజీ బతుకుల కాలంలో ఎవరికి వారు ఒంటరీ ద్వీపాలమైపోతున్నాం. వెలుగు లేని చీకటి దీపాలవుతున్నాం. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా... కుటుంబంతో గడపాలి. అమ్మ సలహా, నాన్న కోపం, అన్న తిట్టు, అక్క అలక, తమ్ముడి అల్లరి... ఏదీ వృథా పోదు. అన్నీ జీవితాన్ని వర్ణమయం చేస్తాయి. టైమ్ ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు... టైమ్ తీసుకొని కుటుంబంతో గడపడమే మనం వారికిచ్చే విలువైన కానుక. కుటుంబంతో గడపడమంటే కుటుంబాన్ని గౌరవించడం, కుటుంబాన్ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడం, సమాజాన్ని గౌరవించడం కూడా! ‘రక్తం బంధాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమ మాత్రమే కుటుంబాన్ని ఇస్తుంది.’ సమాజానికి ఏంచేయాలి? సమాజంలో భాగంగా బతుకుతున్న మనం సమాజం కోసం పాటుబడాలి. దీనికి ఒకే ఒక మంత్రం, మార్గం... పీయస్ఆర్! అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ! ఒక్కమాటలో చెప్పాలంటే ‘మనకు ఇతరులు ఏం చేయాలనుకుంటామో... మనం ఇతరులకు అది చేయడం!’ ట్రాఫిక్స్ రూల్స్ సరిగ్గా పాటించడం నుంచి పర్యావరణ స్పృహతో చేసే మంచి పని వరకు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టించడం నుంచి నెలజీతంలో ఎంతో కొంత సేవకు వెచ్చించే దయాగుణం వరకు... ఏది చేసినా సమాజం కోసం చేసినట్లే. ‘వందమందికి సహాయం చేసే శక్తి లేకపోతే కనీసం ఒక్కరికైనా సహాయం చెయ్’ అనే మాట గుర్తుంచుకుంటే చాలు. కొత్త సంవత్సరం అంటే పాత గోడ మీద కొత్త క్యాలెండర్ కనిపించడం కాదు. కొత్త జీవితానికి తాజాగా ఒక ద్వారం తెరుచుకోవడం. ‘పాత ఆలోచనల నుంచి బయటికి వచ్చినప్పుడే, కొత్తదనాన్ని చూడగలం. సంతోషంగా ఉండగలం’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. కొత్త ద్వారంలోకి ప్రవేశించే ముందు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది! -
ఆశల పల్లకీలో మన్మథ
పరంపరానుగతంగా పరిభ్రమించే యుగచక్రంలోకి నేటినుంచి మరో నూతన సంవత్సరం వచ్చి చేరబోతున్నది. మన్మథ నామ సంవత్సరానికి చోటిచ్చి జయ నామ సంవత్సరం నిష్ర్కమిస్తున్నది. మూడు కాలాలనూ, ఆరు రుతువులనూ తురుముకొని వచ్చే కొత్త సంవత్సరం తనతోపాటు ఎన్నో ఆశలనూ, ఆకాంక్షలనూ మోసుకొస్తుంది. కాలం పుటల్లో ఒదిగిపోయిన పాత సంవత్సరం సుఖదుఃఖాల, మంచీచెడుల, సంతోషవిషాదాల కలనేతగా సాగిపోయినా రాబోయే కాలం మాత్రం తమకు మంచే చేస్తుందని, సంతోషంలోనే ముంచెత్తుతుందని, కష్టాలనన్నిటినీ కడతేరుస్తుందని, తమ జీవితాన్ని సుఖమయం చేస్తుందని విశ్వసించడం సగటు జీవి లక్షణం. అందుకే ఉగాదితోపాటు విడుదలయ్యే కొత్త పంచాంగంలో రాశి ఫలాలను చదవాలని, ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకోవాలని ఆత్రుతపడతారు. తమ రాశికి రాజ పూజ్యమే రాసిపెట్టి ఉండాలని... అవమానాలున్నా అవి కనిష్టంగా మిగలాలని ఆశిస్తారు. ఇక ఆరోజు సాగే పంచాంగ శ్రవణం కోసం అందరికందరూ ఉవ్విళ్లూరుతారు. పంటలెలా పండుతాయో, ఈతిబాధల సంగతేమిటో, విపత్తుల తీరుతెన్నులెలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆశలకు తగ్గట్టే ఉగాది తనతోపాటు వసంత రుతువును తెస్తుంది గనుక ఈ సమయంలో ప్రకృతి సైతం మనల్ని సంభ్రమాశ్చర్యపరిచేలా సింగారించుకుంటుంది. మత్త కోకిలల కుహూకుహూరావాలు... వేపపూల ఘుమఘుమలు... మరుమల్లెల సుగంధం మనల్ని మరో ప్రపంచపుటంచుల్ని తాకిస్తుంటే, చెట్లన్నీ కొత్త బట్టలు తొడుక్కున్న ట్టుగా లేత పచ్చని చిగుళ్లతో వింత సోయగాలను సంతరించుకుంటాయి. ఈ సృష్టిలో రోజులన్నీ మంచివేనని, ఘడియలన్నీ ఉత్తమమైనవేనని... శుభసంకల్పమే దేనికైనా ముఖ్యమని విజ్ఞుల ఉద్ఘాటింపులున్నా పంచాంగంలో ‘మంచి ముహూర్తాన్ని’ ఎంచుకోవడం మామూలే. మొదలెట్టే పనికి ఆటంకాలెదురు కాకుండా ఉండాలంటే, చకచకా సాగాలనుకుంటే ఈ ‘వెతుకులాట’ ఉత్తమమనిపిస్తుంది. అలాగని మనిషి నిర్లిప్తంగా ఉండిపోడు. అంతా విధి లిఖితమని ఊరుకోడు. సవాళ్లను ఎదుర్కొనడా నికి, అగడ్తలను అధిగమించడానికి మనోస్థైర్యంతో, పట్టుదలతో నిత్యం ప్రయత్ని స్తూనే ఉంటాడు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘దుఃఖంలోనే ఆశాదీపిక...చీకటిలోనే తారాగీతిక’లను వెదుక్కుంటూనే ఉంటాడు. ఆ అన్వేషణ రేపో మాపో ముగిసి పోయేది కాదు. అది అనంతం. ఈ భూమ్మీద మనిషి ఉన్నంతవరకూ సాగే ప్రయా ణం. నూతన సంవత్సర ఆగమనం వేళ ఆశల్ని చిగురింపజేసుకోవడం అందులో భాగమే. ఏదో ఒక పేరుతో రావడం తెలుగు సంవత్సరాల విశిష్టత. ఇందులో భయపెట్టేవి, సంభ్రమపరిచేవి, ఆశపెట్టేవి ఉంటాయి. రౌద్రి, రక్తాక్షి, రాక్షస వంటివి ఉన్నట్టే... విరోధి, వికారి, పరాభవ, దుర్ముఖి, దుర్మతి ఉంటాయి. ఇంకా...విజయ, జయ, ప్రమోదూత ఉంటాయి. ఇలా ప్రభవాది 60 సంవత్సరాల్లో మన్మథ 29వ సంవత్సరం. ఇది సుఖసౌఖ్యాలను కలిగించే సంవత్సరమని, ప్రకృతి సోయగాలను రెట్టింపుచేసే సంవత్సరమని ఊరిస్తున్నారు. ప్రేమోద్దీపనను వ్యాప్తి చేస్తుందంటున్నారు. నిజా నిజాలేమిటని తర్కించక్కరలేదు. అరవైయ్యేళ్లనాడు ఇదే సంవత్సరం ఏం చేసి వెళ్లిందో చూసి చెప్పేయొచ్చు. కానీ, అలా వెనక చూపులు చూడటం నిరాశావాదుల పని. ఏదో ఒరుగుతుందని ఆశించి ముందుకెళ్లడమే మనిషి లక్షణం. ఉగాదిని మనం ఒక్కరమే కాదు...పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు మొదలుకొని మణిపూర్, అస్సాంల వరకూ చాలామంది జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు. పండగ జరిపే రోజులు వేరు. మహారాష్ట్రలో గుడిపాడ్వా, కేరళలో విషు, రాజస్థాన్‌లో తపన, పంజాబ్‌లో బైశాఖి, అస్సాంలో బిహు మన ఉగాదిని పోలినవే. ఈసారి మన ఉగాదికి మరో విశిష్టత కూడా ఉంది. భూగోళమంతటా పగలూ, రాత్రీ సమానంగా ఉండే ఈక్వినాక్స్ (విషువత్తు) సంభవించే మార్చి 21నే మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాం. కొన్నేళ్లపాటు మన తెలుగు నేలన ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలు, దాంతో పాటు వచ్చి చేరిన అపోహలు, అపార్థాలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. నిరుడు జయ ఉగాది నాటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయినా లాంఛనంగా విడిపోవడానికి మరికొంత సమయం పట్టింది. కనుక రెండు రాష్ట్రాలుగా ఉగాది జరుపుకోవడం తెలుగు ప్రజలకు ఇది మొదటిసారి. ఇతరేతర సమస్యలు ఎన్ని ఉన్నా రెండు రాష్ట్రాల అధినేతలూ సమష్టిగా కదిలి తెలుగుకు లభించిన ప్రత్యేక శిష్ట భాషా ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తారనుకుంటే పట్టనట్టు ఉండిపోతున్నారని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఇక ఇరు రాష్ట్రాలమధ్యా పరిష్కరించుకోవాల్సిన సమస్యలే కాదు... కొత్త రాష్ట్రాలు కావడంవల్ల ఎక్కడికక్కడ తలెత్తినవీ ఉన్నాయి. ఏటా మూడు, నాలుగు పంటలు పండే తమ భూములపై రాజధాని నగరం దిగబడుతున్నదని తెలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంత రైతాంగం, రైతు కూలీలు కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. భయపడి భూములిచ్చినవారూ, ఇవ్వబోమని భీష్మించినవారూ కూడా ఇందులో ఉన్నారు. హామీలు నమ్మి తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని, బ్యాంకుల్లో తాకట్టుపడిన బంగారం మళ్లీ ఇంటి తలుపు తడుతుందని ఎదురుచూసిన రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. మన్మథ పేరెట్టుకున్నంత మాత్రాన ఈ ఏడాదంతా బాగుంటుందని అలాంటివారంతా అనుకోవడం సాధ్యమేనా? ఒకటి కాదు...రెండు మూడు ఉగాదులు కలిసి కట్టగట్టుకు వచ్చినా వారిలో అలుముకున్న నిరాశానిస్పృహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. ఒక కవి అన్నట్టు కాలం అద్దంలాంటిది. అందులో కనబడే అందమైన దృశ్యమైనా, భీతిగొలిపే చిత్రమైనా... అది మన ప్రతిబింబమే! స్వస్వరూప జ్ఞానంతో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటే బంగారు భవిష్యత్తు మనదవుతుంది. ఆ ఎరుక అందరిలోనూ... మరీ ముఖ్యంగా పాలకుల్లో కలగాలని ఆశిద్దాం.