నువ్వు నీ కుటుంబం మనం | New Year Special! | Sakshi
Sakshi News home page

నువ్వు నీ కుటుంబం మనం

Published Sun, Dec 27 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 2:37 PM

నువ్వు నీ కుటుంబం మనం

నువ్వు నీ కుటుంబం మనం

కొత్త కొత్తగా
ఇంకో మూడు రోజుల తరువాత వచ్చే నాలుగో రోజు సాయంత్రం నుంచి మన హడావిడి మొదలవుతుంది. మన సంతోషాల వేడికి చలికి చిరు చెమటలు పడతాయి. కేకులు తెగుతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ కేకలు ఎగిసిపడతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో లెఫ్ట్ అండ్ రైట్‌ను పట్టించుకుంటున్నాంగానీ మధ్యలో ఉన్న విలువైన నిధి జోలికి మాత్రం చాలామంది వెళ్లడం లేదు. ‘న్యూ’ అంటే మూడు అక్షరాల పదం కాదు...

మనల్ని, మనతో పాటు కుటుంబాన్ని, కుటుంబంతో పాటు సమాజాన్ని మార్చేసే శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం. అందుకే ఈ  అస్త్రం ఎప్పుడూ చెట్టెక్కకూడదు. ‘నేను’తోనే ఆ ఆయుధం పదును తేరుతుంది. జపాన్ ఆర్టిస్ట్, పీస్ యాక్టివిస్ట్, సింగర్ యోకో తరుచుగా ఒక మాట చెబుతుంటారు... ‘నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. అది మారితే ప్రపంచమే మారుతుంది’ అని! మార్పు, కొత్తదనం నుంచి వచ్చే ఫలితాలు ముందస్తుగా కనిపించవు. అమెరికన్-రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి  వెరా నజరీయన్ మాటల్లో చెప్పాలంటే ‘కొత్తదనం’ లేదా ‘మార్పు’ అనేది తొలి వేకువ లాంటిది.

పుట్టడం పుట్టడంతోనే వేకువ బ్రహ్మాండమైన వెలుగైపోదు. వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటిని చీల్చుకుంటూ మెల్లగా అరుణోదయం అవుతుంది. మార్పు కూడా అంతే. మనం మారాలనుకున్నప్పుడు, కొత్తగా బతకాలనుకున్నప్పుడు ప్రతికూలత అనే చీకటి ఆవరించి ఉంటుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. పట్టుదల అనే వేడికి ఆ చీకటి కరిగిపోతుంది.

వెలుగుబాటకు దారి చూపుతుంది. ఇప్పుడు మళ్లీ మనం యోకో దగ్గరికి  వద్దాం. ‘రోజూ పొద్దుటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని పలకరించుకో. కొద్ది కాలం తరువాత నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పేమిటో గమనించుకో’ అంటారామె. అద్దం అంటే మ్యాజిక్ మిర్రర్ కాదు. అందరింట్లో ఉండే మామూలు అద్దమే. అది అద్దమే కాదు, అంతరాత్మ కూడా. అందుకే ఉదయమే అద్దాన్ని పలకరించండి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ మూడు ప్రశ్నలూ వేయండి. అద్దమే సమాధానం చెబుతుంది.

‘నేను ఇలా ఎందుకు ఉన్నాను?’ ‘దీనికి కారణం ఏమిటి?’ ‘దీని నుంచి బయటపడడమెలా?’ అన్ని సమస్యలకూ ఈ మూడు ప్రశ్నలే సమాధానం చెబుతాయి. మనల్ని కొత్త మనిషిగా సమాజం ముందు నిలుపుతాయి.
 శేషేంద్ర కవిత్వాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. ‘బయట ఉన్నది నేనే/లోపల ఉన్నది నేనే/బయటి బాధలకు నేను ఎప్పుడు కరిగి నీరై పోయానో/అప్పుడే నేను నా లోపలి బాధల్ని పోల్చుకోలిగాను.’
 
నిజానికి పోల్చుకోగలిగింది ‘బాధ’ మాత్రమే కాదు... జీవనోత్సాహం, జీవనవైవిధ్యం... ఇలా ఎన్నెన్నో! మన కుటుంబానికి ఏం చేయవచ్చు? కుటుంబం పట్ల మన బాధ్యత మనకు సరికొత్త శక్తినిస్తుంది. ‘నా తల్లిదండ్రులు గర్వపడే పని చేస్తాను’ అను కున్నప్పుడు... ఆ బాధ్యత మనలో శక్తిని నింపుతుంది. కుటుంబం ఇవ్వడంతో పాటు తీసుకోవడమూ నేర్పుతుంది. ‘నైతిక మద్దతు’ అనేదాన్ని కుటుంబం మనకిస్తే , విజయానందం అనేదాన్ని మనం కుటుంబానికి ఇస్తాం.
 
ఈ గజిబిజి బిజీ బతుకుల కాలంలో  ఎవరికి వారు ఒంటరీ ద్వీపాలమైపోతున్నాం. వెలుగు లేని చీకటి దీపాలవుతున్నాం. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా... కుటుంబంతో గడపాలి. అమ్మ సలహా, నాన్న కోపం, అన్న తిట్టు, అక్క అలక, తమ్ముడి అల్లరి... ఏదీ వృథా పోదు. అన్నీ జీవితాన్ని వర్ణమయం చేస్తాయి. టైమ్  ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు... టైమ్ తీసుకొని కుటుంబంతో గడపడమే మనం వారికిచ్చే విలువైన కానుక. కుటుంబంతో గడపడమంటే కుటుంబాన్ని గౌరవించడం, కుటుంబాన్ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడం, సమాజాన్ని గౌరవించడం కూడా! ‘రక్తం బంధాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమ మాత్రమే కుటుంబాన్ని ఇస్తుంది.’
 సమాజానికి ఏంచేయాలి?
 
సమాజంలో భాగంగా బతుకుతున్న మనం సమాజం కోసం పాటుబడాలి. దీనికి ఒకే ఒక మంత్రం, మార్గం... పీయస్‌ఆర్! అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ! ఒక్కమాటలో చెప్పాలంటే ‘మనకు ఇతరులు ఏం చేయాలనుకుంటామో... మనం ఇతరులకు అది చేయడం!’
 
ట్రాఫిక్స్ రూల్స్ సరిగ్గా పాటించడం నుంచి పర్యావరణ స్పృహతో చేసే మంచి పని వరకు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టించడం నుంచి నెలజీతంలో ఎంతో కొంత సేవకు వెచ్చించే దయాగుణం  వరకు... ఏది చేసినా సమాజం కోసం చేసినట్లే. ‘వందమందికి సహాయం చేసే శక్తి లేకపోతే కనీసం ఒక్కరికైనా సహాయం చెయ్’ అనే మాట గుర్తుంచుకుంటే చాలు.
 
కొత్త సంవత్సరం అంటే పాత గోడ మీద కొత్త క్యాలెండర్ కనిపించడం కాదు. కొత్త జీవితానికి తాజాగా ఒక ద్వారం తెరుచుకోవడం. ‘పాత ఆలోచనల నుంచి బయటికి వచ్చినప్పుడే, కొత్తదనాన్ని చూడగలం. సంతోషంగా ఉండగలం’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. కొత్త ద్వారంలోకి ప్రవేశించే ముందు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది!

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement