Jiddu Krishnamurti
-
ఆధునిక తత్వవేత్తలకు ఆద్యుడు
చిత్తూరు జిల్లా మదనపల్లెలోని జిడ్డు నారాయణయ్య, సంజీవమ్మ దంపతులకు మే 12, 1895లో జిడ్డు కృష్ణమూర్తి జన్మించారు. 14ఏళ్ల వయసున్న కృష్ణమూర్తిని అడయార్ దివ్య జ్ఞాన సమాజంలో మొదటిసారి చూసిన లెట్ బీటర్ తమ సమాజ సభ్యులు ఎదురు చూస్తున్న జగత్ గురువు ఈ బాలుడిలోనే ఉన్నాడని ప్రకటించాడు. డాక్టర్ అనీబీసెంట్ వారిని సమాజంలో చేర్పించడంతోపాటు ఉన్నత విద్యకై ఇంగ్లండ్ పంపారు. ఇంతలో తమ్ముడికి జబ్బు చేయడంతో అమెరికా తీసుకువెళ్లారు. కానీ, తమ్ముడు నిత్యానంద మరణించారు. తమ్ముడి మరణం కృష్ణమూర్తిలో మార్పు తీసుకువచ్చింది. ‘ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఇన్ ద ఈస్ట్’ అనే ఒక అంతర్జాతీయ సంఘానికి అనీబీ సెంట్ ఆయనను అధ్యక్షుడిగా చేశారు. ప్రపంచంలో ఉన్నతమైన గౌరవం లభించినప్పటికీ దానికి విలువ ఇవ్వకుండా సాధారణ జీవి తాన్ని గడిపారు. తరువాత జగత్ గురువు పీఠాన్ని స్వీకరించడం ఇష్టంలేదని 1929లో హాలెండ్లో జరి గిన సమావేశంలో ఆ సంస్థను రద్దు చేశారు. నాటినుంచి కృష్ణమూర్తి స్వతంత్ర మానవుడిగా అవతరిం చారు. ఎవరి సహాయాన్ని ఆశించక జీవన శిల్పిగా రూపొందారు. భాషకందని భావం తన కళ్లలో, మాటల్లో కదలాడుతూండేది. అద్భుతమైన చైతన్యం ఆయనను ప్రపంచ దార్శనికునిగా నిలబెట్టింది. జీవన్మరణాలు నాణేనికి రెండు వైపులా ఉండే ముద్రలని ఆయన అన్నారు. జీవించడం ఒక అందమైన కళ. ఆ కళను చక్కగా అనుభవించాలని ఆయన చెప్పారు. మహా ప్రవాహంలాంటి జీవి తాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని అన్నారు. జీవి తమంటే సత్యమైనది, సుందరమైనది, శివమైనది అంటారు. ప్రపంచాన్ని మంచి మార్గంలో నడిపించడానికి యత్నించిన కృష్ణమూర్తి 17 ఫిబ్రవరి 1986న కన్నుమూశారు. (నేడు జిడ్డు కృష్ణమూర్తి జయంతి) – పింగళి బాగ్యలక్ష్మి, గుంటూరు మొబైల్ : 97047 25609 -
హృదయ నిరాడంబరత
జిడ్డు కృష్ణమూర్తి ‘కామెంటరీస్ ఆన్ లివింగ్’ పుస్తకం తెలుగులోకి ‘మన జీవితాలు’ (జిడ్డు కృష్ణమూర్తి వ్యాఖ్యానాలు)గా 1997లో వచ్చింది. దీన్ని అబ్బూరి ఛాయాదేవి అనువదించారు. ప్రచురణ: ప్రగతి పబ్లిషర్స్. దీని ప్రత్యేకత ఏమిటంటే– ‘కృష్ణమూర్తి ప్రచురణలలో ఎక్కువ భాగం వివిధ సందర్భాల్లో, వివిధ ప్రదేశాల్లో చేసిన ప్రసంగాలు కాగా యీ ప్రస్తుత గ్రంథం ఆయన స్వయంగా చేసిన లిఖిత రచన’. అందులో హృదయ నిరాడంబరత గురించి కృష్ణాజీ ఇలా వ్యాఖ్యానిస్తారు: ‘‘వస్తు వాహనాలు కలిగి ఉండటంలో నిరాడంబరత కన్న హృదయ నిరాడంబరత చాలా ముఖ్యమైనది, అర్థవంతమైనది. ఏవో కొద్ది వస్తువులతో తృప్తిపడి ఉండటం అంత కష్టం కాదు. సౌఖ్యాన్ని వదులుకోవటం, ధూమపానం మొదలైన అలవాట్లను మానివెయ్యటం– ఇవి హృదయ నిరాడంబరతని సూచించవు. వేషభూషణాలతో, సౌఖ్యాలతో, అనేక ఆకర్షణలతో నిండి ఉన్న ప్రపంచంలో గోచీగుడ్డ కట్టుకుని తిరిగినంత మాత్రాన స్వేచ్ఛా జీవనాన్ని సూచించదు. ‘‘వాస్తవికతని బాహ్యనిగ్రహాల ద్వారా, ఆంక్షల ద్వారా చేరుకోగలరా? బాహ్యనిరాడంబరత, సుఖాల్ని వదులుకోవటం అవసరమే అయినా, ఆ మాత్రం చేష్టకే యథార్థం అనేదానికున్న ద్వారం తెరుచుకుంటుందా? సౌఖ్యంతో, విజయంతో మనస్సు, హృదయం భారమైపోతాయి. ప్రయాణం చెయ్యాలంటే స్వేచ్ఛగా ఉండాలి. అయితే, మనం ఈ బాహ్య చేష్టతోనే ఎందుకంత సతమతమైపోతున్నాం? మన ఉద్దేశాన్ని బాహ్య రూపంలో పెట్టటానికి ఎందుకంత ఉత్సుకత, ఎందుకంత పట్టుదల? ఇది ఆత్మవంచన వల్ల కలిగే భయం వల్లనా, మరొక కారణం వల్లనా? మన చిత్తశుద్ధి గురించి మనల్ని మనమే నమ్మించుకోవాలని ఎందుకు కోరుకుంటాం? సుస్థిరంగా ఉండాలనే కోరికలోనూ, ఏదో అయితే మనకి ఘనత ఉంటుందన్న నమ్మకంలోనూ ఈ సమస్యంతా ఇమిడి ఉంది. ఏదో అవాలనే కోరికతోనే చిక్కులన్నీ ఆరంభమవుతాయి. ఏదో అవాలి అనే కోరిక లోపలా, బయటా కూడా అంతకంతకు పెరిగిపోవటం వల్ల కూడబెట్టు కోవటం, త్యజించటం, అలవరుచుకోవటం, లేదా వదులుకోవటం చేస్తూ ఉంటాం. కాలం అన్నింటినీ దోచేస్తుందని తెలిసి కాలరహితమైన దానికోసం ప్రాకులాడతాం. ఏదో అవాలని చేసే పోరాటం– ఏదైనా చెయ్యటం ద్వారా గాని, మానెయ్యటం ద్వారా గాని, బంధనాలను పెంచుకోవటం ద్వారా గాని, వాటిని వదులుకోవటం ద్వారా గాని, బాహ్య చేష్టలతో గాని, క్రమశిక్షణతో గాని, సాధనతో గాని ఎన్నటికీ అంతం కాలేదు. కాని, ఈ పోరాటాన్ని అవగాహన చేసుకోవటంతోనే, ఏ విధమైన బాహ్య ప్రేరణ లేకుండా దానంతట అదిగా స్వేచ్ఛ కలుగుతుంది. బహిరంగంగానూ, ఆంతరంగికంగానూ జరిగే సేకరణ నుంచీ, అది కలిగించే సంఘర్షణల నుంచీ విముక్తి లభిస్తుంది. కేవలం బంధనాలను తెంచుకోవటం ద్వారా వాస్తవికతని చేరుకోలేము. ఏ మార్గాన్ని అవలంబించినా అది సాధ్యం కాదు. అన్ని మార్గాలూ, లక్ష్యాలూ ఒకే విధమైన బంధనాలు. అవన్నీ వదులుకోవాలి వాస్తవిక స్థితి కోసం.’’ -
నువ్వు నీ కుటుంబం మనం
కొత్త కొత్తగా ఇంకో మూడు రోజుల తరువాత వచ్చే నాలుగో రోజు సాయంత్రం నుంచి మన హడావిడి మొదలవుతుంది. మన సంతోషాల వేడికి చలికి చిరు చెమటలు పడతాయి. కేకులు తెగుతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’ కేకలు ఎగిసిపడతాయి. ‘హ్యాపీ న్యూ ఇయర్’లో లెఫ్ట్ అండ్ రైట్ను పట్టించుకుంటున్నాంగానీ మధ్యలో ఉన్న విలువైన నిధి జోలికి మాత్రం చాలామంది వెళ్లడం లేదు. ‘న్యూ’ అంటే మూడు అక్షరాల పదం కాదు... మనల్ని, మనతో పాటు కుటుంబాన్ని, కుటుంబంతో పాటు సమాజాన్ని మార్చేసే శక్తిమంతమైన బ్రహ్మాస్త్రం. అందుకే ఈ అస్త్రం ఎప్పుడూ చెట్టెక్కకూడదు. ‘నేను’తోనే ఆ ఆయుధం పదును తేరుతుంది. జపాన్ ఆర్టిస్ట్, పీస్ యాక్టివిస్ట్, సింగర్ యోకో తరుచుగా ఒక మాట చెబుతుంటారు... ‘నువ్వు మారితే నీ కుటుంబం మారుతుంది. అది మారితే ప్రపంచమే మారుతుంది’ అని! మార్పు, కొత్తదనం నుంచి వచ్చే ఫలితాలు ముందస్తుగా కనిపించవు. అమెరికన్-రష్యన్ సైన్స్ ఫిక్షన్ రచయిత్రి వెరా నజరీయన్ మాటల్లో చెప్పాలంటే ‘కొత్తదనం’ లేదా ‘మార్పు’ అనేది తొలి వేకువ లాంటిది. పుట్టడం పుట్టడంతోనే వేకువ బ్రహ్మాండమైన వెలుగైపోదు. వెలుగు చుట్టూ చీకటి ఉంటుంది. ఆ చీకటిని చీల్చుకుంటూ మెల్లగా అరుణోదయం అవుతుంది. మార్పు కూడా అంతే. మనం మారాలనుకున్నప్పుడు, కొత్తగా బతకాలనుకున్నప్పుడు ప్రతికూలత అనే చీకటి ఆవరించి ఉంటుంది. అయితే అది కొద్దిసేపు మాత్రమే. పట్టుదల అనే వేడికి ఆ చీకటి కరిగిపోతుంది. వెలుగుబాటకు దారి చూపుతుంది. ఇప్పుడు మళ్లీ మనం యోకో దగ్గరికి వద్దాం. ‘రోజూ పొద్దుటే అద్దంలో నిన్ను నువ్వు చూసుకొని పలకరించుకో. కొద్ది కాలం తరువాత నీ జీవితంలో వచ్చే పెద్ద మార్పేమిటో గమనించుకో’ అంటారామె. అద్దం అంటే మ్యాజిక్ మిర్రర్ కాదు. అందరింట్లో ఉండే మామూలు అద్దమే. అది అద్దమే కాదు, అంతరాత్మ కూడా. అందుకే ఉదయమే అద్దాన్ని పలకరించండి. ఎందుకు? ఏమిటి? ఎలా? ఈ మూడు ప్రశ్నలూ వేయండి. అద్దమే సమాధానం చెబుతుంది. ‘నేను ఇలా ఎందుకు ఉన్నాను?’ ‘దీనికి కారణం ఏమిటి?’ ‘దీని నుంచి బయటపడడమెలా?’ అన్ని సమస్యలకూ ఈ మూడు ప్రశ్నలే సమాధానం చెబుతాయి. మనల్ని కొత్త మనిషిగా సమాజం ముందు నిలుపుతాయి. శేషేంద్ర కవిత్వాన్ని ఒక్కసారి గుర్తుతెచ్చుకుందాం. ‘బయట ఉన్నది నేనే/లోపల ఉన్నది నేనే/బయటి బాధలకు నేను ఎప్పుడు కరిగి నీరై పోయానో/అప్పుడే నేను నా లోపలి బాధల్ని పోల్చుకోలిగాను.’ నిజానికి పోల్చుకోగలిగింది ‘బాధ’ మాత్రమే కాదు... జీవనోత్సాహం, జీవనవైవిధ్యం... ఇలా ఎన్నెన్నో! మన కుటుంబానికి ఏం చేయవచ్చు? కుటుంబం పట్ల మన బాధ్యత మనకు సరికొత్త శక్తినిస్తుంది. ‘నా తల్లిదండ్రులు గర్వపడే పని చేస్తాను’ అను కున్నప్పుడు... ఆ బాధ్యత మనలో శక్తిని నింపుతుంది. కుటుంబం ఇవ్వడంతో పాటు తీసుకోవడమూ నేర్పుతుంది. ‘నైతిక మద్దతు’ అనేదాన్ని కుటుంబం మనకిస్తే , విజయానందం అనేదాన్ని మనం కుటుంబానికి ఇస్తాం. ఈ గజిబిజి బిజీ బతుకుల కాలంలో ఎవరికి వారు ఒంటరీ ద్వీపాలమైపోతున్నాం. వెలుగు లేని చీకటి దీపాలవుతున్నాం. అందుకే మనం ఏ స్థాయిలో ఉన్నా... కుటుంబంతో గడపాలి. అమ్మ సలహా, నాన్న కోపం, అన్న తిట్టు, అక్క అలక, తమ్ముడి అల్లరి... ఏదీ వృథా పోదు. అన్నీ జీవితాన్ని వర్ణమయం చేస్తాయి. టైమ్ ఉన్నప్పుడు కుటుంబంతో గడపడం కాదు... టైమ్ తీసుకొని కుటుంబంతో గడపడమే మనం వారికిచ్చే విలువైన కానుక. కుటుంబంతో గడపడమంటే కుటుంబాన్ని గౌరవించడం, కుటుంబాన్ని గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించుకోవడం, సమాజాన్ని గౌరవించడం కూడా! ‘రక్తం బంధాన్ని మాత్రమే ఇస్తుంది. ప్రేమ మాత్రమే కుటుంబాన్ని ఇస్తుంది.’ సమాజానికి ఏంచేయాలి? సమాజంలో భాగంగా బతుకుతున్న మనం సమాజం కోసం పాటుబడాలి. దీనికి ఒకే ఒక మంత్రం, మార్గం... పీయస్ఆర్! అంటే పర్సనల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ! ఒక్కమాటలో చెప్పాలంటే ‘మనకు ఇతరులు ఏం చేయాలనుకుంటామో... మనం ఇతరులకు అది చేయడం!’ ట్రాఫిక్స్ రూల్స్ సరిగ్గా పాటించడం నుంచి పర్యావరణ స్పృహతో చేసే మంచి పని వరకు, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెట్టించడం నుంచి నెలజీతంలో ఎంతో కొంత సేవకు వెచ్చించే దయాగుణం వరకు... ఏది చేసినా సమాజం కోసం చేసినట్లే. ‘వందమందికి సహాయం చేసే శక్తి లేకపోతే కనీసం ఒక్కరికైనా సహాయం చెయ్’ అనే మాట గుర్తుంచుకుంటే చాలు. కొత్త సంవత్సరం అంటే పాత గోడ మీద కొత్త క్యాలెండర్ కనిపించడం కాదు. కొత్త జీవితానికి తాజాగా ఒక ద్వారం తెరుచుకోవడం. ‘పాత ఆలోచనల నుంచి బయటికి వచ్చినప్పుడే, కొత్తదనాన్ని చూడగలం. సంతోషంగా ఉండగలం’ అంటారు జిడ్డు కృష్ణమూర్తి. కొత్త ద్వారంలోకి ప్రవేశించే ముందు ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సిన వాక్యం ఇది!