ఆశల పల్లకీలో మన్మథ
పరంపరానుగతంగా పరిభ్రమించే యుగచక్రంలోకి నేటినుంచి మరో నూతన సంవత్సరం వచ్చి చేరబోతున్నది. మన్మథ నామ సంవత్సరానికి చోటిచ్చి జయ నామ సంవత్సరం నిష్ర్కమిస్తున్నది. మూడు కాలాలనూ, ఆరు రుతువులనూ తురుముకొని వచ్చే కొత్త సంవత్సరం తనతోపాటు ఎన్నో ఆశలనూ, ఆకాంక్షలనూ మోసుకొస్తుంది.
కాలం పుటల్లో ఒదిగిపోయిన పాత సంవత్సరం సుఖదుఃఖాల, మంచీచెడుల, సంతోషవిషాదాల కలనేతగా సాగిపోయినా రాబోయే కాలం మాత్రం తమకు మంచే చేస్తుందని, సంతోషంలోనే ముంచెత్తుతుందని, కష్టాలనన్నిటినీ కడతేరుస్తుందని, తమ జీవితాన్ని సుఖమయం చేస్తుందని విశ్వసించడం సగటు జీవి లక్షణం. అందుకే ఉగాదితోపాటు విడుదలయ్యే కొత్త పంచాంగంలో రాశి ఫలాలను చదవాలని, ఆదాయ వ్యయాల లెక్కలు చూసుకోవాలని ఆత్రుతపడతారు. తమ రాశికి రాజ పూజ్యమే రాసిపెట్టి ఉండాలని... అవమానాలున్నా అవి కనిష్టంగా మిగలాలని ఆశిస్తారు.
ఇక ఆరోజు సాగే పంచాంగ శ్రవణం కోసం అందరికందరూ ఉవ్విళ్లూరుతారు. పంటలెలా పండుతాయో, ఈతిబాధల సంగతేమిటో, విపత్తుల తీరుతెన్నులెలా ఉంటాయో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ ఆశలకు తగ్గట్టే ఉగాది తనతోపాటు వసంత రుతువును తెస్తుంది గనుక ఈ సమయంలో ప్రకృతి సైతం మనల్ని సంభ్రమాశ్చర్యపరిచేలా సింగారించుకుంటుంది. మత్త కోకిలల కుహూకుహూరావాలు... వేపపూల ఘుమఘుమలు... మరుమల్లెల సుగంధం మనల్ని మరో ప్రపంచపుటంచుల్ని తాకిస్తుంటే, చెట్లన్నీ కొత్త బట్టలు తొడుక్కున్న ట్టుగా లేత పచ్చని చిగుళ్లతో వింత సోయగాలను సంతరించుకుంటాయి.
ఈ సృష్టిలో రోజులన్నీ మంచివేనని, ఘడియలన్నీ ఉత్తమమైనవేనని... శుభసంకల్పమే దేనికైనా ముఖ్యమని విజ్ఞుల ఉద్ఘాటింపులున్నా పంచాంగంలో ‘మంచి ముహూర్తాన్ని’ ఎంచుకోవడం మామూలే. మొదలెట్టే పనికి ఆటంకాలెదురు కాకుండా ఉండాలంటే, చకచకా సాగాలనుకుంటే ఈ ‘వెతుకులాట’ ఉత్తమమనిపిస్తుంది. అలాగని మనిషి నిర్లిప్తంగా ఉండిపోడు. అంతా విధి లిఖితమని ఊరుకోడు. సవాళ్లను ఎదుర్కొనడా నికి, అగడ్తలను అధిగమించడానికి మనోస్థైర్యంతో, పట్టుదలతో నిత్యం ప్రయత్ని స్తూనే ఉంటాడు. మహాకవి శ్రీశ్రీ అన్నట్టు ‘దుఃఖంలోనే ఆశాదీపిక...చీకటిలోనే తారాగీతిక’లను వెదుక్కుంటూనే ఉంటాడు. ఆ అన్వేషణ రేపో మాపో ముగిసి పోయేది కాదు. అది అనంతం. ఈ భూమ్మీద మనిషి ఉన్నంతవరకూ సాగే ప్రయా ణం. నూతన సంవత్సర ఆగమనం వేళ ఆశల్ని చిగురింపజేసుకోవడం అందులో భాగమే.
ఏదో ఒక పేరుతో రావడం తెలుగు సంవత్సరాల విశిష్టత. ఇందులో భయపెట్టేవి, సంభ్రమపరిచేవి, ఆశపెట్టేవి ఉంటాయి. రౌద్రి, రక్తాక్షి, రాక్షస వంటివి ఉన్నట్టే... విరోధి, వికారి, పరాభవ, దుర్ముఖి, దుర్మతి ఉంటాయి. ఇంకా...విజయ, జయ, ప్రమోదూత ఉంటాయి. ఇలా ప్రభవాది 60 సంవత్సరాల్లో మన్మథ 29వ సంవత్సరం. ఇది సుఖసౌఖ్యాలను కలిగించే సంవత్సరమని, ప్రకృతి సోయగాలను రెట్టింపుచేసే సంవత్సరమని ఊరిస్తున్నారు.
ప్రేమోద్దీపనను వ్యాప్తి చేస్తుందంటున్నారు. నిజా నిజాలేమిటని తర్కించక్కరలేదు. అరవైయ్యేళ్లనాడు ఇదే సంవత్సరం ఏం చేసి వెళ్లిందో చూసి చెప్పేయొచ్చు. కానీ, అలా వెనక చూపులు చూడటం నిరాశావాదుల పని. ఏదో ఒరుగుతుందని ఆశించి ముందుకెళ్లడమే మనిషి లక్షణం. ఉగాదిని మనం ఒక్కరమే కాదు...పొరుగునున్న కర్ణాటక, తమిళనాడు మొదలుకొని మణిపూర్, అస్సాంల వరకూ చాలామంది జరుపుకుంటారు. కాకపోతే పేర్లు వేరు. పండగ జరిపే రోజులు వేరు. మహారాష్ట్రలో గుడిపాడ్వా, కేరళలో విషు, రాజస్థాన్‌లో తపన, పంజాబ్‌లో బైశాఖి, అస్సాంలో బిహు మన ఉగాదిని పోలినవే. ఈసారి మన ఉగాదికి మరో విశిష్టత కూడా ఉంది. భూగోళమంతటా పగలూ, రాత్రీ సమానంగా ఉండే ఈక్వినాక్స్ (విషువత్తు) సంభవించే మార్చి 21నే మనం ఉగాది పండుగను జరుపుకుంటున్నాం.
కొన్నేళ్లపాటు మన తెలుగు నేలన ఉవ్వెత్తున సాగిన ఉద్యమాలు, దాంతో పాటు వచ్చి చేరిన అపోహలు, అపార్థాలు ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నాయి. నిరుడు జయ ఉగాది నాటికే రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయినా లాంఛనంగా విడిపోవడానికి మరికొంత సమయం పట్టింది. కనుక రెండు రాష్ట్రాలుగా ఉగాది జరుపుకోవడం తెలుగు ప్రజలకు ఇది మొదటిసారి. ఇతరేతర సమస్యలు ఎన్ని ఉన్నా రెండు రాష్ట్రాల అధినేతలూ సమష్టిగా కదిలి తెలుగుకు లభించిన ప్రత్యేక శిష్ట భాషా ప్రతిపత్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తారనుకుంటే పట్టనట్టు ఉండిపోతున్నారని భాషాభిమానులు ఆవేదన చెందుతున్నారు.
ఇక ఇరు రాష్ట్రాలమధ్యా పరిష్కరించుకోవాల్సిన సమస్యలే కాదు... కొత్త రాష్ట్రాలు కావడంవల్ల ఎక్కడికక్కడ తలెత్తినవీ ఉన్నాయి. ఏటా మూడు, నాలుగు పంటలు పండే తమ భూములపై రాజధాని నగరం దిగబడుతున్నదని తెలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తుళ్లూరు ప్రాంత రైతాంగం, రైతు కూలీలు కంటిమీద కునుకు లేకుండా కాలం గడుపుతున్నారు. భయపడి భూములిచ్చినవారూ, ఇవ్వబోమని భీష్మించినవారూ కూడా ఇందులో ఉన్నారు. హామీలు నమ్మి తమ రుణాలన్నీ మాఫీ అవుతాయని, బ్యాంకుల్లో తాకట్టుపడిన బంగారం మళ్లీ ఇంటి తలుపు తడుతుందని ఎదురుచూసిన రైతులు దిగాలుగా దిక్కులు చూస్తున్నారు.
మన్మథ పేరెట్టుకున్నంత మాత్రాన ఈ ఏడాదంతా బాగుంటుందని అలాంటివారంతా అనుకోవడం సాధ్యమేనా? ఒకటి కాదు...రెండు మూడు ఉగాదులు కలిసి కట్టగట్టుకు వచ్చినా వారిలో అలుముకున్న నిరాశానిస్పృహలు ఇప్పట్లో తొలగిపోయేలా లేవు. ఒక కవి అన్నట్టు కాలం అద్దంలాంటిది. అందులో కనబడే అందమైన దృశ్యమైనా, భీతిగొలిపే చిత్రమైనా... అది మన ప్రతిబింబమే! స్వస్వరూప జ్ఞానంతో ఎప్పటికప్పుడు సరిచేసుకుంటే బంగారు భవిష్యత్తు మనదవుతుంది. ఆ ఎరుక అందరిలోనూ... మరీ ముఖ్యంగా పాలకుల్లో కలగాలని ఆశిద్దాం.