మార్పు ప్రకృతి సహజ లక్షణం. చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు. కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది. రోజులుగా, నెలలుగా, ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండగుర్తు. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త కేలండర్లు వస్తాయి. కొత్త డైరీలు వస్తాయి. కొందరు అదృష్టవంతులకు ఒకరోజు సెలవు దొరుకుతుంది.
కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందురోజు రాత్రి జనాలు సందడి సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకొంటారు. గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారు.
అలాగని కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రపంచం అమాంతంగా మారిపోదు.లోకంలో మనుషులు ఎప్పటిలాగానే ఉంటారు. మనుషుల స్వభావాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. భూమి గోళాకారంలోనే ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన నింగి నుంచి చుక్కలు రాలిపడిపోవడం, దిక్కులు ఏకమైపోవడం వంటి ఆకస్మిక అనర్థాలేవీ సంభవించవు. ప్రపంచంలో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధాలు కొన సాగుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంక్షోభాలు రగులుతూనే ఉంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో వినిపించే కేరింతల హోరులో అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయంతే!
ప్రపంచమంతా అలాగే ఉన్నప్పుడు మరి మారినదేమిటంటారా? మార్పు మన కళ్ల ముందే జరిగిపోతూ ఉంటుంది. ప్రచార పటాటోప కాంతులకు కళ్లుబైర్లు కమ్మిన దివాంధత్వంలో మనం వెనువెంటనే మార్పును గుర్తించలేం. కొంచెం తెప్పరిల్లిన తర్వాతనే మార్పు మనకు అర్థమవుతుంది. అనుభవంలోకి వస్తుంది. ‘మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు’ అని గ్రీకు తత్త్వవేత్త హెరా క్లిటస్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే చెప్పాడు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహంలో, వేడుకల సంరంభంలో మునిగిపోయిన జనానికి ఆ సమయంలో జరిగే మార్పులేవీ గోచరించవు.
కేలండరు మారుతున్న వేళలోనే ఎక్కడో ఒకచోట ఒక మొక్క మొలకెత్తవచ్చు. ఒక మహావృక్షం నేలకూలిపోవచ్చు. కొత్తగా ఒక శిశువు ఈ భూమ్మీదకు రావచ్చు. పాతబడిన ఒక పండుటాకు రాలిపోవచ్చు. మరెక్కడో ఒకచోట నిశ్శబ్దంగా ఒక కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. ఒక విధ్వంసానికి కొత్తగా ధ్వంసరచన జరుగుతూ ఉండవచ్చు. వార్తలకెక్కితే తప్ప మార్పులను గుర్తించడం మానేశాం మనం. అయినా వార్తలతో నిమిత్తం లేకుండా మార్పులు జరుగుతూనే ఉంటాయి.
అసలు మనం జరుపుకొనే ఈ కొత్త సంవత్సరం వేడుకలు కూడా నానా మార్పుల ఫలితమే! ఇప్పటి మన నాగరికత, మన వేషభాషలు, మన సాంకేతిక పరిజ్ఞానం, మన కళానైపుణ్యాలు, మన ఆటపాటలు, మన తిండితిప్పలు వంటివన్నీ ఎన్నో మార్పుల ఫలితమే! ఎంతటి నియంతలకైనా మార్పును నివారించడం సాధ్యం కాదు. అనంత కాలవాహినిలో మార్పులు అలల్లా వచ్చిపోతుంటాయి. మంచి చెడులు మార్పులకూ వర్తిస్తాయి. మంచి మార్పులు వికాసానికి, చెడు మార్పులు వినాశానికి దారులు వేస్తాయి.
ప్రతి సంవత్సరం మాదిరిగానే నిన్నటితో ముగిసిపోయిన సంవత్సరంలోనూ కొన్ని గణనీయమైన మార్పులే చోటు చేసుకున్నాయి. నిన్నటితో ముగిసిన ఏడాదిలో మానవాళికి మేలు చేసే పదమూడు మార్పులు జరిగినట్లు ‘టైమ్’ మ్యాగజైన్ కథనం చెబుతోంది. ఇదొక ఆశాజనకమైన విషయం. లోకంలో ఎక్కడో ఒకచోట అపశ్రుతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం వాటినే భూతద్దంలో చూపిస్తూ, ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వగచే వారికి ప్రపంచంలోని ఆశాజనకమైన మార్పులు అగుపడవు. అయితే, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని మహాకవి గురజాడ చెప్పిన మాటలు మరువరాదు.
ప్రపంచమంతా శరవేగంగా మారిపోతున్నా, కొందరు యథాతథవాదులు మాత్రం మార్పును కోరుకోరు. తాము మారాలనుకోరు. లోకం తమ కళ్లముందే మారిపోతుండటాన్ని చూసి వారు ఏమాత్రం సహించలేరు. మార్పులను నివారించడానికి శాయశక్తులా విఫలయత్నాలు చేస్తుంటారు. కాలంచెల్లిన మనుషులు కాలం పరుగును వెనక్కు మళ్లించడానికి నానా విన్యాసాలు చేస్తుంటారు.
విఫలయత్నాలు, విన్యాసాలు వికటించి మార్పులు అనివార్యమనే సంగతి అనుభవంలోకి వచ్చినా జీర్ణించుకోలేరు. కాలంతో కలసి ముందుకు సాగేవారిని, మార్పులను మనసారా స్వాగతించే వారిని, మార్పులకు దోహదపడేవారిని అక్కసుకొద్ది ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా లోకం తన మానాన తాను మారుతూనే ఉంటుంది. మార్పు తన శాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది.
కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనాలు తమ జీవితాల్లో మేలి మార్పుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు.
కొత్త సంవత్సరం కాలం మరింతగా అనుకూలించాలని, కష్టాలు కడతేరాలని, ప్రపంచంలో యుద్ధాలు సమసిపోవాలని, శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని, మానవాళికి మేలు కలగాలని, ప్రగతి దిశగా కాలం పరుగు వేగం పుంజుకోవాలని కోరుకుందాం. కొత్త సంవత్సరం కొత్త వేకువ ఉదయించాలని కోరుకుందాం. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కొత్త సంవత్సరం ఒక చక్కని సందర్భం. ఈ సందర్భాన్ని సార్థకం చేసుకుందాం.
కాలగతిలో కొత్త వేకువ
Published Mon, Jan 1 2024 4:35 AM | Last Updated on Mon, Jan 1 2024 5:25 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment