diaries
-
కొత్త చట్టాల ప్రకారం కేసు డైరీలు నిర్వహించాల్సిందే
సాక్షి, అమరావతి: వివిధ కేసుల్లో దర్యాప్తు అధికారులంతా పార్ట్–1 కేసు డైరీ (సీడీ)ని నిబంధనలు నిర్దేశించిన విధంగా నిర్వహించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్)లోని సెక్షన్ 192కు అనుగుణంగా కేసు డైరీలను నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వల్ల రికార్డుల ప్రామాణికత, దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరుగుతుందని తెలిపింది. పోలీసుల కేసు డైరీలను పరిశీలిస్తే అవేవీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం లేదంది. అందువల్ల సీడీల నిర్వహణ విషయంలో రాష్ట్రంలోని దర్యాప్తు అధికారులందరికీ తగిన సూచనలు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ విషయంలో తామిచ్చి న తీర్పు కాపీని డీజీపీకి పంపాలని రిజి్రస్టార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఎన్ఎస్యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్‌కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేసీ కృష్ణారెడ్డి, కేసీ నాగార్జునరెడ్డి, కేసీ సాయిప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సంపత్‌కుమార్ హత్య కేసులో వీరి ప్రమేయం ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంది. అందువల్ల వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. సంచలనం సృష్టించిన సంపత్‌కుమార్ హత్య శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన సంపత్‌కుమార్ ఈ ఏడాది మే 30న దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదమే సంపత్‌కుమార్ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హత్య చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిచి్చన వాంగ్మూలం ఆధారంగా సంపత్‌కుమార్‌తో భూ వివాదం ఉన్న న్యాయవాదులు కేసీ కృష్ణారెడ్డి, ఆయన కుమారులు కేసీ నాగార్జునరెడ్డి, కేసీ సాయిప్రసాద్రెడ్డిలను ప్రధాన నిందితులుగా చేర్చారు. ఈ నేపథ్యంలో వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి విచారణ జరిపారు. వాదనల సమయంలో సంపత్‌కుమార్ హత్య కేసుకు సంబంధించిన కేసు డైరీని పరిశీలించారు. కేసు డైరీ నిబంధనలకు అనుగుణంగా లేని విషయాన్ని గమనించి సీడీ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.సంపత్‌కుమార్ హత్యతో పిటిషనర్లకు సంబంధం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టమవుతోందని.. ఈ దృష్ట్యా పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెబుతూ వారి పిటిషన్లను కొట్టేశారు. -
కాలగతిలో కొత్త వేకువ
మార్పు ప్రకృతి సహజ లక్షణం. చరాచర ప్రపంచంలో మారనిదంటూ ఏదీ ఉండదు. కాలం అనుక్షణం మారుతూనే ఉంటుంది. రోజులుగా, నెలలుగా, ఏడాదులుగా మారే కాలానికి కొత్త సంవత్సరం ఒక కొండగుర్తు. కొత్త సంవత్సరానికి గుర్తుగా కొత్త కేలండర్లు వస్తాయి. కొత్త డైరీలు వస్తాయి. కొందరు అదృష్టవంతులకు ఒకరోజు సెలవు దొరుకుతుంది. కొత్త సంవత్సరాన్ని అట్టహాసంగా స్వాగతించడానికి ముందురోజు రాత్రి జనాలు సందడి సందడిగా మందు విందులతో ఊరూరా అట్టహాసంగా వేడుకలు జరుపుకొంటారు. గడియారం అర్ధరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే కేరింతలు కొడుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. గడచిపోయిన సంవత్సరంలో చేసిన తప్పులను పునరావృతం చేయబోమంటూ కొందరు భీషణ తీర్మానాలు కూడా చేసుకుంటారు. అలాగని కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన ప్రపంచం అమాంతంగా మారిపోదు.లోకంలో మనుషులు ఎప్పటిలాగానే ఉంటారు. మనుషుల స్వభావాలు ఎప్పటి మాదిరిగానే ఉంటాయి. భూమి గోళాకారంలోనే ఉంటుంది. సూర్యుడు తూర్పు దిక్కునే ఉదయిస్తాడు. కొత్త సంవత్సరం వచ్చినంత మాత్రాన నింగి నుంచి చుక్కలు రాలిపడిపోవడం, దిక్కులు ఏకమైపోవడం వంటి ఆకస్మిక అనర్థాలేవీ సంభవించవు. ప్రపంచంలో ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధాలు కొన సాగుతూనే ఉంటాయి. దేశాల మధ్య సంక్షోభాలు రగులుతూనే ఉంటాయి. కొత్త సంవత్సరం వేడుకల్లో వినిపించే కేరింతల హోరులో అభాగ్యుల ఆర్తనాదాలు వినిపించకుండా ఉంటాయంతే! ప్రపంచమంతా అలాగే ఉన్నప్పుడు మరి మారినదేమిటంటారా? మార్పు మన కళ్ల ముందే జరిగిపోతూ ఉంటుంది. ప్రచార పటాటోప కాంతులకు కళ్లుబైర్లు కమ్మిన దివాంధత్వంలో మనం వెనువెంటనే మార్పును గుర్తించలేం. కొంచెం తెప్పరిల్లిన తర్వాతనే మార్పు మనకు అర్థమవుతుంది. అనుభవంలోకి వస్తుంది. ‘మార్పు తప్ప మరేదీ శాశ్వతం కాదు’ అని గ్రీకు తత్త్వవేత్త హెరా క్లిటస్ క్రీస్తుపూర్వం ఆరో శతాబ్దిలోనే చెప్పాడు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే ఉత్సాహంలో, వేడుకల సంరంభంలో మునిగిపోయిన జనానికి ఆ సమయంలో జరిగే మార్పులేవీ గోచరించవు. కేలండరు మారుతున్న వేళలోనే ఎక్కడో ఒకచోట ఒక మొక్క మొలకెత్తవచ్చు. ఒక మహావృక్షం నేలకూలిపోవచ్చు. కొత్తగా ఒక శిశువు ఈ భూమ్మీదకు రావచ్చు. పాతబడిన ఒక పండుటాకు రాలిపోవచ్చు. మరెక్కడో ఒకచోట నిశ్శబ్దంగా ఒక కొత్త ఆవిష్కరణ జరగవచ్చు. ఒక విధ్వంసానికి కొత్తగా ధ్వంసరచన జరుగుతూ ఉండవచ్చు. వార్తలకెక్కితే తప్ప మార్పులను గుర్తించడం మానేశాం మనం. అయినా వార్తలతో నిమిత్తం లేకుండా మార్పులు జరుగుతూనే ఉంటాయి. అసలు మనం జరుపుకొనే ఈ కొత్త సంవత్సరం వేడుకలు కూడా నానా మార్పుల ఫలితమే! ఇప్పటి మన నాగరికత, మన వేషభాషలు, మన సాంకేతిక పరిజ్ఞానం, మన కళానైపుణ్యాలు, మన ఆటపాటలు, మన తిండితిప్పలు వంటివన్నీ ఎన్నో మార్పుల ఫలితమే! ఎంతటి నియంతలకైనా మార్పును నివారించడం సాధ్యం కాదు. అనంత కాలవాహినిలో మార్పులు అలల్లా వచ్చిపోతుంటాయి. మంచి చెడులు మార్పులకూ వర్తిస్తాయి. మంచి మార్పులు వికాసానికి, చెడు మార్పులు వినాశానికి దారులు వేస్తాయి. ప్రతి సంవత్సరం మాదిరిగానే నిన్నటితో ముగిసిపోయిన సంవత్సరంలోనూ కొన్ని గణనీయమైన మార్పులే చోటు చేసుకున్నాయి. నిన్నటితో ముగిసిన ఏడాదిలో మానవాళికి మేలు చేసే పదమూడు మార్పులు జరిగినట్లు ‘టైమ్’ మ్యాగజైన్ కథనం చెబుతోంది. ఇదొక ఆశాజనకమైన విషయం. లోకంలో ఎక్కడో ఒకచోట అపశ్రుతులు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. కేవలం వాటినే భూతద్దంలో చూపిస్తూ, ‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అని వగచే వారికి ప్రపంచంలోని ఆశాజనకమైన మార్పులు అగుపడవు. అయితే, ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని మహాకవి గురజాడ చెప్పిన మాటలు మరువరాదు. ప్రపంచమంతా శరవేగంగా మారిపోతున్నా, కొందరు యథాతథవాదులు మాత్రం మార్పును కోరుకోరు. తాము మారాలనుకోరు. లోకం తమ కళ్లముందే మారిపోతుండటాన్ని చూసి వారు ఏమాత్రం సహించలేరు. మార్పులను నివారించడానికి శాయశక్తులా విఫలయత్నాలు చేస్తుంటారు. కాలంచెల్లిన మనుషులు కాలం పరుగును వెనక్కు మళ్లించడానికి నానా విన్యాసాలు చేస్తుంటారు. విఫలయత్నాలు, విన్యాసాలు వికటించి మార్పులు అనివార్యమనే సంగతి అనుభవంలోకి వచ్చినా జీర్ణించుకోలేరు. కాలంతో కలసి ముందుకు సాగేవారిని, మార్పులను మనసారా స్వాగతించే వారిని, మార్పులకు దోహదపడేవారిని అక్కసుకొద్ది ఆడిపోసుకుంటారు. ఎవరేమనుకున్నా లోకం తన మానాన తాను మారుతూనే ఉంటుంది. మార్పు తన శాశ్వతత్వాన్ని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూనే ఉంటుంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ జనాలు తమ జీవితాల్లో మేలి మార్పుల కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటారు. తమ ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కొత్త సంవత్సరం కాలం మరింతగా అనుకూలించాలని, కష్టాలు కడతేరాలని, ప్రపంచంలో యుద్ధాలు సమసిపోవాలని, శాంతి సామరస్యాలు పరిఢవిల్లాలని, మానవాళికి మేలు కలగాలని, ప్రగతి దిశగా కాలం పరుగు వేగం పుంజుకోవాలని కోరుకుందాం. కొత్త సంవత్సరం కొత్త వేకువ ఉదయించాలని కోరుకుందాం. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడానికి కొత్త సంవత్సరం ఒక చక్కని సందర్భం. ఈ సందర్భాన్ని సార్థకం చేసుకుందాం. -
టీటీడీ క్యాలెండర్లు, డైరీలు రెడీ
తిరుమల: టీటీడీ ప్రచురించిన 2022వ సంవత్సరం క్యాలెండర్లు, డైరీలను టీటీడీ వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్‌లోనూ బుక్ చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. టీటీడీ వెబ్సైట్లో ‘పబ్లికేషన్స్’ను క్లిక్ చేసి డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపి వీటిని ఆర్డరు చేయవచ్చు. ఇలా బుక్ చేసుకున్న వారికి పోస్టులో వాటిని పంపిస్తారు. భక్తులు ఎన్ని క్యాలెండర్లు, డైరీలనైనా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి ప్యాకింగ్, షిప్పింగ్ చార్జీలు అదనం. విదేశాల్లోని భక్తులకు ఈ సదుపాయం ఉంది. ఇతర సమాచారం కోసం 0877–2264209 నంబరు ద్వారా ప్రచురణల విభాగం కార్యాలయాన్ని గానీ, 9963955585లో ప్రత్యేకాధికారిని గానీ సంప్రదించవచ్చు. 12 పేజీల క్యాలెండర్ రూ.130, పెద్ద డైరీ రూ.150, చిన్నడైరీ రూ.120, టేబుల్ టాప్ క్యాలెండర్ రూ.75, శ్రీవారి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీపద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15, తెలుగు పంచాంగం క్యాలెండర్ రూ.30గా ధర నిర్ణయించారు. తిరుమల, తిరుపతిలోని టీటీడీ పుస్తక విక్రయ శాలల్లో కూడా క్యాలెండర్లు, డైరీలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ, విశాఖ, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, న్యూఢిల్లీ, ముంబైలోని టీటీడీ సమాచార కేంద్రాల్లో క్యాలెండర్లు, డైరీలను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. -
క్యాలెండర్లను ఆవిష్కరించిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివిధ ఉద్యోగులు, కార్మిక సంఘాల డైరీలు, క్యాలెండర్లను మంగళవారం ఆవిష్కరించారు. ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ 2021 క్యాలెండర్‌ను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు హాజరయ్యారు. చదవండి: బండారు దత్తాత్రేయను కలిసిన సీఎం వైఎస్ జగన్ -
అందుబాటులో టీటీడీ కేలండర్లు, డైరీలు
తిరుమల : నూతన సంవత్సరానికి సంబంధించిన టీటీడీ కేలండర్లు, డైరీలను భక్తులకు అందుబాటులో ఉంచారు. 12 షీట్ల కేలండర్ రూ.75, శ్రీవేంకటేశ్వర స్వామివారి పెద్ద కేలండర్ రూ.10, పద్మావతి సమేత శ్రీవేంకటేశ్వర స్వామివారి చిన్న కేలండర్ రూ.7, డైరీ రూ.100 ప్రకారం విక్రయిస్తున్నారు. హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ శ్రీ బాలాజీ భవన్‌లోని టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు. అలాగే తిరుమల ఆలయం ఎదురుగా, లేపాక్షి ఎదుట, నిత్యాన్నప్రసాద భవన కేంద్రం, ఏటీసీ వద్ద కూడా విక్రయిస్తున్నారు. తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, రైల్వే స్టేషన్, గోవిందరాజస్వామి ఆలయం పక్కన ధ్యానమందిరం, విజయవాడ, విశాఖపట్నం, న్యూఢిల్లీలోని టీటీడీ సమాచార కేంద్రాలు, కల్యాణ మండపాల వద్ద అందుబాటులో ఉంచారు. వివరాలకు ఫోన్ (040-23220852,23220457) ద్వారా సంప్రదించాలని టీటీడీ ప్రజా సంబంధాల అధికారి తలారి రవి విజ్ఞప్తి చేశారు. -
ప్రింటింగ్ పేర... అరకోటి హాంఫట్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. దేవరకొండ బ్రాంచ్‌లో సుమారు రూ 18 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం మరవకముందే జిల్లా కేంద్ర బ్యాంకులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారన్న వార్త విస్మయ పరుస్తోంది. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో సహకార బ్యాంకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ శాఖలో అక్రమాలపై ముందస్తుగా అక్కడి బ్రాంచ్ మేనేజర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు డీసీసీబీలో ఉన్న డీజీఎం భద్రగిరిరావును దీర్ఘకాలిక సెలవు పెట్టించారు. అక్రమాలపై విచారణాధికారి సరైన నివేదిక ఇవ్వకపోవడంపై 2013 డిసెంబర్ 26న జరిగిన బోర్డు సమావేశంలో డెరైక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణాధికారిని దీర్ఘకాలపు సెలవు పెట్టించాలని తీర్మానం చేసి ఆమెతో సెలవు పెట్టించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను తె ప్పించి ఈ నెల 10న తిరిగి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రింటింగ్ పేర రూ అరకోటికి ఎసరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రిజిష్టర్లు, బ్రోచర్లు, ఓచర్లు, క్యాలెండర్లు, డైరీలు, ఇతర కరపత్రాల ముద్రణ పేరుతో సుమారు రూ 50లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా అవసరం లేకున్నా పట్టణంలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానికి లక్షల రూపాయల ఆర్డర్లు ఇచ్చి ముద్రించి బిల్లులను చెల్లించి వాటాలను పంచుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి సంఘాలకు, బ్రాంచీలకు పంపిణీ చేయడానికి వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో బ్యాంకు బ్రాంచీలను కంప్యూటీకరణ చేయడంతో లక్షలాది రూపాయలను వెచ్చించిన రిజిష్టర్లు పనికిరాకుండా పోయినట్లు, దీంతో వాటిని స్టోర్‌లో మూలనపడేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి టెండర్లూ పిలవకుండానే ఈ తతంగాన్ని గత ఐదారేళ్లుగా బ్యాంకులో కొనసాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని బ్యాంకు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై విచారణ జరుగుతోంది. బ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడానికి డీజీఎం నర్మదను విచారణాధికారిగా నియమించారు. అదేవిధంగా దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశామని బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డెరైక్టర్లు డిమాండ్ చేసినట్లుగా సీబీసీఐడీచే విచారణ జరిపిస్తే బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంత అనేది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.