పోలీసులకు హైకోర్టు అక్షింతలు
దర్యాప్తు అధికారులందరికీ సూచనలివ్వాలని డీజీపీకి ఆదేశం
ఎన్‌ఎస్‌యూఐ నాయకుడి హత్య కేసులో నిందితులకు బెయిల్ నిరాకరణ
సాక్షి, అమరావతి: వివిధ కేసుల్లో దర్యాప్తు అధికారులంతా పార్ట్–1 కేసు డైరీ (సీడీ)ని నిబంధనలు నిర్దేశించిన విధంగా నిర్వహించి తీరాలని హైకోర్టు స్పష్టం చేసింది. భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)లోని సెక్షన్ 192కు అనుగుణంగా కేసు డైరీలను నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఇలా చేయడం వల్ల రికార్డుల ప్రామాణికత, దర్యాప్తు సంస్థల విశ్వసనీయత పెరుగుతుందని తెలిపింది.
పోలీసుల కేసు డైరీలను పరిశీలిస్తే అవేవీ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించడం లేదంది. అందువల్ల సీడీల నిర్వహణ విషయంలో రాష్ట్రంలోని దర్యాప్తు అధికారులందరికీ తగిన సూచనలు చేయాలని డీజీపీని ఆదేశించింది. ఈ విషయంలో తామిచ్చి న తీర్పు కాపీని డీజీపీకి పంపాలని రిజి్రస్టార్ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి, న్యాయవాది సంపత్‌కుమార్ హత్య కేసులో ప్రధాన నిందితులకు హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది.
ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కేసీ కృష్ణారెడ్డి, కేసీ నాగార్జునరెడ్డి, కేసీ సాయిప్రసాద్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. సంపత్‌కుమార్ హత్య కేసులో వీరి ప్రమేయం ఉందనేందుకు ప్రాథమిక ఆధారాలున్నాయంది. అందువల్ల వారి బెయిల్ పిటిషన్లను కొట్టేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి ఇటీవల తీర్పు వెలువరించారు.
సంచలనం సృష్టించిన సంపత్‌కుమార్ హత్య
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురానికి చెందిన సంపత్‌కుమార్ ఈ ఏడాది మే 30న దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదమే సంపత్‌కుమార్ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. హత్య చేసిన ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిచి్చన వాంగ్మూలం ఆధారంగా సంపత్‌కుమార్‌తో భూ వివాదం ఉన్న న్యాయవాదులు కేసీ కృష్ణారెడ్డి, ఆయన కుమారులు కేసీ నాగార్జునరెడ్డి, కేసీ సాయిప్రసాద్‌రెడ్డిలను ప్రధాన నిందితులుగా చేర్చారు.
ఈ నేపథ్యంలో వారు ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ చక్రవర్తి విచారణ జరిపారు. వాదనల సమయంలో సంపత్‌కుమార్ హత్య కేసుకు సంబంధించిన కేసు డైరీని పరిశీలించారు. కేసు డైరీ నిబంధనలకు అనుగుణంగా లేని విషయాన్ని గమనించి సీడీ నిర్వహణ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
సంపత్‌కుమార్ హత్యతో పిటిషనర్లకు సంబంధం ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టమవుతోందని.. ఈ దృష్ట్యా పిటిషనర్లకు ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని న్యాయమూర్తి తేల్చి చెబుతూ వారి పిటిషన్లను కొట్టేశారు.
Comments
Please login to add a commentAdd a comment