నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. దేవరకొండ బ్రాంచ్‌లో సుమారు రూ 18 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం మరవకముందే జిల్లా కేంద్ర బ్యాంకులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారన్న వార్త విస్మయ పరుస్తోంది. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో సహకార బ్యాంకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ శాఖలో అక్రమాలపై ముందస్తుగా అక్కడి బ్రాంచ్ మేనేజర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు డీసీసీబీలో ఉన్న డీజీఎం భద్రగిరిరావును దీర్ఘకాలిక సెలవు పెట్టించారు.
అక్రమాలపై విచారణాధికారి సరైన నివేదిక ఇవ్వకపోవడంపై 2013 డిసెంబర్ 26న జరిగిన బోర్డు సమావేశంలో డెరైక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణాధికారిని దీర్ఘకాలపు సెలవు పెట్టించాలని తీర్మానం చేసి ఆమెతో సెలవు పెట్టించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను తె ప్పించి ఈ నెల 10న తిరిగి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు.
ప్రింటింగ్ పేర రూ అరకోటికి ఎసరు
జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రిజిష్టర్లు, బ్రోచర్లు, ఓచర్లు, క్యాలెండర్లు, డైరీలు, ఇతర కరపత్రాల ముద్రణ పేరుతో సుమారు రూ 50లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా అవసరం లేకున్నా పట్టణంలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానికి లక్షల రూపాయల ఆర్డర్లు ఇచ్చి ముద్రించి బిల్లులను చెల్లించి వాటాలను పంచుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి సంఘాలకు, బ్రాంచీలకు పంపిణీ చేయడానికి వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో బ్యాంకు బ్రాంచీలను కంప్యూటీకరణ చేయడంతో లక్షలాది రూపాయలను వెచ్చించిన రిజిష్టర్‌లు పనికిరాకుండా పోయినట్లు, దీంతో వాటిని స్టోర్‌లో మూలనపడేసినట్లు తెలుస్తుంది.
ఎలాంటి టెండర్‌లూ పిలవకుండానే ఈ తతంగాన్ని గత ఐదారేళ్లుగా బ్యాంకులో కొనసాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని బ్యాంకు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై విచారణ జరుగుతోంది. బ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడానికి డీజీఎం నర్మదను విచారణాధికారిగా నియమించారు. అదేవిధంగా దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశామని బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డెరైక్టర్లు డిమాండ్ చేసినట్లుగా సీబీసీఐడీచే విచారణ జరిపిస్తే బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంత అనేది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రింటింగ్ పేర... అరకోటి హాంఫట్
Published Mon, Jan 6 2014 2:14 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement
Advertisement