District Central Cooperative Bank
-
తప్పు చేసిన వారిపైనే చర్యలు: కోడెల
గుంటూరు: తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయని, తప్పు చేయని వాళ్లు నిర్భయంగా ఉండవచ్చని శాసన సభ స్పీకర్ కోడెల శివ ప్రసాదరావు స్పష్టం చేశారు. డీసీసీబీ పాలకవర్గం, బ్యాంకు అధికారులు, ఉద్యోగులు బుధవారం శాసనసభ స్పీకర్‌ను కలిశారు. సహకార శాఖ కుంభకోణం నుంచి తమను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారితో స్పీకర్ మాట్లాడుతూ.. తప్పు చేసిన వారిపైనే చర్యలు ఉంటాయన్నారు. ఇదిలా ఉంచితే గత పాలకవర్గం సమయంలో రైతు రుణాల పేరుతో రూ.6 కోట్ల స్కాం జరిగింది. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టి, అరెస్ట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. -
ప్రింటింగ్ పేర... అరకోటి హాంఫట్
నల్లగొండ టౌన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవినీతి పరంపర కొనసాగుతూనే ఉంది. దేవరకొండ బ్రాంచ్‌లో సుమారు రూ 18 కోట్లకు పైగా పక్కదారి పట్టిన విషయం మరవకముందే జిల్లా కేంద్ర బ్యాంకులో లక్షలాది రూపాయలు పక్కదారి పట్టించారన్న వార్త విస్మయ పరుస్తోంది. రోజుకో అవినీతి వ్యవహారం వెలుగులోకి వస్తుండడంతో సహకార బ్యాంకు తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవరకొండ శాఖలో అక్రమాలపై ముందస్తుగా అక్కడి బ్రాంచ్ మేనేజర్ రామయ్యను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు డీసీసీబీలో ఉన్న డీజీఎం భద్రగిరిరావును దీర్ఘకాలిక సెలవు పెట్టించారు. అక్రమాలపై విచారణాధికారి సరైన నివేదిక ఇవ్వకపోవడంపై 2013 డిసెంబర్ 26న జరిగిన బోర్డు సమావేశంలో డెరైక్టర్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విచారణాధికారిని దీర్ఘకాలపు సెలవు పెట్టించాలని తీర్మానం చేసి ఆమెతో సెలవు పెట్టించారు. అక్రమాలపై పూర్తిస్థాయిలో నివేదికను తె ప్పించి ఈ నెల 10న తిరిగి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని నిర్ణయించారు. కానీ, ఇదే సమయంలో జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధికారుల అవినీతి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. దీంతో బ్యాంకు ఉద్యోగుల్లో అందోళన మొదలైంది. ఎప్పుడు ఎవరి మెడకు ఏం చుట్టుకుంటుందోనని భయాందోళనలకు గురవుతున్నారు. ప్రింటింగ్ పేర రూ అరకోటికి ఎసరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో రిజిష్టర్లు, బ్రోచర్లు, ఓచర్లు, క్యాలెండర్లు, డైరీలు, ఇతర కరపత్రాల ముద్రణ పేరుతో సుమారు రూ 50లక్షల వరకు దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండేళ్లుగా అవసరం లేకున్నా పట్టణంలోని ఒక ప్రింటింగ్ ప్రెస్ యజమానికి లక్షల రూపాయల ఆర్డర్లు ఇచ్చి ముద్రించి బిల్లులను చెల్లించి వాటాలను పంచుకున్నట్లు సమాచారం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి సంఘాలకు, బ్రాంచీలకు పంపిణీ చేయడానికి వీటిని ముద్రించినట్లు తెలుస్తుంది. కానీ ఇటీవల కాలంలో బ్యాంకు బ్రాంచీలను కంప్యూటీకరణ చేయడంతో లక్షలాది రూపాయలను వెచ్చించిన రిజిష్టర్లు పనికిరాకుండా పోయినట్లు, దీంతో వాటిని స్టోర్‌లో మూలనపడేసినట్లు తెలుస్తుంది. ఎలాంటి టెండర్లూ పిలవకుండానే ఈ తతంగాన్ని గత ఐదారేళ్లుగా బ్యాంకులో కొనసాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారని బ్యాంకు ఉద్యోగులే బాహాటంగా చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులో దీర్ఘకాలంగా తిష్టవేసి అక్రమాలకు అండగా నిలిచిన అధికారులపై విచారణ జరుగుతోంది. బ్యాంకులో జరిగిన నిధుల దుర్వినియోగంపై విచారణ జరపడానికి డీజీఎం నర్మదను విచారణాధికారిగా నియమించారు. అదేవిధంగా దుర్వినియోగానికి బాధ్యులుగా గుర్తించిన మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డిని సస్పెండ్ చేశామని బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. డెరైక్టర్లు డిమాండ్ చేసినట్లుగా సీబీసీఐడీచే విచారణ జరిపిస్తే బ్యాంకులో జరిగిన కోట్లాది రూపాయల కుంభకోణంలో ఎవరిపాత్ర ఎంత అనేది తేలుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
సెలవులో డీసీసీబీ చైర్మన్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. జనవరి 1వ తేదీ నుంచి ఆరు నెలలు సెలవు పెడుతున్నట్లు ఆయన బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావుకు లేఖ అందించారు. దాపరికం ఏమీ లేకుండా, అధికార కాంగ్రెస్‌లో అన్నీ బాహటంగానే సాగిన పరిణామాలు చివరకు విజయేందర్రె డ్డి సెలవుతో కొత్త మలుపు తిరగనున్నాయి. వాస్తవానికి చైర్మన్ గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే సెలవుపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ సమావేశంలో మెజారిటీ డెరైక్టర్లు దేవరకొండ బ్యాంకులో జరిగిన అక్రమాల నిగ్గు తేలేవరకు సెలవుపై వెళ్లడానికి వీలులేదని పట్టుడట్టడంతో వాయి దా వేసుకున్నారు. కానీ ఇటీవల కేంద్ర బ్యాంకు లో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో , కావాలనే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన సెలవుపై వెళ్లడానికే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చేస్తున్న ఒత్తిడి కూడా చైర్మన్ సెలవుకు కారణమని చెబుతున్నారు. రాజకీయ సమీకరణలో భాగంగా బ్యాంకు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు చైర్మన్ బాధ్యతలను అప్పగించాలనే ఉద్దేశంతో విజ యేందర్‌రెడ్డిని సెలవుపెట్టించారన్న విషయం ఇపుడు బహిరంగం అయ్యింది. కాగా, ఈ నెల 10న జరగనున్న బ్యాంకు బోర్డు సమావేశంలో ముత్తవరపు పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. సీఎంకు... మంత్రుల లేఖ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న విజయేందర్‌రెడ్డితో సెలవు పెట్టించి, ఆయన స్థానంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పజెప్పేందుకు జిల్లా కాంగ్రెస్‌లో జరిగిన ప్రయత్నాలను, ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరు మంత్రులూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పం దంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా ఆ లేఖలో మంత్రులు సీఎంకు విన్నవించారు. రానున్న ఎన్నికల్లో ఓ కులం ఓట్లను దృష్టిలో పెట్టుకునే పావులు కదిపినట్లు తేటతెల్లమవుతోంది. కొన్నిరాజకీయ శక్తుల ప్రమేయంతోనే..: విజయేందర్‌రెడ్డి జిల్లాలోని కొన్ని రాజకీయ శక్తులు తనపై లేని పోని అరోపణలు తీసుకువచ్చి తనను రాజకీయంగా ఎదగకుండా ఎత్తులు పన్నుతున్నాయని డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు చెప్పారు. తన 17 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ మచ్చ తెచ్చుకోలేదన్నారు. ఎన్నడూ పైరవీలు చేయలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని చెప్పారు. బ్యాంకులో జరిగిన అవకతవకలకు తాను బాధ్యుడినని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని అన్నారు. సొంత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని ఆరు నెలలు సెలవు పెట్టినట్లు చెప్పారు.