సెలవులో డీసీసీబీ చైర్మన్ | District central cooperative bank chairman in long leaves | Sakshi
Sakshi News home page

సెలవులో డీసీసీబీ చైర్మన్

Published Sat, Jan 4 2014 2:30 AM | Last Updated on Sat, Sep 2 2017 2:15 AM

District central cooperative bank chairman in long leaves

 సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. జనవరి 1వ తేదీ నుంచి ఆరు నెలలు సెలవు పెడుతున్నట్లు ఆయన బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావుకు లేఖ అందించారు. దాపరికం ఏమీ లేకుండా, అధికార కాంగ్రెస్‌లో అన్నీ బాహటంగానే సాగిన పరిణామాలు చివరకు విజయేందర్‌రె డ్డి సెలవుతో కొత్త మలుపు తిరగనున్నాయి. వాస్తవానికి చైర్మన్ గత  డిసెంబర్ 28వ తేదీన  జరిగిన బోర్డు సమావేశంలోనే సెలవుపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ సమావేశంలో మెజారిటీ డెరైక్టర్లు దేవరకొండ బ్యాంకులో జరిగిన అక్రమాల నిగ్గు తేలేవరకు సెలవుపై వెళ్లడానికి వీలులేదని పట్టుడట్టడంతో వాయి దా వేసుకున్నారు.

 కానీ ఇటీవల కేంద్ర బ్యాంకు లో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో , కావాలనే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన సెలవుపై వెళ్లడానికే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చేస్తున్న ఒత్తిడి కూడా  చైర్మన్ సెలవుకు కారణమని చెబుతున్నారు. రాజకీయ సమీకరణలో భాగంగా బ్యాంకు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు చైర్మన్ బాధ్యతలను అప్పగించాలనే ఉద్దేశంతో విజ యేందర్‌రెడ్డిని సెలవుపెట్టించారన్న విషయం ఇపుడు బహిరంగం అయ్యింది. కాగా, ఈ నెల 10న జరగనున్న బ్యాంకు బోర్డు సమావేశంలో ముత్తవరపు పాండురంగారావు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది.

 సీఎంకు... మంత్రుల లేఖ
 డీసీసీబీ  చైర్మన్‌గా ఉన్న విజయేందర్‌రెడ్డితో సెలవు పెట్టించి, ఆయన స్థానంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పజెప్పేందుకు జిల్లా కాంగ్రెస్‌లో జరిగిన ప్రయత్నాలను, ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న  ఈ లేఖలో ఇద్దరు మంత్రులూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పం దంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని, సుదీర్ఘకాలంగా  పార్టీకి సేవలు అందించిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా ఆ లేఖలో మంత్రులు సీఎంకు విన్నవించారు. రానున్న ఎన్నికల్లో ఓ కులం ఓట్లను దృష్టిలో పెట్టుకునే పావులు కదిపినట్లు తేటతెల్లమవుతోంది.
 కొన్నిరాజకీయ శక్తుల ప్రమేయంతోనే..: విజయేందర్‌రెడ్డి
 జిల్లాలోని కొన్ని రాజకీయ శక్తులు తనపై లేని పోని అరోపణలు తీసుకువచ్చి తనను రాజకీయంగా ఎదగకుండా ఎత్తులు పన్నుతున్నాయని డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని, అది వారి  విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు చెప్పారు. తన 17 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ మచ్చ తెచ్చుకోలేదన్నారు. ఎన్నడూ పైరవీలు చేయలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని చెప్పారు. బ్యాంకులో జరిగిన అవకతవకలకు తాను బాధ్యుడినని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని అన్నారు. సొంత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని ఆరు నెలలు సెలవు పెట్టినట్లు చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement