yadavelli vijayendar reddy
-
గులాబీ గూటికి విజయేందర్‌రెడ్డి!
కరీంనగర్: ప్రముఖ వైద్యుడు, బీజేపీ సీనియర్ నాయకుడు డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి బీజేపీని వీడి గులాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధమైంది. డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి ప్రముఖ వైద్యునిగా, బీజేపీలో సీనియర్ నాయకునిగా, సౌమ్యుడిగా పేరుంది. విజయేందర్‌రెడ్డి కుటుం బం మొదటి నుంచీ బీజేపీకి అండగా ఉంది. ఆయన తండ్రి ఎడవెల్లి జగ్గారెడ్డి జనసంఘ్, ఆర్ఎస్ఎస్ విభాగాల్లో పనిచేశారు. బీజేపీ జాతీయ రాష్ట్ర నాయకత్వానికి సుపరిచితులు కావడంతో 1991లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి 1,75,000 ఓట్లకు పైగా సాధిం చి మూడో స్థానంలో నిలిచారు. 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్ర వైద్య విధాన పరిషత్ పాలక మండలి సభ్యులుగా కొనసాగారు. కొంత కాలం కాంగ్రెస్‌ను వీడి స్తబ్దుగా ఉన్న ఆయన మళ్లీ బీజేపీలో చేరారు. 2014లో కరీంనగర్ బీజేపీ శాసనసభ అభ్యర్థిగా టికెట్ ఆశించి భంగపడ్డారు. హుస్నాబాద్ శాసనసభ అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వడంతో పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో కేసీఆర్ సమక్షంలో త్వరలోనే టీఆర్ఎస్లో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కేసీఆర్ నాయకత్వంపై విశ్వాసంతోనే.. టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన, అభివృద్ధి జరుగుతోంది. కేసీఆర్‌తో పోల్చుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో మిగతా పార్టీలకు సరైన నాయకత్వం లేదు. అందుకనే కేసీఆర్ పరిపాలన దక్షతా, శక్తి సామర్థ్యాలపై విశ్వాసంతో టీఆర్ఎస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నా. కరీంనగర్ తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ద్వారా సమయం తీసుకుని త్వరలోనే కేసీఆర్‌ను కలిసి పార్టీలో చేరుతా. – డాక్టర్ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి -
ప్లాన్ అదిరింది!
సాక్షిప్రతినిధి, నల్లగొండ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ)లో అంతా ఒప్పంద రాజకీయమే నడుస్తోంది. ఎన్నికల ముందు ఒప్పందంలో భాగంగానే చైర్మన్ విజయేందర్‌రెడ్డి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో చైర్మన్‌గా పీఠం దక్కించుకునేందుకు ముత్తవరపు పాండురంగారావు పావులు కదిపారు. ఇప్పుడా పదవి కోసం కొందరు డెరైక్టర్లతోనూ ‘ఒప్పందాలు’ జరిగాయి. బుధవారం జరగనున్న చైర్మన్ ఎన్నికలో పోటీ పడకుండా, పూర్తిస్థాయిలో సహకరించేందుకు చేతులకు మట్టి అంటకుండా లక్షలకు లక్షల రూపాయలు దోచిపెట్టే వ్యూహం పన్నారు. భువనగిరి, సూర్యాపేటలో డీసీసీబీ బ్రాంచ్‌ల బిల్డింగుల నిర్మాణం, కోదాడలో బ్యాంకుకు ప్రహరీ, టాయిలెట్ల నిర్మాణం, వాహన గ్యారేజీ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు. ఇదీ ... నేపథ్యం డీసీసీబీ చైర్మన్‌గా పనిచేసిన యడవెల్లి విజయేందర్‌రెడ్డి గత నెల 15వ తేదీన తన పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన చైర్మన్ పదవికి ఎన్నిక కోసం ముందే నిర్ణయం అయిన మేరకు సెప్టెంబరు 29వ తేదీన నోటిఫికేషన్ జారీ అయ్యింది. అయితే, ఈ ఎన్నికను సాఫీగా ముగించేందుకు, పాలకవర్గంలో ఉన్న కాంగ్రెస్ నేతలు పెద్ద వ్యూహమే రచించారు. విజయేందర్‌రెడ్డి రాజీనామా చేయగానే వైస్‌చైర్మన్‌గా ఉన్న ముత్తవరకు పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్ అయ్యారు. ఈలోగా ఏం జరిగిందో ఏమో కానీ డీసీసీబీ సీఈఓ కోటి 38ల క్షల 75వేల రూపాయల విలువైన పనులకు సెప్టెంబర్ 23వ తేదీ టెండరు ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన ఓ దినపత్రికలో (సాక్షి కాదు) 26వ తేదీన అచ్చయ్యింది. మంగళవారంతో టెండరు షెడ్యూళ్ల కొనుగోలు గడువు ముగిసింది. ఈ ప్రకటన మేరకు భువనగిరిలో భవన నిర్మాణానికి రూ.60లక్షలు, సూర్యాపేట భవనానికి రూ.60.75లక్షలు, కోదాడలో ప్రహరీ, టాయిలెట్స్, గ్యారేజీ నిర్మాణానికి రూ.10లక్షల అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు. ఇంతా చేస్తే, భువనగిరి పనికి 3, సూర్యాపేటకు 3, కోదాడ పనికి 5 చొప్పున మాత్రమే టెండరు దరఖాస్తులు అమ్ముడయ్యాయి. ఇదంతా ఓ పద్ధతి, ప్రణాళిక ప్రకారం నడిచిన వ్యవహారమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
డీసీసీబీ... బోర్డు సమావేశం నేడు
దేవరకొండ బ్యాంకు అవినీతి లెక్కతేల్చడమే ప్రధాన ఎజెండా వైస్ చైర్మన్‌కు ఇన్చార్జ్ బాధ్యతల అప్పగింతకు ఆమోదముద్ర సాక్షిప్రతినిధి, నల్లగొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాజకీయ వ్యవ హారం సుఖాంతమైనట్లే కనిపిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇక, వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పే తంతు మాత్రమే మిగిలి ఉంది. గత డి సెంబరు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం మరోమారు బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే వైస్ చైర్మన్‌కు ఇన్చార్జి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెబుతారని, బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేస్తారని చెబుతున్నారు. దీంతో పాటు దేవరకొండ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న అవినీతి లెక్క తేల్చడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. రామయ్య అవినీతి గుట్టు విప్పుతారా..? దేవరకొండ సహకార బ్యాంకు పరిధిలోని చిత్రియాల, తిమ్మాపురం, పీఏపల్లి, దేవరకొండ సంఘాల్లో అనర్హులకూ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇవ్వడంతో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతి వ్యవహారాన్ని తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఇప్పటికే రూ.17.92కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. అయితే, ఈ తతంగం వెనుక ఎవరెవరున్నారు..? ఎంతెంత మొత్తంలో డ బ్బులు చేతులు మారింది. అధికార కాంగ్రెస్ నాయకులు, అధికారుల్లో ఎవరికెంత వాటా ముట్టింది అన్న పూర్తి వివరాలను తేల్చేందుకు డీసీసీబీ సభ్యులంతా సీబీసీఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాటి సమావేశం నేపథ్యంలోనే దేవరకొండ బ్రాంచ్ ఏజీఎంగా పనిచేసి, అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామయ్య లొంగిపోవడం కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇప్పటి దాకా ఆయనను పోలీసులు అరెస్టు చేయకపోవడం, ఆయనే నేరుగా లొంగిపోవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నోరు విప్పి అసలు గుట్టు విప్పుతారా అన్న విషయం కూడా ఆసక్తిగా మారింది. అవినీతిపై స్పందించని డీసీసీబీ రమారమి 18కోట్ల రూపాయల అవినీతి జరిగితే, డీసీసీబీ వైపు నుంచి ఏమంత స్పందన కనిపించలేదు. నామమాత్రంగానే పోలీసులకు ఫిర్యాదు చేసి చేదులు దులిపేసుకున్నారు. దీంతో ఎలాంటి ఒత్తిడీ లేని ఈ కేసును పోలీసులు సైతం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఈ అవినీతి వ్యవహారమంతా... పలువురు ముఖ్యులకు తెలిసే జరిగిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జిల్లా సహకార రంగ ప్రతిష్టను మసకబారేలా చేసిన ఈ కుంభకోణంపై శుక్రవారం నాటి బోర్డు సీరియస్‌గా చర్చిస్తుందా..? బాధ్యులైన అధికారులను ఏం చేయనుంది..? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి. -
సెలవులో డీసీసీబీ చైర్మన్
సాక్షిప్రతినిధి, నల్లగొండ: జిల్లా కేంద్ర సహకర బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల పాటు దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. జనవరి 1వ తేదీ నుంచి ఆరు నెలలు సెలవు పెడుతున్నట్లు ఆయన బ్యాంకు సీఈఓ భాస్కర్‌రావుకు లేఖ అందించారు. దాపరికం ఏమీ లేకుండా, అధికార కాంగ్రెస్‌లో అన్నీ బాహటంగానే సాగిన పరిణామాలు చివరకు విజయేందర్రె డ్డి సెలవుతో కొత్త మలుపు తిరగనున్నాయి. వాస్తవానికి చైర్మన్ గత డిసెంబర్ 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలోనే సెలవుపెట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ సమావేశంలో మెజారిటీ డెరైక్టర్లు దేవరకొండ బ్యాంకులో జరిగిన అక్రమాల నిగ్గు తేలేవరకు సెలవుపై వెళ్లడానికి వీలులేదని పట్టుడట్టడంతో వాయి దా వేసుకున్నారు. కానీ ఇటీవల కేంద్ర బ్యాంకు లో నిధులు దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు రావడంతో , కావాలనే ఇదంతా ఓ పద్ధతి ప్రకారం చేస్తున్నారన్న అభిప్రాయానికి వచ్చిన ఆయన సెలవుపై వెళ్లడానికే మొగ్గుచూపినట్లు కనిపిస్తోంది. జిల్లా మంత్రులు జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు చేస్తున్న ఒత్తిడి కూడా చైర్మన్ సెలవుకు కారణమని చెబుతున్నారు. రాజకీయ సమీకరణలో భాగంగా బ్యాంకు వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు చైర్మన్ బాధ్యతలను అప్పగించాలనే ఉద్దేశంతో విజ యేందర్‌రెడ్డిని సెలవుపెట్టించారన్న విషయం ఇపుడు బహిరంగం అయ్యింది. కాగా, ఈ నెల 10న జరగనున్న బ్యాంకు బోర్డు సమావేశంలో ముత్తవరపు పాండురంగారావు ఇన్చార్జ్ చైర్మన్‌గా బాధ్యతను చేపట్టే అవకాశం ఉంది. సీఎంకు... మంత్రుల లేఖ డీసీసీబీ చైర్మన్‌గా ఉన్న విజయేందర్‌రెడ్డితో సెలవు పెట్టించి, ఆయన స్థానంలో వైస్ చైర్మన్‌కు బాధ్యతలు అప్పజెప్పేందుకు జిల్లా కాంగ్రెస్‌లో జరిగిన ప్రయత్నాలను, ఎన్నికల ముందు జరిగిన ఒప్పందాల గురించి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి సవివరంగా లేఖ రాశారు. గత ఏడాది సెప్టెంబరు 30వ తేదీతో ఉన్న ఈ లేఖలో ఇద్దరు మంత్రులూ సంతకాలు చేశారు. ముందు చేసుకున్న ఒప్పం దంలో భాగంగా, ఆయా కులాల సమీకరణాల నేపథ్యంలో ఈ మార్పు చేయనున్నామని, సుదీర్ఘకాలంగా పార్టీకి సేవలు అందించిన విజయేందర్‌రెడ్డికి రాష్ట్రస్థాయిలో నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కూడా ఆ లేఖలో మంత్రులు సీఎంకు విన్నవించారు. రానున్న ఎన్నికల్లో ఓ కులం ఓట్లను దృష్టిలో పెట్టుకునే పావులు కదిపినట్లు తేటతెల్లమవుతోంది. కొన్నిరాజకీయ శక్తుల ప్రమేయంతోనే..: విజయేందర్‌రెడ్డి జిల్లాలోని కొన్ని రాజకీయ శక్తులు తనపై లేని పోని అరోపణలు తీసుకువచ్చి తనను రాజకీయంగా ఎదగకుండా ఎత్తులు పన్నుతున్నాయని డీసీసీబీ చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తనను రాజకీయంగా దెబ్బతీయాలనే కుట్ర చేస్తున్నారని, అది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నట్లు చెప్పారు. తన 17 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఏనాడూ మచ్చ తెచ్చుకోలేదన్నారు. ఎన్నడూ పైరవీలు చేయలేదని అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలకు తీవ్ర మనస్తాపానికి గురయ్యాయని చెప్పారు. బ్యాంకులో జరిగిన అవకతవకలకు తాను బాధ్యుడినని నిరూపిస్తే దేనికైనా తాను సిద్ధమని అన్నారు. సొంత పనుల నిమిత్తం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని ఆరు నెలలు సెలవు పెట్టినట్లు చెప్పారు.