దేవరకొండ బ్యాంకు అవినీతి లెక్కతేల్చడమే ప్రధాన ఎజెండా
వైస్ చైర్మన్‌కు ఇన్‌చార్జ్ బాధ్యతల అప్పగింతకు ఆమోదముద్ర
సాక్షిప్రతినిధి, నల్లగొండ
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) రాజకీయ వ్యవ హారం సుఖాంతమైనట్లే కనిపిస్తోంది. ఈ నెల ఒకటో తేదీ నుంచే చైర్మన్ యడవెల్లి విజయేందర్‌రెడ్డి ఆరు నెలల దీర్ఘకాలిక సెలవుపై వెళ్లారు. ఇక, వైస్ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావుకు ఇన్‌చార్జ్ చైర్మన్‌గా బాధ్యతలు అప్పజెప్పే తంతు మాత్రమే మిగిలి ఉంది. గత డి సెంబరు 28వ తేదీన జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయంలో భాగంగా శుక్రవారం
మరోమారు బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశంలోనే వైస్ చైర్మన్‌కు ఇన్‌చార్జి ఛైర్మన్‌గా బాధ్యతలు అప్పజెబుతారని, బోర్డు సభ్యులు ఆమోద ముద్ర వేస్తారని చెబుతున్నారు. దీంతో పాటు దేవరకొండ బ్రాంచ్‌లో చోటు చేసుకున్న అవినీతి లెక్క తేల్చడంపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
రామయ్య అవినీతి గుట్టు విప్పుతారా..?
దేవరకొండ సహకార బ్యాంకు పరిధిలోని చిత్రియాల, తిమ్మాపురం, పీఏపల్లి, దేవరకొండ సంఘాల్లో అనర్హులకూ ఇబ్బడి ముబ్బడిగా రుణాలు ఇవ్వడంతో కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టాయి. ఈ అవినీతి వ్యవహారాన్ని తేల్చేందుకు ఏర్పాటైన కమిటీ ఇప్పటికే రూ.17.92కోట్లు అవినీతి జరిగినట్లు నిర్ధారించింది. అయితే, ఈ తతంగం వెనుక ఎవరెవరున్నారు..? ఎంతెంత మొత్తంలో డ బ్బులు చేతులు మారింది. అధికార కాంగ్రెస్ నాయకులు, అధికారుల్లో ఎవరికెంత వాటా ముట్టింది అన్న పూర్తి వివరాలను తేల్చేందుకు డీసీసీబీ సభ్యులంతా సీబీసీఐడితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం నాటి సమావేశం నేపథ్యంలోనే దేవరకొండ బ్రాంచ్ ఏజీఎంగా పనిచేసి, అవినీతి కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామయ్య లొంగిపోవడం కొత్త చర్చకు ఆస్కారం ఇస్తోంది. ఇప్పటి దాకా ఆయనను పోలీసులు అరెస్టు చేయకపోవడం, ఆయనే నేరుగా లొంగిపోవడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన నోరు విప్పి అసలు గుట్టు విప్పుతారా అన్న విషయం కూడా ఆసక్తిగా మారింది.
అవినీతిపై స్పందించని డీసీసీబీ
రమారమి 18కోట్ల రూపాయల అవినీతి జరిగితే, డీసీసీబీ వైపు నుంచి ఏమంత స్పందన కనిపించలేదు. నామమాత్రంగానే పోలీసులకు ఫిర్యాదు చేసి చేదులు దులిపేసుకున్నారు. దీంతో ఎలాంటి ఒత్తిడీ లేని ఈ కేసును పోలీసులు సైతం అంత సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపించలేదు. ఈ అవినీతి వ్యవహారమంతా... పలువురు ముఖ్యులకు తెలిసే జరిగిందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. జిల్లా సహకార రంగ ప్రతిష్టను మసకబారేలా చేసిన ఈ కుంభకోణంపై శుక్రవారం నాటి బోర్డు సీరియస్‌గా చర్చిస్తుందా..? బాధ్యులైన అధికారులను ఏం చేయనుంది..? అన్న ప్రశ్నలు ఆసక్తికరంగా మారాయి.
డీసీసీబీ... బోర్డు సమావేశం నేడు
Published Fri, Jan 10 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement
Advertisement