సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలను బలోపేతం చేసి రైతులకు అండగా ఉండేందుకు ఏర్పాటైన డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) లాభాల బాటలో పయనిస్తోంది. ప్రస్తుత పాలకవర్గం వివిధ రకాల సేవలను అమల్లోకి తెచ్చి రైతులకు అన్ని విధాల సహకరిస్తోంది. నాబార్డు నిధులతో, ఆప్కాబ్ సలహాలతో ఆర్థిక లావాదేవీలను రూ.420 కోట్లకు పెంచడంలో ప్రస్తుత పాలక సభ్యులు విజయం సాధించారు. భవిష్యత్తులో డీసీసీబీని మరింత లాభాల బాటలోకి నడిపిస్తామని, రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని ఆ బ్యాంకు చైర్మన్ డోల జగన్ అన్నారు. ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..
లాభాల్లో పీఏసీఎస్‌లు
రైతులకు లాభాలు చేకూర్చడమే థ్యేయంగా పనిచేస్తున్నాం. గత బోర్డు రూ.270 కోట్ల లావాదేవీలకే పరిమితమైపోతే మేం దాన్ని రూ.420 కోట్లకు పెంచాం. ఇంకా పెంచేందుకు ప్రయత్నిస్తున్నాం. 49 సహకార సంఘాల్లో 34 సంఘాలు ఇప్పటికే లాభాల బాట పట్టాయి. రూ.110 కోట్ల స్వల్పకాలిక రుణాలిచ్చాం. వీటి ద్వారా ప్రతి సంఘానికి ఒక శాతం లాభం వస్తుంది. నాబార్డు సూచనలతో పీఏసీఎస్‌లను బలోపేతం చేసేందుకు బోర్డు సభ్యులతో ఎప్పటికప్పుడు చర్చిస్తున్నాం. గ్రామాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. సభ్యులు రూ.15 చెల్లిస్తే ఏడాదికి రూ. ఒక లక్ష వరకూ బీమా పొందే ందుకు అవకాశం కల్పించాం. ఆప్కాబ్, డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా ఆ సొమ్ముకు బాధ్యత విహ ంచేలా చూస్తున్నాం. విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.
మల్టీ సర్వీస్ సెంటర్లతో ఫలితాలు
డీసీసీబీ ద్వారా ప్రవేశపెట్టిన మల్టీ సర్వీస్ సెంటర్లు సత్ఫలితాలనిస్తున్నాయి. తొలుత కొత్తూరు ప్రాంతంలో రోడ్డుకు ఆనుకుని ఉన్న ఖాళీ స్థలంలో దీన్ని ప్రారంభించాం. అక్కడ పది దుకాణాలు ఏర్పాటు చేశాం. దీనివల్ల ఆయా సొసైటీలకు నెలకు రూ. లక్ష ఆదాయం వచ్చే అవకాశం కలిగింది.
త్వరలో సంతకవిటి, బుడితి, భామిని, లోలుగు, కొత్తూరు, ఇచ్చాపురం ప్రాంతాల్లో మల్టీ సర్వీస్ సెంటర్లు తెరుస్తాం. పంట రుణాలు విరివిగా అందజేయడం సంస్థకు భారమే అయినప్పటికీ రైతుల కోసం ఆ మాత్రం చేయక తప్పదు. దీర్ఘకాలిక రుణాలు, వ్యవసాయ పనిముట్లు అందజేయడం వల్ల రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. భవిష్యత్తులో రుణమేళాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలుస్తాం.
గతంలో అలా..ఇప్పుడిలా..
డీసీసీబీ ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. రూ.120 కోట్ల స్వల్పకాలిక రుణాలు, రూ.7 కోట్ల దీర్ఘకాలిక రుణాలు, బంగారు ఆభరణాలపై రూ.9 కోట్ల రుణాలు, ఇతర రుణాలు రూ.1.5 కోట్లు ఇచ్చాం. అదే సమయంలో రూ.32కోట్ల డిపాజిట్లు సేకరించాం. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వివిధ బ్యాంకులు 9.35 శాతం వరకే వడ్డీ ఇస్తుంటే మేం 9.75 శాతం ఇస్తున్నాం. మా వద్ద 1.30 లక్షల మంది రైతులకు ఖాతాలున్నాయి. నరసన్నపేటలో ఏప్రిల్ మొదటి వారంలో మరో బ్రాంచి తెరుస్తున్నాం.
మొత్తం 49 సొసైటీల్లో 26 సొసైటీలకు సొంత భవనాలున్నాయి. మిగతా వాటికి సమకూర్చే ప్రయత్నాల్లో ఉన్నాం. రుణమాఫీకి సంబంధించి తొలివిడతలో రూ.79.55 లక్షలకు అప్‌లోడ్ చేశాం. రెండోదశకు సంబంధించి రూ.101 కోట్లకు ప్రభుత్వానికి నివేదించాం. గత బోర్డు ఆధ్వర్యంలో 9వేల మెట్రిక్ టన్నుల ఎరువుల వ్యాపారం చేస్తే ఇప్పుడు 19,045 టన్నుల వ్యాపారం చే శాం. గతంలో 2710 టన్నుల విత్తనాలు విక్రయిస్తే ఇప్పుడు 3795 టన్నులు విక్రయించాం. గతంలో 16,100 టన్నుల ధాన్యం సేకరించగా ఇప్పుడు 1,83,390 టన్నులు సేకరించాం.
పెరుగుతున్న లాభాలు
2013లో సంస్థ రూ. 2.35 కోట్ల లాభాలు ఆర్జించగా 2014లో రూ.2.43 కోట్లకు చేరింది. ప్రస్తుతం అవి రూ.2.5 కోట్లకు పెరిగాయి. గతంలో మూడు సొసైటీలే లాభాల్లో ఉండగా ఇప్పుడు 34 సంఘాలు లాభాల్లో ఉన్నాయి. అప్పట్లో డీసీసీబీకి జిల్లాలో 13 బ్రాంచీలుంటే ఇప్పుడు 15కు పెరిగాయి. సంస్థకు చెందిన రూ.30 కోట్లు ప్రభుత్వం వద్ద ఉన్నాయి. రైతులిచ్చిన ఆ సొమ్ముకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహకం లేకపోయినా మేం వడ్డీ కడుతున్నాం. ఆ సొమ్ము కోసం ఆప్కాబ్ ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం.
పెరిగిన డీసీసీబీ రుణ పరపతి
Published Sat, Mar 14 2015 1:36 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement