డీసీసీబీ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం! | District Central Co-operative Bank director notices to chairman premayya | Sakshi
Sakshi News home page

డీసీసీబీ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం!

Published Fri, Mar 18 2016 4:53 AM | Last Updated on Thu, Sep 27 2018 8:50 PM

డీసీసీబీ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం! - Sakshi

డీసీసీబీ వైస్ చైర్మన్ పై అవిశ్వాసం!

ప్రేమయ్యకు తప్పని పదవీ గండం
డీసీవోకు 15 మంది డెరైక్టర్ల నోటీసులు
త్వరలో అవిశ్వాస పరీక్ష తేదీ ప్రకటన
ఏప్రిల్ 7న ఎన్నికలు జరిగే అవకాశం
ఐడీసీఎంఎస్‌పై తాత్కాలికంగా వాయిదా
డీసీసీబీ వైస్ చైర్మన్ రేసులో సంపత్ గౌడ్?

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు(డీసీసీబీ) ఉపాధ్యక్షుడు పరికె ప్రేమయ్య (ప్రేంకుమార్) పదవికి ఎసరు వచ్చింది. అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆయనను ఉపాధ్యక్ష పదవి నుంచి దింపేందుకు అవిశ్వాసం నోటీసు దాఖలైంది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన 15 మంది డెరైక్టర్లు గురువారం నిజామాబాద్‌లోని డీసీవో కార్యాలయంలో జిల్లా సహకార అధికారి గంగాధర్‌ను కలిసి నోటీసు ఇచ్చారు. 2013లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ(బోధన్ మండలం) డీసీసీబీ చైర్మన్‌గా, దోమకొండ మండలానికి చెందిన ప్రేమయ్య పీఏసీఎస్ అధ్యక్షునిగా గెలిచి ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్, వైఎస్సార్ సీపీలకు చెందిన పలువురు డెరైక్టర్లు టీఆర్‌ఎస్‌లో చేరగా, ఏకంగా డీసీసీబీ చైర్మన్ గంగాధర్ పట్వారీ పదవికే గండం ఏర్పడ ఆయన పార్టీ మార్చి పదవిని దక్కించుకున్నారు. కాగా తాజాగా వైస్ చైర్మన్ ప్రేమయ్యను దింపేందుకు అవిశ్వాసం నోటీసు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

 డీసీసీబీ వైస్ చైర్మన్ ఎన్నికపై నేడో, రేపో ప్రకటన
ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్దన్ ఇంట్లో కొద్ది రోజుల క్రితం సమావేశమైన మంత్రి, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు మెజార్టీ సభ్యులు గురువారం డీసీవోకు అవిశ్వాసం నోటీసు ఇచ్చారు. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు మొత్తం 20 మంది డెరైక్టర్లలో 14 మంది మద్దతు అవసరం ఉంది. 2013లో మొత్తం 20 మంది డెరైక్టర్లకు 11 మంది కాంగ్రెస్, ఐదుగురు వైఎస్సార్ సీపీ, నలుగురు టీఆర్‌ఎస్‌కు చెందిన వారు ఎన్నికయ్యారు. ఎస్సీలకు రిజర్వు చేయబడిన ఒడ్డెపల్లికి ఎవరు నామినేషన్ వేయకపోవడంతో అప్పట్లో వాయిదా పడింది. దీంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన గంగాధర్ పట్వారీ చైర్మన్‌గా, ప్రేమయ్య వైస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. మారిన రాజకీయ పరిణామక్రమంలో అధికార పార్టీ నేతలు అవిశ్వాసంకు సరిపడే విధంగా 15 మంది డెరైక్టర్లను కూడగట్టారు. మ్యాజిక్ ఫిగర్‌ను చేరుకున్న టీఆర్‌ఎస్ మరికొందరు డెరైక్టర్లను కూడగట్టి గంగాధర్ పట్వారీపై అవిశ్వాసంకు ప్రయత్నించగా పార్టీ మారి పదవిని కాపాడుకున్నారు. ఇప్పుడు వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు 15 మంది సంతకాలతో కూడిన లేఖను డీసీవోకు సమర్పించారు. ఈ అంశంపై జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పాలకవర్గంలో వాడివేడి చర్చ సాగుతోంది. కాగా డెరైక్టర్ల నుంచి అవిశ్వాసం నోటీసు స్వీకరించిన మాట వాస్తవమేనని, అయితే అవిశ్వాస పరీక్షకు ఇంకా తేదీని ప్రకటించలేదని డీసీవో గంగాధర్ ‘సాక్షి’కి తెలిపారు. నోటీసును పరిశీలించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా దాదాపుగా డీసీసీబీ వైస్ చైర్మన్‌పై ఏఫ్రిల్ 7న అవిశ్వాస పరీక్ష, ఆ వెంటనే కొత్త వైస్ చైర్మన్ జరిగే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం.

వైస్ చైర్మన్ రేసులో సంపత్ గౌడ్..
డీసీసీబీ వైస్ చైర్మన్ ప్రేమయ్యకు పదవీ గండం ఖాయమైంది. ఎందుకంటే డీసీసీబీ ఎన్నికల సమయంలో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ పీఏసీఎస్, డీసీసీబీ డెరైక్టర్ల సంఖ్య తగ్గింది. ఒకప్పుడు 11 మంది డెరైక్టర్లు ఉంటే.. ఇప్పుడు వైస్ చైర్మన్ ప్రేమయ్య, మరో ముగ్గురు మిగిలారు. ప్రేమయ్యతోపాటు మీసాల శ్రీనివాస్, గంగారెడ్డి, డిచ్‌పల్లికి చైర్మన్ జైపాల్‌లు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అవిశ్వాసం నెగ్గడానికి సరిపడే సభ్యులతో కలిసి అధికార పార్టీకి చెందిన డెరైక్టర్లు డీసీవో నోటీసు ఇవ్వగా.. బలపరీక్షలో నెగ్గడం సమస్యే కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంగాధర్ పట్వారీపై అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నం చేసిన లింగంపేట ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు, డీసీసీబీ డైరక్టర్ ఈదురుగట్ల సంపత్ గౌడ్ వైస్ చైర్మన్ రేసులో ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే జనార్దన్ గౌడ్‌కు బావమరిదైన సంపత్ చురుకైన నాయకుడిగా పేరుండటంతో ఎంపీ, ఎమ్మెల్యేలు ఆయనకే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు 15 మంది డెరైక్టర్లతో కలిసి గురువారం సంపత్‌గౌడ్ నిజామాబాద్‌లో డీసీవోకు అవిశ్వాసం నోటీసు అందజేశారు. ఇదిలా వుండగా ఐడీసీఎంఎస్ ఉపాధ్యక్షులపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు ప్రేంకుమార్ విషయంలో స్పష్టతకు వచ్చినా... శ్రావణ్‌రెడ్డి విషయంలో వేచిచూసే ధోరణిలో ఉన్నట్లు తెలిసింది. ఉన్న ఫలంగా డీసీఎంఎస్‌లో ఖాళీగా ఉన్న రెండు డైరక్టర్ పోస్టులను భర్తీ చేసి, మెజార్టీ కూడగట్టి అవిశ్వాసం తీర్మానం పెట్టే అవసరం ఉన్నందున వాయిదా వేసుకున్నట్లు చెప్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement