Movie Director
-
సినీ దర్శకుడు ఆత్మహత్య
సినీ దర్శకుడు రవిశంకర్ (63) చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నారు. భాగ్య పత్రికలో కథారచయితగా జీవితాన్ని ప్రారంభించిన రవిశంకర్ ఆ తరువాత దర్శకుడు కె.భాగ్యరాజ్, దర్శకుడు విక్రమన్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. కాగా శరత్‌కుమార్, దేవయాని జంటగా విక్రమన్ దర్శకత్వంలో రూపొందిన సూర్యవంశం చిత్రానికి రవిశంకర్ సహాయ దర్శకుడిగా పనిచేయడంతోపాటు, అందులోని రోసాపూ అనే సూపర్‌హిట్ పాటను రాశారు. కాగా నటుడు మనోజ్ భారతీరాజా హీరోగా నటించిన వర్షమెల్లామ్ వసంతం చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ చిత్రంలోని అన్ని పాటలను రవిశంకరే రాశారు. అయితే ఆ తరువాత ఈయనకు మరో అవకాశం రాలేదు. కాగా అవివాహితుడైన రవిశంకర్ స్థానిక కేకే.నగర్‌లోని ఒక చిన్న గదిలో అద్దెకు ఉంటున్నారు. అయితే సినిమా అవకాశాలు లేక, పేదరికంలో జీవిస్తున్న ఈయన మానసిక వేదనతో ఉరి వేసుకుని బలవర్మణానికి పాల్పడినట్లు తెలిసింది. సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి రవిశంకర్ భౌతికకాయాన్ని పోస్ట్‌మార్టానికి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈయన ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. రవిశంకర్ మర ణం కోలీవుడ్‌ను దిగ్భ్రాంతికి గురిచేసింది. -
ఇండస్ట్రీని వదిలేసిన ప్రముఖ దర్శకుడు.. కారణం ఆ జబ్బు!?
సినిమా అనేది వ్యసనం లాంటిది. ఒక్కసారి ఇండస్ట్రీలోకి వస్తే తిరిగి బయటకెళ్లాలి అనిపించదు. కొందరు డైరెక్టర్స్ అయితే కెరీర్ ఖతం అయిపోయినా సరే పిచ్చి సినిమాలు తీస్తూ ప్రేక్షకులకు టార్చర్ చూపిస్తుంటారు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ సినిమా తీసిన ఓ దర్శకుడు మాత్రం ఇండస్ట్రీని వదిలేస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ కారణమేంటో తెలుసా? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) తెలుగు ప్రేక్షకులకు మలయాళ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ప్రస్తుతం జనరేషన్‌కి ఈ భాషా చిత్రాలు పరిచయమైంది 'ప్రేమమ్'తోనే. సాయిపల్లవి, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా పరిచయమైన ఈ మలయాళ మూవీ.. 2015లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీనికి దర్శకత్వం వహించిన అల్ఫోన్స్ పుత్రెన్కి బోలెడంత క్రేజ్ తీసుకొచ్చింది. దర్శకుడు కావడానికి ముందు పలు షార్ట్ ఫిల్మ్స్, మ్యూజిక్ వీడియోస్ తీసిన అల్ఫోన్స్.. 2013లో 'నేరమ్' మూవీతో దర్శకుడిగా మారాడు. 'ప్రేమమ్'తో వేరే లెవల్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. దీని తర్వాత అవియల్ (2016), గోల్డ్ (2022), గిఫ్ట్ (2023) సినిమాలు తీశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) కొన్నాళ్ల ముందు అల్ఫోన్స్ ఫొటోలు కొన్ని బయటకొచ్చాయి. వీటిలో బక్కచిక్కి పోయి, నెరిసిన గడ్డంతో కనిపించాడు. దీంతో అనారోగ్యానికి గురయ్యారా అని అందరూ అనుకున్నారు. ఇప్పుడు ఓ జబ్బుతో బాధపడుతున్నట్లు చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అందుకే దర్శకుడి కెరీర్‌కి పుల్‌స్టాప్ పెడుతున్నట్లు చెప్పుకొచ్చాడు. 'నా సినిమా థియేటర్ కెరీర్ ఆపేస్తున్నాను. అటిజం స్పెక్ర్టమ్ డిజార్డర్ సమస్యతో బాధపడుతున్నాను. నేను ఎవరికీ భారంగా ఉండలనుకోవట్లేదు. సాంగ్, వీడియోస్, షార్ట్ ఫిల్మ్స్ మాత్రం చేస్తాను. ఓటీటీ కంటెంట్ కూడా చేస్తాను. నిజానికి సినిమాలు ఆపేయాలనుకోవడం లేదు. కానీ వేరే అవకాశం లేకుండా పోయింది. చేయలేని వాటి గురించి ప్రామిస్ చేయలేను. అనారోగ్యం ఉన్నప్పుడు జీవితంలో ఇంటర్వెల్ పంచ్ లాంటి ట్విస్ట్ ఇలా వస్తుంది' అని అల్ఫోన్ రాసుకొచ్చాడు. కానీ ఈ పోస్ట్ కాసేపటికే డిలీట్ చేశాడు. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
Lokesh Kanagaraj Visits Tirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న లియో డైరెక్టర్ (ఫోటోలు)
-
నవ్వుల జాతర
క్రిష్ సిద్ధిపల్లి, కష్వీ జంటగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ సినిమా షురూ అయింది. వాల్మీకి దర్శకత్వంలో శ్రీ నిధి క్రియేషన్స్ సమర్పణలో సన్ స్టూడియో బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. వాల్మీకి మాట్లాడుతూ– ‘‘పూర్తి హాస్యభరిత చిత్రంగా ‘జంధ్యాలగారి జాతర 2.0’ ఉంటుంది. ఈ సినిమాకు జంధ్యాలగారి పేరు పెట్టడంతో మంచి అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకునేలా మా చిత్రం ఉంటుంది’’ అన్నారు. ‘‘విందు భోజనం లాంటి చిత్రమిది’’ అన్నారు క్రిష్ సిద్ధిపల్లి. నటులు రఘుబాబు, పృథ్వీ, యాని మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: వంశీ కృష్ణ, కెమెరా: విజయ్ ఠాగూర్. -
ఆ రోజు కీడా కోలా
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాల ఫేమ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ నటించి, తెరకెక్కించిన తాజా చిత్రం ‘కీడా కోలా’. క్రైమ్ కామెడీ జానర్లో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ మూవీలో బ్రహ్మానందం, రఘురామ్, రవీంద్ర విజయ్ లీడ్ రోల్స్ చేశారు. కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్, శ్రీసాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ ఈ సినిమాను నిర్మించారు. కాగా ఈ సినిమా నటుడు–నిర్మాత రానా సమర్పణలో నవంబరు 3న విడుదల కానున్నట్లుగా చిత్ర యూనిట్ శుక్రవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు సంగీతం: వివేక్ సాగర్ -
కుటుంబంతో కలిసి చూడొచ్చు – దర్శకుడు అభిషేక్ మహర్షి
‘ప్రేమ్ కుమార్’ చిత్రం ఆద్యంతం వినోద భరితంగా కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది. ఈ మూవీలో నేను, నా వైఫ్ అతిథి పాత్రల్లో కనిపిస్తాం’’ అని దర్శకుడు అభిషేక్ మహర్షి అన్నారు. సంతోష్ శోభన్ హీరోగా, రాశీ సింగ్, రుచిత సాధినేని హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ప్రేమ్ కుమార్’. శివ ప్రసాద్ పన్నీరు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు అభిషేక్ మహర్షి మాట్లాడుతూ–‘‘కొన్ని సినిమాలకు ఘోస్ట్ రైటర్‌గా పని చేశాను. నా దగ్గర ఉన్న ముప్పై కథల్లో ‘ప్రేమ్ కుమార్’ కథ సెట్ అయింది. ‘కుచ్ కుచ్ హోతా హై, నువ్వే నువ్వే’ సినిమాల స్ఫూర్తితో ఈ కథను రాశాను. సినిమాల్లో పెళ్లి సీన్స్ లో చివర్లో హీరో వచ్చి.. హీరోయిన్స్ పెళ్లి ఆపుతాడు. తర్వాత హీరో, హీరోయిన్లు కలిసిపోతారు. అప్పుడు ఆ పెళ్లి కొడుకు పరిస్థితి ఏంటి? చెప్పేందుకే ‘ప్రేమ్ కుమార్’ తీశాం. శివ ప్రసాద్‌గారికి సినిమాలపై ఎంతో ష్యాషన్ ఉంది’’ అన్నారు. -
ధనుష్, శేఖర్ కమ్ముల కాంబోలో ‘డీ 51’
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా ‘డీ 51’ (వర్కింగ్ టైటిల్) తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నారాయణ్ దాస్ కె. నారంగ్ ఆశీర్వాదంతో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించనున్నారు. కాగా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ నారాయణ్ దాస్ కె. నారంగ్ జయంతి సందర్భంగా గురువారం ‘డీ 51’ చిత్రం అప్డేట్ ఇచ్చారు. ‘‘డీ 51’లో ఇంతకు ముందెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ధనుష్‌ని చూపించే పర్ఫెక్ట్ కథను శేఖర్ కమ్ముల సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ సినిమాకి సమర్పణ: సోనాలీ నారంగ్. -
సినీ దర్శకుడు కిడ్నాప్
కర్ణాటక: సినిమాలలో దర్శకుడు ఎన్నో కిడ్నాప్ ఘటనలను చిత్రీకరించి ఉంటాడు. కానీ తనే కిడ్నాప్‌కు గురవుతానని ఊహించి ఉండడు. నిజజీవితంలో అదే జరిగింది. సినిమా చాన్సిస్తానని డబ్బులు వసూలు చేసి ముఖం చాటేసిన సినిమా డైరెక్టర్‌ను కొందరు కిడ్నాప్ చేశారు. ఈ సంఘటన క్రిష్ణగిరి పట్టణంలో చోటుచేసుకొంది. వివరాల మేరకు కేరళ రాష్ట్రం పాలక్కాడుకు చెందిన క్రిష్ణ ప్రకాష్ (36), తమిళం, మలయాళం సినిమా రంగంలో దర్శకునిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం క్రిష్ణగిరి ప్రాంతంలో సినిమాను చిత్రీకరించేందుకు స్థల పరిశీలన కోసం వచ్చాడు. క్రిష్ణగిరి కొత్తబస్టాండులోని ఓ లాడ్జిలో బసచేశాడు. సోమవారం ఉదయం క్రిష్ణగిరి బస్టాండు వద్ద ఉన్న క్రిష్ణప్రకాష్తో కారులో వచ్చిన నలురు వ్యక్తులు వాగ్వివాదానికి దిగి అతన్ని కారులో కిడ్నాప్ చేశారు. ఈరోడ్‌లో పట్టివేత గమనించిన స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందజేశారు. వెంటనే పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని వివిధ పోలీస్స్టేషన్లకు సమాచారం అందజేశారు. ఈరోడ్ జిల్లా సత్యమంగలం పోలీసులు కారును అడ్డుకుని అందరినీ క్రిష్ణగిరి పోలీసులకు అప్పగించారు. గత ఏడాది క్రితం సత్యమంగలం ప్రాంతంలో కరికాలన్, కార్తికేయన్, శివశక్తి అనేవారి నుంచి సినిమాలలో అవకాశమిస్తానని రూ. 2.50 లక్షల నగదును తీసుకొన్నాడు. కానీ అవకాశాలు ఇవ్వకపోవడంతో ఏదో ఒకటి తేల్చుకోవాలని కిడ్నాప్ చేశామని చెప్పారు. నిందితులను అరెస్ట్ చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
ప్రశాంత్ నిల్ మాదిరే మరో డైరెక్టర్ని టార్గెట్ చేసిన సౌత్ నిర్మాతలు
సినీ పరిశ్రమలో టాలెంట్ ఉంటే అవకాశాలు కూడా వారి వెంట పడటం కొత్తేమీ కాదు. ఒక భాషలో విజయం సాధించిన చిత్రాలను ఇతర భాషల్లో మళ్లీ నిర్మించడం, సక్సెస్ఫుల్ హీరోయిన్లకు ఇతర భాషల్లో అవకాశాలు కల్పించడం, ఒక భాషలో సక్సెస్ సాదించిన దర్శకులతో ఇతర భాష నిర్మాతలు కూడా చిత్రాలు చేయడం సాధారణంగా జరిగే విషయమే. తాజాగా సౌత్ ఇండియా నిర్మాతల దృష్టి మలయాళ దర్శకులపై పడిందనే చెప్పాలి. (ఇదీ చదవండి: Trisha Krishnan : మళ్లీ ఒక రౌండ్ కొడుతున్న త్రిష...) అలా కేజీఎఫ్‌తో ప్రశాంత్ నిల్తో టాలీవుడ్ నిర్మాతలు వరుసగా చిత్రాలు చేయడానికి సిద్ధం అయ్యా రు. ఇక ఇటీవల విడుదలైన మలయాళం చిత్రం '2018' అనూహ్య విజయాన్ని సాధించింది. ఇది 2018 లో కేరళలో తుపాన్ ప్రభావానికి గురైన ఘటనను ఆవిష్కరించిన చిత్రం. దీనిని దర్శకుడు 'జూడ్ ఆంథోనీ జోసెఫ్' అద్భుతంగా తెరకెక్కించారు. హృదయ విదారకరమైన తుపాన్ బాధితుల కష్టాలను ఎంతో సహజంగా తీర్చిదిద్దారు. అలా విమర్శకులు సైతం ప్రశంసలు వర్షం కురిపించిన ఈయనపై ఇతర ఇండస్ట్రీలకి చెందిన నిర్మాతల దృష్టి పడింది. ఆయనతో సినిమాలు నిర్మించే అవకాశాన్ని కోలీవుడ్ ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ పొందడం విశేషం. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మంచి కథా బలం ఉన్న చిత్రాలను నిర్మించడానికి ఎప్పుడు ముందు ఉండే ఈ సంస్థ ఇటీవల మణిరత్నం దర్శకత్వంలో భారీ తారాగణంతో అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రం రెండు భాగాలు పెద్ద విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం కమలహాసన్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఇండియన్ –2 చిత్రంతో పాటు.. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలాం' చిత్రాన్ని ఈ సంస్థ నిర్మిస్తోంది. (ఇదీ చదవండి: Salaar: అల్లు అరవింద్ బిగ్ ప్లాన్.. ఇది జరుగుతుందా?) తదుపరి అజిత్ హీరోగా ఒక చిత్రాన్ని, రజనీకాంత్ కథానాయకుడిగా మరో చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుంది. కాగా తాజాగా 2018 చిత్ర దర్శకుడు జూడ్ ఆంథోనీ జోసెఫ్ దర్శకత్వంలో ఓ సినిమాను చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ఆ చిత్ర దర్శకుడు లైకా ప్రొడక్షన్స్ నిర్వాహకుడు జీకేఎం తమిళ్ కుమరన్ ను కలిసి చర్చలు జరిపారు. దీంతో ఈ కాంబినేషన్లో ఎలాంటి చిత్రం వస్తుందో అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. -
రాజమౌళితో మహేశ్ సినిమా.. ఆ టెస్ట్ పాసవ్వాల్సిందేనా!
ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అనుకున్నది సాధించాడు...ఇక ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళి తన నెక్ట్స్ మూవీపైనే ఫోకస్ పెట్టాడు. రాజమౌళి సినిమా ఏదైనా సెట్స్ పైకి వెళ్లే ముందే పక్కా ప్లానింగ్‌తో రెడీ అవుతాడు. ఓ సినిమా అనుకున్న తర్వాత ఏ స్టేజ్‌లో కూడా కాంప్రమైజ్ కాడు. రాజమౌళితో సినిమా అంటే ఆషామాషీగా ఉండదు. ఏ స్టార్ హీరో అయినా, ఏ స్టార్ టెక్నిషీయన్ అయినా రాజమౌళి మాట వినాల్సిందే. ఇక రాజమౌళి నిర్వహించే వర్క్ షాప్‌కు అందరూ హాజరు కావాల్సిందే. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో జక్కన్న తెరకెక్కించబోయే తన నెక్ట్స్ మూవీకి వర్క్ షాప్ ప్లాన్ రెడీ చేశాడు. రాజమౌళితో సినిమా చేయడం హీరోలకు ఓ సవాల్ అనే చెప్పాలి. తన కథకు తగినట్లు హీరో ఉండే విధంగా రాజమౌళి శిక్షణ ఇప్పిస్తాడు. హీరో తన పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే పాత్రను అర్థం చేసుకుని ఆ క్యారెక్టర్లోకి హీరో పరకాయ ప్రవేశం చేసేలా రాజమౌళి ట్రైనింగ్ ఉంటుంది. సాధారణంగా ఏ డైరెక్టర్ అయినా వర్క్ షాప్ వన్ వీక్ లేదా టెన్ డేస్ ఉండేలా ప్లాన్ చేస్తుంటారు. అయితే రాజమౌళి కొన్ని నెలల పాటు వర్క్ షాష్ నిర్వహిస్తాడు. అంతే కాదు ఈ వర్క్ షాప్ కోసం బడ్జెట్ కూడా కేటాయిస్తాడు. ఇక ప్రిన్స్‌తో తెరకెక్కించబోయే #ఎస్ఎస్ఎంబీ 29 మూవీ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసమే దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టనున్నాడట జక్కన్న. రాజమౌళి మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ వరకు అన్ని సినిమాలకు వర్క్ షాప్ నిర్వహించాడు. తన ఊహలో ఆలోచనల్ని రాజమౌళి ముందుగా తన టీమ్‌కు చెబుతాడు. అలాగే వారు ఇచ్చే ఇన్ పుట్స్ కూడా తీసుకుంటాడు. ఇక ఆర్ట్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కెమెరా, విజువల్ ఎఫెక్ట్స్ ఇలా ప్రతి విభాగానికి తాను తీయబోయే సినిమాకి సంబంధించి అన్ని విషయాలు వివరిస్తాడు. తను ఏ సీన్ ఏలా తీయాలనుకుంటున్నది. అందుకు ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నాడో వివరిస్తాడు. అలాగే మహేశ్ బాబుతో తీయబోయే సినిమా కోసం రాజమౌళి ఓ భారీ వర్క్ షాప్ ప్లాన్ చేశాడనే మాట టీ టౌన్లో వినిపిస్తోంది. గ్లోబల్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వేంచర్ జోనర్లో తెరకెక్కించబోయే ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ ఎక్కడ అవసరం అవుతాయి.. ఏ సీన్స్‌కు గ్రీన్ మ్యాట్ వాడాలి. ఇక యాక్షన్ సన్నివేశాలకు సంబంధించిన శిక్షణ ఈ వర్క్ షాప్‌లో ఉండనుందని సమాచారం. బాహుబలి, బాహుబలి- 2 సినిమాల కోసం రాజమౌళి కొన్ని నెలల పాటు ప్రభాస్ - రానా, అనుష్క, నాజర్, సత్యప్రకాశ్లకు వర్క్ షాపులు నిర్వహించాడు. ఇక ప్రభాస్, రానాలో రాజరికం ఉట్టిపడేలా వాళ్లిద్దర్నీ ఆయన తీర్చిదిద్దారు. అలాగే మేకోవర్ విషయంలో ప్రభాస్ - రానా ఇద్దరూ చాలా కష్టపడ్డారు. అంతే కాదు ఓ రేంజ్లో రానా, ప్రభాస్ జిమ్‌లో కసరత్తులు చేసి కండలు పెంచారు. ఇక ఆర్ఆర్ఆర్ విషయంలో కూడా రాజమౌళి రామ్ చరణ్, ఎన్టీఆర్‌ను కూడా వదిలిపెట్టలేదు. ఇక ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించబోయే మహేశ్ బాబు సినిమా కోసం... ఆరు నెలల వర్క్ షాప్ ప్లాన్ చేశాడట రాజమౌళి. ఈ మూవీ నెక్ట్స్ సమ్మర్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ వుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ సినిమా వర్క్ షాప్ స్టార్ట్ అవుతుందనే ప్రచారం ఫిల్మ్ సర్కిల్స్‌లో సాగుతోంది. ఈ వర్క్ షాప్‌లో మహేష్ బాబుతో సహా మిగిలిన యాక్టర్స్ అందరికీ ట్రైయినింగ్ ఉంటుందట. కాగా.. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న మహేశ్ బాబు మూవీ ఎస్ఎస్ఎంబీ 28 ఆగస్టు 11న విడుదల కానుంది. -
కళా తపస్సు ముగిసింది.. కె. విశ్వనాథ్ ఇకలేరు
సాక్షి, హైదరాబాద్: ఓ శంకరాభరణం, ఓ సిరిసిరి మువ్వ, ఓ సిరివెన్నెల, ఓ స్వాతి ముత్యం, ఓ శుభసంకల్పం.. తెలుగు సినీరంగానికి ఇలాంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి చిత్రాలనిచ్చిన దర్శక దిగ్గజం, రచయిత, నటుడు, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, కళా తపస్వి కె.విశ్వనాథ్‌గా ప్రఖ్యాతిగాంచిన కాశీనాథుని విశ్వనాథ్ (92) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం రాత్రి 11 గంటల సమయంలో తుదిశ్వాస విడిచారు. వయోభారం వల్ల ఆయన ఈ మధ్య కాలంలో పలుమార్లు ఆస్పత్రిలో చేరినా కోలుకుని తిరిగి వచ్చారు. అయితే రెండురోజుల క్రితం ఆయన తిరిగి అస్వస్థతకు గురికావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. ఎప్పటిలాగే తిరిగొస్తారని కుటుంబసభ్యులు, అభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందినవారు ఆశించారు. కానీ ఆయన ఇక సెలవంటూ వెళ్లిపోయారు. రాత్రి 12 గంటల ప్రాంతంలో విశ్వనాథ్ భౌతికకాయాన్ని అపోలో ఆస్పత్రి నుంచి ఆయన స్వగృహానికి తరలించారు. గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామంలో జన్మించిన విశ్వనాథ్ ఫిలింనగర్లో నివాసం ఉంటున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయనకు విశ్వవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన శంకరాభరణం సినిమా విడుదల రోజైన ఫిబ్రవరి 2వ తేదీనే కె.విశ్వనాథ్ కన్ను మూయడం విశేషం. 1930 ఫిబ్రవరి 19న జని్మంచిన విశ్వనాథ్..51 సినిమాలకు దర్శకత్వం వహించారు. మొదటిసారిగా 1965లో ఆత్మ గౌరవం సినిమాకు దర్శకత్వం వహించారు. చివరిసారిగా శుభప్రదం సినిమాకు దర్శకత్వం వహించారు. 1992లో పద్మశ్రీ, 2016లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఆయన మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. వాహినీ పిక్చర్స్ జీఎంగా మొదలుపెట్టి.. కాశీనాథుని సుబ్రమణ్యం, సరస్వతమ్మ దంపతులకు కె. విశ్వనాథ్ జన్మించారు. ప్రాథమిక విద్య గుంటూరు జిల్లాలోనే సాగినా ఆ తర్వాత ఆయన కుటుంబం విజయవాడకు మకాం మార్చింది. అయితే కాలేజీ చదువు మాత్రం గుంటూరులో సాగింది. బీఎన్‌రెడ్డి, నాగిరెడ్డి ఆరంభించిన వాహినీ పిక్చర్స్‌లో విజయవాడ బ్రాంచ్‌కి జనరల్ మేనేజర్‌గా పనిచేశారు. బీఎస్సీ పూర్తి చేశాక చెన్నై వాహినీ స్టూడియోలో సౌండ్ రికార్డిస్ట్‌గా కెరీర్ ఆరంభించారు. అన్నపూర్ణ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ‘తోడికోడళ్ళు’ సినిమాకు పనిచేస్తున్నపుడు ప్రముఖ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పరిచయం ఏర్పడింది. ఆయన వద్ద సహాయకుడిగా చేరారు. ఆదుర్తి దర్శకత్వంలో ‘ఇద్దరు మిత్రులు’, ‘డాక్టర్ చక్రవర్తి’ వంటి చిత్రాలకు సహాయ దర్శకుడిగా చేశారు. కె. విశ్వనాథ్ ప్రతిభను గుర్తించిన అక్కినేని నాగేశ్వరరావు తన సంస్థ నిర్మించిన ‘ఆత్మ గౌరవం’ (1965) సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ‘సిరిసిరిమువ్వ’ సినిమాతో కె. విశ్వనాథ్ ప్రతిభ వెలుగులోకి వచ్చింది. అప్పటినుంచి చివరి సినిమా ‘శుభప్రదం’ (2016) వరకూ విశ్వనాథ్ 51 చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇందులో 41 తెలుగు కాగా 10 హిందీ. సాగరసంగమం, శ్రుతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం, స్వయంకృషి తదితర అద్భుత చిత్రాలను తెరకెక్కించారు. విశ్వనాథ్ చిత్రాలన్నీ సంగీత ప్రాధాన్యంగా సాగడం ఓ విశేషం. నటుడిగానూ వెండితెరపై తనదైన ముద్రవేశారు. శుభసంకల్పం, నరసింహనాయుడు, కలిసుందాం రా, ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, సీతారామయ్యగారి మనవరాలు, ఠాగూర్, అతడు, మిస్టర్ పర్ఫెక్ట్ తదితర చిత్రాల్లో నటించారు. దర్శకుడిగా ఏ సినిమా తీసినా అది ఆరంభించి, ముగించేవరకూ షూటింగ్‌కి ఖాకీ బట్టలు ధరించడం విశ్వనాథ్ అలవాటు. తనను తాను కారి్మకుడిలా భావిస్తానని, అందుకే ఖాకీ తొడుక్కుంటానని పలు సందర్భాల్లో విశ్వనాథ్ పేర్కొన్నారు. తాను దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు చిత్రాలను హిందీలో రీమేక్ చేశారు. వాటిలో సరగమ్ (సిరిసిరిమువ్వ), సుర్‌సంగమ్ (శంకరాభరణం), కామ్‌చోర్ (శుభోదయం), శుభ్కామ్నా (శుభలేఖ), సమ్‌జోగ్ (జీవనజ్యోతి) ఉన్నాయి. ఐదు జాతీయ అవార్డులు విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శంకరాభరణం’ సినిమాకు జాతీయ పురస్కారంతో పాటు ‘సప్తపది’కి జాతీయ సమగ్రతా పురస్కారం లభించింది. ‘స్వాతిముత్యం’ సినిమా 1986లో ఆస్కార్ అవార్డుల నామినేషన్లకు అధికారిక ప్రవేశం పొందింది. మొత్తం ఐదు జాతీయ అవార్డులు లభించాయి. భారతీయ సినిమాకు చేసిన సేవకు గాను విశ్వనాథ్‌కు భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారమిచ్చి గౌరవించింది. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారం అందుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కేతో పాటు ఐదు నంది అవార్డులు, 10 ఫిలింఫేర్ అవార్డులు, ‘సాక్షి’ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా అందుకున్నారు. -
యశోద మూవీ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తో " స్పెషల్ చిట్ చాట్ "
-
‘మనసానమః’ దర్శకుడికి సీఎం జగన్ ప్రశంసలు
సాక్షి, అమరావతి: ‘మనసానమః’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి, ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక అవార్డులు సాధించిన యువ దర్శకుడు దీపక్ రెడ్డిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ఈ లఘు చిత్రం దాదాపు 900 పైగా పురస్కారాలు అందుకోవడంతో పాటు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం తనను కలిసిన దీపక్ రెడ్డికి సీఎం వైఎస్ జగన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇకపై మరిన్ని మంచి చిత్రాలు రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌కు గజ్జల శిల్ప నిర్మాణ బాధ్యతలు వహించారు. చదవండి: చెరువులపైనే ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం వైఎస్ జగన్ -
సినీ అవకాశాల పేరుతో యువతులకు వల..దర్శకుడి అరెస్ట్
సాక్షి, చెన్నై: సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. సేలంలో సినిమా కంపెనీ కార్యాలయాన్ని నిర్వహిస్తున్న దర్శకుడు వేల్ క్షత్రియన్. అవకాశాలు పేరుతో యువతులను అశ్లీల ఫొటోలను, వీడియోలను చిత్రీకరించి వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అతనికి సహకరించిన జయజ్యోతి అనే సహాయకురాలి బండారాన్ని అదే కార్యాలయంలో పని చేసే ఇరుప్పాళ్యంకు చెందిన జననీ (పేరు మార్పు) బయటపెట్టింది. వారి అరాచకాలు గురించి సూరమంగళం మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. అందులో తాను పని చేసే సినిమా కంపెనీలో వీరప్పన్ పాలమూరుకు చెందిన దర్శకుడు వేల్ క్షత్రియన్. అతని సహాయకురాలు రాజపాళ్యంకు చెందిన జయజ్యోతి సినిమా అవకాశాల పేరుతో అనేక మంది యువతులను సెల్ఫోన్లో అశ్లీల చిత్రాలను చిత్రీకరించి వాటితో బెదిరించి వారి జీవితాలను పాడు చేస్తున్నారని పేర్కొంది. కేసు నమోదు చేసిన ఇన్స్పెక్టర్ సుబ్బులక్ష్మి నేతృత్వంలో పోలీసులు విచారణ జరిపారు. దీంతో దర్శకుడు వేల్ క్షత్రియన్ గుట్టురట్టు అయ్యింది. అతని కార్యాలయంలో తనిఖీలు చేసి 30కి పైగా హార్డ్ డిస్క్‌లు, ల్యాప్‌ట్యాప్, పెన్‌డ్రైవ్‌లు, కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ హార్డ్‌డిస్క్‌లో 300 మందికి పైగా అమ్మాయిల అశ్లీల వీడియో దృశ్యాలు ఉండటంతో పోలీసులే అవాక్కయ్యారు. దీంతో ఆ ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: వైరల్‌గా మోదీ, బీజేపీపై సమంత కామెంట్స్, మండిపడుతున్న నెటిజన్లు! -
‘జబర్దస్త్’ స్క్రిప్ట్ రైటర్‌గా గుర్తింపు.. విశాఖ జిల్లా కుర్రాడు.. ఊరమాస్
కొమ్మాది (భీమిలి)విశాఖపట్నం: ఒకప్పుడు హాస్యనటుడు షకలక శంకర్‌కు స్క్రిప్ట్ రైటర్‌గా పనిచేసిన అనుభవంతో సినిమాలవైపు అడుగులు వేస్తున్నాడు విశాఖ జిల్లా శ్రీహరిపురానికి చెందిన పోతిన రమేష్ జబర్దస్త్‌లో స్క్రిప్ట్ రైటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ అనుభవంతో మొట్టమొదటిసారిగా హర్రర్ లవ్ స్టోరీ అటవీ సినిమాతో తన సినీ ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం పలువురు ప్రముఖ కథానాయకులతో ఊరమాస్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. చదవండి: నడిరోడ్డుపై హీరోయిన్ను జుట్టుపట్టుకుని కొట్టిన హీరో భార్య అంతే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే తానే వ్యవహరిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో సినీ పరిశ్రమవైపు అడుగులు వేస్తున్నానని, ఊరమాస్ సినిమా 90 శాతం విశాఖలో చిత్రీకరించానని చెప్పారు. విశాఖలో షూటింగ్‌కు అనుకూలమైన లొకేషన్లతో పాటు, అనేక మంది మంచి నటులు ఉన్నారని, సినీ పరిశ్రమ విశాఖ తరలి వస్తే ఎందరో నటులకు, టెక్నీషియన్స్‌కు మరింత ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. రియల్ఎస్టేట్ మాఫియా, ప్రేమ అనే అంశాలతో తెరకెక్కిస్తున్న ఊరమాస్ సినిమా 5 భాషల్లో నిర్మిస్తున్నామని, ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయినట్లు ఆయన తెలిపారు. -
‘మెగా ఫోన్’ పట్టుకున్న టెక్నీషియన్లు.. హిట్ పడేనా?
Technicians Turned Into Directors: విలన్ ముఖం మీద హీరో పంచ్‌లు ఇస్తుంటే.. ఫ్యాన్స్ విజిల్స్ వేస్తారు. హీరో హీరోయిన్ డ్యూయట్ పాడుకుంటే... ఫ్యాన్స్ స్టెప్స్ వేస్తారు. విదేశీ అందాలు తెర మీద కనబడితే అదో ఐ ఫీస్ట్. ఎక్కువ అయిందనుకున్నప్పుడు సీన్ పూర్తయితే అదో రిలీఫ్. ప్రేక్షకులకు ఈ అనుభూతులన్నీ కలగాలంటే తెర వెనక ఫైట్ మాస్టర్స్, డ్యాన్స్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్స్, ఎడిటర్స్ ఎంతో శ్రమించాలి. ఈ క్రమంలో ఈ టెక్నీషియన్లకు సినిమా డైరెక్షన్ మీద ఓ అవగాహన వచ్చేస్తుంది. అందుకే కొందరు డైరెక్టర్లుగా మారతారు. ప్రస్తుతం ‘మెగా ఫోన్’ పట్టుకుని దర్శకులుగా స్టార్ట్.. కెమెరా, యాక్షన్.. కట్ చెబుతున్న టెక్నీషియన్ల గురించి తెలుసుకుందాం. ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా జాతీయ అవార్డుతో పాటు తమిళనాడు, కేరళ ప్రభుత్వ అవార్డులూ గెలుచుకున్నారు బృందా మాస్టర్. ఆమె దర్శకురాలిగా మారారు. దుల్కర్ సల్మాన్, కాజల్ అగర్వాల్, అదితీ రావు హైదరీ హీరో హీరోయిన్లుగా బృందా దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హే సినామిక’. వచ్చే నెలలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక యశ్ ‘కేజీఎఫ్’ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగా మెప్పించాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాలోని స్టంట్స్‌ని అన్బు, అరివు ద్వయం సమకూర్చారు. ఈ చిత్రానికి బెస్ట్ స్టంట్ మాస్టర్స్‌గా జాతీయ అవార్డు కూడా దక్కించుకున్నారు. ఫైట్‌మాస్టర్స్ రామ్–లక్ష్మణ్‌లానే ఈ ఇద్దరు కూడా కవలలే. ఇప్పుడు ఈ ఇద్దరి దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ‘దుర్గ’ అనే చిత్రం రూపొందనుంది. ఇక కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా మారి లారెన్స్ విజయాలు చవి చూస్తున్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. లారెన్స్‌తో అన్బు, అరివు మరోవైపు ‘సీతారాముడు’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’, ‘బుర్రకథ’ ‘పీఎస్వీ గరుడవేగ’ వంటి సినిమాలకు వర్క్ చేసిన కెమెరామేన్ అంజి కూడా రీసెంట్గా దర్శకుడిగా మారారు. శ్రీరామ్, అవికా గౌర్ హీరో హీరోయిన్లుగా నటించనున్న ‘టెన్త్ క్లాస్ డైరీస్’ సినిమాకు అంజి దర్శకుడు. పి. అచ్యుత్ రామారావు, రవితేజ మన్యం ఈ సినిమాను నిర్మించనున్నారు. సునీల్, ధన్‌రాజ్ హీరోలుగా రిలీజ్‌కు రెడీ అయిన సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ‘బుజ్జీ.. ఇలారా’కి కూడా అంజియే దర్శకుడు. నాగిరెడ్డి, శ్రీనివాసరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇక 2016లో వచ్చిన ‘క్షణం’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు గ్యారీ. 2018లో వచ్చిన ‘గూఢచారి’తో గ్యారీ ఎడిటర్‌గా మారారు. ఆ తర్వాత ‘ఎవరు’, ‘హిట్: ది ఫస్ట్ కేస్’ ఇటీవల ‘ఇచట వాహ నములు నిలుపరాదు’ .. ఇలా దాదాపు 20కి పైగా సినిమాలకు ఎడిటర్‌గా చేసిన ఆయన ఇప్పుడు దర్శకుడిగా మెగాఫోన్ పట్టారు. నిఖిల్ హీరోగా దేశభక్తి నేపథ్యంలో ఓ స్పై థ్రిల్లర్ మూవీని గ్యారీ డైరెక్ట్ చేయనున్నారు. ఈ చిత్రాన్ని రాజశేఖర రెడ్డి నిర్మించనున్నారు. మరికొందరు సాంకేతిక నిపుణులు కూడా తమలోని దర్శకత్వ ప్రతిభను వెండితెరపై ఆవిష్కరించడానికి రెడీ అవుతున్నారు. ఛాయాగ్రాహకుడిగా సంతోష్ శివన్‌కి ఎంత మంచి గుర్తింపు ఉందో తెలిసిందే. కెమెరామేన్‌గా నాలుగు జాతీయ అవార్డులు సాధించిన ఆయన డైరెక్టర్‌గాను (ది టెర్రరిస్టు, మల్లి, నవరస చిత్రాలకు) జాతీయ అవార్డులు సాధించారు. ఇప్పుడు సంతోష్ శివన్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ముంబైకర్’. విజయ్ సేతుపతి, విక్రాంత్ మెస్సీ ప్రధాన పాత్రధారులు. తమిళ హిట్ మూవీ ‘మానగరం’కు హిందీ రీమేక్‌గా ‘ముంబైకర్’ రూపొందుతోందని టాక్. ‘దిల్ చాహ్ తా హై’, ‘కోయీ మిల్ గయా’, ‘ఫనా’, ‘గజిని’ ఇలా ఎన్నో హిట్ సినిమాలకు కెమెరామ్యాన్‌గా చేసిన రవి కె. చంద్రన్ ప్రస్తుతం ‘తామర’ అనే ఇండో–ఫ్రెంచ్ మూవీకి దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో అగ్రనిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఇదిలా ఉంటే.. 1992 నుంచి కెమెరామేన్‌గా కొనసాగుతున్న రవి. కె. చంద్రన్ పాతికేళ్లకు తెలుగు సినిమా చేయడం విశేషం. 2018లో మహేశ్‌బాబు హీరోగా వచ్చిన ‘భరత్ అనే నేను’ ఛాయాగ్రాహకుడిగా రవి కె. చంద్రన్‌కు తెలుగులో తొలి సినిమా. అలాగే తెలుగు నిర్మాణ సంస్థలో దర్శకుడిగా ‘తామర’ రవికి తొలి చిత్రం అయినప్పటికీ తమిళంలో ‘యాన్’ (2014), మలయాళంలో ‘భ్రమమ్’ (2021) చిత్రాలకు దర్శకత్వం వహించారు. -
‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు.. చివరికి సాధించాడు!
అనగనగా ఒక పిల్లాడు ఉంటాడు. కుటుంబ పరిస్థితి బాగలేక బాలకార్మికుడిగా మారి ఎన్నో కష్టాలు పడతాడు. పొట్ట నింపుకోవడం కోసం, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం తిరగని పట్టణం లేదు. చేయని పనిలేదు. ఈ కష్టాల పిల్లాడికి సినిమా అంటే ఇష్టం. ‘సినిమా డైరెక్టర్ అవుతాను’ అనే అతని ఆశయం ఎన్నో అవహేళనలకు గురైంది. కాని అతడు మాత్రం ‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు. చివరికి సాధించాడు. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు....ఇది సినిమా కథ కాదు. ‘కూళంగళ్’ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్న మదురై కుర్రాడు పీయస్ వినోద్‌రాజ్ నిజజీవితకథ.... వినోద్‌రాజ్ లో బడ్జెట్ డెబ్యూ మూవీ ‘కూళంగళ్’ (గులకరాళ్లు) ఆస్కార్–ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. కథ ఐడియాలు ఎలా వస్తాయి? విదేశాల్లో ఫైస్టార్ హోటల్లో కూర్చుంటే రావచ్చు. విదేశీ చిత్రాలు చూస్తే రావచ్చు. కొందరికి మాత్రం విదేశాలు అక్కర్లేదు. విదేశీ చిత్రాలు అక్కర్లేదు. ఏ జీవితం నుంచి అయితే తాము నడిచొచ్చారో ఆ జీవితమే వారికి నిజమైన కథలు ఇస్తుంది. వినోద్‌రాజ్... ఈ కోవకు చెందిన డైరెక్టర్. తాను పుట్టి పెరిగిన జీవితాన్నే కథగా మలుచుకున్నాడు వినోద్. అదే ‘కూళంగళ్’ సినిమా! వినోద్‌రాజ్ తండ్రి తాగుబోతు. తాగి ఎప్పుడు ఏ రోడ్డు మీద పడి ఉంటాడో తెలియదు. నాన్న చనిపోయిన తరువాత కష్టాలు పెరిగాయి. కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం పూలు అమ్మడం నుంచి టెక్ట్స్‌టైల్ కంపెనీలో పనిచేయడం వరకు ఎంతో కష్టపడ్డాడు. టెక్ట్స్ టైల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల కష్టాలతో అర్ధాంతరంగా జీవితాన్ని చాలేసిన ఎంతోమందిని అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. ఈ కన్నీటి కథలు, తన కుటుంబ కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కడుపులో దుఃఖసముద్రాలు ఘోషించేవి. ఆ అనంతమైన దుఃఖం బయటికి వెళ్లే మార్గం, మాధ్యమంగా అతడికి సినిమా కనిపించింది. (చదవండి: బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!) సినిమా డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి? చెప్పుకోదగ్గ చదువు కావాలి. ఈ ఆలోచనలతోనే ‘మళ్లీ చదువుకుందాం’ అని నిర్ణయించుకున్నాడు. కానీ ‘ఈ వయసులో చదువేమిటి!’ అనే వెక్కిరింపులు క్యూ కట్టాయి. ఇక లాభం లేదనుకొని చెన్నై వెళ్లి ఒక డీవిడి స్టోర్‌లో పనికి కుదిరాడు. అక్కడ ప్రతి సినిమా తనకొక పాఠం నేర్పింది. ఆ ధైర్యంతోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలతీరానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు డైరెక్టర్ అయ్యాడు. ‘కూళంగళ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరికి తప్ప ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాని ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొటెర్డామ్ టైగర్ అవార్డ్(న్యూజిలాండ్) గెలుచుకుంది. ‘సింపుల్ అండ్ హంబుల్’ అని ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ పరిసరాల్లోకి వెళ్లింది. (చదవండి: ఐటెం సాంగ్ లిరిక్స్‌పై తొలిసారిగా స్పందించిన బన్నీ) ‘ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. పెద్దగా చదువుకోలేదు. జీవితం అనే బడి ఎన్నో పాఠాలు నేర్పింది’ అంటున్న వినోద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి? సింపుల్ అండ్ హంబుల్ ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలా! -
‘పుష్పక విమానం’ డైరెక్టర్ దామోదర గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
సాక్షి, నరసన్నపేట(శ్రీకాకుళం): తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... అతను మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా శుక్రవారం విడుదల కాబోతోంది. ఈ చిత్ర దర్శకుడు సృజన్(దామోదర) శ్రీకాకుళం వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి. లఘు చిత్రాల నుంచి.. సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు కూడా. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నాడు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. గోవర్దనరావు ప్రోత్సాహంతోనే.. ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు. -
టాలీవుడ్ దర్శకుడు, నటుడు గిరిధర్ కన్నుమూత
టాలీవుడ్దర్శకుడు,నటుడు ఇరుగు గిరిధర్(64)కన్నుమూశారు. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గిరిధర్ అప్పటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఆదివారం తిరుపతిలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. చిత్తూరు జిల్లా పాకాల మండలం ఇరంగారిపల్లెలో 1957 మే 21న ఆయన జన్మించాడు. 1982లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. టాలీవుడ్ సీనియర్ దర్శకులు కోదండరామిరెడ్డి, గుణశేఖర్, ఈవీవీ సత్యనారాయణ వంటివారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా గిరిధర్ పనిచేశారు. గుడుంబా శంకర్, అన్నవరం, వన్, సుప్రీమ్, వరుడు వంటి సినిమాలకు కోడైరెక్టర్‌గానూ పనిచేశారు. చంద్రమోహన్, ఆమని, ఇంద్రజ, వినోద్ కుమార్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన శుభముహూర్తం సినిమాకు దర్శకత్వం వహించి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు. అలాగే, ఎక్స్‌ప్రెస్ రాజా, 100 పర్సంట్ లవ్, సర్దార్ గబ్బర్ సింగ్, శ్రీమంతుడు తదితర 20 సినిమాల్లో నటించారు. గిరిధర్ మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. -
వెండితెరపై... విజువల్ పొయట్
పదచిత్రాలతో దృశ్యాన్ని బొమ్మకట్టించే ఓ కవి... వెండితెరపై దృశ్యాలను కవిత్వీకరిస్తే ఏమవుతుంది? కవికి ఉండే సహజమైన సున్నితత్వంతో సమాజాన్నీ, మనుషుల్నీ తెరపై చూపెడితే ఆ కళాసృజనలు ఎలా ఉంటాయి? తెలియాలంటే... భారతీయ సినిమా జెండాను అంతర్జాతీయంగా ఎగరేసిన ప్రముఖ బెంగాలీ చిత్ర దర్శకుడు బుద్ధదేవ్ దాస్‌గుప్తా సినిమాలు చూడాలి. జూన్ 10న తన 77వ ఏట బుద్ధదేవ్ దాస్‌గుప్తా కన్నుమూశారనగానే, ఒక్క బెంగాలీలే కాదు... భారతీయ సినీ ప్రియులందరూ విషాదంలో మునిగింది అందుకే! వెండితెరపై ఆయనది విజువల్ పొయిట్రీ. దర్శకుడి కన్నా ముందు పేరున్న కవి అయిన బుద్ధదేవ్ ఏకంగా తొమ్మిది కవితా సంపుటాలు, 4 నవలలు రాయడం విశేషం. నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో దర్శకుడిగా ఆయన తీసినవి అతికొద్ది ఫీచర్ ఫిల్మ్‌లే. అన్నీ ఆణిముత్యాలే. అవార్డు విన్నర్లే! దిగ్దర్శక త్రయం సత్యజిత్ రే, మృణాల్ సేన్, ఋత్విక్ ఘటక్ తరువాత బెంగాలీ చలనచిత్ర చయనికను, ఆ మాటకొస్తే భారతీయ సినిమాను అంతర్జాతీయంగా దీప్తిమంతం చేసిన దర్శకతార బుద్ధదేవ్. అయితే, ఆయన మాత్రం ఆ దర్శక త్రిమూర్తులతో తనను పోల్చవద్దనేవారు. సమకాలికులైన జి. అరవిందన్, అదూర్ గోపాలకృష్ణన్, శ్యామ్ బెనెగల్ల తరానికి చెందినవాడినని వినయంగా చెప్పుకొనేవారు. చిన్నతనంలో రవీంద్రనాథ్ టాగూర్ ప్రభావంతో కవిగా కలం పట్టిన బుద్ధదేవ్‌కు కోల్‌కతా అంటే ప్రాణం. బెంగాల్‌లోని పురూలియా ప్రాంతంలో 1944లో జన్మించిన బుద్ధదేవ్ కోల్‌కతాలోనే చదువుకున్నారు. ఆ నగరాన్ని ఆయన తెరపై చూపించిన తీరు గురించి ఇవాళ్టికీ సినీజనం చెప్పుకుంటారంటే, దాని వెనుక ఉన్న ఆయన ప్రేమే అందుకు కారణం. కోల్‌కతాలో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఆయన మొదలైంది ఎకనామిక్స్ లెక్చరర్‌గా! కానీ, చెబుతున్న ఆర్థిక సిద్ధాంతానికీ, చూస్తున్న సామాజిక–రాజకీయ వాస్తవికతకూ మధ్య ఉన్న తేడాతో ఆయన మబ్బులు విడిపోయాయి. లెక్కల కన్నా కళల మీద మక్కువే జయించింది. అలా బెంగాల్‌లోని సాంస్కృతిక, కళా జీవితంతో పాటు నక్సల్బరీ ఉద్యమం ఆయనను ప్రభావితం చేసింది. బుద్ధదేవ్ సెల్యులాయిడ్ బాంధవ్యం 1960ల చివరలో డాక్యుమెంటరీలతో మొదలైంది. ఆ తరువాత పదేళ్ళకు ఫీచర్ ఫిల్మ్‌ల స్థాయికి ఎదిగింది. దేశంలో 21 నెలల అంతర్గత ఎమర్జెన్సీ ఎత్తేసిన తరువాత బెంగాల్లో తొలిసారిగా వామపక్ష ప్రభుత్వం వచ్చింది. రాజకీయ కార్యకర్తల్ని బేషరతుగా వదిలేయమంటున్న రోజులు. అంతటా రాజకీయ, సాంస్కృతిక సమరోత్సాహం నెలకొన్న సమయం. సరిగ్గా అప్పుడు ముప్పయ్యో పడిలోని బుద్ధదేవ్ తన తొలి ఫీచర్ ఫిల్మ్ ‘దూరత్వ’ (1978)తో జనం ముందుకు వచ్చారు. సాక్షాత్తూ సత్యజిత్ రే కవితాత్మకంగా ఉందంటూ ఆ చిత్రాన్ని ప్రశంసించారు. ఆ తొలి చిత్రంతోనే నేషనల్ అవార్డు సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించిన బుద్ధదేవ్ ఆ వెంటనే ‘నీమ్ అన్నపూర్ణ’తో అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించారు. కార్లోవీ వారీ, లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఆ చిత్రానికి అవార్డులు రావడం అందుకు దోహదమైంది. ఆయన ఇక వెనుతిరిగి చూసింది లేదు. బుద్ధదేవ్ సినీ ప్రయాణమంతా సామాన్యులపట్ల అక్కర, కవితా దృష్టి – సంగమమే. అందుకే, ఆయన ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మనసూ గెలిచారు. వెండితెరను కవితాత్మకంగా తీర్చిదిద్దిన బుద్ధదేవ్ దర్శకత్వంలో ‘బాగ్ బహదూర్’, ‘చరాచర్’, ‘లాల్ దర్జా’, ‘కాల్‌పురుష్’, ‘మోండో మేయేర్ ఉపాఖ్యాన్’, మిథున్ చక్రవర్తి నటించిన ‘తహదేర్ కథ’ (1992) ఎంతో పేరొం దాయి. రియలిజమ్ను దాటి, మ్యాజికల్ రియలిజమ్, సర్రియలిజమ్ వైపు ప్రేక్షకులను ఆయన తన సినిమాతో తీసుకువెళ్ళారు. మ్యాజికల్ రియలిజమ్నూ, కవితాత్మనూ కలగలిపి, తెరపై చూపారు. నిజానికి, ‘సినిమాలో కథ కన్నా కీలకమైనది మనం కళ్ళకు కట్టించే బొమ్మ’ అని ఆయన అభిప్రాయపడేవారు. చివరి దాకా ఆ పద్ధతే అనుసరించారు. ఫీచర్ ఫిల్మ్స్ చేస్తూనే వాటి రూపకల్పనకు కావాల్సిన నిధులు సమకూర్చుకోవడం కోసం అవార్డ్ విన్నింగ్ డాక్యుమెంటరీలు తీయడమూ కొనసాగించారు. సంగీతం సినిమాల్లో అంతర్భాగమని నమ్మిన బుద్ధదేవ్ భారతీయ, పాశ్చాత్య శైలుల్ని మేళవిస్తూ, తరచూ తానే స్వయంగా సంగీతం సమకూర్చుకొనడం మరో విశేషం. రవీంద్రనాథ్ టాగూర్ పెయింటింగ్స్ వల్ల చిత్రకళ మీద ప్రేమ పెంచుకున్న బుద్ధదేవ్‌కు జానపద కళలన్నా, కళారూపాలన్నా అమితమైన ఇష్టం. అందుకు తగ్గట్టే ఆయన తన ‘బాగ్ బహదూర్’ (1989) చిత్రాన్ని మన తెలుగునాట ప్రసిద్ధమైన జానపద కళారూపం పులివేషాల నేపథ్యంలో తీర్చిదిద్దడం గమనార్హం. తెలుగమ్మాయి అర్చన నటించిన ఆ సినిమా ఆ ఏటి జాతీయ ఉత్తమ చిత్రం. చిన్నప్పుడు నేతాజీని ఆరాధించి, యౌవనంలో నక్సలిజమ్ వైపు మొగ్గిన ఈ బెంగాలీబాబు తరువాత ఆ ప్రభావం నుంచి బయటపడ్డారు. ‘దూరత్వ’, ‘గృహజుద్ధ’, ‘అంధీగలీ’ (1984) చిత్రాల్లో ఆనాటి సంక్షుభిత సమయాలపై తనదైన సినీ వ్యాఖ్యానం చేశారు. ఆయన చిత్రాల్లో 5 నేషనల్ ఫిల్మ్ అవార్డులు సాధిస్తే, ఉత్తమ దర్శకుడిగా ఆయనకు మరో 2 సార్లు (‘ఉత్తర’, ‘స్వప్నేర్ దిన్’) జాతీయ అవార్డులు దక్కాయి. సినిమాలు, డాక్యుమెంటరీలు అన్నీ లెక్క తీస్తే బుద్ధదేవ్ ఖాతాలో ఏకంగా 32 నేషనల్ అవార్డులు చేరడం ఓ రికార్డు ఫీట్! సత్యజిత్ రే మరణానంతరం భారతీయ సినిమాను మళ్ళీ అంతర్జాతీయ వేదికపై నిలబెట్టిన ఘనత కూడా బుద్ధదేవ్దే!! టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లోని ‘మాస్టర్స్ ఆఫ్ వరల్డ్ సినిమా’ విభాగంలో ఏకంగా 8 సార్లు చోటు దక్కించుకున్నారు. ఆయన సృజనాత్మక కృషికి గుర్తింపుగా, 2008లో స్పెయిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో జీవన సాఫల్య పురస్కారం దక్కింది. యౌవనంలో బుద్ధదేవ్‌ను మలిచి, సినిమా వైపు మళ్ళించింది కలకత్తా ఫిల్మ్ సొసైటీ. అక్కడ చూసిన చార్లీ చాప్లిన్, అకిరా కురసావా, విటోరియో డెసికా, రొసెల్లినీ లాంటి ప్రసిద్ధుల చిత్రాలు. అంత బలమైన ముద్ర వేసిన ఫిల్మ్ సొసైటీ ఉద్యమంతో బుద్ధదేవ్ చివరి దాకా సన్నిహితంగా మెలిగారు. అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించినా, చివరి వరకు ఫిల్మ్ సొసైటీ ఉద్యమంలో సిన్సియర్ యాక్టివిస్ట్‌గానే పనిచేశారు. దేశంలోని ఏ మారుమూల, ఏ ఫిల్మ్ సొసైటీ కార్యక్రమానికి పిలిచినా కాదనకుండా, ఆయన స్వయంగా వెళ్ళేవారు. బుద్ధదేవ్ సతీమణి సోహిణీ దాస్‌గుప్తా కూడా దర్శకురాలే. ఇద్దరమ్మాయిలకు జన్మనిచ్చిన వారిది అన్యోన్య దాంపత్యం. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి, కిడ్నీ సమస్యతో కన్నుమూసే వరకు బుద్ధదేవ్ కవిత్వాన్నీ, సినిమానూ శ్వాసిస్తూ వచ్చారు. ఒక్క మాటలో– బుద్ధదేవ్ ఓ అద్భుతమైన దర్శకుడు. అపూర్వమైన కవి. అమోఘమైన టీచర్. అన్నిటికీ మించి మనసున్న మంచి మనిషి. ఆ వ్యక్తిత్వం పరిమళించిన ఆయన సృజనాత్మక కృషి ఎప్పటికీ వసివాడని జ్ఞాపకం. – రెంటాల జయదేవ -
ఈ సినిమాకు కథ–కర్మ–క్రియా ‘హిట్లర్’
మహా నియంత హిట్లర్‌పై ప్రపంచంలో ఎన్నో భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏమిటంటే ఒక సినిమాకు హిట్లర్ అనధికారికంగా అన్నీ తానై వ్యవహరించాడు. ఆ సినిమా పేరు ట్రయంప్ ఆఫ్ ది విల్ (మార్చి 28, 1935లో విడుదలైంది) ఈ నాజీ భావజాల చిత్రానికి లెని రిఫెన్స్టాల్ రచన, దర్శకత్వ బాధ్యతలు స్వీకరించినప్పటికీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హోదా(అనధికారికంగా)తో పాటు, ఫ్రేమ్ టు ఫ్రేమ్‌లో హిట్లర్ హస్తం ఉందట. ఈ సినిమా నటబృందంలో హిట్లర్ పేరు కూడా కనిపిస్తుంది. అదేంటి హిట్లర్ నటించాడా? అదేం కాదుగానీ గంభీరంగా ఉపన్యాసం ఇస్తున్న హిట్లర్ ఇందులో కనిపిస్తాడు. ‘హిట్లర్ ట్రయంప్ ఆఫ్ ది విల్ స్పీచ్’గా ఇది బాగా పాప్లర్ అయింది. 111 నిమిషాల నిడివిగల ఈ చిత్రం భావజాల ప్రచారచిత్రమే అయినప్పటికీ రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలో ఉపయోగించే మూవింగ్ కెమెరాలు, ఏరియల్ ఫొటోగ్రఫీ, లాంగ్–ఫోకస్ లెన్స్.. మొదలైన వాటిని ఈ చిత్రంలో ఉపయోగించారు. మరో విశేషం ఏమిటంటే ఈ సినిమా జర్మనీలోనే కాదు యూఎస్, ఫ్రాన్స్, స్వీడన్... మొదలైన దేశాల్లో అవార్డ్లు గెలుచుకుంది. l -
చార్లీ చాప్లిన్ తొలి సినిమాకు వందేళ్ళు!
చార్లీ చాప్లిన్‌ను సొంతం చేసుకోవడానికి ప్రాంతాలు, భాషతో పనిలేదు. ప్రపంచంలో ఏ మూలన ఉన్నవారైనా ఆయన ప్రపంచంలోకి వెళ్లి హాయిగా నవ్వుకోవచ్చు. చాప్లిన్ నటించి, దర్శకత్వం వహించిన ‘ది కిడ్’ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రసిద్ధ ఫ్రెంచ్ ఫిల్మ్ కంపెనీ ఎంకే2 ‘ది కిడ్’తో సహా ప్రపంచ ప్రసిద్ధి పొందిన చాప్లిన్ చిత్రాల రిస్టోరేషన్ ప్రక్రియ చేపట్టింది. ‘ది గోల్డ్ రష్’ ‘సిటీ లైట్స్’ ‘ది సర్కస్’ ‘మోడ్రన్ టైమ్స్’ ‘ది గ్రేట్ డిక్టేటర్’ చిత్రాలను 4కె రిస్టోరేషన్ చేస్తున్నారు. ‘చార్లి చాప్లిన్ స్టార్డమ్, అద్భుత నటనకు అద్దం పట్టే చిత్రం ది కిడ్. ఈతరం ప్రేక్షకులు కూడా ఆనాటి భావాలు, భావోద్వేగాలతో మమేకం అవుతారు’ అంటున్నాడు ఎంకే 2 సీయివో కర్మిడ్జ్. ఆధునీకరించిన చాప్లిన్ చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈతరం ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పోస్టర్లు. ట్రైలర్లు రెడీ చేస్తున్నారు. -
మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తారు!
‘‘నేను ఎప్పుడూ మా ఇంటి గడప నుంచే కథ వెతుకుతాను. మా ఇంటి లోపల ఏదైనా కథ ఉందా? మా వీధి, మా ఊరు, మా స్నేహితులు.. ఇలా ముందు నా దగ్గర కథే వెతుక్కుంటాను. కల్మషం లేని భావోద్వేగాలతో కూడిన కథే మట్టి కథ. ‘ఉప్పెన’ అలాంటి సినిమాయే’’ అన్నారు బుచ్చిబాబు. వైష్ణవ్ తేజ్, కృతీ శెట్టి జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉప్పెన’. మైత్రీమూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు చెప్పిన విశేషాలు.. ► నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు సుకుమార్‌గారు నా లెక్కల మాస్టర్. సినిమాల్లోకి వెళ్లబోతున్నానని చాలా తక్కువమంది స్టూడెంట్స్‌తో ఆయన చెప్పుకునేవారు. వారిలో నేను ఒకడిని. సుకుమార్‌గారు ఇండస్ట్రీకి వచ్చి ‘ఆర్య’ సినిమా తీశారు. డైరెక్ట్‌గా సినిమా అంటే మా ఇంట్లో పంపించరని, నేను ఎమ్బీఏ చదువుకుంటూ సుకుమార్‌గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పలు సినిమాలు చేశాను. ► కొన్ని తమిళ సినిమాలు డిఫరెంట్‌గా ఉంటాయి. అలాంటి కథలను మన కంటెంట్‌తో కూడా చెప్పవచ్చు కదా అనిపిస్తుంటుంది. లక్కీగా ‘ఉప్పెన’ సినిమా అలాంటిదే. లవ్‌స్టోరీ బ్యాక్‌డ్రాప్‌కు కమర్షియల్ ఎలిమెంట్స్‌తో అల్లుకున్న ఫ్యామిలీ డ్రామా ‘ఉప్పెన’ సినిమా. కూతురిది ఉప్పెనంత ప్రేమ. తండ్రిది ఉప్పెనంత కోపం. ప్రేమకు హద్దులు లేవని చెప్పడమే ఈ సినిమా కథ. ► చిరంజీవిగారికి ఈ కథ చెప్పినప్పుడు ‘హిట్ ఫార్ములా. నువ్వు తీయడాన్ని బట్టి ఉంటుంది. వైషూ (వైష్ణవ్‌తేజ్) నువ్వు చేస్తావా? లేక నన్ను చేయమంటావా?’ అని వైష్ణవ్ తేజ్‌తో అన్నారు. అంటే.. ఆయన సినిమా చేస్తారని కాదు. అదొక కాంప్లిమెంట్. సినిమా కథ బాగుందని చెప్పడం చిరంజీవిగారి అభిప్రాయం. ► క్యాస్ట్ గురించిన అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కానీ పరిధి మేరకు ఉన్నాయి. సెన్సార్ వారు ఒక్క కట్ కూడా చెప్పలేదు. దాదాపు 70మందికి పైగా ఈ సినిమా చూశారు. సినిమా బాగోలేదని ఎవరూ చెప్పలేదు. ‘ఇప్పుడు నా కొడుకు చిన్నవాడు. భవిష్యత్‌లో డైరెక్టర్ అవుతాడో లేదో తెలీదు. నా పెద్దకొడుకు (బుచ్చిని ఉద్దేశించి) సినిమా తీశాడనుకుంటాను’ అని సుకుమార్ అన్నారు. సుకుమార్‌గారితో నాది 20 ఏళ్ల పరిచయం. మా ఊళ్లో నన్ను సుకుమార్ అని పిలుస్తుంటారు. ఒక డైరెక్టర్‌గా కన్నా కూడా సుకుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా నాకు పేరువస్తే హ్యాపీ ఫీల్ అవుతాను. ► ‘నాన్నకు ప్రేమతో...’ సినిమా షూటింగ్ స్పెయి¯Œ లో జరుగుతున్నప్పుడు ఎన్టీఆర్‌కు కథ చెప్పాను. అది ‘ఉప్పెన’ కథ కాదు. మైత్రీమూవీ మేకర్స్ సంస్థలో మరో సినిమా చేయబోతున్నాను. -
ప్రముఖ దర్శకుడు కన్నుమూత
చెన్నై: ప్రముఖ కన్నడ దర్శకుడు విజయ్ రెడ్డి(84) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. వయసు సంబంధిత ఆరోగ్య సమస్యలతో చెన్నైలోని ఆయన నివాసంలో మృతిచెందినట్లు ఆయన కుమారుడు త్రిపాన్ రెడ్డి శనివారం ప్రకటించాడు. కన్నడలో దాదాపు 40కి పైగా చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ్ రెడ్డి మరణవార్త కన్నడ పరిశ్రమకు కలచివేస్తోందంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి తాడేపల్లిగూడెంలో జన్మించిన ఆయన 1953లో కన్నడ చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టారు. (చదవండి: విజయ్ సేతుపతికి జంటగా స్వీటీ) దర్శకుడు బి విఠలచార్య చిత్రం మానే తంబిండా హెన్నూకు అసిస్టెంట్ ఎడిటర్‌గా పని చేసిన ఆయన ఆ తర్వాత కన్నడ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆ తర్వాత ఆయన తీసిన ‘గాంధడ గుడి’, ‘నా నిన్న బిదాలారే’, ‘రంగమహాల్ రహస్య’, ‘శ్రీనివాస కళ్యాణ’, ‘సనాడి అప్పన్న’, ‘కర్ణాటక సుపుత్ర’ సినిమాలకు మంచి గుర్తింపు వచ్చింది. చివరిగా ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్ధన్ 1996లో నటించిన కర్ణాటక సుపత్ర చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ సినిమా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుని సూపర్ హిట్‌గా నిలిచింది. (చదవండి: అందుకే ఇంటర్వ్యూలు ఇవ్వను: నయన్) -
దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్నుమూత
ప్రముఖ దర్శకుడు ఎన్బీ చక్రవర్తి కన్ను మూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శోభన్‌బాబుతో ‘సంపూర్ణ ప్రేమాయణం’, నందమూరి బాలకృష్ణతో ‘కత్తుల కొండయ్య’ చిత్రాలను తెరకెక్కించారు చక్రవర్తి. ఇంకా ‘నిప్పులాంటి మనిషి’, ‘కాష్మోరా’ వంటి చిత్రాలకూ దర్శకత్వం వహించారాయన. 1986లో వచ్చిన ‘కాష్మోరా’ చిత్రం మంచి విజయం సాధించింది. ‘‘చక్రవర్తిగారు చాలా సినిమాలకు కో డైరెక్టర్‌గా చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు కుమార్తెను ఆయన పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు. మూసాపేటలోని తన నివాసంలో నిద్రలోనే హార్ట్ ఎటాక్‌తో చక్రవర్తిగారు మృతి చెందారు. శుక్రవారమే అంత్యక్రియలు పూర్తి చేశాం. జూనియర్స్‌కి కూడా ఎన్బీగారు ఎంతో సపోర్ట్‌గా ఉండేవారు. ఎవర్నీ హర్ట్ చేయకుండా మాట్లాడే మంచి గుణం ఆయనలో ఉంది. అలాంటి వ్యక్తి భౌతికంగా లేకపోవడం సినిమా పరిశ్రమకి తీరని లోటుగా భావిస్తున్నాం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అని తెలుగు చలన చిత్రదర్శకుల సంఘం అధ్యక్షుడు ఎన్. శంకర్ తెలిపారు. చక్రవర్తి మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.