అనగనగా ఒక పిల్లాడు ఉంటాడు. కుటుంబ పరిస్థితి బాగలేక బాలకార్మికుడిగా మారి ఎన్నో కష్టాలు పడతాడు. పొట్ట నింపుకోవడం కోసం, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం తిరగని పట్టణం లేదు. చేయని పనిలేదు. ఈ కష్టాల పిల్లాడికి సినిమా అంటే ఇష్టం.
‘సినిమా డైరెక్టర్ అవుతాను’ అనే అతని ఆశయం ఎన్నో అవహేళనలకు గురైంది. కాని అతడు మాత్రం ‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు. చివరికి సాధించాడు. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు....ఇది సినిమా కథ కాదు. ‘కూళంగళ్’ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్న మదురై కుర్రాడు పీయస్ వినోద్‌రాజ్ నిజజీవితకథ....
వినోద్‌రాజ్ లో బడ్జెట్ డెబ్యూ మూవీ ‘కూళంగళ్’ (గులకరాళ్లు) ఆస్కార్–ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది.
కథ ఐడియాలు ఎలా వస్తాయి?
విదేశాల్లో ఫైస్టార్ హోటల్లో కూర్చుంటే రావచ్చు. విదేశీ చిత్రాలు చూస్తే రావచ్చు. కొందరికి మాత్రం విదేశాలు అక్కర్లేదు. విదేశీ చిత్రాలు అక్కర్లేదు. ఏ జీవితం నుంచి అయితే తాము నడిచొచ్చారో ఆ జీవితమే వారికి నిజమైన కథలు ఇస్తుంది. వినోద్‌రాజ్... ఈ కోవకు చెందిన డైరెక్టర్. తాను పుట్టి పెరిగిన జీవితాన్నే కథగా మలుచుకున్నాడు వినోద్. అదే ‘కూళంగళ్’ సినిమా!
వినోద్‌రాజ్ తండ్రి తాగుబోతు. తాగి ఎప్పుడు ఏ రోడ్డు మీద పడి ఉంటాడో తెలియదు. నాన్న చనిపోయిన తరువాత కష్టాలు పెరిగాయి. కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం పూలు అమ్మడం నుంచి టెక్ట్స్‌టైల్ కంపెనీలో పనిచేయడం వరకు ఎంతో కష్టపడ్డాడు. టెక్ట్స్ టైల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల కష్టాలతో అర్ధాంతరంగా జీవితాన్ని చాలేసిన ఎంతోమందిని అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. ఈ కన్నీటి కథలు, తన కుటుంబ కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కడుపులో దుఃఖసముద్రాలు ఘోషించేవి. ఆ అనంతమైన దుఃఖం బయటికి వెళ్లే మార్గం, మాధ్యమంగా అతడికి సినిమా కనిపించింది. (చదవండి: బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!)
సినిమా డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి? చెప్పుకోదగ్గ చదువు కావాలి. ఈ ఆలోచనలతోనే ‘మళ్లీ చదువుకుందాం’ అని నిర్ణయించుకున్నాడు. కానీ ‘ఈ వయసులో చదువేమిటి!’ అనే వెక్కిరింపులు క్యూ కట్టాయి. ఇక లాభం లేదనుకొని చెన్నై వెళ్లి ఒక డీవిడి స్టోర్‌లో పనికి కుదిరాడు. అక్కడ ప్రతి సినిమా తనకొక పాఠం నేర్పింది. ఆ ధైర్యంతోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలతీరానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు డైరెక్టర్ అయ్యాడు.
‘కూళంగళ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరికి తప్ప ఎవరికీ పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేవు. కాని ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొటెర్‌డామ్ టైగర్ అవార్డ్(న్యూజిలాండ్) గెలుచుకుంది. ‘సింపుల్ అండ్ హంబుల్’ అని ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ పరిసరాల్లోకి వెళ్లింది. (చదవండి: ఐటెం సాంగ్ లిరిక్స్‌పై తొలిసారిగా స్పందించిన బన్నీ)
‘ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. పెద్దగా చదువుకోలేదు. జీవితం అనే బడి ఎన్నో పాఠాలు నేర్పింది’ అంటున్న వినోద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి?
సింపుల్ అండ్ హంబుల్ ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలా!
Comments
Please login to add a commentAdd a comment