Koozhangal Movie
-
నయనతార తీసిన సినిమాకు సీఏఐబీ అవార్డ్
నయనతార గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఓ పక్క నటిస్తూనే మరోవైపు భర్తతో కలిసి పలు చిత్రాల్ని నిర్మిస్తోంది. అలానే రౌడీ పిక్చర్స్ పతాకంపై ఇతర సంస్థలు నిర్మించిన చిత్రాలను విడుదల చేస్తోంది. అలా ఇటీవల ఈ సంస్థ విడుదల చేసిన సినిమా 'కూళంగల్'. ఇప్పుడు ఈ చిత్రం మరో అవార్డుని కైవసం చేసుకుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 18 సినిమాలు.. అవేంటంటే?) గ్రామీణ ప్రజల జీవనాన్ని ఆవిష్కరించే విధంగా దర్శకుడు పీఎస్.వినోద్‌రాజ్.. ఈ సినిమా తీశారు. అంతా కొత్తవాళ్లు నటించిన ఈ చిత్రాన్ని ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. పలు అవార్డులు కూడా గెలుచుకుంది. తాజాగా శనివారం సాయంత్రం చైన్నెలోని చైన్నె ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన సీఏఐబీ-2023 అవార్డుల కార్యక్రమంలో కూళంగల్ చిత్రం ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది. దీంతో పాటు నటుడు శశికుమార్ కథానాయకుడిగా నటించిన 'అయోతి' కూడా ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకుంది. కూళంగల్, అయోతి చిత్రాలు పలు అంతర్జాతీయ అవార్డులను గెలుచుకోవడం తమిళ సినీ పరిశ్రమకే గౌరవం అని ఈ వేడుకలో పాల్గొన్న సినీ ప్రముఖులు చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: ఓటీటీలో బెస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ.. క్లైమాక్స్ చూస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయ్!) -
ఆస్కార్ బరి నుంచి నిష్క్రమించిన కూళంగల్
-
‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు.. చివరికి సాధించాడు!
అనగనగా ఒక పిల్లాడు ఉంటాడు. కుటుంబ పరిస్థితి బాగలేక బాలకార్మికుడిగా మారి ఎన్నో కష్టాలు పడతాడు. పొట్ట నింపుకోవడం కోసం, కుటుంబానికి ఆసరాగా నిలవడం కోసం తిరగని పట్టణం లేదు. చేయని పనిలేదు. ఈ కష్టాల పిల్లాడికి సినిమా అంటే ఇష్టం. ‘సినిమా డైరెక్టర్ అవుతాను’ అనే అతని ఆశయం ఎన్నో అవహేళనలకు గురైంది. కాని అతడు మాత్రం ‘తగ్గేదే ల్యా’ అనుకున్నాడు. చివరికి సాధించాడు. అంతర్జాతీయంగా పేరు సంపాదించుకున్నాడు....ఇది సినిమా కథ కాదు. ‘కూళంగళ్’ సినిమాతో ప్రశంసలు అందుకుంటున్న మదురై కుర్రాడు పీయస్ వినోద్‌రాజ్ నిజజీవితకథ.... వినోద్‌రాజ్ లో బడ్జెట్ డెబ్యూ మూవీ ‘కూళంగళ్’ (గులకరాళ్లు) ఆస్కార్–ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఇండియన్ ఎంట్రీగా ఎంపికైంది. కథ ఐడియాలు ఎలా వస్తాయి? విదేశాల్లో ఫైస్టార్ హోటల్లో కూర్చుంటే రావచ్చు. విదేశీ చిత్రాలు చూస్తే రావచ్చు. కొందరికి మాత్రం విదేశాలు అక్కర్లేదు. విదేశీ చిత్రాలు అక్కర్లేదు. ఏ జీవితం నుంచి అయితే తాము నడిచొచ్చారో ఆ జీవితమే వారికి నిజమైన కథలు ఇస్తుంది. వినోద్‌రాజ్... ఈ కోవకు చెందిన డైరెక్టర్. తాను పుట్టి పెరిగిన జీవితాన్నే కథగా మలుచుకున్నాడు వినోద్. అదే ‘కూళంగళ్’ సినిమా! వినోద్‌రాజ్ తండ్రి తాగుబోతు. తాగి ఎప్పుడు ఏ రోడ్డు మీద పడి ఉంటాడో తెలియదు. నాన్న చనిపోయిన తరువాత కష్టాలు పెరిగాయి. కుటుంబానికి ఆసరాగా ఉండడం కోసం పూలు అమ్మడం నుంచి టెక్ట్స్‌టైల్ కంపెనీలో పనిచేయడం వరకు ఎంతో కష్టపడ్డాడు. టెక్ట్స్ టైల్ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు రకరకాల కష్టాలతో అర్ధాంతరంగా జీవితాన్ని చాలేసిన ఎంతోమందిని అక్కడ ప్రత్యక్షంగా చూశాడు. ఈ కన్నీటి కథలు, తన కుటుంబ కష్టాలను గుర్తు చేసుకున్నప్పుడల్లా కడుపులో దుఃఖసముద్రాలు ఘోషించేవి. ఆ అనంతమైన దుఃఖం బయటికి వెళ్లే మార్గం, మాధ్యమంగా అతడికి సినిమా కనిపించింది. (చదవండి: బ్రేక్ ఔట్ యాక్టర్.. తమిళ అమ్మాయి!) సినిమా డైరెక్టర్ కావాలంటే ఏం కావాలి? చెప్పుకోదగ్గ చదువు కావాలి. ఈ ఆలోచనలతోనే ‘మళ్లీ చదువుకుందాం’ అని నిర్ణయించుకున్నాడు. కానీ ‘ఈ వయసులో చదువేమిటి!’ అనే వెక్కిరింపులు క్యూ కట్టాయి. ఇక లాభం లేదనుకొని చెన్నై వెళ్లి ఒక డీవిడి స్టోర్‌లో పనికి కుదిరాడు. అక్కడ ప్రతి సినిమా తనకొక పాఠం నేర్పింది. ఆ ధైర్యంతోనే కొన్ని షార్ట్‌ఫిల్మ్స్‌కు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ తన కలలతీరానికి చేరుకున్నాడు. ఎట్టకేలకు డైరెక్టర్ అయ్యాడు. ‘కూళంగళ్’ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు కొందరికి తప్ప ఎవరికీ పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ లేవు. కాని ఈ సినిమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ రొటెర్డామ్ టైగర్ అవార్డ్(న్యూజిలాండ్) గెలుచుకుంది. ‘సింపుల్ అండ్ హంబుల్’ అని ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఆస్కార్ పరిసరాల్లోకి వెళ్లింది. (చదవండి: ఐటెం సాంగ్ లిరిక్స్‌పై తొలిసారిగా స్పందించిన బన్నీ) ‘ఇంగ్లీష్ మాట్లాడడం రాదు. పెద్దగా చదువుకోలేదు. జీవితం అనే బడి ఎన్నో పాఠాలు నేర్పింది’ అంటున్న వినోద్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏమిటి? సింపుల్ అండ్ హంబుల్ ప్రాజెక్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలా! -
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
ఆస్కార్ బరిలో నయనతార ‘కూళాంగల్’.. కథేంటంటే..?
‘కూళాంగల్’ (గులకరాయి) మోత ఆస్కార్ వరకూ వినిపించనుంది. ఆస్కార్ అవార్డును కూడా సొంతం చేసుకుంటుందా? అనేది వచ్చే ఏడాది మార్చిలో తెలిసిపోతుంది. అయితే కొత్తవారితో కొత్త దర్శకుడు తీసిన సినిమా ఆస్కార్ పోటీ దాకా వెళ్లడం అంటే చిన్న విషయం కాదు. ప్రేక్షకుల హృదయాలను తాకింది ‘కూళాంగల్’ సినిమా. అందుకే మన దేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఈ సినిమా ఆస్కార్‌కి ఎంపికైంది. 2022 మార్చి 27న జరగనున్న 94వ ఆస్కార్ అవార్డ్ వేడుకకు మన దేశం తరఫున ‘విదేశీ విభాగానికి’ పలు చిత్రాలు పోటీ పడ్డాయి. వాటిలో హిందీ నుంచి ‘సర్దార్ ఉదమ్’, ‘షేర్నీ’, తమిళ చిత్రం ‘మండేలా’, మలయాళ సినిమా ‘నాయట్టు’ ఉన్నాయనే వార్త శుక్రవారం వచ్చింది. అయితే తమిళ చిత్రం ‘కూళాంగల్’ కూడా ఉందని, ఆ చిత్రమే ఎంపికైందని శనివారం అధికారిక ప్రకటన వెల్లడయింది. అన్ని చిత్రాలనూ పరిశీలించాక జ్యూరీ సభ్యులు ‘కూళాంగల్’ని ఎంపిక చేశారు. పీఎస్ వినోద్ రాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ దర్శకుడు విఘ్నేష్ శివన్–హీరోయిన్ నయనతార ‘రౌడీ పిక్చర్స్’ బేనర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ అధికారిక ఎంట్రీకి తమ సినిమా ఎంపికైన సందర్భంగా ‘‘అండ్ ది ఆస్కార్ గోస్ టు అని వినే చాన్స్ కూడా ఉంది! కల నెరవేరడానికి రెండు అడుగుల దూరమే ఉంది’’ అని సోషల్ మీడియా వేదికగా స్పందించారు విఘ్నేష్. ‘‘ఇంతకన్నా ఆనందకరమైన వార్త మరోటి ఉండదు’’ అన్నారు పీఎస్ వినోద్ రాజ్. కూళాంగల్ కథేంటంటే... భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్ వినోద్ రాజ్ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు వినోద్. నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ రోటర్‌డామ్’ (ఐఎఫ్ఎఫ్ఆర్)లో ‘కూళాంగల్’ ప్రతిష్టాత్మక టైగర్ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్ఎఫ్ఆర్ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ ‘దుర్గా’ తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా ‘కూళాంగల్’ కావడం విశేషం.