కూళాంగల్‌: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్‌...? | Nayanthara produced film Koozhangal enters oscar 2022 | Sakshi
Sakshi News home page

కూళాంగల్‌: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్‌... ?

Published Tue, Oct 26 2021 12:22 AM | Last Updated on Tue, Oct 26 2021 1:19 PM

Nayanthara produced film Koozhangal enters oscar 2022 - Sakshi

‘కూళాంగల్‌’ సినిమాలో ఒక సన్నివేశం

మేక్సిమ్‌ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్‌ ఎంట్రీ అయిన ‘కూళాంగల్‌’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే.

‘కూళాంగల్‌’ సినిమాలో ఒక సీన్‌ ఉంటుంది. బస్‌ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే  నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా.

‘కూళాంగల్‌’ సినిమాలో ఒక సన్నివేశం

‘కూళాంగల్‌’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్‌ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్‌. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది.

కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్‌.

మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్‌’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది.


‘కూళాంగల్‌’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట.

కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి.

2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్‌ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్‌ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్‌’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్‌’ సినిమాలు అఫీషియల్‌ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్‌ వరకూ చేరాయి.

చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్‌’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్‌లో రిలీజ్‌ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్‌’ వంటి సినిమాలు చెబుతున్నది అదే.


కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది.
- ‘కూళాంగల్‌’ నిర్మాత నయనతార

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement