water drought
-
Aqueduct Water Risk Atlas: ఇక కన్నీళ్లేనా..?
వానలు, వరదలతో ప్రపంచంలో కొన్ని దేశాలు అల్లాడిపోతుంటే, మరి కొన్ని దేశాల్లో గొంతు తడుపుకోవడానికి గుక్కెడు మంచినీళ్లకి కరువు వచ్చి పడింది. ప్రపంచంలో 25 దేశాలు నీటికి కటకటలాడుతున్నట్టుగా వరల్డ్ రిసోర్సెస్ ఇనిస్టిట్యూట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. అడ్వకేట్ వాటర్ రిస్క్ అట్లాస్ పేరుతో ఈ సంస్థ విడుదల చేసిన నివేదికలో ప్రపంచ జనాభాలో 25% మంది ప్రస్తుతం అత్యంత తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. నివేదిక ఏం చెప్పిందంటే.. ► ప్రపంచంలోని 25 దేశాలు తీవ్రమైన నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. వాటిలో భారత్, సౌదీ అరేబియా, చిలీ, శాన్మెరినో, బెల్జియం, గ్రీస్ వంటి దేశాలున్నాయి. ► బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్ ప్రతీ ఏడాది నీటి కొరతతో అల్లాడిపోతున్నాయి. ప్రతీ ఏడాది కరువు బారిన పడుతున్నాయి. ► ప్రపంచంలో నీటి కొరత అత్యధికంగా ఎదుర్కొంటున్న ప్రాంతాలు పశి్చమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా. ఈ ప్రాంతాల్లో 83% జనాభా అత్యధికంగా నీటి కొరత సమస్యను ఎదుర్కొంటున్నారు. ► దక్షిణాసియా జల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఆ దేశాల్లో 74% మంది జనాభా నీటి కొరత అధికంగా ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ► ప్రపంచ జనాభాలో 50% మంది అంటే 400 మంది కోట్ల వరకు ప్రతీ ఏడాది ఒక నెల రోజుల పాటు నీటికి కటకటగా ఉండే పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. 2050 నాటికి వీరి సంఖ్య 60 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయి. ► నీటి కొరత కారణంగా భారత్, మెక్సికో, ఈజిప్టు, టర్కీ దేశాలు ఆర్థికంగా భారీగా నష్టపోతున్నాయి. ► 2010లో నీటి కొరత వల్ల ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 15 లక్షల కోట్ల డాలర్లు (ప్రపంచ జీడీపీలో 24%) నష్టపోతే, 2050 నాటికి ప్రపంచ స్థూల జాతీయోత్పత్తిలో 31% నష్టం వాటిల్లుతుంది. అంటే 70 లక్షల కోట్ల డాలర్ల నష్టం వస్తుంది. ► ఆసియా దేశాల్లో భారత్ అత్యధికంగా నీటి కొరతను ఎదుర్కొంటుంది. 2050 నాటికి ఆసియా దేశాల్లో 80% మందికి సురక్షిత నీరు అందదు. ► ప్రపంచ వ్యవసాయ రంగం 60% నీటి కొరతను ఎదుర్కొంటోంది. దీని వల్ల వరి, గోధుమ, మొక్కజొన్న, చెరుకు పంటలపై ప్రభావం పడుతోంది. నీటి కటకటకి కారణాలివే..! జనాభా పెరుగుదల , పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, వాతావరణ మార్పులు, నీటి నిర్వహణ సమర్థంగా చేయకపోవడం వంటివెన్నో నీటి కటకటకి కారణాలు. భూమ్మీద 70% నీటితో నిండి ఉన్నా మన అవసరాలు తీర్చే నీరు అందులో 3% మాత్రమే. అందులో రెండింట మూడొంతులు మంచు రూపంలో ఉంది. జనాభా పెరిగిపోతూ ఉండడంతో నీటికి డిమాండ్ పెరుగుతోంది. 1960తో పోల్చి చూస్తే నీటికి డిమాండ్ రెట్టింపు కంటే ఎక్కువైంది. యూరప్, అమెరికాలో నీటికి డిమాండ్ స్థిరంగా ఉంటే ఆఫ్రికా దేశాల్లో పెరుగుతోంది. 2050 నాటికి నీటికి డిమాండ్ మరో 25% పెరుగుతుందని అంచనా. వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచంలో సగం దేశాల్లో అనావృష్టి పరిస్థితులు నీటి కొరతకు కారణమవుతున్నాయి. పరిశ్రమలు పెరిగిపోతూ ఉండడంతో నీటి వినియోగం అధికమవడమే కాకుండా, కలుíÙత నీరు పెరిగిపోయే ప్రజల అవసరాలు తీర్చలేకపోతోంది. చేయాల్సింది ఇదే..! ప్రతీ వాన బొట్టుని సంరక్షించడానికి ప్రపంచ దేశాలన్నీ శక్తివంచన లేకుండా కృషి చేయాలి. వ్యవసాయ, పారిశశ్రామిక రంగాలకే 70% నీటిని వాడాల్సి వస్తోంది. 2050 నాటికి పెరిగే జనాభాకి 2010 కంటే 56% అధికంగా పంటలు పండించాలి. తక్కువ నీటి వాడకంతో పంటలు పండించే సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం వల్ల 2050 నాటికి నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు గణనీయంగా తగ్గుతాయని ఒక అంచనా. చిత్తడి నేలలు పెంచడం, భూగర్భ జలాల పెంపొందించే చర్యలు చేపట్టడం వంటివి చెయ్యాలి. ఇక గ్లోబల్ వారి్మంగ్ అదుపు చేయడానికి ప్రపంచ దేశాలన్నీ కృషి చేయాల్సి ఉంది. ఆ 25 దేశాలు ఇవే..!: భారత్, బహ్రెయిన్, సైప్రస్, కువైట్, లెబనాన్, ఒమన్, ఖతర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఈజిప్టు, లిబియా, యెమన్, బోత్సా్వనా, ఇరాన్, జోర్డాన్, చిలీ, శాన్ మారినో, బెల్జియం, గ్రీస్, టునిషియా, నమీబియా, దక్షిణాఫ్రికా, ఇరాక్, సిరియా నీరు మనకి జీవనాధారం. భూమ్మీద లభించే అత్యంత ముఖ్యమైన వనరు అదే. అయినా దాని నిర్వహణలో మనం విఫలమవుతూ వస్తున్నాం. జల సంరక్షణ అనే అంశంలో నేను 10 ఏళ్లుగా పని చేస్తున్నాను. దురదృష్టవశాత్తూ ప్రతీ ఏడాది అదే నివేదిక, అదే కథనం ఇవ్వాల్సి వస్తోంది. ఈ సంక్షోభ పరిష్కారానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ప్రపంచ దేశాధినేతలు చిత్తశుద్ధితో పని చేస్తూ నీటి వనరుల సంరక్షణకి ఆర్థిక వనరులు కేటాయించాలి’’ –సమంతా కుజ్మా, డబ్ల్యూఆర్ఐ నివేదిక రచయిత్రి – సాక్షి, నేషనల్ డెస్క్ -
కూళాంగల్: నీ సమస్యలకు ఆమెనెందుకు హింసిస్తావ్...?
మేక్సిమ్ గోర్కి ప్రఖ్యాత నవల ‘అమ్మ’లో ఫ్యాక్టరీ కార్మికుడిగా పని చేసే తండ్రి తల్లిని ఎందుకు చితక బాదుతున్నాడో చాలారోజులకు గాని అర్థం కాదు కొడుక్కు. పురుషుడిలోని హింసకు బాహ్య కారణాలూ ఉంటాయి. కరువు నేలలో పురుషులకు పని ఉండదు. స్త్రీలను హింసించడమే వారి పని. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీ అయిన ‘కూళాంగల్’ మధురై ప్రాంతంలో స్త్రీల మీద జరిగే హింసను పరోక్షంగా చర్చించింది. భర్త దాడికి పుట్టింటికి నిత్యం పారిపోయే భార్యను తిరిగి తేవడానికి తండ్రీ కొడుకులు బయలుదేరడమే ఈ కథ. నేడు కరోనా వల్ల ఉపాధులు తలకిందులై ఇళ్లల్లో చోటు చేసుకుంటున్న హింసను చర్చించడానికీ ఇది సందర్భమే. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. బస్ ఆగుతుంది. ఒక ఆడమనిషి మూడు నీళ్లు నిండిన బిందెలను అతి జాగ్రత్తగా బస్సులోకి ఎక్కిస్తుంది. ఆ నీళ్లను ఆమె ఇంటికి తీసుకెళ్లాలి. ఆమె ఎవరో? ఎన్ని గంటలకు నిద్ర లేచిందో. ఎక్కడి నుంచి బస్సెక్కి ఇక్కడి దాకా వచ్చిందో. నీళ్లు పట్టుకోవడానికి ఎంతసేపు పట్టిందో. నీళ్లు ఇంటికి చేరడానికి ఇంకెంత సేపు పడుతుందో. ఇవన్నీ దర్శకుడు చెప్పడు. చూపడు. కాని చూస్తున్న ప్రేక్షకులకు ఇన్ని ఆలోచనలు తప్పక వస్తాయి. కరువు ఆ ప్రాంతంలో. కరువు అంటే నీటి సమస్య. నీటి సమస్య ఎప్పుడూ స్త్రీల సమస్యే. ఎందుకంటే ఇంట్లో ప్రతి అవసరానికి నీళ్లు కావాల్సింది వారికే కదా. ‘కూళాంగల్’ సినిమాలో ఒక సన్నివేశం ‘కూళాంగల్’ సినిమాను తమిళనాడు మధురై జిల్లాలోని మేలూరుకు దగ్గరగా ఉన్న అరిట్టపట్టి అనే ఊళ్లో 2019 మే నెలలో మొదలెట్టి తీశారు. దర్శకుడు వినోద్‌రాజ్ ది ఆ ప్రాంతమే. ఇది అతడి మొదటి సినిమా. ‘నా సినిమాలో మూడే కేరెక్టర్లు ప్రధానం. తండ్రి.. కొడుకు... కరువు’ అంటాడు వినోద్‌రాజ్. ‘కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. నాకు 14 ఏళ్లు ఉన్నప్పుడు మా చిన్నక్కకు, ఆమె భర్తకు తగాదా వస్తే మా చిన్నక్క అత్తింటి నుంచి పుట్టింటికి 10 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ పది కిలోమీటర్లు మా బావ ఆమెను వెంటాడుతూనే వచ్చాడు. ఈ సినిమాకు ఆ సంఘటన ఒక స్ఫూర్తి’ అంటాడు దర్శకుడు వినోద్‌రాజ్. మధురైలోని కరువు ప్రాంతాల్లోని పల్లెల్లో ఏమీ పండదు. మగవారికి పని ఉండదు. నీళ్ల కటకట వల్ల శుభ్రత ఉండదు. అసహనంతో తాగడం. పేకాట ఆడటం. తగాదాలు పడటం. ఇంటికొచ్చి భార్యను హింసించడం... ఇవే పనులు. పిల్లల మీద ఈ తగాదాలు విపరీతంగా ప్రభావం చూపుతాయి. స్త్రీలు ఇళ్ల నుంచి పారిపోతుంటారు. ‘కూళాంగల్’లో తండ్రి కొడుకును అడుగుతాడు– ‘నీకు నేనంటే ఇష్టమా.. మీ అమ్మంటే ఇష్టమా’ అని. దానికి కొడుకు సమాధానం చెప్పడు. కాని సినిమాలో ఒకచోట వాడు ఒక రాయి మీద తల్లి పేరు, చెల్లిపేరు, తన పేరు రాసుకుంటాడు తప్ప తండ్రి పేరు రాయడు. తండ్రి దారుణమైన ప్రవర్తనకు అతడి నిరసన అది. ‘కూళాంగల్’ అంటే నున్నటి గులకరాళ్లు. ఈ సినిమా కథ భర్తతో తగాదాపడి పుట్టింటికి వెళ్లిన భార్యను వెతుక్కుంటూ కాలినడకన భర్త, అతని వెనుక కొడుకు బయలుదేరుతారు. కాని దారంతా కరువు ఎలా ఉంటుందో, పచ్చటి మొక్క కూడా మొలవక ఆ పరిసరాలు ఎంత నిస్సారంగా ఉంటాయో, కిర్రుమనే చప్పుడు... మనిషి అలికిడి లేకపోవడం ఎంత దుర్భరంగా ఉంటుందో దర్శకుడు చూపుకుంటూ వెళతాడు. నీళ్లు చుక్క దొరకని ఆ దారిలో దాహానికి స్పృహ తప్పకుండా ఉండేందుకు పిల్లలు నున్నటి గులకరాయి తీసి బుగ్గన పెట్టుకుని చప్పరిస్తూ ఉంటారు. ఈ సినిమాలో పదేళ్ల కొడుకు కూడా అలాగే చేస్తుంటాడు. కాని వాడి దగ్గర అప్పటికే చాలా గులకరాళ్లు పోగుపడి ఉంటాయి. అంటే తల్లి పారిపోవడం, తండ్రి వెళ్లి తిరిగి తేవడం, దారిలో ఈ పిల్లవాడు గులకరాయి చప్పరించడం ఆనవాయితీ అన్నమాట. కరువు ప్రాంతాల్లో మగవాళ్లు తీవ్రమైన అసహనంతో ఉంటే స్త్రీలు ఎలాగోలా చేసి, ఎలుకనో కుందేలునో పట్టుకుని ఏదో విధాన నాలుగు ముద్దలు వండి పెట్టడానికి పడే తాపత్రయాన్ని, నీళ్ల భారం మోయలేక వాళ్లు పడే అవస్థను దర్శకుడు చూపుతాడు. నటి నయనతార ఈ సినిమా చూసి దీని ఒక నిర్మాతగా మారడం విశేషం. ఆ విధంగా ఒక స్త్రీ ఈ స్త్రీల బాధను అర్థం చేసుకుందని భావించాలి. 2022 ఆస్కార్‌కు మన దేశం తరఫున అఫీషియల్ ఎంట్రీగా వెళ్లనున్న ఈ సినిమా నామినేషన్స్‌కు వెళ్లగలిగితే ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో పోటీ పడవలసి వస్తుంది. అంటే నామినేషన్‌కు చేరుకుంటే తర్వాతి మెట్టు అవార్డు గెలవడమే. గతంలో మన దేశం నుంచి ‘మదర్ ఇండియా’, ‘సలాం బాంబే’, ‘లగాన్’, ‘జల్లికట్టు’, ‘గల్లీబాయ్’ సినిమాలు అఫీషియల్ ఎంట్రీగా వెళ్లాయి. కాని కొన్ని నామినేషన్స్ వరకూ చేరాయి. చూడాలి ఈసారి ఏం జరుగుతుందో. అన్నట్టు ‘కూళాంగల్’ గత సంవత్సరంగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితం అవుతోంది. భారతదేశంలో విడుదల కాలేదు. ఇప్పుడు వచ్చిన పేరు వల్ల ఈ డిసెంబర్లో రిలీజ్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫ్యాక్టరీలోని దారుణమైన చాకిరీకి, తక్కువ రాబడికి అసహనం పొంది తన తండ్రి తల్లిని కొడుతున్నట్టు కొడుక్కు అర్థం అవుతుంది ‘అమ్మ’ నవలలో. ఆ పరిస్థితులు మార్చడానికి అతడు బయలదేరుతాడు. నేడు కరోనా పరిస్థితుల్లో ఉద్యోగాలు పోయిన ఇళ్లల్లో అసహనం చోటు చేసుకోవడం సహజం. కాని అది స్త్రీల మీద హింసగా ఏ మాత్రం రూపాంతరం చెందకూడదు. హింసకు తావులేని అవగాహనే ఇప్పుడు భార్యాభర్తల మధ్య కావాల్సింది. ‘కూళాంగల్’ వంటి సినిమాలు చెబుతున్నది అదే. కరువు చాలా అసహనం ఇస్తుంది. అది మానవ సంబంధాలను ఛిన్నాభిన్నం చేస్తుంది. కరువు ఉన్న ప్రాంతం పురుష పెత్తనం ఎక్కువగా ఉంటే ఆ హింస భరించడం స్త్రీల వంతు అవుతుంది. - ‘కూళాంగల్’ నిర్మాత నయనతార -
చెన్నైకు తాగునీరివ్వండి
సాక్షి, అమరావతి : చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తాగునీరు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని మంత్రులు చెప్పగా.. వైఎస్ జగన్ వెంటనే స్పందించి చెన్నైకి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు. కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరముందని సీఎం జగన్ వివరించారు. -
కరువు తీవ్రం బతుకు భారం
ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. కోతకొచ్చిన కాయలతో పచ్చగా కళకళలాడాల్సిన మామిడి, బత్తాయి, సన్న నిమ్మ తోటలు కాయలతో సహా మలమలా మాడిపోతున్నాయి.. పొట్టేళ్లను వేలాడదీసినట్లు గెలలున్న అరటి చెట్లు వాడిపోతున్నాయి.. బొప్పాయిదీ అదే పరిస్థితి.. చెరకు ఎండిపోయిన గడ్డిలా మారింది.. కోతకు రావాల్సిన నువ్వు భూమికి అతుక్కుని వత్తుల్లా మారింది.. టమోటా, ఇతర కూరగాయల తోటలూ ఇందుకు భిన్నమేమీ కాదు. తినడానికి గడ్డి, తాగడానికి నీరులేక పశువులు బక్కచిక్కిపోతున్నాయి. ఇది తట్టుకోలేక అన్నదాతలు మనసు చంపుకుని వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. మరోవైపు.. వేలాది పల్లెలు తాగునీటికి కటకటలాడుతున్నాయి. పనుల్లేక ఉపాధి కోసం కూలీలతోపాటు సన్నకారు రైతులు వలసబాట పట్టారు. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. సిరిధాన్యాలతో కళకళలాడాల్సిన పల్లె సీమలు కళావిహీనంగా, దయనీయంగా మారాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కరాళ నృత్యం సృష్టించిన బతుకు చిత్రం ఇది. నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ సాక్షి, అమరావతి : ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉష్ణతాపం, వేడిగాలులతో నీటి తడిపెట్టిన రెండో రోజే పంటపొలాలు తడారి ఎండిపోతున్నాయి. మరోవైపు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం పాతాళానికి చేరింది. బోర్లకు నీరు అందడంలేదు. ఎలాగైనా పైర్లు, పండ్ల తోటలను కాపాడుకోవాలనే ఆశతో అప్పుచేసి బోర్లు వేసినా నీరు పడటంలేదు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటి జాడేలేదు. దీంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. పంటల సాగుకు చేసిన అప్పులకు బోర్ల కోసం చేసిన అప్పులు తోడుకావడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుంచి బయటపడే మార్గం కానరాక సతమతమవుతున్నారు. వైఎస్సార్ కడప, అనంతపురం జిల్లాల్లో గెలలతో ఉన్న అరటి తోటలు, బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏతావాతా పెరిగిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు పడుతున్న మానసిక వేదన మాటలకందనిది. తాగునీరు.. కన్నీరు.. గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ఊరుదాటి కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్క నీరు దొరకని దుస్థితిలో గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడో దూరాన చెలమల్లో అరకొర నీరు ఊరుతోందని తెలుసుకొని బిందెలు పట్టుకొని గంటల తరబడి తోడుకుంటూ గుక్కెడు నీళ్లు చేతికందగానే ఇంటి ముఖం పడుతున్నారు. మండు వేసవిలో మహిళలు చిన్న పిల్లలను కూడా వెంట నడిపించుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇకనైనా తమకు కనీసం గుక్కెడు మంచినీళ్లు అందించాలని సర్కారును వేడుకుంటున్నారు. కందిపోతున్న కాయలు రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో నీటి తడులు అందక పండ్ల తోటల్లోని కాయలు నల్లగా కందిపోతున్నాయి. అరటి గెలలు వాడిపోతున్నాయి. బత్తాయి, బొప్పాయితోపాటు మామిడి కాయలు రంగు మారిపోతున్నాయి. టమోటాలు ఎండకు తెల్లగా రంగుమారి పిప్పితేలుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. అనంతపురం జిల్లాలో ఎండల నుంచి దానిమ్మ చెట్లను కాపాడుకోడానికి పాత చీరలను కప్పుతున్నారు. టమోటా రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘తోటకు పందిరి ఎటూ వేయలేం. భారీగా ఖర్చుపెట్టి గ్రీన్ హౌస్ లాంటివి పెట్టుకునే స్తోమతలేదు. అందువల్ల పాత చీరలు కొని పండ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చెట్లకు రక్షణగా కట్టడంవల్ల పండ్లకు, మొగ్గలకు కొంతవరకు రక్షణగా ఉంటున్నాయి’ అని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వెంకటప్ప గౌడ్ అన్నారు. పడిపోయిన భూగర్భ నీటిమట్టం గత ఏడాది మే 16వ తేదీతో పోల్చితే ప్రస్తుతం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. చిత్తూరు జిల్లాలో గత ఏడాదికీ, ఈ ఏడాదికీ భారీ వ్యత్యాసం నెలకొంది. ఏకంగా 36.90 అడుగుల కిందకు జలమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే కాలంలో వైఎస్సార్ జిల్లాల్లో 19.65 అడుగుల కిందకు పడిపోయింది. రాయలసీమలో సగటున భూగర్భ జలమట్టం 20.86 అడుగులకు కిందకు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి నిదర్శనమని భూగర్భ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంతోనే బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ‘భూగర్భ జలమట్టం బాగా పెరగాలంటే మంచి వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రవహించాలి. ఇలా అయితేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల రంగానికి చెందిన నిపుణుడు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని, వర్షపాతం కూడా సాధారణం (93 శాతం మాత్రమే )గానే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాగైతే కష్టమే’ అని ఒక ఉన్నతాధికారి నిరాశను వ్యక్తం చేశారు. తాగునీటికీ కటకట రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలాచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామాల్లో తాగునీరు అందించే బోర్లు ఇంకిపోయి నీరు రావడంలేదు. దీంతో చాలా గ్రామాల వారు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల నుంచి బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీరు తెచ్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దారుణమైన కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంచనా. జాడలేని పశు సంరక్షణ కేంద్రాలు మూగ జీవాలు మేత, నీరులేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంఏర్పాటుచేసి మేత, నీరు అందించే చర్యలు తీసుకోవాలి. అయితే, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు వరిగడ్డి కొనుక్కోవాలంటే ట్రాక్టరు రూ.15 వేలకు పైగా అవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినందున దానిని కొనే స్థితిలో చాలామంది రైతులు లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని గడ్డి, దాణా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా దానిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచక పశువులను కబేళాలకు ఇచ్చేస్తున్నారు. నిత్యం సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి బెంగళూరు, చెన్నై నగరాల కబేళాలకు వేలాది పశువులు తరలిపోతున్నాయి. ప్రకాశంలో 56 శాతం లోటు వర్షపాతం గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సగటున 34.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో సాధారణంతో పోల్చితే 56.7 శాతం, నెల్లూరులో 54.6 శాతం, వైఎస్సార్ జిల్లాలో 55.9 శాతం, చిత్తూరులో 46.2, కర్నూలులో 48.1, అనంతపురంలో 43.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. వరుసగా ఐదేళ్లపాటు ఇలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంవల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. చాలా నదులు ఎండిపోయాయి. డ్యామ్‌లలో నీరు డెడ్ స్టోరేజికి చేరింది. -
వంతెన తెచ్చింది..జలం.. జీవం
చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం - ఈ వారధులతో 365 రోజులూ జలసిరి - తొలిసారిగా తెలంగాణలో అమలు - వాగుల్లో నీటి నిల్వతో వట్టిపోయిన బోర్లకు జీవం - సాగు, తాగు నీటికి ప్రయోజనకరం సాక్షి, హైదరాబాద్ : దుర్భిక్షంతో అల్లాడే ప్రాంతాల్లో ప్రతి నీటి చుక్కా వృథా కాకుండా కాపాడుకోవాలి. ఇటీవల మరాట్వాడా నీటి కరువు దీన్ని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఇలాంటి దుస్థితిని కొంతవరకు అడ్డుకునేందుకు రోడ్లు, భవనాల శాఖ చేపట్టిన ప్రయోగం సత్ఫలితాలనిస్తుందన్న భరోసా కల్పిస్తోంది. వాగులు, వంకలపై నిర్మించే వంతెనల నమూనాలో చిన్నపాటి మార్పులు చేయటం ద్వారా నీటిని నిల్వ చేసే పథకాలుగా మార్చటమే ఈ ప్రయోగం ఉద్దేశం. పొరుగునే ఉన్న కర్ణాటకతోపాటు రాజస్థాన్‌లాంటి కొన్ని రాష్ట్రాలు ఈ ప్రయోగంతో సత్ఫలితాలు సాధించాయి. ఈ నేపథ్యంలో రోడ్లు, భవనాల శాఖ కొత్తగా చెక్‌డ్యాం నమూనాతో వంతెనల నిర్మాణం చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 500 వంతెనలు నిర్మించే పని ప్రారంభించిన ఆర్అండ్బీ శాఖ.. అందులో 174 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో చేపట్టాలని నిర్ణయించింది. గత వానాకా లం నాటికే చాలా వంతెనలను అందుబాటులోకి తేవాలని భావించినా.. నిధుల విడుదలలో జాప్యం, పనుల్లో ఆలస్యం, ప్రణాళిక లేమి వల్ల సాధ్యం కాలేదు. తర్వాత కాస్త వేగం పెంచటంతో ఈ వానాకాలం నాటికి 35 వంతెనలు పూర్తి చేయగలిగారు. ఇవి సత్ఫలితాలిస్తాయని తాజా వానలతో స్పష్టమైంది. మిగతావి పూర్తయితే వచ్చే వానాకాలంలో దాదాపు 174 ప్రాంతాల్లో ఇవి చిన్నపాటి నీటి నిల్వ ప్రాజెక్టులుగా సేవలందించనున్నాయి. పాత కాజ్‌వేలను కూల్చకుండా.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త వెంతెనలు నిర్మిస్తున్నందున పాత కాజ్‌వేలు, చిన్న వంతెనలతో పనిలేదు. అయితే వాటిని కూల్చివేయకుండా తూములు కాంక్రిట్‌తో మూసి చెక్డ్యాంలుగా మార్చాలని నిర్ణయించారు. నదులపై, చెరువులకు చేరువగా నిర్మించే వంతెనలు మినహా మిగతావన్నీ నీటి నిల్వకు ఉపయోగపడేలా నిర్మించాలని భావిస్తున్నారు. సాధారణంగా వాగుల్లోని నీళ్లు పారుతూముందుకు సాగి వానలు తగ్గగానే ఎండిపోతాయి. కానీ ఈ కట్టడాలున్న చోట్ల నీళ్లు కొంతమేర నిలిచి సమీపంలోని బోర్లను ఎండిపోకుండా చేయగలుగుతాయి. కొన్ని చోట్ల నేరుగా వ్యవసాయానికి నీటిని అందిస్తాయి. ఇది ఆదిలాబాద్ జిల్లాలో బాసర–లక్సెట్టిపేట మధ్య మహ్మదాబాద్ వాగుపై నిర్మించిన వంతెన. శిథిలమైన వంతెనను తొలగించి రూ.2.7 కోట్లతో దీన్ని నిర్మించారు. 3.7 మీటర్ల ఎత్తు, 53 మీటర్ల పొడవుతో వంతెనకు చెక్‌డ్యాంను జత చేశారు. ఇటీవలి వర్షాలతో ఇప్పుడు అక్కడ కిలోమీటర్ మేర దాదాపు 800 క్యూబిక్ మీటర్ల నీళ్లు ఉన్నాయి. దీంతో సమీప గ్రామాల్లోని బోర్లు పూర్తిస్థాయిలో రీఛార్జి అయ్యాయి. 500 చోట్ల వంతెనలు నిర్మిస్తాం.. 170 వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో పూర్తి చేయబోతున్నాం. వచ్చే వానాకాలం నాటికి అవి సిద్ధమవుతాయి. మొత్తం 500 వంతెనలు ఈ నమూనాలో సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. భవిష్యత్తులో ఎత్తిపోతల పథకాలు పూర్తయి వాగుల్లోకి నీటి ప్రవాహం పెరిగితే, చెక్‌డ్యాం నమూనా వంతెనలు ఉన్నచోట 365 రోజులు నీటి నిల్వ ఉంటుంది. ఇది భూగర్భ జలాలను పెంచటంతోపాటు నేరుగా సాగు, తాగునీటికి ఉపయోగపడతాయి. – మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వరంగల్ జిల్లా ఆకేరు వాగుపై కల్లెడ–పర్వతగిరి మధ్య నిర్మించిన కొత్త వంతెన ఇది. వంతెన దిగువన 120 మీటర్ల పొడవు, 3.8 మీటర్ల ఎత్తుతో అడ్డుగోడ నిర్మించి చెక్‌డ్యాం ప్రయోజనాన్ని కల్పించారు. ఇటీవలి వర్షాలకు వంతెన దిగువన రెండు కిలోమీటర్ల మేర నీళ్లు నిలిచాయి. వానాకాలం ముగిసిన తర్వాత కూడా కొంతకాలం నీళ్లు నిలిచే ఉండనుండటంతో సమీప గ్రామాల్లోని బోర్లలో నీటి నిల్వ పెరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న మొత్తం వంతెనలు 511 వంతెనలకు అయ్యే ఖర్చు (అంచనా) 2,495కోట్లు తొలి విడతలో చెక్‌డ్యాం నమూనాకు ప్లాన్ చేసిన వంతెనలు: 174 వీటికయ్యే ఖర్చు రూ.520 కోట్లు ఇప్పటికి సిద్ధమైన వంతెనలు: 35 సాధారణ వంతెనను చెక్‌డ్యాం నమూనాలోకి మార్చటం వల్ల అదనంగా అయ్యే వ్యయం:10 శాతం నుంచి 15 శాతం వరకు మాత్రమే -
భోజనం మాది.. నీళ్లు మీవి!
♦ జిల్లాలోని అనేక పాఠశాలల్లో నీటి వసతి కరువు ♦ అతిథి గృహాల్లోనూ అవే ఇబ్బందులు ♦ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్న విద్యార్థులు ♦ అధికారుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం కార్పొరేట్ స్థాయి విద్య.. సకల సౌకర్యాలు.. ప్రభుత్వ పాఠశాలల్లోనే మీ పిల్లల్ని చేర్పించండి... ఇదీ ప్రతిసారి ప్రజాప్రతినిధులు, అధికారులు చెప్పే మాటలు. కానీ, వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలోని అనేక ప్రభుత్వ విద్యాలయాల్లో కనీసం తాగునీరు కూడా అందని దుస్థితి. ఇక టాయిలెట్ల పరిస్థితి చెప్పనక్కర్లేదు. దీంతో బడుల్లో తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు అనాసక్తి చూపుతున్నారు. రాయికోడ్ : మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పిల్లలు తెచ్చుకునే బాటిళ్లలో నీళ్లు అయిపోతే.. ఇక వారు పడే బాధ చెప్పలేనిది. మండల కేంద్రం రాయికోడ్‌లోని ప్రాథమిక, ఉన్నత పాఠశాలలతో పాటు శంశోద్ధీన్పూర్, ఇటికేపల్లి ప్రాథమికోన్నత, అల్లాపూర్ ప్రాథమిక, మహబత్‌పూర్, పాంపాడ్, దౌల్తాబాద్ ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు దాహంతో అలమటిస్తున్నారు. పలు పాఠశాలల్లో బోర్లు ఉన్నా పనిచేయడం లేదు. మరికొన్ని మరమ్మతులకు నోచుకోలేదు. దీంతో ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి, నాణ్యమైన విద్య అందిస్తామన్న అధికారుల మాటలపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి కోసం లక్షల రూపాయలు వెచ్చిస్తున్నామని చెబుతున్నా కనీస సౌకర్యాలు సమకూరకపోవడంపై అసంతృప్తి చెందుతున్నారు. మండలంలో 25 ప్రాథమిక, 17 ప్రాథమికోన్నత, 5 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. సగం పాఠశాలల్లో తాగునీటి సమస్య ఉంది. రెండేళ్లుగా ఇంటి నుంచే నీళ్లు రెండు సంవత్సరాలుగా ఇంటి నుంచే బాటిల్‌తో నీళ్లు తెచ్చుకుంటున్నా. మధ్యాహ్న భోజనంలో వీటినే ఉపయోగిస్తున్నా. పాఠశాలలో నల్లా ఉన్నా నీళ్లు రావడం లేదు. -సోని, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల. ఇబ్బందిగా ఉంది పాఠశాలలో నీళ్లు రావడం లేదు. బాటిళ్లలో తెచ్చుకున్న నీళ్లు అయిపోతే హోటళ్లు, బావుల వద్దకు వెళ్తున్నాం. ప్రతిరోజు నల్లాల ద్వారా నీళ్లు అందించాలి. - అర్జున్, 4వ తరగతి, రాయికోడ్ ప్రాథమిక పాఠశాల ఉన్నతాధికారులకు చెప్పాం మండలంలోని కొన్ని పాఠశాలల్లో తాగునీటి ఇబ్బందులు ఉన్నాయి. నీటి సౌకర్యం లేని పాఠశాలల వివరాలు, విద్యార్థుల ఇబ్బందులపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తాం. - నగారి శ్రీనివాస్, ఎంఈఓ రాయికోడ్. -
నల్లగొండ గుండె చెరువు
నల్లగొండ జిల్లా కరువు క(వ్య)థ ఇదీ! జిల్లా మొత్తం కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మూసీ ప్రాజెక్టు, ఉదయ సముద్రం, ఏఎమ్మార్పీ, ఎస్ఎల్బీసీ, బ్రాహ్మణవెల్లెంల... ఇలా ఎన్ని ప్రాజెక్టులున్నా ఏం లాభం? కొన్ని ప్రాజెక్టులు పూర్తికాక, పూర్తయిన ప్రాజెక్టుల్లో నీళ్లు లేక జిల్లా గొంతెండుతోంది. తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న అరకొర యత్నాలు కష్టాలను తీర్చడం లేదు. ఎన్ని ట్యాంకర్లు పెట్టినా.. ఎన్ని బోర్లు లీజుకు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ నాడు.. నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కళకళలాడే పచ్చని పొలాలు.. కాలువల నిండా పారే నీళ్లు.. పాల పొంగుల పాడి సంపద.. ఏడాదికి మూడు పంటలతో రైతన్న ముఖం నిండా సంతోషం.. చేతి నిండా పనితో కూలన్న కుటుంబం..! నేడు.. వెలవెలబోతున్న సాగర్.. ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు.. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం.. పనుల్లేక పల్లెల వలసబాట.. గడ్డి లేక పశువులను అమ్ముకుంటున్న దైన్యం.. నీళ్లు లేక పొలాల్ని బీళ్లుగా వదిలేసిన దుస్థితి..!! చతికిలపడిన సాగు.. జిల్లాలో వ్యవసాయం పూర్తిగా చతికిలపడింది. రబీ సీజన్లో వరి 60 శాతం మేర సాగుచేసినా.. అందులోనూ 10 శాతానికి పైగా నీ ళ్లు లేక ఎండిపోయింది. మొత్తం 84 వేల హెక్టార్లలో వరి సాగు చే య గా ఎకరానికి సగటున 6 క్వింటాళ్ల ధాన్యం కూడా రాలేదు. వచ్చిన ధా న్యాన్ని అమ్ముకునేందుకు కూడా సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. రోజుల తరబడి ఎదురుచూసినా కాంటాలు కావడం లేదు. రబీ సీజన్లో జిల్లాలో అన్ని పంటలు కలిపి 1.78 లక్షల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేసినా... 1.02 లక్ష ల హెక్టార్లలోనే సాగైంది. ఛిధ్రమైన అనుబంధ రంగాలు.. వ్యవసాయం కుదేలవడంతో అనుబంధ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాడి, చేపలు, కోళ్ల పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఎండలకు వందల సంఖ్యలో కోళ్లు, చేపలు చనిపోతున్నాయి. నీళ్లు లేక, మేత కనిపించక జీవాలను భువనగిరి ప్రాంతం నుంచి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వైపు తీసుకెళ్లి మేపుకుంటున్నారు. జిల్లాలో డిసెంబర్ నెలలో రోజుకు 16 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగితే ఏప్రిల్ చివరి వారంలో అది కేవలం 7 లక్షల లీటర్లకు చేరింది. డిసెంబర్ నుంచి క్రమంగా పాల ఉత్పత్తి తగ్గుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ స్థాయికి చేరింది. ‘సాగర’ ఘోష.. జిల్లాకు ప్రాణాధారమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. ఈ ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 507.40 అడుగులే! గతంలో కూడా సాగర్ ప్రాజెక్టు పలుసార్లు కనిష్ట నీటి మట్టానికి వెళ్లింది. 2004 ఆగస్టు 2న 494.30 అడుగులు, 1995 జూలై8న 494.40 అడుగులు, 2003 సెప్టెంబర్ 4న 494.90 అడుగుల కనిష్ట మట్టానికి సాగర్ ప్రాజెక్టు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్, రబీ సీజన్లలో పుష్కలంగా నీరు తెచ్చుకునే పరిస్థితుల నుంచి కేవలం జిల్లాలోని తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా వరి పంటలన్నీ అయిపోయాక, ఖమ్మం జిల్లా అవసరాలను కూడా తీర్చేందుకు గాను కృష్ణాబోర్డు ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ నీళ్లు కూడా మరో 15 రోజుల వరకే వస్తాయని, ఈసారి తాగునీటి విడుదలకు కూడా బోర్డు అనుమతినిస్తుందో, ఇవ్వదో తెలియని పరిస్థితి ఉందని డ్యాం అధికారులు చెపుతున్నారు. 15 రోజుల తర్వాత సాగర్ నుంచి తాగునీరు రాకపోతే జిల్లా దాహార్తితో అల్లాడాల్సిందే! నీటి కష్టాలు కోటి నల్లగొండ జిల్లా ప్రజలు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో సైతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇక గిరిజన తం డాలు, ఆవాస గ్రామాల సంగతి చెప్పనక్కర్లేదు. అ నుముల మండలం ఎల్లాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిక్కోలం తండాను ‘సాక్షి’ సందర్శిం చగా.. ప్రజలంతా సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. ఊళ్లో సోలార్ ద్వారా నడుస్తున్న బోరు నీళ్లు గొంతు దిగడం లేదని, త్రీ ఫేజ్ కరెంటు ఉన్నప్పుడు సన్నగా ఇంకో బోరు పోస్తున్నా అవి కూడా సరిపోవడం లేదన్నారు. చండూరు మండలం గుండ్రపల్లిలో మరీ దారుణం. ఓ పెద్దాయన చనిపోతే స్నానాలకు నీళ్లు లేక వేరే ఊళ్లో దహనం చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు. బోజ్యా తండావాసులకు బురదతో కూడిన చెలిమ నీరే దిక్కుగా మారింది. అర లీటర్ నీళ్లను మరిగిస్తే అందులో పిడికెడు సున్నం వస్తోందని చెబుతున్నారు. పాతాళానికి చేరిన గంగమ్మ.. జిల్లాలోని పది మండలాల్లో భూగర్భ జల నీటిమట్టం దారుణంగా పడిపోయింది. గత ఏడాది మార్చి నెలాఖరుకు మేళ్లచెరువు మండలంలో 13.36 అడుగుల లోతులో నీళ్లుంటే... ఇప్పుడు 31.98 అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. కోదాడ, మునగాల, త్రిపురారం, హుజూర్నగర్, దామరచర్ల, మఠంపల్లి, కనగల్, పెదవూర, నేరేడుచర్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. గుట్టలో 21.63 అడుగులకు, భువనగిరిలో 22.87, బీబీనగర్ లో 20.78, మఠంపల్లిలో 21.49, చిట్యాల 23.89, మర్రిగూడలో 21.11 అడుగులకు భూగర్భ జలమట్టం పడిపోయింది. ఉపాధి పనులెక్కడ? కరువు రక్కసి కూలీల పొట్టగొట్టింది. ఉపాధి హామీ పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద కేవలం ఇంకుడు గుంతల కార్యక్రమమే నిర్వహిస్తుండడం, రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో రోజు వారీ ఉపాధి కూలీల సంఖ్య లక్షకు చేరింది. అదే రెండు నెలల క్రితం 1.80 లక్షల వరకు ఉండేది. ఈ విషయమై బోజ్యా తండాకు చెందిన శైలి అనే మహిళ మాట్లాడుతూ... ఉపాధి పనుల్లేక అందరూ వలసపోతున్నారని, తమకు కరువు పనులు కల్పించాలని చెప్పింది. చేసిన పనులకు జీతాల్లేక మానేశామని, జీతాలు ఇస్తేనే పనికి వెళ్తామని నేరేడుచర్ల మండలం కొత్తతండాకు చెందిన గిరిజనులు ‘సాక్షి’తో చెప్పారు. ఇక ఉపాధి కూలీకి వెళ్లే వారికి కూడా సరైన రక్షణ సౌక ర్యాలు కల్పించడం లేదు. నీడ కోసం టెంట్లు, దాహార్తి తీర్చేందుకు నీళ్లు సమకూర్చలేని పరిస్థితి ఉంది. టెంట్లు కొనుగోళ్ల కోసం ఇటీవలే హైదరాబాద్ నుంచి అనుమతి వచ్చిందని, త్వరలోనే కొనుగోళ్లు చేస్తామని ఉపాధి హామీ అధికారులు చెపుతుంటే... ఎండాకాలం అయిపోయిన తర్వాత టెంట్లు కొనుక్కుని ఏం చేస్తారని ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు. పనుల్లేక పల్లెకు తాళం పనుల్లేక జనం వలసబాట పట్టడంతో చాలా తండాలు, గ్రామాల్లో ఇళ్లను తాళాలు కనిపిస్తున్నాయి. ఈ పక్క చిత్రం నిడమనూరు మండలం జోజ్యా తండాలోనిది! నునావత్ ధనుకు కుమారులకు చెందిన ఈ ఇల్లు ఇలా తాళం వేసి కనిపించింది. ధనుకు 70 ఏళ్లు ముదుసలి. నలుగురు కొడుకులు. ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు కొడుకులు, కోడళ్లు తండాలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు పనుల్లేక వారంతా గుంటూరు జిల్లా తెనాలికి వలస వెళ్లారు. దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామంలో కూడా సగం కుటుంబాలు గుంటూరు, అమరావతికి వలస వెళ్లాయి. ఈ ఊరి నుంచి వలస వెళ్లి బియ్యం కోసం స్వగ్రామానికి వచ్చిన ధనావత్ మోతీరాంను పలకరించగా.. ‘అక్కడ రోజుకు రూ.400 జీతం ఇస్తున్నారు. మా వాళ్ల గుడిసెలు ఉంటే అందులోనే నేనూ ఉంటున్నా’ అని చెప్పాడు. ఒక్క మోతీరాం, ధనుకు కుటుంబాలే కాదు జిల్లాలోని సగానికిపైగా మండలాల ప్రజలు వలస బాట పట్టారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. జిల్లాలో ఒక ట్రాక్టర్ గడ్డి రూ.4,000 పలుకుతోంది. అందులో సుమారు ఎకరన్నర గడ్డి పడుతుంది. కూలీల ఖర్చులకు రూ. 1,950 అవుతుంది. దూరాన్ని బట్టి ట్రాక్టర్ కిరాయి రూ. 2,000పైనే ఉంది. మొత్తంగా కనీసం ట్రాక్టర్ గడ్డికి రూ.9200 నుంచి రూ.9500 వరకు అవుతుంది. ఇది భువనగిరి, ఆలేరు నియోజవర్గాల లెక్క. అదే ఆయకట్టులో అయితే మిషన్ కోత కాకుండా మామూలుగా కోసిన గడ్డి అయితే ఎకరా రూ.15వేల వరకు పడుతోంది. గడ్డి విషయమై భువనగిరి మండలం హుస్నాబాద్‌కు చెందిన తుమ్మెటి జమ్మయ్యను పలకరిస్తే ‘ మాకు సుమారు 20 వరకు గేదెలు, ఆవులు ఉన్నాయి. గడ్డి లభించక పోవడంతో వలిగొండ, పరిసర గ్రామాలలో 6 ట్రాక్టర్ల గడ్డి కొన్నాను. ఒక్కొక్క ట్రాక్టర్ గడ్డి ఇంటికి చేరే సరికి రూ.10వేల వరకు ఖర్చయింది’’ అని చె ప్పారు. చెరువుల్లో చుక్కనీరు లేదు గొలుసుకట్టు వ్యవసాయానికి మూలాధారమైన చెరువులు జిల్లాలో ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ ఎండిపోని చెరువులు కూడా చుక్క నీరు లేకుండా నెర్రెలు బారి కనిపిస్తున్నాయి. జిల్లాలో మైలసముద్రం, జి.యెడవల్లి, చేపూరు, మాదారం, వాయలసింగారం, అయిటిపాముల, కొమరబండ, దోరకుంట, అమ్మగూడెం, బొమ్మేపల్లి, రేగెట్ట, తిమ్మాజిగూడెం, తుర్కపల్లి, ఇరుగంటిపల్లి, పొనుగోడు, శేరిలింగోటం, జి. చెన్నారం, తుమ్మడం పెద్ద చెరువులు ఎండిపోయాయి. వల్లభాపురం చెరువు, నల్లకుంట, పలుగు చెరువు, రాళ్లకుంట, లింగగిరి పెద్దచెరువు, గరిడేపల్లి తాళ్లచెరువు, ఉదయసముద్రం రిజర్వాయర్, పెద్దదేవులపల్లి రిజర్వాయర్, దామరచర్ల మండలంలోని చెరువులది కూడా ఇదే పరిస్థితి. వీటిలో కొన్ని చెరువులను సాగర్‌నీటితో నింపి తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రోజుకు రూ.అరకోటి వ్యాపారం జిల్లాలో పల్లె, పట్నం తేడా లేకుండా గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నాయి. సూర్యాపేటలో మూడు రోజులకోసారి నీటిని విడుదల చేస్తుండగా, మిగిలిన చోట్ల రెండు రోజులకోసారి ఇస్తున్నారు. తాగునీటి కొరతతో జిల్లాలో రోజుకు రూ.అరకోటికిపైగా వాటర్ వ్యాపారం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 వాటర్ప్లాంట్లు ఉన్నాయి. క్యాన్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.10 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. రైతులు కూడా తాగునీరు, సాగునీరు కోసం ఇటీవలి వరకు పెద్ద ఎత్తున బోర్లు వేశారు. చనిపోతున్న బత్తాయి తోటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు 2-5 వరకు బోర్లు వేశారు. దాదాపు 600-700 ఫీట్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో రైతులు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు. బత్తాయి తోటలను రైతులే నరికేసుకుంటుండగా, కొందరు ఈ సీజన్ వరకే లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు లీజుకు తీసుకుని పంటలను కాపాడుకుంటున్నారు. కరువు సాయం మహాప్రభో.. జిల్లాలో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు కరువు సాయం చేయలేదు. మొత్తం 22 మండలాల్లో 1.25లక్షల హెక్టార్లలో, 1.29లక్షల మంది రైతులకు రూ.86 కోట్ల మేర పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలు వెళ్లాయి కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదు. జిల్లా మొత్తం కరువు ఉంటే అశాస్త్రీయంగా కేవలం 22 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారని రైతు సంఘాలు గగ్గోలు పెడుతుంటే, కరువు మండలాలను ప్రకటించి రెండు నెలలవుతున్నా ఇంతవరకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కరువు కాలంలో కూడా అటు కేంద్రానికి గానీ, ఇటు రాష్ట్రానికి గానీ రైతులపై కనికరం రావడం లేదని రైతులు వాపోతున్నారు. తాగునీటి లెక్కలివి 59 జిల్లాలో మొత్తం మండలాలు 3,341 నివాస ప్రాంతాలు 1592 రక్షిత మంచినీటి సరఫరా ఉన్నవి 492 రోజూ నీళ్లు ఇస్తున్నవి 508 రోజుమార్చి రోజు ఇస్తున్నవి 4 వారానికి ఓసారి ఇస్తున్నవి 182 అసలు నీటి సరఫరా లేనివి 22 నల్లగొండ నియోజకవర్గంలో నీళ్లందని గ్రామాలు వెయ్యికిపైగా బోర్లు అద్దెకు తీసుకున్నాం కరువు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వెయ్యికి పైగా బోర్లను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిధుల కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులతో తాగునీరు, ఎండల తీవ్రతలపై సమీక్ష నిర్వహించి తగు సూచనలిస్తున్నాం. పశువుల కోసం ప్రత్యేక తొట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు 3వేల పశువుల తొట్లు ఉపాధి హామీ కింద చేపడుతున్నాం. - పి. సత్యనారాయణరెడ్డి, కలెక్టర్, నల్లగొండ. -
జీవనది తడారి..జనం బతుకు ఎడారి..!
కరువు కోరల్లో అడవుల జిల్లా ఆదిలాబాద్ ♦ గోదావరి ఎండిపోవడంతో ఎక్కడ చూసినా దుర్భిక్షం ♦ పల్లె, పట్టణం, గోండు గూడేల్లో దాహం దాహం ♦ దారుణంగా పడిపోయిన భూగర్భ జలాలు ♦ అడవుల్లో చెలిమ నీళ్లే దిక్కు ♦ నీటి కోసం కిలోమీటర్ల కాలినడక ♦ గుక్కెడు నీటికి అల్లాడుతున్న మూగ జీవాలు ♦ తెలంగాణ, మహారాష్ట్రకు పట్టని సరిహద్దు గ్రామాలు ఈ చిత్రాన్ని చూశారా? ఏముంది..? ఓ రోడ్డుపై ఆర్టీసీ బస్సు వెళ్తోందంటారా? అలా అంటే పొరపాటే! ఈ బస్సు వెళుతోంది జీవనది గోదావరిలో!! తీవ్ర కరువు పరిస్థితుల కారణంగా గోదావరి చుక్కనీరు లేకుండా ఎండిపోయి ఇలా రహదారిగా మారింది. ఆదిలాబాద్ జిల్లాకు కడెం మండల కేంద్ర సమీపంలోని ఈ చిత్రం కరువుకు అద్దం పడుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గోదావరి అవతల వైపు ఉన్న కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలకు నది మధ్యలోంచి ఆర్టీసీ బస్సులు నడుతున్నారు. ఇలా బస్సులు నడపడం ఇదే తొలిసారి! ‘‘గోదావరిలో ఆర్టీసీ బస్సును నడపడం గతంలో ఎప్పుడూ చూడలేదు.. ఇదే మొదటిసారి’’ అని పలువురు పేర్కొన్నారు. అడవుల జిల్లాగా పేరున్న ఆదిలాబాద్.. కరువు కోరల్లో చిక్కుకుంది. రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే జిల్లాలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. జీవనది గోదావరి ఎడారిగా మారింది. పంటలెండిపోవడంతో రైతు కాడి పడేశాడు. మూగజీవాలు కబేళాకు తరలుతున్నాయి. పెన్‌గంగా, ప్రాణహిత నదులు కూడా ఎండిపోయాయి. కడెం, స్వర్ణ, ఎస్సారెస్పీ వంటి ప్రాజెక్టులు ‘డెడ్’స్టోరేజీకి చేరాయి. ఇక తాగునీటి కష్టాలు వర్ణనాతీతం.. పల్లెలు, పట్టణాలు, గోండు గూడేలు గుక్కెడు నీటికోసం అలమటిస్తున్నాయి. - పాత బాలప్రసాద్, సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ గోదారమ్మ.. నీటి జాడ ఏదమ్మా.. చదువుల తల్లి బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి చెంత జిల్లాలోకి ప్రవేశించే గోదావరి నది.. కోటపల్లి వరకు సుమారు 250 కిలో మీటర్ల మేర ప్రవహిస్తుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ నది ఎడారిగానే కనిపిస్తోంది. రాళ్లు, రప్పలే దర్శనమిస్తున్నాయి. ఒక్క గోదావరి నదే కాదు.. పెన్‌గంగా, స్వర్ణ నదుల్లో కూడా చుక్క నీరు లేదు. నదుల పరిస్థితి ఇలా ఉంటే చిన్నాచితక వాగులు, వంకలు, చెరువుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. చాలాచోట్ల చెరువులు నెర్రెలు పడ్డాయి. ప్రజలు ప్రత్యామ్నయంగా భూగర్భ జల వినియోగంపై ఆధారపడుతుండటంతో నీటిమట్టం రోజురోజుకూ పడిపోతోంది. గోదావరి నదిపై సుమారు 100కు పైగా తాగునీటి పథకాలున్నాయి. ఒక్కో పథకం కింద రెండు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. గత రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా గోదావరిలో నీటిమట్టం తగ్గిపోయింది. దీంతో నదిపై ఉన్న తాగునీటి పథకాలన్నీ వట్టిపోతున్నాయి. ఇప్పటికే సుమారు 20 తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. దీంతో సమీపంలోనే గోదావరి ఉన్నా తీర ప్రాంతాలు దప్పిక కోసం నానా యాతన పడుతున్నాయి. రెండు బిందెల నీళ్లకు గంట చెలిమెలో నీళ్లను తోడుకుంటున్న ఈ దృశ్యం ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీ గిరిజనుల తాగునీటి సమస్యకు అద్దం పడుతోంది. నార్నూర్ మండలం గణేష్‌పూర్‌లో సుమారు 40 కుటుంబాలున్నాయి. ఊళ్లో ఉన్న రెండు బావులు ఎండిపోయాయి. ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేద్దామంటే గ్రామానికి రోడ్డు లేదు. ట్యాంకర్ వెళ్లడం కూడా కుదరదు. ఈ ఊరికి అర కిలోమీటరు దూరంలో వాగు ఉంది. అది కూడా ఎండిపోయింది. ఆ వాగులో రెండు చెలిమెలే వీరి దాహం తీర్చుతున్నాయి. ఒక్కో కుటుంబానికి రెండు బిందెల చొప్పున నీళ్లు తెచ్చుకుంటున్నారు. రెండు, మూడు బిందెలు తోడితే నీళ్లు ఊరడానికి గంట సేపు ఆగాలి. వంతుల వారీగా ఉదయం నుంచి రాత్రి వరకు ఈ చెలిమెల వద్ద నీళ్ల కోసం పడిగాపులుకాయాల్సిన పరిస్థితి. ఇది ఒక్క గణేష్‌పూర్ సమస్యే కాదు.. జిల్లాలో అనేక గోండు గూడేలు తాగునీటికి అల్లాడిపోతున్నాయి. వన్యప్రాణుల విలవిల వన్యప్రాణులు కరువు కాటుకు బలవుతున్నాయి. అడవిలో చెలిమె లు, కుంటలు ఎండిపోవడంతో చు క్క నీరు దొరక్క విలవిల్లాడుతున్నా యి. గొంతు తడుపుకునేందుకు అడవిని వదిలి గ్రామాల బాటపట్టాయి. ఇలా దాహార్తి తీర్చుకునేందుకు రెం డు కృష్ణ జింకలు ఇటీవల కడెం మం డలం బుట్టాపూర్ గ్రామం వైపు వ చ్చాయి. ఈ గ్రామానికి చెందిన రైతు తన పంట రక్షణ కోసం అమర్చిన కరెంటు తీగలకు తగిలి ఆ రెండు జింకలు మృత్యువాత పడ్డాయి. పట్టణాల్లోనూ దాహం దాహం! పల్లెల్లోనే కాదు.. పట్టణాల్లోనూ దాహం కేకలు వినిపిస్తున్నాయి. బెల్లంపల్లి పట్టణానికి నాలుగు రోజుకోసారి.. కేవలం గంటసేపు మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. మొత్తం 56,396 జనాభాకు 6.70 ఎంఎల్డీల నీళ్లు అవసరం ఉండగా. 3 ఎంఎల్డీల నీళ్లే ఇస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో లక్షా 75 వేల జనాభాకు రోజు విడిచి రోజు అరగంట మాత్రమే నీటి సరఫరా అవుతోంది. భైంసా మున్సిపాలిటీ ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల మున్సిపాలిటీలో 1.07 లక్షల జనాభా ఉంది. 9 ఎంఎల్డీల నీళ్లు అవసరముండగా.. 7 ఎంఎల్డీల నీళ్లు సరఫరా చేస్తున్నారు. రోజు విడిచి రోజు నీరిస్తున్నారు. మందమర్రి పట్టణంలో 30 వేల మందికి వార ంలో రెండు సార్లే నీటి సరఫరా అవుతోంది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోని 57,876 జనాభాకు.. రోజు 5.5 ఎంఎల్డీల నీటి అవసరం ఉండగా 3.15 ఎంఎల్డీల నీళ్లు మాత్రమే సరఫరా అవుతుంది. గోండు పల్లెల గోడు.. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఇల్లు సుగురె సత్యపాల్ది. నార్నూర్ మండలం సాంగ్వి పంచాయతీ పరిధిలోని లోకారి(బి)కి చెందిన ఈ రైతు తన ఇంటికి తాళం వేసి కుటుంబంతో సహా వలస వెళ్లాడు. సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న జిన్నింగ్ మిల్లులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. కరువుతో పంటలు ఎండిపోయాయి. ఉపాధి హామీ పనులు కూడా సాగడం లేదు. ఈ గ్రామంలో 180 కుటుంబాలుంటే 80కిపైగా రైతు కుటుంబాలు వలస వెళ్లాయి. ఈ పరిస్థితి ఒక్క లోకారి(బి)దే కాదు... జిల్లాలో వందలాది గోండు గూడేలు వలస బాట పట్టాయి. జిల్లాలో ఉపాధి హామీ పథకం పడకేసింది. వందకుపైగా గ్రామాల్లో ఈ పనులు సాగడం లేదు. కొన్ని గ్రామాల్లోనైతే ఏడాదిగా పనుల జాడే లేదు. మరోవైపు చేసిన పనులకు కూలి చెల్లింపులు కూడా నిలిచిపోయాయి. సుమారు 1.55 లక్షల మంది కూలీలకు జనవరి 20 నుంచి డబ్బులు చెల్లించడం లేదు. సుమారు రూ.64 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. మూగజీవాలకు గ్రాసం కరువు.. కరవు కారణంగా మూగజీవాలు అల్లాడుతున్నాయి. పశుగ్రాసం, నీటి కొరత రోజురోజుకు తీవ్రమవుతోంది. దీంతో రైతులు ప్రాణానికి ప్రాణంగా చూసుకునే పశువులను తెగనమ్ముకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 27,000 టన్నుల పశుగ్రాసం కొరత ఏర్పడిందని జిల్లా పశుసంవర్థక శాఖ అంచనా వేసింది. స్థానికంగా గ్రాసం దొరక్క తమ పశువులను మేపేందుకు అడవికి తీసుకెళుతున్నామని, నీళ్ల కోసం సుమారు పది కిలో మీటర్ల దూరంలో ఉన్న సాత్నాల ప్రాజెక్టుకు తీసుకెళుతున్నామని జైనథ్ మండలం సైదాపూర్‌కు చెందిన రాంచందర్ అనే రైతు వాపోయాడు. జిల్లాలో సుమారు 16 వరకు పశువుల సంతలున్నాయి. ఇందులో ఇచ్చోడ, కౌటాల, దండేపల్లి మండలం కొరివిచల్మ, బెజ్జూరు మండలం సలుగుపెల్లి, జైనూరు వంటి సంతల్లో పశువుల విక్రయాలు పెరిగాయి. గడ్డిని కొనుగోలు చేద్దామన్నా ధర చుక్కలనంటుతోంది. వరిగడ్డి కట్ట ఇప్పుడు రూ.18 నుంచి రూ.20 చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం సైద్పూర్లో సుమారు 1300 మంది జనాభాకు ఒకటే బోరుబావి. కరెంటు వస్తేనే నీళ్లు. దీంతో ఉదయం 6 గంటల నుంచి ఈ బోరు వద్ద నీళ్ల కోసం ఇలా నిరీక్షించాల్సిందే. మా బాధలు పట్టవా? ఈ కాలంలో కూడా బావి నీళ్లనే తాగుతూ కష్టాలు పడుతున్నాం. మమ్ముల్ని పట్టించుకునేవారే లేరు. మా బాధలు ఎవరికీ పట్టవా? ఇంకెన్నాళ్లు ఈ కష్టాలు అనుభవించాలి? - శికారే మథురాబాయి, లేండిగూడ ట్యాంకులతో నీళ్లివ్వాలి నీరు లేని చోట అధికారులు ట్యాంకర్లతో నీటిని అందించాలి. మమ్ముల్ని రెండు ప్రభుత్వాలు కూడా చిన్నచూపు చూస్తున్నాయి. మా బాధలు ఆ దేవుడికే తెలుసు. - కొండాబాయి, ఎంపీటీసీ ఆ ఒక్క బావి కూడా ఎండిపోతోంది ఎండల దెబ్బకు ఇప్పుడు నీళ్లు తెచుకుంటున్న బావి కూడా ఎండిపోయేలా ఉంది. అది ఎండిపోతే ఏం చేయాలో తోచడం లేదు. తాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, నేతలు వెంటనే స్పందించాలి. - కుడ్మెతే అంబుబాయి, బొలాపటార్ పాతాళానికి పానీ.. జిల్లాలో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. 2015 నవంబర్‌లో జిల్లాలో సగటు నీటిమట్టం 7.81 మీటర్ల లోతున ఉండేది. ఇప్పుడు ఇది 10.78 మీటర్లకు పడిపోయింది. ఏడాదిలోనే మూడు మీటర్ల లోతుకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలోని 20 మండలాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా తానూరు, లోకేశ్వరం, బజార్హత్నూర్, ఆసిఫాబాద్, దిలావర్పూర్ మండలాల్లో నీటిమట్టం ఆందోళనకర స్థాయికి పడిపోయింది. తానూర్‌లో 28.20 మీటర్లు, లోకేశ్వరంలో 25.40 మీటర్లు, బజార్హత్నూర్లో 24.42 మీటర్లు, ఆసిఫాబాద్ 23.88 మీటర్లకు, దిలావర్పూర్లో 18.25 మీటర్లు, నేరడిగొండలో 18.02 మీటరు, ముధోల్, సారంగపూర్‌లలో 15.92 మీటర్లు, కుంటాల, తాండూర్లలో 14.90 మీటర్లు, జైనథ్, బెల్లంపల్లి, బెజ్జూర్‌లలో 13.55 మీటర్లు, కాగజ్‌నగర్, గుడిహత్నూర్, దహేగాంలలో 12.20 మీటర్లకు భూగర్భ జలమట్టం పడిపోయింది. సరిహద్దు గ్రామాల అరణ్యరోదన తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో వివాదాస్పద గ్రామాలవి. ఆదిలాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని పరందోళి, అంతాపూర్ గ్రామ పంచాయతీలోని ఈ 14 గ్రామాలను రెండు రాష్ట్రాలు పాలిస్తున్నాయి. ఈ గ్రామాలవారికి రెండు రాష్ట్రాల రేషన్ కార్డులు, ఓటరు గుర్తింపు కార్డులుంటాయి. ఈ గ్రామాల్లో ఇప్పుడు తీవ్ర తాగునీటి ఎద్దడి నెలకొంది. తాగునీటి సమస్య పరిష్కారానికి వచ్చేసరికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయి. మనకెందుకులే అన్న ధోరణితో రెండు రాష్ట్రాల అధికారులు ఉండటంతో ఈ గ్రామాలు గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్నారు. పరందోళి, తాండ, మహరాజ్‌గూడ, ముకదంగూడ, శంకర్‌లొద్ది, లేండిజాల, గౌరీ, లేండిగూడ, భోలాపటార్, నారాయణగూడ, యోసాపూర్, పద్మావతి, అంతాపూర్, ఇంద్రానగర్ గ్రామాల్లో 4,852 జనాభా ఉంది. ఒక్క శంకర్‌లొద్ది మినహా ఏ ఒక్క గ్రామంలో నీటి సౌకర్యం లేదు. ఈ 14 గ్రామాల్లో 12 మంచినీటి పథకాలు ఉన్నాయి. అందులో కేవలం రెండే పనిచేస్తున్నాయి. 34 చేతిపంపుల్లో ఐదే పనిచేస్తున్నాయి. ఏళ్ల తరబడి ఆయా గ్రామాల్లో మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. లేండిగూడ, అంతాపూర్, పద్మావతి గ్రామాల్లో కిలో మీటరు దూరంలో ఉన్న బావి నుంచి నీటిని తెచ్చుకొని కాలం వెల్లదీస్తున్నారు. మరో 15 రోజులైతే ఆ బావులు కూడా ఎండిపోయో ప్రమాదం ఉంది. వర్షాలు లేక.. రబీకి వెళ్లలేక.. ఖరీఫ్‌లో పత్తి సాగు చేసిన భూముల్లో పత్తి కట్టెలను తొలగించి రబీకి సిద్ధమవుతారు రైతులు! కానీ చుక్కనీరు కూడా కరువవడంతో ఖరీఫ్‌లో వేసిన పత్తిని ఇదిగో ఇలాగే వదిలేశాడు సైదాపూర్‌కు చెందిన ఓ రైతు. వర్షాభావ పరిస్థితులతో జిల్లాలో రబీ సాగు దారుణంగా పడిపోయింది. జిల్లాలో రబీ సాధారణ సాగు విస్తీర్ణం 71,531 హెక్టార్లు కాగా.. 63 వేల హెక్టార్లలో సాగైనట్టు అధికారులు చెబుతున్నా వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఖరీఫ్‌లో నష్టాలు ఎదుర్కొన్న రైతులు రబీ సాగుకు వెనుకడుగు వేశారు. వరి 19,352 హెక్టార్లకుగాను 14 వేల ఎకరాల్లోనే సాగైంది. జొన్న 11,149 హెక్టార్లకు.. 7,689 హెక్టార్లలోనే సాగైంది. మిగతా పంటల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. పెట్టుబడులు పెట్టి అప్పులపాలయ్యే కన్నా బీడుగా ఉంచుకోవడమే మేలని భావిస్తున్నారు. ప్రత్యేక చర్యలు చేపట్టాం కరువు నేపథ్యంలో ప్రత్యేక చర్యలు చేపట్టాం. జిల్లాలో నాలుగు వందలకుపైగా గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. ఈ గ్రామాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరువు కారణంగా ప్రజలు వలసలు వెళ్లకుండా నివారించేందుకు అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ముమ్మరం చేశాం. పశువుల విక్రయాలు జిల్లాలో లేవు. పశువుల తాగునీటి కోసం తొట్టెల నిర్మాణం చేపట్టాం. జిల్లా ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. అటవీ ప్రాంతంలో వన్య ప్రాణులకు తాగునీటి వసతి కల్పించేందుకు సోలార్ పంపుసెట్లు ఏర్పాటు చేశాం. - సుందర్ అబ్నార్, జిల్లా జాయింట్ కలెక్టర్ -
గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!
భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీల అరణ్యరోదన దండకారణ్యం నుంచి బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆ ఆదివాసీలంతా దేశ పౌరులే.. వారందరికీ ఓటరు కార్డులుంటాయి.. ఓట్లు వేయించుకునే వరకే నాయకులకు వారితో పని.. ఆ తర్వాత వారి వెతలు ఎవరికీ పట్టవు! గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నా అటు వైపు తొంగి చూసేవారుండరు.. గొంతు తడుపుకునేందుకు మండుటెండల్లో మైళ్ల దూరం నడుస్తున్నా ‘అయ్యో.. పాపం’ అనే నాథుడు ఉండడు.. కరువు రక్కసికి గూడేలు విలవిలలాడుతున్నాయి. కుటుంబంలో మూడ్రోజులకు ఒకరు అని వంతులు పెట్టుకొని స్నానాలు చేసే దుస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం సరిహద్దున భద్రాచలం ఏజెన్సీ పరిధిలో ఆదివాసీ, గిరిజన గూడేల్లోని వెతలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్. చుక్క నీరు లేదు..: ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేలాది మంది ఆదివాసీ, గిరిజన కుటుంబాలు భద్రాచలం ఏజెన్సీలో నివసిస్తున్నారుు. గోదావరికి సమీపంలో ఉన్న చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దున ఉన్నాయి. ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వర్షాభావంతో ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఉన్న మంచినీటి బావులు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడా చేతి పంపులున్నా వాటిల్లో నీళ్లు లేవు. నీళ్ల కోసం జాతరలా.... గోదావరి ఒడ్డున ఉన్న పూసూరు గ్రామం వాజేడు మండల పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి బోర్లు ఎండిపోగా.. బావుల్లో కూడా నీళ్లు అడుగంటాయి. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి చెలమ ఇప్పుడు ఈ గ్రామం దప్పిక తీరుస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోదావరి ఇసుక తిన్నెల్లో జాతరగా చెలమకు వెళ్లి కావడిలో, బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామం గోదావరి ఒడ్డునే ఉన్నా.. నీరున్న పాయంతా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం సమీపంలో ఉండటంతో 2 కి.మీ. నడక తప్పడం లేదు. ఇటీవలే ఏటూరు నాగారం-వాజేడు జాతీయ రహదారిని కలిపేందుకు గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించారు. గోదావరి నీటిని చూసుకుని మురుస్తున్నా.. తాగడానికి మంచినీళ్లు మాత్రం లేవని ఈ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదారి ఒడ్డున ఎడ్జర్ల పంచాయతీ పరిధి లో ఉన్న బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు, ఎడ్జర్లపల్లి ఆదివాసీలు, గిరిజనుల పరిస్థితి కూడా ఇంతే! గొంతు తడుపుతున్న 40 ఏళ్ల చెలమ చర్ల మండలం పార్శికగూడేనికి సమీపంలో ఉన్న రామబ్రహ్మం చెలమ 40 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన గూడేల గొంతు తడుపుతోంది. ఎంత కరువు వచ్చి నా.. ఈ చెలమలో నీళ్లుంటున్నాయి. ఈ చెలిమపై ఉన్న రామబ్రహ్మం కుంట లో నీళ్లు లేకున్నా ఇందులో ఎప్పుడూ నీళ్లుంటాయి. పార్శికగూడెం, బర్లగూడెం, రామవరం ఆదివాసీలంతా ఉదయం, సాయంత్రం ఈ చెలమ నీరు తెచ్చుకుంటారు. గూడేల్లో ఎవరింట్లో శుభకార్యం ఉన్నా.. నాలుగైదు కుటుంబాలవారు కలసి ఆ ఇంటికి ఈ చెలమ నీటిని మోస్తారు. ‘నాకు పెళ్లైన కాడ్నుంచి 40 ఏళ్లుగా ఈ చెలమ నీళ్లే తాగుతున్నాం’ అని పార్శిగూడేనికి చెందిన సారమ్మ(65) చెప్పింది. దాహం తీరాలంటే 10 కి.మీ. వెళ్లాల్సిందే.. భద్రాచలం ఏజెన్సీలో ఒక్కొక్కరి ఇంట్లో పది నుంచి 20కి పైగా పశువులు ఉంటాయి. నీళ్లు లేకపోవడంతో పశువులను గోదావరి వైపునకు పంపుతున్నారు. తెల్లవారుజామునే గ్రామాల నుంచి మేత మేసుకుంటూ బయలుదేరిన పశువులు పది కిలోమీటర్లకుపైగా ఉన్న గోదావరికి చేరుకునే సరికి సాయంత్రం నాలుగైదు అవుతుంది. ఇలా వేలాది పశువులు గోదారి బాట పడతాయి. ముందే వెళ్లిన పశువులు ఇసుకలో వేడికి నడవలేక గోదారి ఒడ్డున కాసేపు సేదతీరుతాయి. సాయంత్రం వేడి చల్లారిన తర్వాత మళ్లీ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి ఆవల ఉన్న పాయలో నీళ్లు తాగుతాయి. తర్వాత పశువులన్నీ సమూహంగా మళ్లీ రాత్రి గ్రామాల బాట పడతాయి. దేవుడిచ్చిన నీళ్లు అవి.. సబక చిన్ని (పటేల్)... ఈయన క్రాంతినగర్ గూడేనికి నాయకుడు (పటేల్). గూడెంలో అంతా ఈయన చెప్పినట్టే నడుచుకుంటారు. గూడేనికి ముందుగా వచ్చి పదేళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకుంది చిన్ని కుటుంబమే. ఐదేళ్ల క్రితం వర్షాల్లేక తాగటానికి నీళ్లు లేక అడవి బాట పట్టిన చిన్నికి సోమలదేవమ్మ గుట్ట కింద కొన్ని నీళ్లు కనిపించాయి. అప్పుడు ఆ నీళ్లున్న గుంటను పెద్ద తోగుగా చేయించాడు. ఆ గుంటలో ఎప్పుడు చూసినా 10, 15 బిందెల వరకు నీళ్లు వస్తాయి. గూడెం వారు ఇప్పుడు ఈ తోగుకే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి తమకు దేవుడిచ్చిన నీళ్లని చిన్ని చెప్పాడు. వంతుల వారీగా స్నానం చర్ల-భద్రాచలం ప్రధాన రహదారి పక్కనే చర్ల మండల పరిధిలో బి.ఎస్.రామయ్య నగరం ఉంది. ఇక్కడ 40 వరకు ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గూడెంలో ఉన్న రెండు మంచినీటి బావులు కూడా ఎండిపోయాయి. సబ్బంపేట పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ గూడేనికి వారానికి 2 రోజులు ట్యాంకర్ల ద్వారా నీళ్లందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి మూడురోజులకు ఒకసారి ఐదు బిందెలే నీళ్లు ఇస్తున్నారు. కుటుంబంలో 3 రోజులకు ఒకరు చొప్పున వంతులవారీగా స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. పది కిలోమీటర్ల మేర ఎక్కడా బోర్లు, బావులు లేకపోవడంతో ఈ గూడెం వాసులంతా ట్యాంకర్ నీళ్లు ఎప్పుడు వస్తాయా..? అని పడిగాపులు గాస్తున్నారు. తాగడానికి నీళ్లు లేకపోవడంతో పశువులను అడవికే వదిలారు. గ్రామంలో ఉన్న రెండు బావుల్లో ఓ బావిలో రోజూ రెండు బొక్కెన్ల నీళ్లే దొరుకుతాయి. ట్యాంకర్ రాని సమయంలో మూడ్రోజుల్లో ఎవరింట్లో నీళ్లు అయిపోతే ఆ కుటుంబం బొక్కెనతో నీళ్లు తోడుకోవాలి. చెలమలే దిక్కు... ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన 30 కుటుంబాలు చర్ల మండలం క్రాంతినగర్‌లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ గూడెం అంతా దండకారణ్యంలో ఉంది. గ్రామంలోని మంచినీటి బావి ఎండిపోయింది. దీంతో గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరంలోని ఎలగలతోగు (చెలమ) నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కరోజు తెచ్చుకున్న నీటిని రెండ్రోజుల వరకు జాగ్రత్తగా వాడుకుంటారు. అడవి జంతువుల నుంచి ముప్పు ఉందని తెలిసినా గ్రామస్తులు రాత్రివేళల్లో నీళ్ల కోసం గుంపులుగా వెళ్తారు. మండువేసవిలో తమ గొంతు తడుపుతున్న ఈ తోగుకు ‘సోమలదేవమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. -
చావుకీ 'నీళ్ల' కరువు!
♦ పాలివాళ్ల స్నానాలకు నీళ్లు లేక స్వగ్రామంలో అంత్యక్రియలు జరపని వైనం ♦ నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో ఘటన ♦ గత నెల 30న చనిపోయిన పెండ్యాల నారాయణరావు ♦ ఇల్లు ఉన్న గ్రామంలో దహనం వద్దన్న కొడుకులు, బంధువులు ♦ కర్మకాండలు, స్నానాలకు నీళ్లు లేకపోవడమే అసలు కారణం ♦ ఊర్లోనే చేయాలని ప్రజలడిగినా కుటుంబ సభ్యుల వెనుకంజ (మేకల కల్యాణ్ చక్రవర్తి) సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఉన్న ఊరు, కన్న తల్లి... ఈ రెండు పదాలకు మనిషి జీవితంతో విడదీయరాని అనుబంధం ఉంది. తల్లి లాలనలో అల్లారుముద్దుగా పెరిగి పెద్దయిన తర్వాత ఆ మాతృమూర్తి రుణం తీర్చుకోవాలని.. ఎక్కడ ఉన్నా, ఏం చేసినా.. ఉన్న ఊరికి సేవచేయాలని, కన్ను మూసినప్పుడు మాత్రం ఆ ఊర్లోనేఆరడుగుల స్థలంలో శాశ్వతంగా నిద్రపోవాలని చాలామంది కోరుకుంటారు. అందుకే మనిషి ఎక్కడ చనిపోయినా స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు, కర్మకాండలు జరిపించడం మనదేశంలో ఆనవాయితీ. కానీ, నల్లగొండ జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులు ఓ దొరవారిని ఉన్న ఊరికి దూరం చేశాయి. తాను పుట్టి పెరిగి, విద్యాబుద్ధులు నేర్చుకుని పెద్దమనిషిగా ఎదిగేందుకు దోహదపడిన ఆ గ్రామంతో దొరవారికి ఉన్న బంధాన్ని శాశ్వతంగా తెంపేశాయి. అందుకు కారణమేంటంటే.. నీళ్లు, నీళ్లు, నీళ్లు. దొరవారిని ఊర్లో దహనం చేస్తే పాలివాళ్లు (అదే ఇంటిపేరు కలిగిన చిన్నాన్న, పెదనాన్న తరఫు వాళ్లు) స్నానాలు చేయడానికి కూడా గ్రామం లో నీళ్లు లేకపోవడమే ఇందుకు కారణం. ఈ కారణంతోనే ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు వెనుకంజ వేశారు ఆయన కుటుంబసభ్యులు. ఊర్లో పెద్దమనిషిగా పేరున్న దొరవారు తమ ఊర్లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్న కోరికతో దొరవారిని ఊర్లోనే దహనం చేయాలని గ్రామస్తులంతా కోరినా.. కేవలం నీటి ఎద్దడి కారణంగానే కుటుంబ సభ్యులు మనోవేదనతో ఊరికి దూరంగా ఆయన అంత్యక్రియలు చేయాల్సి వచ్చింది. నల్లగొండ జిల్లా చండూరు మండలం గుండ్రపల్లిలో జరిగిన ఈ ఘటన రాష్ట్రంలో ఉన్న నీటికొరతకు ఓ మచ్చుతునక. దొరవారు.. ఆ ఊరి కథ పెండ్యాల నారాయణరావు అనే పెద్దమనిషిది నల్లగొండ జిల్లాలోని చండూరు మండలం గుండ్రపల్లి గ్రామం. ఆయన పుట్టి పెరిగింది అక్కడే. ఎంతో క్రమశిక్షణ కలిగిన మనిషిగా, తెలుగుతోపాటు పార్శీ, ఉర్దూ భాషలు నేర్చుకున్న వ్యక్తిగా గ్రామంలో ఆయన తెలియని వారు లేరు. ఆయన మాటంటే గౌరవం కూడా. అందుకే ఆయన్ను నారాయణరావు దొరవారు అని ఆప్యాయంగా కూడా పిలుచుకుంటారు. ఆయనకు ఊర్లోనే భూమి, ఇల్లు, కావాల్సినంత బలగం ఉంది. నలుగురు కుమారులు వివిధ వృత్తుల్లో స్థిరపడ్డారు. ముగ్గురు కుమార్తెలుంటే ఇద్దరు చనిపోగా, మరో కూతురు ఊర్లోనే ఉంటోంది. భార్య యశోదమ్మ 18 ఏళ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయారు. రెండేళ్ల క్రితం వరకు ఆయన కూడా ఊర్లోనే ఉన్నారు. దాదాపు 95 ఏళ్ల వయసు రావడంతో అనారోగ్య సమస్యల కారణంగా ఆయన తన రెండో కుమారుడు ఉండే నల్లగొండకు వచ్చారు. ఇటీవలే ప్రమాదవశాత్తు జారిపడ్డ ఆయనకు బాగా సుస్తీ చేసింది. దీంతో గత నెల 30న నల్లగొండలోనే కన్నుమూశారు. ఆయన చనిపోయిన నల్లగొండకు, స్వగ్రామం గుండ్రపల్లికి కేవలం 35 కిలోమీటర్ల దూరమే. పెద్దమనిషి చనిపోవడంతో ఊరికి తీసుకెళ్లి స్వగ్రామంలో దహనం చేయాలని, ఆయన ఇష్టపడి కట్టుకున్న ఇంట్లోనే కర్మకాండలు జరిపించాలని అంతా భావించారు. కానీ, వారి కులస్తులు చనిపోయినప్పుడు అంత్యక్రియలు చేసే చోట బావి ఎండిపోయింది. దాదాపు 300 ఎకరాలకు నీళ్లు పారించిన కుంట కింది బావి కూడా వట్టిపోయింది. ఆ ఊళ్లో కనీసం తాగడానికి కూడా నీళ్లు లేవు. పేరుకు నాలుగు మంచినీటి ట్యాం కులున్నా.. రాత్రింబవళ్లు నీళ్ల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే. గతంలో ట్యాంకర్లు కొనుక్కుని నీళ్లు తెచ్చుకున్నారు.. కానీ ఇప్పుడు ఆ ట్యాంకర్లు కూడా లేవు. కనీసం వాడుకునేందుకు... ఒక్క మాటలో చెప్పాలంటే స్నానాలు చేసేందుకు కూడా నీళ్లు లేవు. ఈ పరిస్థితుల్లో నారాయణరావు పార్థివదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళితే నీటి ఇబ్బంది ఎదురవుతుందన్న చర్చ జరిగింది. ఊర్లోకి తీసుకెళ్లాలని కొందరు, తీసుకెళ్లి ఇబ్బందులు ఎక్కడ పడతామని మరికొందరు.. ఇలా చర్చోపచర్చలు జరిగాయి. ఊరి ప్రజలంతా ఆయనను ఊర్లోకి తీసుకొచ్చి దహనం చేయాలని అడిగారు.. కానీ కుటుంబ సభ్యులకు ధైర్యం సరిపోలేదు. పాలివాళ్లు స్నానాలు చేయడానికి, ఆ తర్వాత నిర్వహించే కార్యక్రమాలు, కర్మకాండలకు, పెద్దదినాలు చేసేరోజు ఇష్టబంతికి నీళ్లు ఇబ్బందవుతాయని కుమారులు భావిం చారు. అంతే.. ఊరికి తీసుకెళ్లకుండా నల్లగొండలోని ఓ శ్మశాన వాటికలో దహనం చేశారు. 30 కుటుంబాలవారు అప్ అండ్ డౌన్ ఇంకేముంది.. ఇప్పుడు ఊర్లోని బంధువులు, పాలివాళ్లు రోజూ నల్లగొండకు వచ్చిపోతున్నారు. దొరవారి కర్మకాండలు, రోజువారీ కార్యక్రమాల కోసం 30 కుటుంబాలకు చెందిన పాలివాళ్లు గుండ్రపల్లికి, నల్లగొండకు అప్ అండ్ డౌన్ చేస్తున్నారు. చుక్క నీళ్లుంటే ఒట్టు.. చండూరు మండలం గుండ్రపల్లిలో ప్రజలు తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. ఈ గ్రామంలో మొత్తం 2 వేలకు పైగా జనాభా ఉంది. ఏనుగువారి గూడెం, అలరాజుబావి గూడెం, కోమటివారి గూడెం అనే మూడు ఆవాస గ్రామాలు కూడా ఉన్నాయి. ఊళ్లో ఉన్న నాలుగు ట్యాంకుల్లో నీళ్లు ఎప్పుడు వస్తాయా? అని గ్రామస్తులంతా ఎదురుచూడాల్సిన పరిస్థితి. రాత్రింబవళ్లు నీళ్ల కోసం కాపలా కాయాల్సిందే. ఉన్న బోర్లు వట్టిపోయాయి. 3, 4 రోజులకోసారి నీళ్లు వస్తున్నాయి. అవి తాగేందుకు కూడా సరిపోవడం లేదు. ఇక, వాడుకకు, స్నానాలకు నీళ్లన్న మాటే కరువయ్యాయి. గ్రామంలోని యువకులకు పిల్లనివ్వాలంటేనే నీటి ఎద్దడిని చూసి భయపడుతున్నారని, పొద్దున్నే భర్త నిద్ర లేచి భార్య ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి (భార్య నీళ్ల కోసం ట్యాంక్‌ల వద్దకు వెళ్లి కాపలా కాస్తుంది.) ఏర్పడిందని గ్రామస్తులు చెపుతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగాది నాడు కూడా స్నానాలు చేయలేదని, స్నానం చేయక బట్టలు ఉప్పురిసి పోయాయని గ్రామంలోని మహిళలు వాపోతున్నారు. మొన్న పోయినం.. నిన్న పోయినం..ఈ రోజు కూడా పోవాలె మా పెదనాన్న నారాయణరావు అంత్యక్రియలు ఊర్లోనే చేయాలనుకున్నాం. కానీ, నీటి సమస్యతో నల్లగొండలోనే చేశారు. ఊర్లో మంచి పేరున్న మా పెదనాన్నను ఊరికి తీసుకురావాలని అందరూ అడిగినా తీసుకురాలేకపోయాం. ఇప్పుడు ఆయన కర్మకాండల కోసం రోజూ నల్లగొండకు వెళ్లి రావాల్సి వస్తోంది. మొన్న పోయినం.. నిన్న పోయినం.. ఇష్టబంతికి ఈ రోజు కూడా పోవాలి. కేవలం ఊర్లో నీళ్లు లేవన్న కారణంతోనే మా పెదనాన్న పార్థివదేహాన్ని నల్లగొండలో పెట్టారు. - పెండ్యాల మనోహర్‌రావు, నారాయణరావు బంధువు -
విషం తాగుతున్నామా!
-
విషం తాగుతున్నామా!
జలమండలి నీటిలో ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఏసిరెడ్డి రంగారెడ్డి: బొట్టుబొట్టులో హాలాహలం.. ప్రమాదకరమైన ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా.. మంచినీరే కదా అని తాగారో.. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా, జీర్ణకోశ వ్యాధులు తథ్యం! భాగ్యనగరానికి జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిలోకి ఓసారి తొంగిచూస్తే ఇన్ని రకాల జబ్బులు పలకరించాయి మరి!! ఆరోగ్యాన్ని కుప్పకూల్చే బ్యాక్టీరియాలు కుప్పలుతెప్పలుగా కనిపించాయి. ఒకటి కాదు రెండు కాదు.. నగరంలో 8.65 లక్షల నివాసాలకు జలమండలి మంచినీటి రూపంలో ఇలా హాలాహలాన్ని పంచుతోంది. నగరంలో కలుషిత జలాలపై స్వల్ప కాలంలోనే 647 ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో జలమండలి సరఫరా చేస్తున్న మంచినీటిని ‘సాక్షి’ సేకరించింది. ఆ నీటిని ల్యాబ్‌లో పరీక్షించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. పలు బస్తీలు, కాలనీలకు సరఫరా చేస్తున్న జలంలో మానవ మలమూత్రాదుల్లో ఉండే కోలిఫాం, ఈ-కొలి, సిట్రోబ్యాక్టర్ బ్యాక్టీరియా ఉన్నట్లు తేలింది. ఎల్బీనగర్, సికింద్రాబాద్, బహదూర్‌పురా, ముషీరాబాద్, చంచల్‌గూడ, కార్వాన్, మెహిదీపట్నం, సీతాఫల్మండి తదితర ప్రాంతాల నుంచి సేకరించిన నీటిలో ఈ విష కారకాలు ఉన్నట్టు వెల్లడైంది. నగరంలో అనేకచోట్ల మంచినీటి పైప్లైన్లు డ్రైనేజీ లైన్లతో కలిసిపోవటం, పలుచోట్ల లీకేజీలు, శుద్ధి కేంద్రాల్లో నిబంధనలను గాలికొదిలేయడంతో మంచినీళ్లు పూర్తిగా కలుషితమైపోతున్నాయి. చిత్త’శుద్ధి’ఏదీ?: హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్, సింగూరు, మంజీరా, కృష్ణా నీటిని శుద్ధిచేసి సరఫరా చేసేందుకు జలమండలి ఏటా సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రతి వెయ్యి లీటర్ల నీటి శుద్ధికి రూ.27 ఖర్చు చేస్తున్నారు. నగరంలో నాలుగు చోట్ల, మెదక్, నల్లగొండ జిల్లాల పరిధిలో మరో 12 చోట్ల ఫిల్టర్బెడ్లున్నాయి. ఈ నీటిని మహానగరానికి సరఫరా చేసేందుకు 250 స్టోరేజీ రిజర్వాయర్లున్నాయి. ఈ కేంద్రాల వద్ద నీటిశుద్ధి ప్రక్రియను గాలికొదిలేస్తున్నారు. పొరుగు జిల్లాల నుంచి నగరానికి నీటిని తరలించేందుకు 900 కి.మీ. మేర ట్రంక్మెయిన్ భారీ పైపులైన్లు, నగరవ్యాప్తంగా మరో 9 వేల కి.మీ. మేర పైపులైన్లు ఉన్నాయి. వీటికి తరచూ ఏదో ఓచోట లీకేజీలు ఏర్పడుతుండడంతో పైప్లైన్లలోకి మురుగు నీరు, చెత్తాచెదారం చేరుతోంది. ఇలా శుద్ధి చేయాలి.. జలాశయాల్లోని నీటిని(రా వాటర్) నాలుగు దశల్లో శుద్ధి చేయాలి. మొదటి దశ: క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్ రసాయనాలు కలిపి కెమికల్ ట్రీట్మెంట్ నిర్వహించాలి. రెండో దశ: నిల్వ ఉన్న నీటిలో ఆలం కలిపి అందులోని ఘన వ్యర్థాలు, ధూళి కణాలు రిజర్వాయర్ అడుగున చేరేలా చూడాలి. మూడో దశ: మంచినీటిని వివిధ ఫిల్టర్ల ద్వారా శుద్ధిచేయాలి. చిన్న, పెద్ద సైజు గులక రాళ్లు, సన్న ఇసుక, దొడ్డు ఇసుక, లేయర్స్ మీడియా ఫిల్టర్ల మీదుగా నీటి ప్రవాహం వెళ్లనివ్వాలి. నాలుగో దశ: బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద ప్రతి వెయ్యి లీటర్ల నీటికి 2 పీపీఎం, సర్వీసు రిజర్వాయర్ల వద్ద 1.5 పీపీఎం, వినియోగదారుడికి నల్లాల ద్వారా అందించే సమయంలో 0.2 పీపీఎం మోతాదులో క్లోరిన్ ఉండేలా చూడాలి. * కార్బోనేట్ ఫిల్టర్లను ఏర్పాటు చేసి నీటిని పూర్తి స్థాయిలో శుద్ధిచేయాలి. * ఫిల్టర్ బెడ్‌లోకి వచ్చిన నీటిలోకి ఆక్సిజన్‌ను అధిక మోతాదులో పంపితే నీటి నాణ్యత మెరుగుపడుతుంది. రంగు మటుమాయమౌతుంది. కాలుష్యానికి కారణాలెన్నో.. * ఫిల్టర్ బెడ్లు, స్టోరే జీ రిజర్వాయర్ల వద్ద నీటిని శుద్ధి చేసేందుకు ఆలం, క్లోరిన్, ఫెర్రిక్ సల్ఫేట్లను సరైన మోతాదులో కలపడం లేదు. క్షేత్రస్థాయి సిబ్బంది క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు, ఇతర రసాయనాలను ప్రైవేటు వ్యక్తులకు, దళారులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. * ప్రతి స్టోరేజీ రిజర్వాయర్ వద్ద 600 కేజీల ఆలం, 36 కేజీల క్లోరిన్గ్యాస్ను కలిపి నీటిని శుద్ధి చేయాల్సి ఉన్నా ఆ నిబంధన పాటించడం లేదు. * మంచినీటిలోకి ఆక్సిజన్‌ను పంపే ఏరియేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయకపోవడం. నీటిలో రంగు పూర్తిగా పోవాలంటే నాన్ఫెర్రిక్ హైడ్రేటెడ్ లైమ్ కలపాలి. దీన్నీ గాలికొదిలేస్తున్నారు. * బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు, సర్వీసు రిజర్వాయర్ల వద్ద క్లోరినేషన్ కోసం కేటాయించిన క్లోరిన్ గ్యాస్ సిలిండర్లు పక్కదారిపడుతున్నాయి. దీంతో తగు మోతాదులో క్లోరిన్ ను కలపడం లేదు. * నగరంలో 250 సర్వీసు రిజర్వాయర్లను సీజన్ మారగానే శుద్ధి చేయాల్సి ఉన్నా పట్టించుకోవడంలేదు. సుమారు 50 రిజర్వాయర్ల వద్ద అపరిశుభ్రత రాజ్యమేలుతోంది. * మంచినీరు, డ్రైనేజీ పైప్లైన్లు అల్లుకుపోయిన ప్రాంతాల్లో లీకేజీల వల్ల మురుగు నీరు, మంచినీటి లైన్లలోకి ప్రవేశిస్తోంది. గ్రేటర్లో 1,500 బస్తీలు ఉండగా.. లీకేజీల వల్ల తరచూ 100 బస్తీలు కలుషిత జలాల బారిన పడుతున్నాయి. * నగరంలో యుద్ధప్రాతిపదికన 1,100 కిలోమీటర్ల మేర పురాతన మంచినీటి పైప్లైన్లు మార్చాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. * నీటి నాణ్యత తెలుసుకునేందుకు చేసే ఫిజికో కెమికల్, బ్యాక్టీరియాలజీ పరీక్షలను మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు. * జలాశయాల నుంచి ఫిల్టర్‌బెడ్‌కు వచ్చే నీటికి కెమిక ల్, క్లోరిన్, బ్లీచింగ్, ఆలం, వైట్ పౌడర్లను సరైన మోతాదులో కలపకుండానే శుద్ధి చేస్తున్నారు. * గండిపేట క్యాండుట్ కాలువ నిజాంకాలం నాటిది. కొన్నిచోట్ల నాలాపై కప్పు లేకపోవడంతో చెత్తాచెదారం చేరుతోంది. * అనేక స్టోరేజీ రిజర్వాయర్ల వద్ద నీటిలో ఘన వ్యర్థాలు, ధూళి కణాలను తొలగించేందుకు ఫిల్టర్లు లేవు. పురాతన పైపులైన్ల వల్లే.. నగరంలో డ్రైనేజీ, మంచినీరు పైపులైన్లు పక్కపక్కనే ఉండ డం, చాలాచోట్ల 50 ఏళ్ల నాటి పైపులైన్ల కారణంగానే తరచూ జలాలు కలుషితమవుతున్నాయి. తక్ష ణం పురాతన పైపులైన్లు మార్చి స్టెయిన్లెస్ స్టీలు పైపులు వేస్తే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. - పద్మనాభరెడ్డి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి తాగడానికి పనికిరాదు ఈ-కొలి, కోలిఫాం బ్యాక్టీరియా ఆనవాళ్లున్న నీరు తాగడానికి పనికిరాదు. తాగితే తీవ్రమైన జీర్ణకోశ వ్యాధుల బారిన పడతారు. యూవీ ఫిల్టర్స్ ద్వారా శుద్ధిచేసిన నీటిని తాగితే మంచిది. - ఎనుముల రాజు, వాటర్ క్వాలిటీ అనలిస్ట్ జలమండలి వైఫల్యమే.. నగరవాసులకు స్వచ్ఛమైన నీటి ని సరఫరా చేయడంలో జల మండలి విఫలమవుతోంది. కలుషిత జలాలు జనం ఉసురు తీస్తున్నాయి. ఈ నీళ్లు తాగి అనారోగ్యానికి గురవుతున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించే బాధ్య త ప్రభుత్వానిదే. జలమండలిపై నమ్మకం లేక జనం ఫిల్టర్ నీళ్లు కొనుక్కుంటున్నారు. -ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్ చీఫ్ మెంటార్ జీర్ణకోశ వ్యాధులు వస్తాయి కోలిఫాం, ఈ-కొలి బ్యాక్టీరియా ఉన్న నీళ్లు తాగి తే జీర్ణకోశ వ్యాధులు వస్తాయి. అతిసారం, టైఫాయిడ్, న్యుమోనియా వంటి వ్యాధులకు గురవుతారు. చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణిలపై దీని ప్ర భావం అధికం. నల్లా నీరు కాచి చల్లార్చి తాగాలి. - డాక్టర్ బి.రమేష్,గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, ఉస్మానియా ఆస్పత్రి -
జల గరళం
- సర్కారు స్కూళ్లలో తాగునీటి తిప్పలు - విద్యార్థులకు పొంచి ఉన్న ముప్పు - ఏజెన్సీ స్కూళ్లలో పరిస్థితి తీవ్రం - రక్షిత మంచినీరు కరువు - అటకెక్కిన జలమణి ప్లాంట్లు సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సర్కారు స్కూళ్ల విద్యార్థులకు ముప్పు పొంచి ఉందా..? స్కూళ్లలో విద్యార్థులు తాగుతున్నది అరక్షిత మంచినీరేనా..? జిల్లా స్థాయిలో విద్యాశాఖ, క్షేత్రస్థాయిలో ప్రధానోపాధ్యాయులు విద్యార్థులపై తమ బాధ్యతను విస్మరించారా..? వారి ఆరోగ్యంపై పట్టింపులేకుండా వ్యవహరిస్తున్నారా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. జిల్లాలో సుమారు 2వేల పాఠశాలల్లో విద్యార్థులు కలుషిత బోరు నీరే తాగుతున్నారు. నమ్మలేకున్నా ఇదే వాస్తవం. ఓ పక్క విజృంభిస్తోన్న విషజ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ జిల్లా ప్రజల్లో దడపుట్టిస్తుంటే.. మరోపక్క సర్కారు స్కూళ్లలో విద్యార్థులకు డయేరియా ముప్పు పొంచి ఉంది. ఆరేళ్ల క్రితం జిల్లాకు జలమణి ప్లాంట్లు(రక్షిత మంచినీటి) మంజూరు కాగా.. ప్రస్తుతం అవి జాడలేకుండా పోయాయి. దీంతో గ్రామీణ విద్యార్థులు పాఠశాల ఆవరణలో ఉన్న చేతిపంపులు, బోరుబావుల నీళ్లు తాగుతూ ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారు. అటకెక్కిన ‘జలమణి’..! ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యతోపాటు రక్షిత తాగునీరు అందించాలన్న సదుద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2010లో ‘జలమణి’ పథకానికి శ్రీకారం చుట్టింది. తొలివిడతగా జిల్లా అధికారులు 2011లో జిల్లా వ్యాప్తంగా 146 పాఠశాలలను ఎంపిక చేసి ‘జలమణి’ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం గ్రామీణ నీటి సరఫరా విభాగానికి అప్పగించింది. పథకానికి సంబంధించి యూనిట్ల ఏర్పాటుకు ఓ ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య, ఏర్పాటు చేసే వాటర్ ప్లాంట్ల సామార్థ్యాన్ని బట్టి ఒక్కో యూనిట్‌కు ఒక్కో విధంగా నిధులు కేటాయించింది. కనిష్టంగా రూ.15వేలు గరిష్టంగా రూ.30వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. క్షేత్రస్థాయిలో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ల కక్కుర్తితో విద్యార్థులకు రక్షిత నీరు అందకుండాపోయింది. చాలా పాఠశాలల్లో ప్లాంట్లు ఏర్పాటు చేయనే లేదు. కొన్ని స్కూళ్లలో ఏర్పాటు చేసినా నిర్వహణ లోపంతో నిరుపయోగంగా.. అలంకార ప్రాయంగా మారాయి. ప్లాంట్లు ఏర్పాటు చేసే పాఠశాలల గుర్తింపు విషయంలోనూ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు పెద్ద తప్పే చేశారు. భూగర్భ జలం, కనీసం బోరు కూడా లేని పాఠ శాలల పేర్లనూ కేంద్రానికి పంపారు. ఆయా స్కూళ్లలోనూ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్ర నిధులు ఇచ్చింది. క్షేత్రస్థాయిలో నీళ్లు లేకపోవడంతో ప్లాంట్ల ఏర్పాటు జరగనే లేదు. ఫలితంగా మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు ఇప్పటికీ బావులు, బోరు నీటినే సేవించాల్సిన దుస్థితి ఏర్పడింది. రక్షిత మంచినీరు లేని స్కూళ్లు 2వేలపైనే.. జిల్లాలో ప్రభుత్వ, ఐటీడీఏ పరిధిలో 4వేలకు పైగా ప్రాథమిక, 486 ప్రాథమికోన్నత, 570 ఉన్నత పాఠశాలలున్నాయి. మూడు లక్షలకు పైగా మంది విద్యార్థులున్నారు. సగానికి పైగా పాఠశాలలు, పలు వసతిగృహాల్లోనూ రక్షిత తాగునీరు కరువైంది. ప్లాం ట్లు పని చేయకపోవడంతో బోరు నీరే తాగుతున్నారు. ఏజెన్సీ పరిధిలోని పలు ఆశ్రమ, రెగ్యులర్ పాఠశాలల్లో విద్యార్థులు తీవ్ర జ్వరాలతో బాధపడుతున్నారు. కలుషిత నీరే కారణమని వైద్యు లు స్పష్టం చేశారు. దీంతో పలు చోట్ల హెచ్ఎం దాతలను ఆశ్రయించి మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు మినరల్‌వాటర్ సమకూరుస్తున్నారు. మిగిలిన చోట్ల ఇంకా బోరు, కలుషిత నీరే తాగుతున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ మూర్తిని సంప్రదించగా.. జలమణి ప్లాంట్లు పని చేయకపోవడంపై తమకు సంబంధం లేదని, నిర్వహణ బాధ్యత హెచ్‌ఎంలదేనని స్పష్టం చేశారు. -
నీటి యోధుడికి జేజేలు!
నీటి కరువు బాధ అందరికన్నా రైతులకే ఎక్కువ తెలుసు. రైతులకు అంతకుమించిన జీవన్మరణ సమస్య. మంచి నీరు 70% వ్యవసాయం కోసమే ఖర్చవుతోంది. కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అయితే 95% నీరు వ్యవసాయానికే ఖర్చవుతోంది (ఎఫ్.ఎ.ఓ.). అందుకే ఆయుర్వేద వైద్యంలో పట్టా పుచ్చుకున్న రాజేంద్రసింగ్ వైద్యశాలలు తెరవడానికి 35 ఏళ్ల క్రితం ఎడారి రాష్ట్రం రాజస్థాన్‌లో మారుమూల పల్లెలకు వెళ్లారు. ఈ సందర్భంగా రైతులు ఆయనను కోరిందేమిటంటే.. అయ్యా మాకు వైద్యం కన్నా ముందు కావాల్సింది నీరు. తాగు నీటి కోసం, సాగు నీటి కోసం ఏదైనా చేసి పుణ్యం కట్టుకోండని బతిమాలారు. అప్పటి నుంచి రాజేంద్రసింగ్, ఆయన మిత్రబృందం నీటి భద్రత సాధనే ధ్యేయంగా పెట్టుకొని స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. రైతులు, గ్రామీణులను కూడగట్ట గలిగితే ఎడారి ప్రాంతంలో ఎండిపోయిన నదులను కూడా నిక్షేపంగా పునరుజ్జీవింపజేసుకొని పంటకు, ఇంటికి నీటి కరువు లేకుండా చేయొచ్చని లోకానికి నిరూపించారు. తరుణ్ భారత్ సంఘ్ అనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పి.. సంప్రదాయక మట్టి ఆనకట్టలు (జొహాద్లు) కట్టించడానికి విశేష కృషి చేశారు. పారే వాన నీటిని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేయడానికి 8,600 జొహాద్లను నిర్మించారు. రాజస్థాన్‌లో కొద్ది సంవత్సరాల్లోనే వెయ్యి గ్రామాలకు జల కళ తిరిగి వచ్చింది. ఈ కృషి వల్ల రాజస్థాన్‌లో పూర్తిగా ఎండిపోయిన అనేక నదులు మళ్లీ నీటి పారుదలను కళ్ల జూశాయి. చెట్టు చేమ పచ్చబడింది. అడవి విస్తరించింది. తాగడానికే నీరు దొరకని ఆ గ్రామాల్లో ఇప్పుడు సేద్యానికి కూడా సంపూర్ణ నీటి భద్రత చేకూరింది. అందుకే ‘భారతీయ నీటి యోధుడు’గా రాజేంద్రసింగ్ ప్రపంచ ప్రసిద్ధుడయ్యారు. ‘స్టాక్‌హోం వాటర్ ప్రైజ్-2015’ ఆయనను వరించింది. ప్రపంచ నీటి సంరక్షణ వారోత్సవాల సందర్భంగా రేపు (ఆగస్టు 26న) రాజేంద్రసింగ్ ఈ అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోనున్నారు. ‘వాన నీటిని చెక్‌డామ్‌లు, కందకాల ద్వారా ఒడిసిపట్టుకొని ఎక్కడికక్కడే భూమిలోకి ఇంకింపజేసుకుంటే నీటి భద్రత కలుగుతుంది. ప్రతి గ్రామంలోనూ ఈ పని చేస్తే ప్రపంచవ్యాప్తంగా కరువు, వరద బాధలు ఉండవ’ని రాజేంద్ర సింగ్ అన్నారు. నీటి యోధుడికి జేజేలు! -
మరుగున పడ్డాయి..
మరుగుదొడ్లు లేక విద్యార్థుల ఇక్కట్లు జిల్లాలో 5,009 పాఠశాలలు వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు కరువు 2,601 పాఠశాలల్లో బాలురకు మరుగుదొడ్లు లేవు 90 శాతం మరుగుదొడ్లకు నీళ్ల కరువు కొన్నింటికి తాళాలు, మిగిలినవి శిథిలావస్థకు.. నారు పోసినోడు.. నీరు పోయకమానడు అన్న పెద్దలమాట విన్న విద్యార్థులు మరుగుదొడ్లు కట్టించారు కదా.. నీటి వసతి కల్పిస్తారులే అనుకుంటే, అధికారులు మొండిచే రుు చూపారు. జిల్లా వ్యాప్తంగా పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేక నిరుపయోగంగా మారారుు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు ‘నీటి’మూటలుగా మిగలడంతో విద్యార్థులు, ముఖ్యంగా విద్యార్థినులు నోట మాట రాక, ఎవరికీ చెప్పుకోలేక మౌనంగా భరిస్తున్నారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా పాఠశాలల్లో మరుగుదొడ్లు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా బాలికల అవస్థలు అన్నీ ఇన్ని కావు. వారిది చెప్పుకోలేని బాధ. జిల్లాలో 5,009 పాఠశాలుండగా అన్ని నియోజకవర్గాల్లో దాదాపు వెయ్యి పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. 2,601 పాఠశాలల్లో బాలురకు ఒక్క మరుగుదొడ్డి కూడా లేదు. పేరుకు 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించినా నీటివసతి లేక నిరుపయోగంగా మారాయి. పాఠశాలలకు నీటి వసతి కల్పిం చాల్సిన బాధ్యత ఆయా పంచాయతీలు, మున్సిపాలిటీలదేనని అధికారులు చెబుతున్నా అమలు కావడం లేదు. కొన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లకు తాళాలు వేయగా, మిగిలినవి పిచ్చి మొక్కలు మొలిచి శిథిలావస్థకు చేరి పనికి రాకుండా పోయాయి. మరికొన్నింటిని తొలగించి పాఠశాల అదనపు గదులను నిర్మించారు. విద్యార్థులు ఆరు బయటే కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులు వెచ్చి ంచి పేరుకు మరుగుదొడ్లు నిర్మించినా వాటికి నీటివసతి కల్పించి వినియోగంలోకి తీసుకురాకపోవడంతో బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఈ ఏడాది మరుగుదొడ్ల నిర్వహణకు ప్రభుత్వం రూ.1.09 కోట్లు మంజూరు చేసిందని, జిల్లాలో జూన్ నుంచి స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టామని, పాఠశాలల మరుగుదొడ్లు వినియోగంలో ఉన్నాయని సర్వశిక్షా అభియాన్ పీవో లక్ష్మీ చెప్పడం గమనార్హం. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఎంత ఖర్చు చేసిందని తనకు తెలియదని ఎస్ఎస్ఏ ఇంజినీర్‌ను అడగాలంటూ సమాధానమిచ్చారు. తాను కొత్తగా వచ్చానని, నిధుల ఖర్చుల విషయం తనకు తెలియదని ఇంజినీర్ రవీం ద్రబాబు సమాధానం చెప్పేందుకు నిరాకరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గపరిధిలో 390 పాఠశాలలు ఉన్నాయి. నీటి సౌకర్యం లేక 80 శాతం మరుగుదొడ్లు మూతపడ్డాయి. నియోజకవర ్గవ్యాప్తంగా కేవలం 15 పాఠశాలలకు మాత్రమే నీటి సౌకర్యం ఉంది. కొన్ని మరుగుదొడ్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. చంద్రగిరి నియోజకవర్గంలో 325 పాఠశాలలు ఉన్నాయి. 95 శాతం పాఠశాలలకు మరుగుదొడ్లు నిర్మించినా నీరు లేక నిరుపయోగంగా మారాయి. బాలికలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆరుబయట, సమీపంలోని పొలాల్లో కాలకృత్యాలు తీర్చుకోవాల్సి వస్తోంది. జీడీ నెల్లూరు నియోజకవర్గంలో 455 పాఠశాలలు ఉన్నారుు. నిబంధనల మేరకు కనీ సం 40 మందికి ఒక మరుగుదొడ్డి నిర్మిం చాల్సి ఉంది. పెనుమూరు పాఠశాలలో 600 మంది విద్యార్థులకు 15 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. నియోజకవర్గం పరిధిలో 90 శాతం మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. పలమనేరు నియోజకవర్గంలో ఐదు మం డలాల పరిధిలో 501 పాఠశాలలుండగా, 42.441 విద్యార్థులు ఉన్నారు. 410 పాఠశాలల్లో మరుగుదొడ్లు అలంకారప్రాయంగా మారాయి. కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరాయి. కొన్ని హైస్కూళ్లల్లో ట్యాంకర్లతో నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో 390 పాఠశాలలు ఉన్నాయి. 95 పాఠశాలల పరిధి లో మరుగుదొడ్లకు నీటి వసతి లేదు. కొన్నింటికి తాళాలు వేశారు. మరికొన్ని డోర్లు పాడైపోయి శిథిలావస్థకు చేరాయి. సత్యవేడు నియోజకవర్గంలో 413 పాఠశాలలు ఉన్నాయి. 118 పాఠశాలలకు మరుగుదొడ్లు లేవు. 112 పాఠశాలల్లోని మరుగుదొడ్లు ఉన్నా నీటి వసతి లేదు. పుంగనూరు నియోజకవర్గంలో 362 పాఠశాలలు ఉన్నాయి. 41 పాఠశాల్లో మాత్రమే నీటి వసతి ఉంది. మిగిలిన పాఠశాలల్లో మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి. పుత్తూరు నియోజకవర్గంలో 307 పాఠశాలలు ఉన్నాయి. 32 పాఠశాలల్లో మరుగుదొడ్లు లేవు. మిగిలిన పాఠశాలల్లో 90 శాతం వాటికి నీటి సౌకర్యం లేదు. శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలో 349 పాఠశాలలు ఉన్నాయి. 90 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. 60 శా తం పాఠశాలల పరిధిలో నీటివసతి లేక మరుగుదొడ్లునిరుపయోగంగా మారాయి. కుప్పం నియోజకవర్గ పరిధిలో 475 పాఠశాలలు ఉన్నాయి. 80 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లను నిర్మించారు. నీటి వసతి కల్పించలేదు. నీటి వసతి కల్పించే బాధ్య త సర్పంచులదేనని జిల్లా అధికారులు చెబుతున్నా వారు పట్టించుకోవడం లేదు. మదనపల్లె నియోజకవర్గపరిధిలో 215 పాఠశాలల్లో 30,200 మంది విద్యార్థులు ఉన్నారు. 95 శాతం పాఠశాలల్లో మరుగుదొడ్లు ఉన్నాయి. 70 శాతం వాటిలో నీటివసతి లేదు. కొన్ని మరుగుదొడ్లు పిచ్చిమొక్కలుమొలిచి పనికి రాకుండా పోయాయి చిత్తూరు నియోజకవర్గపరిధిలో 215 పాఠశాలున్నాయి. వీటిల్లో 11,699 మంది విద్యార్థులు చదువుతున్నారు. అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు నిర్మించారు. చిత్తూ రు రూరల్, అర్బన్, గుడిపాల పరిధిలో 78 పాఠశాలల్లో నీటి సౌకర్యం లేదు. -
పాఠశాలలో నీటి వసతి కరువు
వెల్దుర్తి, న్యూస్‌లైన్: అధికారుల అలసత్వం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రూ. లక్ష వెచ్చించి బోరు తవ్వినా చుక్క నీరు అందించకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు భోజన పథక నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. మండలంలోని నెల్లూర్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో జూన్ మాసంలో గ్రామీణ నీటి పథకం, పారిశుద్ధ్య శాఖల ఆధ్వర్యంలో బోరు వేసి మోటార్‌ను బిగించారు. రెండు నెలల పాటు బోరు నుంచి ఓ మోస్తరు నీరు వచ్చింది. తర్వాత రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఉపాధ్యాయులు, వంట కార్మికులు, విద్యార్థులు తెలిపారు. మోటార్ చెడిపోవడంతో మరమ్మతుల కోసం తీసుకెళ్లి నేటికి ఐదు నెలలు అవుతున్నా మరమ్మతులు చేయలేదని, దీంతో నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నీటి వసతి లేకపోవడంతో మరుగుదొడ్లు అధ్వానంగా తయారయ్యాయని, దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయినులు ఇబ్బందులు పడుతున్నారని హెచ్ఎం తెలిపారు. ఇంటి నుండి తాగునీరు తెచ్చుకుంటున్నామని విద్యార్థులు వాపోయారు. అధికారులు స్పందించి బోరు నుంచి నీరు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.