గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట! | People suffering for the water! | Sakshi
Sakshi News home page

గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!

Published Tue, Apr 19 2016 4:40 AM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!

గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!

భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీల అరణ్యరోదన
 
 దండకారణ్యం నుంచి బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆ ఆదివాసీలంతా దేశ పౌరులే.. వారందరికీ ఓటరు కార్డులుంటాయి.. ఓట్లు వేయించుకునే వరకే నాయకులకు వారితో పని.. ఆ తర్వాత వారి వెతలు ఎవరికీ పట్టవు! గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నా అటు వైపు తొంగి చూసేవారుండరు.. గొంతు తడుపుకునేందుకు మండుటెండల్లో మైళ్ల దూరం నడుస్తున్నా ‘అయ్యో.. పాపం’ అనే నాథుడు ఉండడు.. కరువు రక్కసికి గూడేలు విలవిలలాడుతున్నాయి. కుటుంబంలో మూడ్రోజులకు ఒకరు అని వంతులు పెట్టుకొని స్నానాలు చేసే దుస్థితి  నెలకొంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం సరిహద్దున భద్రాచలం ఏజెన్సీ పరిధిలో ఆదివాసీ, గిరిజన గూడేల్లోని వెతలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్.

 చుక్క నీరు లేదు..: ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేలాది మంది ఆదివాసీ, గిరిజన  కుటుంబాలు భద్రాచలం ఏజెన్సీలో నివసిస్తున్నారుు. గోదావరికి సమీపంలో ఉన్న చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దున ఉన్నాయి. ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.  వర్షాభావంతో ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఉన్న మంచినీటి బావులు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడా చేతి పంపులున్నా వాటిల్లో నీళ్లు లేవు.  
 
  నీళ్ల కోసం జాతరలా....
 గోదావరి ఒడ్డున ఉన్న పూసూరు గ్రామం వాజేడు మండల పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి బోర్లు ఎండిపోగా.. బావుల్లో కూడా నీళ్లు అడుగంటాయి. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి చెలమ ఇప్పుడు ఈ గ్రామం దప్పిక తీరుస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోదావరి ఇసుక తిన్నెల్లో జాతరగా చెలమకు వెళ్లి కావడిలో, బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామం గోదావరి ఒడ్డునే ఉన్నా.. నీరున్న పాయంతా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం సమీపంలో ఉండటంతో 2 కి.మీ. నడక తప్పడం లేదు. ఇటీవలే ఏటూరు నాగారం-వాజేడు జాతీయ రహదారిని కలిపేందుకు గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించారు. గోదావరి నీటిని చూసుకుని మురుస్తున్నా.. తాగడానికి మంచినీళ్లు మాత్రం లేవని ఈ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదారి ఒడ్డున ఎడ్జర్ల పంచాయతీ పరిధి లో ఉన్న బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు, ఎడ్జర్లపల్లి ఆదివాసీలు, గిరిజనుల పరిస్థితి కూడా ఇంతే!
 
 గొంతు తడుపుతున్న 40 ఏళ్ల చెలమ
 చర్ల మండలం పార్శికగూడేనికి సమీపంలో ఉన్న రామబ్రహ్మం చెలమ 40 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన గూడేల గొంతు తడుపుతోంది. ఎంత కరువు వచ్చి నా.. ఈ చెలమలో నీళ్లుంటున్నాయి. ఈ చెలిమపై ఉన్న రామబ్రహ్మం కుంట లో నీళ్లు లేకున్నా ఇందులో ఎప్పుడూ నీళ్లుంటాయి. పార్శికగూడెం, బర్లగూడెం, రామవరం ఆదివాసీలంతా ఉదయం, సాయంత్రం ఈ చెలమ నీరు తెచ్చుకుంటారు. గూడేల్లో ఎవరింట్లో శుభకార్యం ఉన్నా.. నాలుగైదు కుటుంబాలవారు కలసి ఆ ఇంటికి ఈ చెలమ నీటిని మోస్తారు. ‘నాకు పెళ్లైన కాడ్నుంచి 40 ఏళ్లుగా ఈ చెలమ నీళ్లే తాగుతున్నాం’ అని పార్శిగూడేనికి చెందిన సారమ్మ(65) చెప్పింది.
 
  దాహం తీరాలంటే 10 కి.మీ. వెళ్లాల్సిందే..
 భద్రాచలం ఏజెన్సీలో ఒక్కొక్కరి ఇంట్లో పది నుంచి 20కి పైగా పశువులు ఉంటాయి. నీళ్లు లేకపోవడంతో పశువులను గోదావరి వైపునకు పంపుతున్నారు. తెల్లవారుజామునే గ్రామాల నుంచి మేత మేసుకుంటూ బయలుదేరిన పశువులు పది కిలోమీటర్లకుపైగా ఉన్న గోదావరికి చేరుకునే సరికి సాయంత్రం నాలుగైదు అవుతుంది. ఇలా వేలాది పశువులు గోదారి బాట పడతాయి. ముందే వెళ్లిన పశువులు ఇసుకలో వేడికి నడవలేక గోదారి ఒడ్డున కాసేపు సేదతీరుతాయి. సాయంత్రం వేడి చల్లారిన తర్వాత మళ్లీ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి ఆవల ఉన్న పాయలో నీళ్లు తాగుతాయి. తర్వాత పశువులన్నీ సమూహంగా మళ్లీ రాత్రి గ్రామాల బాట పడతాయి.
 
 దేవుడిచ్చిన నీళ్లు అవి..
 సబక చిన్ని (పటేల్)... ఈయన క్రాంతినగర్ గూడేనికి నాయకుడు (పటేల్). గూడెంలో అంతా ఈయన చెప్పినట్టే నడుచుకుంటారు. గూడేనికి ముందుగా వచ్చి పదేళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకుంది చిన్ని కుటుంబమే. ఐదేళ్ల క్రితం వర్షాల్లేక తాగటానికి నీళ్లు లేక అడవి బాట పట్టిన చిన్నికి సోమలదేవమ్మ గుట్ట కింద కొన్ని నీళ్లు కనిపించాయి. అప్పుడు ఆ నీళ్లున్న గుంటను పెద్ద తోగుగా చేయించాడు. ఆ గుంటలో ఎప్పుడు చూసినా 10, 15 బిందెల వరకు నీళ్లు వస్తాయి. గూడెం వారు ఇప్పుడు ఈ తోగుకే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి తమకు దేవుడిచ్చిన నీళ్లని చిన్ని చెప్పాడు.
 
  వంతుల వారీగా స్నానం
 చర్ల-భద్రాచలం ప్రధాన రహదారి పక్కనే చర్ల మండల పరిధిలో బి.ఎస్.రామయ్య నగరం ఉంది. ఇక్కడ  40 వరకు ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గూడెంలో ఉన్న రెండు మంచినీటి బావులు కూడా ఎండిపోయాయి. సబ్బంపేట పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ గూడేనికి వారానికి 2 రోజులు ట్యాంకర్ల ద్వారా నీళ్లందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి మూడురోజులకు ఒకసారి ఐదు బిందెలే నీళ్లు ఇస్తున్నారు. కుటుంబంలో 3 రోజులకు ఒకరు చొప్పున వంతులవారీగా స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. పది కిలోమీటర్ల మేర ఎక్కడా బోర్లు, బావులు లేకపోవడంతో ఈ గూడెం వాసులంతా ట్యాంకర్ నీళ్లు ఎప్పుడు వస్తాయా..? అని పడిగాపులు గాస్తున్నారు. తాగడానికి నీళ్లు లేకపోవడంతో పశువులను అడవికే వదిలారు. గ్రామంలో ఉన్న రెండు బావుల్లో ఓ బావిలో రోజూ రెండు బొక్కెన్ల నీళ్లే దొరుకుతాయి. ట్యాంకర్ రాని సమయంలో మూడ్రోజుల్లో ఎవరింట్లో నీళ్లు అయిపోతే ఆ కుటుంబం బొక్కెనతో నీళ్లు తోడుకోవాలి.
 
  చెలమలే దిక్కు...
 ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన 30 కుటుంబాలు చర్ల మండలం క్రాంతినగర్‌లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ గూడెం అంతా దండకారణ్యంలో ఉంది. గ్రామంలోని మంచినీటి బావి  ఎండిపోయింది. దీంతో గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరంలోని ఎలగలతోగు (చెలమ) నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కరోజు తెచ్చుకున్న నీటిని రెండ్రోజుల వరకు జాగ్రత్తగా వాడుకుంటారు. అడవి జంతువుల నుంచి ముప్పు ఉందని తెలిసినా గ్రామస్తులు రాత్రివేళల్లో నీళ్ల కోసం గుంపులుగా వెళ్తారు. మండువేసవిలో తమ గొంతు తడుపుతున్న ఈ తోగుకు ‘సోమలదేవమ్మ’ అని పేరు పెట్టుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement