bhadrachalam agency
-
భద్రాచలం టు బీదర్
సాక్షి, హైదరాబాద్: భద్రాచలం ఏజెన్సీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌కు గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తోన్న గంజాయిని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు పట్టుకున్నారు. శనివారం ఎల్బీనగర్ క్రాస్‌రోడ్ వద్ద ట్రక్కు (టీఎస్ 12సీ 5662), కారు (ఏపీ 29 ఏబీ 7351) లను తనిఖీ చేశారు. దీనిపై రూ.4,100 పెండింగ్ చలానాలు ఉన్నాయి. ట్రక్కులో పైన ఖాళీ ప్లాస్టిక్ కేసులను ఉంచి, ఎవరికీ అనుమానం రాకుండా అడుగున గంజాయి సంచులను జాగ్రత్తగా అమర్చారు. కానీ, తనిఖీల్లో 1,554 కిలోల 751 గంజాయి సంచులు బయటపడ్డాయి. వీటి విలువ రూ.3.10 కోట్లు ఉంటుందని అంచనా. ఈ ముఠాలోని ఆరుగురు సభ్యులు చాలా చాకచక్యంగా వ్యవహరించారు. పోలీసుల తనిఖీలను ముం దుస్తుగానే గుర్తించి, ట్రక్కులోని సరుకును తప్పించేందుకు కారును పైలట్ వాహనంగా వాడారు. కానీ, విశ్వసనీయ సమాచారం అందుకున్న డీఆర్ఐ అధికారులు రెండు వాహనాలను ఆపారు. సరుకు భద్రాచలం సమీపంలోని మోతుగూడెం నుంచి కర్ణాటకలోని బీదర్‌కు తరలిస్తున్నట్లుగా వెల్లడించారు. ఆరుగురిని అరెస్టు చేసిన అధికారులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుక్కెడు నీటి కోసం మన్యం తండ్లాట!
భద్రాచలం ఏజెన్సీలో ఆదివాసీల అరణ్యరోదన దండకారణ్యం నుంచి బొల్లం శ్రీనివాస్, సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఆ ఆదివాసీలంతా దేశ పౌరులే.. వారందరికీ ఓటరు కార్డులుంటాయి.. ఓట్లు వేయించుకునే వరకే నాయకులకు వారితో పని.. ఆ తర్వాత వారి వెతలు ఎవరికీ పట్టవు! గుక్కెడు నీటి కోసం అలమటిస్తున్నా అటు వైపు తొంగి చూసేవారుండరు.. గొంతు తడుపుకునేందుకు మండుటెండల్లో మైళ్ల దూరం నడుస్తున్నా ‘అయ్యో.. పాపం’ అనే నాథుడు ఉండడు.. కరువు రక్కసికి గూడేలు విలవిలలాడుతున్నాయి. కుటుంబంలో మూడ్రోజులకు ఒకరు అని వంతులు పెట్టుకొని స్నానాలు చేసే దుస్థితి నెలకొంది. ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం సరిహద్దున భద్రాచలం ఏజెన్సీ పరిధిలో ఆదివాసీ, గిరిజన గూడేల్లోని వెతలపై ‘సాక్షి’గ్రౌండ్ రిపోర్ట్. చుక్క నీరు లేదు..: ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన వేలాది మంది ఆదివాసీ, గిరిజన కుటుంబాలు భద్రాచలం ఏజెన్సీలో నివసిస్తున్నారుు. గోదావరికి సమీపంలో ఉన్న చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాలు ఛత్తీస్‌గఢ్ దండకారణ్యానికి సరిహద్దున ఉన్నాయి. ఇక్కడే పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వర్షాభావంతో ఆదివాసీ, గిరిజన గూడేల్లో ఉన్న మంచినీటి బావులు పూర్తిగా ఎండిపోయాయి. అక్కడక్కడా చేతి పంపులున్నా వాటిల్లో నీళ్లు లేవు. నీళ్ల కోసం జాతరలా.... గోదావరి ఒడ్డున ఉన్న పూసూరు గ్రామం వాజేడు మండల పరిధిలోకి వస్తుంది. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామంలో మంచినీటి బోర్లు ఎండిపోగా.. బావుల్లో కూడా నీళ్లు అడుగంటాయి. గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదావరి చెలమ ఇప్పుడు ఈ గ్రామం దప్పిక తీరుస్తోంది. సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు గోదావరి ఇసుక తిన్నెల్లో జాతరగా చెలమకు వెళ్లి కావడిలో, బిందెల్లో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ గ్రామం గోదావరి ఒడ్డునే ఉన్నా.. నీరున్న పాయంతా వరంగల్ జిల్లా ఏటూరు నాగారం సమీపంలో ఉండటంతో 2 కి.మీ. నడక తప్పడం లేదు. ఇటీవలే ఏటూరు నాగారం-వాజేడు జాతీయ రహదారిని కలిపేందుకు గోదావరిపై బ్రిడ్జిని ప్రారంభించారు. గోదావరి నీటిని చూసుకుని మురుస్తున్నా.. తాగడానికి మంచినీళ్లు మాత్రం లేవని ఈ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. గోదారి ఒడ్డున ఎడ్జర్ల పంచాయతీ పరిధి లో ఉన్న బొమ్మనపల్లి, ముత్తారం, కొత్తూరు, ఎడ్జర్లపల్లి ఆదివాసీలు, గిరిజనుల పరిస్థితి కూడా ఇంతే! గొంతు తడుపుతున్న 40 ఏళ్ల చెలమ చర్ల మండలం పార్శికగూడేనికి సమీపంలో ఉన్న రామబ్రహ్మం చెలమ 40 ఏళ్లుగా ఆదివాసీ గిరిజన గూడేల గొంతు తడుపుతోంది. ఎంత కరువు వచ్చి నా.. ఈ చెలమలో నీళ్లుంటున్నాయి. ఈ చెలిమపై ఉన్న రామబ్రహ్మం కుంట లో నీళ్లు లేకున్నా ఇందులో ఎప్పుడూ నీళ్లుంటాయి. పార్శికగూడెం, బర్లగూడెం, రామవరం ఆదివాసీలంతా ఉదయం, సాయంత్రం ఈ చెలమ నీరు తెచ్చుకుంటారు. గూడేల్లో ఎవరింట్లో శుభకార్యం ఉన్నా.. నాలుగైదు కుటుంబాలవారు కలసి ఆ ఇంటికి ఈ చెలమ నీటిని మోస్తారు. ‘నాకు పెళ్లైన కాడ్నుంచి 40 ఏళ్లుగా ఈ చెలమ నీళ్లే తాగుతున్నాం’ అని పార్శిగూడేనికి చెందిన సారమ్మ(65) చెప్పింది. దాహం తీరాలంటే 10 కి.మీ. వెళ్లాల్సిందే.. భద్రాచలం ఏజెన్సీలో ఒక్కొక్కరి ఇంట్లో పది నుంచి 20కి పైగా పశువులు ఉంటాయి. నీళ్లు లేకపోవడంతో పశువులను గోదావరి వైపునకు పంపుతున్నారు. తెల్లవారుజామునే గ్రామాల నుంచి మేత మేసుకుంటూ బయలుదేరిన పశువులు పది కిలోమీటర్లకుపైగా ఉన్న గోదావరికి చేరుకునే సరికి సాయంత్రం నాలుగైదు అవుతుంది. ఇలా వేలాది పశువులు గోదారి బాట పడతాయి. ముందే వెళ్లిన పశువులు ఇసుకలో వేడికి నడవలేక గోదారి ఒడ్డున కాసేపు సేదతీరుతాయి. సాయంత్రం వేడి చల్లారిన తర్వాత మళ్లీ కిలోమీటరు నడుచుకుంటూ వెళ్లి ఆవల ఉన్న పాయలో నీళ్లు తాగుతాయి. తర్వాత పశువులన్నీ సమూహంగా మళ్లీ రాత్రి గ్రామాల బాట పడతాయి. దేవుడిచ్చిన నీళ్లు అవి.. సబక చిన్ని (పటేల్)... ఈయన క్రాంతినగర్ గూడేనికి నాయకుడు (పటేల్). గూడెంలో అంతా ఈయన చెప్పినట్టే నడుచుకుంటారు. గూడేనికి ముందుగా వచ్చి పదేళ్ల క్రితం నివాసం ఏర్పాటు చేసుకుంది చిన్ని కుటుంబమే. ఐదేళ్ల క్రితం వర్షాల్లేక తాగటానికి నీళ్లు లేక అడవి బాట పట్టిన చిన్నికి సోమలదేవమ్మ గుట్ట కింద కొన్ని నీళ్లు కనిపించాయి. అప్పుడు ఆ నీళ్లున్న గుంటను పెద్ద తోగుగా చేయించాడు. ఆ గుంటలో ఎప్పుడు చూసినా 10, 15 బిందెల వరకు నీళ్లు వస్తాయి. గూడెం వారు ఇప్పుడు ఈ తోగుకే వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇవి తమకు దేవుడిచ్చిన నీళ్లని చిన్ని చెప్పాడు. వంతుల వారీగా స్నానం చర్ల-భద్రాచలం ప్రధాన రహదారి పక్కనే చర్ల మండల పరిధిలో బి.ఎస్.రామయ్య నగరం ఉంది. ఇక్కడ 40 వరకు ఆదివాసీ గిరిజన కుటుంబాలు నివసిస్తున్నాయి. గూడెంలో ఉన్న రెండు మంచినీటి బావులు కూడా ఎండిపోయాయి. సబ్బంపేట పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ గూడేనికి వారానికి 2 రోజులు ట్యాంకర్ల ద్వారా నీళ్లందిస్తున్నారు. ఒక్కో కుటుంబానికి మూడురోజులకు ఒకసారి ఐదు బిందెలే నీళ్లు ఇస్తున్నారు. కుటుంబంలో 3 రోజులకు ఒకరు చొప్పున వంతులవారీగా స్నానం చేయాల్సిన దుస్థితి ఉంది. పది కిలోమీటర్ల మేర ఎక్కడా బోర్లు, బావులు లేకపోవడంతో ఈ గూడెం వాసులంతా ట్యాంకర్ నీళ్లు ఎప్పుడు వస్తాయా..? అని పడిగాపులు గాస్తున్నారు. తాగడానికి నీళ్లు లేకపోవడంతో పశువులను అడవికే వదిలారు. గ్రామంలో ఉన్న రెండు బావుల్లో ఓ బావిలో రోజూ రెండు బొక్కెన్ల నీళ్లే దొరుకుతాయి. ట్యాంకర్ రాని సమయంలో మూడ్రోజుల్లో ఎవరింట్లో నీళ్లు అయిపోతే ఆ కుటుంబం బొక్కెనతో నీళ్లు తోడుకోవాలి. చెలమలే దిక్కు... ఛత్తీస్‌గఢ్ నుంచి వలస వచ్చిన 30 కుటుంబాలు చర్ల మండలం క్రాంతినగర్‌లో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాయి. ఈ గూడెం అంతా దండకారణ్యంలో ఉంది. గ్రామంలోని మంచినీటి బావి ఎండిపోయింది. దీంతో గ్రామస్తులు మూడు కిలోమీటర్ల దూరంలోని ఎలగలతోగు (చెలమ) నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఒక్కరోజు తెచ్చుకున్న నీటిని రెండ్రోజుల వరకు జాగ్రత్తగా వాడుకుంటారు. అడవి జంతువుల నుంచి ముప్పు ఉందని తెలిసినా గ్రామస్తులు రాత్రివేళల్లో నీళ్ల కోసం గుంపులుగా వెళ్తారు. మండువేసవిలో తమ గొంతు తడుపుతున్న ఈ తోగుకు ‘సోమలదేవమ్మ’ అని పేరు పెట్టుకున్నారు. -
మావోల అలజడి
సాక్షి, ఖమ్మం: భద్రాచలం ఏజెన్సీలో మావోయిస్టులు వారం రోజులుగా అలజడి సృష్టిస్తున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్లు, హిట్ లిస్ట్‌పై దృషి పెట్టినట్లు తెలుస్తోంది. చింతూరు మండలం పేగ గ్రామంలో పోలీస్ ఇన్ఫార్మర్లనే నెపంతో 13 మందిని కిడ్నాప్ చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. మావోయిస్టులు ఇటీవల విడుదల చేసిన హిట్‌లిస్ట్ జాబితాలో పేరున్న ఓ గిరిజనుడు కూడా అపహరణకు గురైన వారిలో ఉన్నాడు. అంతేకాకండా ఇటీవల జరిగిన చర్ల మండలం దోసిళ్లపల్లి ఎన్‌కౌంటర్‌తో ప్రతికారేచ్ఛతో మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. ఈ నెలలో ప్రారంభమైన పీపుల్ లివరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాల్లో భాగంగా సెల్ టవర్లను తగులబెట్టేందుకు యత్నం, పోలీస్ ఇన్ఫార్మర్లను హెచ్చరించడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే దోసిళ్లపల్లి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా 29న మావోయిస్టు పార్టీ జిల్లా బంద్‌కు పిలుపునిచ్చింది. చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉన్న సెల్‌టవర్‌ను పేల్చేందుకు ప్రయత్నించి పోలీసుల కాల్పులతో వెనుదిరిగారు. చర్ల, వెంకటాపురం, చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లో ఈనెల రోజుల్లో ఏదో ఒక చోట పోస్టర్లు వేస్తూనే పోలీసులకు సవాల్ విసిరారు. రియల్ ఎస్టేట్ చేస్తూ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, గిరిజనుల భూమి కొంతమంది కబంధ హస్తాల్లో చిక్కుకుందని జిల్లాలోని పలు మండలాల వ్యాపారులు, ప్రముఖ ప్రజాప్రతినిధులను పేర్కొంటూ ఇటీవల ఓ లేఖ కూడా విడుదల చేసింది. అలాగే చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లో 17 మంది పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారారని వారికి ప్రజా కోర్టులో శిక్ష తప్పదని హెచ్చరిస్తూ మరో లేఖ విడుదల చేశారు. శబరి, దుమ్ముగూడెం, వెంకటాపురం ఏరియా కమిటీలతో పాటు ఇటీవల నూతనంగా రిక్రూట్ అయిన కేకేడబ్ల్యూ (ఖమ్మం, కరీనంగర్, వరంగల్) కమిటీ పర్యవేక్షణలో ఈ మూడు కమిటీలు మన్యంలో అలజడి సృష్టిస్తున్నట్లు సమాచారం. గతంలో పోలీస్ కాల్పుల్లో తుడిచి పెట్టుకపోయిందన్న కేకేడబ్ల్యూ మళ్లీ క్రియాశీలకం కావడంతో భద్రాచలం ఏజెన్సీలో ఈ కమిటీ కార్యదర్శి నేతృత్వంలో పీఎల్జీఏ వారోత్సవాలు జరిగినట్లు సమాచారం. పోలీస్ ఇన్ఫార్మర్ల వ్యవస్థపై దృష్టి పెట్టాలని కేకేడబ్ల్యూ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకే చింతూరు మండలంలోని పేగ గ్రామానికి చెందిన 13 మంది గిరిజనులను ఈ పేరుతో శనివారం అర్ధరాత్రి కిడ్నాప్ చేశారని తెలుస్తోంది. పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారొద్దు.. ‘ప్రజలారా డబ్బులు ఆశ చూపితే మీ భవిష్యత్‌ను పాడు చేసుకోకండి.. సమ సమాజం కోసం పాటు పడితే తప్ప మీ జీవితాలు మెరుగు పడవు. మీరే ఆలోచించండి.. లంచగొండి పోలీసులు ఆదివాసీ యువకులకు రకరకాలుగా ఆశ కల్పించి వాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నారు. పోలీస్ ఇన్ఫార్మర్లుగా మారితే కఠిన శిక్ష తప్పదు’ అని శబరి ఏరియా కమిటీ పేరుతో దుమ్ముగూడెంలోని ములకపాడు సెంటర్లో పోస్టర్లు వెలిశాయి. ఇలా వరుస సంఘటనలకు మావోయిస్టులు పాల్పడుతుండడం.. ప్రతిగా పోలీసులు ఎదుర్కొంటుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని గిరిజనులు వణికిపోతున్నారు. -
వణికిస్తోంది..
సాక్షి, ఖమ్మం : ‘ఉదయం మంచు, చలి గాలి. పగలంతా ఎండ. సాయంత్రం 6 దాటితే చల్లని శీతల గాలులు. జిల్లాలో గత నాలుగు రోజులుగా ఇదీ వాతావరణ పరిస్థితి.’ ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి కనిష్టంగా నమోదు అవుతుండడంతో ప్రజలు వణికిపోతున్నారు. వృద్ధులు బయటకు రావాలంటేనే బెంబేలెత్తుతున్నారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ములో గోగ్కొండ సీతమ్మ(80) అనే వృద్ధురాలు చలితీవ్రతను తట్టుకోలేక ఆదివారం మృతిచెందింది. ఖమ్మంతో పాటు కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లెందు ప్రాంతాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. గోదావరి పరీవాహక ప్రాంతాల ప్రజలు గజగజ వణికిపోతున్నారు. రాత్రి, తెల్లవారుజామున బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. భద్రాచలం ఏజెన్సీలో దట్టమైన అడవితో పొగమంచు, చలి ఎక్కువగా ఉండడంతో ఆదివాసీలు, గిరిజనులు ఉదయం 10 దాటిన తర్వాత గడప దాటడం లేదు. ఈనెల 16 నుంచి చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గడిచినవారంలో శనివారం అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత 10.1గా నమోదైంది. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబర్లోనే ఇలా ఉంటే జనవరి, ఫిబ్రవరిలో చలి తీవ్రతగా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది. ఉదయం పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, విధులకు హాజరయ్యే ఉద్యోగులు చలికి వణకుతున్నారు. ఇక గ్రామాల్లో ప్రజలు చలికి తట్టుకోలేక మంటలు వేసుకుంటున్నారు. చలి పెరుగుదలతో ఉన్ని వస్త్రాలకు డిమాండ్ పెరిగింది. చలిని తట్టుకోలేక స్వెట్టర్లు, మప్లర్లు, రగ్గులు, మంకీ క్యాప్‌లు ధరిస్తున్నారు. వాతావరణంలో మార్పుతో జలుబు, దగ్గుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సారి చలి తీవ్రత తక్కువగానే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసినా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటం ఆశ్చర్య కలిగించే అంశం. అయితే గరిష్ట ఉష్ణోగ్రతలు పెరగకున్నా కనిష్ట ఉష్ణోగ్రతలు రోజుకు రెండు డిగ్రీల పైన పడిపోతుండడంతో చలి తీవ్రంగా ఉంటోంది. దట్టమైన పొగమంచుతో ఉదయం 8 గంటలకు కొన్ని ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. -
భద్రాచలం ఏజెన్సీలో మద్యం బంద్
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో మద్యం బాబులకు నేటి నుంచి కష్టాలు వచ్చిపడినట్లే. అందుకు కారణం సోమవారం రాత్రి 11గం.లకు భద్రాచలం, వెంకటాపురం ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో గల మద్యం దుకాణాలకు ప్రస్తుత లెసైన్స్‌ల గడువు ముగిసింది. దీంతో మంగళవారం నుంచి ఈ దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాగా మరి కొని చోట్ల కోరం లేక సభలు వాయిదా పడ్డాయి. ఫలితంగా భద్రాచలం ఏజెన్సీలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11, వెంకటాపురం పరిధిలో 5 దుకాణాలకు కొత్తగా గ్రామసభల ఆమోదం లభించే వరకూ తాళాలు వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. బెల్టుషాపులకు మద్యం తరలింపు..? అధికారికంగా మద్యం దుకాణాలు మూతవేయాల్సి రావడంతో సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు మిగిలిన సరుకును గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రతీ మద్యం దుకణానికి అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దుకాణాల కాలపరిమితి ముగియడంతో మిగిలిన మద్యాన్ని అక్కడికి తరలించి విక్రయించేందుకు సిండికేట్‌దారులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీనికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక మహిళా సంఘాల వారు కోరుతున్నారు. భద్రాద్రిలో బెడిసికొట్టిన వ్యూహం : భద్రాచలంలో ఉన్న తొమ్మిది మద్యం దుకాణాలకు ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా, వీటిని లాటరీ ద్వారా కేటాయించడం కూడా పూర్తయింది. తొమ్మిది దుకాణాలు కూడా ఇతర మండలాలకు చెందిన గిరిజనులకే దక్కాయి. కానీ ఇప్పటి వరకు బినామీలుగా వ్యవహరించిన సిండికేట్ దారులు ఈ ఏడాది కూడా దుకాణాలు దక్కించుకున్న గిరిజనులకు భారీ నజరానా(గుడ్ విల్) ముట్టజెప్పి షాపులను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి రెండు రోజుల క్రితం భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు వ్యూహం పన్నారు. కానీ చివరకు వారి వ్యూహం బెడిసి కొట్టింది. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను గ్రామసభకు రప్పించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన వారిలో తగినంతమంది గిరిజనులు లేకపోవడంతో గిరిజన చట్టాల మేరకు గ్రామసభను రద్దు చేశారు. మరోమారు నిర్వహించే గ్రామసభలో వీటిని ఆమోదింపజేసుకునేందుకు భద్రాద్రి సిండికేట్ దారులు మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆంధ్రాకు పరుగు తీయాల్సిందే... ఏజెన్సీలోని మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు పరుగులు తీయాల్సిందే. అందుకు కారణం చింతూరు మండలంలో రెండు మద్యం దుకాణాలకు గ్రామసభ ఆమోదం లభించింది. దీంతో నూతనంగా దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారికి మంచి వ్యాపారమే సాగనుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో దుకాణాల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం లేదు. అదే విధంగా చింతూరు మండలం మోతుగూడెంలో గ్రామసభకు కోరం లేక వాయిదా పడింది. దీంతో చింతూరు మండల కేంద్రంలో ఉన్న దుకాణంతో పాటు, ఇదే మండలంలోని ఎర్రంపేట దుకాణాల్లో మాత్రం అధికారికంగా మద్యం లభించనుంది. ఈ పరిణామాలు మద్యం ప్రియులకు కష్టాలు తెచ్చిపెట్టనుండగా, మహిళా సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా మద్యం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు కూడా లేకుండా ఎక్సైజ్ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
దాడులకు వ్యూహం !
భద్రాచలం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారనున్నాయి. ఎన్నికల వేళ విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలు ఇక్కడి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేయటమే లక్ష్యంగా మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి భద్రాచలం మండలం గన్నవరంలో సెల్ టవర్‌ను దగ్ధం చేశారని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సరిహద్దు అటవీ ప్రాంతాలకే పరిమితమైన మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లోనూ సంచరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌టవర్ దగ్ధం చేసిన గన్నవరం భద్రాచలానికి 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అర్ధరాత్రి వేళ సాయుధ నక్సల్స్ పెద్ద సంఖ్యలో రావడమే కాక సెల్‌టవర్ సామగ్రి పూర్తిగా కాలిపోయేంత వరకూ అక్కడే ఉన్నారని గ్రామస్తులు చెపుతున్నారు. పట్టణ పరిసర గ్రామాల్లో కూడా మావోయిస్టుల హల్చల్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వేసి ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఎలాంటి విధ్వంసాలకు దిగలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇలాంటి క వ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. దీంతో ఈ నెల 30న జరిగే ఎన్నికలు అధికారులకు కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు అంటున్నారు. సమాచార వ్యవస్థే టార్గెట్... సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్లపై దాడులే లక్ష్యంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలోని వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల పోలింగ్ స్టేషన్లలో ఇప్పటికే ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. 26 పోలింగ్ స్టేషన్ లకు సెల్‌సిగ్నల్స్ లేకపోవటంతో అక్కడ ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఈనెల 6న జరిగిన స్థానిక ఎన్నికలలో చింతూరు మండలంలోని గూడూరు రూట్‌కు బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు వెళ్లిన బస్సు సమయానికి రాకపోవటం తీవ్ర సంచలనం కలిగించింది. పోలింగ్ స్టేషన్ వద్దనే గంట పాటు ఉండిపోగా, కమ్యూనికేషన్ లేకపోవటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలే పరిస్థితి ఇలా ఉంటే గన్నవరంలో సెల్ టవర్ పేల్చివేతతో కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత చిన్నాభిన్నమైంది. మావోయిస్టులు పేల్చిన టవర్‌పై ఎయిర్టెల్, వొడాఫోన్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. అంతేకాకుండా భద్రాచలం, పాల్వంచ డివిజన్లలో ఉన్న 19 టవర్లు దీనికి అనుసంధానంగా ఉన్నాయి. ఎన్నికల నాటికి దీన్ని పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో భద్రాచలమే సమస్యాత్మకం... మొదటి విడత ఎన్నికల జరిగే తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భద్రాచలమే అత్యంత సమస్యాత్మకమైనదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నియోజకవర్గంలోని 261 పోలింగ్ స్టేషన్లకు గాను 156 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ కారణంతోనే భద్రాచలం, వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాలో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన మూడు డివిజన్లలో భద్రాచలం నియోజకవర్గంలోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మావోయిస్టుల కార్యకలాపాలు, పోలింగ్ సమయం కుదించటంతో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింతగా తగ్గవచ్చని పరిశీలకులు అంటున్నారు. -
బినామీ ‘ఘనులు...’!
తెల్లరాయిపై కన్నేసిన బడాబాబులు ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ఏజెన్సీ సంపద అక్రమ లీజులతో గిరిజనులకు అన్యాయం భద్రాచలం, న్యూస్‌లైన్ భద్రాచలం ఏజెన్సీలో ఉన్న అపార ఖనిజ సంపదపై కొంతమంది బడాబాబులు కన్నేశారు. ఇక్కడ ఉన్న తెల్లరాయి నిక్షేపాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గాజు తయారీకి ఉపయోగకరంగా ఉండే తెల్లరాయి భద్రాచలం ఏజెన్సీలో పుష్కలంగా దొరుకుతుండటంతో గిరిజనుల భూములను లీజుకు తీసుకొని ఈ అక్రమానికి పాల్పడుతున్నారు.భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడి మధ్యవర్తుల ద్వారా గిరిజనుల భూములను గిరిజనుల పేరునే లీజుకు తీసుకుని, తమ కనుసన్నల్లో తెల్లరాయి తవ్వకాలు, తరలింపుప్రక్రియ సాగిస్తున్నారు. భద్రాచలం మండలం లక్ష్మీపురం పంచాయతీలోని రంగాపురం, బండిరేవు.., ఎటపాక పంచాయతీలోని బొజ్జుగుప్ప, మాధవరావు పేట.., చింతూరు మండలంలోని చట్టి.., దుమ్ముగూడెం మండలంలోని కొమ్మనాపల్లి సమీపంలో ఇటీవల తెల్లరాయి తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు గనుల నిర్వహణకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వటంతో ఈ అక్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ నుంచి విజయవాడకు తరలించిన తెల్లరాయిని పాలీష్ చేసిన తరువాత తమిళనాడు రాష్ట్రంలోని వివిధ గాజు తయారీ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. కారుచౌకగా లీజుకు భూములు : తెల్లరాయి నిక్షేపాలు లభించే గిరిజనులకు చెందిన భూములను తక్కువ ధరకే లీజుకు తీసుకుంటున్నారు. భద్రాచలం మండలంలోని రంగాపురం క్వారీనే పరిశీలించినట్లైతే... ఆ గ్రామంలోని ఎనిమిదిమంది గిరిజనులకు చెందిన 11 ఎకరాల భూమిని గుంటూరుకు చెందిన ఓ గిరిజన మహిళ పేరుతో ఇరవై ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ.1000చొప్పున కౌలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల భద్రాచలానికి చెందిన కొంతమంది వచ్చి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి చనిపోయారని చెప్పి మళ్లీ ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని భూమిపై హక్కుదారుడైన మడకం ముత్తయ్య తెలిపాడు. అయితే కౌలు గిట్టుబాటు కాదని పట్టుబడితే ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.2500లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపాడు. రాయి తీయటం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడుస్తామని చెప్పినప్పటికీ అలానే వదిలేయటంతో పశువులు దానిలో పడి మృతిచెందుతున్నాయని ఆయన తెలిపాడు. అలాగే భద్రాచలం మండలం బండిరేవు క్వారీ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా తెల్లరాయిని తరలిస్తున్న రెండు లారీలను ఇటీవల అధికారులు పట్టుకున్నారు. ఇలా కారుచౌకగా గిరిజనుల భూములను లీజుకు తీసుకొని వాటిలో ఉన్న ఖనిజ సంపదను బడాబాబులు కొల్లగొడుతుండడం గమనార్హం. గిరిజనుల అంగీకారంతోనే లీజు ఒప్పందాలు జరిగాయనే కారణంతో రెవెన్యూ అధికారులు కూడా క్వారీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండటంతో ఏజెన్సీ సంపద ఇతర ప్రాంతాలకు త రలిపోతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి ఏజెన్సీలో లభించే ఖనిజ సంపద ద్వారా ఈ ప్రాంత వాసులు అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.