భద్రాచలం ఏజెన్సీలో మద్యం బంద్
భద్రాచలం: భద్రాచలం ఏజెన్సీలో మద్యం బాబులకు నేటి నుంచి కష్టాలు వచ్చిపడినట్లే. అందుకు కారణం సోమవారం రాత్రి 11గం.లకు భద్రాచలం, వెంకటాపురం ఎక్సైజ్ స్టేషన్‌ల పరిధిలో గల మద్యం దుకాణాలకు ప్రస్తుత లెసైన్స్‌ల గడువు ముగిసింది. దీంతో మంగళవారం నుంచి ఈ దుకాణాలు తెరిచే పరిస్థితి లేదు. మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆయా పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామసభల్లో ప్రజల నుంచి వ్యతిరేకత రాగా మరి కొని చోట్ల కోరం లేక సభలు వాయిదా పడ్డాయి. ఫలితంగా భద్రాచలం ఏజెన్సీలో మద్యం దుకాణాలకు తాళాలు పడనున్నాయి. భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 11, వెంకటాపురం పరిధిలో 5 దుకాణాలకు కొత్తగా గ్రామసభల ఆమోదం లభించే వరకూ తాళాలు వేయనున్నట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు.
బెల్టుషాపులకు మద్యం తరలింపు..?
అధికారికంగా మద్యం దుకాణాలు మూతవేయాల్సి రావడంతో సిండికేట్‌గా ఏర్పడిన కొంతమంది మద్యం వ్యాపారులు మిగిలిన సరుకును గ్రామాల్లోని బెల్ట్ షాపులకు తరలిస్తున్నారు. భద్రాచలం పట్టణంలో ఉన్న ప్రతీ మద్యం దుకణానికి అనుబంధంగా గ్రామాల్లో బెల్ట్‌షాపులు ఉన్నట్లుగా సమాచారం. ప్రస్తుతం దుకాణాల కాలపరిమితి ముగియడంతో మిగిలిన మద్యాన్ని అక్కడికి తరలించి విక్రయించేందుకు సిండికేట్‌దారులు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. దీనికి అడ్డకట్ట వేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని స్థానిక మహిళా సంఘాల వారు కోరుతున్నారు.
భద్రాద్రిలో బెడిసికొట్టిన వ్యూహం :
భద్రాచలంలో ఉన్న తొమ్మిది మద్యం దుకాణాలకు ఇప్పటికే టెండర్‌లు పూర్తి కాగా, వీటిని లాటరీ ద్వారా కేటాయించడం కూడా పూర్తయింది. తొమ్మిది దుకాణాలు కూడా ఇతర మండలాలకు చెందిన గిరిజనులకే దక్కాయి. కానీ ఇప్పటి వరకు బినామీలుగా వ్యవహరించిన సిండికేట్ దారులు ఈ ఏడాది కూడా దుకాణాలు దక్కించుకున్న గిరిజనులకు భారీ నజరానా(గుడ్ విల్) ముట్టజెప్పి షాపులను కైవసం చేసుకున్నారు. ఈ క్రమంలోనే మద్యం షాపుల ఏర్పాటుకు సంబంధించి రెండు రోజుల క్రితం భద్రాచలం పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన గ్రామసభలో ఎలాగైనా ఆమోదింపజేసుకునేందుకు వ్యూహం పన్నారు. కానీ చివరకు వారి వ్యూహం బెడిసి కొట్టింది. డబ్బులు ఇచ్చి మరీ ప్రజలను గ్రామసభకు రప్పించారనే ఆరోపణలు వచ్చాయి. కానీ వచ్చిన వారిలో తగినంతమంది గిరిజనులు లేకపోవడంతో గిరిజన చట్టాల మేరకు గ్రామసభను రద్దు చేశారు. మరోమారు నిర్వహించే గ్రామసభలో వీటిని ఆమోదింపజేసుకునేందుకు భద్రాద్రి సిండికేట్ దారులు మళ్లీ పావులు కదుపుతున్నారు.
ఆంధ్రాకు పరుగు తీయాల్సిందే...
ఏజెన్సీలోని మద్యం ప్రియులు ఆంధ్రప్రదేశ్‌లోని చింతూరుకు పరుగులు తీయాల్సిందే. అందుకు కారణం చింతూరు మండలంలో రెండు మద్యం దుకాణాలకు గ్రామసభ ఆమోదం లభించింది. దీంతో నూతనంగా దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారికి మంచి వ్యాపారమే సాగనుంది. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించిన కూనవరం, వీఆర్‌పురం మండలాల్లో దుకాణాల ఏర్పాటుకు గ్రామసభ ఆమోదం లేదు. అదే విధంగా చింతూరు మండలం మోతుగూడెంలో గ్రామసభకు కోరం లేక వాయిదా పడింది. దీంతో చింతూరు మండల కేంద్రంలో ఉన్న దుకాణంతో పాటు, ఇదే మండలంలోని ఎర్రంపేట దుకాణాల్లో మాత్రం అధికారికంగా మద్యం లభించనుంది. ఈ పరిణామాలు మద్యం ప్రియులకు కష్టాలు తెచ్చిపెట్టనుండగా, మహిళా సంఘాలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భద్రాచలం ఏజెన్సీలో పూర్తిగా మద్యం లేకుండా చేయాలని వారు కోరుతున్నారు. అదే విధంగా బెల్ట్ షాపులు కూడా లేకుండా ఎక్సైజ్ అధికారులు నిఘా ఏర్పాటు చేయాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.