భద్రాచలం, న్యూస్‌లైన్ : సార్వత్రిక ఎన్నికలు జిల్లా అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారనున్నాయి. ఎన్నికల వేళ విధ్వంసాలు సృష్టించేందుకు మావోయిస్టులు వ్యూహ రచన చేస్తున్నారనే నిఘా వర్గాల హెచ్చరికలు ఇక్కడి అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి ఆనుకొని ఉన్న జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో సమాచార వ్యవస్థను చిన్నాభిన్నం చేయటమే లక్ష్యంగా మావోయిస్టులు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి భద్రాచలం మండలం గన్నవరంలో సెల్ టవర్‌ను దగ్ధం చేశారని అధికారులు సైతం అంగీకరిస్తున్నారు. ఇప్పటి వరకు సరిహద్దు అటవీ ప్రాంతాలకే పరిమితమైన మావోయిస్టులు పట్టణ ప్రాంతాల్లోనూ సంచరిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.
సెల్‌టవర్ దగ్ధం చేసిన గన్నవరం భద్రాచలానికి 24 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అర్ధరాత్రి వేళ సాయుధ నక్సల్స్ పెద్ద సంఖ్యలో రావడమే కాక సెల్‌టవర్ సామగ్రి పూర్తిగా కాలిపోయేంత వరకూ అక్కడే ఉన్నారని గ్రామస్తులు చెపుతున్నారు. పట్టణ పరిసర గ్రామాల్లో కూడా మావోయిస్టుల హల్‌చల్ ప్రభావం ఎన్నికలపై పడే అవకాశం ఉందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్థానిక ఎన్నికలకు ముందు నియోజకవర్గంలోని దాదాపు అన్ని మండలాల్లో మావోయిస్టులు పోస్టర్‌లు, బ్యానర్‌లు వేసి ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అయితే ఆ ఎన్నికల్లో ఎలాంటి విధ్వంసాలకు దిగలేదు. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా ఇలాంటి క వ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయని నిఘా వర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. దీంతో ఈ నెల 30న జరిగే ఎన్నికలు అధికారులకు కత్తిమీద సాము వంటిదేనని పరిశీలకులు అంటున్నారు.
సమాచార వ్యవస్థే టార్గెట్...
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ స్టేషన్‌లపై దాడులే లక్ష్యంగా మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తెలుస్తోంది. భద్రాచలం నియోజకవర్గంలోని వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, దుమ్ముగూడెం మండలాల్లోని మారుమూల పోలింగ్ స్టేషన్‌లలో ఇప్పటికే ఎలాంటి సమాచార వ్యవస్థ లేదు. 26 పోలింగ్ స్టేషన్ లకు సెల్‌సిగ్నల్స్ లేకపోవటంతో అక్కడ ఏం జరిగినా బయట ప్రపంచానికి తెలిసే అవకాశం లేదు. ఈనెల 6న జరిగిన స్థానిక ఎన్నికలలో చింతూరు మండలంలోని గూడూరు రూట్‌కు బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు వెళ్లిన బస్సు సమయానికి రాకపోవటం తీవ్ర సంచలనం కలిగించింది.
పోలింగ్ స్టేషన్ వద్దనే గంట పాటు ఉండిపోగా, కమ్యూనికేషన్ లేకపోవటంతో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. అసలే పరిస్థితి ఇలా ఉంటే గన్నవరంలో సెల్ టవర్ పేల్చివేతతో కమ్యూనికేషన్ వ్యవస్థ మరింత చిన్నాభిన్నమైంది. మావోయిస్టులు పేల్చిన టవర్‌పై ఎయిర్‌టెల్, వొడాఫోన్ సిగ్నల్స్ పనిచేస్తున్నాయి. అంతేకాకుండా భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లలో ఉన్న 19 టవర్‌లు దీనికి అనుసంధానంగా ఉన్నాయి. ఎన్నికల నాటికి దీన్ని పునరుద్ధరించే పరిస్థితి లేకపోవటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో భద్రాచలమే సమస్యాత్మకం...
మొదటి విడత ఎన్నికల జరిగే తెలంగాణ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో భద్రాచలమే అత్యంత సమస్యాత్మకమైనదని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. నియోజకవర్గంలోని 261 పోలింగ్ స్టేషన్‌లకు గాను 156 కేంద్రాలు మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోనే ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈ కారణంతోనే భద్రాచలం, వరంగల్ జిల్లా ములుగు నియోజకవర్గాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. ఇది పోలింగ్ శాతంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. జిల్లాలో మొదటి విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగిన మూడు డివిజన్‌లలో భద్రాచలం నియోజకవర్గంలోనే తక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. మావోయిస్టుల కార్యకలాపాలు, పోలింగ్ సమయం కుదించటంతో సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింతగా తగ్గవచ్చని పరిశీలకులు అంటున్నారు.
దాడులకు వ్యూహం !
Published Fri, Apr 11 2014 2:49 AM | Last Updated on Tue, Oct 9 2018 2:51 PM
Advertisement
Advertisement