తెల్లరాయిపై కన్నేసిన బడాబాబులు
ఇతర రాష్ట్రాలకు తరలుతున్న ఏజెన్సీ సంపద
అక్రమ లీజులతో గిరిజనులకు అన్యాయం
భద్రాచలం, న్యూస్‌లైన్
భద్రాచలం ఏజెన్సీలో ఉన్న అపార ఖనిజ సంపదపై కొంతమంది బడాబాబులు కన్నేశారు. ఇక్కడ ఉన్న తెల్లరాయి నిక్షేపాలను అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు. గాజు తయారీకి ఉపయోగకరంగా ఉండే తెల్లరాయి భద్రాచలం ఏజెన్సీలో పుష్కలంగా దొరుకుతుండటంతో గిరిజనుల భూములను లీజుకు తీసుకొని ఈ అక్రమానికి పాల్పడుతున్నారు.భద్రాచలం, దుమ్ముగూడెం, చింతూరు మండలాల్లో తెల్లరాయి నిక్షేపాలు అపారంగా ఉన్నాయి. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు ఇక్కడి మధ్యవర్తుల ద్వారా గిరిజనుల భూములను గిరిజనుల పేరునే లీజుకు తీసుకుని, తమ కనుసన్నల్లో తెల్లరాయి తవ్వకాలు, తరలింపుప్రక్రియ సాగిస్తున్నారు. భద్రాచలం మండలం లక్ష్మీపురం పంచాయతీలోని రంగాపురం, బండిరేవు.., ఎటపాక పంచాయతీలోని బొజ్జుగుప్ప, మాధవరావు పేట.., చింతూరు మండలంలోని చట్టి.., దుమ్ముగూడెం మండలంలోని కొమ్మనాపల్లి సమీపంలో ఇటీవల తెల్లరాయి తవ్వకాలు చేపట్టారు. గతంలో ఇక్కడ పనిచేసిన డివిజన్ స్థాయి రెవెన్యూ అధికారి ఒకరు గనుల నిర్వహణకు అడ్డగోలుగా అనుమతులు ఇవ్వటంతో ఈ అక్రమ వ్యాపారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఇక్కడ నుంచి విజయవాడకు తరలించిన తెల్లరాయిని పాలీష్ చేసిన తరువాత తమిళనాడు రాష్ట్రంలోని వివిధ గాజు తయారీ ఫ్యాక్టరీలకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది.
కారుచౌకగా లీజుకు భూములు :
తెల్లరాయి నిక్షేపాలు లభించే గిరిజనులకు చెందిన భూములను తక్కువ ధరకే లీజుకు తీసుకుంటున్నారు. భద్రాచలం మండలంలోని రంగాపురం క్వారీనే పరిశీలించినట్లైతే... ఆ గ్రామంలోని ఎనిమిదిమంది గిరిజనులకు చెందిన 11 ఎకరాల భూమిని గుంటూరుకు చెందిన ఓ గిరిజన మహిళ పేరుతో ఇరవై ఏళ్లకు లీజుకు తీసుకున్నారు. మొదట్లో ఎకరాకు ఏడాదికి రూ.1000చొప్పున కౌలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల భద్రాచలానికి చెందిన కొంతమంది వచ్చి గతంలో లీజుకు తీసుకున్న వ్యక్తి చనిపోయారని చెప్పి మళ్లీ ఒప్పంద పత్రాలు రాయించుకున్నారని భూమిపై హక్కుదారుడైన మడకం ముత్తయ్య తెలిపాడు. అయితే కౌలు గిట్టుబాటు కాదని పట్టుబడితే ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.2500లు ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలిపాడు.
రాయి తీయటం వల్ల పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, వాటిని పూడుస్తామని చెప్పినప్పటికీ అలానే వదిలేయటంతో పశువులు దానిలో పడి మృతిచెందుతున్నాయని ఆయన తెలిపాడు. అలాగే భద్రాచలం మండలం బండిరేవు క్వారీ నుంచి ఎటువంటి అనుమతుల్లేకుండా తెల్లరాయిని తరలిస్తున్న రెండు లారీలను ఇటీవల అధికారులు పట్టుకున్నారు. ఇలా కారుచౌకగా గిరిజనుల భూములను లీజుకు తీసుకొని వాటిలో ఉన్న ఖనిజ సంపదను బడాబాబులు కొల్లగొడుతుండడం గమనార్హం. గిరిజనుల అంగీకారంతోనే లీజు ఒప్పందాలు జరిగాయనే కారణంతో రెవెన్యూ అధికారులు కూడా క్వారీ నిర్వాహకులకే వత్తాసు పలుకుతుండటంతో ఏజెన్సీ సంపద ఇతర ప్రాంతాలకు త రలిపోతోంది. ఇప్పటికైనా జిల్లా అధికారులు దృష్టి సారించి ఏజెన్సీలో లభించే ఖనిజ సంపద ద్వారా ఈ ప్రాంత వాసులు అభివృద్ధి చెందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల వారు కోరుతున్నారు.
బినామీ ‘ఘనులు...’!
Published Tue, Jan 28 2014 2:40 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM
Advertisement
Advertisement