![India reaches historic milestone of 100 GW solar power capacity](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/SOLAR-ENERGY_2.jpg.webp?itok=lGw6HRaU)
కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటన
రెండేళ్లు ఆలస్యంగా లక్ష్యం చేరిక
న్యూఢిల్లీ: సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యంలో భారత్ కీలక మైలురాయిని అధిగమించింది.‘‘గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీజీ దార్శనిక నాయకత్వంలో భారత్ చరిత్రాత్మక 100 గిగావాట్ల సోలార్ సామర్థ్యాన్ని సాధించింది. పరిశుద్ధమైన, పర్యావరణ అనుకూల భవిష్యత్ కోసం విశ్రమించని మా అంకిత భావానికి ఇది నిదర్శనం’’అని నూతన, పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రి ప్రహ్లాద్ జోషి ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో పోస్ట్ పెట్టారు. 2022 నాటికి 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని కేంద్ర సర్కారు లక్ష్యాన్ని విధించుకోగా, ఇందులో 100 మెగావాట్లు సోలార్ ద్వారా సమకూర్చుకోవాలన్నది ప్రణాళిక.
కానీ, కరోనా విపత్తు, ఆ సమయంలో లాక్‌డౌన్‌లతో లక్ష్యం చేరిక రెండేళ్లు ఆలస్యమవడం గమనార్హం. 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని మోదీ సర్కారు లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘‘సోలార్ ప్యానెళ్లు, సోలార్ పార్క్‌లు, రూఫ్‌టాప్ సోలార్ ప్రాజెక్టులు విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయి. ఫలితమే నేడు భారత్ 100 గిగావాట్ల సోలార్ ఇంధన లక్ష్యాన్ని సాధించింది. పర్యావరణ అనుకూల ఇంధనంలో భారత్ స్వీయ సామర్థ్యాలపై ఆధారపడడమే కాకుండా, ప్రపంచానికి కొత్త మార్గాన్ని చూపిస్తోంది’’అని ప్రహ్లాద్‌జోషి పేర్కొన్నారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలి యోజన పథకం ప్రతి ఇంటికి శుద్ధ ఇంధనాన్ని అందిస్తుందన్నారు.
పదేళ్లలో చేరిక
2014 నాటికి దేశంలో సోలార్ విద్యుదుత్పాదన సామర్థ్యం 2.82 గిగావాట్లుగానే ఉండగా, పదేళ్లలో 100 గిగావాట్లను చేరుకోవడం విశేషం. 2025 జనవరి 31 నాటికి స్థాపిత సోలార్ సామర్థ్యం 100.33 గిగావాట్లు అయితే, మరో 84.10 గిగావాట్ల సామర్థ్యం ఏర్పాటు దశలో ఉంది. మరో 47.49 గిగావాట్లు టెండర్ దశలో ఉండడం గమనార్హం. కేవలం 2024లోనే 24.5 గిగావాట్ల సామర్థ్యం కొత్తగా అందుబాటులోకి వచి్చంది. మరోవైపు 2014 నాటికి దేశంలో కేవలం 2 గిగావాట్ల సోలార్ మాడ్యూళ్ల తయారీ సామర్థ్యం ఉంటే, 2024 నాటికి 60 గిగావాట్లకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment